వాల్మీకి
వాల్మీకి సంస్కృత సాహిత్యంలో పేరెన్నికగల కవి.[1] రామాయణాన్ని వ్రాశాడు. ఈయన్ని సంస్కృతభాషకు ఆదికవిగా గుర్తిస్తారు. ఇతడే శ్లోకమనే ప్రక్రియను కనుగొన్నాడు.[2] ప్రచేతసుని పుత్రుడు కాబట్టి అతడు ప్రాచేతసుడు అని కూడా ప్రసిద్ధం
జీవిత విశేషాలు
[మార్చు]మహర్షి వాల్మీకి ఎవరు? వల్మీకము (పుట్ట) నుండి వెలుపలికి వచ్చిన వారు కావున వాల్మీకి. రామరామ అని తపస్సుచేసిన వారు కావున మహర్షి, రాముడి జీవితచరిత్రను రామాయణముగా మహాకావ్యరచన గావించి నవాడిగా ఆదికవి అయ్యాడు.
అయితే వాల్మీకి జన్మము ఎట్టిది? ఆయన తల్లితండ్రులు ఎవరు? అనే విషయము పై అనేక తర్జనభర్జనలు, కట్టుకథలు ప్రాచుర్యములో ఉన్నాయి. ఏ రచయత అయినా తన గురించి ఉపోధ్గాతము, పరిచయము తదితర అంశములను తెలుపుకోవటము ఈనాటి రచయతలు పాటిస్తున్న విధానము. వేదవ్యాసుడు తాను మత్స్యగంధి, పరాశరుల కుమారుడనని తన రచనలలోనే చెప్పుకోవడముతో వ్యాసుడు ఎవరన్నది కచ్చితముగా తెలిసింది. అదేవిధముగా రచయతగా తాను ఎవరన్నది ప్రత్యేకముగా వాల్మీకి వ్రాయనప్పటికీ సందర్భానుసారముగా సీతను రాముడికి అప్పచెబుతున్న సమయములో ఉత్తరకాండ (రామాయణము)లో వాల్మీకి ఇలా రాసాడు “రామా నేను ప్రాచేతసుడను ప్రచేతసుడి ఏడవ (దశమ) కుమారుడిని. వేలసంవత్సరాలు తపస్సు చేసి, ఏ పాపము చేయని, అబద్దమాడని మహర్షిని. సీత నిన్ను తప్ప మనసా, వాచా పరపురుషుడిని ఎరగని మహాపతివ్రత. నా మాట నమ్ము, సీతను ఏలుకో. నా మాటలు తప్పు, అబద్దము అయితే ఇంతకాలము నేను చేసిన తపస్సు భగ్నము అవుగాక.” అంటాడు. (వాల్మీకి రామాయణము-తెలుగు అనువాదము,క్రీ.శే.పురిపండా అప్పలస్వామి)
వాల్మీకిగా పిలవబడుతున్న మహర్షి పేరు ప్రాచేతసుడని ఇక్కడ మనము గుర్తించవచ్చును.ఇది వాల్మీకి తనకు తాను తన గురించి చెప్పుకున్న విషయము. ఆయన మాటలలో ఆర్ధత, నిజాయతీ ఉట్టిపడుతున్నాయి. అయితే ప్రచేతసుడు ఎవరు? ప్రచేతసుడు ఎవరి కుమారుడు? ఆయనది ఏ వంశము? ఈ విషయ ములను తెలుసుకోవటానికి అనేక పురాణములను, చరిత్రలను చదవవలసి ఉంటుంది. ప్రచేతసుల గురించిన ప్రస్తావన “శ్రీ మత్భాగవతము”లో ఉంది. శ్రీ మత్భాగవతము వేదవ్యాసవిరచితము. వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణములలో శ్రీ మత్భాగవతము ఒక గొప్ప పురాణము.భారతదేశములోని మహాపురుషుల చరిత్రలు పురాణములుగా వ్రాయబడి ఉన్నాయి. భారతదేశము పై మొదటగా మహమ్మదీయులు దాడి చేయటముతో భారత చరిత్రను వ్రాసిన వారు స్థిరత్వము, ప్రోత్సాహము లేని పరిస్థితులలో చరిత్రలను వ్రాసే స్థితిలో ఉండకపోవడం జరిగింది. ఆంగ్లేయుల పాలన మొదలైన తరువాత ప్రశాంత వాతావరణము ఏర్పడింది. (శ్రే వేమన పద్యసారామృతము-సి.పి.బ్రౌన్) చరిత్ర అనగా హిస్=అతనియొక్క, స్టోరీ=కథ అని ఆంగ్లేయులు వచ్చిన తరువాతే చరిత్ర అనే పదము వాడు కలోకి వచ్చి చరిత్రలను వ్రాయటము మొదలు పెట్టారు. అంతకు ముందు భారతదేశ చరిత్రలను పురాణముల పేరుతో తెలుసుకునే వారు.భారతదేశములో పురాణములను అనగా జరిగిపోయిన వాస్తవాలను (చరిత్రలను) కాలక్షేపానికో, పుణ్యానికో చదవటము, వినటము అలవాటుగా వస్తోంది. పురాణములంటే భారతీయులకు అత్యంత విశ్వాసము. పురాణములలోని వ్యక్తుల జీవితకథలను, అందులోని నీతి, నిజాయతీలను, సంఘటనలను నిజమనే నమ్ముతారు. వారిని ఆదర్శముగా తీసుకొంటారు. పురాణాలలోని ఆచార వ్యవహారాలను, వ్రతములను, పూజాదికార్యక్రమములను, జన్మనుండి మరణము వరకు సాగే బారసాల, అన్నప్రాశన, అక్షరాభ్యాసము నుండి పుంసవనము, శ్రీమంతము, వివాహము తరువాత అప్పగింతలు, మరణము తరువాత పార్థీవశరీరానికి చేసే క్రతువులు అన్నీపురాణాలలో వివరించిన విధముగానే పాటిస్తారు. పురాణ రచయతలను భగవత్సమానులుగా కొలుస్తారు. భగవంతుడే వాల్మీకిమహర్షిగాను (బ్రహ్మ), వేదవ్యాసుడు (శ్రీ మహావిష్ణువు) గాను జన్మించి పురాణములను రచించినారని, అవి విశ్వమానవ సౌభ్రాతత్వమును చాటుతాయని నమ్ముతారు. శ్రీ మధ్భాభాగవతము, శ్రీ విష్ణు పురాణము అన్నవి భగవాన్ విష్ణువు,ఆయన భక్తుల కథలు. ఎవరైతే శ్రీ మహా విష్ణువును నమ్మి కొలుచుకున్నారో, ఆయన వారిని కష్టాలబారి నుండి ఎలా రక్షించాడో తెలిపే కథలు ఈ పురాణాలలో తెలుపబడ్డాయి. శ్రీ మద్భాగవతము ద్వాదశస్కంధములుగా వ్రాయబడింది. శ్రీ మథ్భాగవతము చతుర్థ స్కంధ ములో త్రయోదశోధ్యాయములో విదుర ఉవాచ:
కే తే ప్రచేతసోనామ కస్యాపత్యాని సువ్ర
కస్యా న్వవాయే ప్రఖ్యాతా: కుత్ర వా సత్రామాసత
అర్థము: గొప్ప భగవత్ భక్తిని గలిగిన ఆచార్యా “ప్రచేతసులు చేయుచున్న సత్రయాగములో నారదులు గానము జేసితిరని చెప్పితిరి గదా. ఆ ప్రచేతసులు ఎవరు?వారెవరి కుమా రులు? ఎవరి వంశమందు ప్రసిద్ధిని పొందిరి.”అని విదురుడు ప్రశ్నిస్తూ మైత్రేయునితో ఇంకా ఇలా అన్నాడు.
స్వధర్మశీ లై:పురుషైర్భగవాన్ పురుషోత్తమ:
ఇజ్యమానో భక్తిమతా నారాదేనేరిత:కి ల
అర్థము:క్షత్రియులైన ప్రచేతసులు తమతమ ధర్మముల మూలకముగా శ్రీ హరిని యజ్ఞ యాగాదులచే పూజించుచుండిరి. అచ్చటికి వచ్చిన నారదులు, యజ్ఞమయుడు, పురుషో త్తముడైన విష్ణువును గురించి ఉపదేశించిరని వినియున్నాము.
ఇక్కడ తెలిసిన విషయము ప్రచేతసులు విష్ణుభక్తులు. క్షత్రియులు. వీరికి విష్ణువు, యజ్ఞయాగాదుల గురించి నారదుల వారు ఉపదేశము చేశారు. ఆ తరువాత కథా క్రమములో ధ్రువుడి తపస్సు, శ్రీహరి ప్రత్యక్షమవటము, వరాల అను గ్రహము, ధ్రువ వంశవిస్తరణ, సూర్యవంశస్థులు, బోయలవంశక్రమము వత్సరుడు, పుష్పార్ణుడు, సాయంకాలుడు, చక్షుడు, ఉల్కకుడు, అంగుడు, వేనుడు, పృథ్వీరాజు, విజితాశ్వుడు, పావనుడు, హవిర్ధానుడు, ప్రచేతసుడు, ప్రాచేతసులు (10మంది) అని తెలియబడతారు. వీరి జన్మవృత్తా౦తములు, అంగుడి బాధ, వేనుడి దుశ్చర్యలు, పృథ్వీ రాజు ఔన్నత్యము, నిషాదుడు అడవులలోకి పంపబడి కిరాతరాజవ్వటము, ప్రచేతసుడికి 10 మంది ప్రాచేతసులు జననము వివరించబడ్డాయి. ఆ 10మంది ప్రాచేతసులలో 7వ (పదవ) వాడు వాల్మీకి మహర్షి.
ప్రాచేతసుడు క్షత్రియవంశములో జన్మించాడు, నారదుల ఉపదేశముతోనూ, తండ్రి, తాతల, ముత్తాతల సుకృతము, శ్రీహరిపై తరతరాల భక్తి విశ్వాసాలు వాల్మీకిని మహర్షిగా రూపొందింపచేశాయి. వాల్మీకిమహర్షి యొక్క నిజకథ ఇది. ఈ విషయములను కప్పిపుచ్చి అనేక కథలు తరతరాలుగా ప్రాచుర్యము పొందాయి.వాల్మీకి మహర్షి గురించి ఎవ్వరూ పరిశోధనలు గావించక పోవడముతో కట్టుకథలు ఇంత వరకు ప్రాచుర్యములో ఉన్నాయి. రాముడు అనే పాత్రను లోకానికి ఆదర్శపురుషుడిగా చూపించాలని ఆదికవి తపనే గాని ఆపాత్రకు గుణగణాలు రూపొందిచటమే తన ధృష్టి తప్ప తన గురించి తానెవరో అనే గొప్పలు చెప్పాలనే ఆలోచన తన రచనల్లో కనిపించదు. వాస్తవాన్ని కూడా చెప్పక పోవడముతో ఎవరికి తోచినది వారు ఊహాగానాలు చేశారు. మహానుభావులు ఎప్పుడూ ఇతరుల గురించి, వారి బాగుగురించి ఆలోచిస్తారే తప్ప వారి గురించి వారు తపించరు.
మహర్షివాల్మీకి ఎప్పుడూ, ఎక్కడా తాను తన జీవితచరిత్రను వెలి బుచ్చక పోవటముతో కొందరు వాల్మీకి పేరు రత్నాకరుడని ఆయన పూర్వాశ్రమములో దొంగ, దారి దోపిడీదారుడని వ్రాశారు. మరి కొందరు ఆయన బ్రాహ్మణుడని,పేరు అగ్నిశర్మ అని దొంగల ముటాలో పెరిగి దొంగ అయినాడని వ్రాశారు. ఈ కట్టు కథలకు ఎక్కడా ఆధారాలు లేవు (ఇలపావులూరి పాండురంగారావు,ఆచార్య సహదేవ, జస్టిస్ భల్లా).భగవధ్గీతలో కూడా అనేక మార్పులు, చేర్పులు జరిగాయని, మూల గీతలో లేని అనేక శ్లోక ములు చేర్చబడ్డాయని డాక్టర్ రాధాకృష్ణన్, రుడాల్ఫ్ ఓటో అభిప్రాయ బడ్డారు. (దర్శనములు-మతములు-విజ్ఞాన సర్వస్వము, నాలుగవ సంపుటము-ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి) వాల్మీకిమహర్షి గురించి కొందరు ఓర్వలేక, అసూయతో లేదా దొంగ కూడా తపస్సు చేసి మహర్షి కావచ్చు అనేందుకు ఉదాహరణగా చూపేందు కో అల్లిన కట్టు కథలు.
భారతీయ సాహిత్య నిర్మాతలు-వాల్మీకి అనే ఆంగ్లపుస్తకములో ఇలపావులూరి పాండురంగారావు గారు ఈ క్రింది విధముగా వాల్మీకిమహర్షి పై వ్యాఖ్యానించారు.
“వాల్మీకి తన జీవితారంభ దశలో కిరాతుడని, సప్తరుషులచే ఋషిగా పరివర్తన పొందగలిగాడని ప్రచారములో ఉన్న కథ వినడానికి ఉత్కంఠ భరితముగా ఉండవచ్చుగాని దానికి తగిన చారిత్రాత్మక ఆధారాలు లేవు. జీవితాన్ని గూర్చి సంపూర్ణ అవగాహన గలిగి, శాస్త్రీయ ధృక్పథముతో రసజ్ఞ సౌందర్యాన్ని కవితామయముగా మేళవించిన వ్యక్తిని గూర్చి అలా చెప్పడము భావ్యము కాదు. వాల్మీకి కిరాతుడు అనే కథ బహుళ ప్రచారములో ఉన్నందున ఆ ధృక్పథము తోనే చూస్తున్నారు.”
వాల్మీకి, కిరాతుడు, రత్నాకరుడు, అగ్నిశర్మ పేర్ల కథనాలు, విమర్శలు
[మార్చు]“ కిరాతుడు” అనే పదానికి అర్థము తురాయి అనగా నెమలి పింఛము లేదా అటువంటి ఆకారములో ఉన్న పువ్వులు, ఆకులను, పక్షుల ఈకలను తల ముందు భాగములో కట్టుకొని, తలపాగవలె ధరించిఉన్నవాడు. ”కి” అనగా కలిగి అని, రాతుడు అనగా తురాయివాడు అని అర్థము.అంతే గాని ఈనాడు వాడుకలో ఉన్నట్లుగా కిరాతుడు అంటే కసాయివాడు లేదా కోడి, జింక, గొర్రె, బర్రె, మేక, తదితర సాధు జీవుల తలను నిష్కర్షగా నరికేవాడు అని కాదు. ఆదిమానవకాలములో అడవులలో వేటకై వెళ్ళేప్పుడు ఇతర మాంసాహార జంతువుల బారి పడకుండా ఉండేందుకో,సరదాగా ఉంటుందనో,అలంకారానికో తురాయిని కట్టుకునే వారు. కిరాతుడు అంటే హింసాత్ముడు అనే అర్థము స్ఫురిస్తే ఈరోజులలో జీవాలను (కోళ్ళు, చేపలు, రొయ్యలు, గొర్రెలు,మేకలు) పెంచి, పోషించి మార్కెట్లో అమ్మకము చేసేవారు, కొనేవారు, తినేవారు అందరూ కిరాతులే.
వాల్మీకి శబ్దము చీమలపుట్ట అనే అర్థానికి, కఠోర ధ్యానానికి,నిశ్చల తపోముద్రకు ప్రతీక. అట్టి తపోః ఫలితమే వాల్మీకి మహాకవి. వాల్మీకిని మహోన్నతముగా ఆరాధించే కాళిదాసు మేఘసందేశములోని శ్లోకభాగములో ఇలా ప్రస్తుతించాడు. (ఇలపావులూరి పాండురంగారావు)
“వాల్మీకాగ్రాత్ ప్రభవతి ధను: ఖండమా ఖండాలస్య” అర్థము:సుదూరములో కనిపిస్తున్న ఆ పుట్టను చూడండి! అందులో నుండిఇంధ్రధనస్సు ప్రభవించింది. దీనికి భాష్యము చెబుతూ ఇలపావులూరి పాండు రంగారావు అంటారు-ఇంధ్రధనస్సు అనే ఉపమానము వాల్మీకి కవితాత్మకు, ప్రబంధౌచిత్యానికి ప్రతీక.వాల్మీకి రామాయణములోని 7 కాండలు ఇంధ్రధనస్సులోని సప్తవర్ణాలను గుర్తుకు తెస్తాయి.` కిరాతులు క్షత్రియులే, వీరిలో ఉపనయనాది కర్మలు లోపించాయి అంటాడు మనువు (మనుస్మృతి).
కిరాతుడు ఋషిగా పరివర్తన చెండాడని చెప్పడము నిజము కావచ్చు. అంతేగాని ఆయన గురించి మరొక్క మాట దురాలోచనే. తపస్సు ఆయన ప్రధానసద్గుణము, నిరంతరాధ్యయనము, సత్ప్రవర్తనల ఫలితమే మహాఋషిగా ఆవిర్భవింపచేశాయి. వాల్మీకి పేరు కలిగిన వారు నలుగురైదుగురు ఉన్నారని కొందరు విజ్ఞుల (వ్యాసుడు అనిపేరు కలిగిన వారు కూడా 10 మంది ఉన్నారని) అభిప్రాయము. వారిలో రత్నాకరుడు, అగ్నిశర్మ కూడా ఉండి ఉండవచ్చును. వీరు మహర్షి, ఆదికవి వాల్మీకి ఉత్ద్బోధనలకు ప్రేరితులై తమ పేర్లను వాల్మీకిగా మార్చుకొని ప్రాచుర్య ము లోనికి వచ్చి ఉంటారు. ఆకతాయి రచయతలు ఎవరో వారిని మహర్షిని ఒక్కరే అని పొరబడి ఉండవచ్చును.ఈ విషయము నిజమే అని నమ్మటానికి పంజాబ్, హరియానా విశ్వవిద్యాలయము వారు ఆచార్య, డాక్టరు సహదేవ ఆధ్వర్యములో 3 సంవత్సరముల పాటు నిర్వహించిన పరిశోధనలు సహకరిస్తున్నాయి (మహర్షి వాల్మీకి వాస్ నెవర్ ఏ డేకోయిట్ నార్ ఏ రోడ్ సైడ్ రాబర్-జస్టిస్ భల్లా, ద టైమ్స్ ఆఫ్ ఇండియా,ఇంగ్లీష్ డైలీ, 2010 మే 22)పంజాబ్, హరియానా హైకోర్ట్ ఆదేశాల మేరకు పంజాబ్, హరియానా,విశ్వవిధ్యాలయము వారు పరిశోధనలు గావించారు.డాక్టరు సహదేవ,చైర్ పర్సన్ గా, వాల్మీకి చైర్ అనే విభాగమును,ఏర్పాటు చేసి ఈ పరిశోధనలు,అధ్యాపకులచే నిర్వహింప బడ్డాయి). క్రీ.పూ.నుండి అందుబాటులో ఉన్న వేదములు, శిలాశాసనాలు, ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములు, చరిత్రలు క్షుణ్ణముగా పరిశీలించగా మహర్షివాల్మీకిని ఎక్కడా, ఎప్పుడూ దొంగగా,దారిదోపిడీదారుడిగా వ్రాయబడి లేదు. ఈ పరిశోధన ఫలితాల ఆధారముగా జడ్జిమెంట్‌ను జస్టిస్ భల్లా ఇచ్చారు. ఈ జడ్జిమెంట్ ప్రకారము వాల్మీకి మహర్షిని ఎవ్వరూ దొంగ, దారి దోపిడీదారుడు అనకూడదు. ఆవిధముగా మాట్లాడకూడదు, నాటికలు,టి.వి.సీరియల్స్, సినిమాలు తీయరాదు, వాల్మీకి మహర్షిని దొంగ, దారిదోపిడీదారుడు అని బోయలను, వాల్మీకులను కించపరిచే విధముగా మాట్లాడితే నేరము, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చును. మహర్షి వాల్మీకి గురించి కొన్ని పురాణములలో ( ఆధ్యాత్మికరామాయణము, స్కాంధపురాణము,తదితర) వ్రాయ బడినట్లుగా చెబుతున్న వాటికి వాస్తవాలకు పొంతన లేదని అవి మూలపురాణములో లేవని ఆ తరువాత చేర్చబడిన అవిశ్వాస కథలని ఇతిహాసికులు, చరిత్ర పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
వాల్మీకిమహర్షిని ఆదికవి, ఋక్షకుడు, భార్గవుడు, కవికోకిల, వాక్యావిశారదుడు, మహాజ్ఞాని, భగవాన్ అని కూడా పిలుస్తారు. వాల్మీకిమహర్షి “ఓం ఐ౦ హ్రీం క్లీ౦ శ్రీ౦” అనే బీజాక్షరాలు సరస్వతీ, లక్ష్మి,మాయ కటాక్షాన్ని కలుగచేసే మంత్రాలను లోకానికి పరిచయము చేశారు. (దేవిభాగవతము, వేదవ్యాసవిరచితము, తెలుగు అనువాదము)
వాల్మీకిమహర్షి జీవించిన కాలముపై అనేక పరిశోధనలు జరిగాయి. వాల్మీకి రామాయణము క్రీ.పూ.1000 వ సంవత్సర ప్రారంభములో రచింపబడి వుంటుందని, వాల్మీకిపై విశేషపరిశోధనలు గావించిన జి.ఎస్. ఆల్టేకర్ (1895-1987) నిర్దారించారు (ఇలపావులూరి పాండురంగారావు). క్రీ.పూ.100 సంవత్సరములకు చెందిన బుద్ధచరిత్ర రచయత అశ్వఘోషుడు వాల్మీకి ఆదికావ్యాన్ని గూర్చి ప్రశంశిస్తూ ఇలా వ్రాశాడు.
”వాల్మీకి రాదే చ ససర్జపద్యం జగ్రంధన్నచ్యవనో మహర్షి”- ఈ శ్లోకం వాల్మీకి క్రీస్తు శకానికి ముందువాడని ధ్రువ పరుస్తోంది (ఇలపావులూరి పాండురంగారావు). బుద్ధునికి పూర్వము అంటే క్రీ.పూ.800సం.ల నాటి వాడు వాల్మీకి అని డా.హెచ్.జాకోబి అభిప్రాయము.
మహర్షి వాల్మీకి తనకు తాను తాను పేరు, తండ్రి పేరు చెప్పి నది ఒక సందర్భంలో నే అదే వాస్తవం మిగిలిన పేర్లు, కథలు అబద్ధాలు అనువాదాల ద్వారా వ్రాసి ప్రచురించిన వాల్మీకి జన్మ వృత్తాంతము లకు ఆధారాలు లేవు.(ఆచార్య మంజు లాసహదేవ, వాల్మీకి ఛైర్ పోర్షన్ , పంజాబ్ అండ్ హర్యానా విశ్వ విద్యాలయం.)
వాల్మీకి మహర్షి వద్ద శిష్యరికము గావించిన భరద్వాజుడు, లవుడు, కుశుడు మహర్షిని భగవాన్ అని సంబోధించేవారు. బ్రహ్మ సమానుడని, బ్రహ్మ రామాయణమును వ్రాయటానికి తానే వాల్మీకి మహర్షిగా అవుతరించాడని నమ్మేవారున్నారు. ”విప్రో వాల్మీకిస్సు మహాశయా”అని బ్రహ్మ సరస్వతి దేవితో చెప్పాడని, అందువలన వాల్మీకిమహర్షి విప్రుడు అని పురాణ వ్యాఖ్యాతలు చెబుతున్నారు. స్వగుణధర్మముతో బోయవాడిగా పుట్టినవాడు ఆదికవిగా, మహర్షిగా, బ్రాహ్మణుడిగా గుర్తించ బడ్డారని ఆయన గణకీర్తిని కొనియాడారు.
ఆదికవి వాల్మీకి ఆ రోజులలోనే “అక్షరలక్ష” అనే ఈనాటి “ఎన్ సైక్లోపెడియా బ్రిటానికా” వంటి విజ్ఞాన సర్వస్వము, సర్వశాస్త్రసంగ్రహమును వెలువరించారు. (పెదబాలశిక్ష- గాజుల సత్యనారాయణ) ఈపుస్తకములో భూగర్భశాస్త్రము, రసాయనశాస్త్రము, గణితశాస్త్రము, రేఖాగణితము, బీజ గణిత ము,త్రికోణమితి, 325 రకాల గణిత ప్రక్రియలు, గాలి, ఉష్ణము, విద్యుత్, జలయంత్ర శాస్త్రము,ఖనిజాలు తదితర అనేక అంశాలు వివరించబడి ఉన్నాయి. యోగవాశిష్టము అనే యోగా, ధ్యానముల గురించిన సంపూర్ణ విషయములు గల మరో పుస్తకము మహర్షి వాల్మీకి వ్రాశారు.ఈ పుస్తకము రామాయణములోని అంతర్భాగమే.రాముడు పది-పన్నెండు సంవత్సరాల వయసులో మానసిక అశాంతికి లోనై, మానసిక ధౌర్భల్యమునకు గురి అయిన ప్పుడు వశిస్టుడి ద్వారాయోగా, ధ్యానములను శ్రీరాముడికి బోధించారు వ్రాసింది. వాల్మీకిమహర్షి, పలికింది, బోధించింది వశిస్టుడు,అందు వలన “యోగవాశిష్టము” అనే పేరు వచ్చింది. ఆదిత్య హృదయము అనెడి సూర్యస్తుతిని వ్రాసినవారు వాల్మీకి మహర్షియే.కౌసల్యా సుప్రజా రామ అనెడి సుప్రభాతమును వ్రాసిన వారు వాల్మీకియే. మహర్షివాల్మీకి “వాల్మీకి మతము” అనే దానిని నెలకొల్పారు. తొమ్మిది లక్షణాలతో జీవితమును సంస్కరించుకోవాలని, ఈ తొమ్మిది గుణములు కలిగిన వారిని, పాటిస్తున్నవారిని వాల్మీకి మత స్తులుగా గుర్తించారు. ఆటవికజీవితములో వ్యవసాయముతెలియదు. అడవులలో దొరికిన ఆకులు, అల ములు, దుంపలుకాయలు, పండ్లు, సాధుజీవుల (కుందేలు, కోడి, పంది, గొర్రె, మేకలువంటివి)ను పట్టి, అవి పట్టుబడక పోతే వాటితో పోరాడి స్వంతము చేసుకోవటమే అలవాటు. తమ వద్ద లేని ఇతరుల వద్ద ఉన్న వాటిని లాగుకోవటము, ఇవ్వకపోతే వారితో పొరాడి, చంపి అయినా సరే తమ స్వంతము చేసుకోవటము ఆటవికతనము, ఈ పోరాటము జరిపే, ధైర్యసాహసాలు గల వారినే “క్షత్రియులు” అని అంటారని భీష్ముడు మహాభారతములో క్షత్రియత్వము గురించి వివరణ ఇచ్చాడు.ఈ ఆటవికతనమును పారద్రోలి సంస్క రించటానికే వాల్మీకి తొమ్మిది లక్షణాలతో జీవనమును సాగించాలని బోధించారు.ఆటవికులలో సంస్కారము ను కలుగ చేయటానికే వాల్మీకిమతము ప్రారంభించబడింది. క్రీ.పూ.600 సంవత్సరములోనే ఆటవికులు సంస్కరించబడటము మొదలైంది అని చెప్పటానికి వాల్మీకి వ్రాసిన మొదటి శ్లోకమే గొప్ప ఉదాహరణ.ఆటవిక భాష సంస్కృతముగా రూపొందింది వాల్మీకి వలననే. ”మా నిషాద” అనే పదముతో మొదలైన శ్లోకములోని మొదటి వ్యక్తి నిషాదుడే,అతనూ బోయవాడే.అజ్ఞానముతో బోయవాడు చేసిన ఆడ పక్షిని చంపటము అనే ప్రక్రియ వాల్మీకిమహర్షిలో బోయలను, ఆటవికులను సంస్కరించాలనే ఆలోచనను కలిగింప చేసి ఒక ఆదర్శ మానవుడిని నాయకుడిగా చూపించాలని “రామాయణము” వ్రాసేలా చేశాయి.
రామాయణ కర్తగా వాల్మీకి
[మార్చు]వాల్మీక రామాయణంగా అందరికీ తెలిసిన వాల్మీకంలో 23వేల శ్లోకాలు 7 కాండాలుగా (ఉత్తరకాండ సహా)విభజించబడి ఉన్నాయి. రామాయణంలో 4 లక్షల ఎనభై వేల పదాలు ఉన్నాయి. ఇది మహాభారత కావ్యంలో దాదాపుగా పావు వంతు భాగం. ప్రసిద్ధ ఆంగ్ల రచన ఇలియాడ్కు ఇది నాలుగు రెట్లు పెద్దది. రామాయణం దాదాపుగా క్రీపూ 500 లో రాయబడిందని పాశ్చాత్యులు నమ్ముతారు. రామాయణంలో తెలుపబడిన విషయాలననుసరించి కనీసం లక్ష సంవత్సరాల ప్రాచీనమవవచ్చని భారత దార్శనికుల నమ్మకం. ఇతర ఇతిహాసాల్లాగానే రామాయణం కూడా ఎన్నో మార్పులకు, కలుపుగోరులకు, తీసివేతలకు గురి అయింది.
వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనుడని పేర్కొన్నాడు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, సీతను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆశ్రమంలోనే సీత లవ-కుశలను కన్నట్టూ, వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకికి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తుంది.
తొలి శ్లోకం
[మార్చు]వాల్మీకి తపస్సంపన్నత తరువాత ఆశ్రమవాసం చేయసాగారు. ఆశ్రమ ధర్మాలలో భాగంగా గంగానదీ తీరానికి సంధ్యకు రాగా. భరద్వాజుడనే శిష్యుడు అతని వస్త్రాలను తెస్తాడు. మార్గంలో తామస నది వద్దకు చేరుకుంటారు. తమసా నది నిర్మలత్వాన్ని చూసి ఆ నదిలోనే స్నానం చేయాలని నిర్ణయించుకుంటాడు. స్నానానికి నదిలో దిగుతూ ఒక క్రౌంచ పక్షి జంటను సంగమించడం చూస్తాడు. చూసి పరవశానికి గురి అవుతాడు. అదే సమయంలో మగ పక్షి బాణంతో ఛెదింపబడి చనిపోతుంది. భర్త చావును తట్టుకోలేక ఆడ క్రౌంచ పక్షి గట్టిగా అరుస్తూ చనిపోతుంది. ఈ సంఘటనను చూసి వాల్మీకి మనసు కరిగి శోకానికి లోనవుతాడు. ఈ సంఘటనకు కారణం ఎవరా అని చుట్టూ చూస్తాడు. దగ్గరలో ఒక బోయడు ధనుర్బాణాలతో కనిపిస్తాడు. వాల్మీకికి కోపం వస్తుంది. ఆ శోకంతో కూడుకున్న కోపంలో ఆ బోయవాడిని శపిస్తూ ఈ మాటలు అంటాడు:
మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః॥
యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం॥
- ఓ కిరాతుడా! నీవు శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు.
- ఎందుకంటే క్రౌంచ పక్షులజంటలో కామ పరవశమైయున్న ఒక (మగ) పక్షిని చంపితివి.[3] ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినదే సంస్కృత సాహిత్యంలో వచ్చిన మొదటి శ్లోకం. అలా మొదలయినది రామాయణ కావ్యం సాంతం రాసేవరకూ సాగింది.
వాల్మీకి వలస
[మార్చు]అటవీ తెగకు చెందిన వాల్మీకి కరువుల వల్ల బ్రతుకు తెరువు కోసం ఉత్తర భారతదేశం నుండి వలస బాట పట్టాడు. ఆర్య తెగకు చెందిన సప్తబుషులచే జ్ఞానోదయమైన తర్వాత, మహర్షిగా మారి దండకార్యణం (నల్లమల అడవులు) గూండా దక్షిణ భారతదేశం, ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడు. మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో బసచేస్తూ, అడవి ఆకులు, దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని దేవనాగరి లిపిలో వ్రాస్తూ, తను వెళ్ళిన ప్రదేశాల్ని కావ్యంలో పేర్కొన్నాడు. ఆంధ్ర దేశంలో ఉన్న గోదావరి నదితీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చే సరికి తమిళనాడు రామేశ్వరం సముద్ర గట్టు వద్ద నున్న షోల్ మీదుగా శ్రీలంక ప్రవేశించాడు. శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడు. వాల్మీకి తన జీవిత కాలాన్ని శ్రీలంకలోనే ముంగిచాడని విష్లేషకుల భావవ.
ఇవికూడా చూడండి
[మార్చు]
మూలములు
[మార్చు]- ↑ జూలియా లెస్లీ, Authority and Meaning in Indian Religions: Hinduism and the Case of Valmiki, యాష్గేట్ (2003), పుట. 154. ఐఎస్బీఎన్ 0-7546-3431-0
- ↑ పుట. 505 ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజమ్, వాల్యూం 3, రచయిత : సునీల్ సెహ్గల్
- ↑ బాలకాండలో ని శ్లోకం 1-2-15
- ↑ వాల్మీకి (1914). ఆదిత్య హృదయం. man%27gu%20ven%27kat%27aran%27ganaadharaavu. Retrieved 2020-07-13.
- రామాయణం
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with NLA identifiers
- పురాణ పాత్రలు
- హిందూ ఋషులు