కార్ల గుహలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కార్ల గుహ
క్రీ.పూ.కార్ల గుహ

ముంబయి పూనా ప్రాంతములకు మధ్యన లూనావాలకు దగ్గరలో ఈ కార్లా గుహ ఉంది.ఇది ఒక చైత్యగుహ.అనగా దేవాలయములు, చర్చిలవలె ఇది ఒక ఆరాధన స్థలము. ఈ గుహనిర్మాణ కాలమును తెల్పు శాసనములిందు లేవు. ఇది క్రీ.పూ. 50సం.లకు పూర్వము ఈ గుహనిర్మాణమని పండితులు నిర్ణయించిరి.ఆకాలమున ఆప్రదేశమంతయు ఆంధ్రశాతకర్ణి రాజులు ఏలుబడినట్లు ఉంది.ఇంతే కాక ఈగుహయందు స్తంభబోధికలందు ఏర్పడిన శిల్పములు సంపూర్ణ ఆంధ్రశైలిని అనుసరించినవి.

గుహలు ఎలా నిర్మించారు[1]

[మార్చు]

చిన్నపుడు ఇసుకలో ఆటలు ఆడుకునే ఉంటారుకదా..ఇసుకలో ఆటలాడు కోవడం తడి తడిగా వున్నఇసుకతో ఇళ్ళు, గోపురాలు కట్టడం, ఇసుకను గోపురంగా చేర్చి, లోపల కాలిని గాని, చేతిని గాని లేదా వస్తువునో గాని ఉంచి వాటిని మెల్లగా వెనక్కు తీసి, అక్కడి ఇసుకను తొలగించి ద్వారా మార్గాలు ఏర్పాటు చేయడం మనకందరికీ తెలిసినవిషయమే., మీ జ్ఞాపకాలకి ఆలోచనని జోడిస్తే కొండలను తొలచిన విధానం మీ ఉహకు అందుతుంది. సరిగ్గా అలాగే కొండలను తొలిచి మన శిల్పులు గుహాలయాలను నిర్మించారు. మన దేశంలో శిలలను తొలిచే విధానం దాదాపు 2000 సంవత్సరాలకు పూర్వమే ఆరంభమయింది. మొదట కొండల నుంచి ఏ భాగాన్ని ఏ ఆకారంలో తొలగించాలో గుర్తుగా గీతలు గీసుకునే వారు. ఆ తరువాత తొలచడం ప్రారంభించేవారు. మొదట పైకప్పు భాగం నుంచి తొలుచుకుంటూ కింది భాగానికి వచ్చేవారు.

గుహ నిర్మాణము- శిల్పకళ

[మార్చు]

శిల్పమున సాంచీ స్తూపము తోరణములందు వలెనే వాస్తువునందు ఆంధ్రశిల్పులు కార్లగుహనిర్మాణమందు నూతన రూపములకును, నవ్యభావములకును దారితీసిరి.మనము ఎరిగినంతవరకు, హిందూ దేశమందలి చైత్యగుహలన్నిటికంటె అతివిశాలమయి, ఈ గుహ పూర్ణ స్వరూపమున కలిగియున్నది. అంతకు పూర్వము నిర్మాణమయిన సర్వాస్తులోపములు ఈ గుహయందు సవరణాయినవి. నట్టింటి (Nave) స్తంభములు ఒక వైపునకు వాలక, నిటారుగా ఏర్పడియున్నవి. గుహపురోభాగమందేర్పడిన అంగణకుడ్యము శిల్పములచే అలంకృతమయినది. ఈ కుడ్యము ఈ స్థానము అలంకరించుట ఇదే ప్రథమము. అయినప్పటికినీ ఈ యితర చైత్యమందలి అమగణకుడ్యమునకును తీసిపోని ఉత్కృష్ణరూపమున ఈ కుడ్య మేర్పడియున్నది.

బౌద్ధ ప్రాకారము

ఈ గుహ అంతర్భాగము దాదాపు, 124 అడుగుల పొడవయి, 46 అడుగుల వెడల్పున, 45 అడుగుల ఎత్తున నిర్మితమయినది. నట్టిభాగము (Nave) దాదాపు 26 అడుగుల వెడల్పు, అర్ధచంద్రాకరము కలిగియున్నది. ఈ నట్టి భాగమునకు ఇరువైపుల ఒక్కొక్క శ్రేణిస్తంభములు ఉన్నాయి. ఈ స్తంభశ్రేణులు ఒక్కొక్కటి 15 స్తంభములు కలిగి, నట్టింటిని, పార్స్వభాగములను వేరుపరచును.నట్టింటి చివర ఒక రాతిస్తూపము మలచియున్నది. ఈస్తూపమునకు వెనుక భాగమందు కొలదిదూరమున కుడ్యము వర్తులాకరమున ఏర్పడియున్నది. ఈ కుడ్యమనకును, స్తూపమునకును మధ్యగా ఒక అర్ధచంద్రాకారశ్రేణి యందు ఏడు అష్టకోణ స్తంభములు ప్రచ్చాదమును భరించుచు నిలచియున్నవి. ఈస్తంభములు వట్టి అష్టకోణకంబములు. నట్టింటి కప్పును ఆనాడు అలంకరించిన కలప వాసములు ఇంకను నిలచియున్నవి. ఈకప్పు సరిగా నట్టింటికి ప్రక్కలందు వరుసగా నిలచియున్న స్తంభములపై నుంచిలేదు. కొంతవరకిది సూటిగాపోయి, తరువాత వంపు తిరిగి, ఎత్తును ఇనుమడించి కొనురీతిన నిర్మితమయినది.

ఆనాటికి ఈ పద్ధతిన రాతీటుక కట్టడములందు వాస్తుక్రమము ఏర్పడలేదని, ఈవాస్తురూపము ఆనాడు దేశమున పరిపాటిఅయి ఉన్న కపుప నిర్మాణక్రమమును అనుసరించి శిల్పులు ఈగుహను మలచిరి. చైత్యమునకు వెనుక భాగమందేర్పడిన పూజా వస్తువయిన స్తూపస్థానమునే తరువాత కొన్ని శతాబ్దములకు నిర్మించిన చర్చీలందు క్రైస్తవులు తమ ఆరాధనస్థలము (Alter) ను ఏర్పరిచిరి. ఈ గుహయందు స్థూపపీఠము వర్తులమయి, పై అంచున బౌద్ధ ప్రకారమురీతిన అలంకార యుతముగా మలైచి యున్నది. ఈ స్తూప శిరస్సుపయిన ఆనాడు నిలిపిన కొయ్య చత్రము, కొంత శిథిలమయినను, ఈ నాటివరకు నిలిచియున్నది. ఈ చత్రప్రచ్చాదనము క్రింది ముఖమును పద్మమువలె అతి ఇంపుగా ఆనాటి శిల్పులు మలిచిరి.

గవాక్షము

సమముగా స్తూపమునకు ఎదురున చైత్య సింహ ద్వారము ఏర్పడియున్నది. ఈ సింహద్వారమునకు ఇరువైపుల రెండు ఉపద్వారములు, సరిగా చైత్యపార్స్వభాగములకు ఎదురుగా నిలిచి ఉన్నాయి. ఈ ద్వారము లన్నిటికి పైన ఒక పెద్ద గవాక్షము ఉంది. ఈ గవాక్షముయొక్క వాస్తురూపము చైత్య స్తూపపు రూపురేఖ ననుసరించి యుండును. అందుచేత వాస్తు విమర్సకులందరు దీనిని చైత్యరుపగవాక్షమని అంటారు.చైత్యమునకు వెలుతురు ఈ గవాక్షమునుండి ప్రసరించును. ఈవెలుగు చైత్య గర్భముదున్న స్తూపముపైనమాత్రమే పడి చైత్య పార్స్వమునం దున్న గోడలు సయితము నీడనపడి, సరిగా కానరాక, ఉపాసకునికి పూజావస్తువువయిన స్తూపముపైన ఒక గురిని ఏర్పర్చును. ఆనాడు శిల్పులు ఈ గవాక్షమును ఒక కలుప చుట్టముతో అలకరించిరి. ఈ చట్ట భాగము నేడు శిథిలమయినది.

కార్ల గుహలు-స్తూపము

ఈగవాక్షము క్రింద ద్వారములకు మధ్యన ఏర్పడియున్న అంగనకుద్యముఖమున బుద్ధరుపశిల్పములు ఉన్నాయి. ఈ శిల్పములు మహాయానగతి ననుకరించుటచేత, చైత్యనిర్మాణమయిన తరువాత దాదాపు 200సం. చేసియుండవచ్చును. ఈశిల్పముల క్రింద, సా.శ.150 లకు ఏలిన ఆంధ్రరాజు పులమావికి చెందిన శాసనము ఉంది.

ఈగుహకు ఎదురుగా ఎడమవైపున షోడశకోణముల ధ్వజస్తంభము ఒకటి ఉంది. ఇది అశోక స్తంభమును పోలియున్నది. ఈ స్తంభశిరోభాగమున 4 సింహములు మలిచియున్నవి. కుడివైపున ఒక చిన్న దేవీమందిరము ఉంది. ఈ మందిరమున ఇప్పుడుకూడ పూజలు జరుగుచున్నవి. ప్రస్తుతము దేవీ యున్న స్థానమున రెండవ ధ్వజస్తంభము ఒకటి ఉండిఉండవచ్చునని పండితుల ఊహ.

గుహాంగణమునకు ముందు భాగమున వరాండా ఒకటి ఏర్పరచుట అతి ముఖ్యమయిన ఆంధ్రవాస్తువిశేషము. ఇది ఆతిధ్యమునకు చిహ్నము. ఈ గుహయందు 30 పుర్ణ స్తంభములు ఉన్నాయి. సింహద్వారము కడ నిలిచియున్న మొదటి నాలుగు స్తంభములు కొలదిగా శిథిలమయినవి. వీటి శిరస్సుల పయిన ఒక చిన్న ఉపప్రాచ్చాదనము ఏర్పడియున్నది. ఈ ఉపప్రాచ్చాదనము మహాగవాక్షము గుంద ప్రసరించు వెలుగు చైత్యమంతయు ప్రసరింప నీయక సరిగా చైత్యస్తూపము మీదనే వాలునట్లు చేయుచున్నవి.

కార్లగుహచైత్యము నిర్మించుటకు పూర్వము నిర్మితమయిన గుహలన్నింటి యందును స్తంభములు వట్టి చతురస్రములుగా, ఏటవాలుగా ఏర్పరిచిరి. దీనికి కారణము, ఆ గుహల వాస్తుక్రమమంతయు, ఆనాడు శిల్పు లెరిగిన హర్మ్యవాస్తువు ననుసరించింది. హర్మ్యము లానాడు కొయ్య చట్టములతోను, ఇటుకలతోను నిర్మించెడివారు. కొయ్య చట్టములపైన ఆధారపడిన అర్ధవలయ ప్రచ్చాదములను నిలుపుటకు, మోటించిన ఏటవాలు కంబములు అవసరమయినవి. కాని సంపూర్ణ శిలామయమయిన చైత్యగుహలందు ఈ ఏటవాలు స్తంభములకు అవసరము లేదు. అందుచేత గుహలందు ఏటవాలు స్తంభములు ఇమడక, అతివికృతముగా కూడా గోచరించును. స్వేఛ్హానువర్తులయిన ఆంధ్ర శిల్పులు ఈ అంశమును రాతిగుహలను నిర్మించుటకు గడగినంతనే గిర్తించిరి. రాతి శిల్పములందు శిలానిసారితిరూపములందె వాస్తు వేర్పడవలయును. ఇది వాస్తువు యందు ఒక ప్రధానలయవిశేషము.

ఇచట విదితమయిన స్తంభరూపము సంపూర్ణమయినది. ఒక త్రిఫలపీఠమయిపయిన కుంభము నుంచి, కుంభములో నుంచి నిటారుగా ఒక చతురస్రకంబమును నిలిపి, దానిపయిన ఒక పద్మము నుంచి, పద్మముమీద ఒక పేటికను నిలిపి, శిలావస్తువునకు తగిన స్వరూపమయిన, స్తంభరూపమున సూచించిరి. కుంభజనితమయి వెలువడు ఈకంబము పూర్తిగా చిత్రపద్మములచే అలంకృతమయినది. ఈ కంబముపై నున్న పద్మపు రేకులు ఒక వరుసక్రిందకు వాలి, 2వవరుసపైకి వికసించుచున్నవి. దీనిపైన నిలిపిన పేటిక ముఖము మృగచిత్రములచె అలంకృతము. ఈ రుపమున రాతిస్తంభమునకు అవసరమయిన భాగములుగా క్రిందినుంచి వరుసున పీఠము, అధిష్టానము, ఆశ్యము, కుంభము, గ్రీవము, ఫాలకము, బోఢికలుగా అంవయించి, ప్రథమమున పూర్ణస్తంభరూపమున కార్ల గుహయందు ఆంధ్ర శిల్పులు నిర్మించిరి.

ఈ మహాచైత్యగుహచుట్టును భిక్షుకగృహములు ఉన్నాయి. ఇవన్నియు కూడా ఆకొండనమలచినవె. వీటియందు శిల్పములు కొన్ని మాత్రము తరువాత చాలకాలమునకు కూడా చెక్కబదినవి. అయినను వీటియందు గమనింపదగ్గ విశేషము లేవియును లేవు.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఎల్లోరా గుహలు ఎలా నిర్మించారు". Archived from the original on 2011-08-11. Retrieved 2015-10-30.