Jump to content

భీమా శంకరం

అక్షాంశ రేఖాంశాలు: 19°04′19″N 73°32′10″E / 19.072°N 73.536°E / 19.072; 73.536
వికీపీడియా నుండి
(భీమాశంకర్ నుండి దారిమార్పు చెందింది)
Bhimashankar Temple
భీమశంకర జ్యోతిర్లింగం (మహారాష్ట్ర)
భీమశంకర జ్యోతిర్లింగం (మహారాష్ట్ర)
Bhimashankar Temple is located in Maharashtra
Bhimashankar Temple
Bhimashankar Temple
భౌగోళికాంశాలు :19°04′19″N 73°32′10″E / 19.072°N 73.536°E / 19.072; 73.536
పేరు
ఇతర పేర్లు:మోతేశ్వర మహాదేవ్
ప్రధాన పేరు :భీమశంకర శివాలయం
దేవనాగరి :भिमाशंकर
సంస్కృతం:भिमाशंकर
తమిళం:பீமாஷங்கர் சிவாலயம்
మరాఠీ:भिमाशंकर
ప్రదేశం
దేశం:భారత దేశము
రాష్ట్రం:మహారాష్ట్ర
జిల్లా:పూణె
ప్రదేశం:భీమశంకరం
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :నాగర

భీమశంకర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన 6వ భీమశంకర లింగం వెలసిన హిందూ పుణ్యక్షేత్రం . భీముడు అనే రాక్షసుడి కారణంగా తలెత్తిన వివత్తును తొలిగించి నందువల్ల ఆ భీమశంకర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధిచెందింది. భీమశంకర క్షేత్రం సహ్యాద్రి పర్వత సానువుల్లో మహారాష్ట్రలో పూణేకు 127 కి.మీ. ముంబాయికి 200 కి.మీ. దూరంలో, పూణే జిల్లాలోని ఖేడ్ తాలుకాలో భీమశంకరం లోని భీమా నది ప్రక్కన భావగిరి గ్రామంలో వెలసి ఉంది. సహ్యాద్రి పర్వత శిఖరాలలో ఒకదాని పేరు డాకిని. ఆ కొండపై భాగంలో పరమశివుడు ” భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిశాడు. కృష్ణా నది యొక్క ఉపానది అయిన భీమానది ఇక్కడే పుట్టింది. అది పుట్టినచోట శివలింగం ప్రక్కభాగం నుంచి కొద్ది కొద్దిగా ప్రవహిస్తూంటుంది. భీమశంకరుడు శాకిని, డాకిని మొదలైన రాక్షస సమూహాలతో సేవించబడుతూ ఉన్నాడని పురాణవచనం.

యో డాకిని శాకినికా సమాజే, నిషేవ్యమానం పిశితాశానైశ్చ
సదైవ భీమాది పద ప్రసిద్ధం, తం శంకరం భక్తహితం నామామి

భీమశంకర్ దేవాలయాన్ని 13 వ శతాబ్దంలో నాగరా పద్ధతిలో పీష్వాల దీవాన్ అయిన నానా ఫడ్నవీస్ నిర్మించినట్లు చారిత్రికా ఆధారాలనుసారం తెలుస్తోంది. ఆ గుడి గోపురాన్ని చూడగానే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. నల్లటి రాతితో చెక్కిన ఆ ఆలయ శిఖరాన్ని చూడగానే ఎంతోభక్తి భావం కలగుతుంది. గుడి లోపల చిన్నగా వున్నా ఆ శివలింగాన్ని వెండితో తాపడం చేసారు. దాని పైన ఒక కత్తి గాటు ఉంటుంది. సా.శ1437 లో చిమన్జీ అంతజీ నాయక్ అను నతను స్వామి ముందుర ఉన్నసభా మండపాన్ని నిర్మించాడు. రఘునాథ్ పీష్వా అనే అతను ఒక నూతిని తవ్వించాడు ఆ కోనేటి లోపల ఒక వినాయకుని విగ్రహం కుడా వుంది.ఈ జ్యోతిర్లింగ క్షేత్రం భూమికంటే చాలా దిగువన ఉంటుంది. ఎన్నో ఆలయాలు పర్వత శిఖరాల పైన వుంటాయి. కాని లోయలో ఉండే అతి కొద్ది ఆలయాల్లో భీమాశంకర్ ఒకటి అన్ని జ్యోతిర్లింగ క్షేత్రాల్లాగే భీమాశంకర్ గర్భ గుడి కూడా కిందికి ఉంటుంది. సులువైన మెట్ల మార్గం గుండా ఈ క్షేత్రానికి వెళ్లాలి. ఈ మార్గం గుండా కట్టెతో చేసిన మాదిరిగా ప్లాస్టిక్ స్థంబాలు పయిన కూడా ప్లాస్టిక్ రూఫ్ తో కూడిన మరి అత్యంత సుందరమైన స్వాగత ద్వారం ఎంతో రమణీయం.

స్థల పురాణం

[మార్చు]

పూర్వం భీముడనే పేరుగల రాక్షసుడు తన తల్లియైన కర్కటితో ఈ పర్వత శిఖరం మీద నివసిస్తూ ఉండేవాడు. వాడు ఒకనాడు తల్లిని ” అమ్మా నా తండ్రి ఎవరు ?” ఎక్కడున్నాడు? నీవు ఈ కొండమీద ఒంటరిగా ఉండటానికి కారణం ఏమిటి ” అని ప్రశ్నించాడు. అప్పుడు కర్కటి కుమారునితో “నాయనా లంకా రాజ్యానికి ప్రభువైన రావణాసురుని తమ్ముడైన కుంభకర్ణుడు మీ తండ్రి. పరాక్రమవంతులైన నీ తండ్రిని, పెదతండ్రిని దుర్మార్గుడైన శ్రీరాముడు సంహరించాడు. నా తండ్రి కర్కటుడు, తల్లి పుష్కసి. నా మొదటి భర్త విరాధుడు. అతనిని కూడా ఒకప్పుడు శ్రీరాముడే సంహరించాడు. ఒకనాడు నా తల్లిదండ్రులు అగస్త్యమహర్షి శిష్యుడైన సుతీక్ష్ణుడు అనేవాడిని తినబోయారు. తపస్సంపన్నుడైన వాడు కోపంతో నా తల్లిదండ్రులను భస్మం చేశాడు. నేను దిక్కులేని దానినై బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నాను. అప్పుడు ఒకనాడు ఇక్కడికి వచ్చిన కుంభకర్ణుడు నన్ను బలవంతంగా చేపట్టాడు. ఆ విధంగా నీవు జన్మించావు. నీ తండ్రి మహావీరుడు కనుక తండ్రిని మించిన కొడుకువై నీ వంశానికి పేరు తీసుకొనిరా” అని చెప్పింది.

తల్లిమాటలు విన్న భీముడు కోపంతో వణికిపోయాడు. తన వంశాన్ని నాశనం చేసిన విష్ణుమూర్తినీ, ఆయన భక్తులనూ సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. దేవతలను, మహర్షులను మట్టుపెట్టాలని పట్టుపట్టాడు. బ్రహ్మదేవుని గురించి వేయి సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మప్రత్యక్షమై ఆ రాక్షసునికి అంతులేని పరాక్రమాన్ని, అనంతమైన దైర్యాన్ని వరంగా ప్రసాదించాడు. వరగర్వంతో భీమాసురుడు దేవలోకం మీదికి దండెత్తి దేవేంద్రుని ఓడించి దేవలోకాన్ని ఆక్రమించుకొన్నాడు. ఆ తరువాత భూలోకమంతా తిరిగి సాధువులైన భక్తులను మహార్షులను బాధించాడు.

ఆ కాలంలో కామరూప దేశాన్ని సుదక్షిణుడు అనే రాజు పరిపాలిస్తూండేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు. అఖండమైన తపస్సంపన్నుడు. భీమాసురుడు అతనిపై దండెత్తి అతనిని కారాగారంలో బంధించాడు. శివభక్తుడైన సుదక్షిణుడు కారాగారంలోనే మట్టితో ఒక లింగాన్ని చేసి పూజిస్తూ నిరంతరం శివపంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. ఒకరోజు భీమాసురుడు ఆ రాజును సమీపించి “ఓరీ బుద్ధిమాలినవాడా ఈ జపము లేమిటి? ఈ శివపూజలేమిటి ? ఇకపై ఈ పిచ్చిపనులు మాను ” అని గర్జించాడు. అయినా ఆ రాజు ఇవి ఏమీ పట్టించుకోకుండా శివపూజలో నిమగ్నమైపోయాడు. రాక్షసుడికి వళ్ళు మండింది పళ్ళు పటపట కొరకుతూ కత్తిని తీసి ” మూర్ఖుడా ఏమి మాట్లాడవు ! నిన్నే !” అని అరిచాడు. రాజు నెమ్మదిగా కళ్ళు తెరచి “రాక్షసరాజా మనకు కనిపించే చరాచర జగత్తుకంతటికి పరమశివుడే ప్రభువు. అతడే ఈ ప్రపంచానికి కర్త. భరించేది అతడే, హరించేది అతడే. నేనా జగత్పతిని సేవిస్తూన్నాను. నీ గర్జనలు, గాండ్రింపులు నన్ను ఏమీ చేయలేవు” అన్నాడు. అంతటితో భీముడు మరింత మండిపడుతూ వికటాట్టహాసంతో కత్తిని ఝుళిపిస్తూ “ఈ లోకానికి వీడేనా కర్త ? వీడేనా రక్షించేది ? ఇప్పుడు ఈ లింగాన్ని నా కత్తితో ముక్కలు ముక్కలు చేస్తాను. తనను తాను రక్షించుకోమను” అంటూ కత్తినెత్తి శివలింగాన్ని నరకబోయాడు. అంతలో శివలింగం నుండి శివుడు ఆవిర్భవించి, ఆ రాక్షసుని భస్మం చేశాడు. సుదక్షిణుడు భక్తిపారవశ్యంతో శివుని పాదాలపై పడి నమస్కరించి ఎన్నో విధాలుగా స్తుతించాడు.

పరమశివుని కరుణాకటాక్షం వలన లోకాలకు భీమాసురుని పీడ విరగడయ్యింది విషయము తెలుసుకున్న తారకాసురులు ఈ కామరూప దేశంపై దండెత్తగా సహ్యాద్రి పర్వతములో జరిగిన పోరులో శివుడు చెమటోడ్చి అసుర సంహారము చేశారని పురాణ గాథ. ఈ విధముగా రాలిన చెమట బొట్లే భీమా నదిగా గుర్తింపు వచ్చింది భీమాసురుని తల్లి కర్కటి తన కుమారుని శరీరము పాతాళము నుండి భూమి మీదకు వచ్చి శివుని గురించి దీనాతిదీనంగా ప్రార్థించగా స్వామి దర్శనమిచ్చి వరము కోరుకోమన్నాడు. అప్పుడామె తనయుడి పేరు చిరస్థాయిగా వుండునట్లు అదే ప్రదేశములో జ్యోతిర్లింగముగా శివుడు వెలయవలెనని కోరుకుంది. అంతట పరమేశ్వరుడు ఆమె కోరికను మన్నించి భీమశంకర జ్యోతిర్లింగముగా ఆ సహాద్రి పర్వతములలో వెలసాడు.

యాత్రా మార్గం

[మార్చు]

ముంబై, పుణె, ఔరంగాబాద్, అహమదాగర్ల నుండి అనే విధములైన వాహన సౌకర్యములు ఉన్నాయి. ముంబై, పుణె ల నుండి బస్ సౌకర్యములున్నాయి. 124 కి.మీ. దూరములో ఉండే పుణె రైల్వే సౌకర్యముకూడా అందుబాటులో ఉన్న నగరం. 200 కి.మీ.ల దూరములోని ముంబై, రైల్వేతో పాటు విమాన సౌకర్యము కూడా కలిగియున్నది . భీమాశంకర్ కి దగ్గరి రైలు ప్రదేశం కజ్రత్. కజ్రత్ కు రైలులో వెళ్లి అక్కడినుండి బస్సులో 40 కి.మీ. ప్రయాణం చేసి భీమాశంకర్ జ్యోతిర్లింగం వెలసిన ఖండాస్ చేరుకోగలరు.భీమ్‌శంకర్‌ చిన్న కుగ్రామము. ఇచ్చట కొన్ని సత్రములు కట్టినారు. పర్వ దినములలో వసతి దొరకుట కష్టము. చిన్న భోజనం హోటల్‌, కాఫీ హోటళ్లు ఉన్నాయి.NH50 డారి గుండా పూణే నుండి౬౩ కి.మీ. దూరం పయనంచి అక్కడ నుండి 59 km SH112, SH54 ద్వారా భీమాశంకర్ కు చేరు కోవచ్చు. ఈ 59 కిమీలో ఎటువంటి సెల్ ఫోన్ పని చేయడు కానీ GPS పనిచేస్తుంది దారి మధ్యలో ఒక ప్రాజెక్ట్ కూడా చూడవచ్చు

పర్యాటకం

[మార్చు]

పూర్తిగా అడవి, కొండలలోని ఈ ప్రాంతములోని ఆలయం ప్రకృతి సౌందర్యమునకు మారుపేరుగా ఉంటుంది. ఇప్పటికీ కనపడే కామరూప దేశపు రక్షణ గోడలు, అనేక రకములైన వృక్ష జాతులతో నయనాందకారకముగా ఉంటుంది. దగ్గర్లో గల త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, సహ్యాద్రి వన్యప్రాణ రక్షణ నిలయంలో గల పెద్ద సైజు ఉడుతలు, Trekkingకు గల అనేక అవకాశములతో ఈ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఐతే అనువైన కాలము ఆగస్టు, ఫిబ్రవరి నెలలు. వేసవిలో, వర్షాకాలములో అక్కడి వాతావరణము యాత్రలకు అనుకూలముగా ఉండదు.. ఖంఢాస్ నుండి రెండు నడక మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల ద్వారా సుమారు ఆరు గంటలు సమయం పడుతుంది. శారీరకంగా దృఢంగా లేనివారికీ, వర్షాకాలం, వేసవి కాలంలో నడక మార్గం అత్యంత క్లిష్టమైనది. ఖంఢాస్ నుండి రవాణా సదుపాయం ఉండదు. కనీసం 5-10 మంది ఉంటేనే నడక మార్గం వైపు వెళ్లాలి.