Coordinates: 23°10′58″N 75°46′6″E / 23.18278°N 75.76833°E / 23.18278; 75.76833

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహాకాళేశ్వర జ్యోతిర్లింగం
మహాకాళేశ్వర జ్యోతిర్లింగం is located in Madhya Pradesh
మహాకాళేశ్వర జ్యోతిర్లింగం
మహాకాళేశ్వర జ్యోతిర్లింగం
భౌగోళికాంశాలు:23°10′58″N 75°46′6″E / 23.18278°N 75.76833°E / 23.18278; 75.76833
పేరు
స్థానిక పేరు:శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం
దేవనాగరి:श्री महाकालेश्वर ज्योतिर्लिंग
స్థానం
దేశం:భారత దేశము
రాష్ట్రం:మధ్యప్రదేశ్
ప్రదేశం:ఉజ్జయిని
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:మహాకాళేశ్వరుడు (శివుడు)
వెబ్‌సైటు:mahakaleshwar.nic.in

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం (హిందీ: महाकालेश्वर ज्योतिर्लिंग) హిందూ మత ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిలింగాలలో ఒకటి. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో ఉంది. ఈ దేవాలయం "రుద్రసాగరం" సరస్సు సమీపాన ఉంది. ఈ దేవాలయంలో విశేషమైన శివలింగాన్ని "స్వయంభువు"గా భావిస్తారు. ఈ క్షేత్రంలో ఇతర చిత్రాలు, లింగాల వలె కాకుండా మంత్ర శక్తితో యేర్పడిన శివలింగంగా భావిస్తారు.

జ్యోతిర్లింగం[మార్చు]

శివ పురానం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు,తమలో తము "నేను గొప్ప అంటే నేను గొప్ప" అని వాదించుకున్నారు.ఈ వాదులాట కాస్త వివాదంగా మారింది[1] .దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకొన్నాడు.ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసింది.బ్రహ్మ విష్ణువులు ఇద్దరు లింగాన్ని సమీపించారు.అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కలికంగా సద్దుమణిగింది.ఆ మహా లింగం మొదలు,తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది.బ్రహ్మ హంసా రూపం దరించి లింగం అగ్ర బాగాన్ని చూడడానికి,విష్ణువు వరాహ రుపమలో ఆదిని కనుక్కోవడానికి బయలు దేరాడు.బ్రహ్మకు ఎంతకు లింగం అగ్ర భాగం కాని మొదలు కాని కనిపించలేదు.ఇంతలో లింగం పక్క నుంచి ఒక కేతక పుష్పం (మొగలి పువ్వు) జారి కిందకు రావడం చూసి బ్రహ్మ దాన్ని అపితనకు,బ్రహ్మకు,విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి,సహాయం చేయమని అడిగాడు. ఆవు కనపడితే అదే విధంగా చెప్పి,ఆ లింగం అగ్ర భాగాన్ని చూసినట్లుగా,విష్ణువుతో చెప్పేటప్పుడుఅది నిజమేనని సాక్ష్యం ఇమ్మని ప్రాదేయపడ్డాడు.సాక్షాత్తు సృష్టి కర్తయే తనని బ్రతిమాలేసారికి కాదనలేక సరేనంటాను.రెండు,కిందకు దిగి వచ్చే సారికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయాను అని ఒప్పుకున్నాడు.బ్రహ్మ తాను లింగం అగ్ర భాగాన్ని చూశానని,కావాలంటే అవును, మొగలి పువ్వును అడగమని చెప్పాడు..నిజమే అంది మొగలి పువ్వు,బ్రహ్మ దేవుడి మాటను కాదనలేక అయన లింగం అగ్ర భాగాన్ని చూసాడని ఆవు తలతో చెబుతుంది కాని,అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెబుతుంది.బ్రహ్మ దేవుడి అసత్య ప్రచారాన్ని చూడ లేక ఈశ్వరుడు ప్రతయ్యక్షమయ్యాడు. బ్రహ్మ దేవుడు అబద్దం చెప్పిన కారణం భూలోకంలో ఎచ్చటా పూజలు అందుకోడానికి అర్హత లేకుండా శాపం యిచ్చాడు. విష్ణువుకు ప్రజలు నిరంతరం కొలిచేటట్లు వరమొసగాడు. శివుడు యేర్పరచిన "జ్యోతిర్లింగం" అనంతమైనది. దానినుండి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలు ద్వాదశ జ్యోతిర్లింగాలైనాయి[2][3]. సాధారణంగా జ్యోతిర్లింగాలు 64 కానీ వాటిలో 12 మాత్రం అత్యంత ప్రసిద్ధమైనవిగా భావింపబడతాయి[1]. ఈ పన్నెండు జ్యోతిర్లింగాలలో ప్రతీదీ అచ్చట గల ప్రధాన దైవం పేరుతోనే ఉంటాయి. ప్రతీదీ ప్రత్యేకతను సంతరించుకుంటాయి[4].ఈ జ్యోతిర్లింగాలన్నింటిలో ప్రధాన దైవం "లింగము" . ఇది అనంతమైన జ్యోతిర్లింగ స్తంభంగా భావింపబడుతుంది. ఇది అనంతమైన శివతత్వానికి నిదర్శనం.[4][5][6] ఈ జ్యోతిర్లింగాలు గుజరాత్ లోని సోమనాథుడు, శ్రీశైలం లోని మల్లిఖార్జునుదు, ఉజ్జయిని లోని మహాకాళేశ్వరుడు, మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వరుడు, హిమాలయాలలోని కేదారినాథుడు, మహారాష్ట్ర లోని భీమశంకరుడు, వారణాశి లోని కాశీ విశ్వనాథుడు, మాహారాష్ట్రలోని త్రయంబకేశ్వరుడు, డియోగర్ లోని వైద్యనాథుడు, ద్వారక లోని నాగేశ్వరుడు, తమిళనాడులోని రామేశ్వరుడు, చ ఔరంగాబాద్ లోని గ్రీష్మేశ్వరుడు.[1][7]

దేవాలయ విశేషాలు[మార్చు]

ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుని విగ్రహాన్ని "దక్షిణామూర్తి" అని కూడా అంటారు. అనగా ఈవిగ్రహం ముఖం దక్షివైపు ఉంటుంది. ఈ ఏకైక లక్షణం ఈ దేవాలయం తాంత్రిక శివనేత్రం యొక్క సంప్రదాయాన్ని సమర్థించే విధంగా ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో కంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఈ దేవాలయంలోని గర్భగుడిలో "ఓంకారేశ్వర మహాదేవ" విగ్రహం మహాకాళ విగ్రహం పైన ఉంటుంది. గణపతి, పార్వతి, కార్తికేయుల చిత్రాలు పశ్చిమ,ఉత్తర, తూర్పు గోడలపై అమర్చబడి ఉంటాయి. దక్షిణ భాగంలో నంది చిత్రం ఉంటుంది. ఇది మహాదేవుని యొక్క వాహనం. మూడవ అంతస్తులో గల "నాగచంద్రేశ్వర" విగ్రహం నాగపంచమి రోజున మాత్రమే దర్శనంకోసం తెలుస్తారు. ఈ దేవాలయం ఐదు అంతస్తులలో ఉంటుంది. దానిలో ఒకటి భూ అంతర్భాగం. ఈ దేవాలయం సరస్సు సమీపంలో భారీ గోడలతో కూడుకొనివున్న విశాలమైన ప్రాంగణం కలిగి యున్నది. శిఖరం లేదా గోపురం శిల్పాలతో సొగసుగా అలంకరించబడి ఉంటుంది. ఇత్తడి దీపాలు భూగర్భ గర్భగుడిలోనికి పోయే మార్గానికి వెలుగునిస్తాయి. దేవుని ప్రసాదం (పవిత్ర సమర్పణ)ఇతర ఆలయాల వలె కాకుండా దేవునికి సమర్పించినది దేవతలకు తిరిగి సమర్పించవచ్చని నమ్మకం.[8]

ఉజ్జయినిలో శివ లింగాలు మూడంతస్థులుగా ఉంటాయి. అన్నింటి కన్నా కింద ఉండేది మహా కాళ లింగం. మధ్యలో ఉండేది ఓంకార లింగం, ఆపైన ఉండేది నాగేంద్ర స్వరూపమయిన లింగం. ఉజ్జయినిలో ఒక చిత్రం ఉంది. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందర ‘పర్జన్యానుష్ఠానం’ అని ఒక అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతోంది. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం కిందనే శంఖుయంత్రం అనే చాలా ఆశ్చర్యకరమయిన యంత్రం ఉందని పెద్దలు నమ్ముతారు.ఈశ్వరార్చనలో శంఖాన్ని ఊదుతారు. మహాకాళేశ్వర లింగం కింద శంఖయంత్రం ఉంది. అందుకని మహాకాళేశ్వరుడి దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయాన్నయినా పొందుతాడు.

ఈ ప్రాంగణంలో పార్వతి, వినాయకుడు, కార్తికేయుడు, సాక్షిగోపాలుడు, శనీశ్వరుడుతోపాటు అనేక శివలింగాలు భక్తులకు దర్శనం ఇస్తాయ. మహాకాలళ్ మందిర శోభ సంధ్యా సమయంలో అత్యంత మనోహరమై భాసిల్లుతుంది. సృష్టి ప్రారంభంలో బ్రహ్మ శివుడ్ని ఇక్కడ మహాకాళుడిగా కొలువై ఉండమని ప్రార్థించాడనీ, ఆ బ్రహ్మ అభీష్టం మేరకు శివుడిక్కడ కొలువై ఈ మందిరానికింతటి శోభనిస్తున్నాడనే పురాణకథలు వినిపిస్తాయి.

భస్మ మందిరం[మార్చు]

ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉజ్జయినిలో ఉన్నటువంటి అంతరాలయంలో రెండు జ్యోతులు వెలుగుతుంటాయి. ఆ రెండు జ్యోతులను అఖండ దీపాలని పిలుస్తారు. ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమయిన మందిరం ఉంది. దానిని భస్మ మందిరమని పిలుస్తారు. అక్కడ ఆవుపేడతో విభూతిని తయారుచేస్తారు. భస్మమందిరంలోకి ఆవుల్ని తీసుకు వచ్చి వాటి పేడను ఎంత వరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఉజ్జయినిలో చేసేటటువంటి విభూత్యాభిషేకం రెండు రకాలుగా ఉంటుంది. తెల్లని పలచని బట్టలో మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టేస్తారు. ఆ మూటను శివలింగం పైన పట్టుకుంటారు. మరో మూటతో దానిని కొడతారు.అలా కొట్టినప్పడు ఒక్క శివలింగం ఉన్న చోటే కాదు, మొత్తం అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది. అలా నిండిపోతున్నప్పుడు శంఖాలు, భేరీలు, పెద్దపెద్ద మృదంగాలను కూడా మ్రోగిస్తారు. అపుడు అక్కడ మీరు ఒక అలౌకికమయిన స్థితికి వెళ్ళిపోయినటువంటి అనుభూతిని పొందుతారు. రెండవ రకం అభిషేకంలో పురుషుల్ని సంప్రదాయక దుస్తులతో తెల్లవారు జామున దేవాలయం లోపలికి పంపిస్తారు.అప్పుడే శ్మశానంలో కాలిన శవం తాలూకు భస్మాన్ని అర్చకులు పట్టుకు వచ్చి ఇస్తారు. ఆ భస్మపాత్రను అందరికీ ఇస్తారు. చుట్టూ కూర్చుని ఆ శవ భస్మంతో స్వామికి అభిషేకం చేస్తారు.

స్వామివారికి ఇక్కడ జరిగే భస్మహారతికైలాసనాధుని దర్శనంఅయనంతటి ఆనందాన్ని ఇస్తుందంటారు భక్తులు. బ్రహ్మసైతం ఈ భస్మపూజ చేశాడని ఆ కారణంగానే ఈ క్షేత్రాన్ని మహాశ్మసానమని పిలవడం జరుగుతోందని చెప్పే పురాణకథలూ ఉన్నాయ. ఈ స్వామి దర్శనం అకాల మృత్యువునుంచి రక్షిస్తుంది. 12 సంవత్సరాల కొకసారి ఈ క్షేత్రంలో కుంభమేళా జరుగుతుంది. అత్యంత ఘనంగా జరిగే ఈ కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ క్షేత్రాన మరణించినవారికి పునర్జన్మ ఉండదని ప్రతీతి.

శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి వారికి “భస్మ హారతి” (అస్థికలు సమర్పణ) రొజూ ఉదయం 4 గంటలకు తప్పనిసరి ఆచారంగా త్రయంబకేశ్వరునికి సమర్పిస్తారు. ఈ పూజ రెండు గంటల పాటు ఆవుపేడ పిడకలను (cow dung cakes (upale) ఉపయోగించి నిర్వహిస్తారు. ఆర్తి సమయంలో మంత్రాలు జపించడం, గంభీరమైన ధ్వనులు చేయటం వల్ల గర్భగుడి శక్తివంతమైన ప్రకంపనాలతో మార్మోగిపోతుంది. ఇది మనిషి జీవిత కాలంలో మరిచిపోలేని అద్భుతమైన అనుభవం.

ఈ భస్మహారతి 10 మంది నాగ సాధువుల ద్వారా జరుగుతుంది ఈ భస్మ హారతి సమయంలో ఎవరిని గర్భగుడిలోనికి అనుమతించరు. కేవలం పురుషులకు మాత్రమే ఈ భస్మ హారతిలో పాల్గొనేందుకు అనుమతిస్తారు. స్త్రీలను ఈ హారతిలో పాల్గొనటంకాని, చూడటానికి కానీ అనుమతించరు. భక్తులను గర్భగుడి బయట ఉన్న నంది మంటపంలో, బారికేడ్లు వెనుకకు అనుమతించబడతారు. కేవలం 100 మందికి మాత్రమే వసతి వున్న నంది మంటపంలో సుమారు 500 భక్తులు బారికేడ్ల వెనుక, సమీపంలో కూర్చుని దర్శనం చేసుకొంటారు.

భస్మ హారతి సమయంలో త్రయంబకేశ్వరుడు భస్మధారణతో అందంగా దర్శనం ఇస్తాడు.ఈ భస్మ ఆరతి దర్శనం ప్రతి హిందూ భక్తుని చిరకాల కోరిక, మానవ జీవితంలో భస్మఆరతి దర్శనం పునర్జన హరణం.

మహాకాళేశ్వర దేవాలయం ఒక శక్తి పీఠం[మార్చు]

Shiva carrying the corpse of Sati Devi

విగ్రహం 18 మహా శక్తి పీఠములలో ఒకటిగా ప్రసిద్ధి చెందినది.[9][10][11]

హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని (శివుని)తోడుగా దర్శనమిస్తుంది.

పురాణశాస్త్రం[మార్చు]

పురాణాల ప్రకారం ఉజ్జయిని నగరానికి "అవంతిక" అని పేరు. విద్యార్థులు పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేయుటకు గల నగరాలలో ఒకటిగా భాసిల్లింది.పురాణం ప్రకారం ఈ ప్రాంతాన్ని "చంద్రసేనుడు" అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన మహా శివభక్తుడు. తన పూర్తికాలాన్ని శివారాధనకే అంకితం చేసినవాడు. ఒకరోజు ఒక రైతు కుమారుడు (శ్రీకరుడు) రాజభవనం పరిసరాలలో నడుస్తూ రాజు పఠిస్తున్న భగవంతుని నామాన్ని విని వెంటనే దేవాలయంలోనికి ప్రవేశించి ఆయనతోపాటు ప్రార్థన చేస్తాడు. కానీ రాజభటులు శ్రీకరుడిని బలవంతంగా రాజ్యం వెలుపల గల క్షిప్ర నదీ సమీపంలోనికి పంపిస్తారు. ఉజ్జయినికి ప్రక్కగల రాజ్యాలలోని శత్రు రాజులు రిపుదమన రాజు, సింగాదిత్యుడు ఉజ్జయినిపై దండెత్తి సంపదను దోచుకోవాలని నిశ్చయించుకుంటారు. ఈ విషయం విన్న శ్రీకరుడు ప్రార్థనలు ప్రారంభిస్తాడు. ఈ విషయం విధి అనే పూజారికి తెలుస్తుంది. అయన నిర్ఘాంతపోయి ఆయన కుమారుల తక్షణ అభ్యర్థన మేరకు మహాశివుని క్షిప్ర నదీ తీరంలో ప్రార్థనలు చేస్తాడు. రాజు దాడి చేసాడు, విజయాన్ని సాధించాడు. బ్రహ్మ దేవునిచే ఉపదేశం పొందిన శక్తివంతమైన భూతం కనిపించకుండా అదృశ్య రూపంలో వారికి సహాయం చేసింది. వారు నగరాన్ని దోచుకొని శివ భక్తులపై దాడులు చేశారు.

శివుడు ఆయనభక్తుల అభ్యర్థనలు విని మహాకాళుని అవతారంలో వారికి దర్శనమిచ్చి చంద్రసేనుని రాజ్యానికి శత్రువులనందరినీ నాశనం చేశాడు. శివభక్తులైన శ్రీకరుడు, వ్రిధి ల అభ్యర్థన మేరకు ఆ నగరంలోనే ప్రధాన దైవంగా ఉండుటకు అంగీకరించారు. అచటనే కొలువుండి ఆ రాజ్యంలో గల భక్తులను శత్రువుల బారినుండి రక్షించాలని నిశ్చయించుకున్నాడు. ఆ రోజు నుండి మహాశివుడు లింగంలో మహాకాళునిగా కాంతి రూపంలో కొలువైనాడు. పరమేశ్వరుడు ఈ క్షేత్రంలో దర్శించినవారికి మరణం, వ్యాథుల భయం నుండి విముక్తి కల్పిస్తానని తెలిపాడు.[12]

చరిత్ర[మార్చు]

ఈ దేవాలయ సముదాయం సుల్తాన్ షాస్-ఉద్-దీన్ (ఇలుత్మిష్) చే 1234-5 ప్రాంతంలో ఉజ్జయిని పై దాడి చేసిన సందర్భంలో నాశనం చేయబడింది.[13][14][15] ప్రస్తుత నిర్మాణం సా.శ. 1736 లో శ్రీమంత్ రానోజీరావు షిండే మహరాజ్ యొక్క జనరల్స్ అయిన శ్రీమంత్ పీష్వా బాజీరావు, ఛత్రపతి షాను మహరాజ్ లచే నిర్మింపబదినది. తర్వాతి అభివృద్ధి, నిర్వహణ శ్రీనాథ్ మహాడ్జి షిండే మహరాజ్ (మహాడ్జి ది గ్రేట్) చే జరిగింది.

1886 వరకు మహారాజ శ్రీమంత్ జయాజీ రావు సాహెబ్ షిండే ఆలిజాహ్ బహాదూర్ చే నిర్వహింపబడింది. స్వాతంత్ర్యం వచ్చిన పిదప ఈ దేవాలయం నిర్వహనను ఉజ్జయిని మ్యునిసిపల్ కార్పొరేషన్ వారు చేస్తున్నారు. ప్రస్తుతం ఇది కలెక్టరు కార్యాలయం నిర్వహణలో కొనసాగుతుంది.[13][14][15]

విశేషాలు[మార్చు]

పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అనిపేరు. అవంతి అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. వీటిలో మొదటిది స్త్రీ. రెండోది అక్క. ఇక్కడ ఉన్న అవంతి సాక్షాత్తూ జగదాంబ అయిన అమ్మవారి స్వరూపము. మన దేశంలో ఉన్న ఏడు మోక్ష పట్టణాలలో అవంతి ఉజ్జయిని కూడా ఒకటి. ఈ ఉజ్జయిని ఒకపక్క మహాకాళుడితో ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి వల్ల కూడా అంతే ప్రసిద్ధి పొందింది. ‘కాళ’ అనే శబ్దం లయకారకమై ఉంటుంది. అటువంటి కాలం స్త్రీ స్వరూపంలో చెప్పినప్పుడు కాళిక అవుతుంది. ఉజ్జయినిలోని రెండు స్వరూపాలూ కాల స్వరూపాలై ఉంటాయి. భూమధ్యరేఖ వెడుతున్న చోట మధ్యలో ఈ క్షేత్రం ఉంటుంది. ఉజ్జయిని ఒకానొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్నటువంటి పట్టణం. భోజరాజు, మహాకవి కాళిదాసులు ఇద్దరూ తిరిగినటువంటి ప్రాంతం ఉజ్జయిని.

పూర్వకాలంలో ఆ ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వేద ప్రియుడు నియమ నిష్ఠలతో ఉంటూ శివార్చన శీలుడై షట్కాలాలలోనూ శివపూజ చేసేవాడు. వేదధర్మాన్ని పాటించేవాడు. ఈ బ్రాహ్మణుడికి నలుగురు కుమారులు. ఈ నలుగురు కుమారులు కూడా ధర్మానుష్టానుపరులే. ఆయన పెద్ద కొడుకు పేరు ‘దేవప్రియుడు’. రెండవవాడి పేరు ‘ప్రియమేథుడు’. మూడో కుమారుడి పేరు ‘సుకృతుడు’. నాలుగవ కుమారుడి పేరు ‘సువ్రతుడు’. ఈ నలుగురూ పెద్దవారయ్యారు. ఒకసారి ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరాలలో ఒక రాక్షసుడు బయలుదేరాడు. వాడి పేరు దూషణుడు. అందరినీ ఇబ్బంది పెడుతూ చిట్టచివరకు ఎవరూ ఈశ్వరార్చన చేయలేనటువంటి స్థితిని కల్పించాడు.కానీ ఆ నలుగురు ఏ మాత్రం బెదరలేదు. దూషణుడు ఆ నలుగురు బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తాడు. అయినా వారు బెదరలేదు. ‘హర ఓం హర హర’ అంటూ శివ పారాయణ చేస్తూ కూర్చున్నారు. అప్పుడు అక్కడ ఉన్న చిన్న పార్థివ లింగం నుండి మహాకాళ స్వరూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చి, ఒక్కసారి హుంకరించాడు. ఆ హుంకారానికి దూషణుడి సైన్యాలు బూడిదరాశులై పడిపోయాయి.కానీ ఆ వేడికి అక్కడే కూర్చున్న ఈ నలుగురు బ్రాహ్మణ పిల్లలు మాత్రం బెదరలేదు. వారు ఆ మహాకాళ రూపానికి స్తోత్రం చేశారు. అప్పుడు భక్తుల ప్రార్థన మేరకు శివుడు మహా కాళ లింగ రూపంలో వెలిశాడు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 R. 2003, pp. 92-95
  2. Eck 1999, p. 107
  3. See: Gwynne 2008, Section on Char Dham
  4. 4.0 4.1 Lochtefeld 2002, pp. 324-325
  5. Harding 1998, pp. 158-158
  6. Vivekananda Vol. 4
  7. Chaturvedi 2006, pp. 58-72
  8. "Mahakaleshwar temple". Archived from the original on 2008-06-24. Retrieved 2014-04-28.
  9. The Upanishads. Translated by Max Muller, F. Kessinger Publishing, LLC. June 1, 2004. ISBN 1419186418.
  10. The Upanishads Part II: The Sacred Books of the East Part Fifteen. Translated by Max Muller, F. Kessinger Publishing, LLC. July 26, 2004. ISBN 1417930160.
  11. "Kottiyoor Devaswam Temple Administration Portal". kottiyoordevaswom.com/. Kottiyoor Devaswam. Retrieved 20 July 2013.
  12. Page 67, South Indian Hindu festivals and traditions, By Maithily Jagannathan, Published 2005, Abhinav Publications, ISBN 81-7017-415-5
  13. 13.0 13.1 Abram, David. Rough guide to India. p. 447.
  14. 14.0 14.1 Reddy, Krishna (2007). Indian History for Civil Services. Tata McGraw-Hill. p. B119.
  15. 15.0 15.1 Mahajan, Vidya Dhar (1965). Muslim rule in India. S Chand & Co. p. 80.

నోట్సు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]