Jump to content

నీలం సంజీవరెడ్డి

వికీపీడియా నుండి
నీలం సంజీవ రెడ్డి
[[Image:NeelamSanjeevaReddy.jpg
నీలం సంజీవరెడ్డి
నీలం సంజీవరెడ్డి
|225x250px|నీలం సంజీవరెడ్డి]]


పదవీ కాలం
25 జూలై 1977 – 25 జూలై 1982
ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయి
చరణ్ సింగ్
ఇందిరాగాంధి
ఉపరాష్ట్రపతి బి.డి. జెట్టి
మొహమ్మద్ హిదాయతుల్లా
ముందు బి.డి. జెట్టి (Acting)
తరువాత జైల్ సింగ్

పదవీ కాలం
26 మార్చి 1977 – 13 జూలై 1977
ముందు బలిరాం భగత్
తరువాత కె.ఎస్.హెగ్డె
పదవీ కాలం
17 మార్చి 1967 – 19 జూలై 1969
ముందు సర్దార్ హుకుం సింగ్
తరువాత గురుదయాళ్ సింగ్ ధిల్లాన్

పదవీ కాలం
12 మార్చ్ 1962 – 20 ఫిబ్రవరి 1964
గవర్నరు భీంసేన్ సచార్
ఎస్.ఎం.శృంగేష్
ముందు దామోదరం సంజీవయ్య
తరువాత కాసు బ్రహ్మానందరెడ్డి
పదవీ కాలం
1 నవంబర్ 1956 – 11 జనవరి 1960
గవర్నరు సి. ఎం. త్రివేది
భీంసేన్ సచార్
ముందు బూర్గుల రామకృష్ణారావు (హైదరాబాద్)
బెజవాడ గోపాలరెడ్డి (ఆంధ్ర)
తరువాత దామోదరం సంజీవయ్య

వ్యక్తిగత వివరాలు

జననం (1913-05-19)1913 మే 19
ఇల్ల్లూరు, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటీష్ ఇండియా
(ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము)
మరణం 1996 జూన్ 1(1996-06-01) (వయసు 83)
బెంగుళూరు, కర్ణాటక, భారత దేశము
జాతీయత భారత దేశము
రాజకీయ పార్టీ జనతా పార్టీ (1977నుండి)
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ (1977 ముందు)
పూర్వ విద్యార్థి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, అనంతపురం
మతం హిందూ

నీలం సంజీవరెడ్డి (మే 19, 1913 - జూన్ 1, 1996) భారత రాష్ట్రపతి గా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా, లోక్‌సభ సభాపతి గా, ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా, కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా వివిధ పదవులను అలంకరించి, ప్రజల మన్ననలను పొందిన రాజకీయవేత్త,ఒక్క సారి ఎం .ఎల్.ఎ ఐతే కోట్లకి పడగలు ఎత్తుతు రాజకీయ వారసత్వాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో వాటిని వ్యతిరేకించి ఎలాంటి హంగు ఆర్భాటాలకి పోకుండా నిస్వార్థ సేవలు అందించిన ప్రజా నాయకుడు నీలం సంజీవ రెడ్డి. ముఖ్యంగా లోకసభాపతిగా ఎన్నిక కాగానే తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి అధికారపక్ష -ప్రతిపక్షం మంచి వాతావరణం ఏర్పరచి స్పీకర్ పదవికే వన్నె తెచ్చిన రాయలసీమ రాజకీయ ఆణిముత్యం మన నీలం సంజీవరెడ్డి గారు .

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అనంతపురం జిల్లా, ఇల్లూరు గ్రామంలో 1913, మే 18 న రైతుబిడ్డగా సంజీవరెడ్డి జన్మించాడు. మద్రాసు దివ్యజ్ఞాన సమాజం పాఠశాలలోను, అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోను చదువుకున్నాడు. 1935 జూన్ 8 న నాగరత్నమ్మను పెళ్ళి చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

సంజీవ రెడ్డి విగ్రహము. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయంలో

రాజకీయ జీవితం

[మార్చు]

సంజీవరెడ్డి రాజకీయ జీవితం అనేక ఒడిదుడుకులతో కూడుకున్నది. అనేక విజయాలు, కొన్ని అపజయాలతో పాటు, కొన్ని రాజకీయపు ఎత్తుగడలతో కూడిన త్యాగాలు అతను చరిత్రలో ఉన్నాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు, ఆ తరువాతి రాజకీయ చరిత్రలతో సంజీవరెడ్డి జీవితం పెనవేసుకు పోయింది. 1940 ల నుండి 1970ల వరకు రాష్ట్ర, దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ప్రతి ముఖ్య సంఘటనతోను అతనుకు ప్రమేయముంది.

సంయుక్త మద్రాసు రాష్ట్రంలో

[మార్చు]

1929 లోనే మహాత్మా గాంధీ స్ఫూర్తితో చదువును పక్కనపెట్టి రాజకీయాల్లో చేరి స్వాతంత్ర్య పోరాటం వైపు దృష్టి సారించాడు. 1937లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీకి కార్యదర్శిగా ఎన్నికై దాదాపు పదేళ్ళపాటు ఆ పదవిలో కొనసాగాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని డిటెన్యూగా జైలుకు వెళ్ళాడు.1940, 1945 ల మధ్య ఎక్కువకాలం అతను జైలులో ఉన్నాడు. 1946లో మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యాడు. 1947లో రాజ్యాంగ నిర్మాణ సంఘమైన రాజ్యాంగ సభకు ఎన్నికయ్యాడు. 1949 నుండి 1951 వరకు మద్రాసు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసాడు. 1951 లో ఆంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు మంత్రిపదవికి రాజీనామా చేసాడు. 1951లో ఆంధ్ర ప్రాంత కాంగ్రెసు అధ్యక్షపదవికి ఎన్.జి.రంగాతో పోటీ పడ్డాడు. ప్రకాశం మద్దతుగల రంగాను ఆ ఎన్నికలలో ఓడించాడు. ఆ తరువాత రంగా, ప్రకాశం కాంగ్రెసును విడిచి వెళ్ళారు. ఈ కాలంలో సంజీవరెడ్డి జీవితంలో ఒక దుర్ఘటన జరిగింది. అతను ఐదేళ్ళ కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ విషాదాన్ని తట్టుకోలేని సంజీవరెడ్డి, పార్టీ పదవికి రాజీనామా చేసాడు. తరువాత పార్టీ పెద్దల ఒత్తిడిమేరకు రాజీనామాను ఉపసంహరించుకున్నాడు.

ఆంధ్రరాష్ట్రంలో

[మార్చు]

1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు సంయుక్త మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యుల నుండి కొత్త రాష్ట్ర కాంగ్రెసు శాసనసభా పక్ష నాయకుణ్ణి ఎన్నుకునే సమయంలో సంజీవరెడ్డి పోటీలేకుండా ఎన్నికయ్యాడు. ముఖ్యమంత్రి పదవి తథ్యమైనా, అప్పటి రాజకీయాల ఫలితంగా తాను తప్పుకుని టంగుటూరి ప్రకాశం పంతులుకు నాయకత్వం అప్పగించి, ఉపముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ 1955లో రాజకీయాల ఫలితంగానే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని వదులుకున్నాడు. అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ఎన్.జి.రంగా నాయకత్వం లోని కృషికార్ లోక్ పార్టీ మద్దతు కాంగ్రెసుకు అవసరమైంది. అయితే బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రి అయితేనే తాము మద్దతు ఇస్తామని రంగా ప్రకటించడంతో తాను తప్పుకుని మళ్ళీ ఉపముఖ్యమంత్రి అయ్యాడు.

ఆంధ్రప్రదేశ్ లో

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ అవతరణలో సంజీవరెడ్డిది ప్రముఖపాత్ర. రాష్ట్ర స్థాపనలో ప్రధాన, నిర్ణాయక ఘట్టమైన పెద్దమనుషుల ఒప్పందంలో ఆంధ్ర తరపున అప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రి, బెజవాడ గోపాలరెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రిగా ఉన్న సంజీవరెడ్డి కూడా పాల్గొని ఒప్పందంపై సంతకం పెట్టాడు. ఆంధ్ర ప్రదేశ్ అవతరించాక, కాంగ్రెసు శాసనసభాపక్ష నాయకుడిగా బెజవాడ గోపాలరెడ్డిని ఓడించి, తాను ముఖ్యమంత్రి అయ్యాడు. అల్లూరి సత్యనారాయణ రాజును రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్ష పదవి పోటికి నిలబెట్టి, రంగాను ఓడించాడు. 1960లో అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షపదవికి ఎన్నికవడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసాడు.

కాంగ్రెసు అధ్యక్షుడిగా రెండేళ్ళు పనిచేసి, మళ్ళీ 1962లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. రవాణా సంస్థల జాతీయీకరణ వివాదంలో సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టడంతో 1964 ఫిబ్రవరి 29 న తనపదవికి రాజీనామా చేసాడు. ఆపై సంజీవరెడ్డి కేంద్ర రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించసాగాడు.

కేంద్రంలో

[మార్చు]

1964 జూన్ 9లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వంలో ఉక్కు, గనుల శాఖ మంత్రిగా చేరాడు. ఆపై రాజ్యసభకు ఎన్నికయ్యాడు. 1967లో ఇందిరా గాంధీ ప్రభుత్వంలో కూడా కొద్దికాలం మంత్రిగా చేసాడు. 1967లో నాలుగో లోక్‌సభకు హిందూపురం నియోజకవర్గం నుండి ఎన్నికై, లోక్‌సభకు సభాపతిగా కూడా ఎన్నికయ్యాడు. సభాపతి నిష్పాక్షికంగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్నిక కాగానే, కాంగ్రెసు సభ్యత్వానికి రాజీనామా చేసాడు. సభాపతిగా ఎన్నిక కాగానే, తన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మొదటి లోక్‌సభ సభాపతి, సంజీవరెడ్డి.

1969 జూలై 19 న సభాపతి పదవికి రాజీనామా చేసి, రాష్ట్రపతి పదవికి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసాడు. కాంగ్రెసు అంతర్గత రాజకీయాల ఫలితంగా అతను, మరో తెలుగువాడు - వి.వి.గిరి - చేతిలో కొద్ది తేడాతో ఓడిపోయాడు. దాంతో సంజీవరెడ్డికి కొద్దికాలం రాజకీయ గ్రహణం పట్టింది. 1975 లో జయప్రకాశ్ నారాయణ్ హైదరాబాదులో జరిపిన పర్యటనతో రాజకీయాల్లో తిరిగి క్రియాశీలకంగా మారాడు. 1977లో ఎమర్జెన్సీ తరువాత, జనతాపార్టీ ప్రభంజనం దేశాన్ని చుట్టుముట్టి కాంగ్రెసును అధికారం నుండి దింపివేసినపుడు, ఆంధ్ర ప్రజలు మాత్రం కాంగ్రెసుకు పట్టం కట్టారు. 42 స్థానాలకుగాను, 41ని కాంగ్రెసు గెలుచుకుంది. జనతాపార్టీ గెలిచిన ఒక్క స్థానమూ సంజీవరెడ్డిదే. మళ్ళీ లోక్‌సభ సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అయితే మళ్ళీ పదవికి రాజీనామా చేసి - ఈసారి నాలుగు నెలల్లోనే - రాష్ట్రపతి పదవికి పోటీ చేసాడు. పోటీలో ఉన్న 37 మందిలో ఒక్క సంజీవరెడ్డి నామినేషను తప్ప మరెవరిదీ చెల్లకపోవడంతో, అతను ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఇప్పటివరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఒకేఒక్క రాష్ట్రపతి సంజీవరెడ్డి.

1982 లో రాష్ట్రపతి పదవినుండి దిగిపోయాక, రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుని బెంగుళూరులో స్థిరపడ్డాడు. 1996 జూన్ 1 న నీలం సంజీవరెడ్డి మరణించాడు. బెంగుళూరులో కాక్స్ టౌనులో ప్రభుత్వం అతనుకు సమాధి నిర్మించింది.

విశిష్టతలు

[మార్చు]
  • సంజీవరెడ్డి నిజాయితీని తెలియజేసే ఒక సంఘటన: సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నపుడు, ఒక కాంట్రాక్టరు ఒక ఉత్తరంతో అతను వద్దకు వచ్చాడు. సంజీవరెడ్డి ఆప్తమిత్రుడి వద్దనుండి తెచ్చిన ఉత్తరం అది. దాన్ని అతను అందుకున్నాడుగాని, చించి చూడలేదు. కాంట్రాక్టరుతో ఇలా అన్నాడు. "నువ్వో కాంట్రాక్టరువని నాకు తెలుసు.. దీనిలో ఏమి రాసుందో కూడా తెలుసు. నీ క్షేమం కోరుకునేవాడివయితే, ఈ ఉత్తరం వెనక్కి తీసేసుకో. లేదూ, దీన్ని తెరిచి చూడమంటావా.., ఆపై నేను తీసుకోబోయే చర్యకు సిద్ధంగా ఉండు" అని అన్నాడు. మరో మాట లేకుండా ఉత్తరాన్ని తీసేసుకున్నాడా కాంట్రాక్టరు.
  • ఎమర్జెన్సీ తరువాత 1977 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో దేశమంతటా జనతాపార్టీ ప్రభంజనం వీచి, కాంగ్రెసు చిత్తుగా ఓడిపోగా, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం మొత్తం 42 స్థానాలకుగాను, జనతాపార్టీ 41 స్థానాల్లో ఓడిపోయి, ఒకే ఒక్క స్థానం గెలుచుకుంది. గెలిచిన ఆ ఒక్క జనతాపార్టీ వ్యక్తీ, సంజీవరెడ్డియే!
  • లోక్‌సభ సభాపతిగా రెండు సార్లు ఎన్నికై, రెండుసార్లూ రాష్ట్రపతిగా పోటీ చేసేందుకై రాజీనామా చేసాడు. మొదటిసారి రాష్ట్రపతిగా ఓడిపోగా, రెండోసారి గెలిచాడు.
  • ఇప్పటివరకు రాష్ట్రపతిగా చేసినవారిలో సంజీవరెడ్డి నిర్విరోధంగా ఎన్నికయిన ఏకైక రాష్ట్రపతి.
  • 1969లో కాంగ్రెసు పార్టీ ఆధికారిక అభ్యర్థిగా పోటీ చేసిన సంజీవరెడ్డికి వ్యతిరేకంగా ఆత్మ ప్రబోధానుసారం ఓటు వెయ్యమని ఇందిరా గాంధీ తన పార్టీ వారిని ఆదేశించింది. పార్టీలో తన వ్యతిరేకుల ఆటకట్టించేందుకు ఇందిరా గాంధీ వేసిన ఎత్తు ఇది. ఫలితంగా ప్రతిపక్ష మద్దతు కూడా గల వి.వి.గిరి, సంజీవ రెడ్డిని ఓడించి రాష్ట్రపతి అయ్యాడు. అనంతరం కాంగ్రెసు పార్టీ చీలిపోయింది.
  • పుట్టపర్తి సాయిబాబాను దర్శించని అతికొద్ది మంది రాజకీయ నాయకుల్లో సంజీవరెడ్డి ఒకడు.
  • సంజీవరెడ్డి పేరిట శ్రీశైలం ప్రాజెక్టుకు నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్టు అని పేరుపెట్టారు.
  • 1958లో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం అతనుకు గౌరవ డాక్టరేటు బహూకరించింది.

అతను పలుకులు

[మార్చు]
  • తన స్వంత జిల్లా అనంతపురం యొక్క దుర్భిక్ష పరిస్థితుల గురించి ఆవేదనతో అతనుిలా అనేవాడు: "ఇక్కడ పెన్నానదిలో ప్రవహించేది నీళ్ళు కాదు, ఇసుక"

మూలాలు, వనరులు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]


ఇంతకు ముందు ఉన్నవారు:
ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్
భారత రాష్ట్రపతి
1977 జూలై 251982 జూలై 25
తరువాత వచ్చినవారు:
జ్ఞానీ జైల్ సింగ్


ఇంతకు ముందు ఉన్నవారు:
బూర్గుల రామకృష్ణారావు (హైదరాబాదు రాష్ట్రం)
బెజవాడ గోపాలరెడ్డి (ఆంధ్ర రాష్ట్రం)
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
01/11/1956—11/01/1960
తరువాత వచ్చినవారు:
దామోదరం సంజీవయ్య


ఇంతకు ముందు ఉన్నవారు:
దామోదరం సంజీవయ్య
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
12/03/1962— 29/02/1964
తరువాత వచ్చినవారు:
కాసు బ్రహ్మానంద రెడ్డి