లాల్ బహదూర్ శాస్త్రి

వికీపీడియా నుండి
(లాల్ బహాదుర్ శాస్త్రి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గౌరవప్రదమైన
 లాల్ బహదూర్ శాస్త్రి
లాల్ బహదూర్ శాస్త్రి


పదవీ కాలం
9 జూన్ 1964 – 11 జనవరి 1966
రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్
ముందు గుల్జారీలాల్ నందా(ఆపద్ధర్మ)
తరువాత గుల్జారీలాల్ నందా(ఆపద్ధర్మ)

భారతదేశ హోం మంత్రి
పదవీ కాలం
9 జూన్ 1964 – 18 జూలై 1964
ప్రధాన మంత్రి తానే
ముందు గుల్జారీలాల్ నందా
తరువాత సర్దార్ స్వరణ్ సింగ్

భాతరదేశ హోం మంత్రి
పదవీ కాలం
4 ఏప్రిల్ 1961 – 29 ఆగస్టు 1963
ప్రధాన మంత్రి జవాహర్ లాల్ నెహ్రూ
ముందు గోవింద్ వల్లభ్ పంత్
తరువాత గుల్జారీలాల్ నందా

భారతదేశ రైల్వే మంత్రి
పదవీ కాలం
1951 – 1956
ప్రధాన మంత్రి జవాహర్ లాల్ నెహ్రూ
ముందు ఎన్. గోపాలస్వామి అయ్యంగార్
తరువాత జగ్జీవన్ రాం

వ్యక్తిగత వివరాలు

జననం (1904-10-02)1904 అక్టోబరు 2
ముఘల్‌సరాయ్, ఆగ్రా, ఉడ్ ఉమ్మడి రాజ్యం, బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, భారతదేశం)
మరణం 1966 జనవరి 11(1966-01-11) (వయసు 61)
తాష్కెంట్, ఉజ్బెక్ ఎస్.ఎస్.ఆర్, సోవియట్ యూనియన్
(ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్)
విశ్రాంతి స్థలం విజయ్ ఘాట్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు శారదా ప్రసాద్ శ్రీవాస్తవ (తండ్రి)
రామ్‌ దులారీ దేవి (తల్లి)
జీవిత భాగస్వామి
పూర్వ విద్యార్థి గాంధీ కాశీ విద్యా పీఠం
వృత్తి
  • రాజకీయనాయకుడు
  • విద్యావేత్త
  • ఉద్యమకారుడు
మతం హిందూ మతం
పురస్కారాలు భారతరత్న (1966) (మరణానంతరం)

లాల్ బహదూర్ శాస్త్రి ( audio speaker iconవినండి ) (1904 అక్టోబర్ 2, - 1966 జనవరి 11, ) భారత దేశ రెండవ ప్రధానమంత్రి , భారతదేశ స్వాతంత్ర్యోద్యమం లో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. అతను 1920లలో భారత స్వాతంత్ర్యోద్యమంలో తన స్నేహితుడు నితిన్ ఎస్లావత్ తో కలసి చేరాడు. మహాత్మా గాంధీ ప్రభావంతో అతను మొదట మహాత్మా గాంధీకి, తరువాత జవహర్లాల్ నెహ్రూ కు నమ్మకస్తుడైన అనుచరుడయ్యాడు. 1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అతను భారతదేశ ప్రభుత్వంలోచేరి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో మొదట రైల్వే మంత్రిగా (1951–56), తరువాత హోంమంత్రిగానే కాక ఇతర భాద్యతలను కూడా చేపట్టాడు. శాస్త్రి నెహ్రూకి విధేయుడు. అలాగే నెహ్రూ, శాస్త్రికి ఎంతో ఇష్టమైనవాడు అయినప్పటికీ పార్టీలో గట్టి ప్రతిపక్షాన్ని ఎదుర్కొన్నాడు. కానీ నెహ్రూతో సాన్నిహిత్యం కారణంగా అతను తరువాత కాలంలో ప్రధానమంత్రి కాగలిగాడు. అతను 1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధం కాలంలో దేశాన్ని నడిపించాడు. అతని నినాదం "జై జవాన్ జై కిసాన్" యుద్ధ సమయంలో బాగా ప్రాచుర్యంలోనికి వచ్చి ప్రస్తుత కాలం వరకు ప్రజల హృదయాల్లో గుర్తుండిపోయింది. ఈ యుద్ధం 1966 జనవరి 10న తాష్కెంట్ ఒప్పందం ద్వారా యుద్ధం పూర్తి అయినది. ఒప్పందం జరిగిన తరువాత దినం తాష్కెంట్లో అతను గుండెపోటుతో మరణించినట్లు చెప్పబడింది. కానీ ఈ మరణానికి అనేక కారణాలు చెప్పబడినప్పటికీ అది సి.ఐ.ఎ ద్వారా జరిగిన ప్రణాళికాబద్ధమైన హత్యగా చెప్పబడింది.

ప్రారంభ జీవితం (1904–1917)

శాస్త్రి వారణాసి లోని రామనగర లో తన తల్లితరపున తాత గారింట కాయస్థ హిందూ కుటుంబంలో 1904 అక్టోబర్ 2న జన్మించాడు.[1][2] ఆ కుటుంబం సాంప్రదాయకమైన చాలా గొప్ప అడ్మినిస్ట్రేటర్స్ . సివిల్ సర్వెంట్స్ ఉన్న నేపధ్యం కలది. అతని తండ్రి తరపున పూర్వీకులు వారణాసి దగ్గరలోని రామనగర లో జమీందారుల వద్ద పనిచేసేవారు. అతను జన్మించిన మొదటి సంవత్సరంలో ఇక్కడ పెరిగాడు. శాస్త్రి తండ్రి శారదా ప్రసాద్ శ్రీవాస్తవ ఉపాధ్యాయునిగా పనిచేసాడు. తరువాత అలహాబాద్ రెవెన్యూ కార్యాలయంలో గుమస్తాగా పనిచేసాడు. ఆమె తల్లి మొఘల్ సరాయ్ లోని రైల్వే పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. ఆంగ్ల ఉపాద్యాయునిగా పనిచేసిన మున్షీ హజారీ లాల్ కుమార్తె. శాస్త్రి రెండవ సంతానంగా పెద్ద కుమారునిగా జన్మించాడు. అతని అక్క పేరు కైలాష్ దేవి (జ.1900)[3]

1906 ఏప్రిల్ లో శాస్త్రికి ఒక యేడాది వయస్సు ఉన్నప్పుడు, అతని తండ్రి డిప్యూటీ తహసీల్దారుగా పదోన్నతి పొందాడు కానీ ప్లేగు అనే అంటువ్యాధికి గురై మరణించాడు. ఆ సమయంలో 23 సంవత్సరాల వయస్సు గల రామ్‌దులారీ దేవికి మూడవ బిడ్డతో గర్భంతో ఉంది. ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి ఆమె తన కన్నవారి ఇంటికి (ముఘల్‌సరాయ్) వచ్చి అక్కడ స్థిరపడింది. ఆ కుటుంబాన్ని లాల్ బహదూర్ తాత ఆదుకుని వారికి ఆశ్రయం కలిగించాడు. అక్కడ ఆమె సుందరీ దేవి అనే కుమార్తెకు జూలై 1906 న జన్మనిచ్చింది.[1] [4] ఆ విధంగా శాస్త్రి ఆమె సొదరీమణులతో కలసి తాతగారైన హజారీ లాల్ ఇంటి వద్ద పెరిగాడు. అయినప్పటికీ హజారీలాల్ 1908లో గుండెపోటుతో మరణించాడు. తరువాత శాస్త్రి కుటుంబాన్ని తన మామయ్య దర్బారీ లాల్ చూసుకున్నాడు. దర్బారీలాల్ ఘజీపూర్ లోని "నల్లమందు నియంత్రణ విభాగం" లో ప్రధాన గుమస్తాగా పనిచేస్తూండేవాడు. తరువాత దర్బారీలాల్ కుమారుడు బిందేశ్వరి ప్రసాద్, ముఘల్‌సరాయ్ లో ఉపాద్యాయునిగా పనిచేసాడు.

అన్ని కాయస్థ కుటుంబాల మాదిరిగానే శాస్త్రి కుటుంబంలోని పిల్లలకు ఉర్దూ భాష, సంస్కృతిలో విద్యను అందించే ఆచారం ఉంది. ప్రభుత్వంలో ఆంగ్ల భాష రాక ముందు అనేక శతాబ్దాలుగా ఉర్దూ/పర్షియన్ భాషలు వాడబడుతున్నందున ఈ భాషలు నేర్చుకోవాలనే ఆచారం ఆనాడు ఉండేది. అందువలన శాస్త్రి తన నాలుగు సంవత్సరాల వయస్సులో ముఘల్‌సరాయ్ లోని తూర్పు మధ్య రైల్వే ఇంటర్ కళాశాలలో బుధన్ మిలన్ అనే మౌల్వీ (ముస్లిం పండితుడు) వద్ద విద్యను అభ్యసించాడు. అక్కడ 6వ తరగతి వరకు చదివాడు. 1917లో తన కుటుంబాన్ని పోషిస్తున్న మామయ్య బృందేశ్వర ప్రసాద్ కు వారణాసి కి బదిలీ అయింది. అందువల్ల కుటుంబం అంతా వారణాసి వెళ్లవలసి వచ్చింది. ఆ కుటుంబంతో పాటు రామ్‌దులారీ దేవి తన ముగ్గురు పిల్లలతో కలసి వారణాసి చేరింది. శాస్త్రి హరిష్ చంద్ర హైస్కూలు లో ఏడవ తరగతిలో చేరాడు.[1] ఇక్కడ అతను తన పేరులోని "శ్రీవాస్తవ" అనే ఇంటిపేరును వదిలివేసాడు.

నిరాడంబరతకు తోడు ఎంతో అభిమానవంతుడైన లాల్ బహదూర్ స్కూలుకు వెళ్ళటానికి ప్రతి రోజు గంగానదిని దాటి వెళ్ళవలసి ఉండేది. నది దాటించే పడవ వాడికి ప్రతి రోజు కొంత పైకం యివ్వాలి. అది స్వల్పమే అయినా లాల్ బహదూర్ దగ్గర అప్పుడప్పుడు ఉండేదికాదు. పడవ మనిషిని అడిగితే ఊరికే నది దాటించగలడు. అయినా అభిమానవంతుడైన లాల్ బహదూర్ అలా ప్రాధేయపడటం ఇష్టంలేక తన బట్టలను విప్పి, వాటిలో పుస్తకాలను చుట్టి మూటలా కట్టి, తన వీపునకు తగిలించుకుని, ప్రాణాలను సైతం తెగించి అవతలి ఒడ్డుకు ఈదుకుని వెళ్ళేవాడు. తాతగారింట భయభక్తులతో పెరిగిన లాల్ బహదూర్ తన పాఠశాలలో ఎంతో నిరాడంబరంగా ఉంటూ ఉపాధ్యాయుల ప్రేమాభిమానాలను చూరగొన్నాడు. తోటి విద్యార్థులు తనకు తండ్రి లేడని గేలిచేస్తూ హేళన చేస్తున్నప్పటికీ ఆ దు:ఖాన్ని దిగమింగి, ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేయక, వారితో పాటు ఆడుతూ, పాడుతుండేవాడు. అది గమనించిన టీచర్లకు లాల్ బహదూర్ పై ప్రేమ ఇంకా ఎక్కువైంది.

సత్యాగ్రహం చేసే యువకునిగా (1921–1945)

శాస్త్రి కుంటుంబానికి ఏవిధమైన స్వాంత్ర్యోద్యమ నేపధ్యం లేనప్పటికీ అతను చదివే హరిష్ చంద్ర హైస్కూల్ లోని ఉపాద్యాయులలో ఒకరైన నిశ్మేమేశ్వర ప్రసాద్ మిశ్రా ద్వారా దేశభక్తి కలిగింది. ఆ ఉపాద్యాయుడు అతని పిల్లలకు శాస్త్రిని శిక్షకునిగా నియమించి ఆర్థిక సహాయం చేసేవాడు. మిశ్రా దేశభక్తిని ప్రేరణగా పొందిన శాస్త్రి, స్వాతంత్ర్యోద్యమంపై మక్కువ పెంచుకున్నాడు. తరువాత స్వామి వివేకానంద, గాంధీజీ, అనీబిసెంట్ అంటి వ్యక్తుల చరిత్ర, వారు చేసిన సేవలను గూర్చి అధ్యయనం చేసాడు. 1921 జనవరిలో అతను 10వ తరగతి చదువుతున్నప్పుడు పరీక్షలకు మూడు మాసాల వ్యవధి ఉన్న సమయంలో బెనారస్ లో మహాత్మా గాంధీ, పండిట్ మదన్ మోహన్ మాలవీయ ద్వారా నిర్వహింపబడిన సభకు హాజరైనాడు. మహాత్మా గాంధీ పిలువుకు ప్రేరణ పొందిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదలి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. రెండవరోజే శాస్త్రి హరీష్ చంద్ర పాఠశాలను వదలి స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తగా చేరాడు. అతను చురుకుగా అనేక ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొనేవాడు. ఈ కారణంగా అతనిని అరెస్టు చేసారు కానీ మైనర్ అయినందువలన వెంటనే విడిచిపెట్టారు.[5][6] బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం లోని అధ్యాపకునిగా పనిచేసిన జె.బి.కృపాలానీ శాస్త్రికి సూపర్‌వైజర్ గా ఉండేవాడు. కృపాలానీ భారత స్వాతంత్ర్యోద్యమంలో గాంధీని అనుసరిస్తూ ఉన్న ప్రముఖ నాయకులలో ఒకడు. స్వాతంత్ర్యోద్యమంలోకి చదువును వదిలి వచ్చిన యువ కార్యకర్తలు తమ విద్యను కొనసాగించడానికి కృపాలానీ తన స్నేహితుడు వి.ఎన్.శర్మతో కలసి అనియత పాఠశాలను స్థాపించి యువకులు వారి జాతీయ వారసత్వాన్ని కొనసాగించడానికి "జాతీయ వాద విద్య" ను బోధించేవారు. ఒక సంపన్న పరోపకారం గల వ్యక్తి, కాంగ్రెస్ జాతీయవాది అయిన శివప్రసాద్ గుప్తా మద్దతుతో 1921 ఫిబ్రవరి 10 న బెనారస్ లో ఉన్నత విద్యా సంస్థ (కాశీ విద్యా పీఠ్) స్థాపించబడి గాంధీచే ప్రారంభించబడినది. 1925 లో ఈ విద్యాపీఠ్ లోని మొదటి బ్యాచ్ విద్యార్థులలో శాస్త్రి తత్త్వ శాస్త్రం, నీతి శాస్త్రాలలో మొదటి శ్రేణిలో గ్రాడ్యుయేషన్ చేసాడు. అతనికి "శాస్త్రి" (పండితుడు) అనే బిరుదునిచ్చారు. ఈ బిరుదును బ్యాచిలర్స్ డిగ్రీ అందజేసే విద్యాపీఠ్ ఇస్తుంది కానీ ఇది అతని పేరులో స్థిరపడిపోయింది.[7][8]

అతను లాలా లజపతిరాయ్ స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్స్ సొసైటీ (లోక్ సేవక్ మండల్) లో జీవితకాల సభ్యత్వం తీసుకున్నాడు. అతను ముజఫర్ పూర్ లో గాంధీజీ అధ్వర్యంలో హరిజనుల మంచి కోస్ం వివిధ కార్యక్రమాలలో పాల్గొనేవాడు.[9] తరువాత అతను ఆ సొసైటీకి అధ్యక్షునిగా పనిచేసాడు.[10][11]

స్వాతంత్ర్యోద్యమంలో పాత్ర

శాస్త్రి 1928లో గాంధీజీ పిలుపుతో కాంగ్రెస్ లో చురుకైన, పరిపక్వత గల సభ్యునిగా మారాడు. 1930 లో ఉప్పు సత్యాగ్రహం లో అతను పాల్గొన్నాడు. దాని ఫలితంగా రెండున్నర సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు.[12] తరువాత 1937 లో ఉత్తర ప్రదేశ్ పార్లమెంటరీ బోర్డులో ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసాడు. [13] 1940 లో అతను స్వాతత్ర్య ఉద్యమానికి మద్దతుగా వ్యక్తిగత సత్యాగ్రహం నిర్వహించినందున ఒక సంవత్సరం పాటు జైలు లో ఉన్నాడు.[14]

1942 ఆగస్టు 8 న దేశ వ్యాప్తంగా ఆంగ్లేయులు భారతదేశ్ం విడిచి పోవాలనే డిమాండ్ తో గాంధీజీ ముంబై లోని గోవిలియా టాంక్ వద్ద క్విట్‌ ఇండియా ఉద్యమం గూర్చి సందేశాన్నిచ్చాడు. శాస్త్రి ఒక సంవత్సర కాలం జైలుశిక్ష అనుభవించి విడుదలైన వెంటనే అలహాబాదుకు ప్రయాణమయ్యాడు. జవహర్ లాల్ నెహ్రూ గృహమైన ఆనందభవన్‌లో ఉన్న స్వాతంత్ర్య ఉద్యమకారులకు సూచనలను ఒక వారంపాటు పంపాడు. కొద్ది రోజుల తరువాత అతను అరెస్టు కాబడి 1946 వరకు జైలు శిక్ష అనుభవించాడు. [14] శాస్త్రి స్వాతంత్యోద్యమంలో మొత్తం 9 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించాడు. [15] అతను జైలులో ఉన్నకాలాన్ని పుస్తకాలు చదవడంతో గడిపాడు. పశ్చిమ దేశ తత్వవేత్తలు, విప్లవకారులు, సాంఘిక సంస్కర్తల కృషిని బాగా తెలుసుకున్నాడు.

రాజకీయ జీవితం (1947–64)

1954లో కేంద్ర రైల్వే మంత్రిగా చిత్తరంజన్ రైల్వే ఫ్యాక్టరీని పరిశీలిస్తున్న లాల్ బహదూర్ శాస్త్రి

రాష్ట్ర మంత్రి

భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత శాస్త్రి తన స్వంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో పార్లమెంటరీ సెక్రటరీగా నియమించబడ్డాడు. 1947 ఆగస్టు 15 న గోవింద్ వల్లభ్ పంత్ ముఖ్యమంత్రిగా ఉన్న మంత్రివర్గంలో పోలీసు, రవాణా శాఖలకు మంత్రిగా వ్యవహరించాడు. రఫీ అహ్మద్ కిద్వాయ్ నిష్క్రమణ తరువాత కేంద్రంలో మంత్రిగా చేరాడు. అతను రవాణా శాఖా మంత్రిగా ఉన్నప్పుడు మొదటి సారిగా మహిళా కండక్టర్లను నియమించాడు. పోలీసు శాఖా మంత్రిగా అతను పోలీసులు ఎక్కువగా ఉన్న జన సమూహాలను పారద్రోలేటందుకు లాఠీ చార్జ్ కు బదులుగా వాటర్ జెట్ లు వాడాలని ఆదేశించాడు. [16] పోలీసు మంత్రిగా (తరువాత కాలంలో 1950 నుండి హోం మంత్రి) ఆయన పదవీకాలంలో 1947 లో శరణార్థుల వలసలు, పునరావాసం లో జరిగిన మత సంఘర్షణలను విజయవంతంగా అణచివేసాడు. [ఆధారం చూపాలి]

క్యాబినెట్ మంత్రి

1951లో శాస్త్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. అతను ప్రచారం, ఎన్నికల కార్యకలాపాలు, అభ్యర్థుల ఎంపికకు పూర్తి బాధ్యత వహించాడు. అతని మంత్రివర్గంలో రతిలాల్ ప్రేం చంద్ మెహ్తా వంటి ఉత్తమమైన భారతీయ వ్యాపారవేత్తలు ఉండేవారు. అతను 1952, 1957, 1962 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలోముఖ్య పాత్ర పోషించాడు. 1952 లో ఉత్తర ప్రదేశ్ లోని సోరాన్ ఉత్తర (ఫూల్పూర్ పశ్చిమ) విధాన సభ నియోజక వర్గం నుండి పోటీ చేసి 69% ఓట్లతో విజయం సాధించాడు. ఉత్తరప్రదేశ్ హోం మంత్రిగా పదవినలంకరిస్తాడని నమ్మాడు కానీ కేంద్ర ప్రభుత్వంలో నెహ్రూ పిలుపు మేరకు తిరిగి కేంద్రానికి వెళ్లాడు. నెహ్రూ అతనికి 1952 మే 13 న తన మొదటి కేబినెట్ లో రైల్వే మంత్రి భాద్యతలను అప్పగించాడు.

భారత ప్రధానమంత్రి (1964–66)

1964లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత అతని స్థానాన్ని పూరించడానికై, లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీదేశాయ్ సిద్దంగా ఉండగా, అప్పటి కాంగ్రేసు పార్టీ ప్రెసిడెంటు కామరాజ్ సోషలిస్టు భావాలున్న లాల్ బహదూర్ శాస్త్రికి మద్దతుపలికి ప్రధానమంత్రిని చేయడంలో సఫలీకృతుడయ్యాడు. లాల్ బహాదుర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యేనాటికి దేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. ఈ సంక్షోభమును తాత్కాలికంగా పరిష్కరించడానికై విదేశాల నుండి ఆహారాన్ని దిగుమతి చేసాడు. తరువాత దీర్ఘకాలిక పరిష్కారానికై దేశంలో వ్యవసాయ విప్లవానికై (గ్రీన్ రెవల్యూషన్) బాటలుపరిచాడు.

1964 జూన్ 11 న ప్రధానమంత్రిగా అతను చెప్పిన మొదటి మాటలు ప్రసారమైనాయి. అవి:[17]

" చరిత్ర కూడలిలో నిలబడి ఎటు వెళ్ళాలో తేల్చుకోవాల్సిన సమయం ప్రతి దేశానికీ వస్తుంది. కానీ మనకు ఏ కష్టమూ, సంశయమూ అవసరం లేదు. కుడి, ఎడమలకు చూడనవసరం లేదు. మన మార్గం నేరుగానూ స్పష్టంగానూ ఉంది- అందరికీ స్వాతంత్ర్యం, సంపదా ఇచ్చే సామ్యవాద ప్రజాస్వామ్యాన్ని నిర్మించడం, ప్రపంచ శాంతి కోసం పాటుబడడం, అన్ని దేశాల తోటీ మైత్రి నెరపడం"

దేశీయ విధానాలు

జవహర్ లాల్ నెహ్రూ మంత్రివర్గంలోని అనేక మంది మంత్రులను శాస్త్రి కొనసాగించాడు. టి.టి కృష్ణమాచారిని ఆర్థిక మంత్రిగా నియమించాడు. యశ్వంతరావ్ చవాన్ కు రక్షణశాఖను అప్పగించాడు. అతను స్వరన్ సింగ్ ను విదేశీ వ్యవహారాల శాఖను అప్పగించాడు. అతను జవహర్ లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీకి సమాచార ప్రసారాల శాఖా మంత్రిత్వ శాఖను, గుల్జారీలాల్ నందాకు హోం శాఖను అప్పగించాడు.

అతని పరిపాలనా కాలంలో 1955లో మద్రాసులో హిందీ వ్యతిరేక ఆందోళన జరిగింది. భారతీయ ప్రభుత్వం చాలా కాలంగా భారతదేశ ఏకైక జాతీయ భాషగా హిందీని స్థాపించడానికి ప్రయత్నం చేసింది. ఈ విధానాన్ని హిందీ భాషేతర ప్రాంతాలైన ముఖ్యంగా మద్రాసు రాష్ట్రం వ్యతిరేకించింది. పరిస్థితిని శాంతింపజేయడానికి శాస్త్రి హిందీ భాష మాట్లాడని రాష్ట్రాలలో ఇంగ్లీష్ అధికారిక భాషగా ఉపయోగించబడుతుందనే హామీ ఇచ్చాడు. ఈ సందర్భంలో జరిగిన విద్యార్ధి ఆందోళనలు, శాస్త్రి హామీ తరువాత సద్దుమణిగాయి.

ఆర్థిక విధానాలు

కేంద్ర ప్రణాళికతో నెహ్రూ సోషలిస్టు ఆర్థిక విధానాలను శాస్ర్తి నిలిపివేశాడు. అతను వైట్ విప్లవాన్ని(వైట్ రివల్యూషన్) ప్రోత్సహించాడు. ఈ వైట్ విప్లవం ముఖ్య ఉద్దేశ్యం పాలు ఉత్పత్తి, సరఫరా పెంచడానికి ఒక జాతీయ ప్రచారం చేయడం. గుజరాత్ లోని ఆనంద్ ప్రాంతంలో ఉన్న అమూల్ మిల్క్ కో-ఆపరేటివ్ సహకారంతో "నేషనల్ డైరీ డెవలప్‌మెంటు బోర్డు" ఏర్పాటు చేయడమైంది.[18] 1964 అక్టోబరు 31 న అతను గుజరాత్ లోని ఆనంద్ ప్రాంతాన్ని సందర్శించి కంజరి వద్ద ఏర్పాటు చేసిన అముల్ పశుగ్రాస ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసాడు. ఈ కో-ఆపరేటివ్ విజయాన్ని తెలుసుకోవడంపై ఆసక్తి కలిగిన అతను ఒక గ్రామంలో రైతులతో రాత్రిపూట బస చేసి ఒక రైతు కుటుంబముతో విందు కూడా చేసాడు. అతను కైరా జిల్లా కో-ఆపరేటివ్ పాల ఉత్పత్తుల యూనియన్ లిమిటెడ్ (అమూల్) జనరల్ మేనేజర్ అయిన వర్ఘీస్ కురియన్ తో ఈ విషయంలో చర్చలు జరిపాడు. అతను ఇటువంటి నమూనాలను దేశంలో రైతుల సాంఘిక-ఆర్థిక పరిస్థితులను మెరుగు పరచడానికి దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలలో కూడా నెలకొల్పాలని వర్ఘీస్ కురియన్ తో చర్చించాడు. ఈ సందర్శన ఫలితంగా 1965 లో ఆనంద్ వద్ద నేషనల్ డైరీ డెవలప్‌మెంటు బోర్డు (NDDB) స్థాపించబడింది.

దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక ఆహార కొరత గురించి మాట్లాడుతూ, ప్రజలు స్వచ్ఛందంగా ఒక భోజనాన్ని ఇవ్వాలని కోరాడు. దీని ఫలితంగా ఆహార కొరత గల ప్రజలకు కూడా ఆహారం దొరుకుందని తెలియజేసాడు. అయితే దేశానికి విజ్ఞప్తి చేసే ముందు అతను మొదట తన సొంత కుటుంబంలో ఈ వ్యవస్థను అమలు చేసి ధృవీకరించాడు. ఒక వారంలో ఒక భోజనాన్ని వదిలివేసే అభ్యర్థనను ప్రజలకు తెలియజేయడానికి అతను దేశమంతా పర్యటించాడు. అతని విజ్ఞప్తికి విశేషమైన ప్రతిస్పందన వచ్చింది. దీని ఫలితంగా రెస్టారెంట్లు, తినుబండారాల దుకాణాలు ప్రతీ సోమవారం సాయంత్రం మూసివేయబడినవి. దేశంలోని అనేక ప్రాంతాలు "శాస్త్రి వ్రత్" ను పరిశీలించారు. న్యూఢిల్లీ లోని తన అధికార నివాసంలోని పచ్చిక మైదానాన్ని దున్నడం ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి దేశ ప్రజలకు ప్రేరణ కలిగించాడు.

1965 అక్టోబరు 19 న పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో 22వ రోజున అతను అలహాబాదులోని ఉర్వా లో ప్రభావశీలమైన "జై జవాన్ జై కిసాన్" (సైనికులకు అభినందనలు, రైతులకు అభినందనలు) నినాదాన్నిచ్చాడు. అతి తరువాత జాతీయ నినాదమైనది.

భారతదేశ ఆహార ఉత్పత్తిని పెంచే అవసరాన్ని తెలియజేస్తూ, దీర్ఘకాలిక పరిష్కారానికై దేశంలో వ్యవసాయ విప్లవానికై (గ్రీన్ రెవల్యూషన్) అతను బాటలు వేసాడు. అతను సామ్యవాది అయినప్పటికీ, భారతదేశం క్రమమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉండరాదని పేర్కొన్నాడు.[18]

1964 ఫుడ్ కార్పొరేషన్ చట్టం అద్వర్యంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడినది. తరువాత నేషనల్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ బోర్డ్ చట్టం కూడా ఏర్పడినది.

విదేశీ విధానాలు

శాస్త్రి నెహ్రూ విధానాన్ని నిరంతరాయంగా కొనసాగించడంతో పాటు సోవియట్ యూనియన్ తో మరింత దగ్గరి సంబంధాలను ఏర్పరుచుకున్నాడు. 1962 సైనో-ఇండియన్ యుద్ధం తరువాత, చైనీస్ పీపుల్స్ రిపబ్లిక్, పాకిస్తాన్ మధ్య సంబంధాల కోసం సైనిక ఏర్పాటు కోసం భారతదేశ సైనిక దళాల రక్షణ బడ్జెట్‌ను విస్తరించాలని శాస్త్రి ప్రభుత్వం నిర్ణయించింది.

1964లో సిలోన్ లోని భారతీయ తమిళుల హోదాకు సంబంధించి శ్రీలంక ప్రధానమంత్రి సిరిమావో బండారనాయకే తో జరిగిన ఒప్పందంపై సంతకం చేసాడు.[19] ఈ ఒప్పందాన్ని "సిరిమా-శాస్త్రి ఒడంబడిక" గా వ్యవహరిస్తారు. [20] ఈ ఒప్పందం ప్రకారం, 600,000 మంది భారతీయ తమిళులను తిరిగి స్వదేశానికి పంపించగా, 375,000 మంది శ్రీలంక పౌరసత్వాన్ని తీసుకున్నారు. ఈ పరిష్కారం 31 అక్టోబరు 1981 నాటికి జరిగింది. అయితే, శాస్త్రి మరణం తరువాత, 1981 నాటికి, భారతదేశం 300,000 తమిళులను మాత్రమే స్వదేశంలోకి తీసుకున్నారు. శ్రీలంక పౌరసత్వాన్ని 185,000 పౌరులకు (1964 తరువాత మరో 62,000 మంది జన్మించారు) మాత్రమే ఇచ్చింది. తరువాత, భారతదేశం పౌరసత్వం కోసం ఏ ఇతర దరఖాస్తులను పరిగణించకుండా తిరస్కరించింది, 1964 ఒప్పందం గడిచినట్లు పేర్కొంది. [19]

1962 లో జరిగిన సైనిక తిరుగుబాటు తర్వాత బర్మాతో భారత్ సంబంధాలు బలహీనపడ్డాయి, 1964 లో అనేక భారతీయ కుటుంబాలను బర్మా చేత స్వదేశానికి పంపించడం జరిగింది. న్యూ డిల్లీలోని కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి వస్తున్న పౌరులను తిరిగి బదిలీచేసే మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తూ, బర్మా నుండి తిరిగి వచ్చిన భారతీయుల గుర్తింపు, రవాణా కొరకు ఏర్పాటు చేసింది. ఇది భారతీయ నేల మీద నిరాశకు గురైనవారికి ఆశ్రయం కల్పించడానికి, తగిన సౌకర్యాలను అందించడానికి స్థానిక ప్రభుత్వాల బాధ్యతలకు లోబడి ఉంది. ముఖ్యంగా మద్రాసు రాష్ట్రంలో ఆ సమయంలో ఉన్న ముఖ్యమంత్రి, మింజుర్ కె. భక్తవత్సలం, తిరిగి వచ్చిన వారిని పునరావాసం చేయటంలో శ్రద్ధ చూపించాడు. 1965 డిసెబరులో బర్మాలోని రంగూన్ కు తన కుటుంబంతో పాటు అధికారికంగా పర్యటించాడు. జనరల్ "నె విన్" సైనిక ప్రభుత్వంతో సహజమైన సంబంధాలను తిరిగి పునఃస్థాపించాడు.

పాకిస్థాన్ తో యుద్ధం

1965 ఆగస్టులో, పాకిస్తాన్ తన సేనలను ప్రయోగించి జమ్మూ కాశ్మీరులోని కచ్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది, తద్వారా జమ్ము కాష్మీరులోని ప్రజలు ఉద్యమించి, భారతదేశం నుండి విడిపోతారని ఆశించింది. కానీ అటువంటి ఉద్యమం పుట్టలేదు. పాకిస్తాన్ ఆక్రమణ గురించి తెలుసుకున్న లాల్ బహదూర్ శాస్త్రి వెంటనే త్రివిధ దళాలకు నియంత్రణ రేఖను దాటి లాహోరును ఆక్రమించుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.భారత సైన్యం విజయదుందుభికి చేరువలో ఉండగా శాస్త్రి గారి పై అమెరికా తీవ్ర ఒత్తిళ్లు తెచ్చింది. 1965 యుద్ధం తీవ్రస్థాయికి చేరిన సమయంలో పాకిస్థాన్- అమెరికా, భారత్- అమెరికా మధ్య జరిగిన పలు దౌత్య కార్యక్రమాలు జరిగాయి. యుద్ధంలో పాక్ ఓటమి దశకు చేరిన సమయంలో నాటి పాక్ అధ్యక్షుడు ఆయూబ్‌ఖాన్, విదేశాంగమంత్రి జుల్ఫీకర్ అలీ భుట్టోలను పాక్‌లో అమెరికా రాయబారి వాల్టర్ ప్యాట్రిక్ మెక్‌కోటే కలిసి యుద్ధ విరమణకోసం చర్చలు జరిపారు. అప్పటికే భారత సేనలు పాక్ భూభాగంలోకి ప్రవేశించటంతో పాక్ పాలకులు తాము యుద్ధ బాధితులమని అమెరికాకు, ఐక్యరాజ్యసమితి కూడా ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. అయితే, పాక్ వాదనను అమెరికా కొట్టిపారేసినట్లు దౌత్యపత్రాల ద్వారా వెల్లడైంది. కాశ్మీర్‌లోకి దొంగచాటుగా సేనల్ని పంపి యుద్ధానికి కారణం కావటమే కాకుండా నెపాన్ని ఇతరులపై మోపుతున్నారంటూ అమెరికా రాయబారి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అదీకాక తాము ఇచ్చిన ఆయుధాలతో భారత్‌పై యుద్ధం చేస్తున్నారని మండిపడ్డారు. దాంతో ప్లేటు ఫిరాయించిన పాక్ 1948లో ఐరాస చేసిన తీర్మానాన్ని అనుసరించి జమ్ముకశ్మీర్‌లో ప్రజాభిప్రాయసేకరణ జరుపాలని అమెరికా, ఐరాసను కోరింది.

అదే సమయంలో నాటి భారత ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్‌కు లేఖ రాశారు. ఐరాస తీర్మానానికి ఏనాడో కాలం చెల్లిపోయిందని, కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణకు అవకాశమేలేదని కరాఖండిగా చెప్పారు. బేషరతుగా కాల్పుల విరమణను పాటించేందుకు తాము సిద్ధమేనని తెలిపారు. దాంతో పాకిస్థాన్‌ను కాల్పుల విరమణ పాటించాలని అమెరికా తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు దౌత్యపత్రాల ద్వారా తెలిసింది.[21]

శాస్త్రి తన ప్రధానమంత్రిగా పదవీ కాలంలో రష్యా, యుగోస్లేవియా, ఇంగ్లాండ్, కెనడా, నేపాల్, ఈజిప్టు, బర్మా దేశాలను సందర్శించాడు. అతను కైరోలో జరిగిన అహింసా సమావేశం నుండి తిరిగి వచ్చినపుడు అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు మొహమ్మద్ ఆయూబ్ ఖాన్ తనను విందు కోరకు ఆహ్వానించినపుడు అతను కరాచీ విమానాశ్రయంలో ప్రోటోకాల్ ప్రకారం ఆయూబ్ ఖాన్ వ్యక్తిగతంగా ఆహ్వానించకపోవడంతో కొన్ని గంటలపాటు నిరీక్షించాడు.

1965 లో పాకిస్తాన్తో కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత, శాస్త్రి, అయుబ్ ఖాన్ తాష్కెంట్ లో జరిగిన ఒక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. దీనిని అలెక్సీ కోసైజిన్ నిర్వహించాడు. 1966 జనవరి 10 న శాస్త్రి, ఆయూబ్ ఖాన్ తాష్కెంట్ ఒప్పందంపై సంతకాలు చేసారు. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం మేరకు సోవియట్ లోని టాష్కెంట్లో ఒప్పందం పై సంతకం చేసి అక్కడే మృతిచెందాడు.

మరణం

తాష్కెంట్ లో శాస్త్రి విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

తాష్కెంట్ ఒప్పందం పై సంతకం చేసిన రోజున 02:00 గంటలకు అతను తాష్కెంట్ లో గుండెపోటుతో మరణించినట్లు ప్రకటించబడినది. కానీ ప్రజలు మరణం వెనుక కుట్ర ఆరోపించారు.[22] అతను విదేశంలో చనిపోయే భారతదేశ మొదటి ప్రధాన మంత్రి. అతనిని జాతీయ నాయకునిగా శ్లాఘిస్తూ అతని జ్ఞాపకార్థం విజయఘాట్ లో స్మారకం ఏర్పాటు చేసారు. అతను మరణించిన తరువాత భారత కాంగ్రెస్ పార్టీ నూతన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఇందిరా గాంధీని ఎన్నుకొనే వరకు గుల్జారీ లాల్ నందా ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉన్నాడు. [23]

ముంబైలో శాస్త్రి విగ్రహం

కుట్రపూరిత సిద్ధాంతాలు

పాక్‌తో జరుగుతున్న యుద్ద విరమణ ఒప్పందంపై సంతకాలు చేసేందుకు. తాష్కెంట్‌ (ఇది ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్‌లో ఉంది) లో 1966 జనవరి 10న ఒప్పందాలపై సంతకాలు చేసిన మర్నాడే జనవరి 11న ఆయన హృద్రోగంతో అక్కడే మరణించాడు. ఓ దేశాధినేత అదీ మరో దేశానికి అతిధిగా ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు వెళ్ళి అక్కడే అసహజ, అనుమానాస్పదంగా మృతి చెందడం చరిత్రలో అంతకు ముందెప్పడూ లేదు. ఈ మరణం హృద్రోగం వల్ల సంభవించిందని సోవియట్‌ ప్రభుత్వం ప్రకటించింది. భారత ప్రభుత్వం దీన్నే ధ్రువీకరించింది. కానీ ఆధారాల మేరకు శాస్త్రి బౌతికఖాయానికి పోస్టుమార్టం నిర్వహించలేదు. అంతకుముందెప్పుడూ శాస్త్రికి ఎలాంటి అనారోగ్యం లేదు. విషప్రయోగం వల్లే శాస్త్రి మరణించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి[24][25]. దీనిపై కేంద్రం రాజ్‌నారాయణ్‌ కమిటీని నియమించింది. ఈ కమిటీ అధ్యయనం నివేదిక ఇప్పటివరకు వెలుగుచూడలేదు. ఆఖరికి ఇది భారత పార్లమెంట్‌ లైబ్రరీలో కూడా అందుబాటులో లేదు[26]. వాస్తవానికి పాక్‌తో యుద్ధం చివరిదశకొచ్చింది. భారత్‌ విజయంవైపు దూసుకు పోతోంది. ఈ దశలో ఐక్యరాజ్యసమితి పాక్‌తో విరమణ ఒప్పందాన్ని ప్రతిపాదించింది. అప్పటికే శాస్త్రి యుద్ద వీరుడిగా దేశంలో జేజేలందుకుంటున్నారు. ఈ దశలో ఒప్పందానికి అంగీకరించే విధంగా శాస్త్రిపై తాష్కెంట్‌లో తీవ్ర ఒత్తిళ్ళొచ్చా యన్న ఆరోపణలున్నాయి.

భారత్‌కు తెచ్చిన శాస్త్రి భౌతికకాయం నీలంరంగులోకి మారి ఉంది. శరీరంపై కొన్ని గాట్లు కూడా గమనించినట్లు ఆయన భార్య లలితాశాస్త్రి గుర్తించారు. శాస్త్రి ఆఖరుగా ఆయన కుమార్తె సుమన్‌తో మాట్లాడాడు. ఫోన్‌లో మాట్లాడుతూ పాలుతాగి పడుకుంటానని చెప్పాడు. ఈలోగా ఫోన్‌లైన్‌ డిస్కనెక్ట్‌ అయింది. తర్వాత దాదాపు పదిహేనునిమిషాలకు పైగా సుమన్‌ లైన్‌ కోసం ప్రయత్నించింది. ఆ తర్వాత లైన్‌ దొరికింది కానీ శాస్త్రి ఎత్తలేదు. సోవియట్‌కు చెందిన ఓ అధికారి ఫోన్‌ ఎత్తాడు. మీ తండ్రిగారు ఇప్పుడే మరణించారని సుమన్‌కు చెప్పాడు. అంతవరకు ఎలాంటి అరోగ్యకర ఇబ్బందుల్లేని వ్యక్తికి ఒకవేళ గుండెపోటు సంభవించినా కేవలం పదిహేనునిమిషాల్లో మృత్యువాత పడతాడా అన్న సందేహాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. శాస్త్రి వెంట అతని వ్యక్తిగత వైద్యుడు ఆర్‌ఎన్‌ చుగ్‌ కూడా తాష్కంట్‌ వెళ్ళాడు. అతనూ పక్కగదిలోనే ఉన్నాడు. కనీసం శాస్త్రికి గుండెపోటు వచ్చిందన్న విషయాన్ని ఆయన వ్యక్తిగత వైద్యుడికి కూడా సోవియట్‌ అధికారులు వెల్లడించలేదు. మరణించిన తర్వాతే ఆ విషయాన్ని చెప్పారు.

1977లో శాస్త్రి మరణంపై దర్యాప్తుకు ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు డాక్టర్‌ చుగ్‌ బయలుదేరారు. కారులో ఢిల్లీ వైపు ప్రయాణిస్తుండగా ఎదురుగా ఓ లారీ వచ్చి ఢీ కొట్టింది. చుగ్‌ అక్కడికక్కడే మరణించాడు. అలాగే శాస్త్రి వ్యక్తిగత సేవకుడు రామ్‌నాధ్‌ కూడా ఆయనతో పాటు తాష్కంట్ వెళ్ళాడు. మృతదేహం వెంటే ఆయనా తిరిగొచ్చాడు. అతనిని కూడా కమిటీ సాక్షిగా పరిగణించింది. వాంగ్మూలం నమోదుకు పిల్చింది. మోతీలాల్‌నెహ్రూ మార్గ్‌లోని తన నివాసం నుంచి ఆయన ఒక్కడుగు బయటకేయగానే ఎదురుగా ఓ వాహనం వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రామ్‌నాధ్‌ రెండుకాళ్ళూ నుజ్జునుజ్జు అయ్యాయి. తలకు బలమైన గాయాలయ్యాయి. ఆయన గతాన్ని మర్చిపోయాడు.

శాస్త్రి విష ప్రయోగం వలన మరణించాడని అతని భార్య లలితా శాస్త్రి ఆరోపించింది. 1978 లో క్రాంత్ ఎం.ఎల్.వెర్మా హిందీలో "లలితా కె ఆంసు"[27] పేరుతో పుస్తకాన్ని రాసి ప్రచురించాడు.[28] ఈ పుస్తకంలో శాస్త్రి మరణం గురించి విషాద కథ అతని భార్య లలిత శాస్త్రిచే వ్యాఖ్యానించబడింది. [29] అతని మరణం చుట్టూ ఇప్పటికీ తీవ్రమైన సందేహాలు ఉన్నాయి. అతని కుమారుడు సునీల్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణానికి వెనుక ఉన్న మర్మాన్ని తెలియజేయవలసినదిగా ప్రభుత్వాన్ని కోరాడు. [30] 1966 లో అతని మరణం తరువాత భారతదేశానికి తీసుకువచ్చిన భౌతిక కాయంపై నీలం రంగు మచ్చలు, కొన్ని గాట్లు ఉన్నట్లు అనుమానాలను వ్యక్తికరించాడు. పోస్టు మార్టం చేయబడనప్పటికీ శరీరంపై గాట్లు ఏర్పడానికి కారణాన్ని గూర్చి అడిగాడు.

తాష్కెంట్ ఒప్పందం గూర్చి శాస్త్రి రష్యా వెళ్ళిన తరువాత పాకిస్థాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ నుండి పాకిస్థాన్ భవిష్యత్తులో భారత్ పై బలగాలను ఎప్పుడూ ప్రయోగించరాదనే వాగ్దానాన్ని కోరాడు. కానీ చర్చలు కొనసాగలేదు. తరువాత రోజు శాస్త్రి మరణించాడు. [31] భారత ప్రభుత్వం అతని మరణం గురించి ఎటువంటి సమాచారం అందించలేదు. అప్పుడు మీడియా నిశ్శబ్దంగా ఉంది. భారతదేశంలో ఈ కుట్ర జరిగే సాధ్యాసాధ్యాలను "అవుట్ లుక్ మ్యాగజైన్" ప్రచురించింది.[26][26]

2009లో దక్షిణాసియాపై సిఐఎ దృష్టి పేరిట అనుజ్‌ధార్‌ అనే రచయిత పుస్తకం రాసేందుకు ఉపక్రమించాడు. ఇందుకోసం శాస్త్రి మరణానికి సంబంధించిన పత్రాలు కావాలంటూ సమాచారహక్కు చట్టం క్రింద భారత ప్రధాని కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. వీటి జారీకి పిఎమ్‌ఓ నిరాకరించింది. పైగా ఈ పత్రాల జారీ భారత సార్వభౌమత్వానికి, అంతర్గత భద్రతకు, ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని అతనికిచ్చిన రాతపూర్వకలేఖలో పిఎమ్‌ఓ అధికారులు పేర్కొ న్నారు[24]. పైగా వీటిని ఓ డాక్యుమెంట్‌గానే పరిగణిస్తున్నట్లు పిఎమ్‌ఓ వెల్లడించింది. భారత ప్రధాని అసహజ, అనుమానాస్పద మరణానికి సంబంధించిన అత్యంత విలువైన సమాచారాన్ని సాధారణ డాక్యుమెంట్‌గా పిఎమ్‌ఓ పరిగణించడం కూడా అనేక సందేహాలకు తావిస్తోంది.

శాస్త్రి మరణం నాటికే భారత్‌, సోవియట్‌ల మధ్య విస్తృతమైన మైత్రిబంధముంది. దీంతో మరణం వెనుక సోవియట్‌ హస్తాన్ని ఎవరూ సందేహించలేదు. అప్పటికే యుద్ధంలో పాక్‌ ఓటమిదశకు చేరుకుంది. నిబంధనలు అడ్డురావడంతో ప్రత్యక్షంగా సాయం చేయకపోయినా అమెరికా పరోక్షంగా పాక్‌కు అండగా నిల్చింది. ఈ కారణంగా సిఐఎ ప్రమేయాన్ని కూడా తక్కువగా అంచనావేయలేం. పైగా ఆ సమయంలో సిఐఎలో డైరెక్టర్‌ ఆఫ్‌ ప్లాన్స్‌గా ఉన్న రోబర్డ్‌ క్రోలీ అమెరికాకు చెందిన గ్రెగరీడగ్లస్‌ అనే జర్నలిస్ట్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ శాస్త్రితో పాటు భారత అణు పితామహుడు డాక్టర్‌ హోమీబాబా మరణాలకు సిఐఎ ప్రణాళికలు రచించి అమలు చేసిందని వెల్లడించారు. అయితే తన మరణానంతరమే ఈ ఇంటర్వ్యూను ప్రచురించాలని ఆయన డగ్లస్‌ను కోరారు. శాస్త్రి, హోమీబాబా మరణాలు ఒకే నెలలో జరిగాయి. రెండింటికి మధ్య రెండు వారాల వ్యవధే ఉంది. పైగా ఈ రెండు దేశానికి వెలుపలే చోటు చేసుకున్నాయి. శాస్త్రి మరణంలో హృద్రోగాన్ని సాకుగా చూపితే బాబా మరణానికి పైలెట్‌ తప్పిదాన్ని కారణంగా ప్రచారం చేశారు. 60వ దశకంలో అమెరికాకు సహకరించని వివిధ దేశాల నేతల్ని హతమార్చడం సిఐఎ పనిగా పెట్టుకుంది. [32]

కుటుంబం, వారసులు

1928 మే 16 న శాస్త్రి మిర్జాపూర్ కు చెందిన లలితా దేవిని వివాహమడాడు. ఈ వివాహం పెద్దలచే సాంప్రదాయ పద్ధతిలో చేయబడినది. వారికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, వారి పేర్లు:

  1. కుసుమ శాస్రి, పెద్ద కుమార్తె
  2. హరికృష్ణ శాస్త్రి, పెద కూమరుడు. అతని భార్య విభా శాస్త్రి
  3. సుమన్ శాస్త్రి, రెండవ కుమార్తె, ఆమె విజయ్ నాథ్ సింగ్ ను వివాహమాడింది. వారి కుమారుడు సిద్దేంద్రనాథ్ సింగ్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధికార ప్రాతినిధి, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంలో వైద్యశాఖామంత్రి.
  4. అనిల్ శాస్త్రి. ఆమె మంజు శాస్త్రిని వివాహమాడాడు. అతను కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. అతని కుమారుడు ఆదర్శ్ శాస్త్రి ఏపిల్ కంపెనీ తో కార్పొరేట్ జీవితాన్ని ప్రారంభించి 2014 సార్వత్రిక ఎన్నికలలో ఆమ్‌ఆదమీ పార్టీ తరపున అలహాబాద్ నుండి పోటీ చేసి ఓడిపోయాడు. [33]
  5. సునీల్ శాస్త్రి. అతను మీరా శాస్త్రిని వివాహమాడాడు. అతను భారతీయ జనతాపార్టీలో సభ్యుడు.
  6. అశోక్ శాస్త్రి. చిన్న కుమారుడు. అతను కార్పొరేట్ ప్రపంచంలో పనిచేస్తూ 37 సంవత్సరాల వయస్సులో మరణించాడు.[34] అతని భార్య నీరా శాస్త్రి, కుమారుడు సమీప్ శాస్త్రి లు భారతీయ జనతా పార్టీలో సభ్యులు.

వారసత్వ సంపద

1960 నుండి 1964 మధ్య కాలంలో కులదీప్ నయ్యర్, శాస్త్రికి సలహాదారునిగా ఉండేవాడు. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో అతని కుమార్తెకు జబ్బు చేసింది. అతను జైలు నుండి పెరోల్ పై విడుదలయ్యాడు. అయినప్పటికీ వైద్యులు ఖరీదైన మందులు సూచించిన కారణంగా ఆమెను రక్షించుకోలేక పోయారని నయ్యర్ తన జ్ఞాపకాలను తెలిపాడు. 1963 తరువాత, కేబినెట్ నుండి బయటికి వచ్చిన తరువాత అతను తన గృహంలో చీకటిలో కూర్చున్నాడు. దానికి కారణం అడిగితే అతను ఇకపై మంత్రిని కాదు కనుక అన్ని ఖర్చులు స్వయంగా చెల్లించవలసి ఉంటుందని తెలిపాడు. ఒక పార్లమెంటు సభ్యుడు, మంత్రిగా అతను అవసరమైన సమయం కోసం ఆదాచేయడానికి తగినంత సంపాదించలేదు అని తెలిపాడు. [35]

అతను 1950లలో అనేక సంవత్సరాలపాటు కేబినెట్ మంత్రిగా ఉన్నప్పటికీ మరణించే నాటికి పేదరికంలో ఉన్నాడు. చివరికి అతనికి ఒక పాత కారును, ప్రభుత్వం నుండి వాయిదాల పద్ధతితో కొనుగోలు చేసాడు. దానికి వాయిదాలు చెల్లిస్తూ ఉండేవాడు. అతను సెర్వంట్స్ ఆఫ్ ఇండియా సొసైటిలో సభ్యుడు. సభ్యునిగా ప్రైవేట్ ఆస్తులను వృద్ధిచేయడాన్ని విసర్జించి ప్రజా సేవకులుగా ఉండాలని సభ్యులను కోరాడు.

అతి పెద్ద రైల్వే ప్రమాదం జరిగినప్పుడు నైతిక భాద్యత వహిస్తూ రైల్వే మంత్రిగా రాజీనామా చేసిన మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు.

1964 నవంబరు 19 న అతని ప్రధానమంత్రి కాలంలో లక్నో లో బాల విద్యామందిర్ కు శంకుస్థాపన చేసాడు.

నవంబరు 1964లో చెన్నైలోని తారామణి వద్ద సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ప్రారంభించాడు.

అతను 1965లో ప్లూటోనియం రీ ప్రాసెసింగ్ ప్లాంటును ప్రారంభించాడు. హోమీ జహంగీర్ భాభా సలహాపై అణు పేలుడు పదార్థాల అభివృద్ది చేయాలని నిర్ణయించాడు. భాభా అణు పేలుడు పదార్థాల రూపకల్పన బృందాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కృషి ప్రారంభించాడు.

అతను 1965 మార్చి 20న హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాడు. దానికి ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంగా 1966లో నామకరణం చేసాడు. తెలంగాణ రాష్ట్ర విభజన తరువాత ఇది రెండు విశ్వవిద్యాలయాలుగా విడిపోయింది. తెలంగాణ లోని విశ్వవిద్యాలయానికి జూలై 2014న ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అని నామకరణం చేసారు.

శాస్త్రి అలహాబాదులో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ప్రారంభించాడు.

స్మారకాలు

లాల్ బహాదుర్ శాస్త్రి నేషనల్ అకాడమి ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ముస్సోరీ

శాస్త్రి నిజాయితీ పరుడు, మానవతావాదిగా పేరొందాడు. మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని పొందిన వ్యక్తులలో మొదటివాడు. న్యూఢిల్లో లో "విజయ్ ఘాట్" పేరుతో అతనికి స్మారక స్థలముంది.

అతని పేరుతో లాల్ బహాదుర్ శాస్త్రి అకాడమి ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ విద్యాసంస్థను ముస్సోరీ, ఉత్తరఖండ్ లో నెలకొల్పారు.

1995 లో "లాల్ బహదూర్ శాస్త్రి ఎడ్యుకేషన్ ట్రస్టు" ద్వారా "లాల్ బహాదూర్ శాస్త్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంటు" స్థాపించబడినది. ఇది భారత దేశంలో అతి పెద్ద బిజినెస్ స్కూలు. ఢిల్లీలో లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ ను లాల్ బహాదూర్ శాస్త్రి నేషనల్ మెమొరియల్ ట్రస్టు ప్రారంభించింది. [36]

2011లో శాస్త్రి 45వ వర్థంతి సందర్భంగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రామ్‌నగర్ లో శాస్త్రి నివసించిన పూర్వీకుల భవనాన్ని పునరుద్ధరించి అతని జీవిత చరిత్ర మ్యూజియంగా మలచాలని ప్రకటించింది.[37][38]

వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయానికి అతని పేరును పెట్టారు.[39]

ఉజ్బెకిస్థాన్, తాష్కెంట్ నగరంలో ఒక వీధికి అతని పేరును పెట్టారు.

కొన్ని స్టేడియాలకు అతని పేరు పెట్టారు. ఉదా: హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియం. అదే విధంగా అహ్మదాబాద్, కొల్లం, కేరళ, భవానీపాట్నా లలో ఈ పేరుతో స్టేడియం లు ఉన్నాయి.

కృష్ణా నదిపై ఉత్తర కర్నాటకలోనిర్మిచిన ఆల్మట్టి డ్యాం కు "లాల్ బహాదూర్ శాస్త్రి సాగర్" గా నామకరణం చేసారు.

కార్గో షిప్ కు "ఎం.వి.లాల్ బహాదూర్ శాస్త్రి" గా నామకరణం చేసారు.

భారతీయ రిజర్వు బ్యాంగు ఐదు రూపాయల నాణేన్ని అతని చిత్రంతో విడుదల చేసింది.

1991 నుండి ప్రతీ సంవత్సరం ఆల్ ఇండియా లాల్ బహాదూర్ శాస్త్రి హాకీ టోర్నమెంటు జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ లోని నాగార్జున సాగర్ ఎడమ కాలువకు "లాల్ బహాదూర్ శాస్త్రి కాలువ" గా పేరుపెట్టారు. దీని పొడవు 295 కి.మీ.

అతని పూర్తి విగ్రహాలు ముంబై, బెంగళూరు(విధాన సౌధ), న్యూఢిల్లీ(సి.జి.ఒ సముదాయం), ఆల్మట్టి ఆనకట్ట స్థలంలో, రామనగర్ (యు.పి), హిసార్, విజగపట్టిణం, నాగార్జున సాగర్ ఆనకట్ట స్థలం, వరంగల్ లలో ఉన్నాయి.

అతని సగం భాగం గల బస్ట్ విగ్రహాలు తిరువనంతపురం, పూణె, వారణాసి (విమానాశ్రయం), అహ్మదాబాద్ (సరస్సు ప్రక్కన), కురుక్షేత్ర, షిమ్లా, కాసర్గాడ్, జలంధర్, లలో ఉన్నాయి.

న్యూఢిల్లీ, ముంబై, పూణె, పాండిచేరి, లక్నో, వరంగల్, అలహాబాద్ లలో ముఖ్యమైన రోడ్లకు పేరు పెట్టారు.

లాల్ బహదూర్ శాస్త్రి మెడికల్ కళాశాల, మండి, హిమాచల ప్రదేశ్ లో వుంది.

శాస్త్రి భవనాలు న్యూఢిల్లీ, చెన్నై, లక్నోలలో వున్నాయి.

2005లో భారత ప్రభుత్వం ఆయన పేరుతో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రజాస్వామ్య, పరిపాలన అధ్యయన విభాగంలో అధ్యక్ష స్థానం కల్పించింది. [40]

ఇతర విషయాలు

  • దేశ ప్రధాని కాకముందు లాల్‌ బహాదుర్‌ శాస్త్రి గారు ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్ మునిసిపల్ ఎన్నికలలో గెలిచాడు. దానితో సహజంగా ‘‘అలహాబాద్ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్టు’’కు కూడా ట్రస్టీ అయ్యాడు. అపుడు అక్కడ ‘టాగూర్‌నగర్’ అనే పేరుతో 1/2 ఎకరా భూమిని ప్లాట్లుగా విభజించి వేలానికి పెట్టారు. శాస్త్రి వూళ్ళో లేని సమయంలో, ఆయన అంతరంగిక మిత్రుడొకాయన కమీషనర్‌ను కలిసి ‘శాస్త్రి’ గారికి సొంత ఇల్లులేదు. కాబట్టి ట్రస్టు సభ్యులందరూ ఒక్కో ప్లాటు దక్కించుకొనేలాగా ఒప్పించి, తనకు, శాస్త్రికి ఒక్కో ప్లాటు సంపాదించగలిగాడు. ఆ విషయాన్ని శాస్త్రి గారి భార్య లలితాశాస్త్రి తో చెపితే ‘‘పోనీలెండి, అన్నయ్యగారూ, మీ ప్రయత్నం కారణంగా ఇన్నేళ్ళకు "స్వంత ఇల్లు" అనే మా కల నెరవేరబోతుంది అని సంతోషించారట. రెండురోజుల తరువాత అలహాబాద్ తిరిగొచ్చిన శాస్త్రి గారికి ఈ విషయం తెలిసింది. ఆయన చాలా బాధపడ్డాడు. తన ఆంతరంగిక మిత్రుడిని పిలిచి ‘‘నాకు ఈ విషయం తెలిసినప్పటినుండి రాత్రిళ్ళు నిద్రపట్టడం లేదు. మనం ప్రజాప్రతినిధులం. ప్రజలముందు నిజాయితీగా నిలవాల్సిన వాళ్ళం. నేను నా ప్లాటును వాపసు ఇచ్చేస్తున్నాను. మీరుకూడా వాపసు ఇచ్చేయండి. లేదా రాజీనామాచేసి, సాధారణ పౌరుడిగా వేలంపాటలో పాల్గొని, కావాల్సి వుంటే ప్లాటును దక్కించుకోండి,’’ అని చెప్పి ప్లాటును ట్రస్టుకే వాపసు ఇచ్చేసారట. జీవితాంతం స్వంత ఇల్లులేకుండానే జీవించారు.
  • లాల్‌ బహదూర్‌శాస్త్రి దేశ ప్రధానమంత్రి అయిన తరువాత కూడా ఆయన కొడుకులు సిటీ బస్సుల్లోనే ప్రయాణించేవారు. కొందరు స్నేహితులు ఈ విషయంగా కొంచెం గేలిచేయడంతో, కారు కొనమని వాళ్ళు తండ్రి (శాస్త్రిగారు) మీద ఒత్తిడిచేస్తే ఇష్టంలేకపోయినా, ఆయన అక్కడక్కడ అప్పులుచేసి ఒక ఫియట్‌కారు కొన్నాడు. కారు కొనేందుకు చేసిన అప్పు ఇంకా 4600 రూపాయలుండగా శాస్త్రి మరణించాడు. ఈ విషయం దినపత్రికల్లో వచ్చిందట. దేశవ్యాప్తంగా శాస్త్రి అభిమానులు, ఆయన భార్య లలితాశాస్త్రి కి మనీఆర్డర్ చేశారట. రెండు సంవత్సరాలపాటు ఆమె మనిఆర్డర్‌లు అందుకొన్నారట. కానీ ఆమె, డబ్బు పంపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలతో ఉత్తరం వ్రాస్తూ, డబ్బును కూడా వాపసు పంపించేసారట.
  • లాల్‌బహదూర్‌శాస్త్రి ప్రధానిగా ఉన్న సమయంలో వారి పెద్దకొడుకు హరికృష్ణ శాస్త్రి అశోక్ లేలాండ్ సంస్థలో ఉద్యోగం చేస్తుండేవాడు. ఆ సంస్థవారు హరికృష్ణశాస్త్రికి సీనియర్ జనరల్ మేనేజర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. సంతోషించిన హరికృష్ణశాస్త్రి మరుసటిరోజు, లాల్‌ బహదూర్‌ శాస్త్రి గారికి ఈ విషయం తెలిపాడు. ఒక నిమిషం ఆలోచించి, ‘‘హరీ, ఆ సంస్థ, ఆకస్మాత్తుగా నీకెందుకు ప్రమోషన్ ఇచ్చిందో నేనూహించగలను. కొన్నిరోజుల తరువాత, ఆ కంపెనీవాళ్ళు ఏదో ఒక సహాయంచేయండని నాదగ్గరకు వస్తారు. నేను వారికాసహాయం చేస్తే దేశ ప్రజలు దాన్నెలా అర్ధంచేసుకుంటారో నాకు తెలుసు, నీకూ తెలుసు. పాలకుల నిజాయితీని ప్రజలు శంకించేలాగా జీవించడానికి నేను వ్యతిరేకం. కాబట్టి నీవు వెంటనే ఆ సంస్థలో నీ ఉద్యోగానికి రాజీనామా చేయి. నేను ప్రధానిగా వున్నంతకాలమూ నీవు ఆ సంస్థలో ఉద్యోగం చేయడానికి లేదు’’ అన్నారట.

మూలాలు

  1. 1.0 1.1 1.2 Srivastava, C.P. (1995). Lal Bahadur Shastri, president of india ; a life of truth in politics (Book) (1st ed.). Delhi: Oxford University Press. pp. 12–17. ISBN 0-19-563499-3.
  2. "Prime Minister's address at the inauguration of centenary year celebrations of late Shri Lal Bahadur Shastri". Prime Minister's Office, Government Of India. 2 October 2005. Archived from the original on 5 October 2006. Retrieved 13 March 2007.
  3. "Lal Bahadur Shastri was a Fatherless Child". Retrieved 13 March 2007.
  4. "Shri Lal Bahadur Shastri Je- A Profile". Government Of India. Archived from the original on 26 January 2007. Retrieved 13 March 2007.
  5. "Lal Bahadur Shastri:The Responsibility of Freedom". Retrieved 13 March 2007.
  6. Srivastava, C.P. (1995). Lal Bahadur Shastri, Prime Minister of India; a life of truth in politics (Book) (1st ed.). Delhi: Oxford University Press. pp. 20–22. ISBN 0-19-563499-3.
  7. Hindustan Times, New Delhi Friday, 11 January 2013 page no 5
  8. "Lal Bahadur Shastri: Tilak and Gandhi". Retrieved 13 March 2007.
  9. "Lal Bahadur Shastri (1904–1966)". Research Reference and Training Division, Ministry Of Information And Broadcasting, Government Of India. Retrieved 13 March 2007.
  10. "Lal Bahadur Shastri: The Servants of the People Society". Retrieved 13 March 2007.
  11. Grover, Verinder (1993). Political Thinkers of Modern India: Lala Lajpat Rai. Deep & Deep Publications. pp. 547–. ISBN 978-81-7100-426-3.
  12. "Lal Bahadur Shastri: Freedom's Soldier". Retrieved 13 March 2007.
  13. "Prime Minister's address at the inauguration of centenary year celebrations of late Shri Lal Bahadur Shastri". Prime Minister's Office, Government Of India. 2 October 2005. Archived from the original on 5 October 2006. Retrieved 13 March 2007.
  14. 14.0 14.1 "Lal Bahadur Shastri: In Prison Again". Retrieved 13 March 2007.
  15. Swami Rajesh Chopra. "− Lal Bahadur Shastri". Liveindia.com. Retrieved 5 December 2012.
  16. "Lal Bahadur Shastri:The Responsibility of Freedom". Retrieved 13 March 2007.
  17. "Lal Bahadur Shastri: The Might of Peace". Press Information Bureau, Government Of India. 29 September 2006. Retrieved 13 March 2007.
  18. 18.0 18.1 "Prime Minister Inaugurates Lal Bahadur Shastri Memorial: Text Of Dr Manmohan Singh's Speech". Press Information Bureau, Government Of India. 7 May 2005. Retrieved 13 March 2007.
  19. 19.0 19.1 Encyclopedia of the Third World, as quoted in "Srimavo-Shastri Pact between India and Sri Lanka". Immigration and Refugee Board of Canada. 1 September 1997. Retrieved 26 April 2012.
  20. The Far East and Australasia, 1996
  21. "1965 యుద్ధానికి పాకే కారణం".
  22. "Was Mr Shastri murdered". bbc.co.uk. Retrieved 31 May 2013.
  23. U.N. Gupta (2003). Indian Parliamentary Democracy. Atlantic Publishers & Distributors. p. 121. ISBN 8126901934.
  24. 24.0 24.1 Dhawan, H. "45 years on, Shastri's death a mystery – PMO refuses to Entertain RTI Plea Seeking Declassification of Document". The Times of India, New Delhi Edition, Saturday, 11 July 2009, page 11, columns 1–5 (top left)
  25. "Sunil Shastri asks govt to unravel mystery behind Lal Bahadur Shastri's death". Indiatvnews.com. Retrieved 5 December 2012.
  26. 26.0 26.1 26.2 "Tashkent Whodunit: An Enduring Tale | Saba Naqvi". Outlookindia.com. Retrieved 5 December 2012.
  27. * Book:Lalita Ke Ansoo on worldcat
  28. Hindustan (Hindi daily) New Delhi 12 January 1978 (ललिता के आँसू का विमोचन)
  29. Panchjanya (newspaper) A literary review 24 February 1980
  30. Saba Naqvi (16 July 2012). "Clear air on Lal Bahadur Shastri's death: Son". Hindustan Times. Archived from the original on 13 May 2013. Retrieved 11 June 2013.
  31. krzna (2 October 2011). "The Curious case of Lal Bahadur Shastri's Murder | My First Blush". Krzna.wordpress.com. Archived from the original on 31 August 2012. Retrieved 5 December 2012.
  32. "Conversation with Crowley".
  33. "Grandson banks on Lal Bahadur Shastri's legacy to conquer Allahabad". The Hindu. 6 May 2014. Retrieved 13 May 2014.
  34. "The Shastri saga". Hinduonnet.com. 2 October 2004.
  35. "The politician who made no money". Rediff.com. 6 October 2004. Archived from the original on 4 October 2010. Retrieved 2 October 2012.
  36. Rajeshwar Prasad (1991). Days with Lal Bahadur Shastri: Glimpses from The Last Seven Years. Allied Publishers. p. 16. ISBN 81-7023-331-3.
  37. "Lest we FORGET..." The Hindu. 2 October 2004.
  38. "Shastri memorial losing out to Sonia security". The Indian Express. 17 January 2011.
  39. http://pib.nic.in/newsite/erelease.aspx?relid=12805
  40. "PM's speech at conclusion of Lal Bahadur Shastri Centenary Celebrations". Prime Minister's Office (India), Government of India. 4 October 2005. Archived from the original on 5 October 2006. Retrieved 13 March 2007.

ఇతర పఠనాలు

  • Guha, Ramachandra (2008). India After Gandhi: The History of the World's Largest Democracy. Pan Macmillan. ISBN 978-0-330-39611-0.
  • Pavan Choudary and Anil Shastri. Lal Bahadur Shastri: Lessons in Leadership. Wisdom Village Publications, 2014 ISBN 9789380710365
  • John Noyce. Lal Bahadur Shastri: an English-language bibliography. Lulu.com, 2002.
  • Lal Bahadur Shastri, 'Reflections on Indian politics', Indian Journal of Political Science, vol.23, 1962, pp1–7
  • Shastri, Lal Bahadur (1966). The Fight For Peace The Long Road To Tashkent. Retrieved 2020-07-13.
  • L.P. Singh, Portrait of Lal Bahadur Shastri (Delhi: Ravi Dayal Publishers, 1996) ISBN 81-7530-006-X
  • (Sir) C.P. Srivastava, Lal Bahadur Shastri: a life of truth in politics (New Delhi: Oxford University Press, 1995) ISBN 0-19-563499-3
  • (Sir) C.P. Srivastava, Corruption: India's enemy within (New Delhi: Macmillan India, 2001) chapter 3 ISBN 0-333-93531-4
  • India Unbound From Independence to Global Information Age by Shri Gurucharan Das chapter 11
  • The spiritual master of Sri Lal Bahadur Shastri was Sri Sri Thakur Anukul Chandra Chakravarty.

బయటి లింకులు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
రాజకీయ కార్యాలయాలు
అంతకు ముందువారు
గోవింద్ వల్లభ్ పంత్
భారత దేశ హోం మంత్రి
1961–1963
తరువాత వారు
గుల్జారీలాల్ నందా
అంతకు ముందువారు
గుల్జారీలాల్ నందా
తత్కాలిక
విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి
1964
తరువాత వారు
సర్దార్ స్వరణ్ సింగ్
భారత దేశ ప్రధానమంత్రి
1964–1966
తరువాత వారు
గుల్జారీలాల్ నందా
Acting
ప్లానింగ్ కమీషన్ చైర్ పర్సన్
1966