భారతదేశ భౌగోళికం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతదేశం - భౌగోళికం
ఖండంఆసియా
ప్రాంతందక్షిణాసియా
(భారత ఉపఖండం)
నిర్దేశాంకాలు21°N 78°E / 21°N 78°E / 21; 78
విస్తీర్ణంర్యాంకు: 7 వ
 • మొత్తం3,287,263 కి.మీ2 (1,269,219 చ. మై.)
 • నేల91%
 • నీరు9%
తీరరేఖ7,516.6 కి.మీ. (4,670.6 మై.)
సరిహద్దులుTotal land borders:[1]
15,200 కి.మీ. (9,400 మై.)
బంగ్లాదేశ్:
4,096.70 కి.మీ. (2,545.57 మై.)
చైనా:
3,488 కి.మీ. (2,167 మై.)
పాకిస్తాన్:
3,323 కి.మీ. (2,065 మై.)
నేపాల్:
1,751 కి.మీ. (1,088 మై.)
మయన్మార్:
1,643 కి.మీ. (1,021 మై.)
భూటాన్:
699 కి.మీ. (434 మై.)
అత్యంత ఎత్తైన బిందువుకాంచనగంగ
8,586 మీ. (28,169 అ.)
అత్యంత లోతైన బిందువుకుట్టనాడ్
−2.2 మీ. (−7.2 అ.)
అత్యంత పొడవైన నదిగంగ
2,525 కి.మీ. (1,569 మై.)
అత్యంత పెద్ద సరస్సులోక్‌టక్ సరస్సు (మంచినీటి)
287 కి.మీ2 (111 చ. మై.) to 500 కి.మీ2 (190 చ. మై.)
చిలికా సరస్సు (ఉప్పునీటి సరస్సు)
1,100 కి.మీ2 (420 చ. మై.)

భారతదేశం భూమధ్యరేఖకు ఉత్తరాన 8°4' ఉత్తర, 37°6' ఉత్తర అక్షాంశాలకూ, 68°7', 97°25' తూర్పు రేఖాంశాలకూ మధ్య ఉంది.[2] మొత్తం 3,287,263 చదరపు కిలోమీటర్లు (1,269,219 చ. మై.) విస్తీర్ణంతో ఇది ప్రపంచంలోని ఏడవ అతిపెద్ద దేశం.[3][4] దేశం ఉత్తరం నుండి దక్షిణానికి 3,214 కి.మీ. (1,997 మై.), తూర్పు నుండి పడమరకు 2,933 కి.మీ. (1,822 మై.) ఉంటుంది. దీనికి 15,200 కి.మీ. (9,445 మై.) భూ సరిహద్దు, 7,516.6 కి.మీ. (4,671 మై.) తీరప్రాంతం ఉన్నాయి.[1]

దేశానికి దక్షిణాన సరిహద్దుగా, హిందూ మహాసముద్రం ఉంది -వివరంగా చూస్తే, పశ్చిమాన అరేబియా సముద్రం, నైరుతిలో లక్షద్వీప్ సముద్రం, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉన్నాయి. పాక్ జలసంధి, మన్నార్ జలసంధి భారతదేశాన్ని శ్రీలంక నుండి వేరు చేస్తాయి. లక్షద్వీప్ దీవులకు దక్షిణాన ఎనిమిది డిగ్రీ ఛానల్‌కు ఆవల దాదాపు 125 కిలోమీటర్లు (78 మై.) దూరంలో మాల్దీవులు ఉన్నాయి. దేశ ప్రధాన భూభాగానికి ఆగ్నేయంగా దాదాపు 1,200 కిలోమీటర్లు (750 మై.) దూరంలో ఉన్న అండమాన్ నికోబార్ ద్వీపసమూహం, మయన్మార్, థాయిలాండ్, ఇండోనేషియాలతో సముద్ర సరిహద్దులను పంచుకుంటోంది. భారత ప్రధాన భూభాగపు దక్షిణ కొన (8°4′38″N, 77°31′56″E) కన్యాకుమారికి పక్కనే దక్షిణాన ఉంది, అయితే దేశం మొత్తానికి దక్షిణాది కొన బిందువు, గ్రేట్ నికోబార్ ద్వీపంలోని ఇందిరా పాయింట్. భారత పరిపాలనలో ఉత్తర కొనన ఉన్న ప్రదేశం, సియాచిన్ గ్లేసియర్ లోని ఇందిరా కల్. దేశపు ప్రాదేశిక జలాలు తీరరేఖ నుండి సముద్రంలోకి 12 nautical miles (13.8 మై.; 22.2 కి.మీ.) దూరం వరకు విస్తరించాయి.[5] దేశానికి 2,305,143 కి.మీ2 (890,021 చ. మై.) స్వంత ఆర్థిక మండలం ఉంది. ప్రపంచం లోని అతిపెద్ద స్వంత ఆర్థిక మండళ్ళలో దీనిది 18 వ స్థానం.

భారతదేశ ఉత్తర సరిహద్దులను హిమాలయ పర్వత శ్రేణులు నిర్వచిస్తాయి. ఇక్కడ చైనా, భూటాన్, నేపాల్లు సరిహద్దులుగా ఉన్నాయి. పాకిస్తాన్‌తో దేశ పశ్చిమ సరిహద్దు కారకోరం, పశ్చిమ హిమాలయ శ్రేణులు, పంజాబ్ మైదానాలు, థార్ ఎడారి, రాన్ ఆఫ్ కచ్ ఉప్పుకయ్యలలో ఉంది. సుదూర ఈశాన్యంలో, చిన్ హిల్స్, కాచిన్ హిల్స్, లోతైన అటవీ పర్వత ప్రాంతాలు, భారతదేశాన్ని బర్మా నుండి వేరు చేస్తాయి. తూర్పున, బంగ్లాదేశ్‌తో దాని సరిహద్దు ఎక్కువగా ఖాసీ కొండలు, మిజో కొండలు, ఇండో-గంగా మైదానంలోని పరీవాహక ప్రాంతంచే నిర్వచించబడింది.

గంగా నది భారతదేశంలో ఉద్భవించే అత్యంత పొడవైన నది. గంగా - బ్రహ్మపుత్ర వ్యవస్థ ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశంలో అత్యధిక భాగాన్ని ఆక్రమించగా, దక్కన్ పీఠభూమి దక్షిణ భారతదేశంలో చాలా భాగాన్ని ఆక్రమించింది. సిక్కిం రాష్ట్రంలో, సముద్ర మట్టం నుండి 8,586 మీ. (28,169 అ.) ఎత్తున ఉన్న కాంచన గంగ శిఖరం, భారతదేశంలోనే ఎత్తైన ప్రదేశం. ఇది ప్రపంచంలో మూడవ ఎత్తైన శిఖరం. దేశంలో శీతోష్ణస్థితి దక్షిణాన భూమధ్యరేఖీయ శీతోష్ణస్థితి నుండి, హిమాలయాల ఎగువ ప్రాంతాలలో ఆల్పైన్, టండ్రా శీతోష్ణస్థితుల వరకూ మారుతూంటుంది. భౌగోళికంగా, భారతదేశం ఇండో-ఆస్ట్రేలియన్ ప్లేట్‌కు ఉత్తర భాగంలో ఉన్న ఇండియన్ ప్లేట్‌లో ఉంది.

భూగర్భ అభివృద్ధి

[మార్చు]
ఇండియన్ ప్లేట్

భారతదేశం పూర్తిగా ఇండియన్ ప్లేట్‌పై ఉంది, ఇది పురాతన ఖండం గోండ్వానాలాండ్ (పురాతన భూభాగం, సూపర్ ఖండంలోని పాంజీయా లోని దక్షిణ భాగం) నుండి విడిపోయినప్పుడు ఏర్పడిన ఒక ప్రధాన టెక్టోనిక్ ప్లేట్. ఇండో-ఆస్ట్రేలియన్ ప్లేట్ ఇండియన్ ప్లేట్, ఆస్ట్రేలియన్ ప్లేట్‌లుగా ఉపవిభజన చేయబడింది. సుమారు 9 కోట్ల సంవత్సరాల క్రితం, క్రెటేషియస్ కాలం చివరిలో, భారత ఫలకం సంవత్సరానికి దాదాపు 15 సెంటీమీటర్ల వేగంతో ఉత్తరానికి కదలడం ప్రారంభించింది. సుమారు 5 నుండి 5.5 కోట్ల సంవత్సరాల క్రితం, సెనోజోయిక్ ఇపోక్ లోని ఈయోసిన్ ఎరాలో, ఈ ప్లేట్ 2,000 నుండి 3,000 కి.మీ. (1,243 నుండి 1,864 మై.) దూరం ప్రయాణించి ఆసియాతో ఢీకొంది. ఏ ఇతర ప్లేట్ చలించిన వేగం కంటే కూడా ఇది ఎక్కువ. 2007లో, జర్మన్ భూగర్భవిజ్ఞాన శాస్త్రవేత్తలు, ఇండియన్ ప్లేట్ మందం గతంలో గోండ్వానాలాండ్‌లో ఉన్న ఇతర పలకల మందంలో సగమే ఉండడాన ఇది అంత వేగంగా కదలగలిగిందని నిర్ధారించారు. భారత, నేపాల్‌ల మధ్య ప్రస్తుతం ఉన్న సరిహద్దు వద్ద ఇండియన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్‌తో ఢీకొనడం వల్ల టిబెటన్ పీఠభూమి, హిమాలయాలను సృష్టించే ఒరోజెనిక్ బెల్ట్ ఏర్పడింది. 2009 నాటికి, భారత ఫలకం సంవత్సరానికి 5 సెం.మీ. వేగంతో ఈశాన్య దిశగా కదులుతోంది. యురేషియన్ ప్లేట్ ఉత్తరంగా ఏడాదికి 2 సెం.మీ. మాత్రమే కదులుతోంది. కాబట్టి భారతదేశాన్ని "అత్యంత వేగవంతమైన ఖండం" అని పిలుస్తారు.[6] దీని వలన యురేషియన్ ప్లేట్ వైకల్యం చెందడం, ఇండియన్ ప్లేట్ ఏటా 4 సెం.మీ చొప్పున కుంచించుకు పోవడం జరుగుతోంది.

రాజకీయ భౌగోళికం

[మార్చు]

భారతదేశం 28 రాష్ట్రాలు (అవి మళ్ళీ జిల్లాలుగా) విభజించబడింది. జాతీయ రాజధాని ప్రాంతం (అంటే ఢిల్లీ) తో సహా 8 కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. భారతదేశ సరిహద్దుల మొత్తం పొడవు 15,200 కి.మీ. (9,400 మై.) .[1][7]

భారతదేశ విభజన సమయంలో 1947లో సృష్టించబడిన రాడ్‌క్లిఫ్ లైన్ ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో దేశ సరిహద్దులు వివరించబడ్డాయి. పాకిస్తాన్‌తో దాని పశ్చిమ సరిహద్దు 3,323 కి.మీ. (2,065 మై.) మేర, పంజాబ్ ప్రాంతాన్ని విభజించుకుంటూ, థార్ ఎడారి, రాన్ ఆఫ్ కచ్ ల గుండా నడుస్తుంది.[1] ఈ సరిహద్దు కేంద్రపాలిత ప్రాంతాలైన లడఖ్, జమ్మూ కాశ్మీర్, రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌ల గుండా నడుస్తుంది. కాశ్మీర్ ప్రాంతంలో నియంత్రణ రేఖను భారత, పాకిస్తాన్లు తమ మధ్య అనధికారిక సరిహద్దుగా పరిగణిస్తాయి. ఇప్పుడు పాకిస్తాన్ చైనాల ఆక్రమణలో ఉన్న ప్రాంతాలతో సహా పూర్వపు జమ్మూ కాశ్మీర్ సంస్థానం మొత్తం తన భూభాగమేనని భారతదేశం చెబుతోంది. ఇవి, ఆ రెండు దేశాలు చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న ప్రాంతాలని భారతదేశం వాదిస్తోంది.[1]

బంగ్లాదేశ్‌తో భారతదేశ సరిహద్దు 4,096.70 కి.మీ. (2,545.57 మై.) పొడవు ఉంది.[1] పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలు బంగ్లాదేశ్‌తో సరిహద్దును పంచుకుంటాయి. 2015 కి ముందు, భారత గడ్డపై బంగ్లాదేశ్‌కు 92 ఎన్‌క్లేవ్‌లు ఉన్నాయి. బంగ్లాదేశ్ గడ్డపై భారతదేశానికి 106 ఎన్‌క్లేవ్‌లు ఉన్నాయి. సరిహద్దును సులభతరం చేయడానికి ఇరుదేశాలు ఈ ఎన్‌క్లేవ్‌లను పరస్పరం మార్చుకున్నాయి.[8] మార్పిడి తర్వాత, భారత్ దాదాపు 40 కిమీ 2 (10,000 ఎకరాలు) బంగ్లాదేశ్‌కు కోల్పోయింది.[9]

వాస్తవాధీన రేఖ (LAC) అనేది భారత, చైనాల మధ్య ప్రస్తుతం పరిగణనలో ఉన్న సరిహద్దు. ఇది లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లలో 4,057 కి.మీ. పొడవున ఉంది.[10] బర్మా (మయన్మార్)తో సరిహద్దు, ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం ల తూర్పు సరిహద్దుల వెంట 1,643 కి.మీ. (1,021 మై.) ఉంది. హిమాలయ శ్రేణుల మధ్య ఉన్న భూటాన్‌తో భారతదేశ సరిహద్దు 699 కి.మీ. (434 మై.) ఉంది.[1] సిక్కిం, పశ్చిమ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు భూటాన్‌తో సరిహద్దును పంచుకుంటాయి. నేపాల్‌తో సరిహద్దు, హిమాలయాల పాదాల వెంబడి 1,751 కి.మీ. (1,088 మై.) ఉంది.[1] ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కింలు నేపాల్‌తో సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు. భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల మధ్య ఉండే సన్నని సిలిగురి కారిడార్, ద్వీపకల్ప భారతదేశాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలుపుతుంది.

ఫిజియోగ్రాఫిక్ ప్రాంతాలు

[మార్చు]
వివిధ భౌతిక విభాగాలతో భారతదేశ భౌతిక భౌగోళిక పటం

క్రేటన్లు

[మార్చు]
భారతదేశ స్థలాకృతి
మలానీ ఇగ్నియస్ సూట్, భారతదేశంలో అతిపెద్దది, ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఇగ్నియస్ సూట్. జోధ్‌పూర్‌లో మెహ్రాన్‌ఘర్ కోట సమీపంలో ఉంది.

క్రేటన్ అనేది ఒక నిర్దిష్ట రకమైన ఖండాంతర క్రస్ట్. ప్లాట్‌ఫారమ్ అని పిలువబడే పై పొర తోను, బేస్‌మెంట్ అని పిలువబడే పాత పొరతోనూ ఇది రూపొంది ఉంటుంది. కవచం అనేది క్రేటన్ లోని భాగం. ఇక్కడ భూమి లోపల ఉన్న శిలలు నేల నుండి బయటకు చొచ్చుకుని వస్తాయి (ఔట్‌క్రాప్ అంటారు). ఇది ప్లేట్ టెక్టోనిక్స్ ద్వారా ప్రభావితం కాని, పాత, స్థిరమైన విభాగం.[11][12]

భారతీయ క్రేటన్‌ను ఐదు ప్రధాన క్రేటన్‌లుగా విభజించవచ్చు:

  • ఆరావళి క్రేటన్ (మార్వార్-మేవార్ క్రేటన్ లేదా వెస్ట్రన్ ఇండియన్ క్రేటన్): ఇది రాజస్థాన్ అలాగే పశ్చిమ, దక్షిణ హర్యానాను కవర్ చేస్తుంది. దీనికి తూర్పున మేవార్ క్రేటన్, పశ్చిమాన మార్వార్ క్రేటన్‌లు ఉన్నాయి. దీనికి తూర్పున గ్రేట్ బౌండరీ ఫాల్ట్, పశ్చిమాన థార్ ఎడారి, ఉత్తరాన ఇండో-గంగా ఒండ్రు, దక్షిణాన సోన్ - నర్మద - తపతి ఉన్నాయి. ఇందులో ప్రధానంగా క్వార్ట్‌జైట్, మార్బుల్, పెలైట్, గ్రేవాక్, ఆరావళి-ఢిల్లీ ఓరోజెన్‌లో అంతరించిపోయిన అగ్నిపర్వతాలు ఉన్నాయి. మలానీ ఇగ్నియస్ సూట్ భారతదేశంలో అతిపెద్దది, ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఇగ్నియస్ సూట్.
  • బుందేల్‌కండ్ క్రేటన్, 26,00 కిమీ 2 విస్తీరణంలో ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఉంది. ఇది మాల్వా పీఠభూమికి ఆధారం. పశ్చిమాన ఆరావళి, దక్షిణాన నర్మదా నది, సాత్పురా శ్రేణులు, ఉత్తరాన ఇండో-గాంటెటిక్ ఒండ్రు దీనికి సరిహద్దులుగా ఉన్నాయి. ఇది ఆరావళి క్రేటన్‌ను పోలి ఉంటుంది, ఇది రెండు క్రేటన్‌ల అంచులలో హిందోలి, మహాకోశల్ బెల్ట్‌ల పరిణామంతో రెండుగా విభజించబడటానికి ముందు ఒకే క్రేటన్‌గా ఉండేది.
  • ధార్వార్ క్రేటన్ (కర్ణాటక క్రేటన్), 3.4 - 2.6 Ga, గ్రానైట్ - గ్రీన్‌స్టోన్ భూభాగం కర్ణాటక రాష్ట్రాన్ని, తూర్పు దక్షిణ మహారాష్ట్ర లోని కొన్ని భాగాలను కవర్ చేస్తుంది. దక్కన్ పీఠభూమికి దక్షిణ చివర ఆధారాన్ని ఏర్పరుస్తుంది. 1886లో దీన్ని తూర్పు ధార్వార్ క్రేటన్ (EDC), వెస్ట్రన్ ధార్వార్ క్రేటన్ (WDC) అనే ఇది రెండు టెక్టోనిక్ బ్లాక్‌లుగా విభజించారు.
  • సింగ్‌భూమ్ క్రేటన్, 4,000 km 2 విస్తీర్ణంతో ప్రధానంగా జార్ఖండ్‌తో పాటు ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఉత్తర తెలంగాణ, తూర్పు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను కవర్ చేస్తుంది. ఇది ఉత్తరాన ఛోటా నాగ్‌పూర్ పీఠభూమి, ఆగ్నేయంలో తూర్పు కనుమలు, నైరుతిలో బస్తర్ క్రేటన్, తూర్పున ఒండ్రు మైదానం సరిహద్దులుగా ఉన్నాయి.
  • బస్తర్ క్రేటన్ (బస్తర్-భండారా క్రేటన్), ప్రధానంగా ఛత్తీస్‌గఢ్‌ను కవర్ చేస్తుంది. ఇది ఛోటా నాగ్‌పూర్ పీఠభూమికి ఆధారం. ఇది 3.4-3.0 Ga నాటి ఐదు రకాల TTG గ్నీస్‌ల అవశేషం. ఇది కోత్రి-డోంగాగర్ ఒరోజెన్, మిగిలిన బస్తర్ క్రేటన్‌గా ఉపవిభజన చేయబడింది. నైరుతిలో గోదావరి చీలిక, వాయవ్యంలో నర్మదా చీలిక ఈశాన్యంలో మహానది చీలిక లతో ఇది ఏర్పడింది.

ప్రాంతాలు

[మార్చు]

భారతదేశాన్ని ఆరు ఫిజియోగ్రాఫిక్ ప్రాంతాలుగా విభజించవచ్చు. అవి:

హిమాలయాలు

[మార్చు]

హిమాలయాలు, హిందూ కుష్, పాట్‌కాయ్ శ్రేణులతో కూడిన పర్వతాల చాపం, భారత ఉపఖండపు ఉత్తర సరిహద్దులను నిర్వచిస్తుంది.[13] భారతీయ, యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొనడం వల్ల ఇవి ఏర్పడ్డాయి. ఈ శ్రేణులలోని పర్వతాలలో కొన్ని ప్రపంచంలో కెల్లా ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. ఇవి చల్లని ధ్రువీయ గాలులకు అవరోధంగా పనిచేస్తాయి. భారతదేశంలోని వాతావరణాన్ని ప్రభావితం చేసే ఋతుపవనాల పురోగతికి కూడా ఇవి వీలు కలిగిస్తాయి. ఈ పర్వతాలలో పుట్టిన నదులు సారవంతమైన ఇండో-గంగా మైదానాల గుండా ప్రవహిస్తాయి. ఈ పర్వతాలు రెండు జీవ భౌగోళిక రాజ్యాల మధ్య సరిహద్దును ఏర్పరుస్తాయి. అవి: యురేషియాలో ఎక్కువ భాగాన్ని కవర్ చేసే సమశీతోష్ణ పాలీఆర్కిటిక్ రాజ్యం, దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియా, ఇండోనేషియాలను కలిపి ఉండే ఉష్ణమండల-ఉపఉష్ణమండల ఇండోమలయన్ రాజ్యం. 

A shining white snow-clad range, framed against a turquoise sky. In the middle ground, a ridge descends from the right to form a saddle in the centre of the photograph, partly in shadow. In the near foreground, a loop of a road is seen.
గఢ్వాల్ హిమాలయాలలో కేదార్‌నాథ్ శ్రేణి

హిమాలయాలు భారతదేశంలో ఉత్తరాన లడఖ్ నుండి తూర్పున అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వరకు విస్తరించి ఉన్నాయి. భారతదేశంలో ఉన్న హిమాలయాల్లోని శిఖరాలు 7,000 మీ. (23,000 అ.) కంటే ఎక్కువ ఎత్తునవి చాలా ఉన్నాయి. సిక్కిం - నేపాల్ సరిహద్దులోని కాంచన్‌జంగాతో ( 8,598 మీ. (28,209 అ.), ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిమాలయాల్లో ఉన్న నందా దేవి ( 7,816 మీ. (25,643 అ.) వీటిలో భాగమే. మంచు కురిసే రేఖ, సిక్కింలో సుమారు 6,000 మీ. (20,000 అ.) ఎత్తు, లడఖ్ లో 3,000 మీ. (9,800 అ.) ఎత్తుల మధ్య ఉంటుంది. మధ్య ఆసియా నుండి వీచే అతిశీతల కటాబాటిక్ గాలులకు హిమాలయాలు అడ్డంకిగా నిలుస్తాయి. అందువలన, ఉత్తర భారతదేశం శీతాకాలంలో వెచ్చగానో లేదా కొద్దిగానే చల్లగానో ఉంటుంది; ఇదే కారణం వలన వేసవిలో, భారతదేశం సాపేక్షంగా వేడిగా ఉంటుంది. 

కాంచనగంగ, అత్యంత ఎత్తైన శిఖరాల్లో ప్రపంచంలో మూడవది - సిక్కిం లోని జేము గ్లేసియరు వద్ద
  • కారకోరం శ్రేణి లడఖ్ గుండా వెళుతుంది. సుమారు 500 కి.మీ. (310 మై.) పొడవు ఉండే ఈ శ్రేణి, ధ్రువ ప్రాంతాల వెలుపల, ప్రపంచంలోనే అత్యంత భారీ హిమానీనదాలుండే ప్రాంతం. 76 కి.మీ. (47 మై.) వద్ద సియాచిన్ గ్లేసియర్ ధ్రువ ప్రాంతాల వెలుపల ప్రపంచంలోని రెండవ అతి పొడవైన హిమానీనదం.[14] కారకోరం దక్షిణ సరిహద్దు సింధు, ష్యోక్ నదులచే ఏర్పడింది. ఈ నదులు హిమాలయాల వాయవ్య కొనను, కారకోరం శ్రేణినీ వేరు చేస్తాయి.
  • పాట్‌కాయ్ లేదా పూర్వాంచల్ శ్రేణి, బర్మాతో భారతదేశ తూర్పు సరిహద్దుకు సమీపంలో ఉంది. హిమాలయాల ఏర్పాటుకు దారితీసిన టెక్టోనిక్ ప్రక్రియల లోనే అవి కూడా ఏర్పడ్డాయి. శంఖాకార శిఖరాలు, నిటారుగా ఉండే లోతైన లోయలూ పాట్‌కాయ్ పర్వతాల భౌతిక లక్షణాలు. పాట్‌కాయ్ శ్రేణులు హిమాలయాలంతటి కఠినంగా, పొడవుగా ఉండవు. పాట్‌కాయ్ కింద మూడు కొండ శ్రేణులు ఉన్నాయి. అవి: పాట్‌కాయ్-బుమ్‌, గారో - ఖాసి - జైంతియా, లుషాయ్ కొండలు. గారో-ఖాసి శ్రేణి మేఘాలయలో ఉంది. ఈ కొండలలో చిరపుంజి సమీపంలోని మాసిన్‌రామ్ అనే గ్రామం, ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశంగా గుర్తింపు పొందింది.[15]
మధ్య భారతదేశంలోని వింధ్య పర్వతాలు

ద్వీపకల్ప పీఠభూమి

[మార్చు]

ఇండియన్ క్రేటన్ ప్రధాన లక్షణాలు:

  • పర్వత శ్రేణులు (ఎగువ-ఎడమ నుండి సవ్యదిశలో)
    • ఆరావళి శ్రేణి భారతదేశంలోని అత్యంత పురాతన పర్వత శ్రేణి. ఇది ఈశాన్యం నుండి నైరుతి దిశ వరకు రాజస్థాన్ మీదుగా సుమారు 800 కి.మీ. (500 మై.) విస్తరించి ఉంది. ఈ శ్రేణి ఉత్తరాన హర్యానాలో వివిక్తంగా ఉండే కొండలు, రాతి గుట్టలుగా కొనసాగి, ఢిల్లీ సమీపంలో ముగుస్తుంది. ఈ శ్రేణిలో ఎత్తైన శిఖరం మౌంట్ అబూ వద్ద ఉన్న గురు శిఖర్. ఇది గుజరాత్ సరిహద్దు సమీపంలో 1,722 మీ. (5,650 అ.) ఎత్తున ఉంటుంది. . ఆరావళి పర్వత శ్రేణులు పురాతన ముడత పర్వతాల వ్యవస్థలో కోతకు గురి కాగా మిగిలిన కొండల శ్రేణి. ఆరావళి-ఢిల్లీ ఒరోజెన్ అని పిలవబడే ప్రీకాంబ్రియన్ ఘటనలో ఈ శ్రేణి ఏర్పడింది. భారతీయ క్రేటన్‌ను రూపొందించే రెండు పురాతన విభాగాలైన మార్వార్ విభాగాన్ని వాయవ్యం లోను, బుందేల్‌ఖండ్ సెగ్మెంట్‌ను ఆగ్నేయం లోనూ ఈ శ్రేణి కలుస్తుంది.
    • వింధ్య శ్రేణి, సాత్పురా శ్రేణికి ఉత్తరాన, ఆరావళి శ్రేణికి తూర్పున ఉంది. ఇది చాలా వరకు మధ్య భారతదేశంలో 1,050 కి.మీ. (650 మై.) విస్తరించి ఉంది .[16] ఈ కొండల సగటు ఎత్తు 300 నుండి 600 మీ. (980 నుండి 1,970 అ.). అరుదుగా 700 మీటర్లు (2,300 అ.) పైన ఉంటుంది.[16] పురాతన ఆరావళి పర్వతాలపై వాతావరణ కోత వల్ల ఏర్పడిన వ్యర్థాల నుండి ఇవి ఏర్పడ్డాయని భావిస్తున్నారు. భౌగోళికంగా, ఇది ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశం నుండి వేరు చేస్తుంది. ఈ శ్రేణికి పశ్చిమ కొస, తూర్పు గుజరాత్‌లో మధ్యప్రదేశ్‌తో సరిహద్దుకు సమీపంలో ఉంది. అక్కడి నుండి తూర్పు ఉత్తర దిశల్లో సాగి, దాదాపుగా మీర్జాపూర్ వద్ద గంగానదిని కలుస్తుంది.
      భారతదేశంలోని పీఠభూమి ప్రాంతాల్లోని పొడి, ఆకురాల్చే ముళ్ల అడవులు
    • సాత్పురా శ్రేణి, వింధ్య శ్రేణికి దక్షిణాన, ఆరావళి శ్రేణికి తూర్పున ఉంది. ఇది తూర్పు గుజరాత్‌లో అరేబియా సముద్ర తీరానికి సమీపంలో ప్రారంభమై మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మీదుగా తూర్పుకు వెళుతుంది. 900 కి.మీ. (560 మై.) పొడవున విస్తరించిన ఈ శ్రేణిలో అనేక శిఖరాలు 1,000 మీ. (3,300 అ.) కంటే ఎక్కువగా ఉన్నాయి .[16] ఇది త్రిభుజాకారంలో రెండు వైపులా తపతి, నర్మదా నదులకు సమాంతరంగా ఉంటుంది. దీని అత్యున్నత శిఖరం రత్నపురి వద్ద ఉంది. ఇది ఉత్తరాన ఉన్న వింధ్య శ్రేణికి సమాంతరంగా నడుస్తుంది. ఈ రెండు తూర్పు-పశ్చిమ శ్రేణులు ఇండో-గంగా మైదానాన్ని దక్కన్ పీఠభూమి నుండి విభజిస్తాయి.
  • పీఠభూములు (ఎగువ-ఎడమ నుండి సవ్యదిశలో)
    • మాళ్వా పీఠభూమి రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ అంతటా విస్తరించి ఉంది. దీని సగటు ఎత్తు 500 మీటర్లు. ప్రకృతి దృశ్యం సాధారణంగా ఉత్తరం వైపు వాలుగా ఉంటుంది. దీనిలో చాలా ప్రాంతం చంబల్ నది, దాని ఉపనదులు ప్రవహిస్తాయి; పశ్చిమ భాగం మహి నది ఎగువ ప్రాంతాల ద్వారా ప్రవహిస్తుంది.
    • ఛోటా నాగ్‌పూర్ పీఠభూమి తూర్పు భారతదేశంలో ఉంది. ఇది జార్ఖండ్‌లో ఎక్కువ భాగం, ఒడిషా, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లోని ప్రక్కనే ఉన్న ప్రాంతాలను కవర్ చేస్తుంది. దీని మొత్తం వైశాల్యం సుమారు 65,000 కి.మీ2 (25,000 చ. మై.). ఇందులో రాంచీ, హజారీబాగ్, కోడర్మా అనే మూడు చిన్న పీఠభూములు భాగంగా ఉన్నాయి. వీటిలో రాంచీ పీఠభూమి అతిపెద్దది. దీని సగటు ఎత్తు 700 మీ. (2,300 అ.) . పీఠభూమిలో ఎక్కువ భాగం ఛోటా నాగ్‌పూర్ పొడి ఆకురాల్చే అడవులతో కూడుకుని ఉంది. చోటా నాగ్‌పూర్ పీఠభూమిలో అపారమైన లోహ ఖనిజాలు, బొగ్గు నిల్వలు ఉన్నాయి. పశ్చిమ గుజరాత్‌లోని కతియవార్ ద్వీపకల్పం గల్ఫ్ ఆఫ్ కచ్, ఖంబట్ గల్ఫ్‌లు సరిహద్దులుగా ఉన్నాయి. ద్వీపకల్పంలో చాలా వరకు సహజ వృక్షసంపద, వాయవ్య ముళ్ళ పొదల అడవుల ప్రాంతంలో భాగమైన జెరిక్ పొదలతో కూడుకుని ఉంటుంది.
    • దక్షిణ గరానులైట్ భూభాగం : పశ్చిమ, తూర్పు కనుమలను మినహాయించి దక్షిణ భారతదేశమంతటినీ, ముఖ్యంగా తమిళనాడును, కవర్ చేస్తుంది.
    • దక్కన్ పీఠభూమి: దక్కను పీఠభూమిని డెక్కన్ ట్రాప్స్ అని కూడా పిలుస్తారు. ఈ పెద్ద త్రిభుజాకార పీఠభూమికి ఉత్తరాన వింధ్య పర్వతాలు, తూర్పు, పశ్చిమాల్లో కనుమలు సరిహద్దులుగా ఉన్నాయి. దక్కన్ పీఠభూమి మొత్తం వైశాల్యం 19 లక్షల చ.కి.మీ. సముద్ర మట్టం నుండి దీని ఎత్తు 300 నుండి 600 మీ. (980 నుండి 1,970 అ.) వరకు, ఎక్కువగా సమతలంగా ఉంటుంది. పీఠభూమి సగటు ఎత్తు 610 మీటర్లు (2,000 అ.). దీని ఉపరితలం పశ్చిమాన 910 మీటర్లు (2,990 అ.) ఎత్తు నుండి తూర్పున 460 మీటర్లు (1,510 అ.) వరకు వాలుగా ఉంటుంది.[17] గోదావరి, కృష్ణ, కావేరీ, మహానది వంటి అనేక ద్వీపకల్ప నదులు పీఠభూమి గుండా బంగాళాఖాతంలోకి ప్రవహిస్తాయి. ఈ ప్రాంతం రెండు కనుమల వర్షచ్ఛాయా ప్రదేశంలో ఉన్నందున చాలావరకు పాక్షిక పొడి ప్రాంతంగా ఉంటుంది. దక్కన్‌లో ఎక్కువ భాగం చెల్లాచెదురుగా ఉన్న ముళ్ల పొదలతో, అక్కడక్కడా ఆకురాల్చే అరణ్య ప్రాంతాలతో కప్పబడి ఉంది. దక్కనులో శీతోష్ణస్థితి వేడిగా ఉండే వేసవి నుండి తేలికపాటి చలికాలం వరకు ఉంటుంది.
    • కచ్ కతియవార్ పీఠభూమి గుజరాత్ రాష్ట్రంలో ఉంది.
మతేరన్ సమీపంలోని పశ్చిమ కనుమలు
తూర్పు కనుమల కొల్లి కొండలు, తమిళనాడు
తూర్పు కనుమల వెంబడి పొడి సతత హరిత అడవులు, ఆంధ్రప్రదేశ్
  • కనుమలు
    • పశ్చిమ కనుమలు లేదా సహ్యాద్రి పర్వతాలు దక్కన్ పీఠభూమికి పశ్చిమ అంచున అరేబియా సముద్ర తీరం వెంబడి నడుస్తూ, సన్నని తీర మైదానాన్ని ఏర్పరుస్తాయి. ఈ శ్రేణి సుమారుగా 1,600 కి.మీ. (990 మై.) పొడవున ఉంది. గుజరాత్-మహారాష్ట్ర సరిహద్దు సమీపంలోని తపతి నదికి దక్షిణం నుండి మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు మీదుగా దక్కన్ ద్వీపకల్పం యొక్క దక్షిణ కొన వరకు ఇవి విస్తరించి ఉన్నాయి. వీటి సగటు ఎత్తు సుమారు 1,000 మీ. (3,300 అ.) .[18] కేరళలోని అనైమలై కొండల్లోని అనై ముడి శిఖరం (2,695 మీ. (8,842 అ.) ఎత్తు) పశ్చిమ కనుమలలో కెల్లా ఎత్తైన శిఖరం.
    • తూర్పు కనుమలు దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రధాన నదులైన గోదావరి, మహానది, కృష్ణ, కావేరి నదుల కోతకు గురై, విడివిడిగా ఉండే పర్వతాల శ్రేణి. ఈ పర్వతాలు పశ్చిమ బెంగాల్ నుండి ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వరకు, బంగాళాఖాత తీరం వెంబడి తీరానికి సమాంతరంగా విస్తరించి ఉన్నాయి. పశ్చిమ కనుమల అంత ఎత్తు కానప్పటికీ, కొన్ని శిఖరాలు 1,000 మీ. (3,300 అ.) కంటే ఎక్కువ ఉన్నాయి.[18] తమిళనాడులోని నీలగిరి కొండలు తూర్పు, పశ్చిమ కనుమల కూడలిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అర్మ కొండ ( 1,690 మీ. (5,540 అ.) ) తూర్పు కనుమలలో కెల్లా ఎత్తైన శిఖరం.

ఇండో-గంగా మైదానం

[మార్చు]
దక్షిణ ఆసియా అంతటా వ్యాపించిన ఇండో-గంగా మైదానం
భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లో ఋతుపవనాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమౌతూంటాయి.

ఇండో-గంగా [19] మైదానాలను గ్రేట్ ప్లెయిన్స్ అని కూడా అంటారు. ఇవి మూడు ప్రధాన నదులు, సింధు, గంగా, బ్రహ్మపుత్రలు ప్రవహించే పెద్ద ఒండ్రు మైదానాలు. అవి పశ్చిమాన జమ్మూ కాశ్మీర్ నుండి తూర్పున అస్సాం వరకు హిమాలయాలకు సమాంతరంగా నడుస్తాయి. ఉత్తర, తూర్పు భారతదేశంలోని నదులు చాలా వరకు ఈ మైదానం గుండా ప్రవహిస్తాయి. ఈ మైదానాల విస్తీర్ణం 700,000 కి.మీ2 (270,000 చ. మై.). ఈ ప్రాంతంలోని ప్రధాన నదులు గంగా, సింధు, బ్రహ్మపుత్ర, వాటి ప్రధాన ఉపనదులు- యమునా, చంబల్, గోమతి, ఘఘరా, కోసి, సట్లెజ్, రవి, బియాస్, చీనాబ్, తిస్టా -అలాగే గంగా డెల్టా లోని నదులు, మేఘన.

ఇండో గంగా మైదానాలను నాలుగు విభాగాలుగా వర్గీకరించవచ్చు:

  • భాబరు బెల్ట్ హిమాలయాల పాదాలకు ఆనుకొని ఉంది. ఇది, నదీ ప్రవాహాలలో కొట్టుకు వచ్చిన బండరాళ్లు, గులకరాళ్ళతో కూడుకుని ఉంటుంది. ఇక్కడి నేలల్లో పోరాసిటీ చాలా ఎక్కువగా ఉన్నందున, ప్రవాహాలు భూగర్భంలో ప్రవహిస్తాయి. భాబరు సాధారణంగా సన్నగా, 6 నుండి 15 కి.మీ. (3.7 నుండి 9.3 మై.) వెడల్పుతో ఉంటుంది.
  • తరాయ్ బెల్ట్, భాబరు ప్రాంతానికి పక్కనే దక్షిణంగా ఉంది. ఇది కొత్త ఒండ్రుతో కూడి ఉంటుంది. బాబరు‌ లోని భూగర్భ ప్రవాహాలు ఇక్కడ నేల పైకి వచ్చి ప్రవహిస్తాయి. ఈ ప్రాంతం అధిక తేమతో కూడిన దట్టమైన అటవీప్రాంతం. సంవత్సరం పొడవునా భారీ వర్షపాతంతో, వివిధ రకాల వన్యప్రాణులతో నిండి ఉంటుంది.
  • బంగర్ బెల్ట్ పాత ఒండ్రుతో ఉంటుంది. వరద మైదానాల ఒండ్రు టెర్రస్‌ను ఏర్పరుస్తుంది. ఇది గంగా మైదానాలన్నిటి లోకీ తక్కువ ఎత్తులో, లేటరైట్ నిక్షేపాలతో కూడి ఉంది.
  • ఖాదర్ బెల్ట్ బంగర్ బెల్ట్ తర్వాత లోతట్టు ప్రాంతాలలో ఉంది. ఇది తాజా కొత్త ఒండ్రుతో ఏర్పడింది. ఈ ఒండ్రు, మైదానంలో ప్రవహించే నదుల ద్వారా కొట్టుకు వచ్చింది.

ఇండో-గంగా బెల్ట్ అనేది అనేక నదులలో కొట్టుకు వచ్చిన ఒండ్రు నిక్షేపణ ద్వారా నిరంతతరాయంగా ఏర్పడిన మైదానాల్లో ప్రపంచంలోనే అత్యంత విశాలమైనది. ఈ మైదానం చదునుగా ఉండడం వల్ల కాలువల ద్వారా నీటిపారుదలకి అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రాంతం భూగర్భ జల వనరులతో సమృద్ధిగా ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా సాగుచేసే ప్రాంతాలలో ఇండొ గంగా మైదానం ఒకటి. ఇక్కడ సాగు చేసే ప్రధాన పంటలు వరి, గోధుమలు. ఇతర ముఖ్యమైన పంటలలో మొక్కజొన్న, చెరకు, పత్తి ఉన్నాయి. ఇండో-గంగా మైదానం ప్రపంచంలో అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో ఒకటి.

థార్ ఎడారి

[మార్చు]
థార్ ఎడారి, రాజస్థాన్

థార్ ఎడారి, కొన్ని లెక్కల ప్రకారం ప్రపంచంలోని ఏడవ అతిపెద్ద ఎడారి, మరికొన్ని విధాలుగా చూస్తే పదవది.[20] ఇది 200,000 నుండి 238,700 కి.మీ2 (77,200 నుండి 92,200 చ. మై.) మధ్య విస్తీర్ణంతో పశ్చిమ భారతదేశంలో గణనీయమైన భాగంగా ఉంది. దీన్ని పాకిస్తాన్‌లో చోలిస్థాన్ ఎడారి అంటారు. థార్ ఎడారిలో ఎక్కువ భాగం రాజస్థాన్‌లో, దాని భౌగోళిక ప్రాంతంలో 61% వరకు విస్తరించి ఉంది.

ఈ ఎడారిలో సుమారు 10 శాతం ఇసుక దిబ్బలు, మిగిలిన 90 శాతం క్రాగీ రాతి రూపాలు, ఒత్తుగా గట్టిపడిన ఉప్పుతో కూడిన అడుగుభాగాలు కలిగిన సరస్సులు, స్థిరమైన దిబ్బ ప్రాంతాలతో కూడుకుని ఉంటుంది. వార్షిక ఉష్ణోగ్రతలు శీతాకాలంలో 0 °C (32 °F) నుండి వేసవిలో 50 °C (122 °F) వరకూ ఉంటాయి. ఈ ప్రాంతంలో వర్షపాతం, జూలై-సెప్టెంబరులలో వచ్చే నైరుతి ఋతుపవనాల ద్వారా కలుగుతుంది. అత్యధిక వర్షపాతం 100 నుండి 500 mమీ. (3.9 నుండి 19.7 అం.) ఉంటుంది. నీరు చాలా తక్కువగా, 30 నుండి 120 మీటర్లు (98 నుండి 394 అ.) లోతున ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక నది లూనీ.

పశ్చిమ భారతదేశంలో, గుజరాత్‌లోని కచ్ ప్రాంతం, మహారాష్ట్ర లోని కోయినాలు భూకంపాలు సంభవించే జోన్ IV ప్రాంతం (అధిక ప్రమాదం) గా వర్గీకరించబడ్డాయి. కచ్ ప్రాంతం లోని నగరమైన భుజ్ కేంద్రంగా వచ్చిన 2001 గుజరాత్ భూకంపంలో 1,337 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, 166,836 మంది గాయపడ్డారు. 10 లక్షలకు పైగా ఇళ్ళు ధ్వంసమయ్యాయి.[21] 1993లో మహారాష్ట్రలోని లాతూర్ భూకంపంలో 7,928 మంది మరణించగా, 30,000 మంది గాయపడ్డారు. ఇతర ప్రాంతాలలో భూకంపాల ముప్పు మధ్యస్థ స్థాయి నుండి తక్కువ స్థాయి వరకు ఉంది.

తీర మైదానాలు, కనుమలు

[మార్చు]
విశాఖపట్నం బీచ్, బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ .
కేరళ తీరం, అరేబియా సముద్రంలో వర్కాల బీచ్

తూర్పు తీర మైదానం తూర్పు కనుమలకు బంగాళాఖాతపు తీరానికి మధ్య విస్తరించి ఉన్న భూభాగం. ఇది దక్షిణాన తమిళనాడు నుండి తూర్పున పశ్చిమ బెంగాల్ వరకు విస్తరించి ఉంది. మహానది, గోదావరి, కావేరి, కృష్ణా నదులు ఈ మైదానాల గుండా ప్రవహిస్తున్నాయి. తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 30 °C (86 °F) కంటే ఎక్కువగా ఉండి, అధిక స్థాయి తేమతో కూడి ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాల ద్వారా వర్షం పడుతుంది. నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతం శాఖ, అరేబియా సముద్ర శాఖ అనే రెండు శాఖలుగా విడిపోతాయి. బంగాళాఖాతం శాఖ జూన్ ప్రారంభంలో ఈశాన్య భారతదేశాన్ని దాటి ఉత్తరం వైపు కదులుతుంది. అరేబియా సముద్ర శాఖ ఉత్తరం వైపు కదిలి, పశ్చిమ కనుమలకు గాలి వీచే వైపున వర్షాన్ని కురిపిస్తుంది. ఈ ప్రాంతంలో వార్షిక వర్షపాతం సగటున 1,000 -- 3,000 mమీ. (39 -- 118 అం.) మధ్య ఉంటుంది . మైదానం వెడల్పు 100 -- 130 కి.మీ. (62 -- 81 మై.) మధ్య మారుతూ ఉంటుంది .[22] ఈ మైదానాన్ని ఆరు ప్రాంతాలుగా విభజించారు-మహానది డెల్టా, దక్షిణ ఆంధ్రప్రదేశ్ మైదానం, కృష్ణా-గోదావరి డెల్టాలు, కన్యాకుమారి తీరం, కోరమాండల్ తీరం, ఇసుక తీరం. 

పశ్చిమ తీర మైదానం అనేది పశ్చిమ కనుమలకు, అరేబియా సముద్రానికీ మధ్య 50 నుండి 100 కి.మీ. (31 నుండి 62 మై.) వెడల్పున విస్తరించి ఉన్న సన్నని భూభాగం. ఇది ఉత్తరాన గుజరాత్ నుండి విస్తరించి మహారాష్ట్ర, గోవా, కర్నాటక, కేరళ లలో విస్తరించి ఉంది. అనేక నదులు, బ్యాక్ వాటర్స్ ఈ ప్రాంతాన్ని ముంచెత్తుతాయి. వీటిలో ఎక్కువగా పశ్చిమ కనుమలలో ఉద్భవించాయి. ఈ నదులు వేగంగా ప్రవహిస్తాయి. సముద్రంలోకి ప్రవహించే ప్రధాన నదులు తపతి, నర్మద, మండోవి, జువారీ. వృక్షసంపద ఎక్కువగా ఆకురాల్చే అడవుల రూపంలో ఉంటుంది. కానీ మలబార్ తీరంలో తేమతో కూడిన అడవులు ఒక ప్రత్యేకమైన పర్యావరణ ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి. పశ్చిమ తీర మైదానాన్ని కొంకణ్, మలబార్ తీరం అనే రెండు భాగాలుగా విభజించవచ్చు.

అండమాన్ దీవుల విహంగ దృశ్యం

లక్షద్వీపాలు, అండమాన్ నికోబార్ దీవులు భారతదేశం లోని రెండు ప్రధాన ద్వీపాలు. ఇవి కేంద్రపాలిత ప్రాంతాలు.

లక్షద్వీపాలు, అరేబియా సముద్రంలో కేరళ తీరం నుండి 200 నుండి 440 కి.మీ. (120 నుండి 270 మై.) దూరంలో 32 కి.మీ2 (12 చ. మై.) విస్తీర్ణంలో ఉన్నాయి. అవి పన్నెండు అటోల్‌లు, మూడు దిబ్బలు, ఐదు మునిగిపోయిన ఒడ్డులతో, మొత్తం 35 ద్వీపాలు లంకలతో ఉన్నాయి.

అండమాన్ నికోబార్ దీవులు 6°, 14° ఉత్తర అక్షాంశాలు, 92°, 94° తూర్పు రేఖాంశాల మధ్య ఉన్నాయి.[23] ఇందులో 572 ద్వీపాలున్నాయి. మయన్మార్ తీరానికి సమీపంలో బంగాళాఖాతంలో ఉత్తర-దక్షిణ అక్షంలో సుమారు 910 కి.మీ. పొడవున ఉన్నాయి. అవి కోల్‌కతా నుండి 1,255 కి.మీ. (780 మై.), బర్మాలోని కేప్ నెగ్రైస్ నుండి 193 కి.మీ. (120 మై.) దూరంలో ఉన్నాయి.[23] ఈ భూభాగంలో అండమాన్ దీవులు, నికోబార్ దీవులు అనే రెండు ద్వీప సమూహాలు ఉన్నాయి. అండమాన్ సమూహంలో 325 దీవులు, 6,170 km 2 విస్తీర్ణంలో ఉన్నాయి. నికోబార్ సమూహంలో 1,765 km2 (681 sq mi) వైశాల్యంతో 247 దీవులు ఉన్నాయి. భారతదేశపు ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం, బారెన్ ద్వీపం ఇక్కడ ఉంది. ఇది చివరిసారిగా 2017లో విస్ఫోటనం చెందింది. నార్కోండమ్ ఒక నిద్రాణమైన అగ్నిపర్వతం. బరాటాంగ్ వద్ద ఒక మట్టి అగ్నిపర్వతం ఉంది. భారతదేశపు దక్షిణ కొన అయిన ఇందిరా పాయింట్, నికోబార్ దీవులలో 6°45'10″N, 93°49'36″E వద్ద, ఇండోనేషియా ద్వీపం సుమత్రా నుండి, ఆగ్నేయంగా కేవలం 189 కి.మీ. (117 మై.) దూరంలో ఉంది. ఇక్కడి అత్యంత ఎత్తైన ప్రదేశం 642 మీ. (2,106 అ.) వద్ద ఉన్న మౌంట్ తుల్లియర్ .

భారతదేశంలోని ఇతర ద్వీపాలలో మాజీ పోర్చుగీస్ కాలనీ అయిన డయ్యూ, బ్రహ్మపుత్ర నది ద్వీపమైన మజూలి,[24] బాంబే నౌకాశ్రయంలోని ఎలిఫెంటా, ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీహరికోట ముఖ్యమైనవి. సాల్సెట్ ద్వీపం భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన ద్వీపం. ఈ ద్వీపం లోనే ముంబై నగరం (బాంబే) ఉంది. గల్ఫ్ ఆఫ్ కచ్‌లోని నలభై-రెండు ద్వీపాలు మెరైన్ నేషనల్ పార్క్‌గా ఉన్నాయి.

సహజ వనరులు

[మార్చు]

పర్యావరణ వనరులు

[మార్చు]

నీటి వనరులు

[మార్చు]

భారతదేశంలో దాదాపు 14,500 కి.మీ.ల లోతట్టు జలమార్గాలున్నాయి.[25] పన్నెండు ప్రధాన నదులు ఉన్నాయి. వీటి మొత్తం పరీవాహక ప్రాంతం 2,528,000 కి.మీ2 (976,000 చ. మై.) పైచిలుకు. భారతదేశంలోని అన్ని ప్రధాన నదులు కింది మూడు ప్రధాన పరీవాహక ప్రాంతాలలో ఏదో ఒకదాని నుండి ఉద్భవించాయి :[18]

  • హిమాలయాలు, కారకోరం శ్రేణులు
  • మధ్య భారతదేశంలోని వింధ్య, సాత్పురా శ్రేణులు
  • పశ్చిమ భారతదేశంలోని సహ్యాద్రి లేదా పశ్చిమ కనుమలు

హిమాలయ నదులు మంచు నుండి ఉద్భవించి, ఏడాది పొడవునా నీటి ప్రవాహం కలిగి ఉంటాయి. మిగిలిన రెండు నదీ వ్యవస్థలు ఋతుపవనాలపై ఆధారపడినవి. ఎండా కాలంలో అవి వాగులుగా కుంచించుకుపోతాయి. సింధూ, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్, పశ్చిమాన పంజాబ్ లోకి ప్రవహించే హిమాలయ నదులు.[26]

గంగోత్రి వద్ద భాగీరథి నది (గంగానదికి మూలం)
జాతీయ రహదారి 31A డార్జిలింగ్ హిమాలయ కొండ ప్రాంతంలో కాలింపాంగ్ ( పశ్చిమ బెంగాల్ ) సమీపంలో తీస్తా నది ఒడ్డునే వెళ్తుంది

గంగా - బ్రహ్మపుత్ర - మేఘన వ్యవస్థ, దాదాపు 1,600,000 కి.మీ2 (620,000 చ. మై.) పరీవాహక ప్రాంతంతో అతి పెద్దది.. గంగా పరీవాహక ప్రాంతమే దాదాపు 1,100,000 కి.మీ2 (420,000 చ. మై.) విస్తీర్ణంలో ఉంది. గంగానది ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి గ్లేసియర్ నుండి ఉద్భవించింది. ఇది ఆగ్నేయంగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది.[18] యమున, గోమతి నదులు కూడా పశ్చిమ హిమాలయాలలో పుట్టి, గంగానదిలో సంగమిస్తాయి.[18] బ్రహ్మపుత్ర టిబెట్‌లో ఉద్భవించింది. అక్కడ దీనిని యార్లంగ్ త్సాంగ్పో నది అని పిలుస్తారు. ఇది సుదూర తూర్పు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో భారతదేశంలోకి ప్రవేశించి, తరువాత అస్సాం గుండా పశ్చిమానికి ప్రవహిస్తుంది. బ్రహ్మపుత్ర బంగ్లాదేశ్‌లో గంగానదిలో కలుస్తుంది, ఇక్కడ దీనిని జమునా నది అని పిలుస్తారు.[18][27]

చంబల్, యమునా నది ద్వారా గంగానదికి ఉపనది. ఇది వింధ్య-సాత్పురా వాటర్‌షెడ్ నుండి ఉద్భవించింది. ఈ నది తూర్పు దిశగా ప్రవహిస్తుంది. ఈ పరీవాహక ప్రాంతం నుండి పశ్చిమ దిశగా ప్రవహించే నర్మద, తపతి నదులు గుజరాత్‌లో అరేబియా సముద్రంలో కలుస్తాయి. తూర్పు నుండి పడమరకు ప్రవహించే నదుల ప్రవాహం, మొత్తం నదులన్నిటి ప్రవాహంలో 10% ఉంటుంది.

పాపి కొండల వద్ద గోదావరి నది

దక్కను పీఠభూమిలో ప్రవహించే నదులన్నిటికీ మూలస్థానం పశ్చిమ కనుమలే. వీటిలో గోదావరి నది, కృష్ణా నది, కావేరీ నది వంటివి బంగాళాఖాతంలో కలుస్తాయి. ఈ నదులలో ప్రవాహం, భారతదేశపు మొత్తం నదులన్నిటి ప్రవాహంలో 20% ఉంటుంది.[26]

నైరుతి ఋతుపవనాల వర్షాల కారణంగా బ్రహ్మపుత్ర, ఇతర నదులు ఒడ్లు ఒరుసుకుంటూ ప్రవహిస్తాయి. తరచుగా పొంగి చుట్టుపక్కల ప్రాంతాలను వరదలు ముంచెత్తుతూంటాయి. అవి వరి వరి రైతులకు సహజమైన నీటిపారుదల రూపంలో ఆధారపడదగిన నీటి వనరును అందించినప్పటికీ, ఈ వరదల్లో వేలాది మంది మరణించడం జరుగుతూంటుంది. వరద ప్రాంతాల్లోని ప్రజల వలసలకు ఇవి కారణమయ్యాయి.

ప్రధాన సింధుశాఖల్లో గల్ఫ్ ఆఫ్ కాంబే, గల్ఫ్ ఆఫ్ కచ్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఉన్నాయి. జలసంధుల్లో భారతదేశానికి శ్రీలంకకూ మధ్యన ఉన్న పాక్ జలసంధి, నికోబార్ దీవుల నుండి అండమాన్‌ను వేరు చేసే టెన్ డిగ్రీ ఛానల్, లక్షద్వీపాలు అమిండివి దీవులను మినికాయ్ ద్వీపం నుండి దక్షిణంగా వేరు చేసే ఎయిట్ డిగ్రీ ఛానల్‌లు ఉన్నాయి. ముఖ్యమైన అగ్రాలలో కన్యాకుమారి (గతంలో కేప్ కొమోరిన్ అని పిలిచేవారు), భారతదేశ ప్రధాన భూభాగానికి దక్షిణ కొన. భారతదేశం మొత్తానికీ దక్షిణ కొన (గ్రేట్ నికోబార్ ద్వీపంలో); రామ సేతు, పాయింట్ కాలిమేర్ లు ఇతర అగ్రాలు. అరేబియా సముద్రం భారతదేశానికి పశ్చిమాన, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలు తూర్పు, దక్షిణాల్లో ఉన్నాయి. చిన్న సముద్రాలలో లక్కదీవ్ సముద్రం, అండమాన్ సముద్రం ఉన్నాయి. భారతదేశంలో నాలుగు పగడపు దిబ్బలు ఉన్నాయి. అవి: అండమాన్ నికోబార్ దీవులు, మన్నార్ జలసంధి, లక్షద్వీపాలు, గల్ఫ్ ఆఫ్ కచ్.[28] ముఖ్యమైన సరస్సులలో రాజస్థాన్‌లో దేశంలోకెల్లా అతిపెద్దదైన సంభార్ ఉప్పు సరస్సు, కేరళలో వెంబనాడ్ సరస్సు, ఆంధ్రప్రదేశ్‌లో కొల్లేరు సరస్సు, మణిపూర్‌లో లోక్‌తక్ సరస్సు, కాశ్మీర్‌లో దాల్ సరస్సు, ఒడిశాలో చిల్కా సరస్సు (మడుగు సరస్సు), కేరళలో శస్తాంకోట సరస్సు ఉన్నాయి.

చిత్తడి నేలలు

[మార్చు]
పశ్చిమ బెంగాల్‌లోని భారతీయ సుందర్‌బన్స్ మ్యాప్
పిచ్చవరం మడ అడవులు, తమిళనాడు

భారతదేశం లోని చిత్తడి నేలల పర్యావరణ వ్యవస్థలో జమ్మూ కాశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలో ఉన్న చల్లని, పొడి ప్రాంతాల నుండి, ద్వీపకల్ప భారతదేశంలోని తడి, తేమతో కూడిన శీతోష్ణస్థితి వరకూ విస్తృతంగా ఉన్నాయి. చాలా చిత్తడి నేలలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నదులతో ముడిపడి ఉన్నాయి. భారత ప్రభుత్వం మొత్తం 71 చిత్తడి నేలలను పరిరక్షణ కోసం గుర్తించింది. ఇవి అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలలో భాగంగా ఉన్నాయి.[29] మడ అడవులు భారతదేశ తీరప్రాంతం పొడవునా ఉన్న ఉప్పు నీటి కయ్యలు, క్రీక్స్, బ్యాక్ వాటర్స్, ఉప్పు చిత్తడి నేలలు, మట్టి పలకలలో ఉన్నాయి. మడ అడవుల విస్తీర్ణం మొత్తం 4,461 కి.మీ2 (1,722 చ. మై.).[30] ప్రపంచంలోని మొత్తం మడ అడవులలో ఇవి 7%. అండమాన్ నికోబార్ దీవులు, సుందర్బన్స్ డెల్టా, గల్ఫ్ ఆఫ్ కచ్, మహానది, గోదావరి, కృష్ణా నదుల డెల్టాలలో మడ అడవులు ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలోని కొన్ని ప్రాంతాలలో కూడా పెద్ద మడ అడవులు ఉన్నాయి.

సుందర్బన్స్ డెల్టా ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులకు నిలయం. ఇది గంగా ముఖద్వారం వద్ద, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ లలో వ్యాపించి ఉంది. సుందర్బన్స్ UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశం. దీన్ని సుందర్బన్స్ (బంగ్లాదేశ్), సుందర్బన్స్ నేషనల్ పార్క్ (భారతదేశం) గా విడిగా గుర్తించింది. సుందర్బన్స్ అలల జలమార్గాలు, బురద పలకలు, ఉప్పును తట్టుకోగల మడ అడవులతో కూడిన చిన్న ద్వీపాలతో కూడిన సంక్లిష్ట నెట్‌వర్క్‌తో కలుస్తాయి. ఈ ప్రాంతం అనేక రకాల పక్షులు, మచ్చల జింకలు, మొసళ్ళు, పాములకు నిలయం. ఇక్కడి అత్యంత ప్రసిద్ధ జంతువు బెంగాల్ టైగర్. ఈ ప్రాంతంలో ఇప్పుడు 400 బెంగాల్ పులులు, సుమారు 30,000 మచ్చల జింకలు ఉన్నాయని అంచనా.

రాన్ ఆఫ్ కచ్ వాయవ్య గుజరాత్, పాకిస్తాన్ సరిహద్దులోని సింధ్ ప్రావిన్స్‌లో ఉన్న చిత్తడి ప్రాంతం. ఇది మొత్తం 27,900 కి.మీ2 (10,800 చ. మై.) విస్తీర్ణంలో ఉంది . ఈ ప్రాంతం మొదట అరేబియా సముద్రంలో భాగంగా ఉండేది. భూకంపాలు వంటి భౌగోళిక శక్తుల ఫలితంగా ఈ ప్రాంతానికి కట్టలు ఏర్పడి, పెద్ద ఉప్పునీటి మడుగుగా మారింది. ఈ ప్రాంతం క్రమంగా ఒండ్రుతో నిండి, తద్వారా ఇది కాలానుగుణ ఉప్పు కయ్యగా మారింది. వర్షాకాలంలో, ఈ ప్రాంతం లోతులేని చిత్తడి నేలగా మారుతుంది. తరచుగా మోకాళ్ల లోతు వరకు వరదలు వస్తాయి. వర్షాకాలం తర్వాత ఈ ప్రాంతం ఎండిపోతుంది.

ఆర్థిక వనరులు

[మార్చు]

పునరుత్పాదక నీటి వనరులు

[మార్చు]

భారతదేశపు మొత్తం పునరుత్పాదక నీటి వనరులు సంవత్సరానికి 1,907.8 కిమీ3 అని అంచనా వేసారు.[31] దీని వార్షిక సరఫరా 350 బిలియన్ క్యూబిక్ మీటర్లు. భూగర్భ జలవనరుల్లో 35 శాతం మాత్రమే వినియోగిస్తున్నారు.[32] దేశంలోని ప్రధాన నదులు, జలమార్గాల ద్వారా ఏటా దాదాపు 44 మిలియన్ టన్నుల వస్తువుల రవాణా జరుగుతుంది.[25] భారతదేశ నీటిపారుదల కాలువలలో 40% నీటిని భూగర్భ జలాలు సరఫరా చేస్తాయి. 56% భూమి వ్యవసాయ యోగ్యమైనది, వ్యవసాయానికి ఉపయోగించబడుతున్నదీను. తేమ-నిలుపుకోగలిగిన నల్ల నేలల్లో పొడి వ్యవసాయానికి, పత్తి, లిన్సీడ్ మొదలైన వాటికి ప్రాధాన్యత ఉంది. అటవీ నేలలను టీ, కాఫీ తోటల కోసం ఉపయోగిస్తారు. ఎర్ర నేలల్లో ఇనుము విస్తృతంగా వ్యాప్తించి ఉంటుంది.[33]

చమురు, సహజ వాయువు

[మార్చు]

భారతదేశపు 5.4 billion barrels (860,000,000 మీ3) చమురు నిల్వల్లో అత్యధిక శాతం ముంబై హై, ఎగువ అస్సాం, కాంబే, కృష్ణా-గోదావరి, కావేరి బేసిన్లలో ఉన్నాయి.[34] ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒడిశాలో దాదాపు పదిహేడు ట్రిలియన్ క్యూబిక్ అడుగుల సహజ వాయువు ఉంది.[34] ఆంధ్రప్రదేశ్‌లో యురేనియం తవ్వకాలు జరుగుతున్నాయి. హిమాలయాలు, సోహనా, కాంబే, నర్మదా-తపతి డెల్టా, గోదావరి డెల్టా, అండమాన్ నికోబార్ దీవులు (ప్రత్యేకంగా అగ్నిపర్వత బారెన్ ద్వీపాలు) - ఈ ఏడు ప్రాంతాల్లో భూగర్భ ఉష్ణ శక్తిని వెలికి తీయడానికి 400 మధ్యస్థం నుండి అధిక ఎంథాల్పీ కలిగిన థర్మల్ స్ప్రింగ్‌లు ఉన్నాయి.[35]

ఖనిజాలు, ముడి పదార్థాలు

[మార్చు]
2008 భారత గనుల మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం భారతీయ బొగ్గు ఉత్పత్తి ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. పైన చూపినది జార్ఖండ్‌లోని బొగ్గు గని.

మైకా బ్లాక్‌లు, మైకా స్ప్లిటింగ్‌ల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్దది.[36] ప్రపంచంలోని బెరైట్, క్రోమైట్ ఉత్పత్తిదారులలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది.[36] ప్లీస్టోసీన్ వ్యవస్థలో ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు. ఇనుము ధాతువు ఉత్పత్తిలో నాల్గవ స్థానంలో ఉంది.[34][36] బాక్సైట్ ఉత్పత్తిలో ఐదవ స్థానం లోను, 2018 ఫిబ్రవరి నాటికి ముడి ఉక్కు ఉత్పత్తిలో రెండవ స్థానంలోనూ ఉంది. మాంగనీస్ ధాతువు విషయంలో ఏడవ స్థానం లోను, అల్యూమినియం ఉత్పత్తిలో ఎనిమిదవ స్థానం లోనూ ఉంది.[36] భారతదేశంలో టైటానియం ఖనిజం, వజ్రాలు, సున్నపురాయి వనరులు ఉన్నాయి.[37] ప్రపంచంలో ఆర్థికంగా లాభసాటిగా ఉండే థోరియంలో 24% భారతదేశంలో ఉంది. ఇది కేరళ తీరం వెంబడి లభిస్తుంది.[38] ప్రస్తుతం కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో బంగారాన్ని వెలికి తీస్తున్నారు.[39]

శీతోష్ణస్థితి

[మార్చు]
భారతదేశపు కొప్పెన్ వాతావరణ వర్గీకరణ మ్యాప్ [40] స్థానిక వృక్షసంపద, ఉష్ణోగ్రత, అవపాతం, వాటి కాలానుగుణతపై ఆధారపడి ఉంటుంది.

కొప్పెన్ వ్యవస్థ ప్రకారం, భారతదేశ శీతోష్ణస్థితిలో ఆరు ప్రధాన ఉప రకాలున్నాయి. పశ్చిమాన పొడి ఎడారి, ఉత్తరాన ఆల్పైన్ టండ్రా, హిమానీనదాలూ, నైరుతిలోను, ద్వీప భూభాగాలలోనూ వర్షారణ్యాలకు మద్దతు ఇచ్చే తేమతో కూడిన ఉష్ణమండల ప్రాంతాలు ఉన్నాయి. దేశంలో నాలుగు ఋతువులు ఉన్నాయి: శీతాకాలం (జనవరి-ఫిబ్రవరి), వేసవి (మార్చి-మే), ఋతుపవన (వర్షాకాలం) (జూన్-సెప్టెంబరు), ఋతుపవనాల అనంతర కాలం (అక్టోబరు-డిసెంబరు).[26]

మధ్య ఆసియా నుండి ప్రవహించే శీతల కటాబాటిక్ గాలులకు హిమాలయాలు అడ్డంకిగా నిలుస్తాయి. అందువలన, ఉత్తర భారతదేశం శీతాకాలంలో వెచ్చగానో లేదా కొద్దిగానే చల్లగానో ఉంటుంది. ఈ కారణం వల్లనే వేసవిలో భారతదేశం సాపేక్షంగా వేడిగా ఉంటుంది. కర్కట రేఖ (ఉష్ణమండల, ఉపఉష్ణమండలాల మధ్య సరిహద్దు) భారతదేశం మధ్య గుండా వెళుతున్నప్పటికీ, దేశం మొత్తాన్నీ ఉష్ణమండలం గానే పరిగణిస్తారు.[41]

భారతదేశంలో ఉష్ణోగ్రత సగటులు; (యూనిట్లు సెల్సియస్‌ డిగ్రీల్లో)

భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వేసవి కాలం మార్చి, జూన్‌ల మధ్య ఉంటుంది. ఉష్ణోగ్రతలు పగటిపూట 40 °C (104 °F) దాటవచ్చు. తీర ప్రాంతాల్లో శీతోష్ణస్థితి 30 °C (86 °F) తో, అధిక స్థాయి తేమతో కలిసి ఉంటుంది. థార్ ఎడారి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 45 °C (113 °F) దాటవచ్చు. థార్ ఎడారి సృష్టించే అల్పపీడన వ్యవస్థకు వర్షాన్ని కురిపించే ఋతుపవనాల మేఘాలు ఆకర్షితులవుతాయి. నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతం, అరేబియా సముద్రం అనే రెండు శాఖలుగా విడిపోతాయి. బంగాళాఖాతం శాఖ జూన్ ప్రారంభంలో ఈశాన్య భారతదేశాన్ని దాటి ఉత్తరం వైపు కదులుతుంది. అరేబియా సముద్రం శాఖ ఉత్తరం వైపు కదిలి, పశ్చిమ కనుమలకు గాలి వీచే వైపున వర్షాన్నిస్తుంది. భారతదేశంలోని ద్వీపకల్పంలో శీతాకాలాల్లో తేలికపాటి నుండి వెచ్చని పగళ్ళు, చల్లని రాత్రులూ ఉంటాయి. మరింత ఉత్తరాన ఉష్ణోగ్రత చల్లగా ఉంటుంది. మైదానాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కొన్నిసార్లు గడ్డకట్టే స్థాయి కంటే తక్కువగా ఉంటాయి. ఈ సీజన్‌లో ఉత్తర భారతదేశంలోని చాలా భాగం పొగమంచుతో అల్లాడిపోతుంది. దేశంలో అత్యధిక ఉష్ణోగ్రత 51 °C (124 °F) రాజస్థాన్‌లోని ఫలోడిలో నమోదైంది.[42] అత్యల్పం ఉష్ణోగ్రత −60 °C (−76 °F) జమ్మూ కాశ్మీర్‌ లోని ద్రాస్‌లో నమోదైంది.[43]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "Annual Report 2016-17, Ministry of Home Affairs" (PDF). Archived from the original (PDF) on 7 March 2018. Retrieved 7 March 2018.
  2. India Yearbook, p. 1
  3. "India at a Glance: Area". Ministry of Home Affairs: Government of India. 2001. Retrieved 9 September 2020.
  4. "Jammu and Kashmir - CIA" (PDF). Central Intelligence Agency. 2002. Retrieved 9 September 2020.
  5. "Territorial extent of India's waters". The International Law of the Sea and Indian MaritimeLegislation. 30 April 2005. Archived from the original on 28 September 2007. Retrieved 16 May 2006.
  6. Kind, Rainer (September 2007). "The Fastest Continent: India's truncated lithospheric roots". Helmholtz Association of German Research Centres. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  7. DelhiAugust 5. "States and Union Territories" (in ఇంగ్లీష్). Know India Programme. Archived from the original on 2021-08-19. Retrieved 2020-04-21.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  8. "India, Bangladesh ratify historic land deal, Narendra Modi announces new $2 billion line of credit to Dhaka". The Times of India. Retrieved 1 January 2016.
  9. Daniyal, Shoaib. "India-Bangla land swap: was the world's strangest border created by a game of chess?". Scroll.in. Retrieved 1 January 2016.
  10. "Another Chinese intrusion in Sikkim". Oneindia.in. 19 June 2012. Archived from the original on 28 September 2011. Retrieved 19 November 2008.
  11. Cratons of India.
  12. Cratons of India, lyellcollection.org.
  13. Baker, Kathleen M.; Chapman, Graham P. (11 March 2002), The Changing Geography of Asia, Routledge, pp. 10–, ISBN 978-1-134-93384-6, This greater India is well defined in terms of topography; it is the Indian sub-continent, hemmed in by the Himalayas on the north, the Hindu Khush in the west and the Arakanese in the east.
  14. Measurements are from recent imagery, generally supplemented with Russian 1:200,000 scale topographic mapping as well as Jerzy Wala, Orographical Sketch Map: Karakoram: Sheets 1 & 2, Swiss Foundation for Alpine Research, Zurich, 1990.
  15. "Physical divisions" (PDF). Archived from the original (PDF) on 12 December 2004.
  16. 16.0 16.1 16.2 . "Manorama Yearbook 2006 (India – The Country)". Malayala Manorama.
  17. "The Deccan Plateau". How Stuff Works. Archived from the original on 8 January 2009. Retrieved 14 November 2008.
  18. 18.0 18.1 18.2 18.3 18.4 18.5 Manorama Yearbook 2006 (India – The Country). p. 517.
  19. "Geography Now! India". Youtube. Archived from the original on 2022-08-05. Retrieved 2022-12-31.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  20. "The World's Largest Desert". geology.com. Retrieved 14 May 2011.
  21. "Preliminary Earthquake Report". USGS Earthquake Hazards Program. Archived from the original on 20 November 2007. Retrieved 21 November 2007.
  22. "The Eastern Coastal Plain". Rainwaterharvesting.org. Retrieved 19 November 2008.
  23. 23.0 23.1 "National Portal of India: Know India: State of UTs". Government of India. Archived from the original on 19 June 2010. Retrieved 19 November 2008.
  24. Majuli, River Island. "Largest river island". Guinness World Records. Retrieved 6 September 2016.
  25. 25.0 25.1 "Introduction to Inland Water Transport". Government of India. Archived from the original on 9 July 2012. Retrieved 19 November 2008.
  26. 26.0 26.1 26.2 Manorama Yearbook 2006 (India – The Country).
  27. Brahmaputra River, Encyclopædia Britannica
  28. Manorama Yearbook 2006 (India – Environment). p. 580.
  29. India Yearbook, p. 306
  30. India Yearbook, p. 309
  31. "Water profile of India". Encyclopedia of Earth. Retrieved 20 November 2008.
  32. Jain, J.K.; Farmer, B. H.; Rush, H.; West, H. W.; Allan, J. A.; Dasgupta, B.; Boon, W. H. (May 1977). "India's Underground Water Resources". Philosophical Transactions of the Royal Society of London. 278 (962): 507–22. Bibcode:1977RSPTB.278..507J. doi:10.1098/rstb.1977.0058.
  33. "Krishi World website". Krishiworld.com. Archived from the original on 9 June 2007. Retrieved 18 July 2007.
  34. 34.0 34.1 34.2 "Energy profile of India". Encyclopedia of Earth. Retrieved 20 November 2008.
  35. Chandrasekharam, D. "Geothermal Energy Resources of India". Indian Institute of Technology Bombay. Archived from the original on 17 December 2008. Retrieved 2 November 2008.
  36. 36.0 36.1 36.2 36.3 "India's Contribution to the World's Mineral Production". Ministry of Mines, Government of India. Archived from the original on 16 December 2008. Retrieved 20 November 2008.
  37. "India". CIA Factbook. Retrieved 16 June 2007.
  38. "Information and Issue Briefs – Thorium". World Nuclear Association. Archived from the original on 7 November 2006. Retrieved 1 June 2006.
  39. "Death of the Kolar Gold Fields". Rediff.com. Retrieved 21 November 2008.
  40. . "Updated world map of the Köppen–Geiger climate classification". (direct: Final Revised Paper)
  41. Climate Change: Myths and Realities. Jeevananda Reddy. p. 65. GGKEY:WDFHBL1XHK3.
  42. "India sets new heat record as temperatures soar". Channel NewsAsia. Archived from the original on 21 May 2016. Retrieved 2016-05-20.
  43. Binayak, Poonam. "Dras: The World's Second Coldest Inhabited Place". Culture Trip. Retrieved 2020-11-23.