రఘు బాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యర్రా రఘుబాబు
Raghubabu.jpg
జన్మ నామంరఘుబాబు
జననం (1960-10-10) 1960 అక్టోబరు 10 (వయస్సు: 59  సంవత్సరాలు)
ప్రముఖ పాత్రలు బన్నీ
మురారి
బంగారం
కబడ్డీ కబడ్డీ
దేశముదురు

రఘు బాబుగా ప్రసిద్ధిచెందిన యర్రా రఘు బాబు (జననం: 1960 అక్టోబరు 10)ప్రముఖ తెలుగు సినీ నటుడు. విలన్ గా, హాస్యనటుడిగా, క్యారక్టర్ ఆర్టిస్టుగా పలు పాత్రలు పోషించాడు. ఆయన తండ్రి గిరిబాబు కూడా తెలుగు వారికి సుపరిచితులైన నటుడు. ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించాడు. రఘుబాబు ఇంటికి పెద్ద కొడుకు. ఓ తమ్ముడు, చెల్లెలు ఉన్నారు.

పదేళ్ళ వయసులో అధ్యాపకులు పిల్లలందర్నీ కూడగట్టి శ్రీకృష్ణ తులాభారం నాటకం వేయించారు. అందులో ఆయన వసంతకుడి పాత్ర వేశాడు. దాన్ని ఒక్క ఏడాదిలో 22సార్లు ప్రదర్శించారు. ఆ నాటకం ఎంత ఆదరణ పొందిందంటే టిక్కెట్టు పెట్టి వేస్తే ఆరోజుల్లో పదివేలు వసూలయ్యాయి. ఆ డబ్బుల్తో రావినూతలలో అరుణ కళానిలయం అనే ఆడిటోరియం కట్టారు. అక్కడ ఇప్పటికీ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి.

సినిమాల్లో చేయడానికి గిరిబాబు 1973లో చెన్నై వెళ్లాడు. ఆయనతో పాటు రఘుబాబు వాళ్ళ అమ్మ, తమ్ముడు, చెల్లి కూడా వెళ్లిపోయారు. నాయనమ్మా తాతయ్యా మాత్రం రఘుబాబును రావినూతలలో వాళ్లదగ్గరే పెట్టుకున్నారు. అక్కడ ఆరోతరగతి దాకా చదివాడు.

ఆరో తరగతి పూర్తయ్యాక ఆయన్ను కూడా మద్రాస్‌ తీసుకెళ్లారు. అప్పట్లో అక్కడ పదోతరగతి దాకా తెలుగు మాధ్యమంలో బోధించే పాఠశాలలు ఉండేవి. దాంతో పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ఇంటర్మీడియట్‌కి వచ్చేసరికి మాత్రం ఇంగ్లిష్‌తో ఇబ్బందిపడ్డాడు. ఇంటర్‌ అయిపోయాక ఇంజినీరింగ్‌లో చేరాడు. ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరంలో ఉండగా గిరిబాబు సొంతంగా సినిమా తీశాడు. డబ్బు వ్యవహారాలు చూసుకోవడానికి మొదట్లో రఘుబాబు కూడా షూటింగ్‌కి వెళ్లేవాడు. అలాఅలా చదువు పూర్తిగా మానేసి సినిమాలోకంలో పడ్డాడు.

నట జీవితం[మార్చు]

గిరిబాబు నటుడే అయినప్పటికీ పిల్లల్ని సినిమాలకు దూరంగా ఉంచేవాడు. ఇంట్లో సినిమా వాతావరణమే ఉండేది కాదు. మామూలు మధ్యతరగతి కుటుంబం ఎలా ఉంటుందో అలాగే ఉండేది. కాబట్టి నటించాలన్న ఆలోచన మొదట్నుంచి లేదు. ప్రొడక్షన్‌ పనులు చూసుకోవడానికి ఫీల్డులోకి వచ్చాడు. కాబట్టి ఎప్పటికైనా నిర్మాత అయి మంచి సినిమాలు తీయాలన్న కోరిక బాగా ఉండేది.

1984 వచ్చేసరికి పూర్తిగా ఇండస్ట్రీలో స్థిరపడ్డాడు. కొన్ని కన్నడ, తమిళ్‌ సినిమాలు తెలుగులోకి డబ్‌ చేసి విడుదల చేశాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఆహుతి ప్రసాద్‌, శివాజీరాజా, చిన్నా, కిషోర్‌బాబు, మల్లి తదితరులు పరిచయమయ్యారు. వీళ్లందరూ మధు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొంది అవకాశాల కోసం మద్రాస్‌కు వచ్చారు.

ఇతడు నటుడవ్వాలని పరిశ్రమలోకి అడుగుపెట్టలేదు. ఇతనికి నిర్మాత అవ్వాలనిపించింది. దర్శకత్వమూ ఇష్టమే. సత్యారెడ్డిగారి వద్ద చేరి సినిమా నిర్మాణం గురించి తెలుసుకోవాలనుకొన్నాడు. అనుకోకుండా సత్యారెడ్డి చిత్రం 'దొంగలున్నారు జాగ్రత్త'లో ఇతడిని హీరోని చేశారు. ఆ సినిమా తర్వాత నటుడిగా పదేళ్లు విరామం వచ్చింది. అదృష్టం కొద్దీ దర్శకుడు కృష్ణవంశీగారి దృష్టిలో పడ్డంతో ఇతని జాతకమే మారిపోయింది. 'మురారి'లో మంచి పాత్ర ఇచ్చారు. అందులో ఓ మూర్ఖుడిన పాత్ర. తను చెప్పేదీ, ఆలోచించేదే సరైనదని వాదించే పాత్ర అది. ఆ పాత్రతో గుర్తింపు వచ్చింది

పారంభంలో ఎక్కువగా నెగెటివ్ పాత్రలే వచ్చాయి. గుర్తుండిపోయేది మాత్రం 'ఆది'లో న చేసిన గంగిరెడ్డి పాత్ర. దానికి తిరుగులేని పేరొచ్చింది. బాస్ ఏమన్నా గంగిరెద్దులా తలాడించే ఫాక్షనిస్ట్‌ పాత్ర . 'కుర్రాడు ఎలా ఉన్నాడ్రా' అని బాస్ నన్ను అడిగితే 'మాంచి బళ్ళెంలా ఉన్నాడన్నా' అంటుంటాడు . ఇక ఆ తరువాత వెనక్కి తిరిగిచూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

తర్వాత మళ్లీ వినాయక్‌గారు పిలిచారు. 'చెన్నకేశవరెడ్డి'లో నెగిటీవ్ టచ్ ఉన్న పాత్ర. నందమూరి బాలకృష్ణగారు సెట్లో చాలా ప్రోత్సహించేవారు. ప్రతీ దానికీ 'లాబరన్న...' అంటుంటాడు. ఈ మాట మాస్‌లోకి దూసుకుపోయింది. దాని తర్వాత 'అడిగోరా...లాబరన్న' అని అవుట్‌డోర్‌లో ఇతడిని చూసిన జనం కేకేసేవారు. ఏ నటుడుకైనా సరే ఇలాంటి ఆదరణే కావాలి. దాంతో ఇతని పేరు, ఫేసూ ముద్రించుకుపోయాయి

ఈతరం బాబూరావుగారి 'యజ్ఞం' సినిమాలోనూ ఫాక్షనిస్ట్‌ పాత్రే. కాకపోతే తర్వాత నిజాలు తెలుసుకుని మంచోడిగా మారతాడు. చివరికి చనిపోతాడు. దాంతో ప్రేక్షకుల్లో ఈ పాత్రపై సింపతీ పెరిగింది. ఎక్కువగా ఫ్యాక్షనిస్టు పాత్రలే వేసినా వేటికవి వేర్వేరు.

'కబడ్డీ కబడ్డీ' కూతతో ఇతని నట ప్రయాణం కామెడీ వైపుకి మళ్లింది. అందులో టీ అమ్ముతుంటాడు. 'కప్పు టీ...కప్పు టీ' అని అరుస్తుంటాడు. ఈ సినిమాలో కామెడీ గ్యాంగ్ చాలా ఉంది. అందులో ఇతనికీ కావల్సినంత పేరొచ్చింది

జంథ్యాల తర్వాత వినోదాత్మక చిత్రాలు చేయడంలో దిట్ట అనిపించుకొన్నది ఈవీవీ సత్యనారాయణ. 'బెండు అప్పారావు'లో ఇతని బాడీ లాంగ్వేజ్‌ని పూర్తిగా మార్చేశారాయన. కడుపుబ్బ నవ్వించే పాత్రిచ్చారు. 'రఘుబాబు ఈస్థాయిలో కామెడీ చేయగలడా?' అనిపించేంతలా చేశారు. అవటానికి పాలేరు పాత్రే, అయినా భలే పేరొచ్చింది.

ఈవీవీగారి శిష్యుడు సత్తిబాబు దర్శకత్వం వహించిన 'బెట్టింగ్ బంగార్రాజు'లో అమాయకుడిగా కనిపించి నవ్వించాడు. ఇదో కొత్తకోణం. ఉమ్మడి కుటుంబ సభ్యుల్లో అమాయకుడిని అవడంతో మిగతా వాళ్లు ఇతడిని ఆడిస్తారు, ఆడుకుంటారు. అమాయకంగా చేయాలంటే బాడీ లాంగ్వేజ్, మాటా, నడతా తీరుల్లో స్పష్టమైన మార్పు కనబరచాలి. దర్శకుడి సూచనలు, అవగాహనలతో ఆ పాత్రని పండించాడు. ఇతని ముఖంలో ఆ మాయా ఉందని ప్రేక్షకుల చేత అనిపించుకున్నాడు'.

ఇవన్నీ ఒకెత్తయితే అల్లు అర్జున్ 'బన్ని' సినిమాలో చేసిన గూండా పాత్ర ఒక ఎత్తు. ఓ సందర్భంలో ఇతని కళ్లు పోతాయి. ఆ తరువాత వీడి తిప్పలు చూసి జనం బాగా నవ్వుకొన్నారు. సీరియస్‌గా ఉంటాడు కానీ, ఆ పాత్రతో ఎంత వినోదం పండిందో? ఈ సినిమాకి నంది అవార్డు వస్తుందనుకొన్నాడు. కానీ రాలేదు.

క్రిష్ సినిమా 'కృష్ణం వందే జగద్గురుం'లో రానాకి బాబాయి పాత్ర. ఓ సందర్భంలో ప్రత్యర్థులు ఇతని నాలుక కోసేస్తారు. ఆ తరువాత వచ్చేసీన్‌లో ఇతడి నటన కంటతడిపెట్టించింది. నటుడిగా మంచి పేరొచ్చింది. గుడ్డి, మూగ ఇలాంటి పాత్రలు చేయాలని నటులు కోరుకుంటారు. ఎందుకంటే.. నటుడికి ఈ పాత్రలు ఓ పరీక్ష. ఆ పరీక్షలో ఇతడు నెగ్గాడు.

సుశాంత్ కరెంట్‌ సినిమాలో జాంపళ్లు అమ్ముతాడు. ఇప్పటికీ విశాఖ, రాజమండ్రి రైల్వేస్టేషన్లలో ఇతడిని కలిసినవాళ్లంతా. 'కరెంట్ సినిమాలో జామపళ్లు అమ్మారు కదండీ.. ఆ సీను భలే బాగుంటుందండీ..' అంటుంటారు

శ్రీనివాసరెడ్డి 'టాటా బిర్లా మధ్యలో లైలా'లో దొంగస్వామీజీ వేషం వేయించారు. ప్రజల్ని మాయ మాటలతో మోసం చేసి డబ్బులు గుంజేసే దొంగ సన్యాసి. అందులో ఇతని పాపులర్ డైలాగ్ 'ఆశ దోశ అప్పడం వడ'. ఈ డైలాగ్ ఆ తరువాతి కాలంలో చాలా పాపులర్ అయ్యింది.

సుకుమార్ సినిమా జగడంలో రామ్‌కి తండ్రిగా నటించే ఛాన్స్ ఇచ్చారు. చాలా బాధ్యతగల, బరువైన పాత్ర అది. ఇతని కరకు ఫేసులోంచి అంత సున్నితమైన హావభావాల్ని సుకుమార్‌గారు రాబట్టారు. ఈ సినిమా చూశాక వినాయక్ గారు రఘుబాబులో ఇలాంటి నటుడు దాగున్నాడా! అని ఇతని ముందే అన్నారు. ఇది చూసే క్రిష్ 'కృష్ణం వందే జగద్గురుం'లో అవకాశమిచ్చారు.

నటించిన చిత్రాలు[మార్చు]

తెలుగు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "First look:Powerful Balayya as Ruler!". Tupaki. Retrieved 7 November 2019.
  2. నమస్తే తెలంగాణ, సినిమా వార్తలు (17 May 2019). "ఆగ‌స్ట్‌లో 'గ్యాంగ్ లీడ‌ర్' హంగామా". మూలం నుండి 28 May 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 28 May 2019. Cite news requires |newspaper= (help)
  3. సాక్షి, సినిమా (13 May 2019). "ఇంజినీరింగ్‌ నేపథ్యంలో..." మూలం నుండి 28 May 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 28 May 2019. Cite news requires |newspaper= (help)
  4. "jeevi review for Adda". idlebrain.com. Retrieved 16 July 2019. Cite web requires |website= (help)

ఇతర లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రఘు_బాబు&oldid=2767171" నుండి వెలికితీశారు