అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్

వికీపీడియా నుండి
(ఆహుతి ప్రసాద్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్
Ahuthi prasad.jpg
నటుడు ఆహుతి ప్రసాద్
జననంఅడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్
జనవరి 2, 1958
కోడూరు (ముదినేపల్లి)
మరణం2015 జనవరి 4 (2015-01-04)(వయసు 57)
హైదరాబాద్
మరణ కారణముక్యాన్సర్
నివాస ప్రాంతంహైదరాబాదు మరియు సింధనూరు
ఇతర పేర్లుఆహుతి ప్రసాద్
వృత్తినటుడు, నిర్మాత, బిల్డర్
పిల్లలుఇద్దరు కుమారులు , భరణి ప్రసాద్
కార్తీక్ ప్రసాద్[1][2]
తల్లిదండ్రులురంగారావు, హైమవతి

ఆహుతి ప్రసాద్ (జనవరి 2, 1958 - జనవరి 4, 2015) తెలుగు సినీ నటుడు. క్యారెక్టర్ నటునిగా, హాస్య నటునిగా గుర్తింపు పొంది 300 పైచిలుకు సినిమాల్లో నటించారు. 1983-84ల్లో మధు యాక్టింగ్ స్కూల్లో నటన నేర్చుకున్నాకా విక్రమ్ తో నటునిగా పరిచయం అయ్యాడు. కొద్ది సినిమాల్లో, ఒక సీరియల్లో నటించాకా ఆహుతి (1987) సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆహుతి సినిమా ఘన విజయం సాధించింది, సినిమాలో ప్రసాద్ పోషించిన శంభు ప్రసాద్ పాత్రకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించి అప్పటి నుంచి ఆహుతి ప్రసాద్ గా పేరొందాడు. ఆ తర్వాత అనేక సినిమాల్లో పోలీసు పాత్రలు, రాజకీయ నాయకుని పాత్రలు చేశాడు. 1990లో పోలీసు భార్య పునర్నిర్మాణం చేసి కన్నడంలో నిర్మాతగా మారి 3 సినిమాలు తీశాడు. తొలి సినిమా విజయవంతం అయినా, మిగతా సినిమాల పరాజయం పాలై అప్పుల పాలు చేశాయి. తెలుగులోనూ అవకాశాలు రాకపోడంతో దాదాపు 4 సంవత్సరాల పాటు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. నిన్నే పెళ్ళాడుతా (1996) సినిమాలో కథానాయిక తండ్రిగా చేసిన పాత్రతో తిరిగి సినిమా అవకాశాలు పెరిగాయి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను సినిమాలో నటనకు గాను 2002 సంవత్సరానికి గాను ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారం అందుకున్నాడు. చందమామ (2007) సినిమాలో పోషించిన రామలింగేశ్వరరావు పాత్ర హాస్యం, విభిన్నమైన సంభాషణ శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చందమామలో నటనకు గాను 2007 సంవత్సరానికి ఉత్తమ క్యారెక్టర్ నటుడు - గుమ్మడి విభాగంలో నంది అవార్డు పొందారు. ఆ సినిమా తర్వాత కెరీర్ మళ్ళీ మలుపు తిరిగి పలు హాస్య పాత్రలు చేసే అవకాశం వచ్చింది. నిర్మాణ రంగంలో బిల్డర్ గా వ్యాపారం కూడా చేశాడు. 2015 జనవరి 4న క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించాడు.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

1958 జనవరి 2కోడూరు (ముదినేపల్లి)లో జన్మించారు. వారిది వ్యవసాయ కుటుంబం. నాన్న రంగారావు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయనకు ముగ్గురు అక్కలు. అన్నదమ్ములెవరూ లేరు. కోడూరులో ఉన్న ఏడెనిమిది ఎకరాలు అమ్మేసి కర్నూలు సమీపంలో శాంతినగరం అనే చోట భూములు కొని మూడునాలుగేళ్ల వయసులోనే శాంతినగరానికి వచ్చేశారు. శాంతినగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని చంద్రశేఖరనగరం అనేచోట తాత, నాయినమ్మ కూడా ఉండేవారు. చివరికి రాయచూరు సమీపంలోని సింధనూరు దగ్గర పాండురంగ క్యాంప్‌లో స్థిరపడ్డారు. క్యాంపులో పెరిగినందువల్ల కన్నడ భాష బాగా పట్టుబడింది. ఆయన విద్యాభ్యాసం నాగార్జునసాగర్, డోన్, కోదాడ ప్రాంతాల్లో సాగింది. ఆయన కళాశాల విద్య కోదాడలో పూర్తిచేశారు. చిన్నతనం నుంచీ నటనపై ఆసక్తి ఉండేది. 9వ తరగతి చదువుతున్నప్పుడు అన్నాచెల్లెళ్ళు నాటకంలో తన నటనకు మొదటి బహుమతి రావడంతో నటుడు కావాలనే కోరిక ప్రారంభమై, అతనితో పెరిగి పెద్ద అయింది.[3]

సినిమా కెరీర్[మార్చు]

1983 జనవరి 26న హైదరాబాద్‌లో ప్రారంభమైన మధు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ లో ప్రసాద్ మొదటి బ్యాచ్ లో చేరాడు. నటుడు అచ్యుత్, శివాజీరాజా, రాంజగన్ వంటి నటులు ఆయన సహ విద్యార్థులుగా ఉండేవారు. వారికి దేవదాస్ కనకాల వంటివారు నటన నేర్పించేవారు. 1984లో డిప్లొమా పూర్తి కావడంతో తన బ్యాచ్ మేట్స్ అందరూ అప్పటికీ తెలుగు సినిమా పరిశ్రమ కేంద్రమైన మద్రాసు (నేటి చెన్నై) వెళ్ళి సినిమా ప్రయత్నాలు చేసుకుంటూండగా, పెళ్ళి అయి హైదరాబాద్ లోనే కాపురం పెట్టిన ప్రసాద్ మద్రాసు మారలేకపోయారు. ప్రసాద్ సమస్య గమనించిన మధుసూదనరావు మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ నిర్వహణ బాధ్యతలు ఇచ్చారు.

కొన్నాళ్ల తర్వాత మధుసూదనరావు దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉషాకిరణ్ మూవీస్ వారి మల్లె మొగ్గలు సినిమాకి పనిచేశారు. ఆయన పనిచేస్తున్న రెండో సినిమా విక్రమ్ లో తొలిసారిగా నటించారు. తాతినేని ప్రకాశరావు దూరదర్శన్ కోసం చేస్తున్న మీరూ ఆలోచించండి కార్యక్రమంలో ప్రసాద్ కు అవకాశం ఇచ్చారు. ప్రతాప్‌ఆర్ట్స్‌ థియేటర్‌లో ఆ సినిమాకి డబ్బింగ్‌ చెప్పడానికి వెళ్ళినపుడు అక్కడ వారికి రాఘవగారబ్బాయి ప్రతాప్‌ పరిచయమయ్యాడు. తర్వాత వాళ్ల బ్యానర్‌లో 'ఈ ప్రశ్నకు బదులేది' అనే సినిమా తీస్తున్నప్పుడు అందులో అతడిని విలన్‌గా తీసుకున్నారు.

నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి ఆ సినిమా ఫస్ట్‌కాపీ చూశారు. అప్పటికే ఆయన 'తలంబ్రాలు' తీశారు, రెండో సినిమాగా ఆహుతి నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 'ఈ ప్రశ్నకు బదులేది'లో ఆయన నటన ఆయనకు బాగా నచ్చి 'ఆహుతి'లో శంభుప్రసాద్‌ పాత్రకు తీసుకున్నారు. 1987లో విడుదలైన ఆహుతి సినిమా ఘనవిజయం సాధించడంతో పాటుగా అందులో శంభు ప్రసాద్ గా చేసిన పాత్ర ప్రసాద్ నట జీవితాన్ని మలుపుతిప్పింది. ఆంధ్రప్రభ పత్రికలో పనిచేసిన సినీ జర్నలిస్టు ఆంజనేయశాస్త్రి ఇంటర్వ్యూలో ఆహుతి ప్రసాద్ అని రాయడంతో ప్రారంభమై, అతని పేరు ఆహుతి ప్రసాద్ గా మారిపోయింది.

ఆహుతి ప్రసాద్ ఆహుతి సినిమా విజయాన్ని, తద్వారా తన పాత్రకు, తనకు లభించిన గుర్తింపునీ సరిగా ఉపయోగించుకోలేకపోయారు. కానీ సినిమా విజయంతో చాలా పాత్రలే వచ్చి, వాటిని చేసుకుంటూ వెళ్ళారు. ప్రసాద్ నటించిన పోలీస్ భార్య సినిమా విజయవంతం కావడంతో ఆ సినిమా హక్కులు కొని కన్నడలో నిర్మాణం చేశారు. విజయవంతం కావడంతో మరో రెండు సినిమాలు తీయగా అందులో ఒకటి దారుణమైన పరాజయం పాలైంది. దాంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాడు. మరోవైపు కన్నడ సినిమా నిర్మాతగా బిజీగా ఉన్నప్పుడు అందుబాటులో ఉండడేమోనన్న ఉద్దేశంతో తెలుగులో పాత్రలు తగ్గిపోయాయి. నాలుగు సంవత్సరాల పాటు ఎటూ కాని స్థితి ఎదుర్కొన్నారు.

1996లో దర్శకుడు కృష్ణవంశీ తన నిన్నే పెళ్ళాడతా సినిమాలో కథానాయిక టబు తండ్రిగా ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇవ్వడంతో మళ్ళీ సినిమా అవకాశాలు రావడం ప్రారంభం అయ్యాయి. స్థిరాస్థి వ్యాపారంలోకి ప్రవేశించి, ఇటు సినిమాల్లో తండ్రి పాత్రలు, పోలీసు అధికారి పాత్రలు చేయడం కొనసాగించారు. దాదాపు దశాబ్ది కాలం పాటు అటువంటి పాత్రలు పోషించారు.

తిరిగి 2007లో కృష్ణవంశీ చందమామ సినిమాలో కథానాయకుడి తండ్రి రామలింగేశ్వరరావు పాత్ర ఇచ్చారు. గోదావరి జిల్లా యాసలో విలక్షణమైన నటనతో చెప్పిన డైలాగులు సినిమా విజయానికి తోడ్పడడంతో ఆహుతి ప్రసాద్ కెరీర్ మరో మలుపు తిరిగింది. కొత్తబంగారులోకం, బెండు అప్పారావు, సిద్ధు ఫ్రమ్‌ శ్రీకాకుళం వంటి సినిమాల్లో హాస్యాన్ని పండించే పాత్రలు పోషించారు.[4][3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

1982లో విజయనిర్మలతో ప్రసాద్ వివాహం జరిగింది. వారి కొడుకులు భరణి, కార్తీక్ విదేశాల్లో స్థిరపడ్డారు.[3]

పురస్కారాలు, గౌరవాలు[మార్చు]

నేను నిన్ను ప్రేమిస్తున్నాను సినిమాలో ప్రతినాయక పాత్రలో ఆహుతి ప్రసాద్ నటనకు గాను 2002 సంవత్సరానికి ఉత్తమ ప్రతినాయకుడుగా నంది పురస్కారం అందుకున్నారు.[5] 2007 సంవత్సరానికి గాను నంది పురస్కారాల్లో ఉత్తమ క్యారెక్టర్ నటుడు - గుమ్మడి పురస్కారాన్ని చందమామ సినిమాలో రామలింగేశ్వరరావు పాత్రలో నటనకు గాను అందుకున్నారు.[6]

నటించిన చిత్రాలు[మార్చు]

తెలుగు[మార్చు]

 1. విక్రమ్ (1986)
 2. ఆహుతి (1988)
 3. శాంతి-క్రాంతి (1991)
 4. అసెంబ్లీరౌడీ (1991)
 5. ఘరానా మొగుడు (1992)
 6. సూపర్ పోలీస్ (1994)
 7. నిన్నే పెళ్ళాడతా (1996)
 8. ప్రేమించుకుందాం రా (1997)
 9. అనగనగా ఒక రోజు (1997)
 10. శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి (1998)
 11. సమరసింహా రెడ్డి (1999)
 12. సీతారామరాజు (1999)
 13. స్వయంవరం (1999)
 14. సూర్యవంశం (1999)
 15. కలిసుందాం రా (2000)
 16. దేవి పుత్రుడు (2000)
 17. జయం మనదేరా (2000)
 18. చిరంజీవులు (2001)
 19. మా ఆయన సుందరయ్య (2001)
 20. అప్పారావుకి ఒక నెల తప్పింది (2001)
 21. ముత్యం (2001)
 22. నువ్వు నేను (2001)
 23. చెప్పాలని ఉంది (2001)
 24. అమ్మాయి నవ్వితే (2001)
 25. నువ్వు లేక నేను లేను (2002)
 26. ఆది (2002)
 27. ఇంద్ర (2002)
 28. సంతోషం (2002)
 29. ఆయుధం (2003)
 30. ఒకరికి ఒకరు (2003)
 31. వసంతం (2003)
 32. నేను పెళ్ళికి రెడీ (2013)
 33. జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
 34. ఠాగూర్ (2003)
 35. లక్ష్మీనరసింహా (2004)
 36. మల్లీశ్వరి (2004)
 37. వెంకీ (2004)
 38. సాంబ (2004)
 39. గౌరీ (2004)
 40. మనసు మాటవినదు (2005)
 41. బన్నీ (2005)
 42. శ్రీ (2005)
 43. గౌతమ్ ఎస్.ఎస్.సి (2005)
 44. మిస్టర్ ఎర్రబాబు ఇంటర్మీడియట్ (2005)
 45. అతనొక్కడే (2005)
 46. ప్రేమికులు (2005)
 47. నాయకుడు (2005)
 48. డేంజర్ (2005)
 49. లక్ష్మి (2006)
 50. అసాధ్యుడు (2006)
 51. చుక్కల్లో చంద్రుడు (2006)
 52. పెళ్ళైనకొత్తలో (2006)
 53. సీతారాముడు (2006)
 54. సామాన్యుడు (2006)
 55. చందమామ (2007)
 56. వియ్యాలవారి కయ్యాలు (2007)
 57. వేడుక (2007)
 58. ఆట (2007)
 59. యమగోల మళ్ళీ మొదలైంది (2007)
 60. మధుమాసం (2007)
 61. నవ వసంతం (2007)
 62. బలాదూర్ (2008)
 63. హోమం (2008)
 64. గుండె ఝల్లుమంది (2008)
 65. గజి బిజి (2008)
 66. సిద్దు ఫ్రం శ్రీకాకుళం (2008)
 67. బుజ్జిగాడు (2008)
 68. పౌరుడు (2008)
 69. కొత్త బంగారు లోకం (2008)
 70. ఏకలవ్యుడు (2008)
 71. శశిరేఖా పరిణయం (2009)
 72. అధినేత (2009)
 73. మిత్రుడు (2009)
 74. నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్ (2009)
 75. అరుంధతి (2009)
 76. రైడ్ (2009)
 77. బోణీ (2009)
 78. ఆ ఇంట్లో (2009)
 79. మహాత్మ (2009)
 80. ఆంజనేయులు (2009)
 81. బెండు అప్పారావ్ ఆర్. ఎం. పి (2009)
 82. రెచ్చిపో (2009)
 83. సరదాగా కాసేపు (2010)
 84. బృందావనం (2010)
 85. ఒక్క క్షణం (2010)
 86. శంభో శివ శంభో (2010)
 87. బావ (2010)
 88. కళ్యాణ్ రామ్ కత్తి (2010)
 89. కత్తి కాంతారావు (2010)
 90. చలాకీ (2010)
 91. వరుడు (2010)
 92. బిందాస్ (2010)
 93. లీడర్ (2010)
 94. డార్లింగ్ (2010)
 95. ఝుమ్మందినాదం (2010)
 96. ఏం పిల్లో ఏం పిల్లడో (2010)
 97. పోలీస్ పోలీస్ (2010)
 98. వాంటెడ్ (2011)
 99. అహ నా పెళ్ళంట (2011)
 100. నేను నా రాక్షసి (2011)
 101. నగరం నిద్ర పోతున్న వేళ (2011)
 102. దగ్గరగా దూరంగా (2011)
 103. మడతకాజా (2011)
 104. ఊసరవెల్లి (2011)
 105. బెజవాడ (2011)
 106. మిస్టర్ పర్‌ఫెక్ట్ (2012)
 107. నా ఇష్టం (2012)
 108. లవ్‌లీ (2012)
 109. దమ్ము (2012)
 110. ఢమరుకం (2012)
 111. శ్రీమన్నారాయణ (2012)
 112. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013)
 113. ప్రియతమా నీవచట కుశలమా (2013)[7]
 114. ఒంగోలు గిత్త (2013)
 115. మిస్టర్ పెళ్ళికొడుకు (2013)
 116. జెఫ్ఫా (2013)
 117. గుండెజారి గల్లంతయ్యిందే (2013)
 118. గ్రీకు వీరుడు (2013)
 119. ఓం 3D (2013)
 120. అత్తారింటికి దారేది (2013)
 121. దూసుకెళ్తా (2013)
 122. పిల్లా నువ్వు లేని జీవితం (2014)
 123. రౌడీ ఫెలో (2014)
 124. కొత్త జంట (2014)
 125. పట్టపగలు (2015)
 126. శంకర (2016)[8]
 127. రుద్రమదేవి (2015)

మరణం[మార్చు]

గత కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని కిమ్స్ చికిత్స పొందుతూ 2015, జనవరి 4 ఆదివారం మధ్యాహ్నం మరణించారు.

మూలాలు[మార్చు]

 1. "Telugu actor Ahuti Prasad dies of cancer". sakshipost.com. Jan 4, 2015. Retrieved Jan 4, 2015. Cite web requires |website= (help)
 2. "Ahuti Prasad Died". aptoday.com. Jan 4, 2015. Retrieved Jan 4, 2015. Cite web requires |website= (help)
 3. 3.0 3.1 3.2 ఆహుతి, ప్రసాద్. "21 ఏళ్ళ తర్వాత మబ్బులు వీడిన 'చందమామ'" (Interview). ఇంటర్వ్యూ చేసిన వారు: వేమూరి రాధాకృష్ణ. Retrieved 6 June 2017. Unknown parameter |program= ignored (help)
 4. ఈనాడు, బృందం (11 July 2010). "పేరు మార్చుకోమన్నారు". ఈనాడు ఆదివారం: 20, 21. Retrieved 6 June 2017.
 5. ఐడిల్ బ్రెయిన్లో 2002 నంది పురస్కారం విజేతల జాబితా
 6. వెబ్సైట్, ప్రతినిధులు. "Nandi awards 2007 announced". ఐడిల్ బ్రెయిన్. Retrieved 6 June 2017.
 7. The Times of India, Movie Reviews (23 March 2013). "Priyathama Neevachata Kusalama". Sashidhar. మూలం నుండి 16 September 2015 న ఆర్కైవు చేసారు. Retrieved 13 July 2019. Cite news requires |newspaper= (help)
 8. "Nara Rohit's 'Shankara' audio soon". 123telugu.com. Retrieved 9 July 2019. Cite web requires |website= (help)
 • జూలై 11, 2010, ఈనాడు ఆదివారం అనుబంధం కోసం నేను చేసిన ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు

బయటి లంకెలు[మార్చు]