సిరివెన్నెల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిరివెన్నెల
దర్శకత్వంకె . విశ్వనాథ్
రచనకె.విశ్వనాథ్
నిర్మాతఏడిద నాగేశ్వరరావు
తారాగణంసర్వదమన్ బెనర్జీ, సుహాసిని, మున్ మున్ సేన్, మీనా, సంయుక్త
ఛాయాగ్రహణంఎం. వి. రఘు
కూర్పుజి. జి. కృష్ణారావు
సంగీతంకె.వి.మహదేవన్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
కె. వి. మహదేవన్ సంగీత దర్శకత్వం వహించాడు.
సినిమా నిడివి
181 నిమిషాలు
భాషతెలుగు

సిరివెన్నెల 1986లో విడుదలైన శాస్త్రీయ సంగీత ప్రాధాన్యమున్న తెలుగు చలన చిత్రం. కళాతపస్వి కె.విశ్వనాథ్ దీనికి దర్శకత్వం వహించారు.ఈ చిత్రాన్ని ఏడిద నాగేశ్వరరావు పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు.

ఈ సినిమా కథ ఒక అంధుడైన వేణు విద్వాంసుడు హరిప్రసాద్, మూగదైన చిత్రకారిణి చుట్టూ తిరుగుతుంది. కె. వి. మహదేవన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని పాటలన్నీ మంచి ప్రజాదరణ పొందాయి. ఈ సినిమాలో అన్ని పాటలు సీతారామ శాస్త్రి వ్రాసారు . ఈయనకు పాటల రచయితగా ఇదే మొదటి చిత్రం. ఈ సినిమాతో చేబ్రోలు సీతారామ శాస్త్రి, తెరమీద సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా తన పేరు మార్చుకున్నారు . విధాత తలపున ప్రభవించినదీ పాటకు సీతారామ శాస్త్రి ఉత్తమ గేయరచయితగా, ఉత్తమ గాయకుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు. మూన్ మూన్ సేన్ ఉత్తమ సహాయనటిగా, ఎం. వి. రఘు ఉత్తమ ఛాయా గ్రాహకుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు.

జైపూర్ సమీపంలోని ఒక గ్రామంలో హరిప్రసాద్ అనే ఒక అంధుడైన వేణుగాన కళాకారుడు తన చెల్లెలితో కలిసి నివసిస్తుంటాడు. అది ఒక పర్యాటక ప్రదేశం. అతనికి శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం లేకపోయినా అక్కడికి వచ్చే పర్యాటకులకోసం అద్భుతమైన పాటలు వాయించి దాని ద్వారా వచ్చిన సొమ్ముతో జీవనం సాగిస్తుంటాడు. ఒకసారి పర్యాటకులతో పాటు వచ్చిన జ్యోతిర్మయి అనే గైడ్ అతని వేణుగానానికి ముగ్ధురాలవుతుంది. ఆమె అతనిలో ఉన్న నిగూఢమైన ప్రతిభను గుర్తించి దానిని సానబెట్టడానికి సహాయం చేస్తుంది. అతనికి ప్రకృతి స్వభావాన్ని పరిచయం చేస్తుంది. ఆమె సాయంతో కొన్నేళ్ళకు అతను గొప్ప విద్వాంసుడిగా పేరు తెచ్చుకుంటాడు. హరిప్రసాద్ ఆమెకు తెలియకుండానే మనసులో ఆమెను ఆరాధిస్తుంటాడు. తన ఆల్బమ్స్ ఆమెకు అంకితం చేస్తూ ఉంటాడు. ఇంతలో మాటలు రాని సుభాషిణి అనే చిత్రకారిణి హరిప్రసాద్ ని ఆరాధించడం మొదలుపెడుతుంది.

సుభాషిణి హరిప్రసాద్ పట్ల ఆమెకున్న అభిమానాన్ని తన చిత్రాలలో కనబరుస్తూ ఉంటుంది. నెమ్మదిగా ఆమె సోదరుడు ఆమెకు హరిప్రసాద్ పట్ల ఉన్న అనురాగాన్ని అర్థం చేసుకుంటాడు. హరిప్రసాద్ మామయ్యను కలిసి సంబంధం మాట్లాడతాడు. కానీ అప్పుడే హరిప్రసాద్ తనకు జ్యోతిర్మయి మీదున్న అభిమానాన్ని బయటపెడతాడు. ఇది తెలుసుకున్న జ్యోతిర్మయి తాను గతంలో ధనవంతులైన పర్యాటకులతో గడిపిన విషయం గుర్తుకువచ్చి తాను అతనికి సరిపోనని భావిస్తుంది. ఆమె హరిప్రసాద్ కి ఈ విషయాన్ని పరోక్షంగా తెలియబరచాలని ప్రయత్నిస్తుంది కానీ తన శరీరం మీద ప్రేమ లేని అతని స్వచ్ఛమైన ప్రేమను చూసి ఆ ప్రయత్నాలు మానుకుంటుంది. ఆమె కూడా మనసులో అతన్ని ఆరాధిస్తుంటుంది కానీ మనసులో ఏ మూలనో తాను అతనికి తగనని భావిస్తూ ఉంటుంది. చివరికి తనకు ఓ వైద్యుడితో నిశ్చితార్థం అయింది కాబట్టి అతన్ని పెళ్ళి చేసుకోలేనని చెబుతుంది. ఆమె సంతోషాన్నే కోరుకున్న హరిప్రసాద్ ఆమె పెళ్ళికి ఏర్పాట్లు చేస్తాడు.

ఆమె పెళ్ళి రోజే తన కళ్ళను హరిప్రసాద్ కి దానమివ్వమని లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంటుంది. తన చావు యాత్ర పెళ్ళి యాత్ర లాగా జరగాలనీ, హరిప్రసాద్ కి ఆ విషయం తెలియకూడదని కూడా కోరుకుంటుంది. అందరూ ఆమె కోరిక మేరకు ఆమెను అత్తారింటికి పంపుతున్నట్లే శ్మశానానికి పంపుతారు. హరిప్రసాద్ ఇదంతా ప్రశాంతంగా గమనిస్తూ చివరికి ఆమె సమాధి దగ్గరకు వెళ్ళి తన నివాళులర్పిస్తాడు. అది విచిత్రంగా చూస్తున్న సుభాషిణికి తన దేవత తనకు దూరమైన సంగతి తన దగ్గర ఎవ్వరూ దాచలేరని చెబుతాడు. ఇద్దరూ మౌనంగా జ్యోతిర్మయి సమాధికేసి చూస్తూ ఉండగా కథ ముగుస్తుంది.

నటవర్గం

[మార్చు]

విశేషాలు

[మార్చు]

సీతారామశాస్త్రి ఈ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి, ఈ సినిమా పేరునే ఇంటి పేరు గా నిలుపుకున్నారు. కె.వి.మహదేవన్ సంగీతంతో పాటు ప్రఖ్యాత వేణువాద విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా తన వేణునాద సహకారాన్ని అందించారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఓంకార సంబంధమున్న విధాత తలపున ప్రభవించినది... ( ఈ పాటను రాయడానికి సీతారామశాస్త్రికి వారం రోజులు పట్టింది) అనే గీతంలో సాహిత్యం పలువురి ప్రశంసలు పొందింది. ఈ సినిమాలోని ఇతర పాటలలో చందమామ రావే జాబిల్లి రావే ..., ఆది భిక్షువు వాడినేమి కోరేదీ, బూడిదిచ్చే వాడినేమి అడిగేదీ, ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు, మెరిసే తారలదే రూపం తదితర గీతాలు విశేషంగా అలరించాయి.

చిత్రీకరణ

[మార్చు]

ఈ సినిమాలో చాలాభాగం రాజస్థాన్ లో జైపూర్ లో చిత్రీకరించారు. మొదట్లో చిత్రీకరణ కోసం అక్కడకు వెళ్ళిన వారికి జైపూర్ పర్యాటక శాఖ అధికారులు కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకోమన్నారు. అనుమతి కోసం అజ్మీర్ జిల్లా కలెక్టరును కలవడానికి వెళ్ళగా ఆయన శంకరాభరణం సినిమాకు అభిమాని కావడంతో విశ్వనాథ్ ని గుర్తుపట్టి సులభంగా అనుమతి ఇప్పించాడు. [1]

సంగీతం

[మార్చు]

కె. వి. మహదేవన్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చాడు. ప్రముఖ వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా వేణునాద సహకారం అందించాడు.

ఈ చిత్రంలోని అన్ని పాటలను రచించిన వారు:సిరివెన్నెల సీతారామశాస్త్రి; అన్ని పాటలకు సంగీతం సమకూర్చినవారు:కె.వి.మహదేవన్.

పాటలు
సం.పాటగానంపాట నిడివి
1."ఆది భిక్షువు వాడినేమి కోరేదీ"ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 
2."ఈ గాలి ఈ నేల"ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 
3."చినుకు చినుకు"ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 
4."చందమామ రావే జాబిల్లి రావే"ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల 
5."పాటల్లో"ప్రకాశ రావు, పి.సుశీల 
6."పొలిమేరు దాటిపోతున్న"ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, బి. వసంత 
7."ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలు"ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 
8."మెరిసే తారలదే రూపం"ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 
9."విధాత తలపున ప్రభవించినది"ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 

పురస్కారాలు

[మార్చు]
సంవత్సరం ప్రతిపాదించిన విభాగం పురస్కారం ఫలితం
1986 సిరివెన్నెల సీతారామశాస్త్రి
("విధాత తలపునకు ప్రభవించినది" రచనకు)[2]
నంది ఉత్తమ గీత రచయితలు గెలుపు
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం
("విధాత తలపునకు ప్రభవించినది" గానమునకు)
నంది ఉత్తమ గాయకుడు గెలుపు
మూన్ మూన్ సేన్ నంది ఉత్తమ సహాయనటీమణులు గెలుపు
ఎం. వి. రఘు[3] నంది ఉత్తమ ఛాయాగ్రహకులు గెలుపు

మూలాలు

[మార్చు]
  1. బి, మధులత. "ఆ పాటను ప్రత్యేకంగా చెప్పి రాయించుకున్నా". eenadu.net. ఈనాడు. Archived from the original on 10 May 2017. Retrieved 10 May 2017.
  2. హెచ్ఎంటివి, మిక్చర్ పొట్లం (12 November 2018). ""విధాత తలపున ప్రభవించినది" అనే ఈ పాట!". Archived from the original on 22 December 2020. Retrieved 22 December 2020.
  3. "The saga of a lensman". The Hindu. Chennai, India. 9 June 2003. Archived from the original on 23 October 2003. Retrieved 3 December 2013.

బయటి లింకులు

[మార్చు]