అక్షాంశ రేఖాంశాలు: Coordinates: Unknown argument format

నైమిశారణ్యం

వికీపీడియా నుండి
(నైమిశారణ్యము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Naimisaranya
Naimisaranya is located in Uttar Pradesh
Naimisaranya
Naimisaranya
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
ప్రదేశం
దేశం:India
రాష్ట్రం:Uttar Pradesh
ప్రదేశం:Naimisaranya
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:Deva Rajan
(Vishnu)
ప్రధాన దేవత:Pundarikavallai
(Lakshmi)
పుష్కరిణి:Chakra
కవులు:Tirumangai Alvar

నైమిశారణ్యం (Naimisha Forest) వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి. ఇక్కడ వనరూపిగా నున్న స్వామికే ఆరాధన జరుగుతుంది. ఆళ్వార్లు కీర్తించిన సన్నిధిగాని పెరుమాళ్ళు గాని ఇక్కడ లేవు. నైమిశారణ్యం ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌ జిల్లాలో లక్నోకు 94కి.మీ. దూరంలో ఉంది. గోమతినది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం వేలాది సాధు సన్యాసులు తపమాచరించే పవిత్ర ప్రదేశం. వేదవ్యాసుడు నైమిశారణ్యంలోనే మహాభారతాన్ని రచించినట్టు తెలుస్తోంది. మహా భారతం, రామాయణం, వాయుపురాణం, వరాహపురాణాల్లో నైమిశారణ్య ప్రస్తావన ఉంది. వేదవ్యాసుడు వేదాలను, అన్ని పురాణాలను తన శిష్యులకు బోధించిన పరమ పావన ప్రదేశం నైమిశారణ్యం.

ఒకప్పుడు మునులు బ్రహ్మ వద్దకు పోయి భూమి మీద తపస్సు చేయుటకు తగిన స్థలమేదని ప్రశ్నింపగా బ్రహ్మ దర్భతో నొక వలయము చేసి భూమిపై విడచి ఇది పడిన చోట తపస్సు చేయదగిన స్థలమని చెప్పెనట. అది పడిన చోటే నైమిశారణ్యము. ఇచట గోమతీ నది ప్రవహిస్తుంది. ఇక్కడ మహర్షులు అనేక యజ్ఞయాగాదులు చేశారు. ఆ సమయంలో సూతుడు అష్టాదశ పురాణాలు వినిపించాడు.

ఈ అరణ్యంలో దాదాపు 84 వేలమంది మునులతో శౌనక మహర్షి సమావేశమై భాగవత పారాయణం చేశాడని చెబుతారు. వేదవ్యాసుడు మహాభారతగాథను మొదట తన కుమారుడు శుకమహర్షికి ఇక్కడే చెప్పాడు. వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు ఇక్కడే ఓ మహాయాగం నిర్వహించి మహాభారత పారాయణం చేశాడు. వైశంపాయనుడు చెప్పిన కథను సూతుడు మరోసారి శౌనకాది మునులందరికీ ఇక్కడే చెప్పాడు. సత్యనారాయణ వ్రతవిధానాన్ని కూడా మొదట నైమిశారణ్యంలోనే సూతమహాముని శౌనికాదులకు వివరించాడు. ఇలా ఎంతో ప్రాధాన్యముంది ఈ అరణ్యానికి. ఇక్కడ వ్యాసమహర్షి ఆశ్రమం, దధీచి ఆశ్రమంతోపాటు కొన్ని దేవాలయాలూ ఉన్నాయి.

పేరువెనుక చరిత్ర

[మార్చు]

ఆదిలోకంలో లోకహితార్ధమై బ్రహ్మమనోమయమగు నొక చక్రమును గల్పించెను. ఆ చక్రమును సత్యలోకమునుండి దొర్లించెను. (నేమి అంటే బండి చక్రపు కమ్మి అని అర్ధం) ఆ చక్రము దొర్లి దొర్లి అన్ని లోకములు దాటి భూలోకమునందు వ్రాలెను. అమిత వేగమున వచ్చి వచ్చి భూమిట్ట పల్లములలో చక్రముకమ్మి విచ్చి పోయిన ప్రదేశములో "నైమిశ" మయ్యెను . ఆ ప్రదేశములోని వనము గూడ నైమిశారణ్యమయ్యెను.

వాయు పురాణాన్ని అనుసరించి దీనికి సంబంధించిన ఒక గాథ ప్రాచుర్యంలో ఉంది. మహాభారత యుద్ధం అనంతరం కలియుగ ఆరంభం అయే సమయంలో సౌనకాది మహామునులు కలియుగ ప్రభావం లేని పవిత్ర ప్రదేశాన్ని తాము యజ్ఞం నిర్వర్తించుకునేందుకు చూపమని బ్రహ్మను ప్రార్థిస్తారు. బ్రహ్మ ఒక పెద్ద చక్రాన్ని సృష్టించి ఈ చక్రం వెంట కదిలివెళ్ళండి ఈ మనోమాయా చక్రం ఏ ప్రదేశంలో ఆగి విరిగిపోతుందో ఆ ప్రదేశం చాలా పవిత్రమైనది, యజ్ఞర్హత గలది అని చెబుతాడు. మునులంతా చక్రాన్ని అనుసరించి వెళ్ళగా ఈ నైమిశారణ్య ప్రాంతంలో ఒకచోట చక్రం ఆగి విరిగిపోతుంది. చక్రం విరిగిన ప్రదేశంలో ఉదృత రూపంలో జలం ఉద్భవించి లింగాకృతిలో పొంగి ప్రవహిస్తుంది. మహాశక్తి ఆ ప్రవాహాన్ని ఆపివేస్తుంది. ఈ పవిత్ర ప్రాంతం శక్తిపీఠంగా రూపొంది లింగధారిణి శక్తి రూపం అయిన లలితా దేవి ఆలయంగా పేరుగాం చింది. చక్రం ఆగిన ప్రదే శం చక్రతీర్థం అయింది. నిమి అంటే చక్రకైవారం, అరణ్యం - అడవి. చక్రం విరిగిన అరణ్యం కనుక నైమి శారణ్యంగా పేరుగాంచింది. వరాహ పురాణం ప్రకారం లిప్త కాలంలో విష్ణువు అసురు లను ఈ ప్రాంతంలో సం హరిస్తాడు. నిమి (లిప్త) (సెకండు) లో అసురుల్ని సంహరించిన ఈ అర ణ్యం నైమిశారణ్యంగా పేరొందినదని పేర్కొన బడింది. ఇక్కడే వ్యాస పీఠం, దధీచి కుండం ఉన్నాయి. శ్రీ ఆదిశంకరులు ఇక్కడి లలి తాదేవిని దర్శించి 'లలితా పంచకాన్ని రచించినట్టు చెబుతారు.

నైమిశారణ్యం కొన్ని విశేషాలు

[మార్చు]
  • నైమిశారణ్యములో వర్ణించబడిన చెట్లు, వృక్షాలు, లతలు. సరళ (తెల్ల తెగడ), కొండగోగు, ధన (ఉమ్మెత్త), దేవదారు, చండ్ర, మామిడి, నెరేడు, వెలగ, మర్రి, రావి, పారిజాత, చమ్దన, అగరు, పాటల (కలికొట్టు), నకుల (పొగడ), సప్తవర్ణ (ఏడాకుల పొన్న), పునాగ, సురపొన్న, నాగకేసర (నాగకింజల్కము), శాల, తాల (తాటి), తమాలము (చీకటిమాను), అర్జున (మద్ది ), చంపక (సంపెంగ).
  • నైమిశారణ్యం ఆలయం ఎనిమిది స్వయంవ్యక్త ఆలయాలలో ఒకటి. శ్రీరంగం, శ్రీముష్ణం, సాలగ్రామం, తోతాద్రి, తిరుమల, పుష్కరం, బద్రి, నైమిశారణ్యం ఇవి స్వయంవ్యక్త ఆలయాలుగా పేరుగాంచాయి.
  • నైమిశారణ్యం తొమ్మిది తపోవనాల్లో ఒకటి. దండకారణ్యం, సైంధవారణ్యం, జంబుకారణ్యం, పుష్కరారణ్యం, ఉత్పలా రణ్యం, బదిరికారణ్యం, జంగాలారణ్యం, అరు పుత్తరణ్యం, నైమిశారణ్యం ఇవి తొమ్మిది తపోవనాలు. గయ క్షేత్రం చరణ గయగా, బద్రిశిరోగయ, నైమిశారణ్యం నాభిగయగా పేరుగాం చాయి. ఇక్కడ ఉన్న గోమతినదీ స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు.
  • ఇక్కడకు 9 కి.మీ.దూరంలో మిశ్రిక్‌ అనే ప్రాంతంలో దధీచి కుండం ఉంది. ఇంద్రుని కోరికపై వృత్రాసురుణ్ని వధించేందుకు మహర్షి దధీచి ఈ కుండంలో స్నానం చేసి తన ఎముకలను వజ్రాయుధంగా మలచి ఇంద్రునికి సమర్పించి త్యాగజీవి అయ్యాడు.
  • బలాజీ మందిరంలో ఉన్న మాతాజీ ఆస్రమంలో యాత్రీకులకు బస, భోజన వసతులు లభిస్తాయి.

శ్రీరాముడు

[మార్చు]

శ్రీ రాముడు అశ్వమేధ యాగం చేసినదీ . లవకుశులను కలుసుకున్నది ఇక్కడే. సీతాదేవి పేరున శ్రీరాముడు బ్రాహ్మణులకు దానం చేసిన గ్రామమే నేటి 'సీతాపురం' అని అంటారు. శుక్రాచార్యుల వారి ద్వారా ఈ క్షేత్ర పవిత్రత గురించి తెలుసుకున్న ప్రహ్లాదుడు, ఇక్కడి తీర్థాలను దర్శించినట్టు చెబుతారు. ఇక శౌనకాది మహర్షులకు సూతమహాముని మహాభారత కథను తొలిసారిగా వినిపించినది ఇక్కడే.

పరిక్రమణ

[మార్చు]

నైమిశారణ్యంలో 84 క్రోసుల పరిక్రమణ అనేదొకటి అని విశ్వసిస్తుంటారు. ఫల్గుణమాసంలో ఈ పరిక్రమణలో భాగంగా భక్తులు నైమిశారణ్యంలో మొదలుపెట్టి, 11 పవిత్ర క్షేత్రాలలో మజీలీలు చేసుకుంటూ, మాఘమాసంలో ప్రయాగలోని త్రివేణి సంగమం వద్ద ముగుస్తారు.

చూడవలసిన ప్రదేశాలు

[మార్చు]
ఆలయానికి సంబంధించిన చక్ర తీర్థం
  • వేల సంవత్సరాలు ఋషులు, మునులు తపస్సు చేసిన తపోవనం ఇది. పరమ పవిత్ర దివ్య ప్రదేశం నైమిశారణ్యం. చక్రతీర్థం ఒడ్డున చక్రత్తాళ్వారు, వినాయక, శ్రీరామ లక్ష్మణ సీతా ఆలయాలు ఉన్నాయి.
  • గోముఖినది మార్గంలో వ్యాస ఘాట్‌ ఉంది. మరోవైపు శుకమహర్షి ఆలయం ఉంది. ఈ ఆలయానికి దగ్గరలో కొండపై ఆంజనేయ ఆలయం ఉంది.
  • నైమిశారణ్యం దివ్య దేశంలోని మూల విరాట్టు దేవరాజన్‌. శ్రీమన్నారాయణుడు. తూర్పుముఖంగా ఉన్న ఈ ఆలయం లోని అమ్మవారు పుండరీకవల్లిగా పూజలందుకుంటోంది. చక్రతీర్థం, గోముఖినది, సెమీతీర్థం, దివ్యవిశ్రాంత తీర్థాలలో స్నానం పవిత్రతను అందిస్తాయి.
  • శివపురాణంలో కూడా నైమిశారణ్య ప్రస్తావన ఉంది. అప్పటి పాంచాల, కోసల రాజ్యాల మధ్యన నైమిశారణ్యం ఉండేది. ఫాల్గుణ మాసంలో ఇక్కడ వైభవంగా ఉత్సవాలను నిర్వహి స్తారు. ఈ ఆలయం చుట్టుప్రక్కల పంచప్రయాగ, వ్యాసగడి, సూతగడి, చక్రతీర్థం, శ్రీహనుమగడి, పంచ పాండవ, శంకర మందిరాలు, వటవృక్షం, గోమతినది, దధీచి, సీతారామ ఆలయాలు ఉన్నాయి.

ఆలయాలు

[మార్చు]
నైశారణ్యంలో చూడదగినవి

వ్యాసగద్దె, సూతగద్దె, దేవరాజేశ్వరమందిరం, ఆనందమయి ఆశ్రమం, సేతుబంధరామేశ్వరం, మొదలైనవి ఉన్నాయి.రుద్రావర్తము అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ నీటిలో పాలు అభిషేకిస్తే ఆ పాలు నీటిలో కలవకుండా క్రిందకువెళ్ళిపోతాయని విశ్వసిస్తున్నారు. ఆ అడుగున శివమూర్తి ఉంది.

భూతేశ్వరాలయం

[మార్చు]
భూతేశ్వరాలయం

చక్రతీర్థానికి పక్కనే ఉండే దేవాలయాన్ని భూతేశ్వరాలయం అంటారు. ఈ ఆలయం పుట్టుకకి ఒక గాథ ఉంది. గయుడు అనే రాక్షసుడు విష్ణుధ్వేషంతో పరమశివుని గురించి తపస్సు చేసాడు. కానీ విష్ణువు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అను గ్రహిస్తానన్నాడు. దానికి గయు డు కోపంతో నేను శివుని గురించి తపస్సు చేసు కుంటుంటే, నిన్నెవడు రమ్మన్నాడు. నీవు నాకు వరమిచ్చే వాడివా! నేనే నీకు వరం ఇస్తాను ఏం కావాలో కోరుకో అన్నాడు. వాడి అహంభావా నికి శ్రీహరి మనసులో నవ్వుకుని, అయితే సరే గయుడు నా చేతిలో మరణించేటట్టు వరం ఇవ్వ మని అడిగాడు. ఇక మాట తప్పలేక గయుడు ఆ వరం శ్రీహరికి ఇచ్చేసాడు. వెంటనే విష్ణువు సుదర్శన చక్రంతో గయుని మూడు భాగాలుగా నరికేసాడు. అందులో ఒక భాగం గయలో పడగా, రెండవ భాగం నైమిశారణ్యంలోనే పడింది. మూడవ భాగం బదరీనాథ్‌లో పడింది. ఈ మూడు ప్రసిద ్ధక్షేత్రాలుగా వెలిసాయి. ఈ నైమిశారణ్యంలో పడిన చోట ఆలయ నిర్మాణం జరిగింది. అందులో వేలుపుని భూతేశ్వరుడు అని వ్యవహరిస్తారు.

చక్రతీర్థం

[మార్చు]

భూతేశ్వరాలయానికి ప్రక్కనున్న సరస్సే చక్రతీర్థం అంటారు. ఇది వృత్తా కారంలో ఉండి చుట్టూ మెట్లుండి స్నానమాచ రించడానికి అనువుగా ఉంటుంది. ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల అనేక రుగ్మ తలు నయమవుతాయని ప్రజల విశ్వాసం.

వ్యాసగద్ది

[మార్చు]
వ్యాసగద్దె

ఇక్కడ ప్రవహించే గోమతీ నదీ తీరంలో ఒక చిన్న కొండ మీద వ్యాసమహా ముని నివసించిన ప్రదేశం ఉంది. దీనినే వ్యాసగద్ది అంటారు. ఈ కాలంలో గోమతీ నదిని ధ్యానమతి గంగ అని కూడా పిలిచేవారు. ఈ ప్రదేశంలో ఒక పీఠంలాంటి గద్దెపై పట్టువస్త్రంతో అలంక రించి ఉంచారు. ఆనాడు వేద వ్యాసుడు ఇక్కడ కూర్చుని మహా భారతాన్ని చెప్తుంటే, విఘ్నేశ్వరుడు ప్రక్కన కూర్చుని రాసిన పవిత్ర స్థలం ఇదే. ఈ పక్కనే వ్యాసుని కుమారు డైన శుకమహర్షి పాల రాతి విగ్రహం, కొద్ది దూరంలో పరీక్షితు మహారాజు, శుకమహర్షి శిష్యుడైన శ్యాం చరణ్‌ మహారాజుల విగ్రహాలు మనకి కనువిందు చేస్తాయి.

ప్రాచీన కాలంలో గోమతిని ధ్యానమతి గంగ అనేవారట. ఇక్కడ నిలుచుని చూస్తే, ఒకపక్క ప్రవహించే గోమతి, మూడు పక్కలా దట్టంగా వ్యాపించిన అరణ్యంతో మనోహరమైన దృశ్యం కనువిందు చేస్తుంది. ఇక్కడ చిన్న మందిరాన్ని నిర్మించారు. ముందున్న యజ్ఞశాలలో ఇప్పటికీ యజ్ఞాలు నిర్వహిస్తుంటారు. వచ్చినవారు యజ్ఞవాటికకు ప్రదక్షిణ చేసి అందులోవున్న భస్మాన్ని నుదుట ధరించి వ్యాసగద్ది దర్శిస్తారు.

లలితాదేవి ఆలయం

[మార్చు]
లలితాదేవి

ఈ నైమిశారణ్యాన్ని నివాసయోగ్యంగా అనుగ్రహించిన దేవత లలితాదేవి. పాలరాతి తోరణాలు, విశాలమైన మండపం ఉండి నిత్య జనసందోహాలతో అమ్మవారి పూజలతో కళకళలాడుతూ వుంటుంది.

హనుమాన్‌ ఘరి

[మార్చు]
leftమైరావణ యుద్ధసమయంలో రామలక్ష్మణులతో హనుమ

ఈ మందిర విశేషానికి వస్తే, రామలక్ష్మణుల్ని మైరావణుడు అపహ రించుకుపోయాకా, ఆ మాయని ఛేదించి హనుమంతుడు రామలక్ష్మణుల్ని తన భుజాల మీద ఎక్కించుకుని తీసుకువచ్చిన ప్రదేశం ఇదే. ఇక్కడ ఆంజనేయుని విగ్రహం నిలు వెత్తులో ఉండి, భుజాలమీద రాముడు, లక్ష్మణుడు, హనుమంతుని కాలికింద తొక్క బడుతూ మైరావణుడు ఉంటారు. అంజనేయ స్వామి నిత్యపూజలతో, భక్తులతో నిత్యం నయనానందకరంగా ఉంటుంది.

నైమిశనాథ దేవాలయం

[మార్చు]
నైమిశనాధ దేవాలయం

ఇక్కడి స్వామి నైమిశారణ్యం క్షేత్రపాలకుడు. వేంకటేశ్వర స్వామిని పోలిన ఆకారంలో ఉంటాడు. నల్లని విగ్రహం బంగారు ఆభరణాలతో ఎంతో మనోహరంగా ఉంటుంది. అలాగే అహౌ బిలం వారు నిర్మించిన నారసింహ దేవాల యం, దదీచి కుండం, బలరాముడు ఇక్కడకి వచ్చిన ప్రదేశం, చూడదగ్గవి. అన్నిటినీ మించి ఇక్కడి రమణీయ దఋశ్యాలు అనేకం మనకి కనువిందు చేస్తాయి.

పురాణపురుష

[మార్చు]
right పురాణపురుషాలయంలో శుకుడు

ఇక్కడ ఆనందమయి మాత ఫౌండేషన్‌ వారు నిర్మించిన పురాణ పురుషుని మందిరం చాలా అందమైన నిర్మాణం. పురాణ పురుషుని విగ్రహం పంచలోహంతో మలచారు. చిలుక తలతో, అభయముద్రలో, ప్రశాంత గంభీర వదనంతో వుంటుంది. ఇక్కడ పురాణాం మీద పరిశోధన జరుగుతోంది. 18 పురాణాల తాళ పత్ర గ్రంథాలు పట్టుబట్టలో చుట్టి ఒక వేదిక మీద ఉంచారు. దీని చుట్టూ రేలింగ్‌ అమర్చి ఒక పక్క వేదవ్యాసుని విగ్రహం ప్రతిష్ఠించారు. మరో పక్క నూతుని విగ్రహముంది. దీనికి ప్రక్కనే బహు విశాలమైన గోష్ఠిమందిరం పెద్ద పెద్ద పట్టుపురుపులతో, గద్దెలతో పవిత్ర వాతావరణం ఆవరించింది ఉంది.

అహోబిల మందిరం

[మార్చు]
అహోబిలమందిరంలో నరసిహాలయద్వారం

మన అహోబిలమఠం వారిక్కడ నిర్మించిన ఆలయంలో నారసింహుని పంచలోహ విగ్రహం నిత్య పూజలతో అలరారుతోంది.

దధీచి కుండం

[మార్చు]

ఇది ప్రసిద్ధికెక్కిన స్థలం. దీనికో పౌరాణిక గాథ ఉంది. దేవదానవ యుద్ధాలు తరతరాలుగా జరిగాయని పురాణకథనాలు వివరిస్తున్నాయి. అలాంటి ఒక యుద్ధంలో తారకాసురుడు విజృంభించి, దేవతలనందరినీ చంపుతున్న తరుణంలో ఇంద్రుడు విష్ణువును సమీపించి దేవతలకు రక్షంచమని వేడుకున్నాడు. విష్ణుమూర్తి సలహా మేరకు దధీచి మహర్షి ఎముకతో తయారుచేసిన ఆయుధం రాక్షస సంహారం చేయగలదని తెలిపాడు, ఇంద్రుడు ఆ మహర్షిని దర్శించి జరిగిన విషయం వివరించి ఆయన వెన్నెముకను ఇవ్వమని కోరాడు . ఆ మహాత్ముడు ఈ కోరిక లోక కళ్యాణార్థమని గ్రహించి, యోగమార్గాన తన శరీరాన్ని త్యజించాడట. ఆయన సుదీర్ఘ తపస్సుతో, అనూహ్యశక్తి సంపన్నమైన ఆయన ఎముకతో ఇంద్రుడు వజ్రాయుధాన్ని తయారుచేసుకుని విజయం సాధించాడట. యిప్పటికీ ఇదే ఇంద్రుని ఆయుధం. ఈ సంఘటన జరిగిన ప్రదేశంగా ఈ దధీచికుండానికి ప్రత్యేకమైన ప్రాశస్త్యం ఉంది. లోకకళ్యాణార్థం, తన శరీరాన్ని తృణప్రాయంగా త్యజించిన త్యాగనిరతికి ప్రత్యక్ష నిదర్శనం ఈ దధీచి కుండం.

బలరాముని ప్రాయశ్చిత్తం

[మార్చు]

బలరాముని గురించిన పురాణగాధలో బలరాముడు నైమిశారణ్యంలో ప్రాయశ్చితకర్మలు నిర్వహిన్నట్లు తెలుస్తుంది. కురుక్షేత్ర సంగ్రామానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బలరాముడు తాను తటస్థంగా వుండిపోవాలని నిశ్చయించుకుని, తీర్థయాత్రలకు బయలుదేరి, దానిలో భాగంగా నైవిశారణ్యం చేరుకున్నాడు. ఆ సమయంలో మునులందరూ ఆధ్యాత్మిక విషయాలపై సుదీర్ఘమైన సత్సంగంలో ఉన్నారు. బలరాముని చూసి అందరూ లేచి నమస్కరించారు. సభకు ఆచార్యపీఠాన్నలంకరించిన వారు ఇలా లేవకూడదు. కనుక ఆ స్థానంలో వున్న రోమహర్షణుడు (నూతుడు) లేచి నమస్కరించలేదు. ఇది అవిధేయతగా భావించి దీనిని సహించలేని బలరాముడు సూతుని శిరస్సు ఖండించాడు. మునిగణాలలో అహంకారాలు చెలరేగినాయి. ఈ ఉద్విగ్నిత కొంత ఉపశమించిన తరువాత ఈ బ్రహ్మహత్యా పాతకానికి బలరాముని ప్రాయశ్చిత్తం చేసుకోమన్నారు. అప్పటికే పశ్చాత్తాపపడుతున్న బలరాముడు ప్రాయశ్చిత్తమేదో వారినే నిశ్చయింపమన్నాడు. వారు అక్కడ బల్వుడనే రాక్షసుడు మహా భయంకరుడు. అమావాస్య, పౌర్ణమి రోజులలో మా సమావేశాలను భగం చేస్తూ, రక్త మలమూత్రాలు మాపై కురిపిస్తున్నాడు. ముందు వాణ్ణి సంహరించి మాకుపకారం చేయి. తరువాత 12 మాసములు బ్రహ్మవర్తంలోని సకల తీర్థాలు సేవిస్తే బ్రహ్మ హత్యాపాతకం నుంచి విముక్తుడవుతావని తెలిపారు. ఇంతలో పౌర్ణమిరానే వచ్చింది. పెద్ద తుఫాను చెలరేగి, చీము, రక్తమూ వర్షిస్తూ నల్లని పర్వతాకారంలో అతి భయంకరంగా బల్వలుడు విజృంభించాడు. బలరాముడు తన ఆయుధాలను స్మరించగనే అతని గద, నాగలి చేతికి వచ్చాయి. బలరాముడు గదతో వాడి తలవ్రక్కలు చేశాడు. వాడు భయంకరంగా అరుస్తూ నేలకొరిగారు. మునులందరూ మంత్రజలం చల్లి బలరాముని ఆశీర్వదించారు. అప్పుడు బలరాముడు వేద ప్రమాణపరంగా మానవుడు తన ప్రతిరూపంగా పుత్రుడై జన్మిస్తాడు గనుక యికనుండి రోమహర్షుని తనయుడు మీకు పురాణ ప్రవచనం చేస్తాడు. అతనికి దీర్ఘాయువు, బలము ఇంద్రియపటుత్వము ప్రసాదిస్తున్నానని అన్నాడట. మునులందరూ అంగీకరించి అతణ్ణి వైజయంతి మాలతో సత్కరించి పంపారట.

వైష్ణవ దివ్యదేశాలు

[మార్చు]

108 వైష్ణవ దివ్యదేశాలలో నైమిశారణ్యం ఒకటి.

వివరాలు

[మార్చు]
ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వారా దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
దేవరాజన్ పుండరీక వల్లి దివ్య విశ్రాంత తీర్థం తూర్పుముఖం నిలచున్న భంగిమ తిరుమంగై ఆళ్వార్ శ్రీహరి విమానము దేవర్షులకు ఇంద్రునకు-సుధర్మునకు

విశేషాలు

[మార్చు]

ఇక్కడ మఠములు, రామానుజ కూటములు ఉన్నాయి. వనరూపిగా నున్న స్వామికే ఆరాధన. ఆళ్వార్లు కీర్తించిన సన్నిధిగాని పెరు మాళ్లుగాని ఇక్కడ లేరు. తిరుమంగై ఆళ్వార్లు వనరూపిగా నున్న స్వామినే కీర్తించిరని కొందరు పెద్దలు భావిస్తున్నారు. స్వయం వృక్ష క్షేత్రము. వ్యాస, శుక, సూతులకు సన్నిధులు ఉన్నాయి. సూత పౌరాణికుల మఠమున అనేక తాళపత్ర గ్రంథములు ఉన్నాయి.

ఒకప్పుడు మునులు బ్రహ్మవద్దకు పోయి భూమండలమున తపము చేయుటకు తగిన స్థలమేదని ప్రశ్నింపగా బ్రహ్మ దర్బతో నొక వలయము చేసి భూమిపై విడచి ఇదిపడిన చోటు తపము చేయదగిన స్థలమని చెప్పాడట. ఆచక్రం పడిన చోటు నైమిశారణ్యము. ఇచట గోమతీనది ప్రవహించుచున్నది. ఇచట మహర్షులు అనేక యజ్ఞయాగాదులు చేసియున్నారు. ఆ సమయములో సూతుడు ఇక్కడ అష్టాదశ పురాణములను వినిపించెను.

మార్గం

[మార్చు]

లక్నో - బాలాము మధ్యగల శాండిలా స్టేషన్‌కు 35 కి.మీ. కలకత్తా-డెహ్రాడూన్ రైలు మార్గములో బాలమార్ జంక్షన్ నుండి సీతాపూర్ రైలులో నైమిశారణ్యం స్టేషన్. అక్కడ నుండి 3 కి.మీ. బండిలోగాని నడచిగాని వెళ్లవచ్చును. అహోబిల మఠం రామానుజ కూటం ఉన్నాయి.

సాహిత్యం

[మార్చు]


శ్లో. దివ్య విశ్రాంత తీర్థాడ్యే నైమిశారణ్య పట్టణే |
   పుండరీక లతా నాధో దేవరాజాహ్వయో హరి:||
   విమానం శ్రీ హరిం ప్రాప్య ప్రాచీ వక్త్ర స్థితి ప్రియ:|
   దేవర్షీంద్ర సుధర్మాక్షి ప్రత్యక్ష: కలిజిన్నుత:||

పాశురాలు

[మార్చు]

పా. వాణిలాముఱవల్ శిఱునుదల్ పెరున్దోళ్; మాదరార్ వనములైప్పయనే
   పేణినేన్; అదవై ప్పిழைయెనక్కరుది ప్పేదై యేన్‌పిఱవినో యఱుప్పాన్
   ఏణిలే నిరున్దే నెణ్ణినే నెణ్ణి; యిళై యవర్ కలవియిన్దిఱత్తై
   నాణినేన్ వన్దున్ తిరువడి యడైన్దేన్; నైమిశారణియత్తుళెన్దాయ్.
         తిరుమంగై ఆళ్వార్లు-పెరియతిరుమొழி 1-6-1

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]
  • దివ్య దేశ వైభవ ప్రకాశికా, కిడాంబి గోపాలకృష్ణమాచార్య స్వామి, ఉభయ వేదాంత సభ, పెంటపాడు, 1997.