Jump to content

శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)

వికీపీడియా నుండి
శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)
శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం
శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం
పేరు
ప్రధాన పేరు :శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:కేరళ
జిల్లా:తిరువనంతపురం
ప్రదేశం:తిరువనంతపురం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:పద్మనాభుడు
ఇతిహాసం
నిర్మాణ తేదీ:క్రీ. శ.1568
అనంతపద్మనాభస్వామి దేవాలయం, తిరువనంతపురం
శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం తిరువనంతపురం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం, భారతదేశం, కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉన్న ఒక హిందూ దేవాలయం. అనంతపద్మనాభుడు అనగా నాభి (బొడ్డు) యందు పద్మమును కలిగి అంతం లేనివాడని అర్ధం. శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం శ్రీమహావిష్ణువుకు అంకితమైన ఆలయం.ఈ ఆలయ నిర్వహణ ప్రస్తుతం ట్రావెంకొర్ రాజకుటుంబానికి చెందిన ధర్మకర్తల ఆధ్వర్యంలో సాగుతుంది. మలయాళం, తమిళంలో 'తిరువనంతపురం' నగరం పేరు "ది సిటీ ఆఫ్ లార్డ్ అనంత" అని అనువదిస్తుంది (అనంత విష్ణు రూపం).[1] [2]ఈ ఆలయం చేరా శైలి, ద్రావిడ నిర్మాణ శైలి రెండిటి క్లిష్టమైన కలయికలో నిర్మించబడింది, ఇందులో ఎత్తైన గోడలు, 16వ శతాబ్దపు గోపురాన్ని కలిగి ఉంది.[3][4] కొన్ని సంప్రదాయాల ప్రకారం కేరళలోని కాసరగోడ్ జిల్లా లోని, కుంబ్లాలోని అనంతపుర సరస్సు దేవాలయం దేవత అసలు ఆధ్యాత్మిక స్థానంగా పరిగణించబడుతుంది ("మూలస్థానం"), వాస్తుపరంగా కొంత వరకు, ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారి జిల్లా, తిరువత్తర్‌ లోని ఆదికేశవ పెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపం.[5] ప్రధాన దైవం పద్మనాభస్వామి (విష్ణువు), "అనంత శయన" భంగిమలో, అనంతమైన పాము ఆది శేషునిపై శాశ్వతమైన యోగ నిద్రలో కొలువై ఉన్నాడు.[6] పద్మనాభస్వామి ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికి చెందిన దేవత. ట్రావెన్‌కోర్ మహారాజు మూలం తిరునాళ్ రామవర్మ ఈ ఆలయానికి ప్రస్తుత ధర్మకర్త.on july 14th at 1:25pm the doors of 6th rooms are also opened by government of india by latest technology.

చరిత్ర

[మార్చు]

ట్రావంకోర్ రాజకుటుంబం చేరవంశానికి చెందిన వారు అలాగే కులశేఖర సన్యాసి ఆళ్వార్ సంతతి వారు. ఈ ఆలయం శ్రీమహావిష్ణు 108 దివ్యదేశములలో ఒకటి. 108 దివ్యదేశములు అంటే శ్రీమహావిష్ణువు ఆలయాలు ఉన్న దివ్యక్షేత్రాలు అని అర్ధం. శ్రీమత్భాగవతంలో బలరాముడు తన తీర్ధయాత్రలో భాగంగా ఫాల్గుణం (ప్రస్తుత శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం ) అనే ఈ దేవాలయాన్ని దర్శించినట్లు, ఇక్కడ ఉన్న పంచప్సరసులో (పద్మతీర్థంలో) స్నానం చేసినట్లు [7]అలాగే పది వేల ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లు తెలుస్తుంది. తమిళ ఆళ్వారులు రచించిన దివ్యప్రబంధంలో కూడా ఈ ఆలయం ప్రస్తుతించబడింది (6వ శతాబ్దం-9వ శతాబ్దం). సా.శ. 16వ శతాబ్దం అంతా ఈ ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అపుడు ఈ ఆలయ సుందరగోపుర నిర్మాణం జరిగింది. ఈ ఆలయం ప్రసిద్ధ తిరువట్రార్ శ్రీ ఆదికేశవపెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపం. ఈ ఆలయం కారణంగా కేరళ రాజధాని నగరానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. 'తిరు అనంత పురం ' అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుని పవిత్ర ఆలయం అని అర్ధం. ఈ నగరానికి అనంతపురం, శయనంతపురం అనే మరి కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఆనందం అంటే పద్మనాభస్వరూపమే. హిందుధర్మం భగవంతుడి రూపం సచ్చిదానందం అని చెప్తుంది. (సంపూర్ణ సత్యం, సంపూర్ణ జాగృతి, సంపూర్ణ ఆనందం).

అనంత పద్మనాభుడి ఆలయం అత్యంత పురాతనమైంది. [8]ఈ ఆలయం పేరునే తిరువనంతపురానికి ఆ పేరు వచ్చింది. ఒకప్పుడు దీన్ని పట్టువీట్టల్ పిల్లమార్ అనే నాయనార్ కుటుంబాలు నిర్వహించే వారు. కాల గమనంలో ఈ ఆలయం ట్రావెన్ కూర్ సంస్థాన సంస్థాపకుడైన మార్థాండ వర్మ చేతిలోకి వచ్చింది. వారు తాము పద్మనాభ దాసులుగా ప్రకటించుకొని, ఆలయం లోని శంఖాన్నే తమ రాజ్యానికి గుర్థుగా పెట్టుకున్నారు. ప్రస్తుతమున్న గోపురాన్ని 1568 లో నిర్మించారు. ఆలయంలో మూల విరాట్ ను 1208 సాలగ్రామాలతో తయారు చేసారు.[9] ఈ బారి విగ్రహాన్ని చూడడానికి మూడు ద్వారాల గుండా చూడాలి. ఆది శేషుని పై పవళించి నట్ల్లున్న ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా తిలకిస్తే తల భాగం, మధ్య ద్వారా గుండా చూస్తే బొడ్డు, అందులో పుట్టిన తామర పువ్వు, మూడో ద్వారం ద్వారా చూస్తే పాద భాగం కనిపిస్తాయి

ఆలయ గర్భగృహంలో ప్రధాన దైవమైన పద్మనాభస్వామి అనంతశయనం భంగిమలో (అనంతశేషుడి తల్పం మీద యోగనిద్ర) ఉంటాడు.[10] ట్రివాంకోర్ మహారాజా తనకు తానే పద్మనాభదాసుడని నామకరణం చేసుకున్నాడు. ముఖద్వారం వద్ద హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్న వారికి మాత్రమే ప్రవేశం అన్న ప్రకటన ఉంటుంది. భక్తులకు లోపల ప్రవేశించడానికి ప్రత్యేక మైన వస్త్రధారణ చేయాలన్న నియమం కూడా ఉంది.

స్థలపురాణం

[మార్చు]
దేవాలయ కోనేరులో శ్రీ అనంతపద్మనాభస్వామి

తాళపత్ర గ్రంథాల ఆధారంగా కలియుగం ఆరంభమైన 950వ రోజు తుళువంశ బ్రాహ్మణ ఋషి దివాకరముని సారథ్యంలో విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది. విష్ణుభక్తుడైన దివాకరముని తపస్సు ఆచరించగా శ్రీ మహావిష్ణువు రెండు సంవత్సరాల బాలుని రూపంలో ప్రత్యక్ష్మమయ్యాడు. ఆ బాలుని ముఖవర్చస్సుకు తన్మయుడైన ముని తన వద్ద ఉండిపోవాలని కోరాడు. అందుకు ఆ బాలుడు అంగీకరించి తనను వాత్సల్యంతో చూడాలని అలా జరగని నాడు వెళ్ళిపోగలనని ఆంక్ష విధించాడు. అందుకు అంగీకరించిన ముని ఆ బాలుని అమిత వాత్సల్యంతో చూస్తూ, బాల్యపు చేష్టలను ఓర్చుకుంటూ ఆనందంతో జీవిస్తున్నారు. ఒక రోజు దివాకరముని పూజా సమయంలో సాలగ్రామాన్ని ఆ బాలుడు నోటిలో ఉంచుకొని పరుగెత్తాడు. అందులకు ముని బాలునిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు ఇచ్చిన మాటను ముని తప్పినాడని భావించి ఆ బాలుడు నన్ను చూడాలని పిస్తే అరణ్యంలో కనిపిస్తానని చెప్పి అదృశ్యమైనాడు. ఈ సంఘటనతో దివాకరమునికి ఆ బాలుడు ఎవరైనది అర్థమై తీవ్ర మనోవ్యధకు గురైనాడు. ఎలాగైనా ఆ బాలుని తిరిగి దర్శించుకోవాలన్న తలంపుతో ముని అరణ్యబాట పట్టగా, క్షణకాలం పాటు కనిపించిన ఆ బాలుడు, అనంతరం ఒక మహా వృక్షరూపంలో నేలకొరిగి శ్రీమహావిష్ణువు శేషశాయనుడిగా ఉన్న రూపంలో కనిపించాడు. ఆ మహిమాన్విత రూపం దాదాపు 5 కి.మీ. దూరం వ్యాపించి, శిరస్సు 'తిరువళ్ళం' అన్న గ్రామం వద్ద, పాదములు 'త్రిప్పాపూర్' వద్ద కన్పించాయి. అంతటి భారీ విగ్రహన్ని మానవమాతృలు దర్శించడం కష్టమని, కనువిందు చేసే రూపంలో అవరతించాలని ముని వేడుకున్నాడు. ముని విన్నపాన్ని మన్నించిన స్వామి ప్రస్తుత రూపంలో కన్పించగా, ఆ విగ్రహాన్ని తెచ్చి 'తిరువనంతపురం' లో ప్రతిష్ఠించినట్లు కథాంశం.

ఆలయ నిర్మాణం

[మార్చు]
శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయ కోనేరు దృశ్యం

ఆలయ నిర్మాణం అంచెలంచెలుగా జరిగినట్లు తెలుస్తున్నది. సుమారు 5వ శతాబ్దకాలంలో 'చేరమాన్ పెరుమాళ్' అనే రాజు ఈ ఆలయానికి మొదటి పునాది వేసినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. ఈ రాజు హయాంలో ఆలయంలోని పూజారులు, పాలనా ఉద్యోగులను నియమించినట్లు తెలుస్తుంది. అనంతరం సా.శ. 1050 వ సంవత్సరంలో స్థానిక పాలకులు ఆలయ ప్రాకారం నిర్మించారని తెలుస్తుంది. తరువాత సా.శ. 1335-1384 సంవత్సర మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన 'వీరమార్తాండ వర్మ' అనే రాజు ఆలయ పాలన, వ్యవహారాలను స్వాధీనం చేసుకున్నాడు. ఇతని హయాంలో సా.శ. 1375 సంవత్సరంలో అల్పిసి ఉత్సవాన్ని ప్రవేశపెట్టాడు. ప్రతి ఆరు మాసాలకొకసారి ఈ ఉత్సవం జరుగుతుంది. పదిరోజులపాటు సాగే ఈ ఉత్సవం నేటికి కొనసాగుతూ ఉంది. సా.శ..1459-60 సంవత్సరాల మధ్యకాలంలో ఆలయ గర్భగుడి పునరుద్ధరణ జరిగింది. సా.శ.1461లో ఒక రాతిపై 'ఓట్టకల్ మండపం' నిర్మాణం జరిగింది. అనంతరం సా.శ. 1729 సంవత్సరంలో తిరువాన్కూర్ రాజు ' మార్తాండవర్మ' కాలం నుంచి నేటి వరకు ఆలయ నిర్వహణతో పాటు పలు మండపాలు, ముఖద్వారాలు, ప్రాంగణాలు, ఆలయ నిర్మాణాలు జరిగాయి.

ఆలయ సౌందర్యం

[మార్చు]

ప్రధానాలయం మలయాళ సంప్రదాయ పద్ధతిలో నిర్మాణం జరిగింది. దాదాపు 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ గాలిగోపురం ఆనుకొని చుట్టూ ప్రహారి నాలుగు ముఖద్వారాలతో నిర్మించబడింది. ఆలయంలో స్వామి ఊరేగింపుకై ప్రాంగణం నిర్మించబడింది. నాలుగు మూలల నాలుగు ఉయ్యాల మండపాలతో, అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఈ ప్రాంగణం నిర్మించారు. ఆలయ తూర్పు ముఖద్వారం వద్ద 3 ఎకరాల విస్తీర్ణంలో 'పుష్కరిణి' చాలా విశాలంగా అందమైన మెట్లతో నిర్మాణం జరిగింది. ఆలయంలో శ్రీ నారసింహ, శాస్త (అయ్యప్ప), పార్థసారథి ఆలయాలు ఉన్నాయి. ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది.

ప్రధాన ఉత్సవాలు

[మార్చు]

ప్రతి సంవత్సరం ఆరు మాసాలకు ఒకసారి తులా మాసం (సెప్టెంబరు / అక్టోబరు) లో, ఫాల్గుణ మాసం (మార్చి / ఏప్రిల్) లో 'అల్పిసి ఉత్సవాలు' జరుగుతాయి. తులా మాసంలో జరిగే ఉత్సవాలాలో 'ఆరాట్టు' ఊరేగింపు ప్రధానమైనది. శ్రీ పద్మనాభ, శ్రీనారసింహ, శ్రీకృష్ణ దేవతా విగ్రహాలను గరుడవాహనంపై ఊరేగించి సముద్ర స్నానాలకు తీసుకొని వెళతారు. ఈ ఊరేగింపు అధికార లాంఛనాలతో రాజు కరవాళం చేతబట్టి ముందు నడవాల్సి ఉంది.

దివ్యదేశాలు

[మార్చు]

జ్యోతిర్లింగాలు 12 ఉన్నట్టుగానే విష్ణుమూర్తికి సంబంధించిన 108 దివ్యదేశాలున్నాయి. అందులో ఒకటి తిరువనంతపురంలోని ఈ అనంతపద్మనాభస్వామి దేవాలయం. అనంతపద్మనాభుడు హిందువులకు అతి పవిత్రమైన దేవుడు. ఈ దేవాలయ గోపుర నిర్మాణం 16 వ శతాబ్దంలోజరిగింది. 18 వ శతాబ్దంలో చిట్టచివరి మెరుగులు దిద్దారు. అతి పెద్ద చెరువు పక్కన ఉండటం వలన ఆలయ సౌందర్యం రెట్టింపయ్యింది. ఈ చెరువును పద్మతీర్థం (తామరల కొలను) అంటారు. ఈ దేవాలయం పేరుమీదే కేరళ రాజధానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. ‘తిరు’ ‘అనంత’ ‘పురం’ అంటే ‘అనంతపద్మనాభునికి నెలవైన ప్రదేశం’ అని అర్థం. అనంత పద్మనాభుడు అనంతశయన ముద్రలో (యోగనిద్ర ఆకృతిలో అనంతుడనే సర్పం మీద శయనించి) దర్శనమిస్తాడు. ఈ విగ్రహాన్ని కటుశర్కర యోగం అనే ఆయుర్వేద ఔషధాల మిశ్రమంతో తయారుచేశారు. అనంతుడనే సర్పం మీద శయనించి, తలను దక్షిణ దిక్కుగా పెట్టుకుని ముఖాన్ని తూర్పుముఖంగా ఉంచి శయనిస్తున్న ముద్రలో ఉంటాడు. అనంతుడు లేదా ఆదిశేషువు మీద శయనించిన భంగిమలో విష్ణువు దర్శనమిస్తాడు. నేపాల్‌లోని గండకీ నదీ తీరం నుంచి ఏనుగుల సహాయంతో తీసుకొచ్చిన 12000 సాలగ్రామాలతో ఈ విగ్రహం తయారయ్యింది. ఈ విగ్రహానికి అభిషేకం చేయరు. కేవలం పూలతో మాత్రమే పూజిస్తారు. ఇక్కడ భగవంతుడు మూడు ద్వారాల గుండా దర్శనమిస్తాడు. మొదటి ద్వారం నుంచి విష్ణువు చేతికిందుగా ఉన్న శివుని ముఖం, రెండవ ద్వారం గుండా నాభి నుంచి వెలువడిన కమలం మీద ఆసీనుడైన బ్రహ్మ, ఉత్సవమూర్తులు, శ్రీదేవిభూదేవులు, మూడవ ద్వారం నుంచి విష్ణుమూర్తి పాదపద్మాలు దర్శనమిస్తాయి. ఎవరైనా ముడుపులు చెల్లిస్తే, అది నేరుగా భగవంతునికే చెందుతుంది. విష్ణువు... శయనించి, కూర్చుని, నిలబడి... మూడు భంగిమలలో దర్శనమిస్తాడు. పద్మనాభుని విగ్రహంలో ముఖభాగం, వక్షస్థలం మినహా... కిరీటం, కుండలాలు, మెడలో ధరించిన సాలగ్రామహారం, కంకణం, కమలం, కాళ్లు... అన్నీ బంగారంతో తయారైనవే. కటుశర్కర రక్షణ కారణంగా శత్రువుల కన్ను ఈ స్వామి మీద పడలేదని మహారాజు భావించేవారు.

ఆలయ విశేషాలు

[మార్చు]

ఈ దేవాలయానికి ఆరు నేలమాడిగలు ఉన్నాయి. భక్తులు, రాజులు చెల్లించిన ముడుపులు ఇందులోనే దాచేవారంటారు. వాటికి ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్ అని పేర్లు పెట్టారు. ఎ, బి మాడిగలను 130 సంవత్సరాలుగా ఏనాడూ తెరవలేదు. సి నుంచి ఎఫ్ వరకు లెక్క ప్రకారం తెరిచేవారు. ఈ మధ్యనే ఈ దేవాలయం లోని నేలమాళిగలలో లక్షన్నర కోట్లకు పైగా విలువ చేసే అపార సంపద బయటపడడంతో ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కటం విశేషం.

అనంతపద్మనాభస్వామి కొలువైవున్న దివ్యక్షేత్రం. ఈ ఆలయంలోనికి హిందువులని మాత్రమే అనుమతిస్తారు. మగవాళ్ళు పంచలు మాత్రమే ధరించి లోనికి వెళ్ళాలి. ఆడవారు కుడా ఎటువంటి అధునాతన దుస్తులు ధరించరాదు. అందరు సాంప్రదాయ వస్త్రాలలోనే ప్రవేశించాలి.ఈ మధ్యనే ఈ దేవాలయం లోని నేలమాళిగలలో లక్షన్నర కోట్లకు పైగా విలువ చేసే అపార సంపద బయటపడడంతో ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. తిరువనంతపురం కరమన నది, కిల్లీ నదీ తీరాలలో ఉంది.ఇది కేరళ రాష్ట్ర ముఖ్య పట్టణం. సన్నిధి కోట మధ్య భాగమున ఉంది. ఇక్కడ స్వామిని మూడు ద్వారములలో దర్శించాలి. ఈ స్వామి విషయమై నమ్మాళ్వార్లు తమ తిరువాయిమొళి ప్రబంధములో (10-2)"అరవిల్ పళ్లి పైన్ఱవన్ పాతజ్గాణ నడుమినో సమర్‌ కళుళ్లీర్" భాగవతులారా! అనంతునిపై పవళించియున్న పద్మనాభ స్వామి శ్రీపాదములను సేవింప బయలుదేరుడు" అని యుపదేశించియున్నారు.

శ్రీరంగమున అధ్యయనోత్సవాన అరయరులు ఈ పాశురమును గానం చేయగా విని ఆళవందార్లు ఆనందపరవశులై ఆళ్వార్లు కీర్తించిన ఈ క్షేత్రానికి పోయిరావలెనని వెంటనే తిరువనంతపురం వెళ్ళాడు.

"కురుగైక్కావలప్పన్" అనువారు ఆళ్వందార్లకు యోగరహస్యాలను ఉపదేశింపదలచి ఒక సుముహూర్తమును నిర్ణయించాడు. కాని ఆళవందార్లు ఆదినాన తిరువనంతపురములో ఉండేవాడు. ఆకారణాన యోగరహస్యం వారికి లభించ లేదు. "అయ్యో! పుష్పక విమానమైనను లేదే. ఉన్నచో కురుగైక్కావలప్పన్ సన్నిధికి చేరి యోగరహస్యాలను పొంది యుండు వారమే" యని ఆళవందార్లు భావించారట.

అనంత సంపద

[మార్చు]

ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన తిరుపతి తిరుమల వడ్డి కాసుల వాడు... ఈ మధ్య కాలంలో కేరళ తిరువనంత పురంలోని అనంత పద్మ నాభ స్వామి వారి దేవాలయంలో బయల్పడిన అనంత సంపదతో వజ్రాలు, వైడుర్యాలు, టన్నుల కొద్ది బంగారు ఆబరణాలు మొదలగు వాటితొ లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంపదతో మొదటి స్థానంలో నిలబడగా రెండో స్థానంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడు రెండో స్థానంలో నిలవాల్సి వచ్చింది. ఇంకా బయట పడవలసిన సంపద వున్నందున పూర్తి స్థాయిలో సంపద నంతటిని లెక్కకట్టాల్సి ఉంది. ఆలయంలో దేవునికి సంబంధించిన సంపద నేల మాళిగలలో దాచి వున్నది తెలుసు. అయితే కొన్ని వందల సంవత్సరాలుగా దాన్ని తెరిచి చూసిన పాపాన పోలేదు. 1860 లో మూసివేసిన కొన్ని గదులను మాత్రం 1950 లో సీల్ వేశారు. స్వాతంత్ర్యానంతరం స్థానిక ఆలయాలన్నిటిని ట్రావెంకూర్ దేవస్తానం బోర్డులో విలీనం చేసినా ఈ ఆలయాన్ని మాత్రం రాజ కుటుంబీకులే తమ పర్వవేక్షణ క్రిందనే వుంచుకున్నారు. ఆ కుటుంబానికి చెందిన చివరి రాజు వితిర్ తిరునాళ్ బలారామ వర్మను అప్పటి ప్రభుత్వం రాజ ప్రముఖ్ గా ప్రకటించింది. ఆ రాజ కుటుంబీకులే ఈ ఆలయ నిర్వహణ ట్రస్టీలుగా కొనసాగుచున్నారు. ఈ ఆలయ సంపద నిర్వహణలో అస్తవ్యస్తంగా ఉందని, దాన్ని గాడిలో పెట్టాలని టి.పి. సుందర రాజన్ అనే న్యాయ వాది సుప్రీం కోర్టులో దావా వేయగా, సుప్రిం కోర్టు ఒక కమిటీని వేసి ఆ సంపదను లెక్కించాలని ఆదేశించింది. ఆ విధంగా ఆ నేల మాళిగలలోని అనంత సంపదలు వెలుగు చూసాయి. ఇప్పటివరకు ఐదు నేలమాళిగలలోని సంపదను మాత్రమే లెక్కించారు. అందులోనే అనంతమైన సంపద బయట పడింది. ఇంకా ఆరో గది తెరవవలసి ఉంది. దాని నిర్మాణ రీత్యా అది చాల పెద్దది, అందులోనే ఇంకా ఎక్కువ సంపద దాచి ఉందని తెలుస్తుంది. ఇప్పటివరకే బయట పడిన సంపదతో దేశంలో అత్యంత సంపన్న క్షేత్రంగా ఈ ఆలయం రికార్డులకెక్కింది. ఇప్పటి వరకు బయల్పడిన సంపదలో బంగారం, వజ్రాబరణాలు, బంగారు దేవతా ప్రతిమలు, కిరీటాలు, పచ్చ రాళ్లు పొదిగిన నగలు. బస్తాలకొద్ది బంగారు వెండి నాణేలు, దాదాపు రెండు వేల రకాల కంఠాభరణాలు, గొలుసులు బయల్పడ్డాయి. పదహారవ శతాబ్దం నాటి శ్రీ కృష్ణ దేవరాయల కాలంనాటి నాణేలు, ఈస్టిండియా కాలం నాటి నాణెలు, నెపోలియన్ బోనపార్టే కాలం నాటివి బస్తాల్లో లబ్యమయాయి. అంతేగాక చిత్ర విచిత్రమైన వస్తువులెన్నొ ఉన్నాయి. ఇంకా బంగారు కొబ్బరికాయలు, బంగారు శంఖాలు ఇలా ఎన్నో వింత వింత వస్తువులు వెలుగు చూసాయి.[11][12][13][14]ఇంత సంపద బయల్పడినా ఇంకా అతి పెద్దది, అతి ముఖ్యమైన ఆరో గది తెరవాల్సి ఉంది.[15]

ఈ ఆస్తులు అన్నీ పద్మనాభస్వామికి చెందినవి. చాలా కాలం పాటు ట్రావెన్‌కోర్ రాజకుటుంబం నేతృత్వంలోని ట్రస్ట్ నియంత్రణలో ఉన్నాయి. అయితే, ప్రస్తుతం (జూలై 2020 నుండి), ఆలయ నిర్వహణకు నాయకత్వం వహించే బాధ్యత నుండి ట్రావెన్‌కోర్ రాజకుటుంబాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం తప్పించింది.[16][17][18][19] పద్మనాభస్వామి ఆలయాన్ని చూసే విధానాన్ని సుందరరాజన్ వ్యాజ్యాలు ప్రపంచ దృష్టిని మరల్చాయి.

వివరం

[మార్చు]
ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వారం దిశ భంగిమ కీర్తించిన వారు దర్శనం విమానం ప్రత్యక్షం
అనంత పద్మనాభస్వామి శ్రీహరిలక్ష్మీతాయార్ మత్స్య పుష్కరిణి తూర్పు ముఖం భుజంగశయనం నమ్మాళ్వార్లు మూడు ద్వారాలలో దర్శనం హేమకూట విమానం శివునకు, ఇంద్రునకు

వైష్ణవ దివ్యదేశం శ్లోకం

[మార్చు]

శ్లో. తిరువనంత పురే భుజగేశయో రుచిరమత్స్య సరోవర సుందరే|
   శశి విభూషణ వజ్రధరేక్షిత శ్శఠరిపూత్తమ సూరి పరిష్కృత:||
   అనంత పద్మనాభ శ్శ్రీహరి:లక్ష్మీ సమన్విత:|
   ద్వారత్రయేణ సంసేవ్య: హేమ కూట విమానగ:||

సాహిత్యం

[మార్చు]

పా. కెడుమిడరాయ వెల్లామ్; కేశవా వెన్న; నాళుం
    కొడువివై శెయ్యుమ్‌ కు త్‌తిన్; తమర్ గళుమ్‌ కురుగ కిల్లార్;
    విడముడై యరవిల్ పళ్ళి; విరుమ్బినాన్ శురమ్బలత్‌తుమ్;
    తడముడైవయ; లనన్ద పురనగర్ పుగుదు మిన్ఱే.

    కడువినై కళై యలాగుమ్; కామనై ప్పయన్ద కాళై;
    ఇడవగై కొణ్డదెన్బర్;ఎழிలణి యనన్దపురమ్;
    తడముడై యరవిల్ పళ్ళి; పయిన్ఱవన్ పాదం కాణ
    నడమినో నమర్గళుళ్ళీర్; నాముమక్కఱుయచ్చొన్నోమ్;
    నమ్మాళ్వార్-తిరువాయిమొழி 10-2-1,8

సమీప ప్రాంతాలు

[మార్చు]

ఈక్షేత్రమున సేవింపవలసిన విశేషాలు పెక్కులు గలవు.ఇచటికి సమీపానగల "యానైమలై", అగస్త్య పర్వతం, ఏలకకాయల కొండ చూడదగ్గవి.

ప్రయాణ మార్గం

[మార్చు]

ఇది కేరళ రాష్ట్ర రాజధాని. చెన్నై-తిరువనంతపురం (త్రివేండ్రం) రైలు మార్గం. తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్ నుండి 1 కి.మీ.

మంచిమాట

[మార్చు]

నిత్యవిభూతియగు పరమపదము లీలావిభూతి యీ రెండును సర్వేశ్వరునకు శేషభూతమై యుండును. వీనిలోనివసించువారు నిత్యులనియు ముక్తులనియు బద్ధులనియు మూడు విధములుగా నుందురు. అందు నిత్యులనగా అనంత గరుడ విష్వక్సేనాధి అంతరంగిక కైంకర్యవరులు. ముక్తులనగా కొంతకాలము సంసారమున పడియుండియు సర్వేశ్వరుని కృపకు పాత్రులై పరమపదమును చేరినవారు. బద్ధులనగా సంసారమున బడియుండువారు. వీరు రెండు విధములుగా నుందురు. 1. ఋబుక్షువులు 2. ముముక్షువులు. బుభుక్షువులనగా అవిద్యకు వశ్యులై దేహయాత్రచేయువారు. ముముక్షువులనగా సుకృతవశమున ఆచార్యానుగ్రహము లభింపక సర్వేశ్వరుని పొందుటకై ప్రయత్నించువారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "About Thiruvananthapuram". Thiruvananthapuram Municipal Corporation. Archived from the original on 18 September 2010. Retrieved 29 October 2010.
  2. "Sree Padmanabhaswamy Temple | District Thiruvananthapuram, Government of Kerala | India". Retrieved 2023-04-09.
  3. Abram, David (1 November 2010). The Rough Guide to Kerala. Rough Guides UK. ISBN 9781405388047.
  4. Padanna, Ashraf (1 July 2011). "India: Treasure unearthed in Kerala temple". BBC News. Retrieved 2 July 2011.
  5. Bayi, Aswathi Thirunal Gouri Lakshmi (1995). Sree Padmanabha Swamy Temple. Bharatiya Vidya Bhavan, Bombay, India.
  6. Ponmelil, V.A. "Temples of Kerala – Sri Padmanabhaswamy Temple". Temples.newkerala.com. Archived from the original on 2008-06-09. Retrieved 2023-04-09.
  7. "Sree Padmanabhaswamy Temple | District Thiruvananthapuram, Government of Kerala | India". Retrieved 2023-04-09.
  8. "Sree Padmanabhaswamy Temple | District Thiruvananthapuram, Government of Kerala | India". Retrieved 2023-04-09.
  9. Hatch, Emily Gilchriest (1939). Travancore (Second ed.). Calcutta: Oxford University Press. p. 151.
  10. Jayashanker, S (1999), Temples of Kerala
  11. "Kerala's Padmanabha temple treasure worth over Rs 60k crore".
  12. "Thiruvananthapuram temple riches spark ownership debate".
  13. Ittyipe, Minu (18 July 2011). "The Worth Of Eternal Repose". outlookindia.com.
  14. Gene J. Koprowski (26 March 2015). "Results of billion-dollar treasure hunt in Hindu temple to be revealed". Fox News Channel.
  15. ఈనాడు దిన పత్రిక: సోమ వారం: జూలై 4 2011.
  16. Kerala government has no right over the wealth, 6 July 2011, Rediff.com
  17. SC halts opening of Kerala temple's last vault, TNN & Agencies 8 July 2011
  18. Apex court restrains opening of Kerala temple vault Express news service, Sat 9 July 2011
  19. TNN (9 July 2011). "Padmanabhaswamy temple treasure belongs to deity: Royal family". The Times of India. Archived from the original on 6 November 2012.

బయటి లింకులు

[మార్చు]