Jump to content

ద్వారకా తిరుమల

అక్షాంశ రేఖాంశాలు: 16°57′16.3012″N 81°15′23.6470″E / 16.954528111°N 81.256568611°E / 16.954528111; 81.256568611
వికీపీడియా నుండి
(ద్వారక తిరుమల నుండి దారిమార్పు చెందింది)
ద్వారకా తిరుమల
గ్రామం
పటం
ద్వారకా తిరుమల is located in ఆంధ్రప్రదేశ్
ద్వారకా తిరుమల
ద్వారకా తిరుమల
అక్షాంశ రేఖాంశాలు: 16°57′16.3012″N 81°15′23.6470″E / 16.954528111°N 81.256568611°E / 16.954528111; 81.256568611
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఏలూరు
మండలంద్వారకా తిరుమల
విస్తీర్ణం
2.18 కి.మీ2 (0.84 చ. మై)
జనాభా
 (2011)[1]
5,543
 • జనసాంద్రత2,500/కి.మీ2 (6,600/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్534426

ద్వారకా తిరుమల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా, ద్వారకా తిరుమల మండలం లోని జనగణన పట్టణం.[2] ఇక్కడ చిన్న తిరుపతిగా పేరొందిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం వలన ఇది ప్రముఖ పర్యాటక ప్రదేశంగా పేరు గడించింది.

పేరు వ్యుత్పత్తి

[మార్చు]
ద్వారకా తిరుమల ప్రధానాలయం - http://www.aptourism.in/ నుండి తీసికొన్న చిత్రం
ద్వారక తిరుమల, ఏలూరు జిల్లా

ఇక్కడ శేషాద్రి కొండపై శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు దీరియున్నారు. ఇది ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. స్వయంభువుగా ప్రత్యక్షమైన వేంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశానికి ద్వారక తిరుమల అని పేరు వచ్చింది. సుదర్శన క్షేత్రమైన ద్వారక తిరుమల చిన్నతిరుపతి గా ప్రసిద్ధి చెందింది. ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. కనుక ఆమునికి ప్రత్యక్షమైన స్వామి దక్షిణాభిముఖుడై యున్నాడు. మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉండడం అరుదు. "పెద్దతిరుపతి" (తిరుమల తిరుపతి) లో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును "చిన్నతిరుపతి"లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుందని విశ్వసిస్తారు. కాని చిన్నతిరుపతిలో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని స్థానికంగా భక్తుల నమ్మకం. ఒకే విమాన శిఖరం క్రింద రెండు విగ్రహాలు ఉండటం ఇక్కడి విశేషం. ఒక విగ్రహం సంపూర్ణమైంది. రెండవది స్వామిపై భాగం మాత్రమే కనుపించు అర్ధ విగ్రహం.

ద్వారకా తిరుమలకి చిన్న తిరుపతి అన్న మారు పేరు వ్యవహారంలో వుంది. ద్వారకుడు అనే బ్రాహ్మణుడు అతని భార్య సునంద జీవితాంతం తిరుపతి వెళ్లి ప్రతిఏటా వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేవారు. అతనికి ముసలితనం వచ్చి ఆలయానికి అంతదూరం రావడం కష్టం కావడంతో స్వామివారే ఇక్కడ వెలిశారని, ఆ ద్వారకుని పేరటనే ద్వారకా తిరుమలగా పేరు వచ్చిందని భావిస్తారు. ఐతే చెట్లుకొట్టి కట్టెలు అమ్ముకోవడం-దారుకం వృత్తిగా కలవారు , దారువులు (చెట్లు) ఎక్కువగా వుండడంతో, మెట్ట ప్రాంతానికి ద్వారం వంటిది కావడం వంటి కారణాలతో ద్వారకా తిరుమల అయిందని మరొక వాదం వుంది.[3] తిరుమలను పెద్ద తిరుపతిగా వ్యవహరిస్తూ ఆ క్రమంలోనే దీనిని చిన్న తిరుపతిగా వ్యవహరిస్తూంటారు.

జనగణన గణాంకాలు

[మార్చు]
దస్త్రం:Chinnatirupathi 9.JPG
మొదటి మెట్టు వద్ద పాదుకామండపంలో శ్రీవారి పాదాలు
ద్వారకాతిరుమల కొండ క్రింద గరుడ విగ్రహం

2011 జనాభా లెక్కల ప్రకారం ద్వారకాతిరుమల నగరంలో మొత్తం 1,353 కుటుంబాలు నివసిస్తున్నాయి. ద్వారకాతిరుమల మొత్తం జనాభా 5,543 అందులో 2,492 మంది పురుషులు, 3,051 మంది స్త్రీలు ఉన్నారు. సగటు లింగ నిష్పత్తి 1,224. పట్టణ జనాభా మొత్తంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 502, ఇది మొత్తం జనాభాలో 9%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 266 మంది మగ పిల్లలు ఉండగా, 236 మంది ఆడ పిల్లలు ఉన్నారు. బాలల లింగ నిష్పత్తి 887, ఇది సగటు లింగ నిష్పత్తి (1,224) కంటే తక్కువ.అక్షరాస్యత రేటు 80.5%, దీనిని అవిభాజ్య పశ్చిమ గోదావరి జిల్లా అక్షరాస్యతతో పోలిస్తే ద్వారకాతిరుమలలో అక్షరాస్యత (74.6%) ఎక్కువగా ఉంది. పురుషుల అక్షరాస్యత రేటు 82.52%, స్త్రీల అక్షరాస్యత రేటు 78.9% ఉంది.[4][5]

2001 భారత జనాబా లెక్కలు ప్రకారం మొత్తం జనాభా 4,391, అందులో పురుషుల సంఖ్య 2,251 , స్త్రీలు 2,140. గ్రామ పరిధిలోని గృహాల సంఖ్య 1,114. [6]

రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఏలూరు నుండి 42 కి.మీ.లు దూరములో ఉన్నది. ఏలూరునుండి ద్వారకాతిరుమలకు మూడు బస్సు రూట్లు - వయా భీమడోలు, వయా తడికలపూడి, వయా దెందులూరు - ఉన్నాయి. భీమడోలునుండి 15 కి.మీ. దూరంలో ఈ ఊరు వుంది.ఈ క్షేత్రం విజయవాడ - రాజమండ్రి మార్గంలో ఏలూరుకు 41 కి.మీ., భీమడోలుకు 17 కి.మీ., తాడేపల్లి గూడెంకు 47 కి.మీ. దూరంలో ఉంది. ఏలూరు, తాడేపల్లి గూడెంలలో ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఆగుతాయి. భీమడోలులో పాసెంజర్ రైళ్ళు ఆగుతాయి. ఈ పట్టణాలనుండి, చుట్టుప్రక్కల ఇతర పట్టణాలనుండి ప్రతిదినం అనే ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. బస్సులున్నాయి.

వసతి సౌకర్యాలు

[మార్చు]

పద్మావతి అతిథి గృహం, అండాళ్ అతిథి గృహం, రాణి చిన్నమయ్యరావు సత్రం, సీతా నిలయం, టి.టి.డి. అతిథి గృహం, కొండపైన ధర్మ అప్పారాయ నిలయము, ఆళ్వార్ సదనం, టిటిడి చౌల్ట్రీలతో పాటు కొండపైన గల  విశాలమైన డార్మిటరీ సౌకర్యంకూడా వుంది.

ద్వారకా తిరుమల ఆలయం

[మార్చు]

ఆలయ చరిత్ర

[మార్చు]

స్థల పురాణం ప్రకారం ఈ క్షేత్రం రాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదని భావిస్తారు. "ద్వారకుడు" అనే ఋషి తపసు చేసి స్వామివారి పాదసేవను కోరాడు. కనుక పాదాలు పూజించే భాగ్యం అతనికి దక్కింది. పైభాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. విశిష్టాద్వైత బోధకులైన రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించారనీ, అందరూ స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధ్రువమూర్తికి వెనుకవైపు పీఠంపై వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్ఠించారని అంటారు. స్వయంభువుగా వెలసిన, అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే, ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందనీ, తరువాత ప్రతిష్ఠింపబడిన పూర్తిగా కనుపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్ధకామ పురుషార్ధములు సమకూరుతాయనీ భక్తుల విశ్వాసం.ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేయక పోవడం ఇంకొక విశేషం. ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామి విగ్రహం క్రిందనున్న ఎర్రచీమలను కదుల్చుతాయి. ఈ గుడి సంప్రదాయం ప్రకారం ప్రతియేటా రెండు కళ్యాణోత్సావాలు వైశాఖ, ఆశ్వయిజ మాసాలలో జరుపుతారు. ఇందుకు కారణం- స్వయంభూమూర్తి వైశాఖమాసంలో దర్శనమిచ్చారనీ, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజంలో ప్రతిష్ఠించారనీ చెబుతారు.గుడి ప్రవేశంలో కళ్యాణ మంటపం ఉంది. మంటపం దాటి మెట్లు ఎక్కే ప్రాంభంభంలో (తొలి పైమెట్టు వద్ద) పాదుకా మండపంలో స్వామి పాదాలున్నాయి. పాదాలకు నమస్కరించి భక్తులు పైకెక్కుతారు. పైకి వెళ్లే మెట్ల మార్గంలో రెండు ప్రక్కలా దశావతారాల విగ్రహాలు ప్రతిష్ఠింపబడినవి. మెట్లకు తూర్పునైపున అన్నదాన సత్రం, ఆండాళ్ సదనం ఉన్నాయి. పడమటివైపు పద్మావతి సదనం, దేవాలయ కార్యాలయం, నిత్యకళ్యాణ మండపం ఉన్నాయి.

ప్రస్తుతం ఉన్న గుడిని, విమానం, మంటపం, గోపురం, ప్రాకారాలను నూజివీడు జమిందారు ధర్మా అప్పారావు (1762-1827) కాలంలో కట్టించారు. బంగారు ఆభరణాలు, వెండి వాహనాలు రాణీ చిన్నమ్మరావు (1877-1902) సమర్పించింది.

ఇతర సమీప ఆలయాలు

[మార్చు]

భ్రమరాంబా మల్లేశ్వరస్వామి ఆలయం: కొండపైన ప్రధానాలయానికి వాయువ్య దిశలో కొద్దిదూరంలోనే కొండమల్లేశ్వరస్వామి, భ్రమరాంబికల ఆలయం ఉంది. భ్రమరాంబా మల్లేశ్వరస్వామి ఈ ద్వారకా తిరుమల క్షేత్రానికి క్షేత్ర పాలకుడు. మొత్తం కొండ సర్పరాజు అనంతుని ఆకారంలో ఉన్నదనీ, తలపైన శివుడు, తోక పైన విష్ణువు కొలువు తీరారనీ చెబుతారు. ఈ దేవాలయంలో గణపతి, భ్రమరాంబ, మల్లేశ్వరస్వామి కొలువుతీరి ఉన్నారు. నవగ్రహ మందిరం కూడా ఉంది. ఆలయం తూర్పున "శివోద్యానం" అనే పూలతోట ఉంది. సమీపంలోనే టూరిజం డిపార్ట్‌మెంటు వారి "పున్నమి" అతిథి గృహం ఉంది. ఇటీవలి కాలంలో కొండపైభాగాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.

కుంకుళ్ళమ్మ (రేణుకా దేవి) ఆలయం: కొండకు 1 కి.మీ. దూరంలో, భీమడోలు నుండి ద్వారకా తిరుమల మార్గంలో "కుంకుళ్ళమ్మ" ఆలయం ఉంది. ఈమె ఈ వూరి గ్రామదేవత. ప్రధాన ఆలయంలో స్వామి దర్శనం చేసుకొన్న భక్తులు తిరిగి వెళుతూ కుంకుళ్ళమ్మను దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. ఈ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు. ద్వారకా తిరుమలనుండి కొండక్రింద గ్రామంలో సంతాన వేణుగోపాలస్వామి ఆలయానికి, కుంకుళ్ళమ్మ ఆలయానికి ఉచిత బస్సు సదుపాయం ఉంది.

వెంకటేశ్వర స్వామి, జగన్నాధ స్వామి ఆలయాలు: ద్వారకా తిరుమలకు 2 కి.మీ. దూరంలో, భీమడోలు మార్గంలో ఉన్నాయి. హవేలి లింగపాలెం గ్రామ పరిధిలో సుమారు 130 సంవత్సరాల క్రితం పూరీ (ఒడిషా)కి చెందిన "మంత్రరత్నం అమ్మాజీ" అనబడే లక్ష్మీదేవి అనే భక్తురాలు ఇక్కడ తమ ఇలవేల్పు వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించింది. అప్పటినుండి ఆ గ్రామానికి లక్ష్మీపురం అనే పేరు వాడుకలోకి వచ్చింది. వారిది పూరీ జగన్నాధమఠం కనుక జగన్నాధ స్వామిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, అమ్మవార్లు, జగన్నాధుడు, బలభద్రుడు, సుభద్ర, ఆళ్వారుల సన్నిధులు ఉన్నాయి. ద్వారకా తిరుమలను ఎగువ తిరుపతిగాను, ఈ లక్ష్మీపురాన్ని దిగువ తిరుపతిగాను భక్తులు భావిస్తారు. తిరుగు ప్రయాణంలో ఈ స్వామిని కూడా దర్శించుకోవడం ఆనవాయితీ. 1992లో ఈ ఆలయాన్ని నిర్వహణ కొరకు ద్వారకాతిరుమల దేవస్థానానికి అప్పగించారు. పుష్కరిణి మార్గంలో ఆంజనేయస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉన్నాయి. ఉగాది మండపం ఎదురుగా రామాలయం ఉన్నది

సంతాన వేణుగోపాల స్వామి ఆలయం ఉన్నది

చూదదగిన ప్రదేశాలు

[మార్చు]
  • భ్రమరాంబా మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద శివోద్యానం అనే తోట ఉంది. పుష్కరిణి మార్గంలో నందనవనం అనే తోటను, ప్రధానాలయం వెనుక నారాయణ వనం అనే తోటను పెంచుతున్నారు.
  • భీమడోలువద్ద స్వామివారి నమూనా ఆలయం ఉంది.

దత్తత ఆలయాలు

[మార్చు]
  • శ్రీ కోదండరామస్వామి దేవాలయం - నాగులూరు, రెడ్డిగూడెం మండలం, కృష్ణా జిల్లా: ఈ గ్రామాన్ని మైలవరం జమీందారులు నూరానేని వంశీయులు నిర్మించారు.
  • శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం - శనివారపు పేట, ఏలూరు సమీపంలో, నూజివీడు దారిలో - నూజివీడు జమీందారులచే నిర్మింపబడింది. ఈ ఆలయం గాలిగోపురం చాలా పెద్దది, చక్కని శిల్పాలతో అలరారుతున్నది.
  • శ్రీ భూనీళా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం - రంగాపురం (లింగపాలెం) - ద్వారకా తిరుమలకు 42 కి.మీ. దూరంలో ఉంది.
  • శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం - తూర్పు యడవల్లి: ద్వారకా తిరుమలకు 7 కి.మీ. దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని మరొక భద్రాద్రిగా భక్తులు వర్ణిస్తున్నారు.
  • మైలవరం దేవాలయాలు - మైలవరం , కృష్ణా జిల్లా - శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాలు -
  • శ్రీరామ, శ్రీ వెంకటెశ్వర స్వామి వారి దేవాలయం - భట్ల మగుటూరు, పెనుమండ్ర మండలం
  • శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం - ఐ.ఎస్.జగన్నాధపురం

కార్యక్రమాలు, పధకాలు

[మార్చు]
  • గో సంరక్షణ పధకం
  • నిత్య అన్నదాన ట్రస్ట్ - భక్తులకు ఉచిత భోజన సదుపాయం కల్పించడం
  • వివాహాది శుభకార్యాల కొరకు కల్యాణ మండపం తూర్పుగాలిగోపురం ప్రక్కనే ఉంది.

విద్యాసంస్థలు

[మార్చు]
  • శ్రీ వెంకటేశ్వర వైఖానస ఆగమ పాఠశాల - 1890లో మొదలయ్యింది. సుమారు 100 మంది విద్యార్థులకు ఉచితంగా విద్య, భోజన వసతి సౌకర్యాలు లభిస్తాయి. ప్రస్తుతం "ప్రవేశ", "వర", "ప్రవర" అనే తరగతులున్నాయి.
  • సంస్కృతోన్నత పాఠశాల - 1960లో ప్రారంభించారు.

చిత్రమాలిక

[మార్చు]

ప్రముఖులు

[మార్చు]

మూలాలు, వనరులు

[మార్చు]
  1. https://www.censusindia.co.in/villagestowns/dwarakatirumala-mandal-west-godavari-andhra-pradesh-4955. Retrieved 14 జూలై 2022. {{cite web}}: Missing or empty |title= (help)
  2. "Villages and Towns in Dwarakatirumala Mandal of West Godavari, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Retrieved 2023-02-19.[permanent dead link]
  3. బదరీనాథ్ కానూరి (ఫిబ్రవరి 2012). "నాటి 'వేంగీ విషయం'లోని (నేటి ప.గో.జిల్లా) కొన్ని గ్రామ నామాలు-వివరణలు
  4. "Villages and Towns in Dwarakatirumala Mandal of West Godavari, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Retrieved 2022-03-23.[permanent dead link]
  5. "Dwarakatirumala Population, Caste Data West Godavari Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2023-02-19. Retrieved 2023-02-19.
  6. ద్వారకా తిరుమల మండల సెన్సెస్‌

బయటి లింకులు

[మార్చు]