లక్షద్వీప్

వికీపీడియా నుండి
(లక్షద్వీప్ దీవులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
లక్షద్వీప్ దీవుల పటం-1

లక్షద్వీప్ (ലക്ഷദ്വീപ്‌), భారత దేశంలోని అతిస్వల్ప జనసంఖ్య కలిగిన అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం. [1] ఈ దీవుల భూ విస్తీర్ణం మొత్తం 32 చదరపు కి.మీ, అరేబియా సముద్రములో, కేరళ తీరంనుండి 200 నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.ఈ దీవులలో పది దీవులు మాత్రమే జనావాసం ఉన్న దీవులు. మిగిలిన 17 నిర్జీవ దీవులు. ఇవేకాక ఇంకా లెక్కలోకి తీసుకోని ఎన్నో చిన్న దీపఖండాలున్నాయి.లక్షద్వీప్ రాజధాని నగరం కవరట్టి నగరం.లక్షద్వీప్‌లో లక్షద్వీప్ జిల్లా అనే పేరుతో ఒకే ఒక జిల్లా ఉంది.

కవరట్టి, ఆగట్టి, మినీకాయ్, అమిని ప్రధానమైన దీవులు. 2001 నాటి జనాభా లెక్కల ప్రకారము ఈ కేంద్రపాలిత ప్రాంతము మొత్తము జనాభా 60,595. ఆగట్టిలో ఒక విమానాశ్రయము ఉంది. ఇక్కడికి కొచ్చిన్ నుండి నేరుగా విమాన సౌకర్యము ఉంది.[2]1973 వరకు, ఈ దీవుల సమూహము ఆంగ్లీకరించిన లక్కదీవ్స్ అనే పేరుతో పిలవబడేది. (సంస్కృతములో మాలద్వీపము అని పేరున్న మాల్దీవులుతో పోల్చండి).

ఈ దీవుల ప్రజలు మళయాళ మాండలికమును మాట్లాడతారు. దాదాపు మొత్తము జనాభా ముస్లిం మతస్తులు. తమ పూర్వీకులు ఒక పెద్ద తూఫాను వలన సముద్రములో ఈ దీవులకు కొట్టుకువచ్చిన కొందరు వర్తకులని ఇక్కడి వాసుల నమ్మకము.

నామ చరిత్ర[మార్చు]

లక్షద్వీప్ దీవుల పట-2

లక్షద్వీపాలు అంటే లక్ష అనే సంఖ్య అధారితంగా వచ్చిన పేరు.

చరిత్ర[మార్చు]

లక్షద్వీప్ దీవుల ఉపగ్రహ చిత్రం

లక్ష ద్వీపముల గురించిన ప్రస్తావన మొట్టమొదటిగా తమిళ సాహిత్యమైన పురనానూరు లో ఉంది. ఇది పురాతన ద్రవిడదేశంలో ఒక భాగంగా ఉండేది. సంగకాల తమిళ సాహిత్య పరిశోధనలో ఈ ప్రాంతం చేర దేశ ఆధీనంలో ఉండేదని కనిగొనబడింది. 7వ శతాబ్దంలో పల్లవుల వ్రాలలో ఈ ద్వీపాలు పల్లవసామ్రాజ్యా ఆధీనంలో ఉన్నట్లు ప్రస్తావించబడింది. కేరళదేశపు చివరిరాజైన చేరమాన్ పెరుమాళ్ సమంలో ఈ ద్వీపాలకు సంబంధించిన మొట్టమొదటి ఒప్పదం జరిగినట్లు ప్రాంతీయ సంప్రదాయాలు, చరిత్ర, విశేషాలు తెలియజేస్తున్నాయి. ఈ ద్వీపసముదాయంలో అతిపురాతనంగా నివసించిన ద్వీపాలు వరుసగా అమిని, కల్పేని, ఆండ్రాట్ట్, కవరాట్టి, అగాట్టి. లక్షద్వీప నివాసులు మొదట హిందువులుగా ఉండి తరువాత క్రీ శ 14వ శతాబ్దంలో ఇస్లామ్ మతస్థులుగా మారారు. ఏదిఏమైనప్పటికి సమీపకాలంలో జరిగిన పురాతత్వ పరిశోధనలలో క్రీ శ 6-7 శతాబ్దముల మధ్య కాలములో బౌద్ధులతో ఒక ఒప్పాందం జరిగినట్లు ధ్రువీకరించబడింది. ఇక్కడ ప్రాబల్యమున్న సంప్రదాయాననుసరించి ఏ.డి 661 లో ఉబైదుల్లా అను అరబ్‌దేశీయుడు లక్షద్వీపాలకు ఇస్లామ్ మతాన్ని తీసువచ్చాడని భావించబడుతుంది. ఆయన సమాధి ఆండ్రాట్ట్ ద్వీపములో ఉంది. సమాధి మీద ఏ.డి 756 తారీఖు వేసి ఉంది. 11వ శతాబ్దంలో ద్వీపవాసులు చోళ రాజుల పాలనలోకి వచ్చారు. 17వ శతాబ్దంలో ఈ ద్వీపాలు అలి రాజ్య (అరక్కల్ బీవి ఆఫ్ కానూరు)ఆధీనంలోకి వచ్చింది. దీనిని ఆమెకు కొలాతిరీలు బహుమతిగా ఇచ్చారు. పోర్చుగీసు వారు దీనిని స్వాధీనపరచుకొని కొబ్బరి పీచు ఉత్పత్తిని చేపట్టి ద్వీపవాసులు వారిని తరిమి కొట్టే వరకు ఉతప్పత్తిని కొనసాగించారు. ద్వీపవాసులు అరబ్ పర్యాటకుడు ఇబ్న్ బటువా గురించిన క్ధలను గొప్పగా వివరిస్తుంటారు.

1787 లో అమిందివి ద్వీపసముదాయం (ఆమిని, కాడ్మట్, కిల్తాన్, చెట్లత్, బిత్రా)టిప్పు సుల్తాన్ అధీనంలోకి వచ్చాయి. మూడవ ఆంగ్లో- మైసూరు యుద్ధం తరువాత ఈ ద్వీపాలు దక్షిణ కన్నడదేశంతో ఆంగ్లేయుల ఆధీనంలోకి వచ్చాయి. మిగిలిన ద్వీపాలు కన్ననూరుకు చెందిన అరక్కల్ కుంటుంబంలో స్వాధీనంలో సామంతరాజ్యంగా ఉంటూ వచ్చింది. కప్పం కట్ట లేదన్న నెపంతో బ్రిటన్ ఈ ద్వీపసముదాయాలను తన ఆధీనంలోకి తీసుకుంది. బ్రిటిష్ కాలంలో ఈ ద్వీపాలు మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన మలబారు జిల్లాకు చెంది ఉన్నాయి.

అరేబియా సముద్రంలో దుర్భిణీ వేసి వెతికితే తప్ప కనిపించని ఈ దీవుల్లో మనిషి సంచరించిన ఆనవాళ్లు క్రీ.పూ 1500 నాటికే ఉన్నాయి. బుద్ధుని జాతక కథల్లో ఈ దీవుల ప్రస్తావన ఉంది... అంటే అప్పటికే ఇక్కడ మనుషులు నివసించారనే అనుకోవాలి. ఈ కథలన్నీ పుక్కిటి పురాణాలు అని కొట్టిపారేద్దామంటే చరిత్ర అధ్యయనానికి ప్రామాణిక గ్రంథం ‘పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ’ కూడా దీనినే నిర్ధారించింది. ఆ తర్వాత మధ్యయుగం నాటికి ఈ దీవులను చోళులు పాలించారు. కాలానుగుణంగా బ్రిటిష్ పాలనను రుచి చూసి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ మన జాతీయ జెండా ఎగురవేయడంతో ఇండియాలో భాగమేనని ఖరారయ్యాయి ఈ దీవులు. స్వాతంత్య్రం వచ్చిన దశాబ్దానికి కేంద్రపాలిత ప్రాంతంగా స్థిరపడింది ఈ దీవుల సమూహం.

స్వతంత్ర భారతం[మార్చు]

1947 ఆగస్టు 15 న భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కొద్ది రోజుల అనంతరమే భారతదేశానికి దూరంగా నివసిస్తున్న ఈ ద్వీపవాసులకు దేశస్వాతంత్ర్యం గురించిన సమాచారం తెలిసింది. నిజానికి స్వతంత్రం రావడానికి ఒక మాసం మునుపే మద్రాసు ప్రెసిడెన్సీ భారతదేశ స్వాధీనంలోకి వచ్చినప్పుడే లక్షద్వీపములూ దానంటదే భారతదేశ స్వాధీనంలోకి వచ్చాయి. ముస్లిమ్ జనాభా అధికంగా ఉన్న కారణంగా ఈ ద్వీపసమూహాలను పాకిస్థాన్ తన స్వాధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించింది. అప్పటి ఉపప్రధాని అలాగే రక్షణమంత్రి అయిన ఉక్కుమనిషి అనిపించుకున్న సర్ధార్ వల్లాభాయ్ పటేల్ చేత పంపబడిన రాయల్ ఇండియన్ నేవీ లక్షద్వీపములకు చేరుకుని భారతదేశ జండాను లక్షద్వీపములో నాటి ఈ ద్వీపాల మీద భారతదేశ అధీనాన్ని ధ్రువపరిచి పాకిస్థాన్ చర్యలకు అడ్డుకట్ట వేసారు. భారతీయ యుద్ధనౌక చేరుకునే సమయంలో లక్షద్వీపాలకు సమీపంలో ఉన్న పాకిస్థాన్ కి చెందిన రాయల్ పాకిస్థాన్ నేవీ కి చెందిన యుద్ధనౌక వెనుదిరిగి కరాచీకి చేరుకుంది. 1956లో అధికంగా మళయాళీలు నివసిస్తున్న ఈ ద్వీపాలను స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ ఏక్ట్ ఆధారంగా ప్రధాన భూభాగం నుండి వేరు చేయబడి కొత్తగా ఒక యూనియన్‌గా రూపొందించబడ్డాయి.

భౌగోళికం[మార్చు]

లక్షద్వీపాలు 12 పగడపు దీవులు, మూడు సముద్రాంతర్గత దిబ్బలు, ఐదు సముద్రంలో మునిగిన తీరాలు కలిగి ముప్పై తొమ్మిది ద్వీపాలు అతిస్వల్ప ద్వీపసముదాయాలు కలిగిన ద్వీపాలతో నిండిన సముద్రము. దిబ్బలు కూడా పగడపు దీవులే అయినప్పటికీ తీరాలు పూర్తిగా సముద్రంలో మునిగి వృక్షజాలం ఏమీలేని ఇసుక దిబ్బలే. మునిగిన తీరాలు పగడపు రాళ్ళతో నిండి ఉన్నాయి. అన్ని పగడపు రాళ్ళు అగ్నేయ, ఈశాన్య తీరాలలో చాలా వరకు తూర్పుతీరంలో ఆవృతమై ఉన్నాయి. అధికముగా మునిగి ఉన్న దిబ్బలు పడమటి దిశగా మడుగులతో నిండి ఉన్నాయి. ఈ ద్వీపాలలో 10 మానవ నివాసిత ద్వీపాలు. 17 మానవరహిత ద్వీపాలు, అతి చిన్న ద్వీప సముదాయాలు వీటి సమీపంలో ఉన్నాయి, 4 కొత్తగా ఏర్పడిన ద్వీపాలు, ఐదు మునుగిన దిబ్బలు. వీటిలో ప్రధాన దీవి అయిన కవరాట్టిలో లక్షద్వీప రాజధని నగరం అయిన కవరాట్టి నగరం ఉంది ఈ ద్వీపంతో ఆగట్టి, మినికాయ్, ఆమ్ని దీవుల మొత్తం జనాభా, 2011 జనాభా గణాంకాలను అనుసరించి 60,595. ఆగట్టిలో ఉన్న విమానాశ్రయం నుండి కేరళ లోని కొచ్చిన్ లేక ఎర్నాకుళం వరకు నేరుగా వెళ్ళే విమానాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణీకులు ఈ ద్వీపాలను సందర్శించడానికి అనుమతి లేదు. ప్రస్తుత భారతదేశ మద్యపాన చట్టములను అనుసరించి లక్షద్వీప ద్వీపసముద్రములో మద్యపానము ఒక్క బెంగారామ్ ద్వీపంలో తప్ప మిగిలిన అన్ని ద్వీపాలలో నిషేధించబడింది.

అరేబియా సముద్రంలో ఆఫ్రికా - ఆసియా ఖండాల వ్యాపార మార్గంలో ఉన్నాయి లక్షద్వీప్ దీవులు. పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా భారత తీరాన్ని చేరింది కూడా ఈ దీవుల మీదుగానే. వీటి పేరు లక్షదీవులు... అనే కానీ మనదేశంలోని యూనియన్ టెరిటరీల్లో చిన్నది ఇదే. భూభాగం అంతా కలిపితే విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లకు మించదు. ఒక మోస్తరు పెద్ద దీవులు 36 ఉన్నప్పటికీ పది దీవులే జనావాసాలు. పది సబ్ డివిజన్లతో ఒకే ఒక జిల్లా ఇది. జనాభా పది దీవుల్లో కలిసి 65 వేలకు మించదు. స్థానికుల్లో ఎక్కువ శాతం మలయాళీలే. అధికార భాష కూడా మలయాళమే, మినికోయ్ దీవిలో నివసించే వాళ్లు మాత్రం మహిల్ భాష మాట్లాడుతారు. ఇది మాల్దీవుల్లో మాట్లాడే భాష. ఈ దీవి మిగిలిన దీవుల సమూహానికి దూరంగా విసిరేసినట్లు ఉంటుంది. ఇక్కడి ప్రజల జీవనశైలి మిగిలిన దీవులకు భిన్నంగా ఉండదు, కానీ భాష వేరు.

భారతీయ పగడపుదీవులు[మార్చు]

ది ఆమ్ని గ్రూప్ ద్వీపాలు (ఈ బృందంలో ఆమ్ని, కెల్టాన్, చెట్లత్, కడ్మాట్, బిత్రా, పెరుమాళ్), లక్షద్వీప దీవులు (వీటిలో ఆండ్రోత్, కల్పేని, పిట్టి, సుహేలి) ఈ రెండింటి మధ్య సముద్రాంతభాగ సంబంధం ఉంది. 200 కిలోమీటర్ల వెడల్పైన నైన్ డిగ్రీ కెనాల్ దక్షిణ భాగంలో ఉన్న మినికాన్ ద్వీపంతో ఉన్న ద్వీపాలన్నీ పగడపు రాళ్ళతో నిర్మితమై అలాగే పగడపు దిబ్బలతో భారతీయ పగడపు దీవులుగా ప్రసిద్ధి చెందాయి. ఈ ద్వీపాలన్నీ పగడపు రాళ్ళతో నిండి తీరానికి సమీపంలో ఉన్నాయి. ఉత్తరంగా ఉన్న రెండు తీరాలు ఈ గ్రూప్ ద్వీపాలలో చేర్చబడ లేదు.

 • ఆంగ్రియా తీరం.
 • ఆడాస్ తీరం.

రాజకీయాలు[మార్చు]

లక్షద్వీపాలన్నీ కలసి ఒక భారతీయజిల్లాగా రూపొందింది. కేంద్రప్రభుత్వం నియమించిన ప్రతినిధి నిర్వహణలో ఈ భారతీయ కేంద్రపాలిత ప్రాంతం పాలించబడుతుంది. ఈ కేంద్రపాలిత ప్రాంతం కొచ్చిన్ లోని కేరళా హై కోర్ట్ న్యాయవ్యవస్థకు చెంది ఉంది. ఈ ప్రదేశం మొత్తం ఒక లోకసభ సభ్యుడిని ఎన్నికచేస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ప్రాంతీయ ఎన్నికలు నిర్వహించబడడం లేదు. అయినప్పటికీ నిర్వాహము పంచాయితీ రాజ్‌తో చేరిన టూ-టైర్ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తుంది. లక్షద్వీపాలలో 10 ఐలాండ్ కౌన్సిల్స్ పనిచేస్తున్నాయి. వీటిలో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 79.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల అనుసరించి లక్షద్వీప జనసంఖ్య 64,429. మార్షల్ ద్వీపవాసులకు ఇది సరాసరి జన సంఖ్య. 640 భారతీయ శ్రేణులలో లక్షద్వీప జనసంఖ్య 627వ శ్రేణిలో ఉంది. ఈ జిలా జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 2,013. లక్షద్వీప వైశాల్యం 5,210 చదరపు మైళ్ళు. ఈ దశాబ్ధపు (2001-2011) జనసంఖ్య వృద్ధిరేటు 6.23%. లక్షద్వీప స్త్రీపురుష నిష్పత్తి 946:1000. అక్షరాస్యత 92.28%. రాష్ట్రంలో ముస్లిం మతానికి చెందిన ప్రజలు 96.58% ఉన్నారు. ముస్లిం జనాభా లక్షద్వీప్‌లో మొత్తం జనాభాలో 64.47 వేలల్లో, 62.27 వేల (96.58 శాతం) ఉన్నారు లక్షద్వీప్‌లో క్రైస్తవ జనాభా మొత్తం 64.47 వేలల్లో 0.32 (0.49 శాతం) మంది ఉన్నారు.[3]

భాషలు[మార్చు]

లక్షద్వీపాల భాషలు మలయాళము, జెసేరీ (ద్వీప్ భాషా). ఉత్తర ద్వీపవాసులు వారి వ్యాపార సమయాలలో తమిళం, అరబిక్ ప్రభావిత మళయాళ యాసతో మాట్లాడుతుంటారు. దక్షిణ ప్రాంత మినికాయ్ ప్రజలు మహ్ల్ భాషను మాట్లాడతారు. ఇది మాల్దీవులలో మాట్లాడే దివేహి భాషకు కొంతమార్పిడి చెందిన భాష. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో మళయాళ అక్షరాలతో కూడిన మళయాళ భాష అధికారిక భాషగా పరిచయము చేయబడింది. సమీపకాలముగా ఈ భాకు అరబిక్ ఒక విధమైన అక్షరాలను వాడుతున్నారు. ఈ విధానాన్ని భారతప్రభుత్వం కొనసాగిస్తుంది. మహ్ల్ భాషా ప్రభావితమైన మినికాయ్ ద్వీపంతో సహా లక్షద్వీపాల మధ్య అనుసంధిక భాషగా మళయాళ భాషను వాడుతుంటారు.

సంస్కృతి[మార్చు]

లక్ష ద్వీపవాసులు సాంస్కృతింగా కేరళా సముద్రతీర ప్రాంత ప్రజలను పోలి ఉంటారు. అలాగే అరబ్ వ్యాపారులచేత ప్రభావితులై ఉంటారు. దక్షిణ ప్రంతంలో ఉన్న అలాగే ద్వితీయస్థానంలో ఉన్న మినికాయ్ వాసులైన దివేహీలు ఇక్కడి స్థానికులుగా భావించబడుతున్నారు. ఈ దివేహీ సమూహాలు, ఉప దివేహీలు కొన్ని సందర్భాలలో మహ్లాస్. దేశీయంగా జనాభాపరంగా అధికులు సున్నీ ముస్లీములు. మినికాయ్ వాసులు తప్ప మిగిలిన దివి లేక ఆమ్నిదివీలు. లక్షద్వీపవాసులు సాంస్కృతిక సమూహాలు 84.33% మలయాళీలు, 15,67% మహ్లాస్.

జీవావరణశాస్త్రం[మార్చు]

లక్షద్వీప సముద్రతీర ప్రాంతాలు మాల్దీవులకు చాగోస్ దీవులను పోలి ఉంటుంది. లక్షద్వీప మడుగులు, కొండపగుళ్ళు, సముద్రతీరాలు పలు విధముల సముద్రతీర జీవజాలానికి విలసిల్లడానికి అనుకూల వాతావరణం కలిగి ఉంటుంది. వీటిలో జీవమున్న పగడపు కొండలు, సముద్రపు అర్చిన్స్, సముద్రపు పాచి, సముద్రపు దోసకాయలు, నక్షత్ర చేపలు, కఒరీలు, క్లామ్స్,, అక్టోపసులు ఉంటాయి. సీతాకోక చేపల వంటి అనేకరకాల చేపలు మొరే ఈల్స్, లాగూన్ (మడుగు) ట్రిగ్గర్ ఫిష్ అలాగే మరికొన్ని ఉన్నాయి. నివాసయోగ్యం కాని చర్బానియన్, బైరమ్‌గోర్ కొండ పగులు, పెరుమాల్ పార్ అలాగే పిట్టీ పాల్ ద్వీపం మొదలైనవి సముద్రపు టర్టిల్స్, బ్రౌన్ నొడ్డీ, లెసర్ క్రెస్టెడ్ టర్న్, గ్రేటర్ క్రెస్టెడ్ టర్నులు మొదలైన సముద్రపు పలు పక్షులు సంతానోత్పత్తి కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. పలురకములైన ట్యూనా, వాహూ, స్వోర్డ్ ఫిష్ (కత్తి చేపలు), డాల్ఫిన్స్ వంటివి ఈ ద్వీపతీర సముద్రంలో సాధారణంగా కనిపిస్తుంటాయి. సుహేలీ పార్ వద్ద ఉన్న సముద్రతీర ప్రాణుల పుష్కలత కారణంగా ఈ ప్రాంతాన్ని మేరిన్ నేషనల్ పార్క్ గా ప్రకటించబడింది.

లక్షద్వీప్ జిల్లా[మార్చు]

లక్షద్వీప్ మొత్తం కేంద్రపాలితప్రాంతం ఒక జిల్లాగా పరిగణించబడుతుంది.[4] జిల్లా ముఖ్యపట్టణం కవరట్టి. అంతకుముందు జిల్లాను నాలుగు తహసీల్స్‌గా విభజించారు. ప్రస్తుతం 10 సబ్ డివిజన్లు ఉన్నాయి. సబ్ డివిజనల్ అధికారులు 8 ద్వీపాలలో అభివృద్ధి కార్యకలాపాలను నిర్వహిస్తారు.మినికోయ్, అగట్టిలలో సబ్ డివిజన్ డిప్యూటీ కలెక్టర్ కింద ఉంది. అడ్మినిస్ట్రేషన్ సెక్రటేరియట్ 1964 మార్చిలో కోజికోడ్ నుండి కవరట్టికి మార్చబడింది. వివిధ ప్రణాళిక పథకాలు, నిధుల కేటాయింపుల పెరుగుదలతో, విభాగం వికేంద్రీకరణ అవసరాన్ని గుర్తించి, తదనుగుణంగా 1972 లో కొత్త కార్యాలయాలు సృష్టించబడ్డాయి. డిపార్ట్‌మెంటల్ కార్యాలయాలు విడిగా పనిచేస్తున్నప్పటికీ, అడ్మినిస్ట్రేషన్ సెక్రటేరియట్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటేరియట్ భవనం నుండి కాంపాక్ట్ యూనిట్‌గా ఒకే ఫైల్ సిస్టమ్ కింద పనిచేస్తాయి

రెవెన్యూ, ల్యాండ్ సెటిల్మెంట్, లా అండ్ ఆర్డర్ వంటి జిల్లా పరిపాలన పరిధిలోకి వచ్చే అంశాలు కలెక్టర్ కమ్ డెవలప్‌మెంట్ కమిషనర్ పరిధిలో ఉన్నాయి. అతను జిల్లాకు మేజిస్ట్రేట్‌గా పనిచేస్తాడు . లక్షద్వీప్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎల్‌డిసిఎల్) మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిని నియమించి, సెక్రటరీ, పే అండ్ అకౌంట్స్ పోస్టును సృష్టించిన తరువాత, కలెక్టర్ కమ్ డెవలప్‌మెంట్ కమిషనర్‌తో సహా ఈ సీనియర్ అధికారులలో అభివృద్ధి విభాగాలు కేటాయించబడ్డాయి. కేటాయించిన విభాగాలకు వారు కార్యదర్శులుగా నియమించారు.

శాంతిభద్రతల అమలుకు సంబంధించి జిల్లా మేజిస్ట్రేట్‌కు ఒక అదనపు జిల్లా మేజిస్ట్రేట్, పది ఎగ్జిక్యూ్టివ్ మేజిస్ట్రేట్‌లు సహాయం చేస్తారు. లక్షద్వీప్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ గా లక్షద్వీప్ పోలీసులు అడ్మినిస్ట్రేటర్ ఆధ్వర్యంలో, నియంత్రణలో ఉన్నారు. జిల్లా పరిధిలో 9 పోలీస్ స్టేషన్లు, 2 పోలీస్ అవుట్ పోస్టులు, 1 పోలీస్ ఎయిడ్ పోస్టులలో, లక్షద్వీప్ పోలీసులు 349 మంది సిబ్బందిని మంజూరు చేశారు. పోలీసు సూపరింటెండెంట్ ఫోర్సు హెడ్, పోలీసు బలంతో పాటు శాంతిభద్రతల నిర్వహణ కోసం, కేంద్ర ప్రభుత్వం భారత రిజర్వ్ బెటాలియన్ సంస్థను లక్షద్వీప్, దాద్రా నగర్ హవేలి, డామన్ డయ్యూ కోసం ప్రత్యేకంగా పెంచింది. ఐఆర్‌బికి చెందిన 355 మంది సిబ్బంది లక్షద్వీప్‌లోని వివిధ ద్వీపాల్లో ఉన్నారు. లా అండ్ ఆర్డర్ మెషినరీని బలోపేతం చేయడానికి లక్షద్వీప్ మెరైన్ పోలీస్, లక్షద్వీప్ హోమ్ గార్డ్సును కూడా ఉన్నారు, కవరట్టిలో నావల్ డిటాచ్మెంట్ & కోస్ట్ గార్డ్ యూనిట్లు ఏర్పాటు చేయబడ్డాయి. మినీకోయ్ ద్వీపంలో కూడా నావల్ డిటాచ్మెంట్ పనిచేస్తోంది.

సమాజ అభివృద్ధి పథకాలను అమలు చేసే ఉద్దేశ్యంతో ఈ భూభాగాన్ని ఐదు కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లుగా విభజించారు, కవరట్టి, అమిని, ఆండ్రోట్, మినికోయ్, కిల్తాన్‌లతో బ్లాక్ హెడ్ క్వార్టర్స్‌గా విభజించారు. పరిపాలనను ప్రజలకు దగ్గరగా తీసుకురావడానికి ఎనిమిది సబ్ డివిజన్ అధికారులు, ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లు అగట్టి సబ్ డివిజన్లో భాగమైన బంగారం (దీవి) మినహా అన్ని జనావాస ద్వీపాలలో పోస్ట్ చేయబడ్డారు. వారు సంబంధిత ద్వీపాల బ్లాక్ డెవలప్మెంట్ / అదనపు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా కూడా పనిచేస్తారు.[4]

లక్షద్వీప్ జిల్లా గణాంకాలు[మార్చు]

జనాభా[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం లక్షద్వీప్ జిల్లాలోని మొత్తం జనాభా 64,473. వీరిలో 33,123 మంది పురుషులు కాగా, 31,350 మంది మహిళలు ఉన్నారు. 2011 నాటికి లక్షద్వీప్ జిల్లాలో మొత్తం 11,574 కుటుంబాలు నివసిస్తున్నాయి. లక్షద్వీప్ జిల్లా మొత్తం సగటు లింగ నిష్పత్తి 1000: 946గా ఉంది.2011 జనాభా లెక్కల ప్రకారం లక్షద్వీప్ జిల్లా మొత్తం జనాభాలో 78.1% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 21.9% గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత 91.9% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 91.6%గా ఉంది. లక్షద్వీప్ జిల్లాలోని పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 945 కాగా, గ్రామీణ ప్రాంతాల లింగ నిష్పత్తి 952గా ఉంది.లక్షద్వీప్ జిల్లాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 7255 మంది ఉన్నారు. ఇది మొత్తం జనాభాలో 11%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 3797 మగ పిల్లలు, 3458 ఆడ పిల్లలు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం లక్షద్వీప్ బాలల లైంగిక నిష్పత్తి1000: 911గా ఉంది. ఇది లక్షద్వీప్ జిల్లాలోని సగటు లింగ నిష్పత్తి (946) కన్నా తక్కువ.లక్షద్వీప్ జిల్లా మొత్తం అక్షరాస్యత 91.85%గా ఉంది. లక్షద్వీప్ జిల్లాలో పురుషుల అక్షరాస్యత రేటు 84.6%కాగా, మహిళా అక్షరాస్యత రేటు 78.25%గా ఉంది.[5]

మతాల వారీగా జనాభా[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం లక్షద్వీప్ జిల్లాలో ఆధారంగా మొత్తం జనాభాలో హిందూ మతానికి చెందినవారు 1,788 (2.77%) మంది ఉన్నారు.వారిలో పురుషులు 1,603 మందికాగా, స్త్రీలు 185 మంది ఉన్నారు.ముస్లిం మతానికి చెందినవారు 62,268 (96.58%) మంది ఉన్నారు.వారిలో పురుషులు 31,166 మందికాగా, స్త్రీలు 31,102 మంది ఉన్నారు.క్రిస్టియన్ మతానికి చెందినవారు 317 (0.49%) మంది ఉన్నారు.వారిలో పురుషులు 286 మందికాగా, స్త్రీలు 31 మంది ఉన్నారు.సిక్కు మతానికి చెందినవారు 8 (0.01%) మంది ఉన్నారు.వారిలో పురుషులు 6 మందికాగా, స్త్రీలు 2 ఇద్దరు ఉన్నారు.బౌద్ధులు 10 (0.02%) మంది ఉన్నారు.వారిలో పురుషులు 9 మందికాగా, స్త్రీలు 1 ఒక్కరు మాత్రమే ఉన్నారు.జైనులు 11 (0.02%) మంది ఉన్నారు.వారిలో పురుషులు 6 మందికాగా, స్త్రీలు 5 గురు ఉన్నారు.ఇతర మతాలువారు 7(0.01%) గురు మంది ఉండగా,వారిలో 6 గురు పురుషులు, ఒక్కరు స్త్రీ మాత్రమే ఉంది.మతాలు గుర్తించనివారు 64 (0.1%) మంది ఉండగా,వారిలో పురుషులు 41 మంది, స్త్రీలు 23 మంది ఉన్నారు.[5]

జనాభా సాంద్రత[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం లక్షద్వీప్ జిల్లా మొత్తం వైశాల్యం 30 చ. కి.మీ. జిల్లా జన సాంద్రత చదరపు కిలోమీటరుకు 2,149 మంది.22 చదరపు కి.మీ. విస్తీర్ణం పట్టణ ప్రాంతంలో ఉండగా 8 చదరపు కి.మీ. గ్రామీణ ప్రాంతంలో ఉంది.[5]

జనావాస దీవులు[మార్చు]

లక్షద్వీప్ జిల్లాలో 10 ఉప విభాగాలున్నాయి.[6]

 1. ఆగట్టి
 2. అమిని
 3. ఆండ్రొట్ట్
 4. బిట్ర
 5. చెట్లాట్
 6. కద్మత్
 7. కల్పేని
 8. కవరట్టి
 9. కిల్తన్
 10. మినీకాయ్

ఆర్ధిక రంగం[మార్చు]

లక్షద్వీప జాతీయ ఉత్పత్తి ప్రస్తుత విలువలలో 60 మిలియన్ల అమెరికా డాలర్లు. లక్షద్వీపములో కొంత ఆర్థిక అసమానలు ఉన్నాయి. దారిద్యరేఖకు దిగువన కొంత మంది ప్రజలు ఉన్నారు. కొబ్బరిపీచు ఉత్పత్తి, పీచుతో చేయబడే ఉత్పత్తులు ఇక్కడి ప్రధాన ఆదాయ వనరులు. ఇక్కడ 5 కాయిర్ ఫైబర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. 5 ఉత్పత్తి వివరణ కేంద్రాలు, ఏడు ఫైబర్ కర్లింగ్ యూనిట్స్ ప్రభుత్వం చేత నడపబడుతున్నాయి. ఈ కేంద్రాలు కాయిర్ ఫైబర్ కర్లింగ్, కాయిర్ యార్న్, కారిడార్ ఉత్పత్తి చేస్తున్నాయి.

పర్యాటక రంగం[మార్చు]

ఇక్కడి ప్రశాంత వాతావరణానికి శాస్త్రీయ పరిశోధనలకు అనువైన సముద్రతీలాల వలన లక్షద్వీఅపములు భారతీయులకు 1974 నుండి ప్రముఖ పర్యాటక ఆకర్షణ కలిగి ఉంది. పర్యాటకరంగం లక్షద్వీపాలకు గుర్తించతగినంత ఆదాయాన్ని ఇస్తుంది. పర్యాటకరంగం నుండి వచ్చే ఆదాయం క్రమంగా అభివృద్ధిచెందుతూ ఉంది. స్థలాభావంచేత ఈ ద్వీపాలలో ఫ్యాక్టరీలు నడపడానికి వీలు కాదు కనుక ప్రభుత్వంకూడా పర్యాటకరంగాన్ని ప్రోత్సహిస్తుంది. బంగరమ్, కడమట్ ద్వీపాలు పర్యాటకులను ఆకర్షించడంలో ప్రత్యేకత కలిగి ఉన్నాయి. అంతర్జాతీయ పర్యాటకుల ప్రత్యేక ఆకర్షణగా బంగరమ్ ద్వీపం తీర్చిదిద్దబడుతుంది. సముద్రతీర వృక్షసంపద పర్యాటకులకు కనువిందు చేస్తున్నది. నీటి క్రీడలు స్కూబాడైవింగ్, విండ్ సర్ఫింగ్, స్నార్క్లింగ్, సర్ఫింగ్, కయాకింగ్, కేనోయింగ్, వాటర్ స్కీయింగ్, యాచ్టింగ్, ధైర్యసాహసాలతో కూడుకున్న సముద్రంలో నైట్ వాయేజ్ వంటి జలక్రీడలు పర్యాటక ఆకర్ష్ణలో ప్రబలమైనవి. సముద్రం పూర్తిగా ఉగ్రరూపం ధరించే నైరుతీ ఋతుపవన కాలంలో తప్ప సంవత్సరమంతా పర్యాటనకు అనుకూలమే.

ఒక్కో దీవిలో పర్యటిస్తూ ఇక ఈ దీవిని చూసింది చాలనిపించి ఫెర్రీ ఎక్కి మరో దీవిలోకి అడుగుపెడితే అక్కడ పర్యాటకులు వాటర్ సర్ఫింగ్‌కి సిద్ధమవుతుంటారు. నీటి మీద అలలతో పోటీ పడుతూ ఎగిరి గంతులేయడాన్ని టెలివిజన్ ప్రోగ్రామ్‌లో చూసి ఆనందించడమే తప్ప స్వీయానుభవం లేని వాళ్లకు అలలతో ఆడుకోవాలనే సరదాతోపాటు కొంచెం భయం కూడా వేస్తుంది. కానీ ఇక్కడి ట్రైనర్లు ‘సర్ఫింగ్ బోర్డు మీద ఎలా నిలబడాలి, అల వస్తున్న దిశకు అనుగుణంగా ఎలా కదలాలి...’ వంటి ప్రాథమిక విషయాల్లో శిక్షణనిచ్చి నీటి మీదకు పంపిస్తారు. పొరపాటున నీటిలో పడిపోయినా వెంటనే బయటకు తీసుకొస్తారు.

ఇతర ఉత్పత్తులు[మార్చు]

లక్షద్వీప్ దీవుల్లో మనుష్య సంచారం లేని చిన్న చిన్న దిబ్బల్లాంటివి లెక్కలేనన్ని ఉంటాయి. కొన్ని దీవుల్లోకి పగడాల వేటగాళ్లు మాత్రమే అడుగుపెడుతుంటారు. ఈ కేంద్రపాలిత ప్రాంతానికి రాజధాని కరావట్టి దీవి. లక్షద్వీప్ దీవుల్లోని స్థానికులకు చేపల వేట, కొబ్బరి తోటల సాగు, కొబ్బరి పీచు తీయడం ప్రధాన వృత్తులు. అత్యంత ఖరీదైన ‘ట్యూనా ఫిష్’ ఇక్కడి నుంచి పెద్దమొత్తంలో ఎగుమతి అవుతుంది. ఇప్పుడు పర్యాటకం పెద్ద పరిశ్రమ అయింది. కొన్ని దీవులను పూర్తిగా టూరిస్టు రిసార్టులు, వాటర్ స్పోర్ట్స్ కోసమే డెవలప్ చేశారు. ఇలాంటి దీవుల్లో నివసించేవాళ్లంతా పర్యాటకశాఖ ఉద్యోగులే ఎక్కువగా ఉంటారు.

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-04-14. Retrieved 2020-12-06.
 2. http://www.mapsofindia.com/flight-schedule/kochi-agatti.html
 3. "Lakshadweep Religion Data - Census 2011". www.census2011.co.in. Retrieved 2020-12-06.
 4. 4.0 4.1 https://web.archive.org/web/20120512103644if_/http://lakshadweep.nic.in/KL_Administration.html
 5. 5.0 5.1 5.2 "Lakshadweep District Population Religion - Lakshadweep, Lakshadweep Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-12-08.
 6. "Lakshadweep district, Lakshadweep Village Directory @VList.in". vlist.in. Retrieved 2020-12-08.

బయటి లింకులు[మార్చు]