శంకరాభరణం
శంకరాభరణం | |
---|---|
దర్శకత్వం | కె.విశ్వనాథ్ |
రచన | జంధ్యాల |
నిర్మాత | ఏడిద నాగేశ్వరరావు |
తారాగణం | జె.వి.సోమయాజులు , మంజు భార్గవి, రాజ్యలక్ష్మి, చంద్రమోహన్, అల్లు రామలింగయ్య |
ఛాయాగ్రహణం | బాలు మహేంద్ర |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | ఫిబ్రవరి 2, 1980 |
సినిమా నిడివి | 143 నిమిషాలు |
భాష | తెలుగు |
శంకరాభరణం 1980 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన సంగీత ప్రాధాన్యత గల చిత్రం. ఈ చిత్రాన్ని పూర్ణోదయా క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించాడు. జె. వి. సోమయాజులు, మంజుభార్గవి, రాజ్యలక్ష్మి, అల్లు రామలింగయ్య, చంద్రమోహన్ ముఖ్యపాత్రలు పోషించారు. కె. వి. మహదేవన్ అందించిన సంగీతం ప్రేక్షకులకు బాగా చేరువైంది. కమర్షియల్ హంగులు లేకున్నా ఘనవిజయం సాధించి శంకరాభరణం ఒక సంచలనం సృష్టించింది. 70వ దశకంలో మాస్ మసాలా చిత్రాల వెల్లువలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా రంగానికి మేలిమలుపు అయ్యింది. అంతగా పేరులేని నటీ నటులతో రూపొందిన ఈ చిత్రం అఖండ ప్రజాదరణ సాధించటం విశేషం. ఈ చిత్రం దేశవ్యాప్తంగా శాస్త్రీయ సంగీతాభిమానుల ప్రశంశలను కూడా పొందింది. ఈ చిత్రానంతరం చిత్రదర్శకుడు కె.విశ్వనాధ్ కళా తపస్విగా పేరొందారు. గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఈ సినిమాతో మంచి ప్రఖ్యాతి పొంది తెలుగు చలనచిత్రరంగంలో స్థానం సుస్థిరం చేసుకున్నారు. శంకరాభరణం సినిమా ప్రేరణతో చాలామంది కర్ణాటక సంగీతం నేర్చుకున్నారంటే సినిమా ప్రభావం తెలుస్తోంది.[1]
గోవాలో 2022 నవంబరు 20 నుండి 28 వరకు జరుగుతున్న 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో రీస్టోర్డ్ ఇండియన్ క్లాసిక్ విభాగంలో ప్రత్యేక ప్రదర్శనకు శంకరాభరణం ఎంపిక అయి అరుదైన గౌరవం పొందింది.[2]
చిత్ర కథ
[మార్చు]శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుగాంచిన శంకరశాస్త్రి (జె వి సోమయాజులు) ఒక గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన సంగీతమంటే చెవి కోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకానొక వేశ్య కూతురు,గొప్ప నర్తకి అయిన తులసి (మంజు భార్గవి) ఆ వృత్తిని అసహ్యించుకుంటుంది. కళలను ఆరాధించే తులసి, శంకరశాస్రిని గురుభావంతో ఆరాధిస్తుంది. ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవాలని ఆశపడుతుంది. కానీ ఆమె తల్లి మాత్రం ఆ వృత్తిలోనే కొనసాగాలని పట్టుబడుతుంది. ఆమెను బలాత్కరించి శంకర శాస్త్రిని తులనాడిన ఒక విటుణ్ణి విధిలేని పరిస్థితులలో హతమారుస్తుంది తులసి. శంకర శాస్త్రి ఆమెకు అండగా నిలుస్తాడు. లాయర్ అయిన తన స్నేహితుడి సాయంతో ఆత్మరక్షణకై చంపినట్లుగా నిరూపించి తులసిని విడిపిస్తాడు.వేశ్యయైన ఆమెకు ఆశ్రయం ఇవ్వడంతో శంకరశాస్త్రిని అందరూ చిన్న చూపు చూడడం మొదలు పెడతారు. తన వల్ల శంకరశాస్త్రి నిందలు పడవలసి రావడం తట్టుకోలేని తులసి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది.
కాలక్రమంలో పాశ్చాత్య సంగీతపు ఒరవడిలో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువై శంకరశాస్త్రి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. తనపై జరిగిన అత్యాచార ఫలితంగా తులసి ఒక కొడుకుకి తల్లి అవుతుంది. శంకరశాస్త్రి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి నియమిస్తుంది. దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న శంకరశాస్త్రి కుటుంబాన్ని ఆయనకు తెలియకుండా ఆమె అప్పటిదాకా కూడబెట్టిన డబ్బుతో ఆదుకుంటుంది. చివరకు తన కొడుకును తన సంగీతానికి వారసుడుగా నియమించి కన్ను మూసిన శంకరశాస్త్రి పాదాల దగ్గరే ప్రాణాలు విడుస్తుంది.
పాత్రలు-పాత్రధారులు
[మార్చు]- జె.వి.సోమయాజులు - శంకరశాస్త్రి
- మంజు భార్గవి - తులసి
- రాజ్యలక్ష్మి - శంకరశాస్త్రి కూతురు
- చంద్రమోహన్
- అల్లు రామలింగయ్య
- తులసి - తులసి కొడుకు
- నిర్మలమ్మ
- పుష్పకుమారి
- సాక్షి రంగారావు
- ఝాన్సీ
- వరలక్ష్మి
- అర్జా జనార్ధన రావు
- డబ్బింగ్ జానకి
- జిత్ మోహన్ మిత్ర
- శ్రీ గోపాల్
నిర్మాణం
[మార్చు]కథా చర్చలు
[మార్చు]తాయారమ్మ బంగారయ్య సినిమా విజయం తరువాత దర్శకుడు కె.విశ్వనాథ్ని కలిశాడు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. నాగేశ్వరరావుకి అంతకుముందు ఇచ్చిన మాట ప్రకారం అతడితో సినిమా చెయ్యడానికి పూనుకున్నాడు విశ్వనాథ్. అలా, శాస్త్రీయ సంగీతపు ఔన్నత్యాన్ని తెలిపే అంశంతో తను అనుకున్న కథను రచయిత జంధ్యాలతో కలిసి తయారు చేశాడు విశ్వనాథ్. నాగేశ్వరరావుకి ఇంటర్వెల్ నచ్చి క్లైమాక్స్ నచ్చకపోవడంతో మళ్ళీ కథాచర్చలు నిర్వహించి చివరకు దానికి శంకరాభరణం అని పేరు పెట్టారు. అయితే, ప్రసిద్ధ వీణా విద్వాంసుడైన ఈమని శంకరశాస్త్రికి శంకరాభరణం రాగమంటే ఇష్టమనే విషయం అందరికీ తెలిసినదే కావడంతో అతడి జీవితకథతోనే సినిమా తీస్తున్నారని అందరూ అనుకున్నారు.[3]
నటీనటుల ఎంపిక
[మార్చు]విజ్ఞానం, గాంభీర్యం, చిరు కోపం లాంటి లక్షణాలు కలిగిన శంకరశాస్త్రి పాత్రకు తొలుత అక్కినేని నాగేశ్వరరావు, శివాజీగణేశన్ లను అనుకున్నారు. కానీ వారిని సంప్రదించలేదు. ఆ తరువాత కృష్ణంరాజుకు కథను వినిపించారు. అయితే, ఆ పాత్ర తనకు కొత్తని, దాన్ని ప్రేక్షకులు అంగీకరించకపోతే దాని ప్రయోజనం దెబ్బతింటుందని కృష్ణంరాజు తిరస్కరించాడు. చివరకు ఆ పాత్రకు ఓ కొత్త నటుడిని ఎంపిక చేయాలన్న దర్శకుడు విశ్వనాథ్ ఆలోచనను సమర్థించాడు నిర్మాత నాగేశ్వరరావు.[3] ఆ విషయమై వారిద్దరినీ తమ సన్నిహితులు వారించినా వారు తమ నిర్ణయం వైపే మొగ్గు చూపారు. ఆ క్రమంలో తనతో కలిసి ఒకప్పుడు నాటకాలు వేసిన జె.వి.సోమయాజులు గురించి విశ్వనాధ్ తో చెప్పాడు నాగేశ్వరరావు. అందుకు గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కూడా సమర్థించాడు.[4]
చిత్రీకరణ
[మార్చు]ఈ సినిమాలో ప్రధాన భాగం రాజమండ్రిలో, దానికి సమీపంలోని రఘదేవపురం గ్రామంలో చిత్రీకరించారు.[5]
ప్రజాదరణ పొందిన సంభాషణలు
[మార్చు]పాశ్చాత్య సంగీత పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని ఒక్క కాపు కాయడానికి తన చేతులడ్డు పెట్టిన ఆ మహానుభావులెవరో వారికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను అని సినిమా చివరలో శంకర శాస్త్రి సభికులతో చెప్పే మాట ఈ సినిమా యొక్క సారాంశాన్ని కొన్ని మాటల్లో వివరిస్తుంది. శంకరశాస్త్రి సభికుల్ని ఉద్దేశించి వాడే సభకు నమస్కారం అనే పదబంధాన్ని పలువురు వక్తలు సమావేశాల్లో వాడుతున్నారు.
విడుదల, ఫలితం
[మార్చు]ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ముందుగా బయ్యర్లు దొరకలేదు. వాళ్ళు దొరికినా విడుదలైన కొత్తలో సినిమా చూసేందుకు హాలు నిండా ప్రేక్షకులు కూడా లేరు. కానీ నెమ్మదిగా జనం రావడం మొదలు పెట్టారు. కొద్ది రోజుల్లోనే మంచి ఆదరణ పొందింది. ఊరూరా విజయోత్సవాలు జరిగాయి. దర్శకులు కె. విశ్వనాథ్ కి పలు సన్మానాలు జరిగాయి.[6]
పాటలు
[మార్చు]సంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: కె. వి. మహదేవన్.
సం. | పాట | పాట రచయిత | గానం | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ఏ తీరుగ నను దయ చూచెదవో" | శ్రీ భక్త రామదాసు | వాణీ జయరాం | |
2. | "ఓంకారనాదాను సంధానమౌ గానమే శంకరాభరణము" | వేటూరి సుందరరామ్మూర్తి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం٫ ఎస్. జానకి | |
3. | "దొరకునా ఇటువంటి సేవ" | వేటూరి సుందరరామ్మూర్తి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం | |
4. | "పలుకే బంగారమాయెనా" | శ్రీ భక్త రామదాసు | వాణీ జయరాం | |
5. | "బ్రోచేవారెవరురా" | శ్రీ మైసూరు వాసుదేవాచార్యులు | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం | |
6. | "మాణిక్య వీణాముపలాలయంతి" (పద్యం) | మహాకవి కాళిదాసు | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
7. | "మానస సంచరరే" | శ్రీ సదాశివ బ్రహ్మేంద్రియస్వామి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం | |
8. | "రాగం తానం పల్లవి" | వేటూరి సుందరరామ్మూర్తి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
9. | "శంకరా నాదశరీరాపరా" | వేటూరి సుందరరామ్మూర్తి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
10. | "సామజ వరగమన" | వేటూరి సుందరరామ్మూర్తి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి |
బహుమతులు
[మార్చు]సంవత్సరం | ప్రతిపాదించిన విభాగం | పురస్కారం | ఫలితం |
---|---|---|---|
1979 | కె విశ్వనాధ్ | భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా (స్వర్ణ కమలం) | గెలుపు |
కె వి మహదేవన్ | జాతీయ చిత్ర బహుమతులు - ఉత్తమ సంగీతదర్శకులు | గెలుపు | |
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం | జాతీయ చిత్ర బహుమతులు - ఉత్తమ నేపథ్య గాయకుడు | గెలుపు | |
వాణి జయరాం | జాతీయ చిత్ర బహుమతులు - ఉత్తమ నేపథ్య గాయని | గెలుపు | |
కె వి మహదేవన్ | నంది ఉత్తమ చిత్రాలు - స్వర్ణ నంది | గెలుపు | |
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం | నంది ఉత్తమ నేపథ్య గాయకుడు | గెలుపు | |
వాణి జయరాం | నంది ఉత్తమ నేపథ్య గాయని | గెలుపు | |
కె వి మహదేవన్ | నంది ఉత్తమ సంగీతదర్శకులు | గెలుపు | |
వేటూరి సుందరరామమూర్తి (శంకరా నాదశరీరాపరా పాటకు) |
నంది ఉత్తమ గీత రచయిత | గెలుపు | |
1980 | జె వి సోమయాజులు | ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడు బహుమతి - తెలుగు [7] | గెలుపు |
మూలాలు
[మార్చు]- ↑ Team, TV9 Telugu Web (2020-02-18). "Sankarabharanam movie team felicitated in Hyderabad for 40 years memory- 'శంకరాభరణం' ఓ ఆణిముత్యం.. ఇలాంటి సినిమాలు మళ్లీ రావు". TV9 Telugu (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-02-23. Retrieved 2020-02-23.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "sankarabharanam: శంకరాభరణం చిత్రానికి మరో అరుదైన గౌరవం". web.archive.org. 2022-11-21. Archived from the original on 2022-11-21. Retrieved 2022-11-21.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ 3.0 3.1 సినీ పూర్ణోదయం 2009, p. 61శంకరాభరణం
- ↑ సినీ పూర్ణోదయం 2009, p. 62శంకరాభరణం
- ↑ Movies, iQlik. "Sankarabharanam 35 Years Event". iQlikmovies (in ఇంగ్లీష్). Retrieved 2022-01-26.
- ↑ ఎ. ఎస్., రామ శాస్త్రి (2021). విశ్వనాథ్ విశ్వరూపం. అపరాజిత పబ్లికేషన్స్. p. 41.
- ↑ Namasthe Telangana (2 February 2022). "తెలుగు సినిమా చరిత్రలో ఓ సంచలనం శంకరాభరణం.. ఈ సినిమా తెచ్చిన అవార్డులు ఇవే". Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.
ఆధార గ్రంథాలు
[మార్చు]పులగం చిన్నారాయణ (2009). సినీ పూర్ణోదయం. హైదరాబాద్: క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్.
కె. విశ్వనాథ్ శంకరాభరణం - సీన్, దర్శక నోట్స్ Archived 2024-05-28 at the Wayback Machine
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో శంకరాభరణం
- శంకరాభరణ గురించి idlebrain.com లో సమీక్ష.
- రాగలహరిలో శంకరాభరణం పాటలు.
- "విజన్ ఆఫ్ ఇండియా" విభాగంలో శంకరాభరణం ఎన్నిక[permanent dead link]
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- క్లుప్త వివరణ ఉన్న articles
- 1980 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- All articles with dead external links
- నంది పురస్కారాలు
- నంది ఉత్తమ చిత్రాలు
- తెలుగు సంగీతభరితమైన సినిమాలు
- కె.వి.మహదేవన్ సంగీతం కూర్చిన సినిమాలు
- కె. విశ్వనాధ్ దర్శకత్వం వహించిన సినిమాలు
- అల్లు రామలింగయ్య నటించిన సినిమాలు
- పుష్పకుమారి నటించిన సినిమాలు
- చంద్రమోహన్ నటించిన సినిమాలు
- నిర్మలమ్మ నటించిన సినిమాలు
- జాతీయ ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా పురస్కార విజేతలు