రామాయణం
రామాయణం | |
---|---|
సమాచారం | |
మతం | హిందూ |
రచయిత | వాల్మీకి |
భాష | సంస్కృతం |
కాలం | సా.శ.పూ 8వ శతాబ్దం - సా.శ 3వ శతాబ్దం |
అధ్యాయాలు | 500 సర్గలు, 7 కాండలు |
పద్యాలు | 24,000 |
రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. సాహిత్య చరిత్ర ప్రకారం రామాయణ కావ్యం వేద కాలం తర్వాత, అనగా సుమారు సా.శ. పూ.1500 లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడింది.[1][2]. రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నాడు. భారతదేశం లోని అన్ని భాషల యందు, అన్ని ప్రాంతాలనందు ఈ కావ్యం ఎంతో ఆదరణీయం, పూజనీయం. ఇండోనేషియా, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, వియత్నాం, లావోస్ దేశాలలో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉంది. ఇండోనీషియా లోని బాలి దీవిలో రామాయణం నృత్య నాటకం బాగా ప్రసిద్ధం.
రామాయణ ప్రాముఖ్యం
[మార్చు]24,000 శ్లోకాలతో కూడిన రామాయణం భారతదేశంలో, హిందూ ధర్మం చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకాలు, ఆచారాలపై అనితరమైన ప్రభావం కలిగిఉంది. రామాయణంలో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణముగా స్వీకరిస్తారు.
వాల్మీకి రామాయణమే గాక, వేదవ్యాసుని ఆధ్యాత్మ రామాయణము, భవభూతి ఉత్తర రామచరితము పేరెన్నిక గన్నవి. ఇతర భారతీయ భాషలలో తులసీదాసు రామచరిత మానసము (కడీ బోలీ), కంబ రామాయణము (తమిళం), రంగనాధరామాయణం, రామాయణ కల్పవృక్షము, మందరము (తెలుగు) వంటి అనేక కావ్యాలు ప్రాచుర్యం పొందాయి. ఇంక రామాయణములోని పాత్రలు, సంఘటనలు, భావములు, తత్త్వాలు అంతర్గతంగా నున్న పురాణాలు, కథలు, కావ్యాలు, పాటలు అన్ని భారతీయ భాషలలోను లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. కాని వాల్మీకి రామాయణమే ప్రధాన ప్రమాణముగా సర్వత్రా అంగీకరింప బడుతున్నది. ఆదికవి వాల్మీకి ప్రార్థన సంప్రదాయంగా చాలామంది కవులు స్మరిస్తారు.
- కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్
- ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్
- కావ్యం రామాయణం సీతాయాశ్చరితమ్ మహత్
- పౌలస్త్య వధమిత్యేవ, చకార చరిత వ్రత:
రామాయణము ప్రధానముగా సీతా రాముల పుణ్యచరితము. ఆంజనేయ భక్తి భరితము. వీరిని గూర్చిన ప్రార్థనలు ఎన్నో ప్రచారములో నున్నవి. మచ్చుకు కొన్ని.
- ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం.
- లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
- దక్షిణే లక్ష్మణో యస్య వామేచ జనకాత్మజా
- పురతో మారుతిర్యస్య తం వందే రఘు నందనమ్
- గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసమ్
- రామాయణ మహా మాలా రత్నం వందే అనిలాత్మజమ్
రామ నామము సకల పాప హరమనీ, మోక్షప్రథమనీ పలువురి నమ్మిక. రమంతే సర్వేజనాః గుణైతి ఇతి రామః (తన సద్గుణముల చేత అందరినీ సంతోషింపజేసేవాడు రాముడు) అని రామ శబ్దానికి వ్యుత్పత్తి చెప్పబడింది."రామ" నామములో అష్టాక్షరీ మంత్రము "ఓం నమో నారాయణాయ" నుండి 'ర' బీజాక్షరము, [3]పంచాక్షరీ మంత్రము "ఓం నమశ్శివాయ" నుండి 'మ' బీజాక్షరము పొందుపరచబడియున్నవని ఆధ్యాత్మిక వేత్తల వివరణ. మూడు మార్లు "రామ" నామమును స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము చేసిన ఫలము లభించునని శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము-ఉత్తర పీఠికలో చెప్పబడింది.
- శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
- సహస్రనామ తత్తుల్యమ్ రామనామ వరాననే
వాల్మీకి - రామాయణ కావ్యావతరణం గురించిన కథ
[మార్చు]మహర్షి వాల్మీకి ఆదికవియే గాక వేదాంతి. దార్శనికుడు. తపస్వి. ప్రజలకు మార్గ దర్శకుడు. సంస్కర్త. కార్యాచరణ వేత్త.
ఒక నాడు నారద మహర్షి వాల్మీకి ఆశ్రమమునకు వస్తాడు. అప్పుడు వాల్మీకి నారదుడిని ఒక ప్రశ్న అడుగుతాడు.
కఃను అస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కః చ వీర్యవాన్
ధర్మజ్ఞః చ కృతజ్ఞః చ సత్యవాక్యో దృఢ వ్రతః
ఈ కాలం లో, ఈ లోకంలో గుణవంతుడు, యుద్ధంలో శత్రువుని ధైర్యంగా జయించగల్గిన వాడు, ధర్మవంతుడు, చేసిన మేలు మరువని వాడు, ఎల్లప్పుడు సత్యమునే పలికేవాడు, అనుకున్న పనిని దృఢ సంకల్పంతో చేసేవాడు ఎవడయిన ఉన్నడా..? ఉంటే వాని గురించి చెప్పు అని అడుగుతాడు.
అవియే కాక అన్ని భూతములయందు దయ కలవాడు, విద్వాంసుడు, సమర్ధుడు, ప్రియదర్శనుడు, కోపాన్ని జయించినవాడు, అసూయలేనివాడు... అలా 16 గుణములు చెప్పి అవన్ని ఉన్నవాడు ఈ భూమి మీద ఉన్నడా అని వాల్మికి మహర్షి అడుగుతాడు.
అప్పుడు నారదుడు ఇట్లా చెబుతాడు.
మహర్షీ, మీరు అడిగిన గుణములు గొప్ప చక్రవర్తులకే అసంభవము. ఇక మామూలు మనుష్యులు సంగతి చెప్పనేల..!
కానీ అలాంటి ఒక మనుష్యుని గురించి నేను మీకు చెపుతాను అని ఈ విధముగా చెప్పనారంభించెను.
ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః
నియతాత్మా మహావీర్యో ధ్యుతిమాన్ ధృతిమాన్ వశీ.
ఇక్ష్వాకు వంశములో పుట్టిన రాముడు అనే పేరుతో ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన అపారమైన శక్తి కలవాడు, సంకల్పశక్తి కలవాడు, ఇంద్రియములను జయించినవాడు, అన్ని విద్యలు తెలిసినవాడు, ఐశ్వర్యవంతుడు, శత్రువుని నిగ్రహించ గల్గిన వాడు, ఈ ప్రపంచాన్ని అంతటిని పొషించగల్గిన వాడు, సముద్రమంత గాంభీర్యం ఉన్నవాడు, హిమవత్ పర్వతమంత ధైర్యం ఉన్నవాడు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువయా అని సంక్షేప రామాయణాన్ని నారదుడు చెప్పనారంభిచెను.
సుమారు ఒక నూరు శ్లోకములలో సంక్షేప రామాయణాన్ని నారదుడు వాల్మికి మహర్షికి చెప్పెను. అప్పుడు వాల్మికి మహర్షి అమితానందభరుతుడయ్యెను. పటిక బెల్లం తిన్నవాని నోటికి తీపి ఎలా నిలిచి వుంటుందో అలా ఆయన హృదయమంత రామాయణం నిండిపోయెను.
ఆ మరునాడు ఆయన తన శిష్యుడు భరద్వాజునితో తమసా నదీ తీరమున వెళ్ళుచుండగా ఒక వేటగాడు క్రౌంచ పక్షుల జంటలో మగ పక్షిని బాణముతో కొట్టెను. అప్పుడది విలవిలలాడుచు అసువులు వీడెను. ఆ దృశ్యమును జూచి, వాల్మీకి ముని హృదయము ద్రవించెను. మనస్సు ఆర్ద్రమయ్యెను. శోకాకులుడైన ఆయన నోట ఈ మాటలు వెలువడెను.
- మానిషాద ప్రతిష్ఠాం త్వమగమ: శాశ్వతీస్సమా:
- యత్ క్రౌంచ మిధునాదేకమ్ అవధీ: కామ మోహితమ్
"ఓరీ కిరాతకుడా! క్రౌంచ దంపతులలో కామమోహితమగు ఒకదానిని చంపి, నీవు శాశ్వతమగు అపకీర్తిని పొందితివి"
శోక పరితప్త హృదయముతో ఆయన ఉచ్ఛరించిన ఈ మాటలు ఛందో బద్ధముగా నున్న మొదటి శ్లోకమని, అది రామాయణం వినుటవలన తటస్థించెనని సంస్కృత సాహిత్య చరిత్రలో నమ్మకము. ఆప్పుడు బ్రహ్మ దేవుడు వాల్మీకికి ఆ శ్లోక విశిష్టతను తెలిపి, శ్రీ రామ చరిత్రను కావ్య రూపమున రచింపుమని ప్రేరేపించెను. లోకములయందు పర్వతములు, నదులు ఉన్నంత కాలము ఆ రామాయణ కావ్యము ప్రకాశించునని దీవించెను.
- యావత్ స్థాస్యంతి గిరయ: సరితశ్చ మహీతలే
- తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి.
- రామాయణ మహాకావ్యమ్ శతకోటి ప్రవిస్తరమ్
- ఏకైకమక్షరమ్ ప్రోక్తమ్ పుంసామ్ మహా పాతక నాశనమ్
[బాలకాండ] రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు జననము వివరించాము
కావ్య విభాగాలు, సంక్షిప్త కథ
[మార్చు]రామాయణ మహాకావ్యము ఏడు కాండములు (భాగములు) గా విభజింప బడింది. వాస్తవానికి వాల్మీకి రాసిన రామాయణంలోనివి ఆరు కాండలు, మొత్తం 24వేల శ్లోకములు (శతకోటి అక్షరములని కూడా చెబుతారు).ఏడవ కాండము అయిన ఉత్తర కాండము వాల్మీకి రచన కాదంటారు. కాండము అనగా చెరకుగడ కణుపు అని అర్ధము. రామాయణ కథనము చెరకు వలె మధురమైనది గనుక ఈ పేరు సమంజసమని పండితులు వివరిస్తారు. ఒక్కొక్క కాండములోను ఉప భాగములు "సర్గ"లు.
- బాల కాండ (77 సర్గలు): కథా ప్రారంభము, రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగపరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కల్యాణము
- అయోధ్య కాండ (119 సర్గలు): కైకేయి కోరిక, దశరథుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభము
- అరణ్య కాండ (75 సర్గలు): వనవాస కాలము, మునిజన సందర్శనము, రాక్షస సంహారము, శూర్పణఖ భంగము, సీతాపహరణము
- కిష్కింధ కాండ (67 సర్గలు): రాముని దుఃఖము, హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట, వాలి వధ, సీతాన్వేషణ ఆరంభము
- సుందర కాండ (68 సర్గలు): హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునకు తెలియజెప్పుట
- యుద్ధ కాండ (131 సర్గలు): సాగరమునకు వారధి నిర్మించుట, యుద్ధము, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము
- ఉత్తర కాండ: సీత అడవులకు పంపబడుట, కుశ లవుల వృత్తాంతము, సీత భూమిలో కలసిపోవుట, రామావతార సమాప్తి - (కాని ఇది మూలకావ్యములోనిది కాదని, తరువాత జతచేయబడినదని కొందరి అభిప్రాయము.)
అయోధ్య నగరం రాజధానిగా, కోసలదేశాన్ని రఘువంశీ వంశపు రాజైన దశరథుడు పాలిస్తున్నాడు.కౌసల్య, సుమిత్ర, కైకేయి ఆయన భార్యలు. పిల్లలు లేని కారణంగా దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేశాడు. తరువాత ఆ రాజుకు నలుగురు బిడ్డలు జన్మించారు. వారికి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు.
రావణుడు అనే వాడు బ్రహ్మవద్ద వరాలుపొంది దేవతలను జయించి మునులను వేధిస్తున్నాడు. వానికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావులేదు. దేవతల ప్రార్థనలు మన్నించి శ్రీ మహా విష్ణువు వానిని హతంచేయడానికి నరుడై జన్మింపనెంచాడు. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖ చక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీమహాలక్ష్మి సీతగా అయోనిజయై జనక మహారాజు ఇంట పెరుగుతున్నది. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు కిష్కింధలో ఉన్నాడు.
కులగురువు వశిష్టుని వద్ద రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు సకల విద్యలనూ అభ్యసించారు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చి తన యాగసంరక్షణార్ధమై రామ లక్ష్మణులను తనతో పంపమని కోరాడు. ముక్కుపచ్చలారని నవయువకులను పంపడానికి దశరథుడు సంకోచించినా, వశిష్ఠుని సలహామేరకు విశ్వామిత్రునితో పంపాడు. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు ఎన్నో అస్త్రవిద్యారహస్యాలను బోధించాడు. దారిలో రామ లక్ష్మణులు తాటకి అనే రాక్షసిని సంహరించారు. గంగానదిని దర్శించారు. రాముని పాదము సోకి అహల్యకు శాపవిమోచనమైనది.
రామ లక్ష్మణుల రక్షణలో యాగము జయప్రథముగా జరిగింది. మారీచ సుబాహులూ, ఇతర రాక్షసగణములూ దండింపబడ్డారు. తిరుగుదారిలో రామలక్ష్మణులు విశ్వామిత్రునితో కలసి జనకుని రాజధానియైన మిథిలానగరం చేరారు. అక్కడ సీతా స్వయంవరంలో రాముడు శివుని విల్లు విరచి, సీతకు వరుడైనాడు. సీతారాములు, ఊర్మిళా లక్ష్మణులు, మాండవీ భరతులు, శ్రుతకీర్తి శత్రుఘ్నుల వివాహం కనుల పండుగగా జరిగింది. తిరుగుదారిలో రాముని ఎదిరించిన పరశురామునకు తాము ఇద్దరూ విష్ణుస్వరూపులే అని తెలిసింది.
మహా వైభవముగా నలుగురు జంటలూ అయోధ్యకు తిరిగి వచ్చారు. అయోధ్యలో పాలన నిత్యకల్యాణముగా సాగుతున్నది.
దశరథుడు రాజ్యభారాన్ని పెద్దకొడుకైన రామునకప్పగింపవలెనని సంకల్పించాడు. పట్టాభిషేకానికి సర్వమూ సిద్ధమైనది. అంతటా వేడుకలు జరుగుతున్నాయి.
రాముని సవతి తల్లియైన కైకేయికి రాముడంటే ఎంతో వాత్సల్యము. కాని ఆమె చెలికత్తె మంధర కైకేయికి ఇలా నూరిపోసింది - "రాముడు రాజయితే కౌసల్య రాజమాతవుతుంది. నీ స్థానం బలహీనపడుతుంది. కనుక భరతుని రాజుగా చేసి, రాముని దూరంగా పంపే మార్గం ఆలోచించు.". ఈ మాటలు కైకేయి వంటబట్టాయి. అంతకు పూర్వము దశరధుడు ఆమెకు రెండు కోరికలు ప్రసాదించాడు. వాటిని గుర్తు చేస్తూ ఆమె దశరధుని రెండు కోరికలు కోరింది - (1) భరతుని పట్టాభిషేకము (2) రామునకు 14 ఏండ్ల వనవాసము.
దశరథునకు ఎటూ పాలుపోలేదు. దుఃఖంతో క్రుంగిపోయాడు. కాని రాముడు తండ్రి మాట నిలబెట్టడానికి కృతనిశ్చయుడై ఉన్నాడు. రామునితోబాటు ఆత్మయైన సీత, నీడయైన లక్ష్మణుడూ వనవాసానికి బయలుదేరారు. అయోధ్యపురవాసులంతా విలపించారు.అందరివద్దా సెలవు తీసుకొని సీతారామలక్ష్మణులు సకలసౌఖ్యాలూ వర్జించి, నారదుస్తులు ధరించి వనవాస దీక్షకు సిద్ధమైనారు. దారిలో గుహుడనే నిషాదరాజు వారిని గంగానది దాటించాడు. అక్కడ దశరధుడు రామునికై విలపిస్తూ స్వర్గతుడైనాడు.
మేనమామల ఇంటినుండి అయోధ్యకు వచ్చిన భరతుడు తల్లి చేసిన పనికి మండిపడ్డాడు. ఆమె ముఖం చూడడానికీ, తన ముఖం ఇతరులకు చూపడానికీ అతని మనసొప్పలేదు. సైన్యంతో అడవికి వెళ్ళి - "నీకు చెందవలసిన రాజ్యం నావంటి అల్పుడు పాలించలేడు. నా తల్లి తప్పును మన్నించి, అయోధ్యకు తిరిగివచ్చి మమ్మలనందరినీ ఏలుకో" అని ప్రార్థించాడు. తండ్రి మరణవార్త విన్న రాముడు దుఃఖించాడు. కాని "తండ్రి మాట నిలబెట్టడం మన కర్తవ్యం. వనవాస దీక్ష ముగియవలసిందే" అని నిశ్చయించాడు. అప్పుడు భరతుడు - "14 సంవత్సరాల తరువాత నీవు అయోధ్యకు రావడం ఒక్కరోజు ఆలస్యమైనా నేను ప్రాణాలు త్యజిస్తాను. అంత వరకు నీ పాదుకలను సింహాసనంపై ఉంచి, భృత్యునిగా నేను రాజ్యపాలన నిర్వహిస్తాను" అని అయోధ్యకు తిరిగి వెళ్ళాడు.
సీతారామ లక్ష్మణులు మందాకినీ తీరాన చిత్రకూటం అనే సుందర ప్రదేశంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని జపతపాది కార్యములు నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు. వారు అత్రి మహాముని ఆశ్రమాన్ని దర్శించినపుడు సీతమ్మవారు అనసూయ ఉపదేశములు, ఆశీర్వచనములు గ్రహించింది.
శాపవశమున విరాధుడనే రాక్షసుడైన తుంబురుడు రామ లక్ష్మణులచేత శాపవిమోచనం పొందాడు. తరువాత సీతారామలక్ష్మణులు సుతీక్ష్ణుడు, అగస్త్యుడు వంటి మహర్షుల ఆశ్రమాలను దర్శించి, పిదప గోదావరీ తీరాన పంచవటి వద్ద పర్ణశాలను నిర్మించుకొని అక్కడ నివసింపసాగారు. అక్కడకి శూర్పణఖ అనే కామరూపియైన రాక్షసి వచ్చి రామ లక్ష్మణులను మోహించి సీతను తినివేయడానికి సన్నద్ధమైనది. లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి పంపాడు. రోదిస్తున్న శూర్పణఖ కసి తీరడానికి ఆమె సోదరులైన ఖర దూషణులనే రాక్షసులు 14 వేల మంది రాక్షసులతో రామునిపై దండెత్తారు. రాముడొకడే వారందరిని హతం చేసాడు.
శూర్పణఖ వెళ్ళి రావణునితో మొరపెట్టుకొంది. కసితో రావణుడు మారీచుడిని మాయలేడి రూపంలో పంపి రామ లక్ష్మణులను దూరంగా వెళ్ళేలా చేసి, తాను సీతను ఎత్తుకుపోయాడు. అడ్డు వచ్చిన జటాయువు రెక్కలు తెగనరికాడు. సీత కనిపించక హతాశులైన రామలక్ష్మణులు ఆమెను వెతుకనారంభించారు. కొనవూపిరితోనున్న జటాయువు వారికి సీతాపహరణం గురించి తెలిపి రాముని చేతిలో కన్నుమూశాడు.
దుఃఖంతో సీతను వెతుకుతున్న రామలక్ష్మణులకు కబంధుడనే రాక్షసుడు ఎదురయ్యాడు. వాడు శాపవిమోచనం పొందుతూ సుగ్రీవునితో మైత్రి చేసుకోమని చెప్పాడు. ఆపై రామలక్ష్మణులు మతంగముని ఆశ్రమంలో వారికోసం ఎదురు చూస్తున్న శబరి ఆతిథ్యం స్వీకరించి, ఋష్యమూకపర్వతానికి బయలుదేరారు.
సుగ్రీవుడు వానరరాజు. అన్న యైన వాలితో దురదృష్టవశాత్తు విరోధము సంభవించగా సుగ్రీవుడు హనుమదాది అనుచరులతోడుగా ఋష్యమూకపర్వతంపై ప్రాణభయంతో కాలం గడుపుతున్నాడు.
హనుమంతుడు రామలక్ష్మణులను కలసి, సుగ్రీవునివద్దకుతోడ్కొని వెళ్ళాడు.రాముడూ, సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. వాలిని వధించి రాముడు సుగ్రీవునకు వానర రాజ్యం కట్టబెట్టాడు. తరువాత సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకూ సీతాన్వేషణ నిమిత్తమై పంపాడు. అలా దక్షిణదిశకు వెళ్ళినవారిలో అంగదుని నాయకత్వంలో హనుమంతుడూ, జాంబవంతుడూ, నీలుడూ, మైందుడూ, ద్వివిధుడూ, సుషేణుడూ వంటి మహావీరులున్నారు.
వారు అంతా కలయజూస్తూ, అనేక అవాంతరాలను అధిగమించి, స్వయంప్రభ అనే యోగిని సాయంతో దక్షిణసముద్ర తీరానికి చేరుకొన్నారు. ఆపై దిక్కు తోచకవారు శోకంలో మునిగిపోయిన వారికి జటాయువు సోదరుడైన సంపాతి కనిపించి, రావణుడు సీతను అపహరించి లంకలో దాచాడని చెప్పాడు.
ఇక నూరు యోజనాల విస్తీర్ణమున్న సముద్రాన్ని దాటి లంకకెలా వెళ్ళాలో తెలియక వానరులు తర్జన భర్జనలు పడసాగారు. అప్పుడు జాంబవంతుడు ఈ కార్యానికి హనుమంతుడే సమర్ధుడనీ, హనుమకు అసాధ్యమైన పని లేదనీ ధైర్యం చెప్పాడు. తన శక్తి తెలిసికొన్న హనుమంతుడు మహాతేజంతో ప్రకాశించాడు.
హనుమంతుడు సన్నద్ధుడై, దేవతలకు మ్రొక్కి, మహేంద్రగిరిపైనుండి లంఘించాడు. దారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి, సురస అనే నాగమాత పరీక్షను దాటి, సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని సంహరించి, రామబాణములా లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకిణిని దండించి, మయుని అపూర్వ సృష్టియైన లంకలో ప్రవేశించి, సీతను వెదుకసాగాడు.
చిన్నశరీరము ధరించి, హనుమంతుడు రావణుని మందిరములోనూ, పానశాలలోనూ, పుష్పక విమానములోనూ అన్నిచోట్లా సీతను వెదకినాడు. నిద్రించుచున్న స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమించాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతించాడు. ఏమిచేయాలో తోచలేదు. ఊరకే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి సిద్ధపడలేక ఆత్మహత్యకు కూడా ఉపక్రమించబోతుండగా అశోక వనం కనిపిస్తుంది .
రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకూ, వాయువునకూ, సూర్య చంద్రులకూ, మరుద్గణములకూ, బ్రహ్మకూ, అగ్నికీ, సకల దేవతలకూ నమస్కరించి అశోకవనంలో సీతను వెదకడానికి బయలుదేరాడు. అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృశించిన సీతను చూచాడు. జాడలెరిగి ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు.
అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి ఆమెను బెదిరించి, తనకు వశముకావలెనని ఆదేశించాడు. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మము అగుట తథ్యమని సీత రావణునకు గట్టిగా చెప్పినది. ఒక నెల మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నిస్తూ ఉండటం వల్ల ప్రాణత్యాగం చేయాలని సీత నిశ్చయించుకొన్నది.
వారిలో సహృదయయైన త్రిజట అనే రాక్షసకాంతకు ఒక కల వచ్చింది. తెల్లని ఏనుగునెక్కి వచ్చి రామ లక్ష్మణులు సీతను తీసికొని పోయినట్లూ, లంక నాశనమైనట్లూ, రావణాదులంతా హతమైనట్లూ వచ్చిన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు. సీతకు శుభ శకునములు కనిపించసాగాయి.
ఇంక ఆలస్యము చేయరాదని, హనుమంతుడు సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించి, రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.
హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఊరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. ఒక్క నెలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది.
ఇక హనుమంతుడు పనిలో పనిగా రావణునితో భాషింపవలెననీ, లంకను పరిశీలింపవలెననీ నిశ్చయించుకొన్నాడు. వెంటనే ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ, రావణుడు పంపిన మహా వీరులనూ హతముచేసి, కాలునివలె మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి వివశుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి, మరొక్కమారు సీతను దర్శించి, మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరిపై వ్రాలాడు.
"చూచాను సీతను" అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్నచోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినది ఆలోచించమని కోరారు.
హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు "ఇంతటి క్లిష్టకార్యమును మరెవ్వరు సాధింపలేరు. మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడవు నీవు. నీవంటి దూత మరొకరు లేరు. గాఢాలింగనము కంటె నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను" అని హనుమను కౌగిలించుకొనెను . తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు. సరైన సమయము చూసి, నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపిసేన దక్షిణమునకు పయనమై సాగరతీరము చేరుకొన్నది.
అక్కడ లంకలో రావణుడు యుద్ధము విషయమై తనవారితో చర్చింపసాగాడు. అతని తమ్ముడైన విభీషణుడు రావణునితో విభేదించి, సాగరముదాటి, రాముని శరణు జొచ్చెను. కానున్న లంకాధిపతివని రాముడు విభీషణునకు ఆశ్రయమిచ్చి, కానున్న లంకాధిపతిగా సాగరజలాలతో అభిషిక్తుని చేయించెను. ఇక సాగరమును దాటుటకు అద్భుతమైన వారధి నిర్మాణము విశ్వకర్మ కొడుకైన నలుని పర్యవేక్షణలో ప్రారంభమైనది. అయిదు దినములలో 100 యోజనముల పొడవు, 10 యోజనముల వెడల్పు గల వారధి పూర్తికాగా, వానర భల్లూకసేనల, రామలక్ష్మణులు వారధి దాటి లంకను చేరారు. నీలుని నాయకత్వంలో ఆ సేన మరో సాగరంలా ఉండి, రామకార్యానికి సన్నద్ధమై ఉంది.
రావణుని చారుల వల్ల తెలిసిన సమాచారం ప్రకారం వానర సేనా, రామలక్ష్మణులూ అజేయులు, అసమానులు. కనుక యుద్ధం వినాశనహేతువని కొందరు ఎరుగనిది. ముఖ్యంగా ప్రహస్తుడూ, ఇంద్రజిత్తూ, నికుంభుడూ - వీరిలో ఎవరైనా తప్పక రామలక్ష్మణులను కడతేర్చగలరనీ, కనుక ఇక ఇంద్రుని వజ్రాయుధాన్ని గడ్డిపోచలా తలిచే కుంభకర్ణుడూ, తనూ యుద్ధానికి రావలసిన అవుసరమే రాదనీ రావణుడి విశ్వాసం.
ఇరు పక్షాలవారూ వ్యూహాలు సన్నద్ధం చేసుకొన్నారు. చిట్టచివరి ప్రయత్నంగా రాముడు పనిచిన అంగదరాయబారం విఫలమైనది.
- జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
- రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః
అంటూ వానరసేన లంకను ముట్టడించింది. మహాయద్ధంతో భునభోంతరాళాలు కంపిస్తున్నాయి. వానరులచేతిలో రాక్షసవీరులు భంగపడ్డారు. దానితో ఇంద్రజిత్తు మాయాయుద్ధమారంభించి నాగాస్త్రంతో రామలక్ష్మణులను వివశులను చేసి శతృసైన్యాన్ని భయకంపితులను చేశాడు. అంతా విషణ్ణులైన సమయానికి గరుత్మంతుడు మహాప్రభంజనంలా వచ్చి వారిని నాగబంధాలనుండి విముక్తులను చేశాడు.
మరునాడు హనుమంతుని చేత ధూమ్రాక్షుడూ, అంగదుని చేత వజ్రదంష్ట్రుడూ, నీలునిచేత ప్రహస్తుడూ హతులయ్యారు. రావణుడు స్వయంగా మహావీరులైన రాక్షసగణాలను వెంటబెట్టుకొని యుద్ధానికి వెడలాడు.అప్పుడు జరిగిన భీకరసంగ్రామంలో రావణుని కిరీటము నేలబడింది. ధనుసు చేజారింది. విశ్రాంతి తీసికొని మరునాడు యుద్ధానికి రమ్మని రాముడు రావణుని పంపేశాడు.
అవమాన భారంతో కృంగిన రావణుడు తన సోదరుడైన కుంభకర్ణుని నిదురలేపి యుద్ధానికి పంపాడు. కుంభకర్ణుడు వానరులను కరకర నమలి మ్రింగుతూ, ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనను నాశనం చేయసాగాడు. లక్ష్మణునిబాణాలు కుంభకర్ణుని నిలువరించాయు. రాముడు దివ్యాస్త్రాలతో వాని బాహువులనూ, ఊరువులనూ ఖండించగా వాడు పర్వతంలా క్రిందపడ్డాడు. వాడి క్రింద పడి ఎందరో రక్షసులు కూడా నశించారు.
శోకిస్తున్న రావణుడిని ఊరడించి మరునాడు దేవాంతక, నరాంతక, అతికాయ, త్రిశిరులనే రావణ నందనులు, మత్తుడు ఉన్మత్తుడు అనే రావణ సోదరులు - అందరూ మహా శూరులు- భీకరమైన యుద్ధానికి దిగారు. వారు అంగదుని, హనుమంతుని, లక్ష్మణుని చేత హతులయ్యారు. ఇక ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. దానితో అందరూ మూర్ఛిల్లారు. రామ లక్ష్మణ హనుమంతులు కూడా బ్రహ్మాస్త్రాన్ని మన్నించక తప్పలేదు. ఎలాగో తెలివి తెచ్చుకొన్న జాంబవంతుడు హిమవత్పర్వతాలలో నున్న ఓషధులు తెమ్మని హనుమకు పురమాయించాడు. హనుమంతుడు పర్వతసమేతంగా ఓషధులను తెచ్చి అందరినీ పునరుజ్జీవితులను చేసి, మరల పర్వతాన్ని యధాస్థానంలో ఉంచి వచ్చాడు.
ఇంద్రజిత్తు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని సాధించడానికి నికుంభిలా యజ్ఙం ఆరంభించాడు. లక్ష్మణుడు అన్న ఆశీర్వాదము పొంది, హనుమంతుని భుజాలపై ఆసీనుడై వెళ్ళి, యజ్ఙాన్ని భంగం చేసి యద్ధానికి తలపడ్డాడు. ఆ భీకర సమరంలో ఆకాశాన్ని బాణాలు కప్పివేశాయి. చివరకు రాముని పేరు చెప్పి సౌమిత్రి సంధించిన ఐంద్రాస్త్రంతో ఇంద్రజిత్తు తల తెగిపడింది.
ఇక రావణుడు మహోదరాది మహావీరులతో యుద్ధానికి వెడలాడు. సుగ్రీవుని చేత మహోదరుడు మరణించాడు. రావణుని మహోగ్రశరధాటికివానర సైన్యము ఛిన్నాభిన్నమైనది. లక్ష్మణుడు దారుణంగా గాయపడ్డాడు.. అప్పుడు రాముడు తనవారిన ఉద్దేశించి - "మీరు సౌమిత్రిని రక్షిస్తూ, యుద్ధం చూస్తూ ఉండండి. నేను రాముడంటే ఏమిటో చూపిస్తాను. రావణ సంహారం చేసి వస్తాను" అన్నాడు. రామ రావణ సంగ్రామం ప్రళయకాలాగ్నివలే చెలరేగినది. రావణుని అస్త్రంతో లక్ష్మణుడు కూలిపోయాడు. రాముడు విలపించసాగాడు. లక్ష్మణుడు కేవలం మూర్ఛిల్లాడని ధైర్యం చెప్పి సుషేణుడు మరల హనుమను మరల గిరిశిఖరానికి వెళ్ళమన్నాడు. హనుమంతుడు శిఖరంతో సహా ఓషధులను తెచ్చి వాసన చూపగా లక్ష్మణుడు లేచి నిలబడి, "అన్నా! ఈ సాయంసంధ్యలో రావణుడు కడతేరాలి అన్నాడు".
రామునకు సహాయంగా ఇంద్రుడు మాతలిని సారథిగా పంపాడు. యుద్ధ పరిశ్రాంతుడై యున్న రామునకు అగస్త్యుడు "ఆదిత్య హృదయము"ను ఉపదేశించాడు. రాముడు దానిని మూడు మార్లు జపించాడు. రాముడు, రావణుడు శరవర్షాన్ని కురిపింపసాగారు. "రామరావణ యుద్ధం రామరావణ యోరివ" - వారి యుద్ధానికి మరొకటి పోలిక లేదు - అని దేవగణాలు ఘోషిస్తున్నాయి. రావణుని తలలు తెగి పడుతున్నా మరల మరల మొలుస్తూనే ఉన్నాయి. "రామా! ఇలా కాదు. బ్రహ్మాస్త్రాన్ని సంధించు" అని మాతలి అన్నాడు.
రాముడు సంధించిన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను చీల్చి, తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. రాముడు ఎరపెక్కిన కన్నులతో, శరదళితదేహంతో, కోటి సూర్యుల ప్రకాశంతో, ధనుస్సును నేలకానించి, మరో చేత బాణాన్ని త్రిప్పుతూ వీరశ్రీబంధురాంగుడై త్రిదశపతినుతుడై శోభిల్లాడు. సకలదేవతలు రామునకు అంజలి ఘటించారు.
అనంతరం సీత అగ్ని ప్రవేశం చేసి తన ధర్మనిరతిని లోకానికి నిరూపించింది. సీతారామలక్ష్మణులు సపరివారంగా అయోధ్యకు తిరిగివచ్చారు. వైభవంగా సీతారాముల పట్టాభిషేకం జరిగింది.
ఉత్తరకాండము ప్రత్యేక వ్యాసం చూడండి.
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు హిందూధర్మశాస్త్రాలు | |
వేదములు (శ్రుతులు) | |
---|---|
ఋగ్వేదం · యజుర్వేదం | |
సామవేదము · అధర్వణవేదము | |
వేదభాగాలు | |
సంహిత · బ్రాహ్మణము | |
అరణ్యకము · ఉపనిషత్తులు | |
ఉపనిషత్తులు | |
ఐతరేయ · బృహదారణ్యక | |
ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య | |
కఠ · కేన · ముండక | |
మాండూక్య ·ప్రశ్న | |
శ్వేతాశ్వర | |
వేదాంగములు (సూత్రములు) | |
శిక్ష · ఛందస్సు | |
వ్యాకరణము · నిరుక్తము | |
జ్యోతిషము · కల్పము | |
స్మృతులు | |
ఇతిహాసములు | |
మహాభారతము · రామాయణము | |
పురాణములు | |
ధర్మశాస్త్రములు | |
ఆగమములు | |
శైవ · వైఖానసము ·పాంచరాత్రము | |
దర్శనములు | |
సాంఖ్య · యోగ | |
వైశేషిక · న్యాయ | |
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస | |
ఇతర గ్రంథాలు | |
భగవద్గీత · భాగవతం | |
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు | |
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు | |
శివ సహస్రనామ స్తోత్రము | |
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి | |
పండుగలు · పుణ్యక్షేత్రాలు | |
... · ... | |
ఇంకా చూడండి | |
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం |
రామాయణ కావ్యంలోని నీతి
[మార్చు]- ధర్మము, అర్ధము, కామము, మోక్షము అనునవి పురుషార్ధములు. జీవితం యొక్క గమ్యం మోక్షం పొందడం. మోక్షాన్ని పొందడానికి ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని ఆచరించుటకు అర్ధమును, కామమును జయించాలి.
- ఏ పురుషుడైనా ఏకపత్నీవ్రతుడైయుండాలి.
- సత్యము చెప్పడం, మాటపై నిలబడటం
- తండ్రి మాట జవదాటరాదు.
తెలుగు సాహిత్యంలో రామాయణం
[మార్చు]- ఆతుకూరి మొల్ల - మొల్ల రామాయణము
- తిక్కన -నిర్వచనోత్తర రామాయణం
- పోతన - భాగవతము
- గోన బుద్ధారెడ్డి - రంగనాథ రామాయణము
- గోపీనాధం వేంకటకవి - గోపీనాథ రామాయణం
- కంకంటి పాపరాజు - ఉత్తర రామాయణము
- భక్త రామదాసు - సంకీర్తనలు
- భక్త రామదాసు - దాశరథీ శతకము
- తూము నరసింహదాసు - సంకీర్తనలు
- త్యాగరాజు - సంకీర్తనలు
- అన్నమయ్య - సంకీర్తనలు
- విశ్వనాధ సత్యనారాయణ - శ్రీమద్రామాయణ కల్ప వృక్షము
- వావిలికొలను సుబ్బారావు (వాసుదాస స్వామి) - మందరము : శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణము
- కూచిమంచి తిమ్మన - అచ్చ తెలుగు రామాయణము
- బ్రహ్మశ్రీ చెదలవాడ సుందర రామ శాస్త్రి - ఆధ్యాత్మ రామాయణము
- డా. యం. కృష్ణమాచార్యులు, డా. గోలి వెంకట రామయ్య - శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందర కాండము. గీతా ప్రెస్, గోరఖ్ పూర్ వారి ప్రచురణ)
- కాశీభొట్ల సత్యనారాయణ - ఆదిత్య హృదయము
- బుక్కపట్టణం రామచంద్రాచార్యులు - (రామానందుని) ఆనంద రామాయణం
- వేదుల సూర్యనారాయణ శర్మ - అంతరార్థ రామాయణం
- డా. ఇలపావులూరి పాండురంగారావు- నుదిన రామాయణం
- చదలవాడ సుందరరామశాస్త్రి - (వాల్మీకి రామాయణము అన్ని కాండములు పరిష్కరించి ప్రచురించిరి)
- చదలవాడ సుందరరామశాస్త్రి - శ్రీమద్రామాయణాంతర్గత సుందర కాండము
- విమలాశర్మ - (ఏకనాధ మహారాజు యొక్క) భావార్ధ రామాయణము
- దోర్బల విశ్వనాధ శర్మ - ఏకశ్లోక రామాయణమం ( మోహనరూప వ్యాఖ్య)
- పురాణపండ రాధాకృష్ణమూర్తి - హనుమచ్చరిత్ర
- ఎమ్. ఎస్. శాస్త్రి - పాదుకా పట్టాభిషేకం
- సోమరాజు సుశీల - పథ దర్శిని శ్రీరామ కథ (లక్ష్మీబాయి కేళ్కర్ రామాయణ ప్రవచనాల సంకలనం)
- నేతి అనంతరామ శాస్త్రి - ప్రసిద్ధ సంస్కృతాంధ్ర రామాయణాల్లో రాజనీతి తత్వము
- కాశీభొట్ల సత్యనారాయణ - ప్రవాహిని వ్యాఖ్య (అన్ని కాండములు)
- శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - వాల్మీకి రామాయణం
- జి.వి. పూర్ణచంద్ - రామాయణంలో విశేషాలు
- భావరాజు వరలక్ష్మి - రామకథాసుధ
- జానకీజాని - రామాయణ పావని
- విద్యా ప్రకాశానందగిరి స్వామి - రామాయణ రత్నాకరము
- పడాల రామారావు - వాల్మీకి రామాయణం
- కొత్త రంగయ్య - రామాయణం ఎందుకు చదవాలి
- ఉషశ్రీ - ఉషశ్రీ రామాయణము
- రొంపిచర్ల శ్రీనివాసాచార్యులు - సంపూర్ణ వాల్మీకి రామాయణము - సంగ్రహ వచనము
- జె. వెంకటేశ్వరరావు - (వాల్మీకి, విశ్వనాధ దర్శించిన) సీతారాముల దాంపత్య వైభవము
- డా. దాశరధి రంగాచార్యులు - సీతా చరితం
- పుల్లెల శ్రీరామ చంద్రుడు - సీతా రావణ సంవాదఝురి
- సాతులూరి గోపాలకృష్ణమాచార్య - శ్రీమద్రామాయణ సుధాస్వాదము
- వేదుల వెంకట శాస్త్రి - శ్రీమద్వేంకటేశ్వర రామాయణము
- సి.హెచ్. స్వరాజ్యలక్ష్మి - శ్రీరామ కర్ణామృత వ్యాఖ్య - రామనామ రసార్ణవం
- ఎమ్.ఎస్.ఎన్. శాస్త్రి - శ్రీరామ విజయం (పౌలస్త్యవధ)
- వేదవ్యాస - శ్రీరామ చరితామృతం
- కల్లూరి సూర్యనారాయణ - శ్రీ గాయత్రీ రామాయణం
- వానమామలై వరదాచార్యులు - శ్రీ గీత రామాయణము
- శ్రీ పూర్ణానంద స్వామి, శ్రీ విద్యా ప్రకాశానంద స్వామి - వాల్మీకి కృత శ్రీ యోగవాసిష్టము . తెలుగు అనువాదము
- బేతవోలు రామబ్రహ్మం - శ్రీ మద్రామాయణము
- ఖండేహాల్ వెంకటరావు - శ్రీ మద్రామాయణము
- చలమచర్ల వెంకట శేషాచార్యులు - శ్రీ మద్రామాయణము
- చలమచర్ల వెంకట శేషాచార్యులు - శ్రీ మద్రామాయణము ఆంధ్ర తాత్పర్య సహితము
- చలమచర్ల వెంకట శేషాచార్యులు - శ్రీరామ కర్ణామృతము
- పుల్లెల శ్రీరామచంద్రుడు - శ్రీమద్వాల్మీకి మహర్షి ప్రణీత శ్రీమద్రామాయణము . ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యా సమేతము
- దినవహి సత్యనారాయణ - తులసీదాసు శ్రీరామ చరితమానసము . తెలుగు వచనము
- సూరంపూడి వెంకట సత్యనారాయణ - సుందరకాండము. గేయ కవిత
- కొంపెల్ల వెంకట రామశాస్త్రి - సకల కార్య సిద్ధికి సుందర కాండము
- కొంపెల్ల వెంకట రామశాస్త్రి - వాల్మీకి రామాయణం . సరళ సుందర వచనం
- బ్రహ్మశ్రీ పురాణపండ రాధాకృష్ణమూర్తి - సకల కార్య సిద్ధికి సుందర కాండము
- పవని నిర్మల ప్రభావతి -సుందర కాండ
- బోడాల రామకోటయ్య - తులసీ రామాయణము
- యం. కృష్ణమాచార్యులు - తులసీ రామాయణము
- ముసునూరు రామకృష్ణారావు - ఉత్తర రామాయణము
- ముసునూరు శివ రామకృష్ణారావు - వాల్మీకి రామాయణము
- ఉత్పల వెంకట నరసింహాచార్యులు - వాల్మీకి రామాయణము
- పురిపండా అప్పలస్వామి - వ్యవహారికాంధ్ర వాల్మీకి రామాయణం
- మాముడాల వెంకటేశ్వరరావు - వాల్మీకి హృదయం . శ్రీమద్రామాయణ కథా సంగ్రహం
- ముట్నూరి సంగమేశం - వాల్మీకి రామాయణము. శాపములు, వరములు (శ్రీపాద రఘునాధ బిడే - మరాఠీ మూల గ్రంథం)
- మైత్రేయ - వేదమన్త్ర రామాయణమ్
- గుంటూరు శేషేంద్రశర్మ - షోడశి-రామాయణ రహస్యాలు
- ఎం.ఎస్.రామారావు - సుందర కాండము
- వడలి మండేశ్వరరావు - ఇది కల్ప వృక్షం
- మోడేకుర్తి గున్నయ్య పంతులు - విశోధిత రామాయణము
- రంగనాయకమ్మ - రామాయణ విషవృక్షం
- దరిమడుగు మల్లయ్య - సంగ్రహ నిర్వచన రామాయణము
- గణపతి రామాయణ సుధ - చర్ల గణపతి శాస్త్రి
- ఆటవెలది రామాయణము -
- అధ్యాత్మ రామాయణ కీర్తనలు - మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
- మల్లెమాల రామాయణము - యమ్.యస్. రెడ్డి
- శ్రీ జగన్నాధ రామాయణము -శ్రీ జగన్నాధ శాస్త్రి
- రామాయణ rahasyalu -శ్రీ Gannu Krishnamurthy
- రామాయణం - నిగూడ వాస్తవాలు -యాపర్ల లక్ష్మీనారాయణ రెడ్డి
- మంథెన రామాయణము (యక్షగాన కావ్యము) - బ్రహ్మ శ్రీ ముద్దు బాలంభట్టు (18 వ శతాబ్దం)
- సాకేత రామాయణము (మరాఠీలో (శ్రీ గజానన్ మాల్గూళ్కర్ గారిచే రచింపబడిన గీత రామాయణ్ కి సృజనానువాదం) - బ్రహ్మ శ్రీ గజానన్ తామన్
సినిమాలు
[మార్చు]- లవకుశ (1963)
- సంపూర్ణ రామాయణం (1971)
- సీతారామ కళ్యాణం
- సీతాకళ్యాణం
- శ్రీరామ పట్టాభిషేకం
- పాదుకా పట్టాభిషేకం
- శ్రీరామాంజనేయ యుద్ధం (1975)
- బాల రామాయణం (1996)
- శ్రీరామరాజ్యం (2011)
రామాయణానికు సంబంధించిన స్థలాలు, ఆలయాలు
[మార్చు]లంక: నేటి శ్రీలంక యే రామాయణములో చెప్పిన లంక అని హిందువులు భావిస్తారు. శ్రీలంకలో రామాయణానికి సంబంధించిన చారిత్రిక కథలు స్థలాలు కనిపిస్తాయి. 1. ఋషి పులస్తి (రావణుని తాత) విగ్రహము 2. విస్రవాసముని (రావణుని తండ్రి) విగ్రహము 3. అశోకారణ్యము 4. రావణ జల పాతాలు - రావణ గుహలు 5.చారియత్ పాత్ (సీతాదేవిని మండోదరి కోట నుండి అశోకవనానికి తీసికెళ్లిన దారి)
చిత్ర కూటము: శ్రీరాముడు అరణ్యవాసములో మొదటి 12 సంవత్సరములు ఈ ప్రాంతము లోనే ఉన్నాడని హిందువుల నమ్మకం. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రములో చిత్రకూతట్ జిల్లాలో కాశికి దగ్గరలో ఈ అటవీ ప్రాంతము ఉంది. ఇప్పటికీ ఇది దట్టమయిన ఆటవీ ప్రాంతము. ఇక్కడ భరత్ కుండ్, సీతాకుండ్, హనుమాంధార ఇంకా అనేక ప్రాంతాలు సీతారాములు తిరిగిన ప్రదేశాలుగా గుర్తింపబడినవి.
ఇతర భాషలలో రామాయణానికి సంబంధించిన రచనలు
[మార్చు]- తులసీదాసు - రామచరితమానస్
- తులసీదాసు - హనుమాన్ చాలీసా
- కంబ రామాయణం
- రాజగోపాలాచారి - రామాయణం
ఏకశ్లోకీరామాయణం
[మార్చు]రామాయణం ఒక్క శ్లోకంలో!
- ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనమ్ ||
- వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణమ్ ||
- వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనమ్ |
- పశ్చాద్రావణకుంభకర్ణహననం ఏతద్ధి రామాయణమ్ ||
రామాయణంలో పాత్రలు
[మార్చు]ప్రార్థనలు
[మార్చు]- శ్రీ నామ రామాయణం పూర్తి పాఠం వికీమూలాలలో.
- శ్రీ రామరక్షా స్తోత్రం పూర్తి పాఠం వికీమూలాలలో.
లౌకికవాదం
[మార్చు]ఇటీవల ఐ-సర్వ్ అనే ఆధ్యాత్మిక సంస్థ ఒక అమెరికన్ సాఫ్టువేర్ లో పంచాంగాన్ని ఉపయోగించి శ్రీరాముడు సామాన్య.శ. పూ పూర్వం 5114 లో జనవరి 10 న జన్మించాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీనిని పలువురు విభేదించారు. రాముడి ఉనికి అవాస్తవమని, భారతీయ సంస్కృతి - మనిషి సత్ప్రవర్తన - కుటుంబవ్యవస్థ పటిష్ఠత కోసం వ్రాయబడిన రామాయణం కేవలం కల్పిత కథ అని, వాల్మీకి రాముడి సమకాలీకుడు కాదని, క్రీస్తు పూర్వం 5114 నాటికి ఎటువంటి లిపి అభివృద్ధి కాలేదని, ఆప్పటికి ఆర్యులు భారతదేశంలోకి అడుగుపెట్టలేదని, వారి అధికార భాష అయిన సంస్కృత భాష భారతదేశంలో లేదని, రామసేతు ప్రకృతిసిద్ధంగా ఓషన్ కరెంట్స్ వల్ల ఏర్పడిన షోల్ అని, రామసేతు వంటి షోల్స్ ప్రపంచంలో చాలా ఉన్నాయని, రామాయణ కథ జరిగినట్లు కచ్చితమైన ఆధారాలు లేవని కొంతమంది తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చుతున్నారు. ఏ కవి అయినా తన కావ్యంలో సహజమైన ప్రదేశాలను లిఖిస్తాడని, తాను మరణించిన తర్వాత అవి కాలగర్భంలో కలిసిపోయి వేల సంవత్సరాల తర్వాత త్రవ్వకాల్లో బయటపడినప్పుడు ఆ కావ్యం చరిత్రలా అగుపిస్తుందని, మునుషులు మరణించినా ప్రదేశాలు అలాగే ఉంటాయని, అసలు లంక అనగా సముద్రతీర ప్రాంతమని, రామాయణంలో లంక అని వ్రాసియుంది కాని శ్రీలంక అని లేదని మరికొందరి అభిప్రాయం.రామాయణం జరగలేదని రామాయణం కథలోనే ఉంది ఒకదనికి ఒకటి సంబంధం లేకుండా పోయింది.[ఆధారం చూపాలి]
రామాయణం కాలం నాటి లంక ఈనాటి శ్రీలంక కానేకాదు, ఆనాటి స్వర్ణ లంక భూమి దక్షిణ ధృవం వద్ద ఎప్పుడో సముద్రంలో మునిగిపోయి వుంది. ఒక జలాంతర్గామి నావికులకు కనిపించింది కూడా. వెలికి తీయడం సాధ్యం కానంతగా ఖర్చులు అవుతాయని వదిలేశారు.[4]
ఆనాడు ఆంజనేయ స్వామి వారు లంకకు 100 యోజనల దూరం ప్రయాణం చేసి (అనగా 1,150కిలోమీటర్ల దూరం) చేరుకున్నారు. ఇప్పటి లంక రామేశ్వరం కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో మాత్రమే వుంది.
ఆనాటి రామాయణం నిజం, స్వర్ణ లంక నిజం.
ఇప్పటి శ్రీలంక పేరు గతంలో సింహళ దేశం/సిలోన్ కదా.
సంస్కృతంలో ఇతర రామాయణాలు
[మార్చు]సంస్కృత సాహిత్యంలో వాల్మీకి రామయణం తరువాత అంతగా ప్రసిద్ధంకాని రామాయణాలలో పేర్కొనదగినవి:
- అద్భుత రామాయణం
- ఆనంద రామాయణం
- ఆధ్యాత్మిక రామాయణం లేక భుసుండి రామాయణం.
- మహా రామాయణం లేక యోగ వాశిష్థము.
అద్భుత రామాయణం
[మార్చు]ఇది అన్ని రామాయణాలలో కన్న చిన్నది; నిజానికి ఇది వాల్మీకి రామాయణానికి అనుబంధమయినట్టు- అద్భుతోత్తర కాండమని చెబుతారు. ఇది 27-సర్గలది. దీనిలోని ప్రధానభావాలలో ఒకటి పరాశక్తిగా సీతాదేవి మహత్యాన్ని చిత్రించడం. ఈమె ఈ పరాశక్తి అవతారంలో మహాభయంకరుడైన సహస్రకంఠరావణుడ్ని సంహరిస్తుంది. సీతాసహస్ర నామస్తోత్రం ఒకటి ఈ అద్భుత రామాయణంలో చెప్పబడింది. నారదుని ద్వారా సంగీత కళయొక్క భక్తితత్వం దీనిలో చెప్పబడింది. రాముడు పరశురామునికి, హనుమంతునికి తన విశ్వరూపాన్ని, తక్కిన అవతారాలను చూపుతాడు. దశగ్రీవరావణుని మించిన రావణుల వినాశంలో వానరులయొక్క సీతాదేవి యొక్క పాత్రను అద్భుతీకరించే కధలున్ను ఈలాంటి రామాయణమే థాయిలాండ్ లోని రామాయణకుడ్య చిత్రాలకు కారణమయినది; త్యాగరాజు ల వారు ఈలాంటి కధలను మనస్సులో పెట్టుకొనే శ్రీజనకతనయే అని, కలకంఠీ రాగం లోను, దేవి తనపదభోక్తం అని శాహనరాగం లోను పాడిఉంటారని పరిశోధకుల అభిప్రాయం.
ఆనంద రామాయణం
[మార్చు]ఆనంద రామాయణం కుడా అద్భుత రామాయణం లానే రామకధలోని, రాముని చర్యలలోని మతతత్త్వ అద్భుతాంశాలనే వర్ణింస్తుంది. కాని ఇది అద్భుత రామాయణం కన్నా చాలా విస్తృతం. ఇది శివపార్వత్య సంవాదరూపంలో ఉన్న 109 అధ్యాయాల, 9 కాండల గ్రంథం. భక్తి వేదాంతాలకు ఎక్కువ ప్రాధాన్యం, రాముడు పరబ్రహం.రామమంత్రం, రామసహస్రనామస్తోత్రంతో పాటు పెక్కు స్తోత్రాలు, పూజావిధి, రామనామజపం, పెక్కు కొత్తకధలు -వీటిలో కొన్ని రాముని సోదరులకు సంబంధించినవి. రాముని దక్షిణభారతయాత్రలో దక్షిణాపధంలోని క్షేత్రాలపేర్లు, ముఖ్యంగా తమిళనాడులోని క్షేత్రాల పేర్లు దీనిలో విస్తారంగా వర్ణితంకావటం గమనింపతగ్గ విషయం. రాముడు 15 శ్లోకాలలో సీతకు వేదాంత తత్త్వం ఉపదేశిస్తాడు. దీనిని దేహరామాయణమని దీనిని ప్రతివాడు తనలో భాగంగా చేసుకోవాలని, మనస్సులో దీనిని దాచుకోవాలని అంటాడు.
ఆధ్యాత్మిక రామాయణం లేక భుసుండి రామాయణం.
[మార్చు]ఆనంద, అద్భుత రామాయణాలతో పోల్చి చూస్తే ఆధ్యాత్మిక రామాయణం చాలా వ్యాప్తి చెందినట్లు తెలియుచున్నది. దీనిని పారాయణం చేసేవారు, పూజించేవారు, వ్యాఖ్యానించేవారు ఎక్కువ. దీనికి వ్యాఖ్యలు కూడా చాలా ఉన్నాయి. తమిళ, మలయాళ, హిందీలోని రామాయణాలు- హిందీలో తులసీదాసు రామచరిత మానసం, మలయాళంలో ఎళుతుచ్చన్ ఆధ్యత్మరామాయణ కిళిపాట్టు వంటివి-ఆధ్యాత్మిక రామాయణానికి అతిసన్నిహితమైనవి.
ఈ ఆధ్యాత్మిక రామాయణం పేరుకు తగ్గట్టు రాముణ్ణి పరబ్రహ్మగా నిరూపించి, రామగీతవంటి ఆధ్యాత్మికోపదేశాలు కూడా చేస్తుంది. ఆధ్యాత్మిక రామాయణం శివుడు ప్రాస్వతికి ఉపదేశించినట్లు రచింపబడింది. తులసీదాసు రామచరిత మానస ఉత్తరకాండలో కాకభుసుండని కధ వస్తుంది. ఈ కాకభుసుండుడు గరుడునితో రామమహత్మ్యం గురుంచి, రామభక్తిని గురుంచి చర్చిస్తూ, తన జీవితం, తాను ఎలా కాకి అయిపుట్టిందీ తెలియజేస్తాడు. కాకభుసుండుని కధ, దానిదైవమూలం యోగవాశిష్ఠం చివర నిర్వాణకాండ ప్రథమభాగం 14-27 అధ్యాయాలలో చెప్పబడ్డాయి.
ఈకాకభుసుండుడు ఎవడు? అన్న ప్రశ్నకు సమాధానం ఆది రామాయణం అని లిఖిత పుస్తకాలలో కనిపించే సంస్కృతం రామాయణంలో లభిస్తుంది.ఈ రామయణం లిఖితపత్రులు ఎక్కువగా లేకపోయినా, సమగ్రమైనవో, అసమగ్రమైనవో బరోడా, ఉదయ్ పూర్, జైపూర్, మధురా, రేవా, అయోధ్య, బనారస్, కలకత్తా, లండన్ లిఖిత గ్రంథాలయాలలో లభిస్తున్నాయి.
మహా రామాయణం లేక యోగ వాశిష్థం
[మార్చు]యోగ వాశిష్థములో రామునికి ఆయన గురువు వశిష్ఠుడు తత్త్వోపదేశం చేస్తాడు.ఈ మహారామాయణం పూర్తిగా జ్ఞాన మార్గాన్ని వర్ణించటం వల్లనే దీనికి మహారామాయణమని, జ్ఞాన వాశిష్థమని, యోగవాశిష్ఠమని, మోక్షోపాయనమని పేర్లు వచ్చాయి. ఇది 6 ఖంఢాల మహాగ్రంధం. రసవత్తరమైన శైలిలో ఆఖ్యానోపాఖ్యాలతో హృదయంగమంగా ఉంటుంది. దృష్టివాదం-సృష్టివాదం వంటి గహన తత్త్వ విషయాలను ఇది చెబుతున్నది. దీనిని విద్యారణ్యుడు విశేషంగా ఉదహరించారు. మొగల్ చక్రవర్తుల కాలంలో దీనిని సన్యాసులు హెచ్చుగా ఆదరించారు. అక్బర్ చక్రవర్తి, దారా శిఖోహ్ దీని విషయాలను శ్రద్ధగా వినేవారని చరిత్రకారులు వ్రాసారు. దీనినే పారశీక భాషలోకి అనువదించారు కూడా.
వాశిష్ఠ రామాయణం
[మార్చు]వాశిష్ఠ రామాయణం అనేది ఆధ్యాత్మికంగా మిగతా రామాయణాలకి భిన్నం. ఇది 7 అధ్యాయాల గ్రంథం. దీనిని వశిష్ఠోత్తర రామయణం అని కూడా అంటారు. దీనికే శతముఖ రావణచరితం, సహస్రముఖ రావణ చరితం, సీతా విజయం ' అనే పేర్లు ఉన్నాయి. దీనిలో సీత శతకంఠ రావణుని ధ్వంసం చేస్తుంది. కొన్ని లిఖిత పుస్తకాలు దీనిని జైమిని భారతంలో భాగంగా, కొన్ని స్కంద పురాణం లోని వశిష్ఠ సంహితలో భాగంగా పేర్కొంటున్నవి.
ఇవే కాక రామాయణానికి సంబంధించి పలు ఇతర గ్రంథాలు సంస్కృతంలో రచింపబడినవి.అందులో ముఖ్యంగా:
మైరావణ చరిత్ర
[మార్చు]మైరావణ చరిత్ర, లేక అహిమహిరావణ చరిత్ర అనే పేరుతో చాల లిఖిత పుస్తకాలున్నాయి. ఇటీవలి వరకు దీనిని హరికధగా చెప్పేవారు. దీనిని జైమిని భారతంలో భాగంగా పేర్కొన్నారు. కాని కొందరు పండితులు దీనితో ఏకీభవించరు.
కుశలో పాఖ్యానం
[మార్చు]కుశలో పాఖ్యానము అనే రామకధకు సమబందించిన భాగం మరొకటున్నది. ఇది జైమిని భారతంలో భాగం. జైమినీయ అశ్వమేధంలో ఈ కుశలో పాఖ్యానము 25-36 అధ్యాయాలుగా ముద్రితమైనది. జైమినీయ అశ్వమేధంలోని ప్రధాన ఇతివృత్తం యుధిష్థరుడు పట్టాభిషేకం తర్వాత అశ్వమేధయాగం చేయటం, ప్రసక్తాను ప్రసక్తంగా ఇందులో రామాశ్వమేధకధ చెప్పబడింది. ఈ కధలో పద్మపురాణంలోని పాతాళఖండంలో ఉన్న కధలలోలాగ రామపశ్చాత్తాపం, సీతారామ లవకుశ సమాగమం, రాముడు సీతా సమేతుడై అశ్వమేధయాగం ఆచరించటం వర్నితమయినాయి.
ఇవే కాకుండా, "సత్యోపాఖ్యానం, రామరాజ్యం, దేవీ భాగవతం, పద్మపురాణం, స్కంద పురాణం" మొదలగు గ్రంథాలలో రామకధను వివరించుట జరిగింది.
ఇది కూడా చదవండి
[మార్చు]చిత్రమాలిక
[మార్చు]ఏషియన్-ఇండియా స్మారక సమ్మిట్ 2018 సందర్భంగా 2018 జనవరి 24న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా అంతర్జాతీయ రామాయణ మహోత్సవం నిర్వహించింది.
-
అంతర్జాతీయ రామాయణ మహోత్సవంలో భాగంగా 15 మంది సభ్యులతో కూడిన సింగపూర్ అప్సరస్ ఆర్ట్స్ గ్రూప్ ప్రదర్శించిన ఆంజనేయం నృత్యరూపకం అభినందన కార్యక్రమంలో మాట్లాడుతున్న కెవి రమణాచారి (చిత్రంలో మామిడి హరికృష్ణ, శోభా నాయుడు తదితరులు)
-
అంతర్జాతీయ రామాయణ మహోత్సవంలో భాగంగా 15 మంది సభ్యులతో కూడిన సింగపూర్ అప్సరస్ ఆర్ట్స్ గ్రూప్ ప్రదర్శించిన ఆంజనేయం నృత్యరూపకంలోని దృశ్యం.
-
అంతర్జాతీయ రామాయణ మహోత్సవంలో భాగంగా 15 మంది సభ్యులతో కూడిన సింగపూర్ అప్సరస్ ఆర్ట్స్ గ్రూప్ ప్రదర్శించిన ఆంజనేయం నృత్యరూపకం నటికి శోభా నాయుడుచే సత్కారం (చిత్రంలో మామిడి హరికృష్ణ తదితరులు)
-
అంతర్జాతీయ రామాయణ మహోత్సవంలో భాగంగా 12 మంది సభ్యులతో కూడిన మయన్మార్ రాయల్ పొంటావ్ రామాయణ బృందం ప్రదర్శించిన రామాయణ నృత్యరూపకంలోని దృశ్యం.
-
అంతర్జాతీయ రామాయణ మహోత్సవంలో భాగంగా 15 మంది సభ్యులతో కూడిన సింగపూర్ అప్సరస్ ఆర్ట్స్ గ్రూప్ ప్రదర్శించిన ఆంజనేయం నృత్యరూపకం అభినందన కార్యక్రమంలో మాట్లాడుతున్న శోభా నాయుడు
-
అంతర్జాతీయ రామాయణ మహోత్సవంలో భాగంగా 15 మంది సభ్యులతో కూడిన సింగపూర్ అప్సరస్ ఆర్ట్స్ గ్రూప్ ప్రదర్శించిన ఆంజనేయం నృత్యరూపక నటీనటులు
మూలాలు
[మార్చు]ఆధారాలు
[మార్చు]- సుందర కాండము: గీతా ప్రెస్, గోరఖ్ పూర్ వారి ప్రచురణ.
- అప్పాజ్యోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్ వారి సైటు - తెలుగు పుస్తకాల ఉద్యానవనం
- ఉషశ్రీ రామాయణము
- 1969 భారతి మాస పత్రిక- వ్యాసం-సంస్కృతంలో ఇతర రామాయణాలు- వ్యాస కర్త:డా.వి.రాఘవన్.
బయటి లింకులు
[మార్చు]- శ్రీమద్రామాయణము లోని నీతికథలు
- "Module 9:Translating ReligiousLecture 34: Rewritings / Retellings of Indian Epics II: Ramayana" (PDF). NPTEL. Archived from the original (PDF) on 2015-10-29. Retrieved 2015-03-30.
- http://books.google.co.in/books?id=cWmsQQ2smXIC&pg=PA38&redir_esc=y#v=onepage&q&f=false
- https://web.archive.org/web/20160428014933/http://www.indologica.com/volumes/vol31/09_Saklani.pdf
- ఒక్కొక్క శ్లోకానికీ ఆంగ్లానువాదము; శ్రీ దేశిరాజు హనుమంతరావు, శ్రీ కె. ఎమ్. కె. మూర్తి, శ్రీమతి దుర్గా నాగ దేవి, శ్రీ వాసుదేవ కిషోర్, శ్రీమతి దేశిరాజు కుమారి, శ్రీమతి కె. రాజేశ్వరి గార్ల సమర్పణ Archived 2007-01-13 at the Wayback Machine
- సంపూర్ణ వాల్మీకి రామాయణం
- ఆంధ్ర శ్రీమద్రామాయణం రెండవ భాగం మూడవ భాగం
- ↑ Lecture 34: Rewritings / Retellings of Indian Epics II: Ramayana
- ↑ History of Ancient India: Earliest Times to 1000 A. D., Radhey Shyam Chaurasiya p. 38: "the Kernel of the Ramayana was composed before 500 B.C. while the more recent portion were not probably added till the 2nd century B.C. and la ter."
- ↑ Fukami, Tadashi (2010-10-22). "CORRECTING DARWIN'S OTHER MISTAKE". Evolution. 64 (11): 3336–3338. doi:10.1111/j.1558-5646.2010.01080.x. ISSN 0014-3820.
- ↑ "లంక". EENADU. Retrieved 2024-07-18.