కర్నూలు
కర్నూలు
కందనవూరు, కందనవోలు | |
---|---|
Nickname: రాయలసీమ ముఖద్వారం | |
Coordinates: 15°50′N 78°03′E / 15.83°N 78.05°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కర్నూలు |
Government | |
• Type | నగరపాలక సంస్థ |
• Body | కర్నూలు నగరపాలక సంస్థ |
విస్తీర్ణం | |
• నగరం | 65.9 కి.మీ2 (25.4 చ. మై) |
• Rank | 105 |
Elevation | 274 మీ (899 అ.) |
జనాభా (2011)[1] | |
• నగరం | 4,30,214 |
• Rank | భారతదేశంలో 6వ ర్యాంకు, ఆంధ్రప్రదేశ్ లో 5 వ ర్యాంకు |
• జనసాంద్రత | 6,500/కి.మీ2 (17,000/చ. మై.) |
• Metro | 16,00,000 (కుడా) |
భాషలు | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 518001, 518002, 518003, 518004 |
Vehicle registration | AP-21 |
Website | [dead link] |
కర్నూలు (కందెనవోలు, ఉర్దూ - کرنول ) దక్షిణ భారతదేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 2వ పెద్ద నగరం, అదే పేరుగల జిల్లా ముఖ్యపట్టణం. ఆంధ్ర ప్రదేశ్ లోని అత్యధిక జనాభా గల నగరాలలో కర్నూలు 5వ స్థానంలో ఉంది. రాయలసీమకు కర్నూలు ముఖద్వారం అంటారు. 1953 అక్టోబరు 1 నుండి 1956 అక్టోబరు 31 వరకు ఆంధ్రరాష్ట్ర రాజధానిగా కొనసాగింది.
పేరు వ్యుత్పత్తి
[మార్చు]ఇప్పుడు కర్నూలుగా పిలువబడే ఈ నగరం పూర్వ నామధేయం కందెనవోలు. 11వ శతాబ్దిలో ఆలంపురంలో కడుతున్న ఆలయం కోసం బళ్ల మీద రాళ్లను తరలించే క్రమంలో, ఈ ప్రాంతంలో నదిలోకి బళ్లు దిగేముందు బండి చక్రాలకు కందెన రాయడానికి ఆపేవారట. దీని వల్ల ఈ ప్రాంతానికి కందెనవోలు అనే పేరు వచ్చింది. అదే రానురాను కర్నూలుగా రూపాంతరం చెందింది. కందెన రాయించుకునే ఈ ప్రదేశం పేరు బండ్ల మెట్ట. కాగా ఇప్పటికీ బండి మెట్ట అనబడు ప్రదేశం పాత నగరంలో ఉంది. సా.శ.1775లో ఆధ్యాత్మ రామాయణాన్ని రచించిన పెద్దన సోమయాజి కందెనవోలు అనే పదం వాడారు. విజయనగర సామ్రాజ్యం నాటి కఫియ్యత్తులు కందనోలు, కందనూలు అనే పేర్లు కనిపిస్తున్నాయి. అయ్యలరాజు నారాయణకవి తన హంసవింశతిలోని ఊర్ల పేర్ల జాబితాలో కందనూరు ఒకటి. పట్టణానికి 1830 ప్రాంతంలో కందనూరు అన్న పేరు వాడుకలో ఉండేదన్న సంగతి ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రచరిత్ర ద్వారా తెలుస్తోంది.[3]
చరిత్ర
[మార్చు]కర్నూలు పట్టణం నుండి 18 కి.మీ దూరంలో ఉన్న కేతవరం అనే ప్రదేశంలోని శిలలపై అతి ప్రాచీన చిత్రలేఖనాలు వెలువడ్డాయి. జుర్రేరు లోయ, కాతవాని కుంట, యాగంటి లలో కూడా ఇటువంటి 35,000 నుండి 45,000 సంవత్సరాల ప్రాచీన చిత్రలేఖనాలు ఆ చుట్టుప్రక్కల ఉన్నాయి.
కర్నూలు పట్టణం చుట్టుప్రక్కల కుగ్రామాలు 2,000 ఏళ్ళ క్రితం నుండి వెలిశాయి. చైనీసు ప్రయాణీకుడు హ్యూయన్ త్సాంగ్ కంచికి వెళ్ళే దారిలో కర్నూలు గుండా ప్రయాణించాడు. పదిహేడవ శతాబ్దంలో కర్నూలు బీజాపూరు సుల్తాను యొక్క అధీనంలో ఉండేది. మొగలు సామ్రాజ్యపు చివరి వాడైన ఔరంగజేబు 1687 లో దక్కన్ పీఠభూమిని ఆక్రమించి ఆంధ్రకు చెందిన హైదరాబాదు, కర్నూలులను తన సామంతులైన నిజాంలకి వాటి పరిపాలనా బాధ్యతలను అప్పగించాడు. హైదరాబాదు నిజాం, కర్నూలు నవాబు లిరువురూ స్వతంత్రులుగా తమ రాజ్యాలని ఏలుకున్నారు. అలఫ్ ఖాన్ బహదూర్ అనబడే నవాబు కర్నూలు యొక్క మొట్ట మొదటి పరిపాలకుడు కాగా, అతని వంశీకులు 200 ఏళ్ళు కర్నూలును పరిపాలించారు. అందులో నవాబ్ అబ్దుల్ వహాబ్ ఖాన్ ఒకడు. 18 వ శతాబ్దపు ప్రారంభంలోనే మైసూరు సుల్తానులతో చేతులు కలిపి బ్రిటీషు రాజ్యం పై యుద్ధం చేశాడు .
విజయనగర సామ్రాజ్య పాలకులు కొండారెడ్డి బురుజు అనబడు ఒక ఎత్తైన కోటని కట్టించారు. కర్నూలు పట్టణం నుండి 52 కి.మీ ఉన్న గద్వాలకు ఈ కోట నుండి సొరంగ మార్గం ఉంది. తుంగభద్ర నది క్రింద నుండి వెళుతూ నల్లా సోమనాద్రి నిర్మించిన గద్వాల కోటను అనుసంధానం చేయటం దీని ప్రత్యేకత. ముస్లిం ఆక్రమణదారుల నుండి తప్పించుకొనటానికి 17వ శతాబ్దంలో గద్వాల్ సంస్థానాదీశుడు ఈ సొరంగాన్ని ఉపయోగించేవాడని వినికిడి. 1901 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ సొరంగ మార్గాన్ని మూసివేసింది.
బాదామి చాళుక్యులు, తెలుగు చోళులు, కాకతీయులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లుగా చరిత్ర చెబుతోంది. అటు తర్వాత విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని జయించి తమ ఆధీనం లోనికి తెచ్చుకొన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రస్తుత జిల్లా అంతా ఆయన ఏలుబడి లోనికి వచ్చింది. కర్నూలులో ప్రఖ్యాతి గాంచిన కొండారెడ్డి బురుజు, అచ్యుతదేవరాయలు విజయనగర రాజుగా ఉన్నప్పుడు కట్టబడిన కోటలో ఓ భాగం మాత్రమే, ఆ తర్వాత ఎప్పుడో కొండారెడ్డి అనే విప్లవవీరుణ్ణి అక్కడ బంధించడం వల్ల ఆ పేరు వచ్చింది.
1565లో తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత గోల్కొండ ఇబ్రహీం కుతుబ్ షా కర్నూలును వశపరచుకొన్నాడు. 1687లో ఔరంగజేబు కృష్ణానది తీరాన్ని దాటి దండయాత్ర చేసినప్పుడు, గియాసుద్దీన్ అనే సేనాని కర్నూలును జయించాడు. 1733లో ఇక్కడి నవాబు హిమాయత్ ఖాన్, కర్ణాటక యుద్ధాలుగా ప్రసిద్ధి గాంచిన ఆంగ్లేయ-ఫ్రెంచి వారి గొడవల్లో పాలుపంచుకొన్నాడు. 1741లో మరాఠా విజృంభణ కొనసాగినప్పుడు, కర్నూలు, వారి హయాంలోనికి వచ్చింది.
1751లో సలాబత్ జంగ్, ఫ్రెంచి జనరల్ బుస్సీ (పిల్లల పాటల్లోని బూచాడు) కర్నూలును ముట్టడించారు. 1755లో మైసూరుకు చెందిన హైదర్ అలీ ఈ ప్రాంతాన్ని వశపరచుకొన్నాడు. 1799లో శ్రీరంగపట్టణంలో జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించగా అప్పుడు ఈ జిల్లా హైదరాబాద్ నిజాం నవాబు సొంతం అయింది. తన రక్షణ కోసం బ్రిటిషు సైనికులను ఉపయోగించుకొన్నందుకు ప్రతిగా 1800లో ఈ ప్రాంతాన్ని బ్రిటిషు వారికి దత్తత ఇచ్చాడు నిజాం నవాబు. అందుకే ఈ ప్రాంతాన్ని అప్పటి నుంచి 'దత్తమండలం' (సీడెడ్) అనేవారు. 1928లో ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు ఇప్పటి రాయలసీమ అనే పేరు పెట్టాడు. ఇప్పటికీ సినీపరిభాషలో 'సీమ'ను సీడెడ్ అనే పిలుస్తారు.
18వ శతాబ్దంలో కర్నూలు, అర్ధ స్వత్రంత్రుడైన పఠాన్ నవాబు జాగీరులో భాగముగా ఉండేది. 1839లో ఈ నవాబు వారసుని, బ్రిటీషు ప్రభుత్వము రాజద్రోహ నేరంమోపి గద్దె దింపినది. కర్నూలు నవాబు పరిపాలన అటు కడప జిల్లాలోని కొన్ని గ్రామాలు మొదలుకొని దాదాపుగా మొత్తం కర్నూలు జిల్లా అంతా, ఇటు ప్రకాశంలో కొంతభాగం వంటివి ఉండేవి. యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య 1830లో ఈ ప్రాంతంలో యాత్ర చేస్తూ తమ కాశీయాత్రచరిత్రలో సవివరంగా వ్రాసుకున్నారు. నవాబు తాలూకా ఉద్యోగస్థులుండే కసుబాస్థలమని వ్రాశారు. ఆ నవాబు తాలూకాను నాలుగు మేటీలుగా విభజించి ఒక్కొక్క మేటీ (పరిపాలన విభాగం) కి ఒక్కొక్క అమలుదారుని ఏర్పరిచారని వ్రాశారు. తన వద్ద ఉన్న నౌకర్లకు జీతానికి బదులుగా జాగీర్లను కూడా ఇచ్చారని వ్రాశారు. నవాబు పరిపాలనలో ఉండే పలు హిందూ పుణ్యక్షేత్రాలైన మహానంది, అహోబిలం, శ్రీశైలం వంటి వాటిపై సుంకాలు వేసి, భారీ ఆదాయం స్వీకరించి క్షేత్రాలకు మాత్రం ఏ సదుపాయం చేసేవారు కాదు.[3]
1839 వేసవి కాలంలో హైదరాబాదు నగరంలో ఒక బీద ముస్లిం స్త్రీ మరణించడానికి సిద్ధంగా ఉన్న స్థితిలో, ఒక వ్యక్తికి తానొక రహస్యం చెప్పదలిచాననీ, తనకొక పనిచేసిపెట్టాలనీ కోరింది. ఆ పెద్దమనిషి ఆమెది ఆఖరి కోరిక కదాయని అందుకంగీకరించగా ఒక రక్షరేకు (తాయెత్తు) చేతికిచ్చి దీనిని మూసీనదిలో పారవెయ్యమన్నది. అది చేద్దామనుకుంటూనే ఆయన దీనిలో ఏదో రహస్యం వుందని అనుమానించి బ్రిటీష్ వారైన పై అధికారులకు తీసుకువెళ్లి ఇచ్చారు. దాన్ని వారు పరిశీలించి నిజాం నవాబు సోదరుడు కర్నూలు నవాబుకు రాసిన ఉత్తరమనీ, రక్షరేకుల్లో ఉన్న మతపరమైన విషయాల ద్వారా తిరుగుబాటుకు సిద్ధం చేస్తున్నారని తెలుసుకున్నారు. ఆపైన కర్నూలు నవాబు వద్దకు వెళ్ళి అతని వద్ద ఉండకూడని భారీ ఆయుధాగారం ఉందన్న అనుమానం మీద సోదా చేశారు. అన్ని విధాలుగానూ, ధైర్యంగా నవాబు సహకరించారు. మొదట ఎంత సోదా చేసినా పెద్దసంఖ్యలోని ఆయుధాలేవీ దొరకలేదు. ఇంగ్లీష్ అధికారులు పట్టువదలక సోదా చేస్తే జనానాలోని మైదానం వద్ద కోటగోడల్లో బోలుగా తయారుచేసి లోపల గొప్ప ఆయుధాగారాన్ని సిద్ధం చేశారు. దానితో కర్నూలు నవాబు గులాం రసూల్ ఖాన్ను బంధించి తిరుచిరాపల్లి జైలులో రాజకీయఖైదీగా ఉంచారు. తర్వాత అతడు క్రైస్తవ మతంపై ఆసక్తి చూపుతూ చర్చికి వెళ్తూండే వాడు. అది సహించలేని ముస్లిం ఫకీరు ఒకతను, 1940 జూలై నెలలో చర్చి వెలుపల, గులాం రసూల్ ఖాన్ను కత్తితో పొడిచి చంపారు.[4]
నవాబు యొక్క జాగీరు కర్నూలు రాజధానిగా మద్రాసు ప్రెసిడెన్సీలో ఒక జిల్లా అయినది. జిల్లా మధ్యలో బనగానపల్లె సంస్థానము, నలువైపులా కర్నూలు జిల్లాచే చుట్టబడి ఉంది. 1947లో భారత దేశ స్వాతంత్ర్యానంతరము కర్నూలు, పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీనుండి ఏర్పడిన మద్రాసు రాష్ట్రములో భాగమైనది. బనగానపల్లె సంస్థానము జిల్లాలో విలీనమైనది. 1953లో మద్రాసు రాష్ట్రములోని పదకొండు ఉత్తర జిల్లాలు కలసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని అయినది. 1956లో ఆంధ్ర రాష్ట్రము విస్తరించి, పూర్వపు హైదరాబాద్ రాష్ట్రములో భాగమైన తెలంగాణ ప్రాంతమును కలుపుకొని ఆంధ్ర ప్రదేశ్ అవతరించింది. కొత్తగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాదును రాజధానిగా చేశారు.
హైదరాబాదు నుండి రాయలసీమలో ఏ జిల్లాకు వెళ్ళాలన్నా కర్నూలు గుండా ప్రయాణించవలసినందున దీనిని రాయలసీమ ముఖద్వారంగా వ్యవహరిస్తారు.
అక్టోబరు 2009 వరదలు
[మార్చు]2009 అక్టోబరు 2 న భారీ వర్షాలు, హంద్రీ, తుంగభద్ర నదుల వరద నీటివల్ల కర్నూలు పట్టణంలో వందల ఇండ్లు మునిగిపోయి వేలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు.[5] హంద్రీ, తుంగభద్ర నదుల తీరప్రాంతాలలోని ఇండ్లు రెండు అంతస్తులు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ వల్ల ముంపు సమస్య మరింతగా పెరిగింది. రెండు నదులు పట్టణాన్ని రెండువైపున నుంచి ఉధృతరూపంలో ప్రవహించి పట్టణాన్ని చుట్టుముట్టడంతో ప్రజలు భీతిల్లిపోయారు. వరదనీరు చారిత్రక కొండారెడ్డి బురుజు వరకు వచ్చిచేరింది.[6] అక్టోబరు 1 తేది అర్థరాత్రికి మొదలైన వరద సమస్య తెల్లవారుజాము వరకు తీరప్రాంతాలకు వ్యాపించింది. రెండవ తేది మధ్యాహ్నం వరకు వరద నీరు ఉధృతరూపం దాల్చి దాదాపు 65 వేల ప్రజలు శిబిరాలలో తలదాచుకున్నారు.[7] అక్టోబరు 3 సాయంత్రం తరువాత నీటిమట్టం తగ్గింది. ప్రాణనష్టంతో పాటు అపార ఆస్తినష్టం జరిగింది. రోడ్లపై చనిపోయిన పశువుల కళేబరాల దుర్గంధం, నిలిచిపోయిన విద్యుత్ సరఫరా, నీటి సరఫరా, పూర్తిగా మునిగిన ఇండ్లలోని సామాగ్రి, దుస్తులు పనికిరాకుండా పోవడంతో పట్టణ వాసులు తీవ్ర పరిస్థితిని ఎదుర్కొన్నారు.
భౌగోళిక , వాతావరణ వివరాలు
[మార్చు]కర్నూలు తుంగభద్ర నదీ తీరాన ఉంది. హంద్రీ, నీవా నదులు కూడా కర్నూలు గుండా పారుతాయి. డచ్ దేశస్తులచే ప్రయాణ సౌకర్యార్ధం నిర్మిచబడ్డ కే సి కెనాల్ (కర్నూలు - కడప కాలువ) ప్రస్తుతము నీటి పారుదలకి వినియోగించబడుతున్నది.
కర్నూలుది ఉష్ణ మండల వాతావరణం. వేసవులలో 26 నుండి 45 డిగ్రీల సెల్సియస్, చలికాలం 12 నుండి 31 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుంది. వార్షిక సరాసరి వర్షపాతం 30అంగుళాలు (762మి.మీ.) గా నమోదవుతుంది.
పరిపాలన
[మార్చు]కర్నూలు నగరపాలక సంస్థ నగర పరిపాలన నిర్వహిస్తుంది.
పట్టణం లోని ప్రదేశాలు
[మార్చు]నంద్యాల చెక్ పోస్టు వద్ద నుండి రాజవిహార్ హోటల్ కూడలి వరకు ఉన్న రోడ్డు కర్నూలు పట్టణానికి వెన్నెముక వంటిది. రాజవిహార్ కూడలి వద్ద కుడి వైపు వెళ్ళే రోడ్డు కొండారెడ్డి బురుజు, పాత బస్టాండు, పెద్ద పార్కు వద్దకు దారి తీయగా, ఎడమ వైపు వెళ్ళేరోడ్డు రైల్వే స్టేషను, కొత్త బస్టాండులకు దారి తీస్తాయి.
|
|
|
|
రవాణా
[మార్చు]రహదారి రవాణా సౌకర్యాలు
[మార్చు]- 44వ జాతీయ రహదారి, కర్నూలు నుండి హైదరాబాదు (210 కి.మీ), అనంతపురము (140 కి.మీ), హిందూపురం (245 కి.మీ), బెంగుళూరు (360 కి.మీ) గలవు.
- 40 వ జాతీయ రహదారిపై కర్నూలు-చిత్తూరు లకు మార్గంలో పాణ్యం, నంద్యాల, ఆళ్ళగడ్డ, అహోబిలం, మహానంది, మైదుకూరు, కడప, రాయచోటి, పీలేరు గలవు.
- 340C రాష్ట్రీయ రహదారి (ఆంగ్లవికీవ్యాసం) పై కర్నూలుతో బాటు శ్రీశైలం, వినుకొండ, గుంటూరు, విజయవాడలు గలవు.
విజయవాడ తర్వాత కర్నూలులో రెండవ అతిపెద్ద బస్టాండు ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు సేవలున్నాయి.
రైలు రవాణా సౌకర్యాలు
[మార్చు]హైదరాబాదు-గుంతకల్లు రైలు మార్గంలో కర్నూలు పట్టణం ఉంది. హైదరాబాదు, ఢిల్లీ, చెన్నై, చిత్తూరు, తిరుపతి, జైపూర్, మదురై, షిరిడీ, బెంగుళూరు లకి ఎక్స్‌ప్రెస్ రైళ్ళు గలవు. హైదరాబాదు, గుంతకల్లు, గుంటూరు లకి ప్యాసింజర్ రైళ్ళు కూడా ఉన్నాయి.
విమాన రవాణా సౌకర్యాలు
[మార్చు]కర్నూలు నగరానికి 20 కి.మీ.దూరంలో కర్నూలు విమానాశ్రయం వుంది. సమీప అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాదు లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.
ఉన్నత విద్యా సంస్థలు
[మార్చు]- రాయలసీమ విశ్వవిద్యాలయం
- సిల్వర్ జూబిలీ డిగ్రీ కళాశాల
- ఉస్మానియా కళాశాల
- కర్నూలు వైద్య కళాశాల
- డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ
- క్లస్టర్ యూనివర్సిటీ
- INDIAN INSTITUTE OF INFORMATION TECHNOLOGY, DESIGN AND MANUFACTURING, KURNOOL
- Second National law University, Kurnool
పర్యాటక ఆకర్షణలు
[మార్చు]- కొండారెడ్డి బురుజు, కర్నూలు
- శ్రీ బుగ్గ రామేశ్వరస్వామి దేవాలయం, కాలువ బుగ్గ
- నంద్యాల జిల్లాలోని పలు పర్యాటక ఆకర్షణలు కర్నూలు దగ్గరలోవున్నాయి
విశేషాలు
[మార్చు]- ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద ఆరు (6) థియేటర్లు గల హాల్ ఆనంద్ సినీ కాంప్లెక్స్ కర్నూలులో ఉంది.[ఆధారం చూపాలి]
- కర్నూలులో పుల్లారెడ్డి నేతిమిఠాయిలు ప్రఖ్యాతి గాంచినవి.
ప్రముఖులు
[మార్చు]- ముతుకూరి గౌడప్ప
- బుడ్డా వెంగళరెడ్డి
- గులాం రసూల్ ఖాన్
- పి.ఎస్. రామకృష్ణారావు
- గాడిచర్ల హరిసర్వోత్తమ రావు
- వైద్యం వేంకటేశ్వరాచార్యులు
- దామోదరం సంజీవయ్య
- ఎం. హరికిషన్
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
- కోట్ల విజయభాస్కరరెడ్డి
- భూమా శోభా నాగిరెడ్డి
చిత్రమాలిక
[మార్చు]-
కోట్ల విజయభాస్కరరెడ్డి సమాధి. దీనికి కిసాన్ ఘాట్ అని నామకరణం చేశారు
-
కర్నూలు వైద్య కళాశాల అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్
-
ఉస్మానియా కళాశాల వద్దనున్న గోలెగుమ్మ కట్టడం
-
కర్నూలు పట్టణం నుండి తుంగభద్ర నది
-
పట్టణ పొలిమేర జోళాపురం నుండి హంద్రీ నది
-
శ్రీ జగన్నాథ గుట్ట ఆలయ గోపురం
-
శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Andhra Pradesh (India): Districts, Cities, Towns and Outgrowth Wards – Population Statistics in Maps and Charts". citypopulation.de.
- ↑ "Andhra Pradesh (India): State, Major Agglomerations & Cities – Population Statistics in Maps and Charts". citypopulation.de.
- ↑ 3.0 3.1 వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
- ↑ వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలూ-గాథలూ (మొదటి సంపుటం).
- ↑ ఆంధ్రజ్యోతి దినపత్రిక, తేది 03-10-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 03-10-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 04-10-2009
వెలుపలి లంకెలు
[మార్చు]- Pages with non-numeric formatnum arguments
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- All articles with dead external links
- మూలాలు చేర్చవలసిన పాఠ్యమున్న వ్యాసాలు
- Pages containing citation needed template with unsupported parameters
- ఆంధ్రప్రదేశ్ జిల్లాల ముఖ్యపట్టణాలు
- కర్నూలు జిల్లా మండల కేంద్రాలు
- కర్నూలు
- ఆంధ్రప్రదేశ్ నగరాలు
- రాయలసీమ
- కర్నూలు జిల్లా
- Pages using the Kartographer extension