పుష్ప ఖరే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుష్పా ఖరే
జననం
వృత్తిమహిళా శాస్త్రవేత్త

పుష్పా ఖరే భారతీయ ఖగోళశాస్త్రవేత్త. ఉత్కళ విశ్వవిద్యాలయంలో ఖగోళ శాస్త్ర ఆచార్యిణి.

బాల్యం

[మార్చు]

పుష్పా ఖరే ఇండోరులో మహారాష్ట్రకు చెందిన మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. సాధారణ మహారాష్ట్ర మధ్యతరగతి కుటుంబాలలాగే ఈమె తల్లితండ్రులు కూడా చదువుకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే మిగిలిన కుటుంబాల్లాగా చదువు విషయంలో ఆడ, మగ తేడా చూపించలేదు. పుష్పా ఖరేను కూడా చదువులో ప్రోత్సహించారు. ఈ రోజులలో పాఠశాల విద్య పెద్ద ఖరీదైనది కాదు. ఇండోరులో మధ్య తరగతి పిల్లలకు చదువుకోవటానికి ప్రభుత్వరాయితీతో నడుస్తున్న పలు పురపాలక పాఠశాలలు ఉండేవి. ఈ ప్రత్యేక పాఠశాలలు, మంచి తరగతి గదులు, విశాలమైన ప్రయోగశాలలు, పెద్ద క్రీడామైదానాలు, మంచి ఉపాధ్యాయులు వంటి అవసరమైన సదుపాయాలన్నీ కలిగి ఉన్నాయి. ఇండోర్లో పుష్ప పాఠశాల విద్య సరదాగా సాగింది.

పరిశోధన

[మార్చు]

వైద్యుడైన పుష్పా ఖరే తండ్రి, అప్పుడే కొత్తగా ప్రారంభించబడిన అణుశక్తి విభాగంతో ఉత్తేజితుడై పుష్పాను భౌతికశాస్త్ర విద్యను కొనసాగించాలని ప్రోత్సహించాడు. ఆమెను అణుశక్తి రంగంలో పరిశోధన చేయాలని ప్రోత్సహించాడు. గణితంతో పాటు భౌతికశాస్త్రం ఆమె అభిమాన అంశం అయినందున ఆమె భౌతికశాస్త్రం పోస్ట్ గ్రాజ్యుయేషన్‌ చేసింది. అప్పట్లో ఇండోర్లో భౌతికశాస్త్రంలో పోస్ట్ గ్రాజ్యుయేషన్‌ చేయడానికి అవకాశం ఉన్న ఏకైక కళాశాల చాల చక్కని కళాశాలగా పేరొందింది. ఉత్సాహవంతులైన అక్కడ ఉపాధ్యాయులు ఆమెకు చక్కటి ప్రేరణ కలిగించారు. కాలేజీ చివరి సంవత్సరంలో అనేక జాతీయ స్థాయి పరిశోధనా సంస్థల ప్రవేశ పరీక్షలు వ్రాసింది. వాటిలో పుష్ప బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్), టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టి.ఐ.ఎఫ్.ఆర్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐ.ఐ.టి), కాన్పూరులలో పరిశోధన చేయటానికి ఎంపికయ్యింది. ఆమె అవకాశాలను విశ్లేషించి, టి.ఐ.ఎఫ్.ఆర్లో బాలికలు వసతిగృహం లేనందున ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐ.ఐ.టి), కాన్పూరులో చేరింది. అయితే కొన్ని నెలల తర్వాత ఉండటానికి వసతి సదుపాయం లభించడంతో టి.ఐ.ఎఫ్.ఆర్లో చేరి పరిశోధన అధ్యయనం కొనసాగించింది.[1]

ఖగోళశాస్త్రం ఎంపిక

[మార్చు]

ఆమె ఖగోళశాస్త్ర అధ్యయనం అనుకోకుండా జరిగింది. ఆరోజులలో ఖగోళశాస్త్రం విద్యాంశంగా అంతగా ప్రాముఖ్యత సంతరించుకోలేదు. ధైర్యంచేసి (టి.ఐ.ఎఫ్.ఆర్) చేరినా వివిధ సమస్యలు, ఒత్తిళ్లు ఎదురై పరిశోధనలలో జాప్యం జరిగింది. అయినా పట్టుదలతో పి.హెచ్.డిని ఏడు సంవత్సరాలలో పూర్తిచేసింది. ఆమె పి.హెచ్.డి పూర్తయ్యే సరికి వివాహమై, భర్తతో పాటు భువనేశ్వరుకు తరలి వెళ్లింది. ఆమె భర్త భువనేశ్వర్లోని భౌతికశాస్త్ర సంస్థ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్) లో శాస్త్రవేత్త. అప్పట్లో భారతదేశంలో ఖగోళశాస్త్రంలో పరిశోధన కొన్ని ప్రదేశాలలోనే జరుగుతున్నది. ఆమెకు భర్తను వదిలి హైదరాబాదు, ముంబై అంతదూరం వెళ్లాలనిపించలేదు. భువనేశ్వరులో ఖగోళశాస్త్ర రంగంలో ఉద్యోగ అవకాశాలు లభించలేదు. ఉత్కళ్ విశ్వవిద్యాలయంలోని భౌతికశాస్త్ర విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ దేవ్ కు ఖగోళశాస్త్రం మీద ఉన్న ఆసక్తితో, ఆమెను తరచుగా తన డిపార్ట్మెంటుకు ఆహ్వానిస్తూ వచ్చాడు. ఉత్కళ్ విశ్వవిద్యాలయంతో ఏదో ఒక రకమైన అనుబంధం ఉండటానికి తిరిగి పరిశోధనా అభ్యర్థిగా అక్కడ నమోదు చేసుకుంది. అది ఒకందుకు మేలయ్యింది. మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ నుండి ఉత్కళ్ విశ్వవిద్యాలయంలో ఉపన్యసించడానికి వచ్చిన ఖగోళ శాస్త్రవేత్త జూడిత్ పెర్రీతో ఏర్పడిన పరిచయం వలన మ్యూనిక్లో పోస్ట్ డాక్టొరల్ ఫెలోషిప్ చేయడానికి అవకాశం లభించింది. మ్యూనిక్‌లో ఖగోళశాస్త్ర పరిశోధన కొనసాగించడం ఆమెకు చాలా ఆనందాన్నిచ్చింది. ఇందుకు సహకరించిన ప్రొఫెసర్ దేవ్, జూడిత్ పెర్రీల పట్ల ఆమె అపారమైన కృతజ్ఞతాభావం ఆమె కథనాలు వివరిస్తున్నాయి. మ్యూనిక్ వెళ్లే సమయానికి పుష్పకు మూడు నెలల అబ్బాయి ఉన్నాడు. చిన్న పిల్లవాడి సంరక్షణలో సహాయం చేయటానికి ఆమె తన అత్తను వెంట తీసుకొని వెళ్ళింది.

ఉత్కళ విశ్వవిద్యాలయం

[మార్చు]

మ్యూనిక్ నుండి తిరిగి వచ్చిన తరువాత పుష్పా ఖరే తిరిగి ఉత్కళ విశ్వవిద్యాలయంలో పూల్ ఆఫీసర్‌గా చేరింది. తరువాత అదే విశ్వవిద్యాలయంలో ఉపన్యాసకురాలుగా, అ తరువాత ప్రొఫెసర్‌గా బాధ్యత స్వీకరించింది. ఉత్కళ్ విశ్వవిద్యాలయంలో ఖగోళ శాస్త్ర పరిశోధన కొనసాగించడం అంత సులువైన పనికాదు. ఖగోళశాస్త్ర పరిశోధనకు అవసరమైన పుస్తకాల కొరత, అలాగే సహ పరిశోధకులతో చర్చిండానికి అవకాశం లేకపోవడం ( ఒడిషాలో ఉన్న ఏకైక ఖగోళశాస్త్ర పరిశోధకురాలు పుష్పా ఖరే మాత్రమే అన్నది గుర్తించతగిన విషయం). ఈమె తన పరిశోధనా రంగం మార్పుకుందామని అనుకునే సమయంలోనే ఆమె భర్తతో పాటు ఒక సంవత్సర కాలం పాటు చికాగో వెళ్లే అవకాశం కలిగింది. ఆ సమయంలో చికాగో విశ్వవిద్యాలయంలో డాన్ యార్క్‌తో పనిచేసే అవకాశం లభించింది. ఆ తరువాత 20 సంవత్సరాల కాలం పాటు ఆమె యార్క్‌తో పాటు సమష్టి కృషి చేస్తూ వచ్చింది.

1988లో పూణేలో ఇంటర్ - యూనివర్శిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐ.యు.సి.ఎ.ఎ) స్థాపించడం ఆమెకు ఒక వరంలా మారింది. ఆమె ఐ.యు.సి.ఎ.ఎ క్రమం తప్పకుండా వెళ్ళసాగింది.[2] అక్కడ ఉన్న అమోఘమైన సదుపాయాలు, ఐ.యు.సి.ఎ.ఎ సభ్యులు ఆమెకు అందించిన ప్రోత్సాహం ఆమెను తిరిగి పరిశోధనలో ముందుకు నడిపించాయి. అదృష్టవశంగా ఆమెకు లభించిన విద్యార్థితో చేరి పనిచేసి ఆమె మరికొంత ప్రగతిని సాధించింది. తరువాత అంతర్జాల వసతి అందుబాటులోకి రావడం మరింత సహకరించింది. అంతర్జాల వసతి ఏర్పడటంతో ఒడిషా వంటి సుదూరతీరంలో కూడా ఖగోళ శాస్త్ర అధ్యయనం సాధ్యమౌతున్నదని ఆమె నిశ్చితాభిప్రాయం.

భర్తసహకారం

[మార్చు]

పుష్పా ఖరే భర్త స్త్రీపురుష సమాత్వానికి ఆదరణ కలిగి ఉండడం ఆమె అధ్యయనంలో పురోగతి సాధించడానికి ఎంతగానో సహకరించింది. కుటుంబ బాధ్యతలలో పాలుపంచుకోవడం పరిశోధనలకు ప్రోత్సాహం అందించడం ఆమె అభ్యున్నతికి కారణం అని ఆమె అభిప్రాయపడింది.

మూలాలు

[మార్చు]
  1. లీలావతి కూతుళ్లు శృంఖలలో పుష్పా ఖరే వ్యాసం[permanent dead link]
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-03-10. Retrieved 2014-03-10.

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పుష్ప_ఖరే&oldid=2958121" నుండి వెలికితీశారు