అక్షాంశ రేఖాంశాలు: 16°05′00″N 78°52′00″E / 16.0833°N 78.8667°E / 16.0833; 78.8667

శ్రీశైల క్షేత్రం

వికీపీడియా నుండి
(మల్లికార్జున లింగము - శ్రీ శైలము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
శ్రీశైల క్షేత్రం
శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి దేవస్థానం
బంగారు పూతతో కూడిన మల్లికార్జున గోపుర విమానం
బంగారు పూతతో కూడిన మల్లికార్జున గోపుర విమానం
శ్రీశైల క్షేత్రం is located in ఆంధ్రప్రదేశ్
శ్రీశైల క్షేత్రం
ఆంధ్రప్రదేశ్ లో ఆలయ ఉనికి
భౌగోళికం
భౌగోళికాంశాలు16°05′00″N 78°52′00″E / 16.0833°N 78.8667°E / 16.0833; 78.8667
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లానంద్యాల
స్థలంశ్రీశైలం
సంస్కృతి
దైవంమల్లికార్జునుడు (శివుడు)
భ్రమరాంబ (పార్వతి)
ముఖ్యమైన పర్వాలుమహాశివరాత్రి,నవరాత్రి
వాస్తుశైలి
దేవాలయాల సంఖ్య2

శ్రీశైలక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రం. నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల ఈ శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతుంటుంది.[1]

చరిత్ర

[మార్చు]

ఇక్ష్వాకులు, రెడ్డి రాజులు, చాళుక్యులు, కాకతీయులు, ముసునూరి, పెమ్మసాని, విజయనగర లాంటి రాజులు ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం.[2] పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీమల్లికార్జునుని పవిత్రధామం.చెంచు రామయ్య గా కూడా పిలవబడుతున్నాడు. శ్రీశైల దేవస్థానమునకు రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోట లాంటి పటిష్ఠ కట్టడము నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు, అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు. శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రము [3] శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది, అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవది, దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం ఆరవది.

శాసనాధారాలు

[మార్చు]

శ్రీశైలం చరిత్రకు ఆధారాలుగా ఉన్న శాసనాల్లో మొదటిది సా.శ.6వ శతాబ్ది నాటిది. ఆరవ శతాబ్ది నాటి మైసూరులోని కదంబరాజుల తాల్గుండి శాసనంలో మొదటిసారి శ్రీశైలం పేరు కనిపిస్తోంది.

సాహిత్యాధారాలు

[మార్చు]

తెలుగు, తమిళ, కన్నడ గ్రంథాల్లో దీని ప్రశంస విస్తారంగా కనిపిస్తోంది. సా.శ. 6, 7 శాతాబ్దాల నాటి తమిళ శైవ గ్రంథం తేవరంలో అస్పర్, సుందర్, నమ్మందర్ అనే పేర్లున్న భక్తకవులు శ్రీశైలాన్ని గురించి గానం చేశారు. తిరుప్పాపురం (శ్రీపర్వతం) అని పేర్కొన్నారు. సా.శ.14వ శతాబ్దం నాటి శైవకవియైన పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రములో కరమొప్పు దక్షిణ కైలాసము అంటూ శ్రీశైలాన్ని కీర్తించారు.[2] తెలుగు సాహిత్యంలో తొలి యాత్రాచరిత్రగా పేరొందిన కాశీయాత్ర చరిత్రలో శ్రీశైలం 1830ల నాడు ఎలా ఉందన్న వివరాలు దొరుకుతున్నాయి. 1830లో చెన్నపట్టణం నుంచి కాశీకి యాత్రగా వెళ్ళిన గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య ఆ ఏడాది జూన్ 16 నాటికి శ్రీశైలం చేరుకున్నారు. ఆయన వ్రాసిన దాని ప్రకారం 1830ల్లో ఈ ప్రాంతం కందనూరు నవాబు అధీనంలో ఉండేది. శ్రీశైలం కొండమీద వాసయోగ్యమైన పరిస్థితులు లేకపోవడమూ, క్రూరమృగాల భీతి ఉండడంతో ఈ ఆలయాల అర్చకులు, కందనూరు నవాబు తరఫున యాత్రికుల నుంచి హాశ్శీలు తీసుకునే ముసద్దీలు ఆత్మకూరు పట్టణంలో కాపురం ఉండేవారు. ఉత్సవాలకు వచ్చే సాధారణ భక్తులకు ఒక్కొక్కరికీ రూ.7, గుర్రానికి రూ.5, అభిషేకానికి రూ.3, వాహనోత్సవం చేయిస్తే ఉత్సవపు సెలవులు కాక రూ.43, దర్పణసేవోత్సవానికి రూ.3 ప్రకారం నవాబుకు చెల్లించాల్సివచ్చేది. శ్రీశైలానికి వెళ్ళే నాలుగు బాటల్లో ఆత్మకూరు బాట తప్ప మిగిలిన దారులు ఉత్సవాలు కాని సామాన్యమైన దినాల్లో వెళ్లేందుకు వీలే లేని స్థితిలో ఉండేవి. చెంచువాళ్ళ భయం, అడవి జంతువుల భయం విస్తరించివుండేది. చెంచువాళ్ళు ఆటవికులైనా అప్పట్లో చాలామంది దారినపోయే యాత్రికులను యాచించి తినే అలవాటు పడ్డారని వ్రాసుకున్నారు. ప్రతిరోజూ పల్లకీసేవ జరిగేది. చైత్రమాసంలో భ్రమరాంబ అమ్మవారికి తామసపూజలు జరిగేవి. అర్చకులు ఒకరొకరు మార్చి మార్చి డ్యూటీలు చేసుకునేవారని ఉంది.[4]

స్థల పురాణం

[మార్చు]

పూర్వం అరుణాసురడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపాదాలచే, చతుష్పాదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెపుతుంది. తర్వాత దేవతలు పధకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురుడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నామని, కాబట్టి ఈరాకలో వింత ఏమి లేదని చెపుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర (తుమ్మెద) రూపం ధరించి అసంసాఖ్యకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి.

కృతయుగమున పుత్రార్ధియై ఘోరతప మాచరించిన శిలాద మహర్షికి పరమేశ్వరానుగ్రహంబున జన్మించిన నందికేశ్వర, పర్వతనామ ధేయులగు కుమార రత్నములు తమతీర్వతపోగ్ని జ్వాలలచే త్రిలోకంబుల గడగడలాడించి పరమేశ్వరుని ప్రత్యక్షము గావించుకొనిరి. వారిలో నందీశ్వరుడు ప్రమథగణాధిపత్యమును, ఈశ్వర వాహనత్వమును వరములుగా బడెసెను. పర్వతుడు తాను పర్వతాకారముదాల్చుదునని, తన శిఖరముపై పరమేశ్వరుడు త్రిశత్కోటి దేవతలతో ప్రమధులతో సర్వతీర్థక్షేత్ర రాజములతో స్వయంభూ లింగరూపమున పార్వతీ సమేతుడై వెలయవలయునని, తన శిఖర దర్శన మాత్రంబుననే జనులకు ముక్తి నొసంగ వలయునని వేడుకొనిన నాటినుండి శ్రీశైలము మహామహిమోపేతమై ప్రఖ్యాతిగాంచింది.శ్రీశైలమని పేరువచ్చుటకు గల కారణము-కృతయుగాంతమున గల 'సుమతి' నామధేయుడగు మునీంద్రుని పుత్రికామణియగు 'శ్రీ' తన ఉగ్రతపంబుచే ఈశుని మెప్పించి ' ఈ పర్వతమున ఎల్లకాలము నాపేరు ముందునిడి ప్రజలు పిలుచు నట్లు పరమేశుని వరమనుగ్రహింపమని ప్రార్థించి, సఫల మనోరధురారైనప్పటి నుండి ఈ పర్వతము శ్రీ పర్వతమనియు, శ్రీశైలమనియు వ్యవహరింపబడింది.

స్వామికి మల్లికార్జున నామ ధేయము కలుగుటకు కారణం: శ్రీశైల సమీపమందలి మల్లికాపుర మహారాజగు చంద్రగుప్తుడు శత్రువిజేతయై, స్వదేశానికి ద్వాదశ వర్షానంతరము మేగుదెంచి, పరమేశ్వరానుగ్రహ సంజాతయు, అపురూప లావణ్య పుంజమును, తన పుత్రికా రత్నమును అగు చంద్రమతి గాంచి కామించెను.ఎవరెన్ని విధముల వలదని వారించు చున్నను వినక మోహవివశతచే కామాంధుడై అనుచితముగా ప్రవర్తింప ఆమె తప్పించుకొని శ్రీశైలమునకేగి శివుని మల్లికా కుసుమంబుల బూజించి ప్రత్యక్షము గావించుకొనినది. కామ్మంధుడగు తన తండ్రిని శిక్షించి, మల్లికాపురమున దగ్ధమొనరింప వలసిన దనియు, తనకు దృఢమగు శివభక్తినొసగి సర్వజన భజనీయుడగు, అంబారూపంబు నొసగి మల్లికార్జునాఖ్యచే పరమేశ్వరుడు సుప్రసిద్ధిడు కావలెనని వరములు కోరినది.అది మొదలు మల్లికార్జునడు అను పేరుకలుగుట, చంద్రమతి భ్రమరకీటక న్యాయమున అంబా స్వరూపముగా భ్రమరాంబ నామమున సర్వలోక భజనీయుడగుట జరిగింది.పరమేశ్వర శాప దగ్ధమై మల్లికాపురము నిర్ములన అగుటయు, చంద్రగుప్తుడు పచ్చబండై పాతాళ గంగలో బడుటచే ఆజలము పచ్చగా మారుటయు జరిగింది.

నామవివరణ

[మార్చు]

శ్రీశైలానికే సిరిగిరి, శ్రీగిరి, శ్రీపర్వతం, శ్రీశైలం మొదలైన నామాతరాలున్నాయి. శ్రీ అనగా సంపద, శైలమంటే పర్వతం కనుక శ్రీశైలమంటే సంపద్వంతమైన పర్వతమని అర్థం. దీనికి శ్రీకైలాసం అనే పేరుతో వ్యవహారం వుండడమూ ఉంది. సా.శ.1313లోని ఒక శాశనాన్ని అనుసరించి దీనికి శ్రీ కైలాసము అనే పేరూ ఉన్నట్టు తెలుస్తోంది. దానిలో మహేశ్వరులు శ్రీకైలాసము (శ్రీశైలం) పైన నివసించారని ఉంది.[2]చెంచు వారి అల్లుడిగా,చెంచు రామయ్య గా ప్రసిద్ధికెక్కినాడు.

భౌగోళికం

[మార్చు]
పటం
Map

ఈ క్షేత్రం కర్నూలు నుండి 180 కి.మీ., హైదరాబాదు నుండి 213 కి.మీ, గుంటూరు నుండి శ్రీశైలం 225 కి.మీ. దూరంలో ఉంది.

రవాణా సౌకర్యాలు

[మార్చు]
రోడ్డు మార్గాలు
రైలు మార్గం
విమాన మార్గం

శ్రీశైల దర్శనీయ ప్రదేశాలు

[మార్చు]

శ్రీశైలం చుట్టు ప్రక్కల దాదాపు అయిదు వందల వరకూ శివలింగాలు ఉంటాయంటారు. పరిసర ప్రాంతాలలో చూడదగిన ప్రదేశాలు, దేవాలయాలు,మఠాలు, మండపాలు, చారిత్రక స్థలాలు అనేకాలు ఉన్నాయి. చూపులకు కానరానంతగా విస్తరించుకొన్న శ్రీశైలము క్షేత్రములోని దర్శనీయ ప్రదేశాలను ముఖ్యముగా మూడు భాగాలుగా విభజించవచ్చు.అవి 1.శ్రీశైల దేవాలయ ప్రాంతము. 2.మండపాలు, పంచమఠాల ప్రాంతము, 3.అడవిలో గల పర్యాటక ప్రాంతములు, చారిత్రక ప్రదేశాలు

శ్రీశైల దేవాలయ ప్రాంతం

[మార్చు]
  • శ్రీమల్లికార్జునుని దేవాలయం: అభేద్యమైన ప్రాకారము లోపల నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయము. ప్రధాన గర్భాలయము మాత్రము ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణ నిర్మాణముగా ముష్కరుల నుండి రక్షణ కొరకు కట్టినట్టుగా ఉంటుంది. దీనిలో శివ పార్వతుల విగ్రహాలు వుంటాయి. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడుగా,, మాత పార్వతి దేవిని భ్రమరాంబగా పూజిస్తారు. శివ భగవానుడికి గల 12 జ్యోతిర్ లింగాలలో శ్రీశైలం ఒకటి కావున, హిందువులు ఈ దేవాలయానికి చాల ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకొంటారు. ఇక్కడ గల మల్లెల తీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం వస్తుందని భావిస్తారు.
  • భ్రమరాంబిక అమ్మవారి గుడి: భ్రమరాంబికా అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్పకళతో అందమైన శిల్పతోరణాలతో కూడిన స్థంబాలతోనూ అత్యద్భుతంగా ఉండును. ఈ ఆలయము ఆంధ్రదేశములోనే అత్యంత విశిష్టమైన శిల్ప కళ కలిగిన దేవాలయముగా వినుతికెక్కినది. ఈ దేవాలయములో గర్భాలయ వెనుక భాగమున గోడకు చెవి ఆన్చి వింటే ఝమ్మనే భ్రమరనాదం వినవస్తుంది.
  • మనోహర గుండం: శ్రీశైలంలో తప్పకుండా చూడవలసిన వాటిలో ఇది ఒకటి. దీనిలో గొప్పతనము ఏమిటంటే చాలా స్వచ్ఛమైన నీరు ఈ గుండములో ఉంటుంది. శ్రీశైలము చాలా ఎత్తైన ప్రదేశములో ఉంది. అంత ఎత్తులో కూడా ఆ రాళ్ళలో ఇంత చక్కని నీరు ఉండటం నిజంగా చూడవలసినదే. ఈ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మహానంది లోని కోనేటి నీటిలో క్రింద రూపాయ నాణెం వేస్తే పైకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ చిన్ని గుండంలో కూడా కనిపిస్తుంది.
  • నాగ ప్రతిమలు:
  • పంచ పాండవులు దేవాలయాలు: పాండవులు మల్లికార్జునుని దర్శించుకొని వారి పేరున అయిదు దేవాలయాలను ప్రధాన దేవాలయ వెనుక భాగమున నిర్మించి శివలింగములను ప్రతిష్ఠించిరి.
  • అద్దాల మండపం:
  • వృద్ద మల్లికార్జున లింగం: ఇది ముడతలు పడిన ముఖంలా ఉన్న శివ లింగం. ఇది చూస్తే అంత అందముగా ఉండదు. బహుశా ముసలితనాన్ని గుర్తు చేస్తుంది!
రుద్రాక్ష మఠము

మండపాలు, పంచమఠాల ప్రాంతం

[మార్చు]

పంచమఠాలు అని పిలువబడే మఠాలు ఇక్కడ ఉన్నాయి.

  • ఘంటా మఠం
  • భీమ శంకరమఠం
  • విభూతి మఠం
  • సారంగధర మఠం: మిగిలిన మఠాలలో నిర్వహణలో, అభివృద్ధిలో ప్రసిద్దమైనది సారంగధర మఠం.
  • రుద్రాక్షమఠం: ఇక్కడి మఠంలో శివలింగము రుద్రాక్ష రూపంలో ఉండటం ఇక్కడి ప్రత్యేకత.
  • విశ్వామిత్రమఠం:
  • నంది మఠం మొదలైనవి.

అడవిలో గల పర్యాటక ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలు

[మార్చు]

పాతాళ గంగ

[మార్చు]

శ్రీశైలం ప్రక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. కాకపోతే శ్రీశైలము చాలా ఎత్తులో ఉన్నది, నది మాత్రము క్రింద లోయలో ప్రవహిస్తుంది. అందుకే శ్రీశైలము నుండి చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చెయ్యాలి. ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళగంగ అనే సార్థక నామధేయముతో వ్యవహరిస్తారు. ఆ మెట్లు అన్నీ దిగి కృష్ణలో మునిగి తిరిగి ఎక్కినపుడు పాతాళగంగ అనునది ఎంత సార్థక నామధేయమో తెలుస్తుంది. పాతాళ గంగ వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది నీటి క్రింద బండలపై నాచు నిలచి సూర్య కిరణాల వెలుగు వలన పచ్చగా కానవస్తుంది. అయితే అందరూ నీటి క్రిందగల దీనిని పచ్చల బండ అని వ్యవహరిస్తారు.

2004లో పాతాళగంగకు వెళ్ళుటకు రోప్ వే ఏర్పాటు చేయబడింది. ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. త్రేతాయుగ కాలం నాటి ఆంజనేయ స్వామి గుడి తప్పనిసరిగా చూడవలసిన వాటిలో ఒకటి.

సాక్షి గణపతి ఆలయం

[మార్చు]

ఇది ముఖ్యాలయానికి కొద్ది దూరంలో ఉంటుంది. ఈ గణపతి ఆలయము ప్రత్యేకత ఏమిటంటే మనము శ్రీశైలములో శివుడిని దర్శించినంత మాత్రముననే కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. అప్పుడు మనకు ఈ సాక్షి గణపతే సాక్ష్యము చెపుతాడు, మనము శ్రీశైలము వచ్చినాము అని. ఇతనిని సాక్షి గణపతి అంటారు.

శ్రీశైల శిఖరం

[మార్చు]

శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది, ఈ శ్రీశైల శిఖరం. శ్రీశైలములో శిఖరదర్శనము చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖరదర్శనము అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు; దూరంగా ఉన్న ఈ ఎత్తైనకొండ శిఖరేశ్వరం పై నుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి. అలా చూస్తే, శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారని నమ్ముతారు.

ఫాలధార, పంచధారలు

[మార్చు]

శిఖరేశ్వరమునకు, సాక్షిగణపతి గుడికి మధ్యగా హటకేశ్వరానికి సమీపాన అందమైన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన ప్రదేశము ఉంది. ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి. కొండపగులులనుండి పంచధార (ఐదుధార) లతో ఉరికివచ్చే జలాలు చల్లగా ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ప్రవహిస్తూ ఒక్కొక్క ధార ఒక్కొక్క రుచితో నుండుట ఇక్కడి ప్రత్యేకత. ఒక ధార నుండి జలము సేవించి ప్రక్కమరొక దాని నుండి సేవిస్తే మార్పు తెలుస్తుంది.

ఆది శంకరాచార్యుడు తపస్సు చేసిన ప్రదేశం

[మార్చు]

దేశం రాజకీయంగా అల్లకల్లోల పరిస్థితులలో ఉన్నప్పుడు, వివిధ దార్శనికులు,మతప్రచారకులు అశాంతికి దోహదంచేస్తున్న సమయంలో,భారతీయ సంప్రదాయానికి ఆధారమైన వైదిక వాజ్మయాన్ని సరిగా అధ్యయనం చేసేవారుగాని, వాఖ్యానించగలిగేవారుగాని చాలా అరుదుగా ఉన్న సమయంలో జన్మించిన శ్రీశంకరులు పరిస్థితులను చక్కదిద్ది ప్రజలలో వైదికథర్మస్ఫూర్తిని వ్యాప్తి చేస్తూ దేశంనలుమూలలా నాలుగు ప్రప్రసిద్ధ పీఠాలను స్థాపించి విస్తృతంగా పర్యటిస్తూ ఉండేవారు. అలా పర్యటించే సమయంలోచాలా కాలం శ్రీశైల పరిసరములందు తపమాచరించారు. ఈయన తపమాచరించిన ఈ ప్రదేశానికి ఒక మంచి కథనము ఉంది.

శంకరులు ఇక్కడ తపస్సు చేసుకొంటూ ఈపరిసరాలలో అద్వైతమత వ్యాప్తి చేయుచున్నకాలమందు, శంకరులు చేయు కార్యములు నచ్చని కొందరు ఆయనను అంతమొందించు యత్నముతో ఆపరిసరాలయందు బీభత్సము సృష్టించుచున్న ఒకపెద్ద దొంగలముఠానాయకుని రెచ్చగొట్టి, కొంత సొమ్మిచ్చి పంపించారు.అతడు ఇదే ప్రదేశమున పెద్ద కత్తితో మాటువేసి తపమాచరించుకొనుచున్న శంకరుని వెనుకగా ఒకేవేటున తలఎగరగొట్టు ప్రయత్నమున ముందుకురికెను.ఇక్కడ ఇది జరుగుచున్న సమయమున శంకరుని ప్రధాన శిష్యుడైన పద్మపాదుడు మల్లికార్జునుని దేవాలయమున ఈశ్వరుని ధ్యానించుచూ కూర్చొని ఉండెను. ఈశ్వరునే మనసున ఉంచి ధ్యానిస్తున్న అతనికి హటాత్తుగా ఈ దృశ్యము కనిపించెను. వెంటనే అతడు మహోగ్రుడైన శ్రీలక్షీనరసింహుని వేడనారంభించెను. ఇక్కడ శంకరుని వధించుటకు ఉరికిన ఆ దొంగలనాయకునిపై ఎటునుండో హటాత్తుగా ఒక సింహము దాడి చేసి, అతడి శరీరాన్ని ముక్కలుముక్కలుగా చీల్చివేసి ఎట్లు వచ్చినదో అట్లే మాయమయినది.ఈ విషయము శంకరులకు ధ్యానమునుండి బయటకు వచ్చిన తరువాత తెలియజేసారు. అంతవరకూ ఆయనకు జరిగినది తెలియదు. అధిక కాలము ఈప్రాంతమందు తపమాచరించిన గుర్తుగా ఇక్కడ ఉన్న పెద్ద బండపై శంకరుని యొక్క పాదముద్రలు ఉన్నాయి.

శివాజీ సాంస్కృతిక , స్మారక భవనం

[మార్చు]

శివాజీ గొప్ప దుర్గా భక్తుడు. శ్రీశైల దేవాలయమును ఎన్నోసార్లు దండయాత్రలనుండి కాపాడి శ్రీశైలంలో భ్రమరాంబికా అమ్మవారి స్వహస్తాలతో వీరఖడ్గం అందుకొన్న ఘనుడు. అతని పేరున ఇక్కడ ఇంకనూ తుదిమెరుగులు దిద్దుకొనుచూ రెండు అంతస్తులుగా నిర్మింపబడిన శివాజీ సాంస్కృతిక, స్మారక భవనంలో- అతడి జీవిత విశేషాల కథనం, చిత్రాల ప్రదర్శన కొరకు మొదటి అంతస్తునూ, శివాజీ కాంశ్యవిగ్రహం కొరకు రెండవ అంతస్తును కేటాయించారు.

హటకేశ్వరం

[మార్చు]

శ్రీశైలమల్లికార్జునదేవస్థానమునకు మూడు కిలోమీటర్ల దూరములో కల మరొక పుణ్యక్షేత్రం హటకేశ్వరం. ఇక్కడ హటకేశ్వరాలయము ఉంది. ఈ పరిసరాలలోనే శ్రీ ఆదిశంకరాచార్యులవారు నివసించారు. పరమశివుడు అటిక (ఉట్టి, కుండ పెంకు)లో వెలియడంతో ఈ ఆలయంలోని ఈశ్వరుని అటికేశ్వరుడు అనేవారు రానురాను అదేమెల్లగా హటికేశ్వరస్వామిగా మారిపోయింది. హటకేశ్వర నామంతో ఆ ప్రాంతానికి రాకపోకలు సాగించే భక్తుల మాటగా హటకేశ్వరంగా పిలువ బడుతోంది. ఇక్కడ చెంచులు అదివాశీలు నివసిస్తున్నారు. ఈ దేవాలయ పరిసరాలలో పలు ఆశ్రమములు, మఠములు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేందుకు శ్రీశైలం దేవస్థానము నుండి ప్రతి అర గంటకు బస్సులు ఉన్నాయి.

శిఖరం

[మార్చు]

శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది, ఈ శిఖరేశ్వరం. శ్రీశైలంలో శిఖరదర్శనం చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖరదర్శనము అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు,అక్కడ ఉన్న నందిని రోలుమాదిరిగా నున్న దానిలో నవధాన్యాలు వేసి ఈశ్వరుని స్మరించి అటూ ఇటూ వీలుగా త్రిప్పుకొనుచూ సుదూరంగా ఉన్న శ్రీమల్లిఖార్జుని ఆలయపు విమానంపైనున్న శిఖరాన్ని చూడుటకు ప్రయత్నించాలి.అలా చూసే క్రమంలో ఆవ్యక్తికి గనుక శిఖరం కనిపిస్తే కొద్ది దినాలలో చనిపోతారు, పునర్జన్మ నుండి విముక్తులవుతారు.

కదళీవనం

[మార్చు]

శ్రీ దత్తాత్రేయ స్వామి అవతార పరంపరలో 3వ అవతార పురుషుడైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహారాష్ట్రలోని కరంజా నగరంలో జన్మించి నర్సోబవాడాలోను, కర్ణాటకలోని గాణాగాపురంలోనూ తపమాచరించి చివరకు కదళీవనంలో అంతర్ధానమయ్యారు. వీరశైవ సంప్రదాయానికి చెందిన అక్క మహాదేవి కూడా ఇక్కడే అవతార సమాప్తి గావించారని ప్రతీతి.

భీముని కొలను

[మార్చు]

శ్రీశైలంలోని సాక్షి గణపతి గుడి దాటాక కుడివైపు పాపనాశనం తీర్థం ఉంటుంది. దీనికి ఎదురుగా ఉన్న కాలిబాట భీముని కొలనుకు దారితీస్తుంది. ఈ మార్గంలో శతాబ్దాల కిందట రెడ్డిరాజులు మెట్లు కట్టించడం విశేషం. మెట్ల దారిలో ఒక కిలోమీటర్‌ వెళ్లాక.. దట్టమైన అడవితో విశాలమైన లోయ కనిపిస్తుంది. ఇక్కడున్న మహాద్వారం.. అందమైన లోకంలోకి స్వాగతం పలుకుతుంది. పెద్ద పెద్ద మెట్లు.. వీటికి ఇరువైపులా చెట్లు.. వాటికి అల్లుకున్న లతలు.. మనిషంత ఎత్తుండే పుట్టలు.. దారి పొడుగునా కనిపించే దృశ్యాలివి. ఈ దారిలో రెండు కిలోమీటర్లు నడక సాగిస్తే.. త్రివేణీ, త్రి పర్వత సంగమానికి చేరుకుంటారు.వందల అడుగుల లోతున్న లోయల మధ్య తూర్పు నుంచి ఒక సెలయేరు, దక్షిణం నుంచి మరో సెలయేరు వచ్చి.. చిన్న చిన్న జలపాతాలుగా దూకుతుంటాయి లపాతాలు ఏర్పరిచే కొలను మనోహరంగా ఉంటుంది. అదే భీముని కొలను. అంటే పెద్ద కొలనని అర్థం. అయితే ఇది మరీ అంత పెద్దగా ఏం ఉండదు. కానీ చాలా ప్రత్యేకమైనది. తూర్పు సెలయేరు, దక్షిణ సెలయేరు సంగమించి.. జలపాతంగా మారి ఒక గుండంలో దూకుతాయి. అక్కడ దూకిన జలాలు.. అనూహ్యంగా మాయమవుతాయి. ఒక పరుపు బండ కింది నుంచి రెండు వందల అడుగులు ప్రయాణించి మళ్లీ బయటకు వస్తాయి. భారీ పరుపు బండ మీద నిలబడితే.. దాని కింది నుంచి నీళ్లు పారుతున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. పరుపు బండ కింది నుంచి వెలుపలకు వచ్చిన నీళ్లు కొలనులోకి చేరడంతో నిరంతరం అలలు పుడుతుంటాయి. వేసవిలోనూ ఇక్కడ నీటి జాడ కనిపించడం విశేషం. అహోబిలం నరసింహస్వామి.. చెంచులక్ష్మిని వరించి భీముని కొలనులో సయ్యాటలాడాడని స్థానిక కథనం. కొలను ఒడ్డున భీమాంజనేయుల విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడికి సమీపంలోని పురాతన శివాలయం ఉంది. దీనిని సందర్శించి.. మరోసారి లోయల అందాలను చూస్తూ.. పొద్దుగూకే లోగా శ్రీశైల క్షేత్రానికి చేరుకోవచ్చు.

వసతి సౌకర్యాలు

[మార్చు]

శ్రీశైలంలో వసతిగా దేవస్థానమువారి సత్రములు, అతి పెద్ద కాటేజీలు, హొటల్స్ ఉన్నాయి. ఆంధ్రదేశములో ఎక్కడా లేని విధంగా కులప్రాతిపదికగా ఎవరికి వారుగా ప్రతి కులపువారికీ ఒక సత్రం నిర్వహింపబడుతున్నది. శివరాత్రి పర్వదినములు, కార్తీకమాసంలో తప్ప మిగిలిన దినాలలో ఏసత్రములోనైనా ఎవరికైనా వసతి లభించును. ఈ సత్రములే కాక మరికొన్ని కర్ణాటక వారి సత్రముల, ప్రైవేటువారి సత్రములతోనూ శ్రీశైలం భక్తజనులతో కళకళలాడుతుంటుంది.

ఇంకా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. గబ్బిట, దుర్గాప్రసాద్ (2015). "శ్రీ బ్రమరాంబా మల్లికార్జున దేవాలయం, శ్రీశైలం". దర్శనీయ దైవక్షేత్రాలు. సరసభారతి. pp. 18–24.
  2. 2.0 2.1 2.2 లక్ష్మీనారాయణ, కొడాలి (1972). చారిత్రిక శ్రీశైలము, భారతీయ సంస్కృతి, చారిత్రక కాశీక్షేత్రము.
  3. గోకర్ణ ఖండము లోని, గోకర్ణ పురాణము అను సంసృత గ్రంథము ౬౬ వ. అధ్యాయము నుండి .... పర్వతాగ్రే నదీతీరే బ్రహ్మ,విష్ణు,శివై శ్రితే..........అను శ్లోక ప్రమాణముగా శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రము అనుటలో ఎలాంటి సందేహము లేదు.
  4. వీరాస్వామయ్య, యేనుగుల (1941). Wikisource link to కాశీయాత్రా చరిత్ర (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. వికీసోర్స్. 
  5. "Nearest Railway Station to Mallikarjuna Jyotirlinga". NearestRailwayStation.com.[permanent dead link]

బయటి లింకులు

[మార్చు]