Jump to content

అటల్ బిహారీ వాజపేయి

వికీపీడియా నుండి
(అటల్ బిహారీ వాజ్‌పాయి నుండి దారిమార్పు చెందింది)
అటల్ బిహారీ వాజపేయి
अटल बिहारी वाजपेयी
అటల్ బిహారీ వాజపేయి


11వ భారత ప్రధానమంత్రి (1వ దఫా)
పదవిలో
16 మే 1996 – 1 జూన్ 1996
మునుపు పాములపర్తి వెంకట నరసింహారావు
తరువాత హెచ్.డి.దేవెగౌడ

14వ భారత ప్రధానమంత్రి (2వ దఫా)
పదవిలో
19 మార్చి 1998 – 22 మే 2004
మునుపు ఐ.కె.గుజ్రాల్
తరువాత డా.మన్మోహన్ సింగ్

జననం (1924-12-25)1924 డిసెంబరు 25
బటేశ్వర్, ఆగ్రా జిల్లా, ఉత్తర ప్రదేశ్, బ్రిటీష్ ఇండియా
మరణం 2018 ఆగస్టు 16(2018-08-16) (వయసు 93)
ఢిల్లీ
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు, కవి
మతం హిందూమతము
సంతకం అటల్ బిహారీ వాజపేయి's signature
వెబ్‌సైటు http://www.atalbiharivajpayee.in

అటల్ బిహారీ వాజపేయి (1924 డిసెంబర్ 25 - 2018 ఆగస్టు 16) మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్లో జన్మించిన అటల్ బిహారీ వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన నాయకుడు. ఈయన బ్రహ్మచారి. ఇతను మొదటిసారిగా రెండవ లోక్‌సభకు ఎన్నికయ్యారు. మధ్యలో 3వ, 9వ లోక్‌సభలకు తప్పించి 14వ లోక్‌సభ ముగిసేవరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. 1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి, 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. 1996లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి యోగం లభించినా అది 13 రోజులకే పరిమితమైంది. 1998లో రెండో పర్యాయం ప్రధానమంత్రి పదవి పొంది 13 మాసాలు పాలించారు. 1999లో 13వ లోక్‌సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నారు. అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. మొదటి కాంగ్రేసేతర ప్రభుత్వమైన మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖను నిర్వహించారు. అనారోగ్య కారణాల వల్ల క్రియాశీల రాజకీయాలనుండి తప్పుకున్నారు. ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు గాను భారత ప్రభుత్వం మార్చిి 12, 2015లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది.[1] ఆయన పుట్టినరోజు అయిన డిసెంబర్ 25ను సుపరిపాలనా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించింది.[2] 2015 మార్చి 27 న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, వాజపేయికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేసారు. అనారోగ్యంతో పూర్తిగా మంచంపై ఉన్న వాజపేయికి భారత రత్న ప్రదానం చేయడానికి స్వయంగా రాష్ట్రపతే వాజపేయి నివాసానికి తరలి వెళ్ళారు[3]

ప్రారంభ జీవితం, విద్య

అటల్ బిహారీ వాజపేయి డిసెంబర్ 25,1924గ్వాలియర్ లోని ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు కృష్ణాదేవి, కృష్ణబిహారీ వాజపేయి. ఆయన తాత పండిట్ శ్యాం లాల్ వాజపేయి వారి పూర్వీకుల నివాస ప్రాంతమైన ఉత్తర ప్రదేశ్ లోని బటేశ్వర్ నుండి గ్వాలియర్ లోని మొరీనాకు వలస వెళ్ళాడు. ఆయన తండ్రి కృష్ణబిహారీ వాజపేయి గ్వాలియర్ ప్రాంతంలో ఒక ఉపాధ్యాయుడు, కవి. వాజపేయి గ్వాలియర్ లోని సరస్వతి శిశు మందిర్ లో విద్యాభ్యాసం చేశాడు. గ్వాలియర్ విక్టోరియా కళాశాల (ప్రస్తుతం లక్ష్మీబాయి కళాశాల)లో చేరి హిందీ, ఆంగ్లము, సంస్కృతంలో అత్యంత ప్రతిభావంతునిగా పట్టభద్రుడైనాడు. కాన్పూరు లోని దయానంద ఆంగ్లో వైదిక కళాశాలనుండి రాజనీతిశాస్త్రంలో ఎం.ఎ పట్టాను పొందాడు. ఎం.ఎ డిగ్రీని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనాడు.[4][5]

వాజపేయి గ్వాలియర్లో ఆర్య సమాజపు యువ విభాగమైన ఆర్య కుమార్ సభతో తన సామాజిక కార్యశీలతను ప్రారంభించి, 1944లో ఆ విభాగానికి ప్రధాన కార్యదర్శి అయ్యాడు. ఆయన 1939 లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.)లో కూడా చేరాడు. బాబా ఆమ్టే ప్రభావంతో ఆయన 1940-44 లలో అధికార్ల శిక్షణా కేంద్రానికి హాజరైనాడు. ఆయన 1947 లో "పూర్తి స్థాయి సేవకుడు" అనగా ఆర్.ఎస్.ఎస్. ప్రచారక్ అయ్యాడు. ఆయన దేశ విభజన తర్వాత జరిగిన అల్లర్ల వల్ల న్యాయశాస్త్ర విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపేశాడు.

రాష్ట్రీయ స్వయంసేయక్ సంఘ్ విస్తారక్ గా ఉత్తరప్రదేశ్ వెళ్ళిన వాజపేయి, అక్కడ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నడుపుతున్న "రాష్ట్రధర్మ" (హిందీ మాసపత్రిక), "పాంచజన్య" (హిందీ వారపత్రిక) పత్రికలలోను, స్వదేశ్", "వీర్ అర్జున్" వంటి దిన పత్రికలలోనూ పనిచేయటం ప్రారంభించాడు. వాజపేయి జీవితాంతం బ్రహ్మచారిగా జీవించాడు.[5][6][7]

ప్రారంభ రాజకీయ జీవితం (1942–1975)

1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో, ఆయన తన అన్న ప్రేమ్‌తో కలిసి 23 రోజుల పాటు అరెస్టయిన సందర్భంలో వాజపేయికి తొలిసారిగా రాజకీయాలతో పరిచయమేర్పడింది. ఏ విధమైన బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొననని, క్విట్ ఇండియా ఉద్యమ నాయకులతో ఎటువంటి సంబంధాలు నెరపనని వ్రాతపూర్వకమైన హామీ యిచ్చిన తరువాతనే ఆయనను విడిచిపెట్టాడు.[8]

1951 లో క్రొత్తగా ఏర్పడిన భారతీయ జనసంఘ్ అనే హిందూ దక్షిణ పక్ష రాజకీయపార్టీలో పనిచేయడానికి, దీన్ దయాళ్ ఉపాధ్యాయతో పాటు వాజపేయిని ఆర్.ఎస్.ఎస్ నియమించింది. ఇది ఆర్.ఎస్.ఎస్ తో కలిసి పనిచేస్తున్న రాజకీయ పార్టీ. ఆయన ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న పార్టీ ఉత్తర విభాగానికి జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాడు. అనతికాలంలోనే జనసంఘ్ నాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ అనుయాయిగా, సహాయకునిగా మారాడు. 1954 లో కాశ్మీరులో కాశ్మీరేతర భారతీయ సందర్శకులను చిన్నచూపు చూస్తున్నారన్న విషయమై నిరసన ప్రకటిస్తూ ముఖర్జీ ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించినప్పుడు, వాజపేయి ఆయన వెంటే ఉన్నాడు. ముఖర్జీ ఈ నిరాహారదీక్షా సమయంలోనే కాశ్మీరు జైలులో మరణించాడు. 1957లో వాజపేయి బల్రామ్‌ఫూర్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆయన వాగ్ధాటి మూలంగా, అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఏదో ఒకరోజు వాజపేయి దేశ ప్రధాని అవుతాడని ఊహించాడు.[9]

ఆయనకు గల వాగ్ధాటి, సంస్థాగతమైన నైపుణ్యాల కారణంగా జనసంఘ్‌లో ముఖ్యనేతగా ఎదిగాడు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరణానంతరం జనసంఘ్ మొత్తం బాధ్యత, యువ వాజపేయిపై పడింది. 1968 లో జనసంఘ్ జాతీయ అధ్యక్షునిగా ఎదిగాడు. నానాజీ దేశ్‌ముఖ్, బాల్‌రాజ్ మధోక్, లాల్ కృష్ణ అద్వానీ లతో కలిసి జనసంఘ్‌ను జాతీయస్థాయి ప్రాముఖ్యతను సంతరించుకునే దిశగా నడిపించాడు.

1978లో అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ భారత పర్యటన సందర్భంగా, అప్పటి విదేశాంగ మంత్రి, వాజపేయి (కుడివైపు చివర), అప్పటి భారత ప్రధానమంత్రి మొరార్జీ దేశాయి (మొదటి వరస, కుడి నుండి మూడవ వ్యక్తి)

రాజకీయ జీవితం (1975–1995)

1975, 1977 ల మధ్య, భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి చెందిన ప్రధాని, ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన ఎమర్జన్సీ కాలంలో అనేకమంది విపక్ష నాయకులతో పాటు అరెస్టు అయ్యాడు. 1977 లో సంఘసంస్కర్త జయప్రకాశ్ నారాయణ్, కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా సంఘటితమై పోరాడటానికి, అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు ఇచ్చిన పిలుపు మేరకు, వాజపేయి జనసంఘ్‌ను క్రొత్తగా ఏర్పడిన సంకీర్ణ కూటమి, జనతాపార్టీలో విలీనం చేశాడు.[10]

1977 సార్వత్రిక ఎన్నికలలో న్యూఢిల్లీ నుండి జనతా పార్టీ విజయం తరువాత ఆయన మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశాడు. విదేశీ వ్యవహారాల మంత్రిగా ఆయన ఐక్యరాజ్యసమితి యొక్క సర్వప్రతినిధి సభలో హిందీలో ప్రసంగించిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు. 1979లో జనతా ప్రభుత్వం కూలిపోయే నాటికి వాజపేయి, స్వతంత్రంగా గౌరవప్రథమైన రాజకీయవేత్తగా, అనుభవజ్ఞుడైన నాయకునిగా ఎదిగాడు.[10] 1979లో మొరార్జీదేశాయ్ ప్రధానమంత్రిగా రాజీనామా చేసిన కొద్దిరోజులకే జనతాపార్టీ కూడా విఛ్ఛిన్నమైపోయింది. జనసంఘ్ నాయకులు జనతాపార్టీని సంఘటితంగా ఉంచడానికి ప్రయత్నించినా, జనతాపార్టీలోని వివిధ వర్గాల మధ్య అంతర్గత విభేదాలవల్ల విసిగిపోయి సంకీర్ణంలోనుండి బయటకు వచ్చింది.

వాజపేయి, జనసంఘ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ల నుండి వచ్చిన తన సహచరులను, ముఖ్యంగా దీర్ఘకాల స్నేహితులైన ఎల్.కె.అద్వానీ, భైరాన్ సింగ్ షెకావత్ లను కలుపుకొని 1980 లో భారతీయ జనతా పార్టీని ఏర్పరచి, మొట్టమొదటి అధ్యక్షునిగా పనిచేసాడు. జనతా ప్రభుత్వం తర్వాత వచ్చిన ఇందిరా కాంగ్రెసు ప్రభుత్వానికి బలమైన విమర్శకునిగా అవతరించాడు.

భారతీయ జనతాపార్టీ, పంజాబ్ రాష్ట్రంలో పెరిగిపోతున్న వేర్పాటువాద తీవ్రవాదాన్ని వ్యతిరేకించినా, ఆ పరిస్థితికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ యొక్క "విభజన, అవినీతి రాజకీయాలు జాతీయ సమైక్యత, సమగ్రతలకు ఫణంగా పెట్టి, తీవ్రవాదాన్ని ప్రోత్సహించాయి" అని ఆరోపించింది.[11] భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ బ్లూ స్టార్ను వ్యతిరేకించింది. 1984 లో ఇద్దరు సిక్కు అంగరక్షకులచే ఇందిరాగాంధీ హత్యకు గురైన తదుపరి ఢిల్లీలో సిక్కుల పై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించింది.[12] 1984 ఎన్నికలలో బి.జె.పి లోక్‌సభలో రెండు సీట్లను మాత్రమే పొందింది. ఆ కాలంలో వాజపేయి బి.జె.పి అధ్యక్షునిగా, విపక్ష నాయకునిగా కొనసాగాడు.

అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం, విశ్వహిందూ పరిషత్, ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలు కలసి చేపట్టిన రామ జన్మభూమి మందిర ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ రాజకీయ గళాన్నిచ్చింది.

1995 మార్చిలో గుజరాత్, మహారాష్ట్రలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయం సాధించింది. 1994లో కర్ణాటకలో జరిగిన అసెంభ్లీ ఎన్నికలలో మంచి విజయాలుసాధించింది. ఈ విధంగా జాతీయస్థాయిలో పెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. 1995 నవంబరులో ముంబాయిలో జరిగిన బి.జె.పి సమావేశంలో బి.జె.పి అధ్యక్షుడైన లాల్ కృష్ణ అద్వానీ వాజపేయిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాడు. 1996 మే నెలలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో బి.జె.పి విజయం సాధించింది.[13]

భారత ప్రధానమంత్రిగా (1996 to 2004)

వాజపేయి 1996 నుండి 2004 ల మధ్య మూడు పర్యాయాలు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.

తొలి పర్యాయం: మే 1996

సానుకూల జాతీయవాద భావజాలపు ప్రభావంతో భారతీయ జనతాపార్టీ 1995లో బలమైన పార్టీగా అవతరించింది. 1996 సార్వత్రిక ఎన్నికలలో లోక్‌సభలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా బి.జె.పి అవతరించింది. ఆనాటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ, వాజపేయిని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాడు. వాజపేయి భారత 10వ ప్రధానమంత్రి అయ్యాడు. కానీ బి.జె.పి ఇతర పార్టీల మద్దతును కూడగట్టుకొవటంలో విఫలమై, వాజపాయి ప్రభుత్వం సభలో ఆధిక్యతను నిరూపించుకోలేకపోయింది. పార్లమెంటులో మెజారిటీ పొందలేమని స్పష్టమైన వెంటనే, 13 రోజుల అనంతరం వాజపేయి తన పదవికి రాజీనామా చేశాడు.

రెండవ పర్యాయం: 1998–1999

1996 నుండి 1998 ల మధ్యన రెండు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు పడిపోయిన తరువాత, లోక్‌సభ రద్దై, మధ్యంతర ఎన్నికలు జరిగాయి. 1998 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బి.జె.పి అన్ని పార్టీల కంటే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఈ కాలంలో భావసారూప్యత కలిగిన పార్టీలన్ని బి.జె.పిలో కలిసి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్గా యేర్పడ్డాయి. వాజపేయి రెండవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.[14]

ఎన్.డి.ఏ పార్లమెంటులో తన మెజారిటీని నిరూపించుకుంది. ఈ ప్రభుత్వం 13 నెలల కాలం అనగా 1999 మధ్య వరకు కొనసాగింది. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామైన, జయలలిత నాయకత్వంలోని ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (ఏ.ఐ.ఏ.డి.ఎం.కె) పార్టీ మద్దతు ఉపసంహరించిన కారణంగా ఈ ప్రభుత్వం మెజారిటీని కోల్పోయింది.[15] 1999 ఏప్రిల్ 17 లో జరిగిన విశ్వాస పరీక్షలో ఒక ఓటుతో ఓడిపోయింది. విపక్షాలలో ఎవరూ ప్రభుత్వం యేర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీని కలిగి యుండనందున మరలా లోక్ సభ రద్దయినది. మరలా ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగేంత వరకూ వాజపేయి ప్రధానమంత్రిగా కొనసాగాడు.

అణు పరీక్షలు

1974 లో తొలిసారిగా "ప్రోఖ్రాన్-I" అణుపరీక్ష జరిపిన భారతదేశం, మళ్ళీ 24 సంవత్సరాల తరువాత, 1998 మే నెలలో భారతదేశం రాజస్థాన్ లోని పోఖ్రాన్ ఎడారిలో ఐదు భూగర్భ అణు పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షను "ప్రోఖ్రాన్-II"గా వ్యవహరిస్తారు. వాజపేయి ప్రభుత్వం యేర్పడిన నెలరోజులలోనే ఈ పరీక్షలు జరిగినవి. రెండు వారాల అనంతరం పాకిస్థాన్ తన సొంత అణుపరీక్షలతో స్పందించింది. భారతదేశపు అణు పరీక్షలను రష్యా, ఫ్రాన్స్ మొదలైన కొన్ని దేశాలు సమర్థించాయి.[16] యు.ఎస్.ఎ, కెనడా, జపాన్, బ్రిటన్, ఐరోపా దేశాలు భారతదేశానికి సమాచారం, వనరులు, సాంకేతికాంశాలలో సహాయంపై ఆంక్షలు విధించాయి.[17] తమ అణు సామర్ధ్యాన్ని, అణ్వాయుధంగా మలచే విషయమై భారతదేశం తీసుకున్న నిర్ణయాన్ని, అంతర్జాతీయ ఆంక్షలు సమర్ధవంతంగా నిరోధించలేకపోయాయి. వాజపేయి ప్రభుత్వం ఈ చర్యలను ముందే ఊహించి, పరిగణనలోకి తీసుకొని, తదనుగుణంగా ప్రణాళిక ఏర్పరుచుకున్నది.

లాహోర్ సదస్సు

1988 చివరలో, 1999 మొదట్లో వాజపేయి పాకిస్తాన్‌తో శాంతి కోసం పూర్తిస్థాయి దౌత్యచర్యలు ప్రారంభించాడు. దీని ఫలితంగా ఢిల్లీ-లాహోర్ బస్సును 1999 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. వాజపేయి కాశ్మీర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా పాకిస్థాన్ తో నూతన శాంతి ఒప్పందంకోసం పాకిస్థాన్ ను ఆహ్వానించాడు. తత్ఫలితంగా కుదిరిన లాహోర్ ఒప్పందం, ద్వైపాక్షిక చర్చలను కొనసాగించాలని, వర్తకసంబంధాలు విస్తరించాలని, సహృద్భావం పెంపొందించాలనీ ఉల్లేఖించింది. అణ్వాయుధరహిత దక్షిణాసియా అనే దార్శనిక లక్ష్యాన్ని ఉద్బోధించింది. ఈ ఒప్పందం 1998 అణుపరీక్షల తర్వాత ఇరుదేశాలలోనే కాక, దక్షిణాసియాలోను ఇతర ప్రపంచంలోనూ నెలకొన్న ఉద్రిక్తతలను ఉపశమింపజేసింది.

కార్గిల్ యుద్ధము

కార్గిల్ యుద్ధం, భారత్ పాకిస్తాన్ మధ్య మే - 1999 జూలైలో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలోను, మరికొన్ని సరిహద్దుల వద్దనూ జరిగింది. ఈ యుద్ధానికి కారణం పాకిస్తాన్ సైనికులు, కాశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖ (ఎల్.ఒ.సి) దాటి భారతదేశంలోకి చొరబడడం.[18] యుద్ధప్రారంభ దశలో పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి, తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి పాకిస్తాన్ సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టీ ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం కూడా ఉందని రుజువయ్యింది.[19][20][21] అధీనరేఖ దాటి పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం, భారత వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుంది. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం వెనుతిరిగింది. ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన యుద్ధాల కిది తాజా ఉదాహరణ. ఇంత ఎత్తులో యుద్ధం జరగడం వల్ల ఇరు పక్షాలకూ ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అణుబాంబులు కలిగియున్న దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో ఇది రెండోది (మొదటిది చైనా - సోవియట్ ల మధ్య 1969 లో జరిగింది).

మూడవ పర్యాయం: 1999–2004

2001 లో వైట్‌హౌస్ లో అమెరికా అధ్యక్షుడు బుష్ ను కలసిన వాజపేయి

కార్గిల్ పరిణామాల తరువాత జరిగిన 1999 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్.డి.ఏ కూటమి లోక్‌సభ 303 స్థానాలు గెలిచి,[22] భారత పార్లమెంటులో స్థిరమైన మెజారిటీని పొందింది. వాజపేయి 1999 అక్టోబరు 13 న మూడవసారి ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించాడు.

ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్

1999 డిసెంబర్ కాఠ్మండు నుండి కొత్త ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం-814 ను ఆప్ఘనిస్థాన్ కు చెందిన తాలిబాన్ టెర్రరిస్టులు హైజాక్ చేయడంతో జాతీయ సంక్షోభం ఉద్భవించింది. .[23] హైజాకర్లు, భారతదేశపు జైలులో ఉన్న మౌలానా మసూద్ అజహర్ అనే తీవ్రవాదిని విడిచిపెట్టాలనే కోరికతో పాటు అనేక డిమాండ్లను ప్రభుత్వానికి అందించారు. ప్రయాణికులు కుటుంబాలు, రాజకీయ ప్రతిపక్షాల నుండి తీవ్రవత్తిడికి తలొగ్గి భారత ప్రభుత్వం హైజాకర్ల డిమాండ్లను ఒప్పుకుంది. అప్పటి విదేశాంగమంత్రి అయిన జశ్వంత్ సింగ్ ఆప్ఘనిస్థాన్ వెళ్ళి, అజహర్ ను అప్పగించి, ప్రయాణీకులను విడుదల చేయించాడు.

జాతీయ రహదార్ల ప్రాజెక్టు, విదేశీ విధానం, ఆర్థిక సంస్కరణలు

వాజపేయి మూడవ దఫా పరిపాలనా కాలంలో అనేక దేశీయ ఆర్థిక, మౌలిక సంస్కరణలను చేపట్టాడు. వాటిలో ప్రైవేటు రంగాన్ని, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించాడు. కొన్ని ప్రభుత్వరంగ సంస్థలలో పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించాడు. ప్రభుత్వపు వృధాఖర్చులను తగ్గించి, పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించారు. కొన్ని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించాడు.[24] గత 32 సంవత్సరాలలో అభివృద్ధి చెందిన రోడ్లలో సగం వరకు, వాజపేయి నేతృత్వంలోని ఎన్.డి.ఎ ప్రభుత్వం యొక్క ఐదేళ్ల పాలనలో అభివృద్ధి చెందినవే అని యు.పి.ఏ ప్రభుత్వం 2013, జూలై 1న సుప్రీంకోర్టు ఎదుట అంగీకరించింది.[25]

"నేషనల్ హైవే డెవలప్‌మెంటు ప్రాజెక్టు", "ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన" వాజపేయి అభిమాన ప్రాజెక్టులు.

2000 మార్చిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు, బిల్ క్లింటన్ అధికారిక పర్యటనపై భారతదేశాన్ని సందర్శించారు. 22 యేళ్లలో భారత దేశాన్ని సందర్శించిన మొట్టమొదటి అధ్యక్షుడు ఆయనే. అమెరికా అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించడం ఇరు దేశాల మధ్య సంబంధాల పురోగతికి ముఖ్యమైన మైలురాయిగా చెప్పవచ్చు. ఈ సందర్శనకు ముందు రెండు సంవతర్సాల క్రితమే భారత్ పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించి ఉండటం, సంవత్సరం ముందే కార్గిల్ యుద్ధం జరిగి ఉండటం, తదనంతరం పాకిస్తాన్ సైనికపాలనలోకి వెళ్ళటం వంటి సంఘటనల పూర్వరంగంతో జరిగిన ఈ పర్యటన, ప్రఛ్ఛన్న యుద్ధం తర్వాత అమెరికా విదేశాంగ విధానంలో చోటుచేసుకున్న పెనుమార్పులను ప్రతిబింబించింది. భారత ప్రధానమంత్రి, అమెరికా అధ్యక్షుడు వ్యూహాత్మక సమస్యలపై చర్చలు జరిపారు. కానీ ఈ చర్చల ప్రధాన ఫలితంగా ద్వైపాక్షిక వాణిజ్య, ఆర్థిక సంబంధాలు గణనీయంగా విస్తరించాయి. ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య భవిష్యత్తు సంబంధాల అభివృద్ధికి అవలంబించవలసిన మార్గంపై, ప్రధాని వాజపేయి, అధ్యక్షుడు క్లింటన్ చారిత్రక విజన్ డాక్యుమెంట్ పై సంతకం చేసారు.

దేశాంగ విధానంలో, హిందూత్వ అజెండాను చేపట్టాలనే విషయమై, బి.జె.పి ప్రభుత్వం దాని సైద్ధాంతిక గురువు అయిన అర్.ఎస్.ఎస్, హిందూ అతివాద సంస్థ అయిన విశ్వహిందూ పరిషత్ నుండి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నది. కానీ ప్రభుత్వం భాగస్వామ్య పక్షాల మద్ధతుతో కొనసాగుచున్నందున, అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేపట్టడం, కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దుచేయటం, అన్ని మతాలకు సమంగా వర్తించేట్టు ఉమ్మడి సివిల్ కోడ్ అమలుపరచడం వంటి అంశాలను తీసుకురావడానికి కష్టతరమైనది. 2000 జనవరి 17న వాజపేయి పరిపాలనపై అసంతృప్తితో బి.జె.పి లోని కొంతమంది అతివాద నాయకులు, ఆర్.ఎస్.ఎస్ నాయకులు జనసంఘ్ ను పునః ప్రారంభించాలని నిర్ణయించారని నివేదికలు వెలువడ్డాయి. పూర్వపు జనసంఘ్ అధ్యక్షుడైన బాలరాజ్ మధోక్ ఆర్.ఎస్.ఎస్. అధ్యక్షుడైన రాజేంద్రసింగ్ కు మద్దతు ఇవ్వవలసినదిగా లేఖ వ్రాసారు.[26]

బి.జె.పి జాతీయ విద్యావిధానాన్ని, పాఠ్యాంశాలను కాషాయీకరిస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంది. అప్పటి హోం మంత్రి ఎల్.కె.అద్వానీ, మానవ వనరుల మంత్రి మురళీ మనోహర్ జోషీలపై 1992 లో జరిగిన బాబ్రీ మసీదు కేసులో, తమ ప్రసంగాలతో మూకలను రెచ్చగొట్టి, కూల్చివేతకు కారణమయ్యారనే నేరాన్ని మోపారు. మసీదు కూల్చివేతకు ముందురోజు వాజపేయి చేసిన వివాదాస్పద ప్రసంగం, వాజపేయిని కూడా తీవ్ర ప్రజావిమర్శకు గురిచేసింది.[27] న్యాయమూర్తి మన్మోహన్ సింగ్ లిబర్హాన్ అధ్యక్షతన వెలువడిన 2009 నివేదిక, మసీదు విధ్వంసానికి 68 మందిని నిందితులుగా పేర్కొంది. వారిలో పెక్కుమంది బి.జె.పి. నాయకులు కాగా, కొద్దిమంది అధికారులు ఉన్నారు. నివేదికలో పేర్కొన్న వారిలో మాజీ ప్రధాని మంత్రి ఎ.బి.వాజ్‌పేయి, (2009) నాటి భారతీయ జనతా పార్టీ పార్టీ పార్లమెంటు నాయకుడు ఎల్.కె.అద్వానీ ఉన్నారు. నివేదికలో మసీదు విధ్వంస సమయంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ సింగ్ పై కఠిన విమర్శలు చేశారు. అయోధ్యలో మసీదు విధ్వంస సమయంలో చూస్తూ మౌనంగా ఉండిపోయిన పోలీసు అధికారులను, ఉన్నతాధికారులను నియమించినందుకు అతడిపై విమర్శలు వచ్చాయి.[28] లిబర్హాన్ కమిషన్ నివేదికలో ఎన్డీయే ప్రభుత్వంలో మాజీ విద్యాశాఖామంత్రి మురళీ మనోహర్ జోషి కూడా నేరస్తుడయ్యాడు. ప్రాసిక్యూషన్ తరపున సాక్షిగా ఇండియన్ పోలీస్ అధికారిణి అంజూ గుప్త హాజరయ్యింది. విధ్వంసం జరిగిన రోజున అద్వానీకి భద్రతాధికారిణిగా ఉన్న అంజూ గుప్త, అద్వానీ, మురళీ మనోహర్ జోషీలు రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేసారని చెప్పింది.[29] ఆర్.ఎస్.ఎస్ కూడా తరచూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, స్వదేశీ వస్తువులను, పరిశ్రమలను ఫణంగా పెట్టి, విదేశీ వస్తువులను, విదేశీ పోటీని పెంపొందించే పెట్టుబడిదారీ స్వేచ్ఛా విఫణి విధానాలను అవలంభిస్తున్నదని విమర్శించేది.

వాజపేయి ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కంపెనీల ప్రైవేటీకరణ వలన అనేక కార్మిక సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగుల కోపానికి గురైంది. భారతీయ ఆర్థికరంగాన్ని సమూలంగా పరివర్తనం చేసి, విస్తరించే దిశగా వాజపేయి వ్యాపారరంగానికి మద్దతునిస్తూ, స్వేచ్ఛా విఫణి సంస్కరణలను ప్రోత్సహించాడు. గత ప్రధాని పి.వి.నరసింహారావు ప్రారంభించిన ఈ సంస్కరణలు, 1996లో అస్థిర ప్రభుత్వాలు పాలనలో ఉండటం వలన, 1997లో సంభవించిన ఆసియా ఆర్థిక సంక్షోభం వలనా నిలిచిపోయాయి. పోటీతత్వం పెంపొందించడం, సమాచార సాంకేతికత, ఇతర సాంకేతిక పరిశ్రమలకు అదనపు పెట్టుబడి, మద్దతు సమాకూర్చడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, వర్తక, పెట్టుబడులు, వాణిజ్య చట్టాలపై నియంత్రణ సడలించడం వంటి చర్యలన్నీ విదేశీ పెట్టుబడులు పెరిగేందుకు దోహదం చేసి, ఆర్థికరంగ విస్తరణకు శ్రీకారం చుట్టాయి.

రష్యా అధ్యక్షుడు వ్లాడిమీర్ పుటిన్‌తో వాజపేయి.

రెండు సంవత్సరాల సంస్కరణాకాలం, ప్రభుత్వంలో అంతర్గత కలహాలతో పాటు, ప్రభుత్వం యొక్క దిశపై అయోమయంతో కూడుకొని ఉంది. ఆ కాలంలో క్షీణిస్తున్న వాజపేయి ఆరోగ్యం కూడా ప్రజాసక్తిని చూరగొన్నది. తన కాళ్లపై పడుతున్న ఒత్తిడికి ఉపశమనం కల్పించేందుకు వాజపేయి ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో మోకీలు మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నాడు.

2001లో అప్పటి బీజేపీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌ ముడుపుల వ్యవహారంపై తెహల్కా డాట్‌ కాం అనే వార్తాసంస్థ స్టింగ్‌ ఆపరేషన్‌ (రహస్య దర్యాప్తు) నిర్వహించింది. ఆయుధాల డీలర్‌గా వచ్చిన ఓ విలేకరి, లక్ష్మణ్‌కు ఒక కాంట్రాక్ట్‌కోసం లక్ష రూపాయలు ముడుపులిచ్చాడు. రహస్యంగా అమర్చిన కెమెరాలు బంగారు లక్ష్మణ్‌ లంచం తీసుకోవడాన్ని చిత్రీకరించాయి. నకిలీ రక్షణ ఒప్పందం కుదుర్చుకునేందుకు నకిలీ ఆయుధ డీలర్లతో లాలూచిపడి బంగారు లక్ష్మణ్‌ లంచం తీసుకుంటున్నట్టు తెహల్కా డాట్‌ కాం చిత్రించి, వెలుగులోకి తెచ్చిన ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.[30]

వాజపేయి భారత పాకిస్థాన్ ల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించుటకు గాను ఆగ్రా ఒప్పందం కొరకు పాకిస్థాన్ అధ్యక్షుడు అయిన పర్వేజ్ ముషారఫ్ను ఢిల్లీకి ఆహ్వానించాడు. అంతకు ముందు కార్గిల్ యుద్ధానికి ప్రణాళిక రచించిన వ్యక్తిని ఆహ్వానించడం, పాకిస్తాన్‌తో ప్రతిష్ఠంబనను తొలగించడానికి వాజపేయి చేసిన రెండవ ప్రధాన ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. ఆహ్వానాన్ని అంగీకరించి ముషారఫ్ ఢిల్లీకి వచ్చాడు. మూడు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో ముషారఫ్ ఢిల్లీలోని తన జన్మస్థానాన్ని కూడా సందర్శించాడు. అయితే ముషారఫ్ కాశ్మీరు సమస్యను పక్కనపెట్టి ఇతర అంశాలను చర్చించడానికి నిరాకరించడంతో ఆగ్రా సమావేశం విఫలమైంది.

2001 లో వాజపేయి ప్రభుత్వం, ప్రాథమిక, మాధ్యమిక విద్యాభివృద్ధి లక్ష్యంగా సర్వశిక్షా అభియాన్ అనే ప్రసిద్ధ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

2001 పార్లమెంటు దాడి

2001 డిసెంబర్ 13 న సాయుధ ఇస్లామిక తీవ్రవాదులు భారత పార్లమెంటు పై దాడి చేసారు. భద్రతా దళాలు వీరిని సమర్ధవంతంగా ఎదుర్కొని, దాడిలో పాల్గొన్న మొత్తం ఐదుగురు తీవ్రవాదుల్నీ హతమార్చారు.[31]

2002 గుజరాత్ హింసాకాండ

2002లో గుజరాత్ రాష్ట్రంలో హిందూ, ముస్లింల మధ్య హింసాకాండ జరిగింది. దీని ఫలితంగా 1000 మంది ప్రజలు మరణించారు. వాజపేయి అధికారికంగా ఈ హింసాకాండను ఖండించాడు.[32]

తరువాత వాజపేయి "ముస్లింలు అధికంగా ఉన్నచోట్ల వారు శాంతియుతంగా ఉండటానికి యిష్టపడరు." అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.[33] ఈ వ్యాఖ్యలు సందర్భానుసారంగా తీసుకోవాలని ప్రధానమంత్రి కార్యాలయం వివరణనిచ్చింది.

వాజపేయి హింసాత్మక చర్యలను ఆపలేకపోయారనే విమర్శలనెదుర్కొన్నాడు. ఆ తరువాత జరిగిన తప్పులను ఒప్పుకున్నాడు.[34] అప్పటి రాష్ట్రపతి అయిన కె.ఆర్.నారాయణన్ కూడా వాజపేయి ప్రభుత్వం హింసాత్మక చర్యలను అదుపుచేయడంలో విఫలమైందని విమర్శించాడు.[35]

2004 సార్వత్రిక ఎన్నికలు

2004 సార్వత్రిక ఎన్నికలలో ఎన్.డి.ఎ తన ఆధిక్యత నిలుపుకొంటుందని భావించారు. అంతకు ముందు బి.జె.పి రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల శాసనసభల ఎన్నికలలో సాధించిన విజయాలతో, ప్రజాభిప్రాయం భారతీయ జనతా పార్టీకు మద్దతుగా ఉందనే ఉద్దేశంతో, దానిని సద్వినియోగం చేసుకొనే దిశగా, ప్రభుత్వం 13 వ లోక్‌సభను ఐదు సంవత్సరాల కాలపరిమితి పూర్తి కాకుండానే రద్దుచేసి, ఎన్నికలు నిర్వహించింది. "ఇండియా షైనింగ్" అనే నినాదాన్ని బాగా ఉపయోగించుకోవాలని తలచి, భారతీయ జనతా పార్టీ తమ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక అభివృద్ధిని చాటుతూ అనేక ప్రకటనలు విడుదలచేసింది. అయితే ఆ ఎన్నికలలో ఎన్.డి.ఎ భాగస్వామ్య పక్షాలు దాదాపు సగందాకా సీట్లను కోల్పోయాయి. సోనియా గాంధీ నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెసు అత్యధిక స్థానాలను పొందింది. కాంగ్రెసు, దాని భాగస్వామ్య పక్షాలతో కలసి యు.పి.ఎ కూటమి ఏర్పాటు చేసింది. డా. మన్‌మోహన్ సింగ్ ప్రధానమంత్రి పదవిని అధిష్టించాడు. వాజపేయి తన పదవికి రాజీనామా చేస్తూ, క్రొత్త ప్రభుత్వానికి సంపూర్ణ సహకారాన్నందిస్తానని ప్రకటించాడు.[36] ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రతిపక్ష నేతగా కూడా ఉండటానికి నిరాకరించాడు. నాయకత్వ బాధ్యతను లాల్ కృష్ణ అద్వానీకి అప్పగించాడు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా అద్వానీ ఎన్నికయ్యాడు. అయితే వాజపేయి ఎన్.డి.ఎ కూటమి అధ్యక్షునిగా మాత్రం కొనసాగాడు.

తరువాత జీవితం

2005 డిసెంబర్ నెలలో ముంబై లోని శివాజీ పార్కులో జరిగిన భారతీయ జనతా పార్టీ సిల్వర్ జూబ్లీ ర్యాలీలో వాజపేయి క్రియాశీల రాజకీయాలనుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాడు. తరువాతి సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయనని ప్రకటించాడు. ఈ సమావేశంలో వాజపేయి "ఇకనుండి లాల్ కృష్ణ అద్వానీ, ప్రమోద్ మహాజన్‌లు భారతీయ జనతా పార్టీకి రామలక్ష్మణుల వంటివారు" అని ప్రకటించాడు.[37]

భారతదేశ రాజ్యసభలో అప్పటి ప్రధాని డా.మన్మోహన్ సింగ్ తన ప్రసంగంలో వాజపేయిని రాజకీయ భీష్మునిగా అభివర్ణించాడు.[38]

2009, ఫిబ్రవరి 6న వాజపేయి ఛాతిలో ఇన్ఫెక్షన్, జ్వరం కారణంగా ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ లో చేరాడు. పరిస్థితి క్షీణించడంతో వెంటిలేషన్ సహకారంతో కొన్నాళ్ళు ఉండి, ఆ తరువాత కోలుకొన్నాడు.[39] అనారోగ్య కారణంగా 2009 సార్వత్రిక ఎన్నికలలో ప్రచారం చేయలేకపోయాడు. ఆయన భారత దేశ ఓటర్లకు బి.జే.పికి మద్దతు ఇవ్వాలని లేఖ వ్రాసాడు. ఆయన యిదివరకు ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నో నియోజకవర్గం నుండి లాల్జీ టాండన్ పోటీ చేశాడు. భారతదేశమంతటా భారతీయ జనతా పార్టీ ఎన్నికలలో తిరోగమనం పట్టినా, వాజపేయి సహకారంతో లాల్జీ టాండన్ లక్నో నియోజకవర్గం నుండి విజయం సాధించగలిగాడు.[40]

భారత అత్యుత్తమ వ్యక్తిగా ఎంపిక

2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్  భాగస్వామ్యంతో అవుట్ లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్ లో అతను తొమ్మిదవ స్థానంలో ఎంపికైయ్యాడు.[41]

ఆరోగ్య సమస్యలు

వాజపేయి 2001 లో మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను బ్రీచ్ కాండీ వైద్యశాల, ముంబైలో చేయించుకున్నాడు. 2009లో స్ట్రోక్ కారణంగా పక్షవాతానికి గురై, మాట క్షీణించింది.[42] ఆయన ఆరోగ్యపరిస్థితి మూలంగా తరచుగా వీల్ చైర్ కు పరిమితమై, మనుషులను గుర్తించలేని స్థితికి చేరాడు. ఆయన దీర్ఘకాలిక మధుమేహంతో పాటు డిమెంటియా వ్యాధితో బాధపడ్డాడు. జీవిత చరమాకంలో ఆయన ఏ బహిరంగ సమావేశంలోనూ హాజరు కాలేదు. అప్పుడప్పుడు వైద్య సేవల కోసం ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు వెళ్ళటం మినహాయించి బయటికి ఎక్కడికి వెళ్ళలేదు.[43] ఆయన అనారోగ్యంతో ఉండగా ఆరు దశాబ్దాలుగా ఆయన స్నేహితుడైన ఎన్.ఎం.ఘటాటే, అద్వానీ, బి.సి.ఖండూరీ మొదలైన వారు ఆయన్ను తరచూ సందర్శించే వారు. వారు ఆయన పక్కన కూర్చోవటానికి, ఆయన అరోగ్య విషయాల గురించి వాజపేయి కుమార్తెను వాకబు చేయటానికీ వెళ్ళేవారు. భారత మాజీ ప్రధాని డా. మన్‌మోహన్ సింగ్ ఆయన ఆరోగ్యం గూర్చి తరచుగా తెలుసుకొనేవాడు. ఆయన ప్రతి పుట్టినరోజు న స్వయంగా కలిసి శుభాకాంక్షలు అందజేసేవారు.[42] 2018 ఆగస్టు 16 న సాయంత్రం 5:05 కు అటల్ బిహారీ వాజపేయి ఢిల్లీలో మరణించాడు.

వ్యక్తిగత జీవితం, అభిరుచులు

సంతానం లేని వాజపేయి, నమిత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నాడు. ఆయనకు భారతీయ సంగీతం, నాట్యం అంటే ఇష్టం. ప్రకృతి ప్రేమికుడైన వాజపేయికి హిమాచల ప్రదేశ్ లోని మనాలీ ప్రాంతమంటే ఎనలేని ఇష్టం.[44]

స్వతహాగా కవి అయిన వాజపేయి తాను వ్రాసిన కవితల గూర్చి ఈ విధంగా చెప్పుకున్నాడు. "My poetry is a declaration of war, not an exordium to defeat. It is not the defeated soldier's drumbeat of despair, but the fighting warrior's will to win. It is not the despirited voice of dejection but the stirring shout of victory."[45]

వాజపేయి వేలాదిమంది ముందు, పార్లమెంటులోనూ కవితాత్మకంగా, జనరంజకంగా, పలు విషయాలు ప్రస్తావిస్తూ ప్రసంగించేవాడు. అప్పటికి స్వాతంత్ర్యోద్యమ నేతగా, భారత ప్రధానిగా లబ్ధప్రతిష్ఠుడైన నెహ్రూ సైతం యువకుడైన, ప్రతిపక్ష నాయకుడు వాజపేయి ప్రసంగాలను శ్రద్ధగా విని ప్రశంసించేవాడు.

పురస్కారాలు

  • 1992, పద్మవిభూషణ్[46]
  • 1993, కాన్పూర్ విశ్వవిద్యాలయం నుంచి డీలిట్ గౌరవ పురస్కారం [47]
  • 1994, లోకమాన్య తిలక్ పురస్కారం[47]
  • 1994, ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం
  • 1994, భారతరత్న గోవింద్ వల్లభ్‌పంత్ పురస్కారం [46]
  • 2014 : భారతరత్న

నిర్వహించిన పదవులు

  • 1951 – వ్యవస్థాపక సభ్యుడు, భారతీయ జనసంఘ్ [48]
  • 1957 – రెండవ లోక్‌సభకు ఎన్నిక
  • 1957–77 – నాయకుడు, భారతీయ జనసంఘ్ పార్లమెంటరీ పార్టీ
  • 1962 – సభ్యుడు, రాజ్యసభ
  • 1966-67- ఛైర్మన్, ప్రభుత్వ అస్సూరెన్స్ కమిటీ
  • 1967 – నాలుగవ లోక్‌సభకు మరలా ఎన్నిక (రెండవ సారి)
  • 1967–70 – ఛైర్మన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ
  • 1968–73 – అధ్యక్షుడు, భారతీయ జనసంఘ్
  • 1971 – ఐదవ లోక్‌సభకు ఎన్నిక. (మూడవ సారి)
  • 1977 – ఆరవ లోక్‌సభకు ఎన్నిక (నాలుగవ సారి)
  • 1977–79 – కేంద్ర కేబినెట్ మంత్రి, విదేశీ వ్యవహారాల శాఖ
  • 1977–80 – వ్యవస్థాపక సభ్యుడు, జనతాపార్టీ
  • 1980 – ఏడవ లోక్‌సభకు ఎన్నిక ( ఐదవ సారి)
  • 1980-86- అధ్యక్షుడు, భారతీయ జనతాపార్టీ (బి.జె.పి)
  • 1980-84, 1986, 1993–96 – నాయకుడు, బి.జె.పి. పార్లమెంటరీ పార్టీ
  • 1986 – సభ్యుడు, రాజ్యసభ; సభ్యుడు, జనరల్ పర్పస్ కమిటీ
  • 1988–90 – సభ్యుడు, హౌస్ కమిటీ; సభ్యుడు, బిజినెస్ అడ్వయిజరీ కమిటీ.
  • 1990-91- ఛైర్మన్, కమిటీ ఆన్ పిటీషన్స్.
  • 1991– పదవ లోకసభకు ఎన్నిక (ఆరవ సారి)
  • 1991–93 – ఛైర్మన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ.
  • 1993–96 – ఛైర్మన్, కమిటీ ఆన్ ఎక్స్‌టెర్నల్ అఫైర్స్; ప్రతిపక్ష నేత, లోక్‌సభ.
  • 1996 – 11వ లోక్‌సభకు ఎన్నిక (ఏడవ సారి).
  • 1996 మే 16 – 1996 మే 31 – భారతదేశ ప్రధానమంత్రి.
  • 1996–97 – ప్రతిపక్ష నేత, లోక్‌సభ.
  • 1997–98 – ఛైర్మన్, కమిటీ ఆన్ ఎక్స్‌టెర్నల్ అఫైర్స్.
  • 1998 – 12వ లోకసభకు ఎన్నిక (ఎనిమిదవ సారి).
  • 1998–99 – భారతదేశ ప్రధానమంత్రి; విదేశీ వ్యవహారాలమంత్రి; ఎవరికీ కేటాయించని మంత్రిత్వశాఖలకు ఇన్‌ఛార్జ్.
  • 1999 – 13వ లోక్‌సభకు ఎన్నిక (తొమ్మిదవ సారి)
  • 1999 అక్టోబరు 13 నుండి 2004 మే 13– భారతదేశ ప్రధానమంత్రి; ఎవరికీ కేటాయించని మంత్రిత్వశాఖలకు ఇన్‌ఛార్జ్.
  • 2004 – 14వ లోక్‌సభకు ఎన్నిక (పదవ సారి)

రచనలు

సామాజిక, రాజకీయ

  • నేషనల్ ఇంటిగ్రేషన్. (1961).
  • డైనమిక్ ఆఫ్ ఎన్ ఓపెన్ సొసైటీ. (1977).
  • న్యూ డైమెన్షన్స్ ఆఫ్ ఇండియాస్ ఫారిన్ పాలసీ. (1979).
  • హీల్ ద వూండ్స్: వాజ్‌పేయిస్ అప్పీల్ ఆన్ అస్సాం ట్రాజెడీ టు ద పార్లమెంట్. (1983).
  • వెన్ విల్ అట్రాసిటీస్ ఆన్ హరిజన్స్ స్టాప్?: ఏ.బి.వాజపేయ్స్ స్పీచ్ ఇన్ రాజ్యసభ. (1988).
  • కుఛ్ లేఖ్, కుఛ్ భాషణ్. (1996).
  • సెక్యులర్‌వాద్: భారతీయ పరికల్పన (డా. రాజేంద్రప్రసాద్ స్మారక్ వ్యాఖ్యాన్‌మాలా). (1996).
  • బిందు-బిందు విచార్. (1997).
  • రాజ్‌నీతీ కి రప్తీలీ రెహమ్. (1997).
  • న దైన్యం న పలాయనం (హిందీ సంచిక). (1998).
  • బాక్ టు స్క్వైర్ వన్. (1998).
  • డిసైసివ్ డేస్. (1999).
  • శక్తి సే శాంతి. (1999).
  • 'విచార్ బిందూ (హిందీ సంచిక). (2000). ISBN 978-81-7016-475-3.
  • నయూ చునౌతీ, నయా అవసర్ (హిందీ సంచిక). (2002). ISBN 978-8170165019.
  • ఇండియాస్ పర్‌స్పెక్టివ్స్ ఆన్ ఏషియన్ అండ్ ది ఏషియా-పసిఫిక్ రీజన్. (2003). ISBN 978-981-230-172-7.

జీవితచరిత్రలు

  • అటల్ బిహారీ వాజ్ మే తీన్ దశక్. (1992).
  • ప్రధాన్‌మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, ఛునే హుయే భాషణ్. (2000).
  • వాల్యూస్, విజన్ & వర్సెస్ ఆఫ్ వాజపేయ్: ఇండియాస్ మాన్ ఆఫ్ డెస్టినీ. (2001).
  • ఇండియాస్ ఫారిన్ పాలసీ: న్యూ డైమెన్షన్స్. (1977).
  • అస్సాం ప్రాబ్లం: రిప్రెషన్ నో సొల్యూషన్. (1981).

కవితలు

  • ట్వంటీవన్ పోయంస్. (2003). ISBN 978-0-670-04917-2.
  • క్యా ఖోయా క్యా పాయా: అటల్ బిహారీ వాజ్‌పేయి, వ్యక్తిత్వ ఔర్ కవితాయే (హిందీ సంచిక). (1999). ISBN 978-81-7028-335-5.
  • మేరీ ఇక్యావన్ కవితాయే. (1995).
  • శ్రేష్ఠ కబిత. (1997).
  • నయీ దిశాజగ్జీత్ సింగ్తో కలిసి సంగీతపు ఆల్బమ్ (1999)
  • సంవేద్నాజగ్జీత్ సింగ్తో కలిసి సంగీతపు ఆల్బం (2002)

ప్రసంగాలు

  • ప్రైం మినిస్టర్ అటల్ బిహారీ వాజ్‌పేయి, సెలెక్టెడ్ స్పీచెస్. (2000). ISBN 978-81-230-0834-9.
  • ప్రెసిడెంస్ అడ్రెసెస్, 1980–1986. (2000).
  • ప్రెసిడెన్షియల్ అడ్రెస్. (1986).
  • ప్రెసిడెన్షియల్ అడ్రెస్: భారతీయ ప్రతినిధి సభా సెషన్, భగల్పూర్ (బీహార్), 5 6 & 7 మే 1972. (1972).
  • అటల్ బిహారీ వాజ్‌పేయి అండ్ పోఖ్రాన్

ఇవి కూడా చదవండి

  • L.K. Advani. My Country My Life. (2008). ISBN 978-81-291-1363-4.
  • M.P. Kamal. Bateshwar to Prime Minister House – An Interesting Description of Different Aspects of Atalji's . (2003). ISBN 978-81-7604-600-8.
  • G.N.S. Raghavan. New Era in the Indian Polity, A Study of Atal Bihari Vajpayee and the BJP. (1996). ISBN 978-81-212-0539-9.
  • P. R Trivedi. Atal Bihari Vajpayee: The man India needs : the most appropriate leader for the twentyfirst century. (2000). ISBN 978-81-7696-001-4.
  • Sujata K. Dass. " prem k jain ". (2004). ISBN 978-81-7835-277-0.
  • Chandrika Prasad Sharma. Poet politician Atal Bihari Vajpayee: A biography. (1998). ASIN: B0006FD11E.
  • Sheila Vazirani. Atal Bihari Vajpayee; profile & personal views (Know thy leaders). (1967). ASIN: B0006FFBV2.
  • Dr. C.P. Thakur. India Under Atal Behari Vajpayee: The BJP Era. (1999). ISBN 978-81-7476-250-4
  • Sita Ram Sharma. Prime Minister Atal Behari Vajpayee: Commitment to power. (1998). ISBN 978-81-85809-24-3.
  • Bhagwat S. Goyal Values, Vision & Verses of Vajpayee: India's Man of Destiny 2001 Srijan Prakashan R-6/233 Rajnagar Ghaziabad, Uttar Pradesh 201002 ISBN 81-87996-00-5.
  • Darshan Singh. Atal Behari Vajpayee: The arch of India. (2001). ISBN 978-81-86405-25-3.
  • Yogesh Atal. Mandate for political transition: Reemergence of Vaypayee. (2000). ASIN: B0006FEIHA.
  • Sujata K. Das. Atal Bihari Vajpayee. (2004). ISBN 978-8178352770

మూలాలు

  1. "భారత రత్న వాజపేయి, మాలవీయకు అత్యున్నత పురస్కారం". ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి. 2014-12-24. Archived from the original on 2014-12-27. Retrieved 2014-12-25.
  2. Government to Announce Bharat Ratna for Atal Bihari Vajpayee, Madan Mohan Malaviya Today: Sources
  3. http://timesofindia.indiatimes.com/india/President-confers-Bharat-Ratna-to-Atal-Bihari-Vajpayee/articleshow/46715649.cms
  4. "The Leading Indian Politician Site on the Net". indianpoliticians.com. Archived from the original on 2012-04-25. Retrieved 2012-11-24.
  5. 5.0 5.1 "The Sangh (RSS) is my Soul; writes Atal Bihari Vajpayee". Vishwa Samvada Kendra. 19 January 2012. Archived from the original on 2018-12-25. Retrieved 2014-09-29.
  6. "The outliers who won the PM's post". Mail Today. 15 April 2014. Retrieved 2014-09-29.
  7. Jaffrelot, Christophe (1996). The Hindu Nationalist Movement and Indian Politics. C. Hurst & Co. Publishers. pp. 131–132. ISBN 978-1850653011.
  8. Chatterjee, Mannini. V. K. Ramachandran. "Vajpayee and the Quit India movement Archived 2014-07-16 at the Wayback Machine". Frontline. 7–20 February 1998. Retrieved 11 November 2012.
  9. "India Matters". Indiamatters.in. Archived from the original on 2012-11-17. Retrieved 2012-11-24.
  10. 10.0 10.1 "ఆర్కైవ్ చేసిన కాపీ". Archived from the original on 2010-05-26. Retrieved 24 డిసెంబరు 2014.
  11. "ఆర్కైవ్ చేసిన కాపీ". Archived from the original on 2005-04-11. Retrieved 24 డిసెంబరు 2014.
  12. "1984: Assassination and revenge". BBC News. 1984-10-31. Archived from the original on 2009-02-15. Retrieved 2009-01-23.
  13. "Will the rath yatra bring LK Advani back in RSS good books? – Analysis – DNA". Dnaindia.com. 11 October 2011. Retrieved 2012-06-25.
  14. "Atal Bihari Vajpayee: India's new prime minister". BBC News. BBC News. 1998-03-03.
  15. "South Asia Vajpayee's thirteen months". BBC News. BBC News. 1999-04-17.
  16. "Atal Bihari Vajpayee (prime minister of India) – Britannica Online Encyclopedia". Encyclopædia Britannica. 1924-12-25. Retrieved 2012-11-24.
  17. Gaurav Kampani. "Living With India's Bomb: In Praise Of Indifferenc" (PDF). Archived from the original (PDF) on 2013-10-15. Retrieved 2014-12-24.
  18. "1999 Kargil Conflict". GlobalSecurity.org. Retrieved 2009-05-20.
  19. Tom Clancy, Gen. Tony Zinni (Retd) and Tony Koltz (2004). Battle Ready. Grosset & Dunlap. ISBN 0-399-15176-1.
  20. "Pak commander blows the lid on Islamabad's Kargil plot". June 12, 2009. Retrieved 2009-06-13.
  21. "Sharif admits he let down Vajpayee on Kargil conflict". 2007-09-10. Archived from the original on 2007-09-16. Retrieved 2007-10-06.
  22. "Address to the Nation by Prime Minister Atal Bihari Vajpayee" (PDF). Indianembassy.org. Archived from the original (PDF) on 2012-04-02. Retrieved 2012-11-24.
  23. "Information on hijacked Indian Airlines Flight IC-814". Embassy of India. Archived from the original on 2010-06-18. Retrieved 24 డిసెంబరు 2014.
  24. "Vajpayee, the right man in the wrong party – ,Vajpayee, the right man in the wrong party – 4 – ,4 – National News – News – MSN India". MSN. Archived from the original on 2013-01-04. Retrieved 2012-11-24.
  25. Mahapatra, Dhananjay (2 July 2013). "NDA regime constructed 50% of national highways laid in last 30 years: Centre". The Times of India. Archived from the original on 2 డిసెంబరు 2013. Retrieved 26 November 2013.
  26. Sharad Gupta; Sanjiv Sinha (18 January 2000). "Revive Jan Sangh – BJP hardlines". The Indian Express. Archived from the original on 2013-10-12. Retrieved 11 October 2013.
  27. National / Elections 2004 : This Vajpayee speech campaigns against the NDA. The Hindu. Retrieved on 2014-05-21.
  28. ఇండియా మదీసుల నివేదిక పై ధ్వజం: 1992 బాబ్రీ మసీద్ కూల్చివేత పై ప్రతిపక్ష BJP నాయకుల అభియోగం అల్-జజీర ఇంగ్లీష్ - నవంబర్ 24, 2009
  29. ఇన్ ది డాక్క్, అగైన్ Archived 2011-06-06 at the Wayback Machine , ఫ్రంట్ లైన్
  30. Fernandes offers to quit - The Times of India. Timesofindia.indiatimes.com (2001-03-14). Retrieved on 2014-05-21.
  31. "పార్లమెంటుపై తీవ్రవాదుల దాడి". 2006. Rediff.com. Rediff India. 13 డిసెంబర్. 2001
  32. "Vajpayee condemns Godhra carnage, Gujarat communal violence".
  33. Sultan Shahin (26 April 2002). "Gujarat: return to the deadly past". Asia Times. Archived from the original on 2 అక్టోబరు 2013. Retrieved 26 August 2013.
  34. "Vajpayee admits mistake over Gujarat". CNN. 2002-04-13. Archived from the original on 2013-03-07. Retrieved 2014-12-24.
  35. Rafiq Dossani (2008). India Arriving: How This Economic Powerhouse Is Redefining Global Business. AMACOM Div American Mgmt Assn. p. 154.
  36. "Vajpayee moves to new home". The Daily Star. 6 July 2004.
  37. "Vajpayee to retire from politics". BBC News. 29 December 2005. Retrieved 2005-12-29.
  38. "Manmohan calls Vajpayee 'Bhishma Pitamah' of politics". The Hindu. Chennai, India. 6 March 2008.
  39. "Vajpayee showing signs of improvement". The Indian Express. Retrieved 2009-02-05.
  40. "Vajpayee writes to Lucknowites for support". The Times of India. 18 April 2009. Retrieved 2009-04-18.
  41. "A Measure Of The Man | Outlook India Magazine". web.archive.org. 2021-07-24. Archived from the original on 2021-07-24. Retrieved 2021-10-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  42. 42.0 42.1 "A peek into the life Vajpayee now leads".
  43. Vajpayee turns 88 amid health concerns. Zee News (2011-12-23). Retrieved on 2013-07-16.
  44. "Read the Short biography of Atal Bihari Vajpayee". Preservearticles.com. Archived from the original on 2017-07-28. Retrieved 2012-11-24.
  45. Values, Vision & Verses of Vajpayee: India's Man of Destiny page – iii
  46. 46.0 46.1 "Shri Atal Bihari Vajpayee - A Profile". Archived from the original on 2012-01-09. Retrieved 24 డిసెంబరు 2014.
  47. 47.0 47.1 "Prime Minister of India Bio-Data". Parliamentofindia.nic.in. Retrieved 2012-11-24.
  48. "Atal Bihari Vajpayee". Archived from the original on 2012-12-27. Retrieved 2014-12-24.

ఇతర లింకులు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
రాజకీయ కార్యాలయాలు
అంతకు ముందువారు
యశ్వంత్‌రావు చవాన్
విదేశాంగ శాఖామంత్రి
1977–79
తరువాత వారు
శ్యాంనందన్ ప్రసాద్ మిశ్రా
అంతకు ముందువారు
పి.వి.నరసింహారావు
భారత ప్రధానమంత్రులు
1996
తరువాత వారు
హెచ్.డి.దేవేగౌడ
అంతకు ముందువారు
ఐ.కె.గుజ్రాల్
భారత ప్రధానమంత్రులు
1998–2004
తరువాత వారు
మన్మోహన్ సింగ్