భారతి (మాస పత్రిక)
భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో మరీ ముఖ్యంగా మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న తెలుగు సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులే భారతిని కూడా స్థాపించాడు. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైంది.[1] 1991 మార్చి చివరి సంచిక. [2]
లక్ష్యాలు
[మార్చు]సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడా ప్రచురించేది. తొలి సంచికలో ఈ క్రింది విధంగా సంపాదకులు పేర్కొన్నారు.
“భారతియందు భాష, వాజ్మయము, శాస్త్రములు, కళలు మొదలగు విషయములు సాదరభావముతోఁ జర్చించుటకవకాశములు గల్పించబడును. వాజ్మయ నిర్మాణమునకిపుడు జరుగుచున్న ప్రయత్నములు పరిస్ఫుటము చేయబడును. శిల్పమునకు చిత్రలేఖనమునకు శాసనములకు సంబంధించిన విషయములు చిత్రములతోఁ బ్రచురింపఁ బడును.”
నిర్వహణ
[మార్చు]భారతి పత్రికకు [[గన్నవరపు సుబ్బరామయ్య]] సంపాదకులుగా (1924-1938) ఉన్నారు. నాగేశ్వరరావు అనంతరం అతని అల్లుడు శివలెంక శంభుప్రసాద్ (1938-1972), ఆ తరువాత అతని కుమారుడు శివలెంక రాధాకృష్ణ (1972-1991) భారతిని నిర్వహించారు. భారతిలో పనిచేసిన వారిలో తిరుమల రామచంద్ర, విద్వాన్ విశ్వం మొదలైన వారు ఉన్నారు. ఈ పత్రికలో మరొక ఆకర్షణ తలిశెట్టి రామారావు కార్టూనులు.
విశిష్టత, ప్రాచుర్యం
[మార్చు]భారతిలో ఎన్నెన్నో గొప్ప రచనలు ప్రచురితమయ్యాయి. భారతి తొలి సంచికలో మంగిపూడి వేంకటశర్మ రచించిన గాంధీ శతకము ప్రచురణ ప్రారంభించారు. ఆధునిక వాజ్మయ ధోరణులను ఈ పత్రిక నిస్సంకోచంగా సమర్థించింది. మార్పును ఆహ్వానించింది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. భారతిలో కథ పడటమే తమ సాహిత్య ప్రక్రియకు గీటురాయి అని అప్పట్లో రచయితలు అనుకునేవారట. తెలుగుసాహిత్య రంగంలో ఉన్న ఉద్దండులందరి కథలూ భారతిలో ప్రచురించబడ్డాయి. అందరికంటే ఎక్కువ కథలు భారతిలో ప్రచురించబడిన రచయిత ఆర్.ఎం.చిదంబరం. ఆయన గురించిన వివరాలు అందుబాటులో లేవు. భారతి పత్రిక 1949లో రజతోత్సవం, 1984లో వజ్రోత్సవం జరుపున్నది. వ్యాపార పక్షంగా లాభదాయకంగా లేక పోయినా సాహితీ ప్రియులకి ఇది ఒక అభిమాన పత్రిక.
కొందరు రచయితలు
[మార్చు]ఈ పత్రికలో రచనలు చేసిన కొందరు ప్రసిద్ధ రచయితలు: చెఱుకుపల్లి జమదగ్నిశర్మ, వడలి మందేశ్వరరావు, బొడ్డు బాపిరాజు, పురిపండా అప్పలస్వామి, కొడాలి ఆంజనేయులు, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, కాంచనపల్లి కనకమ్మ, కావ్యకంఠ గణపతిశాస్త్రి, బెజవాడ గోపాలరెడ్డి, గుర్రం జాషువా, బండారు తమ్మయ్య, గుమ్మడిదల దుర్గాబాయి, తాపీ ధర్మారావు, వేటూరి ప్రభాకరశాస్త్రి, ముద్దుకృష్ణ, కోరాడ రామకృష్ణయ్య, దువ్వూరి రామిరెడ్డి, విద్వాన్ విశ్వం,తిరుమల రామచంద్ర, సెట్టి లక్ష్మీనరసింహం, కనుపర్తి వరలక్ష్మమ్మ, నేలటూరి వెంకటరమణయ్య, వేంకట పార్వతీశ కవులు, వేదము వేంకటరాయశాస్త్రి, కవికొండల వెంకటరావు, ఆండ్ర శేషగిరిరావు, శ్రీరంగం శ్రీనివాసరావు, పూతలపట్టు శ్రీరాములురెడ్డి, సోమంచి వాసుదేవరావు, విశ్వనాథ సత్యనారాయణ, వడ్డాది సుబ్బారాయుడు, తుమ్మల సీతారామమూర్తి, మల్లంపల్లి సోమశేఖరశర్మ,దాశరథి కృష్ణమాచార్య, సి.నారాయణరెడ్డి, కె.వి.రమణారెడ్డి, ఎస్.గంగప్ప, నాళేశ్వరం శంకరం,రంధి సోమరాజు, ఆచార్య కొలకలూరి ఇనాక్ , హెచ్.ఎస్.బ్రహ్మానంద, డా. తిరునగరి రామానుజయ్య, ఆవంత్స సోమసుందర్, సర్దేశాయి తిరుమలరావు, వేగుంట మోహనప్రసాద్, మధురాంతకం రాజారాం, వేలూరి సహజానంద, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి,జానమద్ది హనుమచ్ఛాస్త్రి,ఉత్పల సత్యనారాయణాచార్య,కొమ్మూరి వేణుగోపాలరావు, టేకుమళ్ల కామేశ్వరరావు, నిడుదవోలు వేంకటరావు, యస్వీ జోగారావు, నూతలపాటి గంగాధరం, నోరి నరసింహశాస్త్రి, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, పేరాల భరతశర్మ, చెరబండరాజు, పులికంటి కృష్ణారెడ్డి, గొల్లపూడి మారుతీరావు,చెప్యాల రామకృష్ణారావు, అక్కిరాజు రమాపతిరావు, ఐ.వి.యస్. అచ్యుతవల్లి, తాడిగిరి పోతరాజు, చేకూరి రామారావు, చౌడూరి నరసింహారావు, మహీధర నళినీమోహన్, అంగర వెంకటకృష్ణారావు, అరిగే రామారావు, గుమ్మనూరు రమేష్ బాబు మొదలైనవారు.
కొన్ని రచనలు
[మార్చు]ఈ పత్రికలో ప్రచురింపబడి ప్రాచుర్యం పొందిన కొన్ని రచనలు: పెనుగొండలక్ష్మి (పుట్టపర్తి నారాయణాచార్యులు), పెన్నేటిపాట (విద్వాన్ విశ్వం), అల్పజీవి (రాచకొండ విశ్వనాథశాస్త్రి), తలలేనోడు (కొలకలూరి ఇనాక్), ఏకవీర (విశ్వనాథ సత్యనారాయణ), పూర్ణ (కావ్యకంఠ గణపతిముని), సాహితీ సుగతుని స్వగతము (తిరుమల రామచంద్ర), కచటతపలు (భమిడిపాటి కామేశ్వరరావు) మొదలైనవి
చిత్రమాలిక
[మార్చు]భారతి మాసపత్రికలో ప్రముఖ కళాకారులచే గీయబడిన కళాఖండాలు ప్రతి నెలా ప్రచురింపబడేవి. వాటిలో కొన్ని ఈ క్రింద చూడండి.
-
వడ్రంగి
-
చాటింపు
-
మురళి
-
పల్లెపడుచులు
-
పెళ్ళి చూపులు
-
మేఘనాథుడు
-
కాపుపడతి
-
గజాసుర దమనుడు
-
నాగేశ్వరుడు
-
యౌవనశ్రీ
-
ప్రతీక్ష
-
పర్ణశాలలు
-
విరహిణి
-
మలబారు గ్రామదృశ్యములు
-
జాగాయ్, మాధాయ్
-
నగల నాణెము
-
పరిచర్య
-
గుఱి
-
విప్రోషిత
-
ఎర్రగుడి గుట్ట
-
ధర్మవిజయము
-
స్కందుడు శివునికి ప్రణవ మంత్రోపదేశం చేయుట