కల్వకుంట్ల చంద్రశేఖరరావు

వికీపీడియా నుండి
(కెసీఆర్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కల్వకుంట్ల చంద్రశేఖరరావు
కల్వకుంట్ల చంద్రశేఖరరావు

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014-06-02
నియోజకవర్గం గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1954-02-17) 1954 ఫిబ్రవరి 17 (వయసు 69)
చింతమడక, మెదక్, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి శోభ
సంతానం కల్వకుంట్ల తారక రామారావు (కొడుకు), కల్వకుంట్ల కవిత (కూతురు)
నివాసం ప్రగతి భవన్, హైదరాబాదు
మతం హిందూమతం
http://www.archive.india.gov.in/govt/loksabhampbiodata.php?mpcode=4083

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (జ.1954 ఫిబ్రవరి 17) తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ పార్టీ) వ్యవస్థాపక అధ్యక్షుడు.[1] కేసీఆర్ అన్న పొడి అక్షరాలతో సుప్రసిద్ధుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.[2][3][4] తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడైన చంద్రశేఖర్ రావు 14వ లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ లోని కరీంనగర్ లోకసభ నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహించాడు. 2004 నుండి 2006 వరకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. 15వ లోక్‌సభలో మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుండి విజయం సాధించాడు.[5] 2018  డిసెంబరు 7న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి,   డిసెంబరు 13  గురువారం మధ్యాహ్నం 1:25 నిమిషాలకు రాజ్‌ భవన్‌లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండవసారి పదవీబాధ్యతలు చేపట్టాడు.

తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం సాధనే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించాడు. 2004 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ తో కలిసి పోటీచేసి 5 లోక్‌సభ స్థానాలను దక్కించుకున్నాడు. అయితే తరువాతి కాలంలో యు.పి.ఎ నుండి వైదొలగాడు. ఇతడు ఎం.ఏ (సాహిత్యం) ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పూర్తిచేశాడు.

2014 జూన్‌ 2 నుండి 2023 జూన్‌ 2 వరకు తొమ్మిది సంవత్సరాలపాటు తెలంగాణ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు, స్వాతంత్య్రానికి పూర్వం నుండి 2023 వరకు అత్యధికకాలం ముఖ్యమంత్రిగా కొలువుదీరిన తెలుగు నాయకుడిగా రికార్డు సృష్టించాడు. ఒక తెలుగు నాయకుడు గ్యాప్‌ లేకుండా, ఏకబిగిన, ఇంత సుదీర్ఘ కాలం, ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉండటం చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి.[6]

జీవిత విశేషాలు

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా లోని చింతమడక గ్రామంలో 1954 ఫిబ్రవరి 17న రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించాడు. చంద్రశేఖర్ రావు కుటుంబం ఎగువ మానేరు డ్యాం నిర్మాణంలో భూమి కోల్పోయి చింతమడక గ్రామానికి వచ్చి స్థిరపడింది. దీనివల్ల ఇతను చిన్నతనంలో మధ్యతరగతి జీవితం అనుభవించాడు.[7][8] అతను సిద్ధిపేట డిగ్రీ కళాశాలలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యం సబ్జెక్టులుగా బి.ఎ. పూర్తిచేసి,[7] ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎం.ఎ (తెలుగు సాహిత్యం) చదివాడు.[9] ఇతను 1969 ఏప్రిల్ 23న శోభను వివాహమాడారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు, కుమార్తె కల్వకుంట్ల కవిత తెలంగాణ సాధన కోసం ఉద్యమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కుమారుడు తారక రామారావు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గంలో చేరగా, కుమార్తె కవిత పార్లమెంటు సభ్యురాలైంది.

రాజకీయ జీవితం

తొలినాళ్ళ రాజకీయ జీవితం (1970-2001)

విద్యార్థి నేత, తొలినాళ్ళ రాజకీయాలు

హైదరాబాదు నగరంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చిత్రం

విద్యార్థి దశలో ఉన్నప్పుడే చంద్రశేఖర్ రావు రాజకీయాల్లో చురుకుగా ఉండేవాడు. విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీచేసి ఓడిపోయాడు. విద్యార్థి దశ నుంచే కేసీఆర్‌కి రాజకీయ రంగంలోకి వెళ్ళాలనే స్పష్టత ఉండేది.[నోట్స్ 1] అప్పటి కాంగ్రెస్ నాయకుడు అనంతుల మదన్ మోహన్ ఇతనికి రాజకీయ గురువు. 70 వ దశకంలో యువజన  కాంగ్రెస్  నాయకుడిగా ఉన్న కేసీఆర్, 1982లో తాను ఎంతగానో అభిమానించే నందమూరి తారక రామారావు పార్టీ పెట్టడంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, తెలుగుదేశం పార్టీలో చేరాడు. 1983 ఎన్నికల్లో తన రాజకీయ గురువు మదన్ మోహన్‌పైనే పోటీచేసి గట్టి పోటీనిచ్చి 877 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[7]

వరుస విజయాలు, మంత్రి పదవులు

1985లో తెలుగుదేశం తరఫున ఎన్నికల్లో పోటీచేసి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు.[10] ఇది కేసీఆర్ రాజకీయ జీవితంలో తొలి విజయం. ఆ తరువాత 1989, 1994, 1999, 2001 (ఉప ఎన్నిక)లో వరుసగా గెలుపొందాడు.[7] 1987-88 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా సంపాదించాడు. 1992-93లో పబ్లిక్ అండర్ టేకింగ్ చైర్మెన్ పదవిని నిర్వహించాడు. 1997-98లో కేసీఆర్‌కు తెలుగు దేశం ప్రభుత్వంలో కేబినెట్ హోదా కలిగిన రవాణా మంత్రి పదవి లభించింది. 1999-2001 కాలంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ డిప్యూటి స్పీకర్ పదవి కూడా నిర్వహించాడు. అయితే 1999లో చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా తప్పించడం కేసీఆర్‌ను అసంతృప్తుణ్ణి చేసింది.[7]

సంవత్సరం నియోజకవర్గం విజేత పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు మెజారిటీ
1983 సిద్దిపేట అనంతుల మదన్ మోహన్ కాంగ్రెస్ పార్టీ 28766 కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్వతంత్ర అభ్యర్థి 27889 877
1985 సిద్దిపేట కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీ 45215 టి.మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 29059 16156
1989 సిద్దిపేట కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీ 53145 అనంతుల మదన్ మోహన్ కాంగ్రెస్ పార్టీ 39329 13126
1994 సిద్దిపేట కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీ 64645 అనంతుల మదన్ మోహన్ కాంగ్రెస్ పార్టీ 37538 27107
1999 సిద్దిపేట కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీ 69169 మూషినం స్వామి చరణ్ కాంగ్రెస్ పార్టీ 41614 27555
2004 సిద్దిపేట కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సమితి 74287 జిల్లా శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ 29169 45118
2004 కరీంనగర్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సమితి 451199 చెన్నమననేని విద్యాసాగర్ రావు భారతీయ జనతా పార్టీ 320031 131168
2006(ఉప ఎన్నికలు) కరీంనగర్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సమితి 378030 టి.జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 176448 210582
ఎల్.రమణ తెలుగుదేశం పార్టీ 170268
2008(ఉప ఎన్నికలు) కరీంనగర్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సమితి 269452 టి.జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 253687 15765
2009 మహబూబ్ నగర్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సమితి 366569 దేవరకొండ విట్టల్ రావు కాంగ్రెస్ పార్టీ 346385 20184
కె.యాదగిరి రెడ్డి భారతీయ జనతా పార్టీ 57955
2014 గజ్వేల్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సమితి 86694 వంటేరు ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం పార్టీ 67303 19391
2014 మెదక్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సమితి 657492 నరేంద్ర నాథ్ కాంగ్రెస్ పార్టీ 260463 397029
2019 గజ్వేల్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సమితి 125444 వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 67154 58290

ఉద్యమ నాయకత్వం (2001-2014)

తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన

ఆ తరువాత 2001 ఏప్రిల్ 21 నాడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి 2001 ఏప్రిల్ 27న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశాడు.[11][12] తొలిదశ తెలంగాణ ఉద్యమం, మలిదశలో తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ప్రారంభించిన కార్యక్రమాలు కేసీఆర్‌ని ప్రభావితం చేశాయి. 2001లో కొత్తగా ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఏర్పాటు తెలంగాణ ఏర్పాటు ఏమీ అసాధ్యం కాదన్న అభిప్రాయం ఏర్పరిచింది. అదే సంవత్సరం తెలంగాణ ఉద్యమకారులతో ఏర్పాటుచేసిన సమావేశాల్లో రాష్ట్ర సాధన ఉద్యమం గురించి చర్చించాడు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటుచేయాలన్న ఆలోచనను బలపరిచాయి. ఈ నిర్ణయం కేసీఆర్ తన రాజకీయ బలాబలాలపై ఉన్న అవగాహన కూడా అంచనా వేసే తీసుకున్నాడు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను మంత్రివర్గంలోకి తీసుకోకపోడం,[13] విద్యుత్తు ఛార్జీల పెంపు వంటివి కేసీఆర్ నిర్ణయంపై ప్రభావం చూపాయి. మరోవైపు అప్రతిహతంగా అప్పటికి పదిహేనేళ్ళ పైచిలుకు 5 ఎన్నికల్లో సిద్ధిపేటలో వరుసగా గెలుస్తూండడంతో స్థానికంగా తనకు ఎదురులేదన్న అంచనాకు కూడా వచ్చాడు. తెరాస స్థాపనకు ముందు సైద్ధాంతికంగానూ తెలంగాణ ఏర్పాటు, దాని అవసరాల గురించి అధ్యయనం చేశాడు.[7][14]

అప్పటికే మలిదశలోకి అడుగుపెట్టిన తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ తెరాస స్థాపన అన్నది రాజకీయమైన వ్యక్తీకరణ అయింది.[15] తెరాసను స్థాపించిన 20 రోజులకు 2001 మే 17న తెలంగాణ సింహగర్జన పేరిట భారీ బహిరంగ సభ ఏర్పరిచి, తెలంగాణను రాజకీయ పోరాటం ద్వారా సాధిస్తామని ప్రకటించాడు. ఆపైన తన వాగ్ధాటికి, రాజకీయ వ్యూహాలకు పదును పెట్టుకుంటూ సాగాడు.[7]

2004 ఎన్నికలలో కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుండి గెలుపొందాడు.[16] ఐదుగురు లోక్‌సభ సభ్యులున్న తెరాస కాంగ్రెస్ నేపథ్యంలోని యుపిఎ కూటమిలో భాగస్వామిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరింది. ఈ సందర్భంగా తెరాస నాయకులుగా కేసీఆర్, ఆలె నరేంద్ర కేంద్ర మంత్రులయ్యారు.[17] 2004 నుండి 2006 వరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కేసీఆర్ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి పదవులకు రాజీనామా చేసి, యూపీఏ నుంచి బయటకు వచ్చాడు.[18] ఈ సమయంలో మంత్రి పదవులతో పాటు లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి, ఉపఎన్నికలలో కరీంనగర్ స్థానం నుండి మళ్ళీ పోటీచేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన టి.జీవన్ రెడ్డిపై రెండు లక్షలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించాడు. 2008లో మళ్ళీ రాష్ట్రమంతటా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు చేసిన రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలలో మళ్ళీ కరీంనగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీచేసి 15000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. 15వ లోక్‌సభ ఎన్నికలలో మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విఠల్ రావుపై గెలుపొందాడు. జనరల్ ఎన్నికల్లోనే కాకుండా పలుమార్లు రాజీనామాలు చేయగా వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్‌ను తిరిగి భారీ మెజారిటీలతో ఎన్నుకుని ప్రజలు విజయాలు కట్టబెట్టారు.[7] ఒక దశలో రాజీనామా కేసీఆర్‌కు రాజకీయంగా పెద్ద అస్త్రంగా మారింది.

నిరాహార దీక్ష, పోరాటం, రాష్ట్ర సాధన

2009 నవంబరు 29న కేసీఆర్ తెలంగాణ సాధన లక్ష్యంగా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టాడు చేపట్టడానికి కరీంనగర్ నుండి సిద్ధిపేట దీక్షాస్థలికి బయలుదేరుతుండగా మధ్యలో కరీంనగర్ దగ్గరలోని అలుగునూరు వద్ద పొలీసులు అరెస్టుచేసి ఖమ్మం పట్టణానికి తరలించారు [నోట్స్ 2] అదే రోజున పోలీసులు దీక్ష భగ్నం చేసి ఖమ్మం సబ్ జైలుకు తరలించి 29, 30 తేదీల్లో బంధించారు. 30న జైల్లోనే నిరాహార దీక్ష కొనసాగించడంతో అక్కడ నుంచి ప్రభుత్వాసుపత్రికి కేసీఆర్‌ని తరలించారు.[19]

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిత్వం (2014-2018)

ఆయన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా జూన్ 2 మధ్యాహ్నం 12.57 కు ప్రమాణ స్వీకారం చేసారు. ఆయన తన నాలుగున్నర పాలన తరువాత సెప్టెంబరు 2018లో తెలంగాణ శాసనసభను రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 119 స్థానాల్లో పోటీచేసి 88 స్థానాల్లో విజయ దుందుభి మెగించింది.[20][21][22]

పథకాలు - ఆవిష్కరణలు

  1. రైతుబంధు పథకం
  2. కె.సి.ఆర్‌. కిట్‌ పథకం
  3. ఆరోగ్య లక్ష్మి పథకం
  4. కళ్యాణలక్ష్మి పథకం
  5. షాదీ ముబారక్ పథకం
  6. చేనేత లక్ష్మి పథకం
  7. బతుకమ్మ చీరలు
  8. ఆసరా ఫింఛను పథకం
  9. గ్రామజ్యోతి పథకం
  10. పల్లె ప్రగతి పథకం
  11. హరితహారం
  12. ఫైబర్‌ గ్రిడ్‌ పథకం
  13. టి సాట్
  14. మన ఊరు - మన ప్రణాళిక
  15. మిషన్ కాకతీయ
  16. మిషన్ భగీరథ
  17. షాదీ ముబారక్ పథకం
  18. షి టీమ్స్
  19. టాస్క్
  20. టీ హబ్
  21. టీఎస్ ఐపాస్‌
  22. టీఎస్ బిపాస్‌
  23. వీ హబ్‌
  24. టీ యాప్ ఫోలియో
  25. టీ వాలెట్
  26. మెడిసిన్ ఫ్రమ్ ది స్కై
  27. మన ఊరు - మన బడి
  28. అమరవీరుల స్మారకం
  29. హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రాజెక్టు
  30. స్టేట్ ఇన్నోవేషన్ సెల్
  31. హాక్ఐ యాప్
  32. డయాగ్నస్టిక్ మొబైల్ యాప్
  33. క్రీడా ప్రాంగణం
  34. టీ వర్క్స్
  35. గ్రామీణ సంచార పశువైద్యశాల
  36. పల్లె ప్రకృతి వనం
  37. నేతన్న బీమా పథకం
  38. నేతన్నకు చేయూత పథకం
  39. కంటి వెలుగు
  40. రైతుబీమా పథకం
  41. అన్నపూర్ణ భోజన పథకం
  42. గృహలక్ష్మి పథకం
  43. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం
  44. ఆరోగ్య మహిళ
  45. దళితబంధు పథకం
  46. డబుల్ బెడ్రూమ్ పథకం
  47. కాళేశ్వరం ప్రాజెక్టు
  48. బస్తీ దవాఖాన
  49. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్
  50. తెలంగాణ సచివాలయం
  51. గొర్రెల పంపిణీ పథకం
  52. రైతు వేదిక
  53. రైతు స‌మ‌న్వయ స‌మితి
  54. డా. బి.ఆర్. అంబేడ్కర్ స్మృతివనం
  55. బుద్ధవనం ప్రాజెక్టు
  56. పోడు పట్టాల పంపిణీ

కాలరేఖ

  • 1985-2004: ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుడు (4 సార్లు)
  • 1987-88: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో సహాయ మంత్రి
  • 1992-93: అధ్యక్షుడు, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్ టేకింగ్స్
  • 1997-99: ఆంధ్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి
  • 1999-2001: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఉప సభాపతి
  • 2001 ఏప్రిల్ 21: తెలుగుదేశం పార్టీకి డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా
  • 2001 ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన
  • 2004 : 14 వ లోక్ సభ సభ్యునిగా ఎన్నిక
  • 2004-06: కేంద్ర కార్మిక , ఉపాధి, రేవులు, నౌకాయానం, జలరవాణా శాఖ మంత్రి
  • 2006 సెప్టెంబరు 23: లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా
  • 2006 డిసెంబరు 7: 14 వ లోక్ సభ ఉప ఎన్నికలో మరల ఎన్నిక
  • 2008 మార్చి 3: లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా
  • 2009 : 15 వ లోక్ సభ సభ్యునిగా ఎన్నిక (2వ సారి)
  • లోకసభలో తెలంగాణ రాష్ట్రసమితి పార్లమెంటరీ పార్టీ నాయకుడు
  • 2009 ఆగస్టు 31 : కమిటీ ఆన్ ఎనర్జీలో సభ్యులు
  • 2009 సెప్టెంబరు 23 : రూల్స్ కమిటీలో సభ్యులు
  • 2014: 16 వ లోక్ సభ సభ్యునిగా ఎన్నిక
  • 2014: గజ్వేల్ శాసనసభ్యునిగా ఎన్నిక [23]
  • 2014: తెలంగాణ రాష్ట్రం శాసన సభా పక్ష నాయకునిగా ఎన్నిక.
  • 2014, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.
  • 2018: డిసెంబరు 13 న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణ స్వీకారం.

ఇవీ చూడండి

నోట్స్

  1. చంద్రశేఖర్ రావు చదువు పూర్తవుతూండగానే ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తానని అతని రాజకీయ గురువు మదన్ మోహన్ సూచిస్తే "నేను ఉద్యోగం చేయను, రాజకీయాల్లోకి వస్తాను" అన్నారని కాలేజీ సహాధ్యాయి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి గుర్తుచేసుకున్నాడు.
  2. తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించివాడు, అడ్డుకున్నాడన్న పేరు పడ్డ వ్యక్తి అయిన అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో 2009 సెప్టెంబరు 2న దుర్మరణం పాలు కాగా ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. రాజశేఖరరెడ్డి మరణానంతరం మూడు నెలలకు కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలు ఎదుర్కొంటుండగా కేసీఆర్ తెలంగాణ సాధనే లక్ష్యంగా నిరాహార దీక్ష ప్రారంభించడం సాధారణంగా రాజకీయంగా ఎంచుకున్న సమయంలో పోరాడే అతని తత్త్వానికి నిదర్శనం.

మూలాలు

  1. "Telangana CM, K Chandrashekar Rao, a Hindi, but not English speaking CM in south India". timesofindia.indiatimes.com. Retrieved 2014-08-03.
  2. "KCR the strong leader in Telangana state". Archived from the original on 2016-02-17. Retrieved 2016-02-15.
  3. "Telangana Jathi Pitha KCR". Archived from the original on 2016-02-26. Retrieved 2016-02-15.
  4. "'Make in Telangana' should be a global standard: KCR". thehindu.com. The Hindu.
  5. ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009
  6. telugu, NT News (2023-05-31). "CM KCR | ఏకబిగిన 9 ఏండ్ల పాటు పాలించిన తెలుగు సీఎంగా కేసీఆర్‌ రికార్డు.. మొత్తం 24 మంది తెలుగు సీఎంలలో ఎవరికీ దక్కని కీర్తి". www.ntnews.com. Archived from the original on 2023-06-01. Retrieved 2023-07-10.
  7. 7.0 7.1 7.2 7.3 7.4 7.5 7.6 7.7 పసునూరు, శ్రీధర్ బాబు (5 December 2018). "కేసీఆర్ వ్యక్తిత్వం : మాటే మంత్రంగా నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం". బీబీసీ తెలుగు. బీబీసీ. Archived from the original (ఆన్లైన్) on 6 December 2018. Retrieved 6 December 2018.
  8. "Who is KCR?". NDTV.com. Archived from the original on 2014-10-11. Retrieved 2014-08-03.
  9. "Fifteenth Lok Sabha Members Bioprofile". Parliament of India. Archived from the original on 31 March 2014. Retrieved 7 January 2016.
  10. "KCR to enter Congress via Telangana?". IBN Live. 26 February 2014. Archived from the original on 2 మార్చి 2014. Retrieved 26 February 2014.
  11. "Dy. Speaker resigns, launches new outfit". hindu.com. The Hindu. 28 April 2001. Archived from the original on 2014-03-05. Retrieved 2014-02-24.
  12. "Telangana finds a new man and moment". Hinduonnet.com. 19 May 2001. Archived from the original on 8 January 2009. Retrieved 2011-06-30.
  13. "'కేసీఆర్‌కు మంత్రి పదవి ఇవ్వకపోవడం పొరపాటు'". BBC News తెలుగు. 28 February 2018. Retrieved 6 December 2018.
  14. కాసం, ప్రవీణ్ (6 August 2018). "ప్రొఫెసర్ జయశంకర్: 'శనివారం ఉపవాసాన్ని, తెలంగాణవాదాన్ని విడిచిపెట్టలేదు'". BBC News తెలుగు. Retrieved 6 December 2018.
  15. కొత్తపల్లి, జయశంకర్ (20 January 2016). "తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్‌". www.andhrajyothy.com. Retrieved 6 December 2018.[permanent dead link]
  16. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-04-10. Retrieved 2009-03-11.
  17. "Politics of separation". Frontline. Retrieved 24 February 2014.
  18. "Telangana isn't scary". hindustantimes.com. Hindustan Times. 10 December 2009. Archived from the original on 2010-11-14. Retrieved 2011-06-30.
  19. "ఆ దీక్షకు ఎనిమిదేళ్లు." www.andhrajyothy.com. 29 November 2017. Archived from the original on 30 నవంబరు 2017. Retrieved 6 December 2018.
  20. "KCR to Be Sworn in Telangana State's First CM on June 2". Deccan-Journal. Archived from the original on 29 మే 2014. Retrieved 27 May 2014.
  21. "KCR to Be Sworn in Telangana State's First CM on June 2". Deccan-Journal. Archived from the original on 2 జూన్ 2014. Retrieved 2 June 2014.
  22. "Politics of separation". Frontline. Retrieved 16 April 2014.
  23. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.

ఇతర లింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

వంశవృక్ష ఆధారం