నవరసాలు
రససృష్టి
[మార్చు]ఉత్తమ కళాసృష్టి వలన మనలో ఒక భావం ఉదయించి, దానిమూలంగా కళాసృష్టి యందు మనకొక పూర్ణ నిమగ్నత కలిగి, ఆ భావం స్థాయీపరమై పెచ్చు పెరిగి, తదనుసారంగా మనం ఒక అనిర్వచనీయమైన అపరిమిత ఆనందం అనుభవిస్తాము. అప్పుడు మనకు రసానుభూతి కలిగిందంటారు. ఆనందస్వరూపమైన ఈ అపరిమిత ఆనందాన్ని రసం అన్నారు. అందుచేత రసప్రకృతి మనలో కళాసృష్టి వలన ఉదయించే ప్రధానభావాన్ని అనుసరించి ఉంటుంది. భావాలు అనేక రకాలుగా ఉండటం చేత, రసాలు కూడా వేర్వేరుగా ఉండకతప్పదు. కాని ప్రతీభావం మనలో స్థితినందుకొని స్థాయీప్రంగా పెరిగి రసంకాగల శక్తి కలదై యుండదు. ఈశక్తి కలిగిన భావాలు కొన్ని మాత్రమే. మాంవహృదయ నైజం బాగా శోధించిన భారతీయ ఋషులు పూర్వపు వక్తలు, ఈ భావాలు ఎనిమిదని చెపారు. కాని కొంతకాలమైన తరువాత సా.శ. 5 వ లేక 6వ శతాబ్దములో మరొక రసాన్ని నిర్వచించి శాంత రసాన్ని చేర్చి, నవ రసాలుగా నిర్ణయించారు.
నవరసాలు - స్థాయీభేదాలు:
[మార్చు]- శృంగారం - భావం:రతి
- వీరం - భావం:ఆవేశం
- కరుణ - భావం:దు:ఖం
- అద్భుతం - భావం:ఆశ్చర్యం
- హాస్యం - భావం:నవ్వు
- భయానకం - భావం:భయం
- బీభత్సం - భావం:జుగుప్స
- రౌద్రం - భావం:కోపం
- శాంతం - భావం:ఓర్పు
రసానుభూతి
[మార్చు]ఒక కళాసృష్టి వలన మనలోకి మొదట ఒకభావం అంకురించి స్థితినందుకోవాలి. తదుపరి ఆభావం స్థాయీపరంగా పెరగాలి. పెరిగి, పెరిగి తుట్టతుదకు ఆభావం అంతిమస్థాయి నందుకొన్నప్పుడు ఆనందస్వరూపమైన బ్రహ్మానందాన్నీ మనం అనుభవిస్తాము. అప్పుడాభావం రసం అయ్యింది. ఈ తొలి భావం స్థితినందుకొని స్థాయీపరంగా పెరిగిందవటం చేత దీన్ని స్థాయీభావం అన్నారు. కళాసృష్టి యందలి ఈ స్థాయీభావోదయకారక అంశము విభావము' అని అంటారు. భావకారణం విభావం. ఈవిభావ కారణంగానే స్థాయీభవ అంకురం, అది వృద్ధి పొందడంకూడా. తదనుసారంగానే రసోత్పత్తికి అవకాశం. అందుచేత ద్వివిధాలుగా మన వక్తలు నిర్వచించారు: 1. ఆలంబన 2. ఉద్దీపన. స్థాయీభావోదయానికి ముఖ్య కారణమైన అంశమును ఆలంంబన విభావమనబడింది. ఈ స్థాయీభావాన్ని పెంపొందించడానికి గల కారణాంశము ఉద్దీపన విభావము. ఎందుకనగా నిలిచియున్న ష్తాయీభావాన్ని ఇది ఉద్దీపిస్తుంది.
ఈ స్థాయీభావం పెచ్చుపెరిగి విధానంలో అనేక చిన్నచిన్న భావాలు తెరలు తెరలుగా వచ్చి సమసిపోతుటాము. వీటిని సంచారీభావాలు అంటారు. ఈ సంచారీభావాలు స్థాయీభావమువలె మనలో నిలకడ చెందవు. చిన్నచిన్న వీచికలలాగ ఇవి తాకు పోతుంటాయి. అంచేత స్థాయీభావ సాగరమందు ఉదయించి, సమసిపోవు తరంగాలుగా ఈ సంచారీ భావాలను పోల్చారు.
రసానుభూతికి కళాసృష్టి ఎంతకారణభూత మవుతుందో, సామాజికుడు కూడా అంత కారణభూతుడవుతాడు. బీజమెంత ఉత్తమమైనదైనను, క్షేత్రం తగినది కాకపోయినప్పుడు తద్బీజము సరిగా ఫలించకపోవడమే గాక, ఒక్కొక్కప్పుడు అంకురవికాసములను కూడా అందుకొనకపోవచ్చును.