సప్త చిరంజీవులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పురాణాల్లోని ముఖ్య ఘట్టాలు. ఎడమ నుండి కుడికి, పైనుండీ కిందికి: వ్యాసుడు, గొడ్డలితో పరశురాముడు, అంజలి ముద్రలో హనుమంతుడు, మార్కండేయుని రక్షిస్తున్న శివుడు, ఇండోనేసియా తోలుబొమ్మ రూపంలో కృపాచార్యుడు, ఇండోనేసియా తోలుబొమ్మ రూపంలో విభీషణుడు , నారాయణాస్త్రాన్ని సంధింస్తున్న అశ్వత్థామ, ఛద్మవేషంలో ఉన్న ఇంద్రునితో బలి చక్రవర్తి

చిరజీవులు లేదా చిరంజీవులంటే చావులేనివారని అర్థం.

  1. అశ్వత్థామ: ద్రోణాచార్యుని కుమారుడు. కురుక్షేత్ర యుద్ధం తరువాత కౌరవ పక్షాన మిగిలిన అతి కొద్దిమందిలో ఇతనొకడు. నిద్రిస్తున్న ఉపపాండవులను గొంతుకలు కోసి చంఫాడు. ఆ కారణంగా, ఒళ్ళంతా వ్రణాలతో చావు లేకుండా చిరంజీవిగా జీవించమని శ్రీకృష్ణూడు అతన్ని శపించాడు.
  2. బలి: ముల్లోకాలనూ జయించిన దానవ చక్రవర్తి. ప్రహ్లాదుని మనుమడు. విరోచనుని కుమారుడు. పౌరాణిక గాథల్లో మహా దాతలుగా ప్రసిద్ధికెక్కిన ముగ్గురు - బలి, శిబి, ధధీచి - లలో ఒకడు. వామనావతారంలో వచ్చిన విష్ణుమూర్తి మూడడుగుల నేలను అతనినుండి దానంగా పొంది, రెండు అడుగులతో యావద్విశ్వాన్నీ ఆక్రమించి, మూడో అడుగు ఎక్కడ పెట్టమని అడగ్గా, తన తలను చూపించాడు. త్రివిక్రముడైన వామనుడు అతన్ని పాతళానికి తొక్కేసాడు.
  3. హనుమంతుడు: అత్యంత ప్రసిద్ధుడైన చిరంజీవి. బ్రహ్మచారి. రామకార్యం కోసం లంకకు లంఘించి, సీత జాడ కనుక్కున్న పరోపకారి. హనుమతుడు చేసిన ఉపకారానికి రాముడిచ్చిన బహుమానం అత్మీయమైన కౌగిలింత. రాముణ్ణి తన గుండెలో దాచుకున్నవాడు, రాముడి గుండెలో ఒదిగిపోయినవాడు -హనుమంతుడు.
  4. విభీషణుడు: రావణాసురుని తమ్ముడు. అపహరించి తెచ్చిన సీతను తిరిగి రామునికి అప్పగించమని అన్నకు సలహా ఇచ్చాడు. ఆ తరువాత అన్నను వీడి, రాముని వద్ద శరణు పొందాడు. అతను చిరంజీవి కాదుగానీ దాదాపుగా చిరంజీవి. కల్పాంతము వరకూ చిరంజీవిగా ఉండే వరం పొందాడు.
  5. కృపుడు: కౌరవ పాండవుల కుల గురువు. ద్రోణుని బావమరది. కురుక్షేత్ర యుద్ధంలో బ్రతికి బట్టకట్టిన అతి కొద్ది కౌరవ పక్ష యోధుల్లో మేనల్లుడు అశ్వత్థామతో పాటు కృపుడు ఒకడు.
  6. పరశురాముడు: విష్ణుమూర్తి అవతారం. జమదగ్ని కొడుకు. తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని చంపి మళ్ళీ ఆమెను బతికించమని వరంగా కోరుకున్నవాడు. తన తండ్రిని క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు వధించినందుకు ప్రతిగా యావత్తు క్షత్రియ జాతిపై 21 మార్లు దండెత్తి వారిని వధించాడు.
  7. వ్యాసుడు: భారత, భాగవత గ్రంథాలను రచించాడు. భారత దేశంలో వివిధ భాషల్లో ఉన్న భారత భాగవత గ్రంథాలకు ఈతని రచనలే మూలం. వశిష్టుని మునిమనుమడు, శక్తి మహర్షి మనుమడు, పరాశరుని కుమారుడు. భీష్మునికి వరుసకు అన్న.

ఈ ఏడుగురు చిరంజీవులని పురాణాలు చెపుతున్నాయి. ఈ ఏడుగురితో పాటు మరొక చిరంజీవి యైన మార్కండేయుని కూడా కలిపి అష్ట చిరంజీవులని కూడా అంటారు. మార్కండేయుడు శివుని అనుగ్రహాన చిరంజీవి అయ్యాడు.

అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః ।

కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥

సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమం ।

జీవేద్వర్షశ్శతమ్ సొపి సర్వవ్యాధి వివర్జిత ॥

శ్రీకృష్ణుని శాపము వలన అశ్వత్థాముడు వామనానుగ్రహమువలన బలిచక్రవర్తి లోకహితముకై వ్యాసుడు శ్రీరామభక్తితో హనుమంతుడు రామానుగ్రహమువలన విభీషణుడు విచిత్రజన్మము వలన కృపుడు ఉత్క్రుష్టతపోధనుడైన పరశురాముడు సప్తచిరంజీవులైరి । వీరికుత్తరమున శివానుగ్రహముచే కల్పంజయుడైన మార్కండేయుని ప్రతినిత్యం తలచుకొన్న సర్వవ్యాధి వివర్జితులై శతాయుష్మంతులౌతారని ఈ శ్లొకతాత్పర్యము॥