సప్తవాయువులు
కశ్యపుడు, దితిల సంతానమైన సప్త మరుత్తులు లేదా సప్తమారుతములు లేదా సప్త వాయువులు వివిధ మండలములలో వ్యాపించిన వాయువులకు అధిపతులుగా భగవంతుడు నియమించెనని పురాణ గాథ.
పురాణ గాథ
[మార్చు]దితి ఇంద్రుని చంపునట్టి కొడుకు కావలయును అని కశ్యపుని ప్రార్థింపగా అతను అనుగ్రహించి గర్భమును కలుగజేసి వంద సంవత్సరాలు నియమలులతో కాపాడుకున్నచో అటువంటి బిడ్డ జన్మించునని చెప్పెను. ఆమె నియమములతో ఉన్నను నూరు సంవత్సరాలు ముగియుటకు ముందు అశుచియై నియమము తప్పిన సమయములో అదే సమయమును చూచుచున్న దేవేంద్రుడు ఆమె గర్భమున ప్రవేశించి ఆ శిశువును తన వజ్రాయుధంతో ఏడు భాగాలు చేసెను. అప్పుడు ఆ శిశువు తుడెములై రోధన చేయుచున్నప్పుడు దితి "మారుద మారుద" అని చెప్పెను. కనుక వీరు మరుత్తులు అనబడిరి. అంత ఇంద్రుడు దితిగర్భమున ఉండి వెలువడివచ్చి 'తల్లీ నీవు అశుచివై ఉండినందున ఇంతపని చేసితిని' అని ఆమెను మంచిమాటలచే సమాధానపరిచి, ఆమె కోరినట్లు ఆ ఏడుపిండములకు దీర్ఘాయువును ఇచ్చి సప్తలోకములయందును వాయురూపముగా తిరుగునట్లు అనుగ్రహంచి వెడలిపోయెను. అది కారణముగ మరుత్తులును, దేవతలును కూడి ఉందురు.[1]
సప్త మరుత్తులు
[మార్చు]- ఆహవ వాయువు: మేఘ మండలానికి, భూమండలానికి మధ్య ప్రసరించునది.
- ప్రవహ వాయువు: సూర్య మండలానికి, మేఘ మండలానికి మధ్య ప్రసరించునది.
- అనువహ వాయువు: చంద్ర మండలానికి, సూర్య మండలానికి మధ్య ప్రసరించునది.
- సంవహ వాయువు: నక్షత్ర మండలానికి, చంద్ర మండలానికి మధ్య ప్రసరించునది.
- వివహ వాయువు: గ్రహ్ర మండలానికి, నక్షత్ర మండలానికి మధ్య ప్రసరించునది.
- పరావహ వాయువు: సప్తర్షి మండలానికి, గ్రహ మండలానికి మధ్య ప్రసరించునది.
- పరివహ వాయువు: ధ్రువ మండలానికి, సప్తర్షి మండలానికి మధ్య ప్రసరించునది.
మూలాలు
[మార్చు]- ↑ పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879