Jump to content

సప్త ద్వీపాలు

వికీపీడియా నుండి

బ్రహ్మాండ పురాణములోను, మహాభారతంలోను, భాగవతం సప్త ద్వీపాలగురించి ఉంది.

బ్రహ్మాండపురాణంలో సూతుడు ప్రపంచములోని భూభాగములు, జలభాగముల గురించి ఇలా చెప్పాడు - స్వాయంభువమనువు కొడుకు ప్రియవ్రతుడు. ఈయనకు మొదటి భార్యవలన ఉత్తమ, తామస, రైవతులు జన్మించారు.రెండవ భార్య బర్హిష్మతి. ఈమెవలన అగ్నీధ్ర, ఇధ్మజహ్వ, యజ్ఞబాహు, మహావీర, హిరణ్యరేతస, గృహపుష్ఠ, సవన, మేధాతిధి, వీతిహోత్ర, కలి, ఊర్జస్వతీ, అనేవారు జన్మించారు.వీరిలో మహావీర, సవన, కలి అనేవారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు.స్వాయంభువ మనువు తన మనుమలలో ఏడుగురిని ఏడు ద్వీపములకు చక్రవర్తులను చేసెను. వారు తమ తమ సంతానానికి ఆయా ద్వీపాలను పంపకం చేయడం వలన అనేక రాజ్యాలు ఏర్పడినాయి. అలా ముందుగా వివిధ ద్వీపాలకు చక్రవర్తులైన మనువు మనుమలు

  1. జంబూద్వీపం - అగ్నీంద్రుడు
  2. ప్లక్షద్వీపం - మేధాతిథి
  3. శాల్మలీద్వీపం - వపుష్మంతుడు
  4. కుశద్వీపం - జ్యోతిష్మంతుడు
  5. క్రౌంచద్వీపం - ద్యుతిమంతుడు
  6. శాకద్వీపం - హవ్యుడు
  7. పుష్కరద్వీపం - సేవనుడు.

ఈ క్రిందివే సప్త ద్వీపాలు :

జంబూద్వీపం

[మార్చు]

(ప్రస్తుతం మనము ఉంటున్నది) జంబూ అనగా నేరేడు పండ్లు, లేదా గిన్నెకాయలు. ఇవి ఎక్కువగా ఉంటాయి కనుక ప్రస్తుతము మనము ఉంటున్న ద్వీపాన్ని జంబూద్వీపము అంటారు. జంబూద్వీపము 9 వర్షాలు లేదా భాగాలుగ విభజించబడింది. అవి

  1. ఇలావృత (హిమాలయాలు, టిబెట్ ప్రాంతము)
  2. భధ్రవర్ష (హిమాలయాల తూర్పు ప్రాంతము) - తూర్పు
  3. హరి (అరేబియా) - దక్షిణము
  4. కేతుమాలం (ఇరాన్, టర్కీ ) పశ్చిమం
  5. రమ్యక (రష్యా, సైబీరియా) ఉత్తరము
  6. హిరణ్మయ (మంచూరియా) ఉత్తరము
  7. కురు (మంగోలియా) ఉత్తరము
  8. కింపురుష / కిన్నర (హిమాలయాల దక్షిణ ప్రాంతాలు) దక్షిణము
  9. భరత (భారత ఉపఖండము)

ఈ ద్వీపము చుట్టు లవణాంబుధి యున్నది. ఈ ద్వీపంలో 6 పర్వతాలు - హిమాలయము, మేరు పర్వతము, నీలాచలము, హిమాచలము, శ్వేతాచలము, మాల్యవంతము, గంధమాదనము, వింధ్యపర్వతము.

తన తండ్రి ఆస్తిలో జంబూద్వీపానికి అగ్నీధ్రుడు అధికారి అయినాడు.ఈయనకు 9 మంది పిల్లలు కలిగి ఉన్నారు.మొదటివాని పేరు అజ, అజనాభి, నాభి అని కంపిస్తుంది. మిగిలినవారి పేర్లను బట్టి కింపురుష, హరి, ఇలావృత, రమ్యక, హిరణ్మయి, కురు, భద్రాశ్వ, కేతుమాల వర్షాలు వచ్చినవి.అజ శబ్దమునుంచి ఆసియా వచ్చింది.

జంబూ శబ్దము వృక్షనామము. ఈ వృక్షాలు విరివిగా కనిపించే దేశము జంబూద్వీపము.నేటికి కూడా మనదేశములో ఒక భాగాన్ని జమ్ము అనిపిలుస్తున్నాము.హిమాలయాలలో ప్రవహించే నదులకు టిబెట్ దేశస్థులిచ్చినపేరు చివర సంపో లేక త్సంసో అనే శబ్దం కంపిస్తుంది. ఇది జంబూ శబ్దమే.

ప్లక్షద్వీపం

[మార్చు]

ఇది జంబూద్వీపంకంటే రెండురెట్లు పెద్దది. ఇందు ప్లక్ష (జువ్వి) చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ ద్వీపానికి ఒకవైపు ఉప్పునీటి సముద్రము, మరొకవైపు రససముద్రము ఉన్నాయి.

  • పర్వతాలు - గోమోదకము, నారదాచలము, దుందుభి పర్వతము, సోమకాచలము, సుమనోపర్వతము.
  • నదులు - అనుతప్త, సుఖి, విపాశము త్రివిక్రము, అమృత, సుకృత

శాల్మలీద్వీపం

[మార్చు]

ఇది ప్లక్ష ద్వీపంకంటే పెద్దది. ఇందులో ఒక మహోన్నతమైన శాల్మలి (బూరుగు) వృక్షం ఉంది. ద్వీపానికి ఒక ప్రక్క ఇక్షుసముద్రము, మరొక ప్రక్క సురసముద్రము ఉన్నాయి.

  • పర్వతాలు - కుముద, వలాహక, ద్రోణ, మహిష
  • ఔషధులు - సంజీవకరణి, విశల్యకరణి, సంధానకరణి వంటి దివ్యౌషధాలున్నాయి.
  • నదులు - జ్యోతిస్సు, శాంతి, తుష్కచంద్ర, శుక్ర, విమోచన, నివృత్తి.

కుశద్వీపం

[మార్చు]

ఇది శాల్మలీ ద్వీపంకంటే రెట్టింపు పెద్దది. ద్వీపానికి ఒక ప్రక్క ఘృతసముద్రము, మరొక ప్రక్క సురసముద్రము ఉన్నాయి.

  • పర్వతాలు - విద్రుమాద్రి, హేమాద్రి, మృతిమంతము, పుష్పకాద్రి, కులేశయము, హరిగిరి, మందరము
  • నదులు - ధూత, పాఫ, శివ, పవిత్ర, సంతతి, విద్యుమ్న, దంభ, మాహీ.

క్రౌంచద్వీపం

[మార్చు]

ఈ ద్వీపానికి ఒక ప్రక్క ఘృతసముద్రము, మరొక ప్రక్క దధిసముద్రము ఉన్నాయి.

  • పర్వతాలు - క్రౌంచాచలము, వామనపర్వతము, అంధకాచలము, దివావృతాద్రి, ద్వివిధగిరి, పుండలీకాద్రి, దుందుభిస్వనగిరి.
  • నదులు - గౌరి, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజన, ఖ్యాతి, పుండరీక.
  • దేశములు - కుశల, వామన, గోష్ఠ, పవరము

శాకద్వీపం

[మార్చు]

ఇది క్రౌంచ ద్వీపంకంటే రెట్టింపు పెద్దది. వలయాకారంలో ఉంది. కేతువు అనే మహావృక్షం ఉంది. ద్వీపానికి ఒక ప్రక్క మంచినీటి సముద్రము, మరొక ప్రక్క పెరుగు సముద్రము ఉన్నాయి.

  • పర్వతాలు - ఉదయాద్ర్రి, జలధార, రైవతకాద్రి, శ్యామలాద్రి, హస్తాద్రి, అంబికేయాద్రి, కేసరాద్రి.
  • విషయములు -జలదము, సుకుమారము, కౌమారము, మణీవకము, మహాద్రుమము
  • నదులు - సుకుమారి, కుమారి, నళిని, రేణుక, ఇక్షువు, గభస్తి.

పుష్కరద్వీపం

[మార్చు]

ఇది శాక ద్వీపంకంటే రెట్టింపు పెద్దది. ద్వీపానికి ఒక ప్రక్క మంచినీటి సముద్రము, మరొక ప్రక్క క్షీర సముద్రము ఉన్నాయి.

  • పర్వతాలు - చిత్రసాను, మానసోత్తర.
  • నదులు - లేవు.

ఈ ద్వీపాలకు-ఈజిప్టు దేశములకు సంబంధము

[మార్చు]

జంబూ ద్వీపస్థులు ఈజిప్టు దాకా వలసపోయినారని చెప్పటానికి చాలా ఆధారాలున్నాయి.ఈజిప్టు చరిత్రలో కంపించే హోవనిభు శబ్దము అజనాభా శబ్దమునుంచి వచ్చినదే.గ్రీకు దేశపు దేవుడగు బాకస్, ఈజిప్టులోనున్న ఒసిరస్ అనే దేవత ఒకటె.మేరోస్ అనే పర్వతం మీద ఈ దేవత విద్యనభ్యసించచెనని లెంప్రీర్ నిఘంటువులో సహితం చెప్పబడింది.ఇది మేరు పర్వతము. ప్లినీ ఈ ప్రదేశమున నైస అని పిలిచినప్పుడు నిషధశబ్దభవము.

ఈజిప్టులో నైలునది ప్రధానమైనది. దీనిని వారు నీలపునైల్ అని ఆప్యాయంగా పిలుస్తారు.వస్తుతః నైల్ శబ్దము సంస్కృత నీలశబ్దము నుంచి వచ్చినదే కావటముచేత నీలపునైల్ అనేవారు.అసలు అయిప్టస్ నైలునది మొదటి పేరు. ఈ శబ్దము అజశాబ్దమునుంచి వచ్చింది.అజమనగా మేక.ఖ్నుము అనే దేవతకు వెనుక రోజులలో ఈజిప్ట్ దేశస్థులు మేకతలనిచ్చారు.అమలెయియా అనే మేక పెంచటం చేతను, మేకతోలును డాలుగా కట్టుకొనటం చేతను జుపిటర్ అనే దేవతను వీరు జుపిటర్ అయియోకప్ అన్నారు.మేకపాదాలుండటం చేతను పాక్ అనే దేవుడిని పాక్ ఆయిపాక్ అన్నారు.దక్ష ప్రజాపజాపతికి మేకతల ఉన్నట్లు ఖ్నుము అనే దేవతకు మేకతల నిచ్చారు.ఈజిప్టును పాలించిన ఫారోలుర అనే సూర్యదేవుని సంతతివారుట!ఈర అనే దేవతను రని అంటారు. ఈ రనిని ఈజిప్టుదేశంలో వానరాలని పోలిన రెండు జంతువులతో పోలుస్తారు.నాగలోకంలో సూర్యుని హయశిరస్ అని అంటారని ఉద్యోగపర్వం (99.5) చెప్పుతున్నది. ఈజిప్టులో సూర్యుడికి మరొక పేరు హోరుస్ అనే గరుడుడు, ఉరెయిస్ అనే ఉరగము కూడా ఉండేవి. పరశురాముడు, ఆయన గండ్రగొడ్డలి లేకపోతే ఈజిప్టుదేశపు ప్రాచీన చరిత్రయే లెదని అంటారు.గరుడుడు, నాగులు శాల్మలీ ద్వీపానికి వలసపోయినారని సంప్రదాయమే చెబుతున్నది.

ఈజిప్టును క్రీ.పూ 7వ శతాబ్దములో తర్హక అనే ఇధియోపియా రాజు పాలించాడు.ఇది తారకాసుర శబ్దముమనటంలో సందేహములేదు.అజనాభాుని సంతతివారైన భారతీయులు ఆఫ్రికాలో కూడా స్థిరనివాసులైరి అని చెప్పవచ్చును.

అగ్నీధ్రుని సంతతిలో ఇలావృత శాబ్దము కనిపిస్తున్నది.అలై పర్వతాలకు చెందిన జుంగరియా శ్రేణిలో ఇలి అనే నది ఉంది. దీని ఉపనది ఒడ్డున వెర్నో అనే నగరంన్నది.ఇది వరుణ శబ్దము. వరుణిని నగరాన్ని నిమలోనని భాగవతము పేర్కొన్నది.ఇది అస్సీరియాలో నిమ్రోద్ అనిపిస్తున్నది.దీనికి దక్షిణముగా యముడు నగరమైన సంయమని పురమున్నదన్నారు.అరేబియా సముద్రము లోకి దారితీసే సొన్మియస్ అఖాతపు తెరములో సాన్మియని ఊరు నేటికి ఉంది.

ఇలావృత వర్షములలో మధ్యగా మహామేరు ఉంది. దీనికి తూర్పుగా భద్రాశ్వ వర్షము, పశ్చిమంగా కేతుమూలవర్షము లున్నవని వాయు పురాణము, మత్స్య పురాణములు చెప్పుచున్నవి. ఈ మేరు పర్వతం నుంచి అనేక పర్వతాలు బయలు దేరినవి.వీటిలో కురంగ (కుయుక్లెన్), కురకర (కరకోరం), కుసుంభ (హిందుఖుష్), వైకంటక (విటిం), శంఖ (ఖింగన్), రుచక (రుష్య), అనే పేర్లు కనిపిస్తున్నవి.

ఇధ్మజిహ్వునకు సంక్రమించినది ప్లక్ష ద్వీపము.అస్సీరియా దేశచరిత్రలో ఇష్మిదగోన్ అనే మొట్ట మొదటి రాజు కనిపిస్తాడు.ఈయన కుమారుడు షమష్ రమన్. ఈపేరునకు పూర్వరూపము క్షేమ శబ్దంలో కనిపిస్తుంది.ఇధ్మజిహ్వునకు శివ, యశస్య, సుభద్ర, శాంతక్షేమ, అభయ, అమృతులనే 7గురు కొడుకులునారని భాగవతు చెబుతున్నది.అస్సీరియా పాలించిన రెండవరాజు షమష్ రమన్.ఇంతే కాకుండా నిమ్రోద్ పాలించిన మేషరాజు పూజించిన దేవుళ్ళలో ఖేమోష్ అనే దెవుడున్నాడు.అసియాలో గల తుర్కిస్థానును శివులు పాలించారు.సుభద్ర శబ్దము కబర్దగాను, అభయ శబ్దము అరేబియాగాను మారింది. అమృతశబ్దము అర్మీనియా కావచ్చును.ఇర్మక్ నదీ తీరము అమెసియాలో నున్నది.

ప్లక్ష ద్వీపానికి లవణ సముద్రమును చెప్పినారు. దీనిని క్షార సముద్రమని అంటారు.నేడు ఖొరొసాక్ అని పిలువబడేది క్షారసముద్రమే.ఈద్వీపంలో అరుణ, అంగిరసీ, సత్యంభరా, సుప్రభాతా, సృమణ అనే నదులుండేవి.సిరియాలోని ఒరెంటిస్కు ప్రాచీన నామము అరుణ.అంగిరసీ నది - అనటోలియాలోని సింగరియస్.నేడు టైగ్రిస్ అని పిలవబడే నదిని ప్రాచీనకాలంలో షత్తెలమర అన్నారు.ఇసి సత్యంభర.సుప్రభాత నది యూప్రటిస్ గా మారినది.స్మర్నా అనే నగరం నేడుండేచోట సృమణానది ఉండవచ్చును.ఈద్వీపంలో మణికూట (మనిష్ఠ్) ధూమ్రపర్ణ (ధూమన్లు) మేఘమాల (మేర్ఖుంచ్) ఇంద్రసేన (అందిష్) వజ్రకూట (బజర్గొట్ప) పర్వతాలున్నవి.ఈ పేర్లను పరిశీలిస్తే అర్ధవంతమైన నామములు సంస్కృతములో కనిపిస్తున్నవి.భారతీయులే ఈపేర్లను స్థిరపరచినారని స్పష్టముగా తెలియుచున్నది.

శాల్మలీ ద్వీపము యజ్ఞబాహువునకు వచ్చింది.ఇచ్చట ఇస్ఖుసముద్రమున్నదన్నారు.ఈజియన్ సముద్రములో ఒకభాగానికి నేటికీ మర్క్ ఇకారియం అని పేరున్నది.ఇక్షు శాబ్దము ఇక అని మారినది.ఉత్తర ఆఫ్రికాలోని నూబియా ప్రాంతంలో శాల్మి, ఎల్ సొలిమనిష్లు ఉన్నాయి.సొమాలి దేశముకూడా ఉంది.యజ్ఞబాహువు యొక్క 7గురు కొడుకులు వారి వారిపేర్లను ఆయా ప్రాంతా ల కిచ్చారు.సోమాలికి పడమరగా సురొ ఉంది.ఇది సురొచునకి చెందినది.సౌమనస్యుని ద్వారా సొనాన్, రమణకుని వలన మూరాకోలోని రిహ్మన, దేవబర్హుని నుంచి ధేబయిద్ అని పిలవడు ఉత్తర ఈజిప్ట్, పరిబర్హుని వలన బర్చరి, ఆప్యాయునినుంచి అబిస్సీనియా, అభిజ్ఞాతుని ద్వారా అబైనది ప్రవహించు ప్రాంతము అంవర్ధములైనవి.దక్షిణ ఈజిప్ట్ లో చాలా కాలము వరకు గరుడుడే పతాకచిహ్నముగా గ్రహించబడినాడు.

హిరణరేతుసునికి వచ్చినది కుశద్వీపము.ఇచట ఘృతోదధి ఉన్నదన్నారు.ఘృతశబ్దము నేడు క్రీట్ అని పిలవబడి కృతశబ్దమునకు మూలరూపము.హిరణ్యరేతుసునకు 7గురు పుత్రులున్నారు.వసుదానుడు మసెదోనియాను, గుప్త అనువాడు కోపియస్ ను, సత్యవ్రతుడు స్పార్టాను, లిప్రుడు ఎపిరస్ ను, వామదేవుడు ఎమధియా అనబడ్డ ధెస్సలీని బయటకు తెచ్చారు.కుశద్వీపానికి చివర దధిమంతో దధి ఉంది.ఇది నేటి దల్మాషియా కావచ్చును. వస్తుతః హిరణ్యరేతశబ్దము ట్రోజను వీరుడగు ఈనియంపేరులో కనిపించును.ఈ శబ్దాలు సంస్కృత భాషను భారతదేశమును సూచించేవి.

గృహపృష్టునకు క్రౌంచద్వీపము వచ్చింది.దధి మంధసముద్రము ఇచ్చట గలదన్నారు.మెడిట రేనియన్ సముద్రమున గల మొదటపదానికి అంతర్మధనమని అర్ధము సరిపోతుంది.ఈతని 7గురు కొడుకులు మధువహుని నుంచి మాల్బేలియా, సుదాముని ద్వారా స్వీడన్ ఋషిజ్యుని వలన రష్యా, లోహితార్ధుని ద్వారా లిధునేనియా వనస్పతినుంచి ఆస్త్రియాలోని బనత్ బయలుదేరినవి.మేఘపృష్టుడు పాలించిన ప్రాంతము ప్రష్యా కావచ్చును.

శకద్వీపాన్ని గ్రహించినవాడు మేధాతిధి.ఈయన సంతతిలో పురోజన (బరీషేవ), మనోజవ ( మెజెక్), విశ్వచార (పెట్చొర), వేపమాన, ధూంరానీక, చిత్రరధ, బహురూపులున్నారు.ఈ ప్రాంతంలో ఊరుశృంగ (ఊరల్) పర్వతమున్నది.ఈశాన, బలభద్ర, శతకేసర, సహస్రస్రోత, దేవపాల, మహాన పర్వతాలు ఆల్ప్స్ లోని, రష్యా, జర్మనీలలో ఉండవీలున్నది.దీనికి ఉత్తరముగా శ్వేతద్వీపమున్నది. ఇది విపరీతమైన ఉష్ణగోళమని శాంతిపర్వము (335,335) చెప్పుతున్నది.

వీతిహోత్రునకు పుష్కరద్వీపం వచ్చింది.ఇది అత్యుత్తర ప్రాంతం కావచ్చును.కాని ఇతనిపుత్రులు రమణక, ధాతకులని చెప్పబడుటచేత ఇది ధనునికోహ్ ప్రాంతం కావచ్చును.ఇచట కనిపించే అర్వాచీన పర్వతమే అరల్, ఐరుక పర్వతములు.ప్రాచీన పర్వతము పరక్టెచేసెగా కనిపిస్తున్నది.ఇచ్చట సాగ్దియానమున్నది.దీనినే భారతీయులు స్వర్గదేవయాన మని అంటారు.ఈ పుష్కర ద్వీపంలో లోకపాలుర నగరాలునాయన్నారు.

ఆర్యులు భారతదేశము నుండి పశ్చిమముగాను, ఉత్తరముగాను మాత్రమే ఇతర దేశాలను కనుగొనలేదు.ఆ ప్రాచీన భారతీయులు దక్షిణంగాను, తూర్పుగాను కూడా వెళ్ళినారు.భారతదేశానికి దక్ష్ణంగా మహాసముద్రంలో విద్యుత్వాక్ పర్వతశ్రేణులలో అనేక ద్వీపాలు బయలుదేరినవి.ఇందలి ప్రజలు పొట్టివారు, మేఘశ్యామ వర్ణము కలవారు.ఫలపుష్పాలను తినువారు. అల్పాయువు గలవారని వాయుపురాణము చెప్పినది.ఇవి కాక బర్హణద్వీపముతో కలసిన 7 ద్వీపాలు ఇచట ఉన్నవన్నారు.బర్హణ (బోర్నియా), అంగ, యవ (జావా), మలయ, శంఖ (సయూం, కుముద (కాంబోడియా), కుశ (కూప్), వరాహ (ఆస్ట్రేలియా) ద్వీపాలిక్కడ ఉన్నాయి.అంగ ద్వీపము బాలిద్వీపము కావచ్చును.నాగజాతికి ప్రధానమైన కేంద్రము అంగ ద్వీపమని, ఇచట మ్లేఛ్చులున్నారని, చక్ర పర్వతాలిక్కడ కలవని వాయుపురాణము (48,17-18) చెప్పినది.వెండి బంగారు గనులు, గంధపుచెట్లు, మహామలయపర్వతము గల మలయ ద్వీపమున మ్లేఛ్చులు గలరని, ఇచటనే అగస్యుని ఆశ్రమము కలదని వాయు పురాణము (48,20-29), మత్స్య (163,74-78) చెప్పినవి.

ఈవిధంగా రేఖాంశలను నిఋనయించినవారు భారతీయులే అని కొందరి అభిప్రాయము. భూమిపై పలు ప్రాంతాలకు వీరు గావించిన నామములే నేటికీ ప్రసిద్ధిలో ఉన్నవందురు.ఇతూవంటి సందర్భములో ఆర్యులు భారతదేశానికి ఎక్కడనుండో వలసవచ్చినవారు కారని వారిది భారతదేశమే స్వదేశమని, వీరే ఇచట నుండి ఇతరదేశాలకు వలసవెళ్ళిరని పలువురి అభిప్రాయము.

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • అష్టాదశ పురాణములు - (18 పురాణముల సారాంశము) - రచన: బ్రహ్మశ్రీ వాడ్రేవు శేషగిరిరావు - ప్రచురణ, సోమనాథ్ పబ్లిషర్స్, రాజమండ్రి (2007)

మూలములు

[మార్చు]