Jump to content

రాజమండ్రి

అక్షాంశ రేఖాంశాలు: 16°59′N 81°47′E / 16.98°N 81.78°E / 16.98; 81.78
వికీపీడియా నుండి
(కర్రబొమ్మల సీతరామ మందిరం నుండి దారిమార్పు చెందింది)
రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం
గోదావరి పై వంతెనలు
గోదావరి పై వంతెనలు
Nickname: 
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని
రాజమహేంద్రవరం is located in ఆంధ్రప్రదేశ్
రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం
ఆంధ్రప్రదేశ్ లో రాజమహేంద్రవరం స్థానం
Coordinates: 16°59′N 81°47′E / 16.98°N 81.78°E / 16.98; 81.78
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
Founded byరాజరాజ నరేంద్రుడు
Government
 • Bodyరాజమహేంద్రవరం నగరపాలక సంస్థ (GRMC)[1]
రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (RUDA)[2]
 • శాసనసభ సభ్యుడుఆదిరెడ్డి భవాని - పట్టణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి - గ్రామీణ
 • లోక్‌సభ సభ్యుడుమార్గాని భరత్
విస్తీర్ణం
 • నగరం44.50 కి.మీ2 (17.18 చ. మై)
Elevation
14 మీ (46 అ.)
జనాభా
 (2011)[3][4]
 • నగరం3,76,333
 • Metro4,76,873
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
PIN
533 1xx
ప్రాంతీయ ఫోన్ కోడ్+91-883
వాహనాల నమోదుAP-05 (గతం)
AP-39 (2019 జనవరి 30 నుండి)[6]

రాజమహేంద్రవరం (రాజమండ్రి, రాజమహేంద్రి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక నగరం, జిల్లా కేంద్రం. ఈ నగరం తూర్పుచాళుక్య రాజైన రాజరాజనరేంద్రుని రాజధాని. గోదావరి నది పాపి కొండలు దాటిన తరువాత పోలవరం వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశించి, విస్తరించి, ఇక్కడికి కొద్ది మైళ్ళ దిగువన ఉన్న ధవళేశ్వరం దగ్గర రెండు ప్రధాన పాయలుగా చీలి డెల్టాను ఏర్పరుస్తుంది. ఇక్కడ పన్నెండేళ్ళకొకసారి గోదావరి పుష్కరాలు ఘనంగా జరుగుతాయి.

ఈ నగరం పేరు బ్రిటిష్ వారి హయాంలో రాజమండ్రిగా రూపాంతరం చెందింది. 2015 లో రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చారు.[8] ఆదికవి నన్నయ ఇక్కడివాడే కనుక ఇది సాహిత్య పరంగా ముఖ్యమైన ఊరు. కందుకూరి వీరేశలింగం ఇక్కడి వాడే కనుక ఈ ఊరు సాంఘికంగా పెద్ద పేరు సంతరించుకొంది. ఈ విధంగా సాంఘిక, చారిత్రక, వివిధ రాజ్యాల పాలనవలన ఆర్థిక, రాజకీయ ప్రాముఖ్యత కలిగిన నగరం కావున దీనిని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని అని కూడా అంటారు.[9]

చరిత్ర

[మార్చు]
రాజమండ్రి నగర సాంస్కృతిక, చారిత్రిక ప్రాధాన్యతను వివరిస్తూ నగర రైల్వేస్టేషన్లో వేసిన కుడ్యచిత్రం
రాజమండ్రి రైల్వే స్టేషను

స్థల పురాణం

[మార్చు]

శ్రీ చక్ర విలాసము అను గ్రంథములో శ్రీ చక్ర అవిర్భావం గురించిన రెండు పౌరాణిక గాథలలోని రెండవ కథ ఈ విధముగా చెప్పబడింది. ఈ కథ బ్రహ్మాండ పురాణమునకు చెందినది. భండాసురుని జయించుటకై శ్రీదేవిని ఉద్దేశించి ఇంద్రుడు మహా యజ్ఞము చేసెను. ఆ యజ్ఞమున దేవతలు తమతమ శరీరమాంసములను కోసి హోమద్రవ్యముగా నొసగిరి. దేవతల త్యాగమునకు సంతోషించిన శ్రీదేవి కోటిసూర్య సమమైన తేజముతోను, కోటిచంద్ర శీతలమయూఖములతోను ఆ హోమాగ్ని మద్యమున ప్రత్యక్షమయ్యెను. శ్రీదేవి జ్యోతీరూపమైన శ్రీచక్రమధ్యగతమై ప్రత్యక్షమైనది. (ఈ వృత్తాంతమునే లలితాసహస్రనామావళిలో 'చిదగ్నికుండ సంభూతా దేవకార్య సముద్యతా' (4,5 నామములు) అనునవి వెల్లడించుచున్నవి. ఈ వృత్తాంతసందర్బమైన యజ్ఞము నేటి గోదావరి నదీ తీరమున రాజమహేంద్రవరమున గల కోటిలింగ క్షేత్రమున జరిగినదనియూ అక్కడే శ్రీ చక్రముతో రాజరాజేశ్వరీదేవి ఉద్భవించుటచేత - ఆ ప్రదేశము రాజరాజేశ్వరీ మందిరమై - రాజమహేంద్రవరముగా మారిపోయిందని స్థలపురాణము.

చారిత్రక విషయాలు

[మార్చు]

రాజమండ్రి అమ్మరాజా విష్ణువర్ధనుడు I (919 - 934 AD)చే స్థాపించబడింది. పురావస్తు అవశేషాల లభ్యత ప్రకారం, ఈ నగరం ఒక పెద్ద నివాసప్రాంతంగా 1022 AD కాలంలో తూర్పు చాళుక్యుల వంశపు రాజైనరాజరాజ నరేంద్రుడు పరిపాలనలో వున్నట్లు తెలుస్తుంది.[10][11] 11వశతాబ్దపు రాజభవనాలు, కోటల అవశేషాలు ఇంకా ఉన్నాయి.[12]

తరువాత కాకతీయులు, తూర్పు గంగ వంశపు రాజులు, రెడ్డి రాజులు, గజపతులు, విజయనగర రాజులు, నిజాం, ఐరోపా రాజులు, జమిందారులు ఈ నగరాన్నిపాలించారు.[13]

రాజమహేంద్రపురం వర్ణించు సందర్భాలలో శ్రీనాధుడు తరుచు "రుద్రపాదములు" అన్నపదాన్ని ఉపయోగించాడు. గోదావరి పొంగినప్పుడు తీరానగల మార్కండేశ్వర, మృకండేశ్వరుల, పాదంవరకు వస్టాయి. అందుచేత దీనిని రుద్రపాద క్షేత్రంగా వర్ణించుయుండును. గోదావరికి ఆవలిఒడ్డున కొవ్వూరువద్ద గల క్షేత్రం గోపాద క్షేత్రమని, ధవళేశ్వరం వద్ద రామపాదక్షేత్రమని ప్రసిద్ధిచెందినవి. ఈ మృకండేశ్వర ఆలయం తూర్పు చాళుక్య రాజైన మొదటి చాళుక్య భీముడు సా.శ.892-922 కాలమందు నిర్మించాడు. సా.శ. 1323 సం.లో మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఓరుగల్లును జయించి రాజమహేంద్రవరంపై దాడి చేసాడు. దుర్గాన్ని స్వాధీనపరచుకొని హుమాయున్ గుజ్జార్ అను వానిని గవర్నరుగా నియమించాడు.ఆ సమయాన రాజమహేంద్రవరంలోని పురాతన దేవాలయాలఎన్నో ధ్వంసానికు గురి అయ్యాయి. వేణుగోపాలస్వామి ఆలయం పడగొట్టి హుమాయున్ గుజ్జార్ ప్రేరణచేత ప్రస్తుతం పెద్ద మార్కెట్ చెంతవున్న పెద్ద మసీదును నిర్మించాడు. ఇది సా.శ.1325లో నిర్మింపబడినట్లు మసీదు ద్వారంపై పారసీభాషలో గల శాసనంద్వారా తెలస్తుంది. ఆ సందర్భంలోనే మృకండేశ్వరాలయం కూడా ధ్వంసం అయినట్లు, అటుపై ఇక్కడ లభించిన నందివిగ్రహం పరిశీలనవల్ల తెలుస్తుంది. అటుపై సా.శ.1327లో రాజమహేంద్రనగరం రెడ్డిరాజుల స్వాధీనమయినా 15వ శతాబ్దం మధ్యకాలం వరకు ఆపురం పూర్వ వైభవాన్ని పొందలేదు. అటుపై 1561లో ప్రతాపరుద్ర గజపతిని నిర్మూలించి ఉత్కళ దేశాన్ని పాలించిన హరిచెందనదేవుడు రాజమహేంద్రనగరాన్ని స్వాధీనపరుచుకున్నాడు. సా.శ.1565లో విజయనగర సామ్‌రాజ్య సేనలకు, ముస్లిం కూటమికి మధ్య రాకాసి తంగడి యుద్ధం జరిగింది. ఈ యుద్ధ సమయంలో గోల్కొండ సుల్తాను, నిడదవోలులో గల తన సైన్యాన్ని పిలిపించుకున్నాడు. రాకాసి తంగడి విజయానంతరం రఫత్ ఖాన్ లాహరీ అను గోల్కొండ సైన్యాధిపతి దండెత్తివచ్చి రాజమహేంద్రవరం నగరాన్ని స్వాధీనపరచుకున్నాడు.[ఆధారం చూపాలి]

ఏనుగుల వీరాస్వామయ్య రచన కాశీ యాత్రా చరిత్ర కొరకు, రాజమహేంద్రవరమునకు దగ్గరలో గల వాడపల్లి అనేవూరులో బసచేశాడు.[14] జనాభా గణాంకాలు

రాజమండ్రి రైల్వే బ్రిడ్జి

2011 జనగణన ప్రకారం రాజమండ్రి నగర జనాభా 3,76,333. 2001 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 3,15,251 - పురుషులు 1,58,454 - స్త్రీలు 1,56,797

నగరంలో ముఖ్య ప్రదేశాలు

[మార్చు]
కోటిపల్లి బస్సు నిలయం వద్ద నున్న కందుకూరి వీరేశలింగం పంతులు

పాల్ చౌక్

[మార్చు]

పాల్ చౌక్ ఈ ప్రదేశం ఇప్పటి కోటిపల్లి బస్సు నిలయం ఉన్న ప్రదేశం క్రిందకు వస్తుంది. 1907 ఏప్రియల్ మాసంలో బిపిల్ చంద్ర పాల్ ఈ ప్రదేశంలోనే ఐదు రోజులు ఉపన్యాసాలు ఇచ్చాడు. ఆ సంఘటనకు గుర్తుగా ఈ ప్రదేశాన్ని పాల్ చౌక్ అని పిలుస్తారు. ఈ ప్రదేశంలో ఇప్పుడు జెట్టి టవర్స్, కోటీపల్లి బస్సు నిలయం, మూడు పార్కులు ఉన్నాయి. ఈ పార్కులలో స్వాతంత్ర్యత్య సమరయోధుల విగ్రహాలు ఉన్నాయి. ఈ ప్రదేశంలో కందుకూరి వీరేశలింగం పంతులు విగ్రహం, ఎన్.టి.రామారావు విగ్రహాలు ఉన్నాయి. 1929 మే 6 నాడు మహాత్మా గాంధీజీ పాల్ చౌక్ లో ప్రసంగించాడు.

ఇన్నీసుపేట

[మార్చు]

1865 సంవత్సరంలో అప్పటి సబ్ కలక్టర్ ఇన్నిసిన్ ద్వారా వలస స్థావరంగా ఏర్పాటు చెయ్యబడింది. ఇన్నీసుపేట సరిహద్దులు కుమారి టాకీసు నుండి రాజమహేంద్రవరం జూనియర్ కాలేజి వరకు. 1910 సంవత్సరం తరువాత నుండి ఇప్పటి వరకు ఇన్నీసుపేట సరిహద్దులు కుమారి టాకీసు నుండి వీరేశలింగం థియోలాజికల్ కళాశాల వరకు విస్తరించబడింది.

ఆల్కాట్ గార్డెన్స్

[మార్చు]

ఒకప్పుడు దివ్యజ్ఞాన సమాజ కార్యకలాపాలు, సమావేశాలు జరిగే ఈ ప్రదేశం, దివ్య సమాజ నాయకుడైన ఆల్కాట్ పేరు మీద పెట్టబడింది.

రామదాసు పేట

[మార్చు]

జానపద గాయకుడైన యెడ్ల రామదాసు పేరు మీద ఈ ప్రాంతం పిలువబడుతోంది. యెడ్ల రామదాసు తన జానపద గేయాలలో వేదాంతాన్ని, అహింసావాదాన్ని వ్యాప్తి చేశాడు. రామదాసు పేట కోరుకొండ రోడ్డు మీద టి.బి.శ్యానిటోరియం - క్వారీకి మధ్య వస్తుంది. ఈ ప్రదేశంలో ఈ గాయకుడి సమాధి కనిపిస్తుంది. ఈయన టి.బి.శ్యానిటోరియం లోనే క్షయ వ్యాధిగ్రస్తుల మధ్య నివసించేవాడు.

ఆర్యాపురం

[మార్చు]

1895 సంవత్సరంలో అప్పటి సబ్ కలక్టర్ లిస్టర్ ఈ ప్రభుత్వ స్థలాన్ని మూడు వీధులు వచ్చేటట్లు 130 ఇళ్ళ స్థలంగా విభజించాడు. తొంభై శాతం ఇక్కడ నివసించేవారు పూజారులు. ఈ ప్రదేశానికి లిస్టర్ పేట అని పేరు పెట్టబడింది, ఈ ప్రాంతంలో ఆర్యులు లేక పండితులు అయిన బ్రాహ్మణులు నివసించడంతో కాలక్రమంలో ఆర్యాపురంగా పేరు మార్చారు. 1890 సంవత్సరంలో ఆర్యాపురం రాజమహేంద్రవరం పురపాలక సంఘం పరిధిలోకి చేర్చబడింది. ఆర్యాపురంలో నున్న పాఠశాలకు పూర్వపు సబ్ కలక్టర్ పేరు గుర్తుగా లిస్ట్ర్ పేత మునిసిపల్ హైస్కులుగా నామకారణం చేశారు. 1910 సంవత్సరంలో ఆర్యాపురంలో డాక్టర్ ఏ.బి.నాగేశ్వరరావు ఆర్యాపురం గ్రంథాలయం ఏర్పాటు స్థాపించాడు. ఆర్యాపురంలో నున్న ఆ వీధీకి ఏ.బి.నాగేశ్వరరావు వీధిగా పేరు పెట్టారు. ఆర్యాపురం గ్రంథాలాయాన్ని శ్రీ రామ బాల భక్త పుస్తక భండాగారంగా పేరు మార్చి వంకాయల వారి వీధికి మార్చబడింది. 1935 సంవత్సరంలో సత్యనారాయణ స్వామి వారి దేవాలయం నిర్మించబడింది. ఇప్పటికి ఈ అర్యాపురం వాసస్థులు ఎక్కువ మంది బ్రాహ్మణులు.

సీతం పేట

[మార్చు]

కాండ్రేగుల వంశానికి చెందిన వారిచేత ఈ ప్రదేశం పండితులకు, శాస్త్రజ్ఞులకు, పూజారులకు వారి తల్లి సీతమ్మ జ్ఞాపకార్థం ఇవ్వబడింది. అందువలన ఈ ప్రదేశాన్ని సీతంపేట అని పిలుస్తారు. ఈ ప్రదేశంలో ఒక చెఱువు ఉండేది, దానిని సీతమ్మ చెఱువు అని పిలిచేవారు, ఆ చెఱువు ఇప్పటి కాలంలో ఒక ఉద్యానవనంగా మార్చబడింది. ఇచ్చట పేపర్ మిల్ కలదు అ ప్రదేశానికి పేపర్ మిల్ వారి సహకారముతో ఈ సీతం పేట అభివృద్ధి చెందుతున్నది. ఆధ్యాత్మికంగా ప్రసిద్ద చెందిన అవతార్ మెహెర్ బాబా సెంటర్ ఇక్కడనే గుమ్మిడాలవారి వీధిలో రామాలయం దగ్గర ఉంది. మెహెర్ బాబా 1953,1954 లో రాజమండ్రి సందర్శించాడు.

జాంపేట

[మార్చు]

విశాఖపట్నం జిల్లా జామి ప్రదేశములో కరువు కాటకాలు రావడంతో అక్కడ నివసించే చేనేత వృత్తిగా కలవారు ఈ ప్రదేశానికి వలస వచ్చారు. రాజమహేంద్రవరం పురపాలక సంఘం గౌవ గార్డెన్స్ అనే ప్రదేశాన్ని కొనుగోలు చేసి ఇళ్ళ స్థలాలుగా విభజించి వీరికి అమ్మింది. అందువలన ఈ ప్రదేశాన్ని జాంపేట అని పిలిచేవారు. ఇప్పటికీ వారి వారసులే ఎక్కువగా నివాసం వుంటున్నారు. కాని ఇప్పుడు ఈపేటలో ఒక్క మగ్గం కూడా లేదు. వీరంతా ఎక్కువగా వస్త్రవ్యాపారంలో స్దిరపడ్డారు. జాంపేట కూడలిలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆవిష్కరించాడు.

దానవాయిపేట

[మార్చు]

దానవాయిపేటలో మూడు ప్రధాన వీధులు ఉన్నాయి. ఇక్కడ ఉద్యానవనం కూడా ఉంది.

నాగుల చెరువు

[మార్చు]

ఇప్పటి మున్సిపల్ స్టేడియం ఉన్న ప్రదేశాన్ని నాగుల చెరువు అని పిలిచేవారు. ఒక శతాబ్ధానికి పూర్వం నాగుల అనే పేరు గల వ్యక్తి సామాన్య జనాల కొరకు ఇక్కడ ఒక చెరువు త్రవ్వించాడని ఆయన పేరు మీద ఈ ప్రదేశాన్ని నాగుల చెరువు అని పిలిచేవారు. 1955 సంవత్సరం రాజమహేంద్రవరం ఛైర్మన్ గా ఎన్నికైన క్రీడాకారుడు పోతుల వీరభద్ర రావు ఈ ప్రదేశంలో 1956 సంవత్సరంలో ఒక క్రీడాప్రాంగ్రణ నిర్మాణం జరిపించాడు. ఈ క్రీడాప్రాంగణం కేంద్ర మంత్రి సురిత్ సింగ్ మజిగ్య ఫుట్ బాల్ ఆటతో ప్రారంభించాడు. ఇప్పుడు ఈ ప్రదేశంలో ఉన్న మార్కెట్ ని నాగుల చెరువు మార్కెట్ అనిపిలుస్తారు.

రంగరాజు పేట

[మార్చు]

1870 ప్రాంతంలో ఈ ప్రదేశంలో రాజస్థాన్ మహారాష్ట్ర నుండి ప్రజలు వలస వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొన్నారు. ఈ ప్రదేశం ఇప్పటి కోట గుమ్మ వద్ద ఉంది. వలస వచ్చిన ప్రజలు అద్దకం వృత్తి, కుమ్మర వృత్తి చేసేవారు. వీరు బోంధిలి మతానికీ చెందినవారు. భారతదేశంలోనే ప్రఖ్యాతి గాంచిన రత్నం కలాలు (రత్నం పెన్నులు) పరిశ్రమ, ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది.

వీరభద్రపురం

[మార్చు]

1910 సంవత్సరంలో కంభాల చెరువు వద్ద నున్న 100 ఎకరాల స్వంత స్థలాన్ని దువ్వురి వీరభద్ర రావు అనే వ్యక్తి ఇళ్ళ స్థలాలుగా విభజించి బ్రాహ్మలకు అతి తక్కువ వెలకి, రజకులకు, విశ్వబ్రాహ్మణులకు ఉచితంగా ఇచ్చాడు. అతని జ్ఞాపకార్థం ఈ ప్రదేశాన్ని వీరభద్రపురం అని పిలుస్తారు. ఈ ప్రదేశం ఇప్పటి సుభాష్ నగర్, లలితనగర్లోకి వస్తుంది. 1930 సంవత్సరంలో ఇక్కడ నివసించే ప్రజలు రాజమహేంద్రవరం పురపాలక సంఘం పరిధిలోకి చేరడానికి నిరాకరించారు. కాని తరువాత ఈ ప్రాంతం పురపాలక సంఘం పరిధిలోకి వచ్చింది. వీరభద్ర రావు కంభాల చెరువు వద్ద ఉన్న ప్రదేశాన్ని రామకృష్ణ మిషన్కి దానం ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో రామకృష్ణ మఠం నుండి కొంత ప్రదేశాన్ని సంగ్రహించి ఆదాయక పన్ను శాఖ తమ కార్యాలయమైన ఆయకార్ భవన్ ఏర్పాటు చేసుకొన్నది. ఈ కూడలిని వివేకానంద చౌక్ అని పిలుస్తారు. ఇది కంభాల చెరువుకి ప్రక్కన వస్తుంది.

శేషయ్య మెట్ట

[మార్చు]

రాజమహేంద్రవరం జిల్లా న్యాయస్థానం వెనుక ఉన్న ప్రదేశాన్ని శేషయ్య మెట్ట అని పిలుస్తారు. రాజమహేంద్రవరం పంచ గిరులమీద ఉన్నదని శేషయ్య మెట్ట ఒక గిరి అని ఇక్కడి ప్రజలు చెబుతారు. ఈ గిరి పేరు వెనుక చరిత్రకారులలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ ప్రదేశం రాజమహేంద్రవరం పరిపాలించిన మహమదీయుడైన షేర్ షహిబ్ పేరు క్రింద వచ్చిందని కొంత మంది అంటారు. షేర్ షాహిబ్ నివాసం ఇప్పటి రాజమహేంద్రవరం పాత తపాల కార్యాలయం.

సుబ్రహ్మణ్య మైదానం

[మార్చు]

1947 ఆగస్టు 15 వ తారీఖు వరకు ఈ ప్రదేశాన్ని పోలిస్ పెరేడ్ గ్రౌండ్స్ అని పిలిచేవారు. స్వాతంత్ర్యం వచ్చాక ఆప్పటి కలెనెల్ డి.యస్.రాజు ఈ ప్రదేశాన్ని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ బ్రహమజోసుల సుబ్రహ్మణ్యం పేరుకి స్మారకంగా నామకరణం చేశాడు.

మెరక వీధీ

[మార్చు]

1565 సంవత్సరం విజయనగర సామ్రాజ్యం పతనమై పోయాక చంద్రగిరి నుండి చాలా మంది ప్రజలు ఈ ప్రదేశానికి వలస వచ్చి, ఇక్కడ తమ నివాసం ఏర్పాటు చేసుకొన్నారు. ఈ ప్రదేశంలో ఇప్పటి టౌన్ హాలు ఉంది. ఈ వలస వచ్చిన వారు, తెలగ కులమునకు చెందిన వారు. వారి ఇంటి పేర్లు కందుల, పోతుల, ముత్తంగి, కత్తుల, యర్ర, నర్ర, నీలం, కంచుమర్తి, నడీపల్లి, భయపునంద. వీరు విజయనగర సైన్యంలో సైనికులుగా పనిచేసేవారు. ఇప్పటికి ఈ వంశానికి చెందిన కుటుంబాల వార ఇళ్ళలో యుద్ధానికి ఉపయోగించిన ఆయుధాలు కనిపిస్తాయి. ఈ వంశాల ప్రధాన దైవం వేణుగోపాలస్వామి. వేణు గోపాలస్వామి ఉత్సవ ఊరేగింపుకి వచ్చినప్పుడు ఈ వీధి గుండా ఊరేగింపు జరుగుతుంది. ఈ వంశానికి చెందినవారు చాలా వరకు శ్రీవైష్ణవులు.

శ్రద్ధానంద ఘాట్

[మార్చు]

రాజమండ్రి సమాచారమ్ పత్రికా కార్యాలయం సమీపం వద్ద ఉన్న ఈ ఘాట్ 1920 సంవత్సరంలో నిర్మించారు. ఈ ఘాట్ ఢిల్లీలో ఉన్న ఆర్యసమాజ్ ప్రధానాచార్యుడు శ్రద్ధానంద పేరు మీద పెట్టబడింది. ఈ ప్రదేశంలో సుభాష్ చంద్ర బోస్ విగ్రహం ఇక్కడ ఉండేది. గోదావరికి రాజమండ్రిలో వరదలు వచ్చినప్పుడు ఈ విగ్రహం మునిగిపోతుండేది. 1991 సంవత్సరం పుష్కరాల ఏర్పాట్లలో ఈ విగ్రహాన్ని అక్కడ నుండి తొలగించారు. ఆచార్య కృపాలనీ, ప్రకాశం పంతులు, తెన్నేటి విశ్వనాధం, కళా వేంకటరావు ఈ ప్రదేశంలో ప్రజలను ఉద్దేశించి ఉపన్యసించారు.

కోట గుమ్మం

[మార్చు]
కోట గుమ్మం వద్ద నున్న మృత్యుంజయుడి విగ్రహం

కోట గుమ్మం గోదావరి రైలుస్టేషను వద్ద ఉన్న ప్రదేశం. ఇక్కడ మృత్యుంజయుడి విగ్రహం, పొట్టి శ్రీరాములు విగ్రహం ఉన్నాయి. అజంతా హోటలు ఉన్న ప్రదేశాన్ని కోట గుమ్మం అని పిలుస్తారు. ఈ కోట చాళుక్యులు 8-11 వ సతాబ్ధాలమధ్య నిర్మించబడినదని చరిత్ర ఆధారాల వల్ల తెలుస్తున్నాయి. ఈ ప్రదేశంలో ఇప్పుడు కందకం (పెద్ద కాలువ) వీధి కనిపిస్తుంది. ఇది గతంలో గోదావరి నుండి త్రవ్వబడిన ఒక పెద్ద కాలువ. ఈ కందకం శత్రువులు కోటలోకి ప్రవేశించకుండా అడ్డంగా ఈ కాలువ ఉండేది. 20 అడుగులు లోతు, 50 అడుగుల వెడల్పు ఉండేది. ఇక్కడి మార్గంలో ఏనుగులను, గుర్రాలను గోదావరి నదికి స్నానం చేయించడానికి తీసుకెళ్లేవారు. ఈ కోట గోడ రెండు వైపుల వాలుగా ఉంటుంది. 1897-1900 సంవత్సరాల మధ్యన రాజమండ్రి గోదావరి పై మీద మొదటి రైలు వంతెన (హేవలాక్ వంతెన) కట్టేటప్పుడు ఈ కోట గుమ్మాన్ని బ్రద్దలు కొట్టారని చెబుతారు. ఇక్కడ ఆర్థర్ కాటన్ కుమార్తె సమాధి ఉంది.

కంభం సత్రం, కంభాల చెరువు

[మార్చు]

చనిపోయిన వారికి శాద్ధ్రాలు జరిపే సత్రం. 1845-1850 సంవత్సరాల మధ్య కంభం నరసింగ రావు పంతులు స్వంత నిధులతో ఈ సత్ర నిర్మాణం జరిపించారు. అదేసమయంలోనే ఇక్కడ ఒక చెరువు కూడా త్రవ్వించబడింది. చెరువు త్రవ్వగా వచ్చిన మట్టితోనే ఈ సత్రానికి కావలసిన ఇటుకలు తయారుచేశారు. ఈ సత్రం శిథిలాలుగా ఉంది. ఇక్కడ ఉన్న చెరువులో నిరంతరం నీరు ఉంటుంది.

పరిపాలన

[మార్చు]

రాజమండ్రి నగర పాలక సంస్థ 50 వార్డులుగా విభజించారు. దీని పరిధి 44.50 కి.మీ2 (17.18 చ. మై.).[15]

రవాణా సౌకర్యాలు

[మార్చు]

రోడ్డు రవాణా సౌకర్యాలు

[మార్చు]
రాజమహేంద్రవరం బస్సు ప్రధాన నిలయం

చెన్నై-కలకత్తాని కలిపే జాతీయ రహదారి - 16 మీద ఈ నగరం ఉంది. నగరంలో రోడ్డు రవాణా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ద్వారా నిర్వహించబడుతోంది. అంతే కాకుండా సర్వీసు ఆటోల సదుపాయం కూడా ఉంది. నగరంలో ఆర్.టి.సి. బస్సు నిలయం, గోకవరం, కోటిపల్లి, హైటెక్ బస్సుస్టాండ్ అనబడే మొత్తం నాలుగు బస్టాండ్లు ఉన్నాయి.

రైలు సౌకర్యం

[మార్చు]
గోదావరి రైలు స్టేషను

రాజమండ్రి చెన్నై-కలకత్తా ప్రధాన రైలు మార్గములో వచ్చే ప్రధాన రైలుస్టేషను. గోదావరి మీద ఉన్న రైలు వంతెన వల్ల రాజమండ్రి భారతదేశం నలుమూలలకు కలుపబడుతోంది. రాజమండ్రిలో గోదావరి రైల్వే స్టేషను, రాజమండ్రి రైలు స్టేషను ఉన్నాయి. గోదావరి నది మీద మెదటి రైలు వంతెన (హేవలాక్‌ వంతెన) 1900 నిర్మించబడినప్పుడు గోదావరి రైలు స్టేషను నిర్మించారు. తరువాతి కాలంలో ట్రాఫిక్ ఎక్కువ అవ్వడం వల్ల రెండో రైల్వే లైను సౌలభ్యం కోసం రైలు రోడ్డు వంతెన నిర్మాణం జరిగింది. 1990-1995 సంవత్సరాల మధ్య మూడవ రైలు వంతెన నిర్మాణం జరిగింది.

విమాన సౌకర్యం

[మార్చు]

నగర శివార్లలో ఉన్న మధురపూడిలో ఉంది.

జలరవాణా సౌకర్యాలు

[మార్చు]

రైలు వంతెన, రోడ్డు వంతెన వచ్చాక జల రవాణా మీద ప్రజలు ఆధారపడడం లేదు. కాని ఇక్కడ నుండి పాపి కొండలకు, భద్రాచలం, పట్టిసీమకు లాంచీ సదుపాయం ఉంది.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

రాజమండ్రి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల విద్యా నిలయం. కందుకూరి వీరేశలింగం భారత స్వాతంత్ర్యం రాక ముందే స్త్రీలకు ప్రత్యేక కళాశాలలు ప్రారంభించాడు.

  • పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం: శాఖ రాజమండ్రిలో ఉంది. 1989 సంవత్సరంలో కూచిపూడిలోని సిద్ధేంద్ర కళాక్షేత్రం ఇందులో విలీనం చేయబడింది.
  • ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం: దీనిని 2006లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
  • కందుకూరి వీరేశ లింగం విద్యాసంస్థలు -శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా జూనియర్, డిగ్రీ, పి.జి కళాశాల, యస్.కే.వి.టి ఉన్నత ఆంగ్ల బోధనా పాఠశాల,యస్.కే.వి.టి ఉన్నత తెలుగు బోధనా పాఠశాల, యస్.కే.వి.టి జూనియర్ కళాశాల,యస్.కే.వి.టి డిగ్రీ & పి.జి కళాశాల
  • ప్రభుత్వ కళాశాల (రాజమహేంద్రవరం): ఈ కళాశాల 1857లో స్థాపించబడింది. దీనికి మొదటి ప్రిన్సిపాల్ గా "మెట్కాఫ్" అనే ఆంగ్లేయుడు పనిచేశాడు. ఈయన పేరుతోనే విద్యార్థుల వసతి గృహం (మెట్కాఫ్ హాస్టల్) ఇప్పటికీ నడుస్తున్నది. అడవి బాపిరాజు ఇక్కడ చదువుకున్నాడు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇక్కడ ఈ కళాశాలలో ముఖ్యాధ్యాపకులుగా పనిచేశాడు.
  • గోదావరి ఇనిస్టిట్యూట్ అఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (GIET): రాజమండ్రి నగరంలో ఇది మొదటి ఇంజినీరింగ్ కాలేజ్
  • రాజమహేంద్రి ఇనిస్టిట్యూట్ అఫ్ ఇంజినేరింగ్ అండ్ టెక్నాలజీ (RIET)
  • ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ కళాశాల: ఇది 2008 లో స్థాపించాబడింది
  • జి.యస్.ఎల్ వైద్య కళాశాల:
  • డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియోపతి వైద్య కళాశాల: ఇది 1940 లో స్థాపించబడింది.
  • జి.కే.యస్.యమ్ లా కళాశాల
  • డాక్టర్ అంబేద్కర్ జి.యమ్.ఆర్ పాలిటెక్నిక్ కళాశాల
  • గౌతమీ గ్రంథాలయం: గౌతమీ గ్రంథాలయం అనబడేది వాసురయ గ్రంధ్రాలయం, రత్నకవి గ్రంథాలయాల సముదాయం. వాసురయ గ్రంధ్రాలయం వాసుదేవ సుబ్బారాయడు చేత, రత్నకవి గ్రంధ్రాలయం కొక్కొండ వేంకటరత్నం చేత స్థాపించబడ్డాయి. గౌతమీ గ్రంథాలయం పేరు 1898లో ఇవ్వబడింది, 1920 సంవత్సరంలో పేరు రిజిష్టరు చేయబడింది.

సి.టి.ఆర్.ఐ

[మార్చు]

సెంట్రల్ టొబాకో రీసర్చ్ ఇన్సిట్యూట్ (CTRI): ఇక్కడ పొగాకు, ఇతర అన్ని రకముల మొక్కలకు సంబంధించిన ప్రయోగములు జరుపుతారు. దీనిని 1947లో స్థాపించారు. పొగాకు సాగు విధానము మొట్టమొదట 1605 వ సంవత్సరములో పోర్ఛుగీసు దేశమునుండి మన దేశానికి వ్యాపించింది.

పరిశ్రమలు

[మార్చు]
  • ఏ.పి.పేపర్ మిల్స్: కాగితంపరిశ్రమల
  • విజ్జేశ్వరం సహజవాయువుతో విద్యుత్తు తయారు చేసే కేంద్రము.
  • ఓ.ఎన్.జి.సి (చమురు, సహజ వాయివు సంస్థ) (Navaratna) వారి కృష్ణ-గోదావరి బేసిన్ ప్రాజెక్టు కార్యాలయాలు రాజమండ్రిలో ఉన్నాయి.
  • కోస్టల్ పేపర్ మిల్స్
  • సథరన్ డ్రగ్స్ అండ్ ఫార్మసూటికల్స్ లిమిటెడ్ అనే మందుల కంపెనీ
  • హారిక్ల్స్ ఫ్యాక్టరీ స్మిత్ క్లైన్ బీచ్‌హమ్‌ కన్సుమర్ హెల్త్ కేర్ లిమిటెడ్ వారి హారిక్స్ల్ ఫ్యాకటరీ ధవళేశ్వరం వెళ్ళే మార్గములో ఉంది.
  • కడియం పేపరు మిల్లు - కడియం
  • పూల మార్కేట్, మొక్కల నర్సరీలు - కడియపులంక
  • జి.వి.కే. ఇండస్ట్రీస్, జేగురుపాడు విద్యుత్తు కేంద్రము - జేగురుపాడు
  • రాజమండ్రి కో.ఆఫ్. స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్- లాలాచెరువు
  • సర్వరాయ సుగర్స్ ప్రైవేటు లిమిటెడ్, (కోకొ కోలా బాట్లింగ్ లిమిటెడ్)-వేమగిరి
  • నైలోఫిల్స్ ఇండియా లిమిటెడ్ - గుండువారి వీధిలో ఆఫీసు. కర్మాగారము - ధవళేశ్వరం
  • గోదావరి సిరమిక్స్ - పిడింగొయ్యి
  • రత్నం బాల్ పెన్ వర్క్స్

ప్రసార మాధ్యమాలు

[మార్చు]

93.5 MHz (రెడ్.ఎఫ్.ఎమ్) రాజమండ్రిలో గల ఎఫ్.ఎమ్.స్టేషను.

సంస్కృతి

[మార్చు]

చలనచిత్ర రంగం

[మార్చు]

దుర్గా సినీటౌన్, దక్షిణ భారతదేశం లోని మొట్టమొదటి సినిమా స్టూడియో, ఈ స్టూడియో 1936లొ నిడమర్తి సూరయ్య స్థాపించాడు.

రాజమహేంద్రవరం నగరంలో సుమారు 14 సినిమా హాల్స్ కలవు

చిత్రకళ

[మార్చు]

ఇక్కడ చిత్రలేఖనంలో ప్రపంచ ఖ్యాతి పొందిన దామోర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ ఉంది. ఇక్కడ దామోర్ల రామారావు గారి చిత్రాల్లో ముఖ్యమైన కృష్ణ లీల, తూర్పు కనుమల గోదావరీ, కథియవార్, గౌతమ బుద్ధుడు పై సిధ్ధార్ద రాగొద్యం, కాకతీయుల పై నంది పూజ చిత్రాలు భద్రపరిచారు.[16]

గోదావరి పుష్కరాలు

[మార్చు]

పుష్కరము బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరాలు జరుపుకోవలసిందిగా పుష్కర శాస్త్రంలో వివరణ ఉంది. పుష్కర సమయంలో భూమండలంలోని సమస్త తీర్థాలే గాక, ఇతర లోకాల్లోని పవిత్ర తీర్థాలన్నీ గోదావరి నదిలో కలసి వుంటాయని ప్రగాఢమైన విశ్వాసం. ఈ పవిత్ర సమయంలో గోదావరి సమీపానికి త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు, సప్తరుషులు, పితృదేవతలు, సర్వదేవతలూ ఒక పర్వకాలం దాటేవరకు అక్కడే నివాసాలు ఏర్పరచుకుంటారని ఐతిహ్యం.

అంటే ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. రాజమహేంద్రవరంలో గత పుష్కరాలు 2015లో జరిగాయి.[17] దీని కోసం నిర్మించిన కోటి లింగాల ఘాట్ ముఖ్యమైనది.[18]

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]
రాజమండ్రి రైల్వేస్టేషను భవనంపై గోదావరి మాత విగ్రహం
రాజమండ్రిలో గోదావరి నది ఒడ్డున వివిధ ఘాట్లు

గోదావరి నిత్య హారతి

[మార్చు]

నగరంలో ప్రతి రోజూ గోదావరికి నిత్యా హారతి ఇస్తారు. సంవత్సరానికి ఒకసారి కార్తిక పున్నమి రోజున నగర జనుల మధ్య ఎంతో ఘనంగా గోదావరి మాతకు వేద పండితులు హారతి ఇస్తారు. అలానే కోటగుమ్మం లోని మహా శివుని విగ్రహం వద్ద ప్రతి మాస శివరాత్రికి మహా కుంభ హారతి నిర్వహిస్తారు.

కాటన్ మ్యూజియం, ఆనకట్ట

[మార్చు]

ఇది రాజమండ్రి నగరంలోని ధవళేశ్వరం ప్రాంతంలో ఉంది. బ్రిటష్ ఇంజినీర్ సర్ ఆర్ధర్ థామస్ కాటన్ గోదావరి నదిపై ఇక్కడ ఆనకట్టను నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసాడు. అతని గుర్తుగా నగరంలో ఆయన బస చేసిన ఇంటిని మ్యూజియంగా 1998 లో మార్చారు.

రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియం

[మార్చు]

ఇక్కడ పూర్వకాలంలో రాజులు, బ్రిటిష్ వారు ఉపయోగించిన వస్తువులు చూడవచ్చు.

ఆర్యభట్ట సైన్సు మ్యూజియం

[మార్చు]

ఈ ఆర్యభట్ట సైన్సు మ్యూజియం నగరంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంది. నగరానికి చెందిన విశ్రాంత ఉద్యోగియైన పెద్దింటి సత్యనారాయణ మూర్తి విద్యార్ధులలో సైన్సు పట్ల అవగాహన కొరకు వారి ఇంటినే మ్యూజియంగా ఏర్పాటుచేసారు. దేశం నలుమూలల నుంచి సేకరించిన సైన్సుకి సంబంధించిన వస్తువులున్నాయి.

రాజమండ్రి కేంద్ర కారాగారం

[మార్చు]

డచ్ వారి పరిపాలనలో ఆయుధాలు, తుపాకులు భద్రపరచుకొనటానికి మూడు నిల్వ గదులు ఏర్పాటు చేశారు. ఈ గదులపైన ఒక రంధ్రం ఉన్నది, అవసరం పడి నప్పుడు ఆ రంధ్రం గుండా కావలసిన ఆయుధాలు తీసుకొనేవారు. ఈ గదులు కొలతలు 10 అడుగులు ఎత్తు 10 అడుగుల వెడల్పు 10 అడుగుల పొడవు ఉంటాయి. వీటిలో ఒక గది రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నది, రెండవది మునిసిపల్ ఆఫీస్ పశ్చిమ గేటుకి ఎదురుగా ఉన్నది, ముడవది పాత సబ్ కల్టకర్ ఆఫీసు వెనుక అప్సర హోటలు దగ్గర ఉంది. 1857 సంవత్సరంలో ప్రథమ స్వాతంత్ర్య సమరం జరిగాక రాజమండ్రి డచ్ వారి చేతుల నుండి ఆంగ్లేయులకు హస్తగతం అయ్యింది, అప్పుడు ఆంగ్లేయులు ఈ కోటను కారాగారంగా మార్చారు. ఈ కారాగారంలో ఒక పెద్ద దేవాలయం ఉండేదని డి.ఐ.జి. కార్యాలయంలో ఉన్న శిలా ఫలకం చెబుతుంది. ఇంకో ఆకర్షణ ఈ జైలులో గజలక్ష్మి (లక్ష్మి దేవి విగ్రహం లక్ష్మి దేవికి ఇరుప్రక్కల రెండు ఏనుగులు ఉన్నాయి) విగ్రహం కనిపిస్తుంది, ఇది గజపతుల రాజ చిహ్నం. గోదావరి నది నుండి ప్రవాహించే ఒక నది పాయ ఈ జైలులో ప్రవహించేది, కాని ఆ పాయ మార్గం ఇప్పుడు మారి పోయింది. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు ఈ జైలులో ఆంగ్లేయుల చేత ఖైదు చేయబడినారు. 1847 సంవత్సరము నుండి ఈ కారాగారానికి సెంట్రల్ జైల్ స్థాయి కల్పించబడింది. ఇది 35 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ జైలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పురాతనమైన,అన్ని రకాల సురక్షిత వ్యవస్థలు కలిగిన జైలు. 1991 సంవత్సరం జైలు కార్యాలయం అందించిన ఆధారాల ప్రకారం ఈ జైలులో 581 మంది జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, 355 స్వల్ప కాలం జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఉండేవారు.

కంభాల చెఱువు నుండి తిన్నగా వై-జంక్షన్ వైపు వెళ్ళితే రాజమండ్రి ప్రభుత్వ కళాశాల (ఆర్ట్స్ కాలేజి) ఎదురుగా 100 మీటర్ల దూరంలో కేంద్ర కారాగారం (సెంట్రల్ జైలు) చేరుకోవచ్చు.

ఆలయాలు

[మార్చు]

శ్యామలాంబ (సోమలమ్మ తల్లి ) దేవాలయం

[మార్చు]

ఈ అమ్మవారిని రాజమహేంద్రవరం నగర దేవతగా పిలుస్తారు. కాని అమ్మ వారి ఆలయం రాజ రాజ నరేంద్రుని కాలం నుంచి వుందనీ, వారు శ్రీ అమ్మవారిని కొలిచేవారని కొంతమంది పెద్దలు చెబుతారు. పెద్దల కథనం మేరకు అమ్మవారు చిన్న వయసులో తోటి పిల్లలతో ఆడుకుంటూ ఏడు పెంకులు కోసం అని బయలుదేరి ప్రస్తుతం ఆర్.టి.సి బస్సు కాంప్లెక్సు దగ్గర ఉన్న ప్రదేశంలో అమ్మవారిగా అవతరించారని అక్కడే ఆమె నేను సోమ్మలమ్మను రాజమహేంద్రవరం నగర దేవతను అని ప్రకటించారని పెద్దలు చెబుతుంటారు. అలా దేవతగా మారిన అమ్మవారు ప్రతి ఏట ఉగాది పర్వదినం సందర్భంలో నన్ను నగరంలోకి తీసుకువెళ్ళి జాతర చెయ్యాలి అని వారి భక్తులను ఆదేశించిందంట. ఆ తల్లి కోరిన విధం గానే నేడు ప్రతీ ఏట ఇక్కడ అమ్మ వారి జాతర అంగ రంగ వైభవంగా జరుగుతుంది. ఈ జాతర జరిగే తీరు హిందూ కుటుంబంలో ఆడ పిల్లకు గల ప్రాముఖ్యం, అక్క చెళ్ళెల మధ్య వుండే అనుబంధం అందరికి స్ఫూర్తి కలిగిస్తుంది. అది ఎలా అంటే ఒకసారి జాతర జరిగే తీరును తెలుసుకుందాం అమ్మవారి పుట్టినిల్లుగా పిలువబడే శ్యామల నగర్ (కొత్త పేట) లోని ఆలయంలో నుంచి అమ్మవారి కుటుంబంకి చెందిన వ్యక్తి అమ్మవారిని పుట్టింటికి పిలిచేందుకు కావిడితో చీర,ముర్రట (పసుపు నీరు )వేపాకులు ఇంకా ఇతర సారె వస్తువులు తీసుకొని రోడ్డు మర్గాన రాజమహేంద్రవరం నగర వీదులలో నుంచి వెళ్తారు ఈ మార్గ మధ్యంలో ప్రజలు ఆ కావిడి తీసుకొని వెళ్ళే వ్యక్తికి కాళ్ళు కడిగి అమ్మ వారిని నగరంలో తీసుకొని రావాలని ప్రార్థిస్తారు. ఈ సమయంలో పాత సోమాలమ్మ ఆలయం వద్ద జాతర మొదలవుతుంది. ఈ వ్యక్తి ఆ ఆలయంకి వెళ్లి అమ్మవారిని పిలిచి జాతరగా అమ్మను తీసుకొని నగరం లోకి ప్రవేశిస్తారు.ఈ దారిపొడవునా ప్రజలు అమ్మవారికి వేపాకులు ముర్రట డప్పులతో స్వాగతం పలుకుతారు అలా అమ్మవారు అత్త వారి ఇంటినుంచి పుట్టింటికి వస్తారు. అప్పుడు పుట్టింటి వద్ద జాతర అంగరంగ వైభవంగా మొదలవుతుంది. అమ్మవారు నగరంలో ఉండే ఒక్కో రోజు అమ్మవారి చెల్లెళ్ళుగా పిలిచే గొల్లమారమ్మతల్లి,ముత్యాలమ్మ తల్లి, గంటాలమ్మతల్లి, పున్తలమ్మ తల్లి, గంగలమ్మ తల్లి మొదలగు అమ్మవారులు ఊరేగింపుగా జాతరతో ఈ ఆలయం వద్దకు వచ్చి అమ్మ వారిని కలుసుకుంటారు చూసారా ఎంత ఆప్యాయత ఈ జాతర ప్రతి ఒక్కరికి ఆదర్శం. అలా అందరు అమ్మవారులు పల్కరించాక చివరగా సోమాలమ్మ అమ్మవారి జాతర అంగ రంగ వైభవంగా జరుగుతుంది. అలా ఈ జాతర చివరి రోజు అమ్మవారు భక్తులను ఆశీర్వదిస్తూ అత్త వారి ఇంటికి వెళ్తారు. ఈ విధంగా జాతర ముగుస్తుంది.

శ్రీ వేణుగోపాలస్వామి గుడి

[మార్చు]

శ్రీ వేణుగోపాలస్వామి రాజమహేన్ద్రి క్షేత్ర పాలకుడు. ఈ గుడి రాజమండ్రి ముఖ్య వీధిలోని ఇప్పటి "పెద్దమసీదు" స్థానములో ఉండేది. 1323 సంవత్సరములో నూర్ హసన్ (మహమ్మద్ద్ బీన్ తుక్లక్) వేణుగోపాలస్వామి గుడిని మసీదుగా (రాయల్ మాస్క్) మార్చెను. అప్పుడు గుడి పూజారులు కంభం వారి సత్రం వీధిలోని ఒక సందులో వేణుగోపాలస్వామి విగ్రహాన్ని దాచి పూజించేవారు. 14 వ శతాబ్దంలో రెడ్దిరాజులు దేవాలయం నిర్మించి అనపర్తి గ్రామన్ని గుడికి దానం చేసారు. నగర ముఖ్య వీధిలోని రాయల్ మసీదుకు, అప్పటి గుడియొక్క ముఖద్వారం, ద్వారం పైన పద్మం, గుడిలోని 12 దేవాలయ స్తంభాలు, సరోవరం, రాతి కట్టడంతో చదరపాకారములో దిగుడు బావి ఇంకాను అలాగే ఉన్నాయి.

శ్రీ ఉమా మార్కండేశ్వరస్వామి ఆలయం

శ్రీ ఉమా మార్కండేశ్వరస్వామి గుడి

[మార్చు]

మృకండ మహర్షి ఆయన భార్య మరుద్వతికి సంతానం లేకపోవడం చేత శివుడి గురించి తపస్సు చేసి 16 ఏళ్ళు ఆయుష్షు కల సంతానం పొందుతారు. ఆ పిల్లవాడి పేరు మార్కండేయుడు. నారద మహర్షి సూచన మేరపు మార్కండేయుడు గౌతమీ (గోదావరి) తీరంలో శివ లింగాన్ని ప్రతిష్ఠ చేసుకొని తపస్సు చేస్తాడు. ఇతిహాసం ప్రకారం ఇక్కడే శివుడు మార్కండేయుడిని యముడి బారి నుండి కాపాడి చిరంజీవత్వం ఇచ్చాడు. మార్కండేయుడే శివ లింగాన్ని అమ్మవారిని ప్రతిష్ఠించడం వల్ల ఇక్కడ స్వామి వారిని శ్రీ ఉమా మార్కండేశ్వరస్వామి అని పిలుస్తారు. శాసనాల ఆధారంగా రాజరాజ నరేంద్రుడు, చోళరాజులు, రెడ్డి రాజులు ఆలయ నిర్వహణ జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఆలయం దాదాపు 200 సంవత్సరాల పూర్వం 1000 చదరపు గజలలో నిర్మితమైంది. ప్రస్తుతం ఈ దేవాలయ నిర్వహణా బాధ్యతలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దేవాలయ ధర్మదాయ శాఖ గ్రేడ్-I కార్యనిర్వహణాధికారి ద్వారా చేబట్టుతోంది. ఈ దేవాలయం గోదావరి బండ్ మీద ఉంది. ఈ దేవాలయం ఉన్న ప్రదేశం దగ్గరలో చంద సత్రం శిథిలమైన మసీదు ఉండేది. శిథిలమైన మసీదుని పురావస్తు శాఖ వారు పరిశోధించి ఇక్కడ ఒక శివుని దేవాలయం ఉండేదని నిర్ధారణ జరిపారు. 1818 సంవత్సరంలో గుండు శోభనాధీశ్వర రావు అనే వ్యక్తి ఈ శివాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం ఉన్న వీధిని గుండు వారి వీధీ అని పిలుస్తారు. ఆలయానికి ప్రధాన ద్వారం గుండు వారి మీద నుండి ఉంది. అంతే కాకుండా తరువాతి కాలంలో గోదావరి బండ్ మీద నుండి ఒక ద్వారం ఏర్పాటు చేశారు. ఇప్పుడు గుండు వారి వీధిలో ఉన్న ద్వారాన్ని రెండో పక్షంగా వాడుతూ ప్రధాన ద్వారం గోదావరి బండ్ మీద ఉన్నదాని క్రింద వాడుతున్నారు. నగరంలో ఇప్పుడు ఉన్న వైశ్య హాస్టలు గుండు శోభనాధీశ్వర రావు ఒకప్పటి నివాసం.

సారంగధీశ్వర దేవాలయం, సారంగధర మెట్ట

శ్రీ సారంగధీశ్వర స్వామి గుడి

[మార్చు]

సారంగధీశ్వర దేవాలయం రాజమండ్రి నగరం నుండి కోరుకొండ వైపు వెళ్ళే కోరుకొండ రోడ్డు వెళ్తేవచ్చే సారంగధార మెట్టా పై నున్నది. తూర్పు చాళుక్య రాజైన రాజ రాజ నరేంద్రుడు రాజమండ్రిని రాజధానిగా చేసుకొని వేంగి సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తుండేవాడు. రాజరాజనరేంద్రుడినికి సారంగధరుడు అనే కుమారుడు, చిత్రాంగి అనే రెండవ భార్య ఉండేది. రాజరాజ నరేంద్రుడి సవతి తల్లి కుమారుడు విజయాదిత్యుడు రాజ రాజ నరేంద్రుడికి పక్కలో బల్లం వలే ఉండేవాడు. ఒకరోజు చిత్రాంగి సారంగధారుడిని విందుకు ఆహ్వానించింది, వేట పై ఆసక్తి ఉన్న సారంగధరుడు విందుకు రాకుండా వేటకు వెళ్తాడు. ఆ విషయాన్ని చారుల ద్వారా తెలుసుకొన్న విజయాదిత్యుడు చిత్రాంగి - సారంగధారుడికి అక్రమ సంభంధం ఉన్నదని రాజారాజ నరేంద్రుడి చెబుతాడు. విషయా విషయాలు పరిశీలించకుండా రాజరాజ నరేంద్రుడు సారంగధారుడి రెండు చేతులు, రెండు కాళ్ళు ఖండించాలని శిక్ష వేస్తాడు. సేవకులు రాజాజ్ఞ పరిపాలించి సారంగధారుడిని నగరానికి ఉత్తర దిశలో అడవులతో నిండిన ఒక ఎత్తైన పర్వతం మీద రెండు చేతులు రెండు కాళ్ళు ఖండించి పాడవేస్తారు. సారంగధారుడు రెండు చేతులు కాళ్ళ నుండి నెత్తురు పారుతూ ఉండగా సారంగధారుడు గట్టిగా అరుస్తాడు. అప్పుడు సారంగ ధారుడికి ఆకాశవాణి ద్వారా పూర్వ జన్మలో చేసిన పాపం వల్ల ఈ శిక్షని అనుభవించవలసి వచ్చిందని, ఈ జన్మలో పాపం ఏమి చెయ్యలేదని చెబుతుంది. ఆ ఆర్త నాధం విన్న మేఘనాధ అనే శివ భక్తుడు అక్కడకు వచ్చి సారంగధారుడికి సపర్యలు చేసి, శివుడిని ప్రార్థించమని సలహా చెబుతాడు. సారంగధారుడు మేఘనాధుడి సూచన ప్రకారం శివుడి ఆరాధిస్తే శివుడు ఆ ప్రార్థనతో సంతృప్తి చెంది సారంగధారుడికి తన పూర్వపు చేతులు, కాళ్ళు, మంచి అందమయిన శరీరాన్ని ప్రసాదిస్తాడు. సారంగధరుడు శివుడి అనుగ్రహంతో పునర్జన్మ పొందిన ప్రదేశం కాబట్టి ఈ ప్రదేశం పేరే సారంగధర మెట్ట, ఈ దేవాలయంలో నున్న దేవుడు సారంగధేశ్వరుడు.

రాజమండ్రి మహాకాళేశ్వరాలయం

శ్రీ మహాకాళేశ్వరాలయం

[మార్చు]

రాజమండ్రి గోదావరి చెంత 2022లో దక్షిణ భారతదేశంలోనే తొలి మహాకాళేశ్వరాలయం కొలువుదీరింది.[19] దక్షిణాది రాష్ట్రాల నుంచి రాజమహేంద్రవరం వచ్చే భక్తులు ఇక్కడికి వచ్చి రెండో ఉజ్జయినగా పేరు గాంచిన ఈ ఆలయంని దర్శనం చేసుకోగలరు. ఈ మహాకాళేశ్వరుడి ఆలయ నిర్మాణ కర్త శ్రీ పట్టపగలు వెంకట్రావు. ఈ మహాకాళేశ్వర ఆలయంలో 64 ఉప ఆలయాలు, నాలుగు రాజగోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క రాజగోపురం 75 అడుగుల ఎత్తు కలిగి ఉండగా, నాలుగు వైపులా భారీ నందీలు, 50 అడుగుల ఎత్తుతో నాలుగు మహామండపాలున్నాయి.[20] ఉజ్జయిని దేవాలయంలా భస్మాభిషేకానికి ప్రసిద్ధిచెందగా, ఆ ఆలయంలాగా ఇక్కడ ఆడావారికి ఎటువంటి నిషేధం లేదు.

ఇతర ఆలయాలు

[మార్చు]
ఉమా రామ కోటిలింగేశ్వర స్వామి ఆలయం
  • దత్త ముక్తి క్షేత్రం :ఈ క్షేత్రం గోదావరి నదీ తీరంలో గౌతమీ ఘాట్ లో ఉంది.
  • ఉమా రామ కోటిలింగేశ్వర స్వామి ఆలయం: ఈ ఆలయ చరిత్ర పరకారం బ్రమ్మ దేవుడు మహా సరస్వతి సమేతుడై ఇక్కడ కోటిలిగాలకు పూజించారని ఆ కోటి లింగములలోని బ్రమ్మ సరస్వతుల చే పూజించబడిన లింగాకరమే స్వామివారని అంటారు అలాగే ఈ స్వామివారిని అరణ్య వాసము సమయంలో శ్రీ సీతా రాములు పూజించారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అందుకు గుర్తుగా ఇక్కడ శ్రీ అన్న పూర్ణ సమేత కోటిలింగేశ్వర స్వామి వారితో పాటు శ్రీ సీతా రాముల దేవాలయం కుడా ఉంది.
  • సత్యనారాయణ స్వామి ఆలయం, ఆర్యాపురం: ఇక్కడ అన్నవరం దేవస్థానం వలె అనేక పెళ్ళిళ్ళు జరుగుతాయి ఈ మధ్య ఈ ఆలయం చాల ప్రాచుర్యం పొందింది. ప్రతి ఏట భక్తులు పెరుగుతున్నారు ఆదాయం కుడా రికార్డు స్థాయిలో నమోదు అవుతుంది .

ఇతరాలు

[మార్చు]
రాజమండ్రి నగరంలోని కోటిపల్లి బస్టాండ్ వద్ద గల ఆలయ నృత్యక్షేత్రంలోని ఆలయ నృత్య విగ్రహాల స్తూపం
  • నృత్య ఆలయం, కోటిపల్లి బస్సు స్టాండ్: భారత నృత్య రీతులను వివరించే అద్భుత శిల్ప కలలతో చాల అందంగా వుంటుంది.
  • స్వాతంత్ర్య సమరయోధుల పార్క్
  • సైనికుల పార్క్, లాలా చెరువు: ఈ పార్క్ కార్గిల్ యుద్ధం లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరుల స్మరనర్దం నిర్మించారు ఇది లాలాచెరువు నేషనల్ హైవే 16. పై ఉంది.

ప్రముఖులు

[మార్చు]
  • గంధం సీతారామాంజనేయులు: గుంటూరు జిల్లాలో పెదనందిపాడు సమీపంలో పుసులగ్రామం లోని స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబం నేపథ్యంగల ఇతను ఉద్యోగరీత్యా ధవళేశ్వరం, దుమ్ముగూడెం ప్రాంతాల్లో పనిచేసి ఖద్దరు గుమాస్తాగా పనిచేశాడు. అనంతరం క్రొవ్విడి లింగరాజుగా గోదావరి పత్రికలో ఎకౌంటెంట్ గా చేరి ఆ పత్రిక మూసివేతతో ఆ రంగం పట్ల అనురక్తి కలిగి 1956లో రాజమండ్రి సమాచారమ్ పేరిట స్థానిక దినపత్రికను స్థాపించి 1987లో మరణించేవరకు సంపాదకునిగా పట్టణ సమస్యలను ప్రస్పుటంగా అధికారులు దృష్టిలో పెట్టటానికి కృషి చేశారు. భారతదేశ చిన్నపత్రికలలో అసమాన ఖ్యాతిని సాధించిన తొలి స్థానిక పత్రికగా 'ఫెడరేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఇన్ ఇండియా' వారి ప్రశంసలు అందుకుంది. భారత ప్రధాని రాజీవ్ గాంధీ చేతులు మీదుగా వారి తదనంతరం మరణాంతరం పురస్కారం పత్రికా సంపాదక బాధ్యతలు చేపట్టిన వారి తనయుడు గంధం నాగ సుబ్రహ్మణ్యం అందుకున్నాడు. మూడు దశాబ్దాల పాటు గోదావరి గట్టు శ్రద్ధానంద ఘాట్ సమీపంలో మైదవోలు వారి వీధిలో సమాచారం తన ప్రస్థానాన్ని కొనసాగించినందున నగరానికే ప్రతిష్ఠాత్మకంగా భావించే గోదావరి గట్టును " గంధం సీతారామాంజనేయులు ఘాట్"గా కౌన్సిల్ తీర్మానాన్ని 1988లో చేసారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చిన్న పత్రికలకు ఇచ్చే మద్దూరి అన్నపూర్ణయ్య పురస్కారం అందించింది. ఇక స్థానిక సేవా సంస్థలు సమాచారమ్ పత్రిక ప్రతిభాపాటవాలను ప్రశంసించి సీతారామాంజనేయులు కృషిని గుర్తించి అవార్డులను ప్రదానం చేశాయి. ఇక నగరానికి ఏ ప్రముఖ వ్యక్తి వచ్చినా సమాచారమ్ కార్యాలయం సందర్శించేవారు.
  • ఈశ్వర వరాహ నరశింహం: ఇతను అనువాద సాహిత్య రచనలు 26వ ఏట ప్రారంభించి 69 ఏళ్ల వయస్సు వరకు తన వైద్య వృత్తికి లోపం రాకుండా సంవత్సరానకొక పుస్తకం చొప్పున సాగించాడు. ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముణ్డక, మాండ్యూక, తైతిరేయ, ఐతరేయ, ఛాంద్యోగ్య, బృహదారణ్య, శ్వేతాశ్వేతరోపనిషత్, మనస్మృతి, వేదాంత దర్శనము, అదవైతవాదము, నిఘంటు సహిత నిరుక్తము, మఱియు ఇతరులను వైదిక గ్రంథములను ఆంధ్రీకరించాడు. ఇవి కాక సంస్కృతము అతి సులభంగా పద్ధతిలో నేర్చుకునుటకు వీలుకల్పించు "సంస్కృత పాఠమాల" అను సంస్కృత భాషాబోధినిని స్వీయరచన గావించాడు.
  • దృశ్యమాలిక

    [మార్చు]

    మూలాలు

    [మార్చు]
    1. "Rajamahendravaram municipal corporation". Archived from the original on 2020-11-24. Retrieved 2022-07-09.
    2. "Greater Rajamahendravaram Municipal Corporation (GRMC)". 14 January 2020 – via www.thehansindia.com.
    3. 3.0 3.1 "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 17 జూలై 2019. Retrieved 23 June 2016.
    4. "Census of India: Search Details". Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 23 May 2017.
    5. "Agglomerations and Cities". citypopulation.de.
    6. "New 'AP 39' code to register vehicles in Andhra Pradesh launched". The New Indian Express. Vijayawada. 31 January 2019. Archived from the original on 28 జూలై 2019. Retrieved 9 June 2019.
    7. "Municipality Profile". Rajahmahendravaram Municipal Corporation (in ఇంగ్లీష్). Archived from the original on 21 June 2017. Retrieved 14 May 2017.
    8. Staff Reporter (2015-10-17). "Rajahmundry is now 'Rajamahendravaram'". The Hindu. ISSN 0971-751X. Retrieved 2020-07-26.
    9. "Introductory". Rajahmundry Municipal Corporation. Archived from the original on 2014-09-04. Retrieved 3 September 2014.
    10. "19th century coins unearthed from an Andhra Pradesh temple". NDTV.com.
    11. "Rajahmundry to get back it's [sic] original name". Archived from the original on 2015-12-15. Retrieved 2022-07-10.
    12. "All eyes on Rajahmundry central jail land". News18. 5 July 2011.
    13. "1000+ Years History (Since 919 AD)". History of Rajahmundry. Rajahmundry.net. Archived from the original on 14 October 2008. Retrieved 22 October 2008.
    14. ఏనుగుల, వీరాస్వామయ్య (1941). కాశీ యాత్రా చరిత్ర.
    15. "District Census Handbook – East Godavari" (PDF). Census of India. p. 3,16–17. Retrieved 6 November 2015.
    16. "Damerla Rama Rao Art Gallery: a picture of neglect". The Hindu. 11 August 2015. Retrieved 2 July 2016.
    17. "Godavari Pushkaralu 2". godavaripushkaralu.co.in. Archived from the original on 2016-05-20. Retrieved 2 July 2016.
    18. "Iconic Kotilingala Ghat loses its sheen". The Hindu. 26 February 2016. Retrieved 2 July 2016.
    19. "రెండో ఉజ్జయిని.. రాజమహేంద్రవరం". Sakshi. 2022-05-01. Retrieved 2023-09-10.
    20. "Women too to take part in Bhasma Abhishekam in newly-built Sri Mahakaleshwar temple in Andhra". The New Indian Express. Retrieved 2023-09-10.

    వెలుపలి లంకెలు

    [మార్చు]
    Wikisource
    Wikisource
    తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: