Jump to content

ఈశావాస్యోపనిషత్తు

వికీపీడియా నుండి
(ఈశావాస్య ఉపనిషత్తు నుండి దారిమార్పు చెందింది)
ఈశావాస్యోపనిషిత్తులో శ్లోకాల ప్రతి

"ఈశావాస్యమిదగ్గ్ సర్వం" అనే మంత్రముతో ఈ ఉపనిషత్తు ప్రారంభం అవుతుంది. అందువలన దీనికి ఈశావాస్య ఉపనిషత్తు అనే పేరు వచ్చింది. ఇందులో 18 మంత్రాలు ఉన్నాయి. మిగిలిన ఉపనిషత్తుల లాగా కాకుండా ఇది మంత్రభాగంలో చేరినది.[1] యజుర్వేదం యొక్క శుక్లయజుర్వేద విభాములో వాజసనేయసంహిత ఉంది. ఇందులో 40 అధ్యాయాలు ఉన్నాయి. ఈ ఉపనిషత్తు 40వ అధ్యాయము. "తత్యన్ అధర్వణుడు" అనే మహర్షి తన కుమారునికి ఉపదేశించిన ఉపనిషత్తు ఇది. ఈ ఉపనిషత్తులో పేర్కొనబడ్డ విద్య లేక భగవంతుని సాక్షాత్కరించుకొనే సాధనను "ఈశ విద్య" అంటారు.

ఈశావాస్య ఉపనిషత్తు క్రింది శాంతి మంత్రముతో ప్రారంభము అవుతుంది.


ఓం పూర్ణమదః పూర్ణిమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే
ఓం శాంతిః శాంతిః శాంతిః


దేవుడు పరిపూర్ణుడు. ఇది (ఈ ప్రపంచం) పరిపూర్ణమైనది. పరిపూర్ణమైన భగవంతుడి నుండే పరిపూర్ణమైన ప్రపంచం పుట్టింది. పరిపూర్ణం నుండి పరిపూర్ణాన్ని తీసివేసిన తర్వాత కూడా పరిపూర్ణతే మిగిలి ఉంది.

వివరణ: పరిపూర్ణం నుండి పరిపూర్ణం ఎలాపుడుతుంది? తీసివేసిన తర్వాత కూడా పరిపూర్ణమే ఎలా మిగులుతుంది? అనే అనుమానాలు మనకు వస్తాయి. కొన్ని ఉదాహరణల ద్వారా దీనిని చూడవచ్చు. ఒక దీపం నుండి ఎన్ని దీపాలను వెలిగించినా మొదటి దీపము అలాగే మిగతా దీపాలు కూడా సంపూర్ణప్రకాశమే కలిగి ఉంటాయి. అలానే విద్యాదానం విషయం కూడా చెప్పుకోవచ్చు. ఇలానే భగవంతుని పరిపూర్ణతకు కూడా తీసివేయడం వలనో లేక ఇవ్వడం వలనో లోపం కలుగదు.

ఈ మంత్ర సారాంశం ఏమిటంటే దేవుడి నుండి ఉద్భవించడం వలన ఈ ప్రపంచం కూడా భగవంతుని అంశ లేక భగవంతునిచే నిండి ఉన్నదని.

వేదమంత్రాలన్నీ ఓం శాంతిః అంటూ ముగుస్తాయి. మూడు సార్లు శాంతి అని ఎందుకు ముగుస్తాయంటే నిత్యజీవితములోని మూడు ఆటంకాల నుండి బయటపడుటకు. ఆ మూడు ఏమంటే

1.ఆద్యాత్మికం: శారీరక, మానసిక అనారోగ్యాలు మొదలగునవి 2.ఆదిభౌతికం: ఇతర జీవరాసులవలన, ఇతర మానవులవలన కలుగు బాధలు 3.ఆధిదైవికం: ప్రకృతి వలన అంటే వరదలు, భూకంపాలు, పిడుగులు, అగ్ని ప్రమాదాలు మొదలగునవి.

ఈ మూడు రకాలైన బాధల నుండి తప్పించుకోవడానికి మూడు సార్లు శాంతి అని పలుకుతాము.

ఇక ఉపనిషత్తు మొదటిశ్లోకం:
1. ఓం ఈశా వాస్య మిదగ్గ్ సర్వం యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుఞ్ఙీథా మాగృధః కస్యస్విద్ ధనం
అర్థం:

జగత్తులో ఏవేవైతే ఉన్నవో అన్నీ భగవంతునిచే నింపబడాలి.. అలాంటి త్యాగబుద్ధితో ఈ లోకాన్ని అనుభవించు. ఎవరి ధనాన్నీ ఆశించకు.

వివరణ: నింపబడడం అంటే ముందు శాంతి మంత్రములో చెప్పుకున్నట్లుగా ఈ లోకం దేవుడి నుండి పుట్టింది కాబట్టి లోకం అంతా భవంతుడిమయమే. కాబట్టి నువ్వు కూడా అంటే మనం కూడా సర్వ లోకాన్నీ, లోకములోని అన్ని వస్తువులనూ, జీవనిర్జీవ పదార్థాలను భగవంతుడిగానే చూడాలి. అంటే భగవంతుని సంపదగానే చూడాలి. అందువలన మన సంపదను లేక ధనాన్ని కూడా భగవంతుని సంపదగానే చూడాలి. అలాంటి త్యాగబుద్ధి మనకు ఉంటే ధనం ఉన్నా, పోయినా మనం బాధపడము. ఆనందముగా ఉండగలము.అలాగే ఎవరి సంపదనూ అంటే పరుల సంపదను కూడా ఆశించకూడదు.


రెండవ శ్లోకము:
2. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్చతగ్‌ం సమాః
ఏవం త్వయి నాన్యథేతో స్తిన కర్మ లిప్యతే నరే


అర్థం: ఈ లోకములో కర్తవ్యాలను నిర్వహిస్తూ మాత్రమే నూరేళ్ళు జీవించాలని ఆశించు. నీలాంటి వారికి ఇది తప్ప వేరే దారి లేదు. కర్తవ్యాలు నిన్ను అంటవు.

వివరణ: లోకములో జీవించాలంటే పనిచేసి తీరాలి. ఆ పని ఫలితం మంచైనా, చెడైనా కావచ్చు. ఆ ఫలితానికి మనము దాసులము. అంటే కచ్చితముగా ఫలితం ఉంటుంది. మరి ఈ శ్లోకాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ముందు మొదటిశ్లోకము గమనిస్తే అంతా భగవంతుని సంపదే కాబట్టి మనము భగవంతుని కొరకే పనిచేయాలి. మన సంపద, ఐశ్వర్యము భగవంతునికి చెందినదని భావించి అందుకు బాధ్యత వహించిన వ్యక్తిగా జీవితం గడపాలి. ఆ విధముగా మన కర్తవ్యాలను మనం నిర్వర్తిస్తే ఆ పని ద్వారా కలిగే ప్రతిఫలం మనలను తాకదు. మనకు ఇంతకంటే మరో మార్గం లేదు. ఇలా పనిచేస్తూనే మనం నూరేళ్ళూ జీవించాలని ఆశించాలి.

మూడవ శ్లోకం:

[మార్చు]

3.అసుర్యా నామతే లోకా అంధేన తమసావృతాః
తాగ్ంస్తే ప్రేత్యాభిగచ్చన్తియేకే చాత్మహనో జనాః
అర్థం: రాక్షసుల యొక్క లోకాలు గాఢమైన అంధకారముతో అంటే చీకటితో ఉంటాయి. ఆత్మహంతకులు మరణానంతరం ఆ లోకాలను పొందుతారు.

వివరణ: మనకు తెలుసు రాక్షసులు అంటే ఇతరులను పీడించే స్వభావం లేక గుణాలు కలిగినవారని. అంటే తమ ఆనందం కోసం ఇతరులను చంపడానికైనా తయారుగాఉండేవారు. దీని ప్రకారం మన సమాజంలోనే మనం ఎంతోమంది రాక్షసుల మధ్య ఉన్నామని మనకు తెలుసు. ఇక ఈ శ్లోకం విషయానికి వస్తే ఆత్మహంతకులు అనగా ఎప్పుడూ శరీరసుఖాలే జీవితలక్ష్యాలుగా చేసుకొని దేవుడి గురించి లేక పరమాత్మ గురించి ఆలోచన చేయనివారు. వీరు రాక్షసులతో సమానం. వీరు చనిపోయినతర్వాత రాక్షసుల లోకాలు పొందుతారు అంటే తమ స్వభావం ప్రకారమే మళ్ళీ జన్మిస్తారు. అంటే మళ్ళీమళ్ళీ పుడుతూ, చస్తూ బాధలకు గురి అవుతుంటారు. గాఢమైన చీకటి అని ఎందుకన్నారంటే వీరు కన్నూమిన్నూ కానకుండా సంచరిస్తారు. చీకటిలోనే కదా మనం కూడా అలా కదిలేది.

నాల్గవ శ్లోకం:

[మార్చు]

4.అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్
తద్ధావతో న్యానత్యేతి తిష్ఠత్ తస్మిన్నపో మాతరిశ్వా దధాతి

అర్థం: ఆత్మ కదలలేనిది, ఒక్కటే అయినది. మనస్సు కంటే వేగవంతమైనది. ఇంద్రియాలు దాన్ని పొందలేవు. అన్నిటికన్నా ముందు వెళ్తూనే అది స్థిరముగా ఉంటుంది. కదిలే వస్తువులు అన్నిటికన్నా ఆత్మ వేగవంతమైనది. ఆత్మ స్థిరముగా ఉండటం వలన ప్రాణం అన్నిటితో పనిచేయిస్తుంది.

వివరణ: ఈ శ్లోకంలో ఎన్నో పరస్పర వ్యతిరేక అంశాలు ఉన్నాయి. చలిస్తుంది అనీ చలనం లేనిదనీ, స్థిరము అనీ అన్నిటికన్నా వేగవంతం అనీ వ్యతిరేకాలు ఉన్నాయి. ఏదైనా ఒక వస్తువు కదలాలన్నా, పనిచేయాలన్నా ఒక స్థలం ఉండాలి. విశ్వమంతా ఆత్మ ఒకటే ఉన్నప్పుడు రెండవది లేనప్పుడు ఆత్మ ఎక్కడకు కదలగలదు? అందుకే ఆత్మ చలనం లేనిది అన్నారు.

మనం ఒక వస్తువును అనుకొన్నప్పుడు మన మనసు ఆ వస్తువు రూపాన్ని ఊహించుకొంటుంది లేక ఆ వస్తువు రూపాన్ని గ్రహిస్తుంది. మన శరీరం ఆ వస్తువు వద్దకు వెళ్ళక ముందే మనసు ఆ వస్తువు వద్దకు వెళ్ళిపోతుంది. కాని ఆత్మ ఒక్కటే ఈ విశ్వమంతా వ్యాపించి ఉండడం వలన మనసు, శరీరం అన్నీ అందులోనివే కావడం వలన మనసు ఆ వస్తువు వద్దకు వెళ్ళక ముందే అక్కడ ఆత్మ ఉంటుంది. అంటే ఆత్మ స్థిరముగా ఉంటూనే మనసు కన్నా కూడా వేగవంతం అని చెప్పబడింది.

ఇంద్రియాలు ఆత్మను గ్రహించలేవు. ఎందుకంటే ఇంద్రియాలు ( కన్ను, ముక్కు, చెవి, కాళ్ళు, చేతులు, చర్మము, నాలుక మొదలగునవి) బయటి ప్రపంచాన్ని తెలుసుకోవడానికే సృష్టింపబడ్డాయి. ఏ వస్తువు కదలాలన్నా, కదలని వస్తువు ఒకటి ఆధారముగా ఉండాలి. బస్సు కదలాలంటే కదలని రోడ్డు, చలనచిత్రం చూడాలంటే కదలని తెర ఉండాలి. ప్రాణం అనేది ఆత్మను ఆధారముగా చేసుకొని ఇంద్రియాలను లేక ప్రపంచముతో పని చేయిస్తుంది. ఈ శ్లోకం యొక్క వివరణ ఇది.

ఐదవ శ్లోకం:

[మార్చు]

5.తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే
తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః

అర్థం: అది చలిస్తుంది, చలించదు. దూరంగా ఉంటుంది, చాలా దగ్గరగా ఉంటుంది. అది అన్నిటి లోపలా, బయట కూడా ఉంటుంది.

వివరణ: ఈ శ్లోకంలో కూడా ముందటి శ్లోకంలో లాగా వ్యతిరేకాలే కనిపిస్తున్నాయి. ముందు శ్లోకంలో చెప్పుకున్నట్లుగా ఆత్మ ఇంద్రియాలకు అందదు. చలిస్తుంది, చలించదు అనే వాటికి ముందు శ్లోకములో అర్థం చెప్పుకున్నాము. ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది కాబట్టి అందరికీ అది చాలా దగ్గరగా ఉంది. కాని మనం ఆ విషయం అనుభవపూర్వకముగా తెలుసుకోనప్పుడు అది మనకు దూరంగా ఉందనే కదా అర్థం. ఆత్మ రూపములో అది మనలోనే ఉంది, అలాగే పరమాత్మ రూపంలో మన బయట కూడా ఉంది అన్న విషయం మనకు తెలుసు కదా.

ఆరవ శ్లోకం:

[మార్చు]

6.యస్తు సర్వాణి భూతాన్యాత్మ న్యేవాను పశ్యతి
సర్వభూతేషు చాత్మానం తతోన విజుగుప్సతే
అర్థం: ఎవరైతే అన్ని జీవులను ఆత్మలోనూ, ఆత్మను అన్ని జీవులలోనూ చూస్తాడో అతడు ఎవరినీ ద్వేషించడు.

ఏడవ శ్లోకం:

[మార్చు]

7.యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవాభూద్విజానతః
తత్రకో మోహః కః శోక ఏకత్వమనుపశ్యతః
అర్థం: ఆత్మే అన్ని జీవరాసులుగా ఉన్నదని గ్రహించిన వ్యక్తికి మోహం, శోకం ఎలా ఉంటాయి?
వివరణ: పై 6,7 శ్లోకాలు ఆత్మను సాక్షాత్కరించుకొన్నవాడి లేక ఆత్మానుభూతి పొందిన వాడి గురించి చెబుతున్నాయి. మనకు ఇష్టం లేనిదాన్ని మనం ద్వేషిస్తాం. విపరీత ఆకర్షణ వలన మనకు ఒక వస్తువుపై మోహం కలుగుతుంది. మనకు ఇష్టం లేనిది జరిగినప్పుడు మనకు బాధ కలుగుతుంది. కాని ఆత్మానుభూతి పొందిన వ్యక్తి విశ్వాన్ని అంతటినీ ఆత్మస్వరూపంగా లేక భగవంతుడిగా చూస్తాడు. అలాంటప్పుడు అతనికి ఆత్మ తప్ప ప్రపంచములో వేరేది కనిపించదు. ఏదైనా రెండవ వస్తువు ఉన్నప్పుడు మాత్రమే కదా మనకు దానిపైన మనసు పోయేది. అంతా ఒకటే అయినప్పుడు మనసు ఎక్కడకు పోగలదు. ఒక్కచోటే ఉంటుంది. అందువలన బాధ గాని, ఆకర్షణ లేక మోహం కాని, ద్వేషం కాని ఎలా ఉంటాయి. ఇవన్నీ ఆత్మానుభూతి పొందిన వాడి లక్షణాలు.

ఆత్మానుభూతి, ఆత్మసాక్షాత్కారం మొదలగునవి ఆంతరంగిక అనుభవాలు. బయటి ప్రపంచం ముందులానే ఉంటుంది. కాని చూసేవాడి మనసును బట్టి వ్యక్తివ్యక్తికీ ప్రపంచస్వభావం వేరేలా ఉంటుంది. ఒక యువకుడికి ఏదైనా సాధించగలననే విశ్వాసం ఉంటుంది. అదే ఒక ముసలివ్యక్తికి అంతా అయిపోయిందనే భావన ఉంటుంది. ప్రపంచం ఏమీ మారలేదు. మార్పు అంతా చూసేవాడిని బట్టే. అలానే ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తికి రెండు కొమ్ములు ఏమీ రావు. అతని మనసు విశాలమై విశ్వమంతటితోనూ ఏకం అవుతుంది.

ఎనిమిదవ శ్లోకం:

[మార్చు]

8.స పర్యాగాచ్చుక్ర మకాయవ్రణమస్నావిరగ్‌ం శుద్ధమపాపవిద్ధం
కవిర్మనీషీ పరిభూః స్వయం భూ ర్యాథాతథ్యతోర్థాన్ వ్వదధాచ్చాశ్వతీభ్యః సమాభ్యః

అర్థం: అతడు (అంటే ఆత్మానుభూతి పొందినవాడు) అన్నిటి అంతరార్థాన్నీ గ్రహిస్తాడు.మనసును వశం చేసుకొన్నవాడు.మొత్తం జ్ఞానాన్నీ తనలో ఉంచుకొన్నవాడు.ఎవరికీ చెందనివాడు.అన్నివేళలా అన్ని వస్తువుల నిజమైన నైజాన్ని తెలుసుకొన్నవాడు.ఉజ్వలమైన శరీరం లేని, కండలు లేని, పాపం లేని పరిపూర్ణమైన, స్వచ్ఛమైన దేవుడిని అతడు చేరుకొంటాడు. వివరణ: ఈ శ్లోకంలో ఆత్మానుభూతి పొందిన వాడి అనుభవం చెప్పబడింది. సాధారణ మానవులమైన మనం ఏదైనా వస్తువును చూడడంతో ఆగిపోతాం. కాని అతడు ఒక వస్తువును చూడడమే కాకుండా దానికి సంబంధించిన మొత్తం జ్ఞానాన్ని తెలుసుకోగలడు. అతడు మాత్రమే నిజమైన మనీషి. మనీషి అంటే మనసును వశం చేసుకొన్నవాడు అని అర్థం. మనసు చెప్పినట్లు అతడు ఆడడు, అతడు చెప్పినట్లు అతని మనసు ఆడుతుంది. మనం ఎంత నేర్చుకొన్నా ఇంకా నేర్చుకోవాలనే కోరికతో తృప్తిలేకుండా ఉంటాము. కాని ఆత్మానుభూతి పొందినవాడికి తెలుసుకోవలసింది ఏమీ లేకపోవడం వలన అతడు నిత్యతృప్తుడై ఉంటాడు. అందుకే ఏది తెలుసుకొంటే ఇక తెలుసుకోవలసింది ఏమీ ఉండదో అదే ఆత్మ అని "కేనోపనిషత్తు"లో కూడా చెప్పబడింది. ఎవరికీ చెందనివాడంటే అతడు కేవలం ఆత్మ లేక భగవంతుడిపైనే ఆధారపడిఉంటాడు కాబట్టి మిగతా జీవరాసులపై కాదు. అతడు వస్తువుల నిజమైన తత్వాన్ని తెలుసుకొన్నవాడు కాబట్టి దేనికీ లొంగనివాడు. భగవంతుడు నిరాకారుడు కాబట్టి కేవలం అనుభూతి ద్వారా మాత్రమే అతనిని తెలుసుకోగలం కాబట్టి అతడు కండలు లేనివాడని, శరీరం లేనివాడని చెప్పబడింది. పాపంలేకపోవడం, తేజోమయం, స్వచ్ఛమైనది అనే గుణాలు భగవంతుడి గుణాలుగా చెప్పబడినవి.

తొమ్మిదవ శ్లోకం:

[మార్చు]

9.అంధం తమః ప్రవిశన్తి యేవిద్యాముపాసతే
తతో భూయ ఇవ తే తమో య ఉ విద్యాయాగ్ంరతాః

అర్థం: ఎవరు కర్మల (పనుల) లో పాల్గొంటారో వారు చిమ్మచీకటిలోనూ, అలాగే జ్ఞానాన్ని అవలంబిస్తారో వారు అంతకన్నా కారుచీకటిలో మునిగిపోతారు (అవిద్యని ఉపాసించేవారు గాంఢాంధకారంలో ప్రవేశిస్తారు, అంతకంటే అంధకారంలోకి విద్యామదం కలవారు ప్రవేశిస్తారు.).

వివరణ: ఈ శ్లోకం చాలా విశేషార్థం కలిగిఉంది. ఒక లక్ష్యం అంటూ లేకుండా ఎవరైతే ఊరికే పనులు చేసుకుంటూ ఉంటారో వారు బాధలకు గురి అవుతారు. అలాగే అర్హత లేకుండా డాంబికం కోసం అంటే లోకం దృష్టిలో పడడం కోసం, లోకం తనను పొగడడం కోసం ఎవరైతే ధ్యానము, భక్తి మొదలగు వాటి కోసం ప్రయత్నిస్తారో (అంటే మనస్పూర్థిగా కాకుండా) వారు ఇంకా ఎక్కువ బాధలు పడతారు అని అర్థం. దీని గురించి అందరికీ తెలుసు, ఎక్కువ వివరణ అవసరం లేదని భావిస్తున్నాను.

పదవ శ్లోకం:

[మార్చు]

10.అన్యదేవాహు ర్విద్యయా అన్యదాహురవిద్యయా
ఇతి శుశ్రుమ ధీరాణాం యేన స్తద్విచచక్షిరే

అర్థం: ఆత్మ విద్య ద్వారా ఒక ఫలితం, కర్మల (పనుల) ద్వారా మరొకరకమైన ఫలితం లభిస్తాయి. మాకు దానిని వివరించిన మహాత్ములు ఇలా చెప్పారు.

పదకొండవ శ్లోకం:

[మార్చు]

11.విద్యాం చావిద్యాం చ య స్తద్వేదో భయగ్‌ం సహ
అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతశ్నుతే

అర్థం: జ్ఞానం (అంటే భగవంతుని తెల్సుకొనే విద్య), కర్మలు (పనులు) రెండింటినీ కలిపి తెలుసుకొన్నవాడు కర్మల ద్వారా మరణాన్ని దాటి, జ్ఞానం ద్వారా అమర్త్వాన్ని పొందుతాడు. వివరణ: ఈ శ్లోకంలో తము తెలుసుకొన్నామని చెప్పుకోకుండా తమ గురువుల ద్వారా తెలుసుకొన్నామని చెప్పుకుంటున్నారు. మనం బ్రతకాలంటే పనులు చేయక తప్పదు. కాని ఆ పనులు మాత్రమే చేసుకుంటూ కూర్చుంటే భగవంతుని గురించి తెలుసుకోలేము. కాబట్టి పనులు భగవదర్పితం అయ్యుండాలి (ఉపనిషత్తు యొక్క మొదటి శ్లోకం చూడండి). ధ్యానం మనస్పూర్థిగా ఉండాలి. జ్ఞానం, పని రెండింటినీ సమన్వయంతో సాధించినవాడికే ఆత్మానుభూతి అని చెప్పబడింది.

పన్నెండవ శ్లోకం:

[మార్చు]

12.అంధం తమః ప్రవిశన్తి యే సంభూతిముపాసతే
తతో భూయ ఇవ తే తమో య ఉ సంభూత్యాగ్‌ం రతాః
అర్థం: దేవుడిని నిరాకారముగా పూజించేవారు కటిక చీకటిలోనూ, ఆకారం ఉన్నవాడిగా పూజించేవాడు ఇంకా ఘోరచీకటిలోనూ మునిగిపోతారు.

పదమూడవ శ్లోకం:

[మార్చు]

13.అన్యదేవాహుః సంభవాదన్యదాహురసమ్భవాత్
ఇతి శుశ్రుమ ధీరాణాం యే నస్తద్విచచక్షిరే

అర్థం: మాకు దానిని వివరించిన మహాత్ములు విన్నది ఏమంటే " సాకార ఉపాసన వలన ఒక ఫలితం,నిరాకార ఉపాసన వలన మరోరకమైన ఫలితం లభిస్తాయి" అని.

పదునాల్గవ శ్లోకం:

[మార్చు]

14.సంభూతిం చ వినాశం చ యస్తద్వేదోభయగ్‌ం సహ
వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమశ్నుతే

అర్థం: సాకార ఉపాసన, నిరాకార ఉపాసన రెంటినీ కలిపి గ్రహించినవాడు సాకారోపాసన వలన మరణాన్ని దాటి, నిరాకారోపాసన వలన అమరత్వం పొందుతాడు.

వివరణ: మనకు రూపం, గుణాలు ఉన్నాయి కాబట్టి మన జ్ఞానం రూపాన్ని, గుణాలను దాటిపోవాలంటే కష్టం. దేవుడిని నిరాకారముగా పూజించడములో కలిగే కష్టం ఇది. దానివలన మనకు ఏదీ సరిగా అర్థం కాదు. ఆధ్యాత్మికముగా ఉన్నతస్థితిలో ఉన్నవారికి మాత్రమే ఇది సాధ్యము. అందువలన మనలాంటి సాధారణజీవులకు ఇది చీకటిలో ఉన్నట్లే లెక్క. అలాగే సాకారఉపాసన అంటే రాముడిగానో, శివుడిగానో పూజించడం. ఇలా పూజించాలంటే అన్ని దేవుళ్ళరూపాలు ఒకే పరమాత్మ అని గ్రహించి ఉండాలి. లేకుంటే "దశావతారం" చిత్రంలో రాజుల కాలం నాటి పరిస్థితి ఎదురవుతుంది. అంటే నీ దేవుడి కంటే నా దేవుడే గొప్ప అనే దురభిమానం, మూఢభక్తి లాంటి ప్రమాదాలు ఎదురవుతాయి. అందుకని ఇది ఇంకా చీకటిలో ఉండడం అన్నమాట. కాబట్టి రెండింటినీ కలిపి మనం ఆత్మానుభూతి పొందాలనేది ఈ శ్లోకాల అర్థం. అది ఎలా అనేది తర్వాతి శ్లోకాలలో చూస్తాము.

పదహైదవ శ్లోకం:

[మార్చు]

15. హిరణ్మయేన పాత్రేణసత్యస్యాపిహితం ముఖం
తత్ త్వం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే

అర్థం: సత్యం యొక్క ముఖం బంగారు తెరతో కప్పబడి ఉంది. ఓ సూర్యదేవా! సత్యనిష్ఠుడనైన నేను ఆ సత్యాన్ని దర్శించడానికి తెరను తొలగించు.

వివరణ:ఈ శ్లోకం మన ఊహకు కూడా అందని దాన్ని గురించి తెలుపుతోంది. అజ్ఞానం అనే చీకటి నుండి జ్ఞానం అనే వెలుగులోనికి తోడ్కొని వెళ్ళమని ప్రార్థన మనకు తెలుసు. ధ్యానం, భక్తి మొదలగు వాటివలన భగవత్‌దర్శనం కలుగుతుంది. అంటే వెలుగులోనికి మనం ప్రయాణించగలం. కాని సత్యం అనేది వెలుగుచీకట్లకు, జ్ఞానాజ్ఞానాలకు అతీతమైనది. అంటే ఆ తేజస్సును అంటే వెలుగును కూడా దాటిపోవాలి అనే విషయం ఈ శ్లోకంలో తెలుస్తోంది. ఆ తేజస్సునే ఇందులో సత్యం యొక్క ముఖం బంగారు తెరతో కప్పబడి ఉన్నదని చెప్పబడింది."సత్యనిష్ఠుడనైన నేను" అని ఎందుకు అంటున్నారంటే తన అర్హతను తెలిజేయడం జరుగుతోంది.నిరాకార, నిర్గుణమైన సత్యాన్ని అనుభూతి పొందడానికి ప్రార్థించడం ఇక్కడ జరుగుతోంది.

పదహారవ శ్లోకం:

[మార్చు]

16. పూషన్నేకర్షే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహ రశ్మీన్ సమూహ
తేజో యత్ తే రూపం కళ్యాణతమం తత్ తే పశ్యామి
యో సావసౌ పురుషః సోహమస్మి

అర్థం:సకల జీవరాసులను పోషించి కాపాడేవాడవు, ఒంటరిగా పయనించేవాడవు. అన్నిటినీ పాలించే ఓ సూర్యదేవా! ప్రజాపతి కుమారుడా! నీ కిరణాలను ఉపసంహరించుకో. నీ తేజస్సును కుదించుకో. కళ్యాణకరమైన నీ స్వరూపాన్ని నీ అనుగ్రహంతో నేను చూస్తున్నాను. ఆ సూర్యునిలో ఉన్నది "నేనే". వివరణ:ఈ శ్లోకంలో ఋషి తను దర్శించినది చెప్పినాడు. భగవత్కృపతో దర్శిచి ఆ సత్యమైన పదార్థం "నేను" అని కనుగొన్నాడు. ఇక్కడ "నేను" అని సూచించబడ్డది మనం మామూలు అర్థంలో తీసుకోకూడదు. ఈ "నేను" అన్నది ఏంటో నాకు ( రచయిత) చెప్పడానికి అర్హత కానీ, అనుభవపూర్వక జ్ఞానం కానీ లేవు. కానీ ఉపనిషత్తు ప్రకారం ఈ "నేను" అనేది ముందటి శ్లోకాలలో చెప్పబడిన "ఒకే వస్తువు". ఈ స్థితి అత్యున్నత స్థితి, భగవంతుడి స్థితి.

పదిహేడవ శ్లోకం:

[మార్చు]

17. వాయురనిలమమృతమథేదం భస్మాన్తగ్‌ం శరీరం
ఓం (3) క్రతో స్మర కృతగ్‌ం స్మర క్రతో స్మర కృతగ్‌ం స్మర

అర్థం:ఈ శరీరం కాలి బూడిద అయిపోతుంది.ఈ శరీరప్రాణం మరణంలేని ప్రాణంతో కలిసిపోతుంది. ఓ మనసా! చేసినవాటిని విచారణ చేయి, విచారణ చేయి. వివరణ: ఈ శ్లోకం ఒక "స్వయం సూచన" (Self suggestion) లేక "స్వయం ప్రేరణ" (Self Motivation) మంత్రం లాంటిది.నిత్యజీవితములోనైనా సరే, ఆధ్యాత్మిక జీవితములోనైనా సరే ఒక లక్ష్యము ఎంచుకొన్నప్పుడు ఆ లక్ష్యము నుండి జారకుండా ఉండడానికి మన మనసుకు మనమే గుర్తుచేసుకోవడం ఇది.మహారాజైనా, బిక్షగాడైనా ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే, అతడి ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే. దీనిని గుర్తుచేస్తూ ఒక సాధకునికి చెప్తున్న మంత్రం ఇది.

పద్దెనిమిదవ శ్లోకం:

[మార్చు]

18. అగ్నే నయ సుపథా రాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్
యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ

అర్థం:ఓ అగ్నిదేవా! మేము చేసిన అన్ని పనులూ నీకు తెలుసు. ప్రారబ్ధకర్మలను అనుభవించడానికి మమ్మల్ని అనుభవమార్గంలో తీసుకెళ్ళు. మా ఘోరమైన తప్పుల నుండి మమ్మల్ని విముక్తున్ని చేయి. నీకు అనేక నమస్కారాలు చేస్తున్నాం.వివరణ: అనుభవమార్గం అంటే "ఇంతవరకు చేసిన పనుల ఫలితాలను మాత్రం అనుభవించేటట్లు చేసి, క్రొత్తపనులతో అంటే చేయబోయేపనుల ఫలితం మాకు అంటకుండా చేయి" అని అర్థం. అంటే చేయబోయే పనులు నిష్కామంగా చేసేట్టు చేయి అని అర్థం.

ఈ శ్లోకంతో "ఈశావాస్య ఉపనిషత్తు" సంపూర్ణమౌతుంది.

శాంతి మంత్రం:

[మార్చు]

ఓం పూర్ణమదః పూర్ణిమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే

ఓం శాంతిః శాంతిః శాంతిఃదేవుడు పరిపూర్ణుడు. ఇది (ఈ ప్రపంచం) పరిపూర్ణమైనది. పరిపూర్ణమైన భగవంతుడి నుండే పరిపూర్ణమైన ప్రపంచం పుట్టింది. పరిపూర్ణం నుండి పరిపూర్ణాన్ని తీసివేసిన తర్వాత కూడా పరిపూర్ణతే మిగిలి ఉంది.

మూలాలు

[మార్చు]
  1. ఇలపావులూరి, పాండురంగారావు (1998). ఆది అనాది (PDF). తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం. p. 9.

1. రామకృష్ణమఠం వారి ఈశావాస్యోపనిషత్తు