Jump to content

హైదరాబాదు

అక్షాంశ రేఖాంశాలు: 17°23′03″N 78°27′23″E / 17.38405°N 78.45636°E / 17.38405; 78.45636
వికీపీడియా నుండి
(హైదరాబాదు, భారత్ నుండి దారిమార్పు చెందింది)
హైదరాబాదు
భాగ్యనగరం
హైద్రాబాదు నగరానికి సంబంధించిన బొమ్మలకొలువు
Nickname: 
ముత్యాలనగరి
హైదరాబాదు is located in Telangana
హైదరాబాదు
హైదరాబాదు
తెలంగాణలో హైదరాబాదు స్థానసూచిక
Coordinates: 17°23′03″N 78°27′23″E / 17.38405°N 78.45636°E / 17.38405; 78.45636
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ రీజియన్, దక్కన్
జిల్లాలు
స్థాపించినది1591
Founded byమహమ్మద్ కులీ కుతుబ్ షా
Government
 • Typeనగర పాలిక సంస్థ
 • Bodyగ్రేటర్ హైద్రాబాదు మునిసిపల్ కార్పోరేషన్,
హైదరాబాదు మెట్రోపాలిటన్ డవలప్మెంట్ అధారిటీ
విస్తీర్ణం
 • మహానగరం900 [1] కి.మీ2 (Formatting error: invalid input when rounding చ. మై)
 • హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం7,257 కి.మీ2 (2,802 చ. మై)
Elevation
505 మీ (1,657 అ.)
జనాభా
 (2023 [2])
 • మహానగరం77,49,334
 • Rank4వ
 • Metro
1,11,00,000 [3]
 • మెట్రో ర్యాంక్
6వ
Demonymహైద్రాబాదీ
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్లు
500 xxx, 501 xxx, 502 xxx.
ప్రాంతపు కోడ్(లు)+91–40, 8413, 8414, 8415, 8417, 8418, 8453, 8455
Vehicle registrationTS 07 to TS 15 (earlier – AP09 to AP-14 and AP 28,29)
మెట్రో జిడిపి (PPP)$40–$74 billion
అధికారిక భాషలుతెలుగు, ఉర్దూ

హైదరాబాదు, తెలంగాణ రాష్ట్ర రాజధాని. హైదరాబాదు జిల్లా, రంగారెడ్డి జిల్లాల ముఖ్యపట్టణం. హైదరాబాద్ కి మరో పేరు భాగ్యనగరం. హస్తకళలకు, నాట్యానికి ప్రసిద్ధి. హైదరాబాదు భారతదేశంలో ఐదవ అతిపెద్ద మహానగరం[1]. అంతేకాదు హైదరాబాదు చుట్టు పక్కల మున్సిపాలిటీలను కలుపుకుపోతే ప్రపంచంలోని మహానగరాలలో 41వ స్థానంలో ఉంది.[2] ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం.

హైదరాబాదు భారతదేశంలో బాగా అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటి, అంతేకాదు సాఫ్టువేరు రంగంలో కూడా బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తోంది. హైదరాబాదు, సికింద్రాబాద్లు జంట నగరాలుగా ప్రసిద్ధి పొందాయి. హుస్సేన్‌ సాగర్‌ ఈ రెండు నగరాలను వేరు చేస్తుంది, ట్యాంకు బండ్ వీటిని కలుపుతుంది. హుస్సేన్‌ సాగర్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా వలీ 1562లో నిర్మించిన ఒక పెద్ద కృత్రిమ సరస్సు. హైదరాబాదుకు మధ్యలో చార్మినారును మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో అప్పటిదాకా విజృంభించిన ప్లేగు వ్యాధి నిర్మూలనకు చిహ్నంగా నిర్మించాడు.

హైదరాబాదు నగరం డెక్కన్ డైమండ్ సిటీ, నవాబుల నగరం, ముత్యాల నగరం, సరస్సుల నగరం, రాళ్ళ నగరం మొదలైన పేర్లతో ప్రసిద్ధి చెందింది.[3]

చరిత్ర

మహమ్మద్ కులీ కుతుబ్ షా, 5వ కుతుబ్ షాహీ సుల్తాన్, హైదరాబాదు నగర స్థాపకుడు.
గోల్కొండ కోటపై నుండి హైదరాబాదు నగరం

హైదరాబాదును మూసీ నది ఒడ్డున సా.శ.1590 దశకంలో, కుతుబ్ షాహీ వంశస్థుడయిన, మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు.[4] గోల్కొండలోని నీటి సమస్యకు సమాధానంగా పరిపాలనను ఇక్కడకు మార్చారని చరిత్రకారులు చెబుతారు. ఇక్కడి నుండే కుతుబ్ షాహీ వంశస్థులు ఇప్పటి తెలంగాణ ప్రాంతాన్ని , ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలలోని కొన్ని భాగాలను పాలించారు.[5] 400 సంవత్సరా లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన అతి గొప్ప నగరమది. కుతుబ్‌షాహి నవాబులు నిర్మించిన ఈ నగరం తొలుత చించలం (ఇప్పుడు శాలిబండ ) పేరుతో చిన్న గ్రామంగా ఉండేది. 1590లో కలరా మహమ్మారి సోకి గోల్కొండ నగరం అత లాకుతలమయింది. నవాబ్ కులీ కుతుబ్ షా అక్కడి నుంచి చించలం గ్రామానికి తరలి వచ్చి తాత్కాలికంగా బస చేశాడు. వ్యాధి బెడద తగ్గిన తరువాత తిరిగి గోల్కొండ వెళుతూ తన బసకు గుర్తుగా 1591లో చార్మినార్ నిర్మించాడు. ఆ తర్వాత 1594లో నాల్గవ ఖలీఫా హజరత్ హైదర్ అలీ పేరిట నగరం నిర్మించాడు. 17వ శతాబ్దంలో హైదరాబాద్‌ను సందర్శించిన ఇటాలి యన్ యాత్రికుడు టావెర్నియర్ నగరంలోని ఉద్యానవనముల శోభకు అమితంగా ముగ్ధుడయ్యాడు. హైదరాబాద్ నిజానికి 'బాగ్‌నగర్' అని శ్లాఘించాడు. ఉద్యాన వనాలకేకాక సరస్సులకు కూడా హైదరాబాద్ పెట్టింది పేరు.దేశానికి స్వాతంత్య్రం లభించేనాటికే హైదరాబాద్ సకల వసతులు కల రాజధాని నగరం. శాసనసభా భవనం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు, విమానాశ్రయం, కంటోన్మెంటు, విశాలమైన కార్యాలయాలు, అతిథి గృహాలు, చక్కని డ్రైనేజి వ్యవస్థ, నిరంతరం ఉచిత మంచినీటి సరఫరా వ్యవస్థ, సిమెంట్ రోడ్లు, డబుల్ డెక్కర్ బస్సులు, డీజిల్ రైలు, కారు వ్యవస్థ, రేడియో స్టేషను, టంకశాల, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు మొదలైన సౌకర్యాలు అప్పటికే ఏర్పాటై ఉన్నా యి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ కూడా పార్లమెంటు భవనం లేకపోవడం మినహా దేశరాజధాని కావడానికి హైదరాబాద్‌కు అన్ని అర్హతలూ ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సంవత్సరానికి ఒకసారైన పార్లమెంటు సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించాలని ఆయన సూచించారు. అంబేద్కర్ సూచన మేరకే బొల్లారంలో రాష్ట్రపతి నిలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.1956లో హైదరాబాద్ దేశంలో ఐదవ పెద్ద నగరంగా ఉండేది. ఇప్పుడు ఆరవ పెద్ద నగరంగా ఉంది. రాష్ట్రాల పునర్విభజన జరిగినప్పుడు హైదరాబాద్ రాష్ట్రం నుంచి కర్ణాటకకు మూడు జిల్లాలు, మహారాష్ట్రకు ఐదు జిల్లాలు బదిలీ అయ్యాయి. విభజన తర్వాత కర్నూలులో తగిన వసతులు లేక ప్రభుత్వ కార్యాలయాలు చాలా భాగం మద్రాసులోనే ఉండిపోయాయి. అందువల్ల అన్ని వసతులు ఉన్న హైదరాబాద్‌ను రాజధానిగా ఏర్పాటుచేశారు. పాతబస్తీకి సరిహద్దుగా హైదరాబాదు సరిహద్దు గోడ కట్టబడింది.[6]

పేరు పుట్టుక

లాల్ బహదూర్ శాస్త్రితో నిజాం (మీర్ ఉస్మాన్ అలీ ఖాన్) ప్రధానమంత్రి

మహమద్ కులీ కుతుబ్‌షా భాగమతి అనే బంజారా స్త్రీని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఆ తరువాత ఆవిడ పేరు మీదనే భాగ్యనగర్ అని పేరు పెడతాడు. పెళ్ళయిన తరువాత భాగమతి ఇస్లాం మతం స్వీకరించి, హైదర్ మహల్ అని పేరు మార్చుకుంటుంది. దానిని అనుసరించి నగరం పేరు కూడా హైదరాబాదుగా (అనగా హైదర్ యొక్కనగరం) రూపాంతరం చెందింది[7] ఇండియా ట్రావెల్ టైంస్ సైటు నుండి మే 12, 2007న సేకరించబడింది. ఉర్దూ భాషాయుక్తంగా చూస్తే హైదరాబాదు పేరు వెనక మరొక అర్థం ఉంది. హైదర్ (రాజు పేరు) ఎక్కడయితే ఆబాదు (ప్రఖ్యాతి) అయ్యాడో ఆ నగరమే హైదరాబాదు అని ప్రతీతి.

భారత స్వాతంత్ర్యం అనంతరం

1947లో భారతదేశంలో ఆంగ్లేయుల పాలన అంతమయిన తరువాత అప్పటి నిజాము స్వతంత్రంగా పాలన సాగించాలని నిర్ణయించాడు. వ్యాపార, వాణిజ్యాలు స్థిరముగా ఉండేందుకు హైదరాబాదు రాజ్యానికి అన్ని వైపులా ఉన్న భారత దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటి తెలంగాణా కమ్యునిస్టులు హైదరాబాదును భారత దేశంలో కలుపుటకు, నిజాము సొంత సైన్యమయిన రజాకర్ల మీద చేసిన పోరాటం వలన శాంతి భద్రతలు క్షీణించాయి. పెరిగిన హింస కారణంగా అప్పటి మద్రాసు రాష్ట్రంలో ఉన్న కోస్తా ఆంధ్ర ప్రాంతానికి వలసలు బాగా పెరిగినాయి. అటువంటి సమయంలోనే, అప్పటి గృహమంత్రి, సర్దార్ వల్లభాయి పటేల్ నేతృత్వంలో భారతదేశం ఆపరేషన్ పోలో పేరుతో పోలీసు చర్యకు ఉపక్రమించింది. సెప్టెంబరు 17, 1948న, అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం తరువాత, హైదరాబాదులో ఐదు రోజుల పోలీసు చర్య జరపడం వల్ల హైదరాబాదు భారతదేశంలో కలిసింది. భారతదేశంలో అంతర్భాగమయిన తరువాత ఎనిమిది సంవత్సరాలపాటు (సెప్టెంబరు 17, 1948 నుండి 1956 నవంబర్ 1వరకు) హైదరాబాదు ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉంది. 1956 నవంబర్ 1న భారత దేశాన్ని భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజించినపుడు హైదరాబాదు రాష్ట్రం మూడు భాగాలుగా విడి ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక లలో కలిసిపోయింది. హైదరాబాదు నగరం , దాని చుట్టుపక్కల తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో కలిసాయి, అంతేకాదు హైదరాబాదు ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అయింది.

భౌగోళికం

పటం
హైదరాబాదు

హైదరాబాదు దాదాపు తెలంగాణ రాష్ట్రము మధ్య ప్రాంతములో ఉంది. ఇది దక్కను పీఠభూమిపై సముద్రమట్టం నుండి 541 మీ. (1776 అడుగులు) ఎత్తులో ఉంది. సుమారుగా ఈ నగర వైశాల్యం 260 చ.కి.మీ. (100 చ.మైళ్ళు).

హిమాయత్ సాగర్, సింగూరు జలాశయం, కృష్ణా తాగునీటి మొదటి దశ ప్రస్తుతమున్న ప్రధాన నీటి వనరులు. కృష్ణా నది నుండి తాగునీటిని సరఫరా చేసే ప్రాజెక్టు రెండో దశ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

హుసేన్ సాగర్ నుండి హైదరాబాదు విస్తృత చిత్రం
హుసేన్ సాగర్ నుండి హైదరాబాదు విస్తృత చిత్రం
Hyderabad population 
CensusPop.
195110,85,722
196111,18,5533.0%
197117,96,00060.6%
198125,46,00041.8%
199130,59,26220.2%
200136,37,48318.9%
201168,09,97087.2%
Sources:[8][9][10]

2011 లో హైదరాబాదు మహానగర జనాభా 68,09,970. హైదరాబాదులో ముస్లిం జనాభా 40%గా ఉంది. తెలుగు, ఉర్దూ, హిందీ ఎక్కువగా మాట్లాడే భాషలు. వ్యాపార వ్యవహారాల్లో ఇంగ్లీషు ఎక్కువగానే వాడుతారు. భారత దేశములోని అనేక ప్రాంతములనుండి ప్రజలు హైదరాబాదుకు వచ్చి స్థిరపడ్డారు.

పౌర పరిపాలన

నగర పరిపాలన హైదరాబాద్ మహానగర పాలక సంస్థ చే నిర్వహించబడుతుంది దీనికి అధిపతి మేయరు అయినప్పటికీ కార్యనిర్వాహక అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం నియమించే నగరపాలక కమిషనరు అనబడే ఒక ఐఏఎస్ అధికారి చేతిలో ఉంటాయి. నగర త్రాగునీటి సౌకర్యం, రోడ్లు, డ్రైనేజీ నిర్వహణ, చెత్త తొలిగించుట, వీధిదీపముల ఏర్పాటు, మౌలిక వసతులకు బాధ్యత ఈ సంస్థదే. నగరం 150 వార్డులుగా విభజింపబడి ఉంది. ఒక్కో వార్డుకు ఒక కార్పొరేటరు ఎన్నికై కార్పొరేషనులో తన వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. నగరప్రాంతం మొత్తం తెలంగాణ 31 జిల్లాల్లో ఒకటి - అదే హైదరాబాదు జిల్లా. ఆస్తుల దస్తావేజులు, రెవెన్యూ సమీకరణకు జిల్లా కలెక్టరు బాధ్యుడు. హైదరాబాదు జిల్లాలో ఎన్నికల నిర్వహణ బాధ్యత కూడా కలెక్టరుదే.

భారతదేశంలోని ఇతర మహానగరంలలో వలెనే, హైదరాబాదు పోలీసుకు పోలీసు కమీషనరుగా ఒక ఐపీఎస్‌ అధికారి ఆధిపత్యము వహిస్తుంటాడు. హైదరాబాదు పోలీసు రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ నేతృత్వములో పని చేయుస్తుంది. హైదరాబాదును ఐదు పోలీసు జోన్లుగా విభజించారు. ఒక్కొక్క జోన్‌కు ఒక డిప్యూటీ కమీషనర్‌ ఆఫ్‌ పోలీసు అధిపతిగా ఉంటాడు. ట్రాఫిక్‌ పోలీసు విభాగము హైదరాబాదు పోలీసు శాఖలో పరిమిత స్వయంప్రతిపత్తి కలిగిన ఒక విభాగము. తెలంగాణ రాష్ట్రము మొత్తము తన న్యాయ పరిధిలో ఉండే తెలంగాణ ఉన్నత న్యాయస్థానము యొక్క పీఠము హైదరాబాదు నగరంలోనే ఉంది. హైదరాబాదులో రెండు దిగువ న్యాయస్థానములు, పౌరసంబంధ సమస్యలకై చిన్న సమస్యల (small causes) న్యాయస్థానము , నేర విచారణ కొరకు ఒక సెషన్స్ న్యాయస్థానం ఉన్నాయి. హైదరాబాదు నగరానికి లోక్‌సభలో రెండు సీట్లు , రాష్ట్ర శాసనసభలో పదమూడు సీట్లు ఉన్నాయి.

కొత్త మాస్టర్‌ ప్లాన్‌

బృహత్తర ప్రణాళిక (మాస్టర్‌ ప్లాన్‌) ప్రకారం కోర్‌ ఏరియా 172 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 2001లో నగర జనాభా 75.86 లక్షలు కాగా... 2031 నాటికి అది 1.84 కోట్లకు పెరుగుతుందనే అంచనాలతో కొత్త మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించారు. అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా 22 ప్రాంతాలకు మల్టిపుల్‌ జోన్లుగా గుర్తింపు. ఐదు ప్రాంతాల్లో అంతస్తుల (మల్టీ లెవెల్‌) పార్కింగ్‌ ఏర్పాటుచేస్తారు. 70 కమర్షియల్‌ రోడ్లను గుర్తించారు. 150 హెరిటేజ్‌ భవనాలను గుర్తించి వాటి పరిరక్షణకు ప్రణాళిక రూపకల్పనచేశారు. 29 కొత్త రోడ్లు వేస్తారు.అంతర్గత రోడ్లను 40 అడుగులకు పరిమితం చేస్తారు. కొత్తగా పది ఫ్త్లెఓవర్ల నిర్మిస్తారు . మూసీనది, హుస్సేన్‌సాగర్‌ నాలాలపై 13 వంతెనలకు ప్రతిపాదన చేశారు.హుస్సేన్‌సాగర్‌ సర్‌ప్లస్‌ నాలాలకు గ్రీన్‌ బెల్టుగా గుర్తించి, రెండు వైపులా తొమ్మిది మీటర్ల చొప్పున పచ్చదనం పెంపు చేస్తారు. ఆజామాబాద్‌, సనత్‌నగర్‌ వంటి పారిశ్రామిక ప్రాంతాలకు వర్క్‌ సెంటర్లుగా గుర్తించారు.జాతీయ రహదారులను 120-150 అడుగుల మేరకు విస్తరిస్తారు.ఏడు చోట్ల రైల్‌ అండర్‌ బ్రిడ్జిలు, కందికల్‌ గేట్‌ వద్ద ఆర్వోబీ, తాడ్‌బండ్‌ వద్ద ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మిస్తారు. రోడ్ల విస్తరణలో స్థలాన్నిచ్చే వారికి చెల్లించే పరిహారం 100 శాతంగా ఉన్న ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్స్‌ రైట్స్‌ను 150 శాతానికి పెంచుతారు. ఎంజీబీఎస్‌ మినహా మిగిలిన ఆర్టీసీ బస్టాండ్లు, డిపోలను బహుళ అవసరాలకు వినియోగించుకుంటారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, హైటెక్‌ సిటీ ఫ్త్లెఓవర్‌ నిర్మాణం పూర్తిచేస్తారు. హుస్సేన్‌సాగర్‌లోకి రసాయనాలు మోసుకొచ్చే పికెట్‌, కూకట్‌పల్లి నాలాలపై మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి, వాటర్‌ రీసైక్లింగ్‌ ద్వారా ఆ నీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తారు. బాటసింగారం వద్ద 40 ఎకరాల్లో ట్రక్స్‌ పార్కు ఏర్పాటు చేస్తారు. సాగర్‌ హైవేపై మంగల్‌పల్లి వద్ద 20 ఎకరాల్లో మరో ట్రక్‌ పార్కు ఏర్పాటు చేస్తారు.

రవాణా వ్యవస్థ

రోడ్డు రవాణా

దస్త్రం:Fly Over Hyd.jpg
హైదరాబాదులోని ఒక ఫై ఓవరు

హైదరాబాదు దేశంలోని చాలా నగరాలతో రోడ్డుద్వారా అనుసంధానమై ఉంది. వాటిలో బెంగళూరు, ముంబాయి, పూణె, నాగ్‌పూర్, విజయవాడ, వరంగల్, గుంటూరు , కర్నూలు చెపుకోతగ్గవి. ముఖ్యంగా తెలంగాణాలోని అన్ని పట్టణాలకు ఇక్కడి నుండి రోడ్లు ఉన్నాయి. జాతీయ రోడ్లయిన జాతీయ రహదారి 44, జాతీయ రహదారి 163, జాతీయ రహదారి 65 నగరంలో నుంచే వెళ్తుంటాయి.

హైదరాబాదు నగరం లోపలకూడా మంచి రోడ్లు ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకై ఎన్నో ఫ్లైఓవర్లు నిర్మించటం జరిగింది. ముఖ్యమయినా రోడ్లు చాలావరకు 3-లేన్ సౌకర్యము ఉంది. అయినా కూడా ట్రాఫిక్ సమస్య పెరిగి పోతుండటంతో జాతీయ రహదారుల వెంట వెళ్ళే పెద్ద వాహనాలను నగరం వెలుపల నుండే పంపుటకుగాను ఔటర్ రింగు రోడ్డు నిర్మాణము జరిగింది.[11]

హైదరాబాదు నగరంలో ప్రయాణ అవసరాలకు తెలంగాణా రోడ్డు రవాణా సంస్థ,[12] లెక్కకు మిక్కిలి సిటీ బస్సులను నడుపుతుంది. ఇక్కడ ఉన్న మహత్మా గాంధీ బస్ స్టేషను 72 ప్లాట్ఫారాలతో ఆసియాలోకెల్లా అతిపెద్ద బస్‌స్టేషనుగా పేరు సంపాదించింది. బస్సులేకాక నగరం నలుమూలలకు తీసుకు వెళ్ళే ఆటోలు ఇక్కడ ఇంకో ప్రధాన రవాణా సాధనం.

హైదరాబాద్ రోడ్డు అభివృద్ధి సంస్థ (హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) అనేది తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన పబ్లిక్ రోడ్ల అధికారిక సంస్థ. దీని ద్వారా హైదరాబాదు నగరంలో రోడ్ల నిర్మాణం, నిర్వాహణ పనులు నిర్వర్తించబడుతాయి.

రైలు రవాణా

నక్లెస్ రోడ్డులోని ఎంఎంటిఎస్ రైల్వే స్టేషను

హైదరాబాదుకు జంటనగరమైన సికింద్రాబాదులో దక్షిణమధ్య రైల్వే ముఖ్యకార్యాలయం ఉంది. ఇక్కడి నుండి దేశంలోని అన్ని ప్రాంతాలకు రైలు సౌకర్యం ఉంటుంది.[13]

  1. సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను, ఇది నగరంలో పెద్ద రైల్వేస్టేషన్, ఇక్కడనుండి నగరబస్సులు, ఎమ్ఎమ్టిఎస్ (యంయంటియస్) రైలు సేవలున్నాయి.
  2. నాంపల్లి రైల్వేస్టేషను (హైదరాబాదు దక్కన్)
  3. కాచిగూడ రైల్వేస్టేషను
నగరంలో ఇతర రైల్వేస్టేషన్లు
  1. బేగంపేట రైల్వేస్టేషసు
  2. లింగంపల్లి రైల్వేస్టేషన్
  3. మల్కాజ్‌గిరి రైల్వేస్టేషన్
సబర్బన్ రైల్వే

హైదరాబాదు నగరంలో 2003లో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (Multi-Modal Transport System (MMTS)) ప్రవేశ పెట్టారు. సికింద్రాబాదు - లింగంపల్లి, హైదరాబాదు (నాంపల్లి) - లింగంపల్లి, సికింద్రాబాదు - ఫలక్‌నుమా, లింగంపల్లి - ఫలక్‌నుమా, హైదరాబాదు (నాంపల్లి) - ఫలక్‌నుమా దారులలో రైలు బండ్లు తిరుగుతున్నాయి. 121 ట్రిప్పులతో రోజుకు 180,000 ప్రయాణీకులకు సేవలందిస్తోంది. దీనిక జతగా సెట్విన్ సంస్థ చిన్నబస్సు సేవలు నడుపుతుంది.[14]

మెట్రో రైలు

మెట్రోరైల్ మొదటి దశ 2017 నవంబర్ లో నాగోల్ - అమీర్పేట్- మియాపూర్ మార్గంతో ప్రారంభించబడింది. తరువాత ఎల్ బి నగర్ -అమీర్ పేట మార్గం 2018 అక్టోబరులో ప్రారంభించబడింది. అమీర్ పేట -హైటెక్ సిటీ మార్గం 2019 మార్చి న ప్రారంభించారు.[15] హైదరాబాద్ మెట్రో దేశంలో రెండవ పెద్ద మెట్రోగా గుర్తింపుపొందింది.[16]

విమానయానం

హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్లో కొత్తగా నిర్మించిన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 2008 మార్చి 15 తేదీన ప్రారంభించబడింది.[17] ఇది ప్రపంచం లోని 5 ప్రముఖ విమానాశ్రయాలలో స్థానం సంపాదించింది. 4కిమీపైగా ఉన్న రన్‌వే సౌకర్యంతో, ప్రపంచంలోనే అతిపెద్దదయిన ఎయిర్‌బస్ A380 విమానము కూడా ఇక్కడి నుండి రాకపోకలు సాగించగలదు. ఈ విమానాశ్రయం నుండి భారతదేశంలోని అన్ని ముఖ్య పట్టణాలకు, మధ్య ప్రాచ్య ప్రాంతం నైరుతి ఆసియా, దుబాయి, సింగపూరు, మలేషియా , చికాగో, ఫ్రాంక్‌ఫర్ట్ మొదలైనటువంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన ప్రయాణ సౌకర్యము ఉంది.[18]

హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయము ప్రత్యేక విమానాల (రక్షణ , ఇతరాలు) కొరకు మాత్రమే పనిచేస్తుంది.

ఫ్లైఓవర్‌లు, అండర్ పాస్‌లు

హైదరాబాదు మహానగరం 1591లో స్థాపించబడినందున, నిత్యం పెరుగుతున్న నగర జనాభాకు ప్రస్తుతమున్న రోడ్లు సరిపోవు. పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా తెలంగాణా ప్రభుత్వం, హైదరాబాదు మహానగరపాలక సంస్థ ల ఆధ్వర్యంలో హైదరాబాదు నగరంలోని రోడ్ల అభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. అందులో భాగంగా ప్రభుత్వం నగరం అంతటా అనేక ఫ్లైఓవర్‌లు, అండర్ పాస్‌లు నిర్మించాలని నిర్ణయించింది.

విద్య

విద్య పరంగా హైదరాబాదు దక్షిణ భారతంలో ప్రముఖ కేంద్రం.

పెద్ద గులాబీ రంగు గ్రానైట్ భవనం
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల

ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు చాలావరకు సిబిఎస్ఇ విద్యాపద్ధతి పాటిస్తాయి. మూడింట రెండు వంతులు విద్యార్థులు ప్రైవేట్ సంస్థలలో ఉన్నారు.[19] బోధనా మాధ్యమాలు ఇంగ్లిషు, హిందీ, తెలుగు, ఉర్దూ.[20] సంస్థని బట్టి, విద్యార్థులు సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ పరీక్ష రాస్తారు.[21] లేక ఐసిఎస్ఇ (ICSE) రాస్తారు. సెకండరీ మాధ్యమిక విద్య పూర్తయిన తర్వాత, జూనియర్ కళాశాలలో ఉన్నత మాధ్యమిక విద్యకొరకు చేరుతారు. ఇంజనీరింగ్ వృత్తి విద్య కొరకు ప్రవేశ పరీక్ష (ఎమ్సెట్) (EAMCET) రాసి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ విశ్వవిద్యాలయం, (JNTUH) లేక ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU) అనుబంధం గల కళాశాలలలో చేరతారు.[22][23]

13 విశ్వవిద్యాలయాలలో, రెండు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, రెండు విశ్వవిద్యాలయ అర్హతగలవిభావించబడిని విశ్వవిద్యాలయాలు, ఆరు రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, మూడు కేంద్ర విశ్వవిద్యాలయాలున్నాయి. కేంద్ర విశ్వవిద్యాలయాలలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు, (HCU)[24] మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం , ఇంగ్లీషు , విదేశ భాషల విశ్వవిద్యాలయము ఉన్నాయి.[25] 1918లో ఏర్పాటు చేయబడిన ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాదులోని తొలి విశ్వవిద్యాలయం. ఇది విదేశీ విద్యార్థులని ఆకర్షించడంలో దేశంలో రెండవ స్థానంలో as of 2012 ఉంది.[26] 1982 లో ఏర్పాటైన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, దేశంలోనే తొలి సార్వత్రిక విశ్వవిద్యాలయం[27]

హైదరాబాదులో చాలా జీవసాంకేతికం, జీవమెడికల్ శాస్త్రం, ఔషధాల కేంద్రాలున్నాయి.[28] నేషనల్ ఇన్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPER)[29] హైదరాబాదులో ఐదు వైద్యకళాశాలలున్నాయి. అవి ఉస్మానియా వైద్య కళాశాల, గాంధీ వైద్య కళాశాల, నిజాం వైద్య శాస్త్రాల సంస్థ, దక్కన్ వైద్య శాస్త్రాల సంస్థ] , షాదాన్ వైద్య శాస్త్రాల సంస్థ][30] ఎఐఐఎమ్ఎస్ (AIIMS) హైదరాబాద్ పొలిమేరలలో ప్రతిపాదించబడింది.[31] యునాని వైద్యంలో ప్రభుత్వ నిజామియా టిబ్బి కళాశాల ఉంది.[32]

ఇంకా ప్రముఖ కళాశాలలు లేక సంస్థలు సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (NIRD), నల్సార్ శాసనవిషయాల సంస్థ (నల్సార్), ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (NGRI), ప్రభుత్వరంగ సంస్థల సంస్థ (IPE), the భారతీయ పరిపాలన ఉద్యోగుల సంస్థ (ASCI), ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా (ESCI),సర్దార్ వల్లభభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ. సాంకేతిక కళాశాలలు ఐఐఐటి (IIITH), బిట్స్ (BITS Hyderabad), గాంధీ సాంకేతిక నిర్వహణ సంస్థ (GITAM హైదరాబాదు) , ఐఐటి,హైదరాబాదు (IIT-H), వ్యవసాయ శాస్త్ర సంస్థలు ఇక్రిశాట్ (ICRISAT), ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం.

ఫ్యాషన్ కళకు సంబంధించిన రాఫిల్స్ మిల్లెనియమ్ ఇంటర్నేషనల్, నిఫ్ట్, హైదరాబాదు (NIFT-H), విగాన్ మరియ లీ కళాశాల కూడా ఉన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ 2015 లో పని ప్రారంభించిది. దక్షిణ భారతంలోనే అతిపెద్ద ఇస్లామిక్ విశ్వవిద్యాలయం అయిన జామియా నిజామియా కూడా ఇక్కడే ఉంది.

వాణిజ్య వ్యవస్థ

హైదరాబాదు నగరం ముత్యాలకు, చెరువులకు పేరు సంపాదించినది, ఈ మధ్యన ఐటి రంగం వలన కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తోంది. చార్మినారుకు దగ్గరలోనే ముత్యాల మార్కెట్టు ఉంది. అందుకే ఈ నగరాన్ని ముత్యాల నగరం అని కూడా పిలుస్తారు. వెండి గిన్నెలు, చీరలు, నిర్మల్ , కలంకారి బొమ్మలు, గాజులు, పట్టు, చేనేత, నూలు వస్త్రాలు, లాంటి మరెన్నో వస్తువులతో ఇక్కడ శతాబ్దాల తరబడి వర్తకం నిర్వహిస్తున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్దదైన చలన చిత్ర నిర్మాణ కేంద్రమైన రామోజీ ఫిలిం సిటీ ఇక్కడే ఉంది. రెండు వేల ఎకరాల సువిశాల ప్రదేశంలో ఈ కేంద్రాన్ని 1996లో నిర్మించారు.[33] అంతే కాదు ఆరు వందల లొకేషన్లను కల్పించే ఈ చలన చిత్ర నిర్మాణ కేంద్రం అతిపెద్ద చలన చిత్ర నిర్మాణ కేంద్రంగా గిన్నీసు బుక్కులో స్థానం కూడా సంపాదించింది.[34]

హైదరాబాదులో పేరెన్నికగన్న పరిశోధనాలయాలు , విద్యాలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రభుత్వ రంగంలో ఉంటే మరికొన్ని ప్రైవేటు రంగంలో ఉన్నాయి. అంతేకాదు ఈ పరిశోధనాలయాలు వివిధ రంగాలకు విస్తరించాయి కూడా. వాటిలో కొన్ని:

హైదరాబాదులోనే స్థాపించబోయే మరికొన్ని ముఖ్యమయిన ప్రాజెక్టుల వివరాలు

  • జీనోము వ్యాలీ :- ఇది ఐసిఐసిఐ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రాజెక్టు. బయోటెక్నాలజీ కంపెనీలకు ఉపయుక్తంగా ఉండేటట్లు 200 ఎకరాలలో ఒక నాలేడ్జి పార్కును స్థాపించే ప్రయత్నం ఇది.[35]
  • రాజీవ్ గాంధీ నానో టెక్ సిలికాన్ ఇండియా పార్కు :- దీనిని శంషాబాదులో నిర్మింప తలపెట్టిన కొత్త అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో నిర్మిస్తున్నారు. దీనిని 350-ఎకరాలలో (మొదటి దశ 50 ఎకరాలు) నిర్మించాలని తలపెట్టారు. ఈ ప్రాజెక్టు వలన ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 250 కోట్ల (మొదటి దశలో 60 కోట్లు)అమెరికన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని అంచానా వేస్తున్నారు.[36]

రియల్ ఎస్టేట్ రంగము

భారత దేశంలోని మరెన్నో ఇతర నగరాల వలే హైదరాబాదులో కూడా రియల్ ఎస్టేటు రంగము మంచి అభివృద్ధి సాధిస్తోంది. అందుకు ముఖ్య కారణంగా ఇటీవల కాలంలో తామర తంపరగా వస్తున్న ఐటి సంస్థలనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వం హైటెక్ సిటీని నిర్మించిన తరువాత ఎంతోమంది ప్రైవేటు భాగస్వాములు కూడా ఐటి పరిశ్రమలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. అంతేకాదు సింగపూరులో కార్యకలాపాలు సాగించే ఎసెండాస్ 2002లో హైదరాబాదులోని హైటెక్ సిటీ దగ్గర ఐటీ పార్కుని నిర్మించటానికి ఎల్&టితో, తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.[37] అంతే కాదు ఆంధ్ర ప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ కూడా, సెస్మా ఇంటర్నెషనల్ (CESMA International) అనే సింగపూరుకు చెందిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఐటి ఉద్యోగులకు ఉపయుక్తంగా పోచారం దగ్గర 16000 గృహాల సముదాయాన్ని నిర్మించ తలపెట్టింది.[38]

సైబర్ టవర్లు, హైదరాబాదు ఐటి చిహ్నము

ఐటి రంగము

1990 దశకం తరువాత హైదరాబాదులో ఐటి , ఐటిఇఎస్ కంపెనీలు తామరతంపరగా పెరిగిపోవటం మొదలయింది. అప్పటి నుండి హైదరాబాదును సైబరాబాదు అని కూడా పిలవడం మొదలుపెట్టారు. అంతేకాదు హైదరాబాదును బెంగుళూరు తరువాత రెండో సిలికాను వ్యాలీ గా పిలుస్తున్నారు. ఈ రంగం వలన హైదరాబాదుకు ఎన్నో పెట్టుబడులు రావడంతో సాంకేతిక రంగంలో హైదరాబాదు పేరు దేశమంతా వ్యాపించింది. విద్య మీద ప్రజలు చూపించే శ్రద్ధ, ఇక్కడి ఉత్పాదకత, వాణిజ్యం పెరగడానికి దోహదపడ్డాయి. భారతదేశపు నాలుగో పెద్ద సాఫ్టువేరు కంపెనీ టెక్ మహీంద్రా యొక్క ముఖ్య కార్యాలయం ఇక్కడే ఉంది. ఐ బి ఎం, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఒరాకిల్,డెల్, కాన్బే, జిఇ, సొన్స్ ఈన్దీ, డెలాయిట్, హెచ్ఎస్‌బిసి, జూనో, ఇంటర్‌గ్రాఫ్, కీన్, బాన్ ఇక్కడున్న కంపెనీలలో కొన్ని. తెలంగాణ ప్రభుత్వం ఔత్సాహవంతులకోసం ట్రిపుల్‌ఐటీ ప్రాంగణంలో సుమారు 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ హబ్ను కూడా ప్రారంభించింది.

సంస్కృతి

వైవిధ్యత

ఛార్మినార్ నుండి ఒక దృశ్యం

హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు వంటి వివిధ మతాల ప్రజలు హైదరాబాదులో పెద్దసంఖ్యలో ఉన్నారు. సిక్కులు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. హైదరాబాదీయులు తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషలు మాట్లాడుతారు. హిందువులు, క్రైస్తవులు తెలుగు, ముస్లిములు ఉర్దూ మాట్లాడినప్పటికీ అధికశాతం ప్రజలు రెండు భాషలూ మాట్లాడగలిగి ఉంటారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలు హైదరాబాదులో స్థిరపడటంతో అన్ని రకాల యాసల తెలుగూ ఇక్కడ వినిపిస్తుంది. అయితే ప్రధానంగా తెలంగాణా యాస ఎక్కువగా వినిపిస్తుంది. ఇక్కడి హిందీ, ఉర్దూ కూడా దేశంలోని ఇతర ప్రాంతాల వాటికంటే భిన్నమైన యాస కలిగి ఉంటాయి. హిందువులు, ముస్లిములు అన్నదమ్ముల కలిసి మెలిసి ఉంతరు

ఇక్కడి ముస్లిములు సాంప్రదాయికంగా ఉంటారు. స్త్రీలు బురఖా ధరించడం, మతపరమైన ఆచారాలను కచ్చితంగా పాటించడం వంటివి ఇక్కడ బాగా కనిపిస్తాయి. ఉత్తర భారతీయులకంటే తాము కాస్త కులాసా జీవితం గడుపుతామని మిగతా దక్షిణాది వారి వలెనే హైదరాబాదీయులు కూడా అనుకుంటారు.

రుచులు

హైదరాబాదు రుచులు మిగతా భారతదేశపు రుచుల కంటే భిన్నంగా ఉంటాయి. మొఘలుల రుచులతో కలిసిన తెలంగాణా వంటకాలు ఇక్కడి ప్రత్యేకత. బిరియానీ, బగారాబైంగన్ (గుత్తి వంకాయ), ఖుబానీ కా మీఠా, డబల్ కా మీఠా, హలీమ్, ఇరానీ చాయ్ మొదలైనవి ఇక్కడి ప్రముఖ వంటకాల్లో కొన్ని. చాలామంది హైదరాబాదీ ముస్లింలు పని చేయడానికి మధ్య ప్రాచ్యము అందులో ప్రత్యేకముగా దుబాయి వెళ్ళడము వలన, ఇప్పుడు హలీం ఆ ప్రాంతాలలో కూడా ప్రసిద్ధి చెందినది.హైదరాబాద్‌ హలీం భౌగోళిక చిహ్నం (జియోగ్రాఫికల్‌ ఇండికేటర్‌)ని సొంతం చేసుకొంది.

సమాచార, వినోద మాధ్యమాలు

హైదరాబాదు చారిత్రక, రాజధానిగా ఉండుట వలన ఇక్కడ ప్రచురణ , ఎలక్ట్రానిక్ మీడియా బాగా అభివృద్ధి చెందింది. దాదాపు అన్ని తెలుగు వినోద, వార్తా ఛానళ్ళు రేడియో స్టేషన్లు హైదరాబాదు కేంద్రముగా పని చేయుచున్నవి.

1780 లో స్థాపించిన దక్కన్ టైమ్స్ పత్రిక హైదరాబాద్ నుండి వెలువడిన తొలి వార్తాపత్రిక.[39] తెలుగు పత్రికలలో ప్రధానమైనవి ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ. ఆంగ్ల పత్రికలలో ప్రధానమైనవి ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందు, దక్కన్ క్రానికల్ ప్రముఖ ఉర్దూ పత్రికలు ది సియాసత్ డైలీ, ది మున్సిఫ్ డైలీ,ఇండియన్ ఇతేమాద్.[40][41] సికందరాబాదు కంటోన్మెంట్ బోర్డు తొలి రేడియో కేంద్రాన్ని 1919 లో ప్రారంభించిది. నిజాం కాలంలో దక్కన్ రేడియో కేంద్రం 1935 ఫిబ్రవరి 3 లో ప్రసారాలు ప్రారంభించింది.[42] ఎఫ్ఎమ్ ప్రసారాలు 2000లో ప్రారంభమయ్యాయి.[43] ప్రముఖ ఎఫ్ ఎమ్ రేడియో ఛానళ్లు ఆకాశవాణి, రేడియో మిర్చి, రేడియో సిటీ, రెడ్ ఎఫ్ఎమ్, బిగ్ ఎఫ్ఎమ్, ఫీవర్ 104 ఎఫ్ ఎమ్.[44] టెలివిజన్ ప్రసారాలు 1974 లో దూరదర్శన్ ప్రారంభంతో మొదలయ్యాయి.[45] 1992 జూలైన, స్టార్ టివి ప్రారంభంతో ప్రైవేట్ రంగంలో టెలివిజన్ ప్రసారాలు మొదలయ్యాయి.[46] ఉపగ్రహ టివీ ఛానళ్లు కేబుల్ టెలివిజన్, డిటిహెచ్, ఐపిటివి సేవల ద్వారా లభ్యమవుతున్నాయి.[43][47] మొదటి సారి అంతర్జాల సేవ 1990 దశకంలో కేవలం సాఫ్ట్వేర్ కంపెనీలకు మాత్రమే వుండేవి.[48] ప్రజలకు అంతర్జాల సేవ ప్రభుత్వరంగంలో 1995 లో ప్రైవేట్ రంగంలో 1998 లో ప్రారంభమయ్యాయి.[49] 2015 లో అధిక వేగం గల ప్రజా వైఫై సేవ నగరంలోని కొన్ని భాగాలలో మొదలైంది.[50]

ఆకర్షణలు

మల్టీప్లెక్సు థియేటర్లు

  • ఐనోక్స్ - జివికే వన్ మాల్, బంజారా హిల్స్, రోడ్డు నెం 8
  • సినిమ్యాక్స్ - ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఎదురుగా, బంజారా హిల్స్, రోడ్డు నెం 3
  • బిగ్ సినిమాస్ - బిగ్ బజార్ కాంప్లెక్సు, అమీర్ పేట
  • పి వి ఆర్ - సెంట్రల్ మాల్, పంజగుట్ట
  • ప్రసాద్స్ ఐమ్యాక్స్ - ఎన్ టీ ఆర్ గార్డెన్స్ ప్రక్కన, ఎన్ టీ ఆర్ మార్గ్
  • సినీ ప్లానెట్ - కొంపల్లి
  • జి వి కే మాల్ - బంజారా హిల్స్
  • సుజనా ఫోరమ్ మాల్ కెపిహెబి

షాపింగ్ మాల్ లు

  • హైదరాబాద్ సెంట్రల్ - పంజగుట్ట
  • షాపర్స్ స్టాప్ - బేగంపేట
  • సిటీ సెంట్రల్ - అబీడ్స్ , బంజారా హిల్స్
  • బ్రాండ్ ఫ్యాక్టరీ - అబీడ్స్ , బంజారా హిల్స్
  • జీవీకే మాల్ - బంజారా హిల్స్
  • ఇనార్బిట్ - విబీఐట పార్కు
  • బన్సీలాల్‌పేట్ కోనేరు బావి

గ్రంథాలయాల జాబితా

హైదరాబాదు నగరంలో అనేక గ్రంథాలయాలు ఉన్నాయి. వాటిల్లో నిత్యం అనేకమంది విద్యార్థులు, ఇతరులు పుస్తకాలు చదువుతున్నారు.

కంపెనీలు

హైదరాబాదులో ప్రధాన కార్యాలయాన్ని కలిగివున్న ప్రముఖ కంపెనీలు కూడా ఉన్నాయి.

ప్రముఖులు

హైదరాబాదు నగరంలో జన్మించినవారు, హైదరాబాదీ సంతతికి చెందినవారు లేదా హైదరాబాద్‌లో ఎక్కువకాలం గడిపిన వారిని హైదరాబాదీ అంటారు.

చిత్రమాల

ఇవీ చూడండి

మూలాలు

  1. "World Gazetteer:India - largest cities (per geographical entity)". Archived from the original on 2012-12-04. Retrieved 2006-10-28. నుండి 28/10/2006న సేకరించబడినది.
  2. ఆంగ్ల వికీపీడియాలో మహానగరాల జాబితా నుండి 28/10/2006 న సేకరించబడినది.
  3. డా. మామిడి, హరికృష్ణ (2023-10-19). "Hyderabad, Shehar Ye Pyar Ka". Telangana Today. Archived from the original on 2023-10-20. Retrieved 2023-10-30.
  4. హైదరాబాదు అధికారిక వెబ్‌సైటు Archived 2007-06-11 at the Wayback Machine నుండి హైదరాబాదు చరిత్ర గురించి 29/10/2000న సేకరించబడినది.
  5. ఆర్.ప్లంకెట్, టి.కాన్నన్, పి.డేవిస్, పి.గ్రీన్‌వే , పి.హార్డింగ్‌లు, (2001)లో రాసిన Lonely Planet South India[permanent dead link] అనే పుస్తకములోని 419వ పేజీ నుండి 5/3/2006న సేకరించబడినది. ప్రచురణకర్తలు: Lonely Planet
  6. Bilgrami, 1927, pp. 94.
  7. http://www.indiatraveltimes.com/legend/sultan.html హైదరాబాదుకు ఆ పేరు ఎలా వచ్చింది
  8. Gopi, K.N (1978). Process of urban fringe development: A model. Concept Publishing Company. p. 25. Retrieved 6 August 2013.
  9. Iyer, Neelakantan Krishna; Kulkarni, Sumati; Raghavaswam, V. (13 జూన్ 2007). "Economy, population and urban sprawl a comparative study of urban agglomerations of Banglore and Hyderabad, India using remote sensing and GIS techniques" (PDF). circed.org. p. 21. Archived (PDF) from the original on 19 మే 2012. Retrieved 10 డిసెంబరు 2012.
  10. "Cities having population 1 lakh and above, census 2011" (PDF). Government of India. 2011. p. 11. Archived (PDF) from the original on 7 మే 2012. Retrieved 10 డిసెంబరు 2012.
  11. ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టు వివరాలు Archived 2006-10-24 at the Wayback Machine 29/10/2006న సేకరించబడినది.
  12. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ వెబ్సైట్[permanent dead link]
  13. "History". Indian Railways. Archived from the original on 8 జనవరి 2016. Retrieved 15 ఆగస్టు 2019.
  14. "SETWIN buses back on roads". The Hindu. 4 సెప్టెంబరు 2006. Archived from the original on 2 జూన్ 2012. Retrieved 28 ఏప్రిల్ 2012.
  15. "గుడ్ న్యూస్ : పెద్దమ్మగుడి వద్ద మెట్రో ఆగుతుంది". 2019-03-30. Archived from the original on 2019-08-15. Retrieved 2018-08-15.
  16. Geetanath, V. (2018-09-24). "Hyderabad Metro Rail is now second largest metro network in country". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-01-11.
  17. "Air travel not elitist any more: Sonia". The Hindu. 2008-03-15. Archived from the original on 2008-06-12. Retrieved 2008-06-20.
  18. భారత విమానాశ్రయాల అధికార సంస్థ (AAI) వెబ్‌సైటు నుండి బేగుంపేట విమానాశ్రయ సమాచారం, 29/10/2006న సేకరించబడినది.
  19. Bajaj, Vikas; Yardley, Jim (30 డిసెంబరు 2011). "Many of India's poor turn to private schools". The New York Times. Archived from the original on 1 ఏప్రిల్ 2012. Retrieved 10 జూన్ 2012.
  20. "Centre extends 40-cr aid to Urdu schools". The Times of India. 27 ఫిబ్రవరి 2002. Archived from the original on 11 సెప్టెంబరు 2015. Retrieved 9 జూలై 2011.
  21. "SSC results: girls score higher percentage". The Hindu. 22 మే 2011. Archived from the original on 10 నవంబరు 2013. Retrieved 9 సెప్టెంబరు 2011.
  22. "Vice chancellor's speech about Osmania university". Osmania University. Archived from the original on 12 November 2007. Retrieved 15 November 2007.
  23. "EAMCET 2013" (PDF). Andhra Pradesh State Council of Higher Education. 2013. Archived from the original (PDF) on 1 జూలై 2014. Retrieved 16 ఆగస్టు 2019.
  24. "Annual report 2005–2006" (PDF). University Grants Commission (India). pp. 195–217. Archived from the original (PDF) on 20 అక్టోబరు 2012. Retrieved 16 ఆగస్టు 2019.
  25. "Central universities". Ministry of Human Resource Development, Government of India. Archived from the original on 9 అక్టోబరు 2014. Retrieved 16 ఆగస్టు 2019.
  26. Reddy, T. Karnakar (30 మార్చి 2012). "OU to hike fee for foreign students". CNN-IBN. Archived from the original on 21 ఏప్రిల్ 2012. Retrieved 2 మే 2012.
  27. Reddy, R. Ravikanth (22 ఆగస్టు 2005). "Distance no bar". The Hindu. Archived from the original on 8 ఫిబ్రవరి 2012. Retrieved 3 మే 2012.
  28. Iype, George (30 నవంబరు 2004). "Hyderabad: India's Genome Valley". Rediff.com. Archived from the original on 19 అక్టోబరు 2012. Retrieved 3 మే 2012.
  29. "A fillip to pharma sector". The Hindu. 21 సెప్టెంబరు 2009. Archived from the original on 23 అక్టోబరు 2013. Retrieved 3 జనవరి 2011.
  30. "List of colleges teaching MBBS". Medical Council of India. 2010. Archived from the original on 7 జూన్ 2013. Retrieved 16 ఆగస్టు 2019.
  31. "Cabinet gives nod for setting up AIIMS at Bibinagar in Telangana". The New Indian Express. Archived from the original on 19 డిసెంబరు 2018. Retrieved 11 జనవరి 2019.
  32. "Blow to students as Unani PG seats slashed". The Times of India. 9 ఆగస్టు 2012. Archived from the original on 11 సెప్టెంబరు 2015. Retrieved 3 మే 2012.
  33. రామోజి ఫిలిం సిటీ వెబ్‌సైటు Archived 2006-12-17 at the Wayback Machine నుండి 28/10/2006న సేకరించబడినది.
  34. గిన్నీసు బుక్కులో Archived 2006-10-30 at the Wayback Machine అతిపెద్ద సినీ నిర్మాణ కేంద్రంగా రామోజీ ఫిలిం సిటీ స్థానము, 28/10/2006న సేకరించబడినది.
  35. జీనోము వ్యాలీ Archived 2016-03-08 at the Wayback Machine నుండి 28/10/2006 న సేకరించబడినది.
  36. ఏపి ప్రభుత్వ సైటు Archived 2007-01-02 at the Wayback Machine నుండి 28/10/2006న సేకరించబడినది.
  37. ఎసెండాస్ ఇంఫోసిటీ వెబ్‌సైటు Archived 2006-09-17 at the Wayback Machine నుండి 28/10/2006న సేకరించబడినది.
  38. తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ వెబ్‌సైటు Archived 2006-10-18 at the Wayback Machine లో సంస్కృతి గృహసముదాయం గురించిన వివరణ, 28/10/2006న సేకరించబడినది.
  39. Masood Ali, Khan (1995). The history of Urdu press: a case study of Hyderabad. Classical Publishing. p. 27. OCLC 246868337.
  40. "Magazine publishers of India". Publishers Global. p. 1. Archived from the original on 18 ఫిబ్రవరి 2013. Retrieved 16 ఆగస్టు 2019.
  41. "Hyderabad Urdu papers launch campaign for simple weddings". The Indian Express. 12 డిసెంబరు 2012. Archived from the original on 1 జనవరి 2016. Retrieved 1 ఆగస్టు 2013.
  42. "The long and interesting story of all India Radio, Hyderabad – part 1". ontheshortwaves.com. 15 ఆగస్టు 2010. Archived from the original on 5 మే 2013. Retrieved 16 ఆగస్టు 2019.
  43. 43.0 43.1 "South Asia: India". Central Intelligence Agency. 12 ఏప్రిల్ 2012. Archived from the original on 11 జూన్ 2008. Retrieved 16 ఆగస్టు 2019.
  44. "Radio stations in Andhra Pradesh, India". asiawaves.net. Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 16 ఆగస్టు 2019.
  45. "Kendra's origin". Doordarshan Kendra Hyderabad. 2008. Archived from the original on 6 నవంబరు 2011. Retrieved 16 ఆగస్టు 2019.
  46. Manchanda, Usha (1998). "Invasion from the skies: the impact of foreign television in India". Australian Studies in Journalism. 7: 146.
  47. "Consolidated list of channels allowed to be carried by cable operators/ multi system operators/ DTH licensees in India" (PDF). Ministry of Information and Broadcasting (India). Archived from the original (PDF) on 5 సెప్టెంబరు 2012. Retrieved 16 ఆగస్టు 2019.
  48. Fortner, Robert.S; Fackler, P. Mark (2011). The handbook of global communication and media ethics. John Wiley & Sons. ISBN 978-1-4051-8812-8.
  49. "Information and communication technologies throughout the world" (PDF). UNESCO. 1998. p. 210. Archived (PDF) from the original on 5 అక్టోబరు 2013. Retrieved 26 మే 2012.
  50. "Hyderabad begins rollout of public WiFi". Livemint. 16 ఏప్రిల్ 2015. Archived from the original on 18 ఏప్రిల్ 2015. Retrieved 16 ఏప్రిల్ 2015.
  51. "Directions". ISKCON, Hyderabad. Archived from the original on 2008-11-20. Retrieved 2008-12-26.

బయటి లింకులు