Jump to content

శివలింగం

వికీపీడియా నుండి
శివ లింగం
శివలింగ పుష్పం
తిరువన్నామలై ఆలయంలోని పంచముఖ శివలింగం

శివలింగం హిందూ మతంలో పూజింపబడే, శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం. సాంప్రదాయంలో లింగం శక్తి సూచికగా, దైవ సంభావ్యతగా పరిగణింపబడుతుంది. సాధారణంగా శివలింగం సృజనాత్మక శక్తికి సూచికగా ప్రతిష్ఠింపబడి ఉంటుంది.

పూర్వం శివుడ్ని విగ్రహ రూపం లోనే పూజించే వారు (హరప్పా శిథిలాలలో దొరికిన పశుపతి విగ్రహాన్ని పరిశీలించవచ్చు). వరాహపురాణం లోని వేంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాథలో భృగు మహర్షి శాప ఘట్టంలో భృగుమహర్షి శివుడ్ని "నేటి నుండి నీ శివలింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు, నీ ప్రసాదం నింద్యం అవుతుంది" అని శపిస్తాడు. అంటే అంతకుముందు విగ్రహానికి పూజలుండేవన్నమాట. శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే. ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటి దాకా ఎవరూ కచ్చితంగా తేల్చలేదు. శివం అనే పదానికి అర్థం శుభప్రదమైనది అని. లింగం అంటే ఆకారం అని అర్థం.శివ లింగం అంటే శివుని ఆకారం అని అర్ధం, పురుషలింగం/స్త్రీ లింగం అంటే పురుష ఆకారం,స్త్రీ ఆకారం అని అర్ధం. అంటే శివలింగం సర్వ శుభప్రదమైన దైవాన్ని సూచిస్తుంది,నిరాకారమైన దైవానికి రూపం లేదు, సాకారమైన దైవానికి ఆకారమే శివలింగ రూపం. ప్రపంచంలో లింగం ఎన్నో రూపాల్లో ప్రజల గౌరవాన్ని పొందుతోంది.

పురాణాల్లో లింగోద్బవం

[మార్చు]

మహా శివరాత్రి పర్వదినాన అర్ధరాత్రి లింగోద్భవ కాల పూజ పరమ శివుడిని కొలిచేందుకు అత్యంత అనుకూలమైన సమయం. ఈ లింగోద్భవం గురించి స్కంద పురాణంలో వివరించడం జరిగింది. మహా ప్రళయం తరువాత, సృష్టి, స్థితి కారకులైన బ్రహ్మ, విష్ణువు మధ్య ఎవరు గొప్పో తేల్చుకోవాలన్న పోటీ వచ్చి, అది సంగ్రామానికి దారి తీసింది. ఒకరిపై ఒకరు భీకర ఆస్త్రాలను ప్రయోగించుకునే వేళ, మరో ప్రళయాన్ని నివారించేందుకు లయ కారకుడు రంగంలోకి దిగి, ఆద్యంతాలు తెలియని మహాగ్ని స్తంభం రూపంలో అవతరించి దర్శనమిచ్చాడు. ఇది జరిగింది మాఘ బహుళ చతుర్దశి నాటి అర్థరాత్రి. ఇదే లింగోద్భవ కాలం.

ఇక ఈ శివ లింగావతారం మొదలును తెలుసుకునేందుకు విష్ణువు వరాహ రూపంలో, ముగింపును చూసేందుకు బ్రహ్మ హంస రూపంలో వెళ్లి, తమ లక్ష్యాన్ని చేరలేక తిరిగి వచ్చి శివుడినే శరణు కోరగా, తన నిజరూపంతో వారికి దర్శనమిచ్చి వారిలో నెలకొన్న అహంకారాన్ని రూపుమాపాడు. శివుడు తొలిసారిగా లింగ రూపంలో దర్శనమిచ్చిన సమయం కాబట్టి లింగోద్భవ కాలం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అందుకే, రాత్రి 11 గంటల వేళ మొదలయ్యే లింగోద్భవ కాల పూజలను భక్తులు అత్యంత శ్రద్ధతో నిర్వహించి పరమశివుడి కృపకు పాత్రులవుతుంటారు.[1]

శివ లింగనిర్మాణం

[మార్చు]

శివలింగము (మానుష లింగము) లో మూడు భాగాలు ఉంటాయి. బ్రహ్మ భాగము భూమిలో, విష్ణు భాగం పీఠంలో, శివ భాగం మనకు కనిపించే పూజా భాగముగా శిల్పులు ఆగమ శాస్త్రాలలో సూచించిన విధముగ సరియైన రాతితో గాని ఇతర పదార్ధాలతో నిర్మిస్తారు.

శివలింగము

శివ లింగాలు - రకాలు

[మార్చు]
  • స్వయంభూ లింగములు: స్వయముగా వాటి అంతట అవే వెలసినవి.
  • దైవిక లింగములు: దేవతా ప్రతిష్ఠితాలు.
  • ఋష్య లింగములు: ఋషి ప్రతిష్ఠితాలు.
  • మానుష లింగములు: ఇవి మానవ నిర్మిత లింగములు.
  • బాణ లింగములు: ఇవి నర్మదా నదీతీరాన దొరికే (తులా పరీక్షకు నెగ్గిన) బొమ్మరాళ్ళు.

షణ్మతాలు

[మార్చు]

హిందూ మతాన్ని అనుసరించే వారిని ఆరు వర్గాలుగా విభజించవచ్చు.వీటినే షణ్మతాలు అంటారు.

పంచభూతలింగాలు

[మార్చు]

పంచభూతాలు అనగా పృథివి, జలం అగ్ని, వాయువు, ఆకాశం. శివుడు ఈ పంచభూతాల స్వరూపాలైన లింగరూపాలతో ఐదు క్షేత్రాలలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు.

  1. తేజో లింగం: అన్నామలైశ్వరుడు - తిరువన్నామలై అరుణాచలం
  2. జల లింగం: జంబుకేశ్వరుడు- తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం శ్రీరంగపట్టణం దగ్గర 2 కి.మీ
  3. ఆకాశ లింగం: చిదంబరేశ్వరుడు (నటరాజ) - చిదంబరం:
  4. పృథ్వీ లింగం: ఏకాంబరేశ్వరుడు - కంచి:
  5. వాయు లింగం: శ్రీకాళహస్తీశ్వరుడు - శ్రీకాళహస్తి:

పంచారామాలు

[మార్చు]
  1. అమరారామం: అమరావతి (గుంటూరు జిల్లా) శ్రీ అమరేశ్వర స్వామి, బాలచాముండికా దేవి
  2. ద్రాక్షారామం: ద్రాక్షారామ (తూర్పు గోదావరి జిల్లా) శ్రీ భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ
  3. కుమారారామం: సామర్లకోట (తూర్పు గోదావరి జిల్లా) శ్రీ కుమార భీమేశ్వర స్వామి, బాలాత్రిపురసుందరి
  4. భీమారామం: భీమవరం (పశ్చిమ గోదావరి జిల్లా) శ్రీ సోమేశ్వర స్వామి, అన్నపూర్ణ
  5. క్షీరారామం: పాలకొల్లు (పశ్చిమ గోదావరి జిల్లా) శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి, ఉమ

కొన్ని విశేషాలు

[మార్చు]
  • శ్రీకాళహస్తి లోని శివలింగాన్ని అభిషేకించేటపుడు ఎవరూ లింగాన్ని తాకరు. కేవలం లింగం కింద భాగమైన పానువట్టాన్ని మాత్రమే తాకుతారు.
  • కంచి లోని శివలింగం మట్టితో చేసింది (పృధ్వీ లింగం) కాబట్టి లింగానికి అభిషేకం జరగదు. నూనెను మాత్రమే పూస్తారు.
  • శివరాత్రి నాడు జాగరణ చేసి లింగోద్భవ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని హిందువుల విశ్వాసం.

ఇవి కూడా చూడండి

[మార్చు]


మూలాలు

[మార్చు]
  1. పురాణాల్లో లింగోద్బవం
"https://te.wikipedia.org/w/index.php?title=శివలింగం&oldid=4237111" నుండి వెలికితీశారు