ఉపనయనము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉపనయనానంతరం ఆ క్రతువులో పాల్గొన్న ఒక బాలుడు. చిత్రంలో యజ్ఞోపవీతము, దండము, ముంజీయమూ చూడవచ్చు.

ఉపనయనము హిందువులలో అబ్బాయిల వేదాభ్యాసానికి ముందుగా చేసే ప్రక్రియ. ఉపనయనాన్ని ఒడుగు అని కూడా అంటారు. ఇది అధికంగా పురుషులకు చేస్తారు. బాల్యావస్థ నుండి బ్రహ్మచర్యావస్థకు మారే సమయాన ఇది చేయడం ఆనవాయితీ. అప్పటి వరకు నియమ నిష్ఠ లతో పనిలేకుండా సంచరించే బాలుడు నియమ నిష్ఠలతోకూడిన జీవితంలో ప్రవేశించడానికి చేసే శాస్త్రీయమైన ప్రక్రియ ఇది. ఉపనయనానికి ముందు ఒక జన్మ తరువాత ఒక జన్మగా కూడా వ్యవహరించడం వలన ఉపనయనానికి అధిక ప్రాముఖ్యతను ఇచ్చే బ్రాహ్మణుని సమాజంలో ద్విజుడు అని నామాంతరంతో వ్యవహరిస్తుంటారు.

క్షత్రియులు, వైశ్యులు ఇప్పటికీ దీనిని ఆచరిస్తున్నా, అధిక ప్రాముఖ్యతతో నిర్దిష్ట విధులతో బ్రాహ్మణులు దీనిని అధికంగా ఆచరిస్తున్నారు. మిగిలినవారిలో ఇది ఒక ఆనవాయితీగా మారింది. వివాహపూర్వం ఒక తంతుగా మాత్రం దీనిని ఇప్పుడు ఆచరిస్తున్నారు. పూర్వకాలం గురుకులాభ్యాసం చేసే అలవాటు ఉన్న కారణంగా ఉపనయనం చేసి గురుకులానికి బాలురను పంపేవారు. అక్కడవారు విద్యను నేర్చుకుని తిరిగి స్వగృహానికి వచ్చి గృహస్థాశ్రమంలో ప్రవేశించేవారు.

ఉపనయనము అయ్యేవరకు పురుషుడు స్వయంగా ఎటువంటి ధర్మకార్యం నెరవేర్చటానికి అర్హుడుకాడు. యజ్ఞయాగాది క్రతువులు నెరవేర్చటానికి ఉపనయనము చేసుకున్న తరువాతే అర్హత వస్తుంది. క్షత్రియులకు ధర్మశాస్త్రాలభ్యసించడం అత్యవసరం కనుక ఉపనయన క్రతువు జరిపించి, విద్యాభ్యాసం ఆరంభించేవారు. పితరులకు కర్మకాండ, తర్పణం లాంటి కార్యాలు చేయడానికి ఉపనయనం అత్యవసరం. కొన్ని సందర్భాలాలో తల్లి తండ్రులు మరణావస్థలో ఉన్న సమయాలలో అత్యవసరంగా ఉపనయనం జరిపించి, కర్మకాండ జరిపించే అర్హతనిస్తారు. సన్యసించడానికి ఉపనయనం ప్రధానమే. కనుక హిందూ ధర్మంలో ఉపనయనం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఒక ప్రక్రియ. హిందూ ధర్మంలో ఇది బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు తప్పక నిర్వహించవలసిన బాధ్యత.

ఉపనయన ప్రాముఖ్యం

[మార్చు]

ఉపనయనము హిందువులలో కొన్ని కులాలలో మాత్రమే జరిగే ప్రక్రియ. ఇది సాధారణంగా బ్రాహ్మణులకు, వైశ్యులకు, క్షత్రియులకు జరుగుతుంది. ఉపనయనం జరిగిన రోజున బాలుని తండ్రి బాలునికి చెవిలో గాయత్రీ మంత్రం ఉపదేశిస్తాడు. ఉపనయనం జరిగిన నాటి నుండి వటువు ప్రతి నిత్యం గాయత్రిని పూజిస్తూ బ్రహ్మచర్యం పాటించాలి. వేదాభ్యాసానికి ముందు తప్పనిసరిగా ఉపనయనం చేయవలెను. వివాహానికి ముందు బ్రహ్మచర్యాన్ని స్నాతక ప్రక్రియ ద్వారా వదిలి, గృహస్థాశ్రమంలోనికి ప్రవేశిస్తాడు వరుడు.

శ్లోకము
ఉపనయమనం విద్యార్థస్యశ్రుతిత్ స్సగ్గ్ స్కారః అప. ధర్మసూత్రం.

అనగా వేదాధ్యాయనౌ కొరకు శ్రుతి మంత్రములచేత చేయబడు సంస్కారమే ఉపనయనము. అనబడును.

శ్లో
అగ్ని కార్య త్పరిభ్రష్టాః తే సార్వే వృషలాస్మృతాః.||. పరాశర స్మృతి వేదాద్యయనము చేయై బ్రాహ్మణునకు 'వృష్లుడు.' అని పేరు. వృషలుడు అనగా శూద్రుడు లేక పాపాత్ముడు అని అర్థము. కనుక బ్రాహ్మణ బ్రాహ్మచారులకు వేదాధ్యయనము నిత్యమైనది.,. అవశ్యకమైనదీ కూడాను.

ఉపనయన ముహూర్తము

[మార్చు]

ఉపనయనము ఉత్తరాయణ కాలంలో మాత్రమే చేయవలెను. ఉపనయన ముహూర్తము తండ్రి జన్మ నక్షత్రం, బాలుని జన్మ నక్షత్రంపై ఆధారపడుతుంది.

విధులు

[మార్చు]

ఉపనయన విధులు బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు వేరు వేరుగా ఉంటాయి.

బ్రాహ్మణులకు 5 సంవత్సరాలవయసులో ఉపనయనం చేసినట్లు అయితే "బ్రహ్మ వర్చస కామం పంచమ వర్షే" అథవా గర్బాష్టకంలో బ్రాహ్మణులకు ఉపనయనం చేయాలి. క్షత్రియులకు 11 సంవత్సరాల వయసులో, వైశ్యులకు 12 సంవత్సరాల వయసులో ఉపనయనము చేయడం ఉచితమని శాస్త్రనిర్ణయం. ఉపనయన సమయంలో బ్రాహ్మణులు నార వస్త్రాన్ని అంగవస్త్రంగా ధరించి, జింకతోలును ఉత్తరీయంగా ధరించాలి. అలాగే బ్రాహ్మణుడు ముంజకసవుతో పేనిన మొలత్రాడును ధరించాలి. ముంజ కసవు దొరకనప్పుడు దర్భ గడ్డిని నీటితో తడిపి ఒక ముడివేసి ధరించవచ్చు. మొలత్రాడు విధిగా ముప్పేటగా ధరించాలి. నూలుతో కట్టిన మూడు పోగుల యజ్ఞోపవీతాన్ని ధరించాలి. అలాగే బిల్వము లేక మోదుగ దండాన్ని కేశమువరకు ఉండేలా చేసుకుని ధరించాలి. ఉపవీతుడైన పిమ్మట భవతీ బిక్షాక్షాం దేహిఅని యాచించాలి. గురుకులానికి వెళ్ళిన బ్రాహ్మచారి యాచనతో దొరికిన ఆహారాన్ని గురువుకు సమర్పించి, తరువాత గురువు అనుమతితో భుజించాలి. అవశిష్టాన్ని పరిశుద్ధుడై తూర్పుముఖంగా కూర్చుని భుజించాలి. భుజించిన పిదప చేతులు శుభ్ర పరచుకుని ఆచమనం చేసి శరీరావయాలను నీటితో శుభ్రపరచుకోవాలి. ఆ తరువాత వస్త్రంతో అవయవాలను తుడుచుకోవాలి. ముందుగా తల్లిని కానీ, సోదరిని కానీ తల్లి వైపు సోదరిని కానీ యాచించడం ఉత్తమం. అవమానించని వారిని యాచించడం ఉత్తమమని అంతరార్ధం. ఈ మాదిరి బ్రహ్మచారి యాచించడం మధూకరం అంటారు. ఇందుకు పేద గొప్పా తారతమ్యం లేదు. అందరూ గురు శుశ్రూషలో సమానమే. ఉపనయనమునకు బ్రాహ్మణులకు చైత్ర వైశాఖ మాసాలు ఉత్తమం.

అలాగే క్షత్రియులకు వెల్వెట్ వస్త్రాన్ని అంగవస్త్రంగా ధరించి కురుమృగ చర్మాన్ని ఉత్తరీయంగా ధరించాలి. ముర్వ కసవుతో చేసిన మొలత్రాడును అది లభించని పక్షంలో నీటితో తడిపిన రెల్లుని మూడు ముడులు వేసి ధరించాలి. జనపనారతో చేసిన తొమ్మిది వరసలుగల యజ్ఞోపవీతాన్ని ధరించాలి. యజ్ఞోపవీతానికి జంద్యం అనే మరో పేరుకూడా ఉంది తమిళనాట ప్రతి సంవత్సరం జంద్యాల పండుగ జరుపుకుంటారు. తమిళనాట ఈ పండుగను ఆవణి ఆవట్టం అంటారు. వివాహానంతరం మొదటిసారిగా ఈ పండుగ అత్తవారింట జరుపుకోవడం ఆనవాయితే. యజ్ఞోపవీతాన్ని భుజంపై నుండి రెండవ చేతి క్రిందిగా ధరించాలి. శుభకార్యాలకు సవ్యంగానూ కర్మక్రియలు లాంటి పితృ కార్యాలు జరిపేటప్పుడు అపసవ్యంగా ధరించడం ఆనవాయితీ. అలాగే మర్రి లేక చండ్ర కొమ్మను కానీ నొసటి వరకు ఉండేలా దండాన్ని ధరించాలి. తరువాత బిక్షాం భవతి దేహి అని యాచించాలి. యాచించే ముందు సూర్యోపాసన చేసి అగ్నికి ప్రదక్షిణ చేసి యాచించాలి. క్షత్రియులకు జ్యేష్ట ఆషాఢాలు ఉపనయము చేయడానికి ఉత్తమమని భావన.

అలాగే వైశ్యులు ఉన్ని బట్టను అంగవస్త్రంగా ధరించి గొర్రెతోలును ఉత్తరీయంగా ధరించాలి. వైశ్యుడు జనపనారతో చేసినది అది లభ్యం కానిచో తుంగతో చేసిన మొలత్రాడును ముప్పేటగా చేసి అయిదు ముడులు వేసి ధరించాలి. మేక బొచ్చుతో చేసిన తొమ్మిది పేటల యజ్ఞోపవీతాన్ని ధరించాలి. జమ్మి లేక మేడి కొమ్మను ముక్కు వరకు ఉండేలా ధరించాలి. దండం వంకర లేనిది అగ్నిలో కాలనిది పైపట్టతో కూడినదై ఉండాలి. ఆశ్వయుజ, కార్తీక మాసాలు వైశ్యులకు ఉత్తమ ఉపనయన కాలమని పెద్దల భావన.

ఉపనయన విధానం

[మార్చు]

ఉపనయనం చేయించే అధికారం ముందుగా తండ్రికి లేనిచో అన్నకు అదికూడా లేనిచో దాయాదులకు అంటే సగోత్రికులకు ఉంటుంది. ఉపనయనం చేయించే వ్యక్తిని ఆచార్యుడుగా వ్యవహరిస్తారు. ఉపనయన సమయంలో వటువునకు ఆచార్యుడు గాయత్రీ మంత్రోపాసన చేస్తాడు. యజ్నోపవీత ధారణ సమయంలో అయిదుగురు బ్రహ్మచారులను పూజించి పసుపు బట్టలను ఇవ్వడం ఆచారం. బ్రహ్మ దేవునకు సహజంగా లభించిందీ మొదట పుట్టినదీ అయిన ఈ పవిత్ర యజ్ఞ ఉపవీతాన్ని నేను ధరిస్తున్నాను ఈ యజ్ఞ ఉపవీతం నాకు తేజస్సు, బలం, దీర్ఘాయువు, నిర్మలత్వం, పుష్టిని ఇచ్చుగాక అని వటువు మంత్రయుక్తంగా చెప్పి ధరిస్తాడు. యజ్ఞోపవీత ధారణ వటువునకు ఆశ్రమ వాసాధికారం, కామ్యసిద్ధి, విద్యాధ్యయనం, వేదాధ్యయనం, సంపద, యశస్సు, ఆయుష్షు, ధర్మాచరణాధికారం ఇస్తుంది.

అగ్నిహోత్రమునకు ఉత్తర దిక్కుగా ఆచార్యుడు కూర్చుని దక్షిణ దిశగా సన్నికల్లు ఉంచి వటునిచే అతిష్టేమ మంత్రం చెప్పి తొక్కించాలి. రాయివలెనే నీవు బ్రహ్మచర్య వ్రతములో స్థిరుడవై ఉండాలని దీని అర్ధం. ఆ రాతి మీదనే వస్త్రాలను అభిమంత్రించి వటువునకు ధరింపచేయవలెను, దేవతా వస్త్రాలను ధరించి ఐశ్వర్య వంతుడవై ఆర్తులను ఆప్తులను ఆదుకుంటూ నిండునూరేళ్ళు జీవించమని ఆశ్వీర్వదిస్తూ ఈ వస్త్రధారణ జరుగుతుంది. ఆ తరువాత మొలత్రాడు కట్టి యజ్ఞోపవీతాన్ని ధరింపచేసి మంత్రోపాసన చేయించాలి. వటువు ఆచార్యునకు గోదానం ఇచ్చి దండధారణ చేయించి అగ్నికి ప్రదక్షిణచేసి భిక్షాటనకు బయలు దేరాలి.

ఉపనయనమునకు ముఖ్య కాలము

[మార్చు]

శ్లో: గర్భా-ష్టమేషు బ్రాహ్మణ ముష్నయీత.' ( ఆపస్థంబ సూత్రం) అనగా తల్లి గర్భములో ఉన్న 9 మాసములను కలిపి లెక్క చూచినతో వటువునకు 8 వ సంవత్సరం రావలెను. అనగా 7 సంవత్సరాల 3 నెలలు 9 గర్భమాసములు కలిపినచీ 8 వ సంవత్సరం వచ్చును. దీనినే ఘర్భాష్టమ సంవత్సస్రం. అని అంటారు. ఇదియే సరైన కాలము.

బ్రహ్మచర్య ధర్మాలు

[మార్చు]

ఉపనయనము తరువాత వటువు కనీసం 12 సంవత్సరాలు ఒక వేదమునైనా అభ్యసించాలి. అలాగే ఒక్కో వేదానికి ఒక్కో 12 సంవత్సరాలు బ్రహ్మచర్యం అవలంబించవచ్చు. కానీ అది తప్పని సరికాదు. కలియుగములో ఎక్కువకాలం బ్రహ్మచర్యం మంచిదికాదని ఋషి భావన. ఆ తరువాత స్నాతకం చేసి వివాహ జీవితంలో ప్రవేశపెట్టడం శాస్త్రసమ్మతం.

బ్రహ్మచారికి నియమ నిష్ఠలు అనేకం ఉంటాయి. సుగంధ ద్రవ్యాలను వాడరాదు, పగటి నిద్ర పనికి రాదు, అలంకరణ చేసుకోరాదు, కామక్రోధ మద మాత్సర్యాలకు దూరంగా ఉండాలి, స్త్రీలయందు మౌనం సాధించాలి, సంగీత నృత్య వాద్యాలకు దూరంగా ఉండాలి, దుర్జన సాంగత్యం చేయకూడదు, చన్నీటి స్నానం మాత్రమే చేయాలి, వాహనాన్ని అదిరోహించకూడదు, వివేకం వీడకూడదు. దంతధావనానికి సుగంధాలను ఉపయోగించరాదు, అతిగా ఉద్రేకం, సంతోషం లాంటివి దరిచేరనీయకూడదు. అద్దములో ముఖమును చూడరాదు. మధువు, మాంసము తీసుకొనకూడదు. ఉప్పు, కారం లేని సాత్విక భోజనమే భుజించాలి. గురువు ఆజ్ఞను శిరసావహించాలి. ఇలా అనేక నియమ నిస్ఠలతో బ్రహ్మచర్యాన్ని కొనసాగించాలి. విద్యాభ్యాస సమయంలో బ్రహ్మచారి గురువునకు ఏమీ ఇవ్వనవసరం లేదు. కానీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని గురువును అడిగి అతను కోరినది గురుదక్షిణగా సమర్పించడం ఆచారం.

ఉపనయన ముహూర్తం, దోషాలు , నివారణ

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఉపనయనము&oldid=4167454" నుండి వెలికితీశారు