శ్రీ కృష్ణుడు

వికీపీడియా నుండి
(కృష్ణ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కృష్ణుడు
రాధాకృష్ణులు - 18వ శతాబ్దానికి చెందిన రాజస్థానీ చిత్రం
రాధాకృష్ణులు - 18వ శతాబ్దానికి చెందిన రాజస్థానీ చిత్రం
సంప్రదాయభావంవిష్ణువు పూర్ణావతారం
ఆవాసంబృందావనం, ద్వారక,
మంత్రంశ్రీ కృష్ణః శరణం మమః , ॐ నమో భగవతే వాసుదేవాయ
ఆయుధంసుదర్శన చక్రం
భార్యరుక్మిణి, సత్యభామ, జాంబవతి, నాగ్నజితి, లక్షణ, కాళింది, భద్ర, మిత్రవింద.
వాహనంగరుత్మంతుడు
గ్రంధాలుభాగవతం, భగవద్గీత

శ్రీకృష్ణుడు, హిందూమతంలో అర్చింపబడే ఒక దేవుడు. విష్ణువు పది అవతారాలలోఎనిమిదవ అవతారము. హిందూ పురాణాలలోను, తాత్త్విక గ్రంథాలలోను, జనబాహుళ్యంలోని గాథలలోను, సాహిత్యంలోను, ఆచార పూజా సంప్రదాయాలలోను కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు, చిత్రీకరిస్తుంటారు. చిలిపి బాలునిగాను,రాధా గోపికా మనోహరునిగాను, రుక్మిణీ సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను, గోపికల మనసు దొచుకున్నవాడిగాను యాదవరాజుగాను, అర్జునుని సారథియైన పాండవ పక్షపాతిగాను, భగవద్గీతా ప్రబోధకునిగాను, తత్త్వోపదేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రిక రాజనీతిజ్ఞునిగాను ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరింపబడినాయి.[1][2][3]. మహాభారతం, హరివంశం, భాగవతం, విష్ణుపురాణం - ఈ గ్రంథాలు కృష్ణుని జీవితాన్ని, తత్త్వాన్ని తెలిసికోవడానికి హిందువులకు ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు.

హిందూమతంలో, ప్రత్యేకించి వైష్ణవులలో కృష్ణునిపూజ దేశమంతటా చాలా ముఖ్యమైనది. మథురలో బాలకృష్ణునిగా, పూరీలో జగన్నాథునిగా, మహారాష్ట్రలో విఠోబాగా, రాజస్థాన్‌లో శ్రీనాధ్‌జీగా, తిరుమలలో వేంకటేశ్వరునిగా, ఉడిపిలో కృష్ణునిగా, గురువాయూరులో గురువాఐరోపాపగా కృష్ణుని పూజిస్తారు. ఇంతే కాకుండా కృష్ణుని ఆలయాలు, విష్ణువు ఆలయాలే అనవచ్చును. ఇందుకు అనుగుణంగా దేశంలో వివిధ ప్రాంతాలలోను, వర్గాలలోను అనేక సంప్రదాయాలు నెలకొన్నాయి. వీటిలో ప్రధానమైన భావం:

శ్రీమహా విష్ణువు తన సృష్టి లోని జీవులకు బాధలు హెచ్చినప్పుడు, లోకంలో పాపం హద్దు మీరినప్పుడు, దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించడం కోసం జీవుల రూపంలో అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు. ఈవిధంగా అవతరించడాన్నిలీలావతారం అంటారు. ఇలాంటి లీలావతారాలు, భాగవతం ప్రకారం, భగవంతునికి ఇరువది రెండు (22) ఉన్నాయి. శ్రీమహావిష్ణువు లీలావతారాలలో ఇరువది ఐదవ అవతారం శ్రీకృష్ణావతారం. ఈ లీలావతారాలు ఇరవైరెండింటి లోనూ ముఖ్యమైనవి పది ఉన్నాయి. ఈ పదింటిని దశావతారాలు అంటారు. దశావతారాలలో శ్రీకృష్ణావతారం కొన్నిచోట్ల చెప్పబడుతుంది. కొన్నిచోట్ల చెప్పారు. ("రామోరామశ్చరామశ్చ"). యుగాలలో రెండవదయిన త్రేతాయుగంలో శ్రీరాముని లోక కళ్యాణ కారకునిగ రావణాది రాక్షస శిక్షకుడుగా కీర్తించబడుతున్నాడు. నారాయణుడు ఆ తర్వాతదయిన ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు. శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారాల్లో పరిపూర్ణావతారంగా కొలవబడుతున్నాడు. గీతోపదేశం ద్వారా అర్జునుడికి సత్యదర్శనం చేసి, కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ముందుకు నడిపించాడు. ఆ విధంగా భగవద్గీతను లోకానికి ఉపదేశించి శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు.

నామాలు, రూపం

[మార్చు]
ఒడిషా జగన్నాథ మందిరంలో ఉన్న బలభద్రుడు (బలరాముడు), సుభద్ర, కృష్ణుడు విగ్రహాల నమూనా.
భగవాన్ శ్రీకృష్ణుని సాధారణ చిత్రీకరణ

"కృష్ణ" అనగా నలుపు అని అర్ధం.[4] కృష్ణుడు నల్లని రంగు కలవాడని ఐతిహ్యం. ఇంకా ఈ పేరుకు అనేక వివరణలున్నాయి. మహాభారతం ఉద్యోగపర్వం (5.71.4) ప్రకారం 'కృష్' అనగా దున్నుట (నాగలి మొన నల్లగా ఉంటుంది గనుక ఈ పేరు వచ్చింది). భూమిని దున్ని సస్యశ్యామలం చేసేవాడు కృష్ణుడు (వ్యవసాయానికి ప్రాముఖ్యతను తెలిపే పేరు). వల్లభ సాంప్రదాయం బ్రహ్మసంబంధ మంత్రం ప్రకారం పాపాలను నాశనం చేసే మంత్రం "కృష్ణ".[5] చైతన్య చరితామృతంలో చెప్పిన అర్థం ప్రకారం మహాభారత వాక్యం (5.71.4) ఆకర్షించేవాడు కృష్ణుడు.[6][7] భాగవతం ఆత్మారామ శ్లోకం (1.7.10) లో కూడా ఈ భావం చెప్పబడింది.[8] విష్ణుసహస్రనామం 57వ పేరుగా వచ్చిన "కృష్ణ" అనగా సచ్చిదానంద స్వరూపమును సూచించునది అని ఆదిశంకరాచార్యుడు వివరించాడు.[9] ఇంకా కృష్ణునికి గోవిందుడు, గోపాలుడు, వాసుదేవుడు వంటి అనేకనామాలున్నాయి.[10][11] జగన్నాథుడు, విఠోబా వంటి పేర్లు కొన్ని ప్రాంతాలలో లేదా సంప్రదాయాలలో ప్రాచుర్యం కలిగి ఉన్నాయి.[12]

విష్ణు సహస్రనామ స్తోత్రంలో "కృష్ణ" అనే నామం రెండు సార్లు వస్తుంది (1) అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః (2) వేధాః స్వాంగో జితః కృష్ణో దృఢః సంకర్షణోచ్యుతః - ఈ రెండు సందర్భాలలోను వివిధ వ్యాఖ్యానకర్తలు వివిధ భావాలను తెలిపారు. అవి క్లుప్తంగా క్రింద ఇవ్వబడినాయి* [13][14][15]

  • సృష్ట్యాది లీలావిలాసాల ద్వారా సచ్చిదానంద క్రీడలో వినోదించువాడు.
  • నల్లని వర్ణం కలవాడు. నీలమేఘ శ్యాముడు.
  • తన అనంత కళ్యాణ గుణములతో భక్తులను ఆకర్షించువాడు.
  • నాగలివలె భూమిని దున్ని జీవ సమృద్ధి కలిగించువాడు.
  • కృష్ణద్వైపాయనుడైన వేదవ్యాసుడు.
  • వ్యాసునిగా వేదములను విభజించి భక్తులకు మనోవ్యవసాయం కలిగించి జ్ఞానం పండించువాడు.
  • కానరాని, తెలియరాని, అందజాలనివాడు. సంపూర్ణభక్తికి మాత్రమే లభ్యమయ్యేవాడు.

అనేక దేవాలయాల విగ్రహాలలోను, ఇతర శిల్పాలలోను, చిత్రాలలోను, ప్రార్థనలలోను, కావ్యాలలోను, సాహిత్యంలోను, పురాణాలలోను, సినిమాలలోను కృష్ణుని రూప స్వభావాల చిత్రణ ఉంది. ఉదాహరణగా "కృష్ణాష్టకం" అనే ప్రార్థనలో కృష్ణుని వర్ణించిన విధానం - దేవకీవసుదేవుల నందనుడు, కంసచాణూర మర్దనుడు, నల్లని మేనికాంతి (అతసీపుష్ప సంకాశం) కలవాడు, నెమలి పింఛము, వివిధ ఆభరణములు, మందారమాల, పీతాంబరాలు, తులసి మాలలు ధరించినవాడు, మెలిదిరిగిన ముంగురులు కలవాడు, రుక్మిణీసత్యభామాది భామలతో విహరించువాడు, గోపికల కుచముల కుంకుమ అంటిన వక్షస్థలం, శ్రీవత్స చిహ్నం కలవాడు, వనమాల, శంఖచక్రాలు ధరించినవాడు.

తెలుగునాట పోతన శ్రీమదాంధ్ర భాగవతం అత్యంత ప్రాచుర్యం కలిగిన గ్రంథం. ఇందులో కృష్ణుని రూప స్వభావ వర్ణన అనేక పద్యాలలో ఉంది. పోతన వాడిన కొన్ని వర్ణనలు - నల్లనివాడు, పద్మ నయనమ్ములవాడు, నవ్వు రాజిల్లెడు మోమువాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, సుధారసమ్ము పైజల్లెడువాడు, యదుభూషణుడు, నర (అర్జునుని) సఖుడు, శృంగార రత్నాకరుడు, లోకద్రోహి నరేంద్ర వంశదాహకుడు, లోకేశ్వరుడు, నిర్వాణ సంధాయకుడు, భక్తవత్సలుడు, బ్రాహ్మణ్యుండు, గోవిందుడు, - పాండవులకు సఖుడు, సారథి, సచివుడు, నెయ్యం, వియ్యం, విభుడు, గురువు, దేవుడు - ఇలా లెక్కలేనన్ని వర్ణనలున్నాయి.

అన్నమయ్య చెప్పిన కొన్ని వర్ణనలు - ముద్దుగారే యశోద ముంగిట ముత్యము, కాళింది పడగలపైని కప్పిన పుష్యరాగము, రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము

జీవితం

[మార్చు]

వివిధ గ్రంథాలలో శ్రీకృష్ణుని జీవిత వృత్తాంతం ఉంది. వాటిలో భాగవతంలో ఉన్న కథాక్రమం ప్రజలకు సుపరిచితమైనది. ఇందులో నవమ స్కంధములో వసుదేవుని వంశక్రమం ఉంది. తరువాత దశమ స్కంధం, ఏకాదశ స్కంధములలో కృష్ణుని జీవిత వృత్తాంతము ఉంది. సంభాషణలో శ్రీకృష్ణుని లాక్షాగృహదహనానంతరం కృష పరవేశం అవుతుంది. అక్కడినుండి కురుక్షేత్ర సంగ్రామం చివరి వరకు కృష్ణుని కథ పాండవుల కథకు సమాంతరంగా నడుస్తుంది. మహాభారతం చివరిలో కృష్ణుని నిర్యాణం ఉంది. భాగవతం కథారంభంలోనే కృష్ణుని నిర్యాణం చెప్పబడింది. వీటిలోనుండి సంగ్రహింపబడిన కృష్ణుని కథ క్రింద ఇవ్వబడింది.

జననం

[మార్చు]
శ్రీ కృష్ణుని జననం - రాజా రవివర్మ చిత్రం

లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్థన మేరకు భగవంతుడు దేవకీ వసుదేవులకు జన్మింపదలిచాడు.

మధురా నగరాన్ని యాదవ క్షత్రియ వంశంకి చెందిన శూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతనికి వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు. చెల్లెలు అంటే ఎంతో ప్రేమ కల కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి రథం మీద సాగనంపుతుంటే అశరీరవాణి దేవకి గర్భంలో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెబుతుంది. కంసుడు దేవకిని, వసుదేవుడిని, ఆడ్డువచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజును కూడా చెరసాలలో పెడతాడు. దేవకీ దేవి ఏడవ మారు గర్భం ధరించి నప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశ పెడతాడు. ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో దేవకికి గర్భ స్రావం అయిందని అనుకొంటారు. కొన్ని రోజులకు దేవకీ దేవి ఎనిమిదో మారు గర్భం ధరిస్తుంది. లక్ష్మీనాథుడు దేవకి గర్భములో ఉండడం చూసి దేవతలు, యక్ష, కిన్నర, కింపురుషులు దేవకీ దేవి ఉన్న చెరసాలకు వచ్చి స్తుతిస్తారు.

దేవకి గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిథి నాడు విష్ణువు శ్రీకృష్ణుడుగా రోహిణీ నక్షత్ర యుక్తమైనప్పుడు జన్మిస్తాడు. కృష్ణుడు జన్మించాక వసుదేవుడు కృష్ణుడిని పొత్తిళ్ళలో పెట్టుకొని, చెరసాల బయట నిద్ర పోతూ ఉన్న కావలి వాళ్ళను తప్పించుకొని, యమునా నది వైపు బయలు దేరుతాడు. యమునానది రెండుగా చీలి పోతుంది. నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్ళి యశోద ప్రక్కన ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణుడిని విడిచి ఆ శిశువును తీసుకొని తిరిగి చెరసాలకు వస్తాడు. చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది. కంసుడు ఆ శిశువును తీసుకొని చంపడానికి పైకి విసరగా ఆ శిశువు ఎనిమిది చేతులతో శంఖ చక్ర గదా శారంగాలతో ఆకాశం లోకి లేచి పోయి తాను యోగ మాయ నని కంసుడిని చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయం అవుతుంది. దేవకీవసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు వ్రేపల్లె లోని యశోదాదేవి ఒడిని చేరి, అక్కడే పెరిగాడు.

వ్రేపల్లెలో

[మార్చు]
ఇరువురు గోపాలకులతో కలసి గోవులను ఇంటికి తోలుకు వస్తున్న కృష్ణుడు.

మధురానగరంలో కంసుని చెరసాలలో జన్మించిన కృష్ణుడు పుట్టగానే తన తండ్రి వసుదేవునిచే వ్రేపల్లె లోని నందుని ఇంట చేరి యశోదాదేవి ముద్దు బిడ్డగా బాల్య జీవితం గడిపాడు. పాలుత్రాగే ప్రాయంలో తనను చంపటానికి కంసునిచే పంపబడిన పూతనను, బుడిబుడి నడకల ప్రాయంలో శకటాసురాదులను సంహరించాడు. చిరు ప్రాయంలో యశోదకు తననోటిలో అండ పిండ బ్రహ్మాండాదులను చూపి యశోదను ఆనందాశ్చర్యచకితురాలిని చేశాడు. దోగాడే వయసులో యశోదచే నడుముకి కట్టబడిన రోలుతో రెండు మద్ది చెట్లను కూల్చి మద్దిచెట్ల రూపంలో ఉన్న గంధర్వులకు శాపవిమోచనం గావించాడు.

అన్న బలరామునితో చేరి స్నేహితులతో గోపాలుడయ్యాడు. వేణుగానంలో అసాధారణ ప్రజ్ఞ చూపించి ఆబాలగోపాలాన్ని మంత్రముగ్ధులను గావించాడు. కాళిందీనదిలో ఉన్న కాళీయుడి తలపై నృత్యంచేసి "తాండవకృష్ణుడు" అయ్యాడు. కాళీయుని మదమణచి, కాళిందిని విడిచి దూరంగా పంపి వ్రేపల్లె వాసుల మన్ననలను పొందాడు. ప్రళయకాలంలో గోవర్ధన గిరిని[16] తన చిటికెన వేలుతో ఎత్తి వ్రేపల్లె వాసులను ఆ గిరి కిందకు చేర్చికాపాడి వ్రేపల్లె వాసుల మనసుల్లో భగవంతుడి స్థాయికి ఎదిగాడు. అల్లరి పనులతో అలరించి, ఆపత్కాలంలో ఆదుకుని, ధైర్యసాహసాల ప్రదర్శనతో వ్రేపల్లెను మురిపించాడు.

కృష్ణుని చంపడానికి కంసుడు ఒక వ్యూహం పన్ని, ఉద్ధవుని దూతగా పంపి, కృష్ణబలరాములను మధురకు రప్పించాడు. బలరామకృష్ణులు చాణూర ముష్టికులనే మల్లులను, తరువాత కంసుని వధించి తమ తాత ఉగ్రసేనుని చెర విడిపించి అతనిని రాజ్యాభిషిక్తుని గావించారు. చెరలోఉన్న తల్లి, తండ్రులను వారితో పాటుగా విడిపించి ద్వారకకు చేరుకున్నారు.

దేవకీ వసుదేవుల కోరికపై విద్యాభ్యాసానికి సాందీపని ముని ఆశ్రమం చేరుకొని అక్కడ కుచేలుని చెలిమిని పొందారు. గురుదక్షిణగా అంతకుపూర్వమే మరణించిన గురుపుత్రుని బ్రతికించి తెచ్చి గురువుకి సమర్పించారు. విద్యాధనంతో తన తల్లి తండ్రులవద్దకు చేరుకున్నారు.

కుటుంబం

[మార్చు]
యశోద తో బాలకృష్ణుడు

దేవకీ వసుదేవులు కృష్ణుని తల్లిదండ్రులు. అన్న బలరాముడు. చెల్లి సుభద్ర. కాని బాల్యంలో కృష్ణబలరాములు యశోదా నందులవద్ద వ్రేపల్లెలో పెరిగారు. కృష్ణుని తమ్ముడు సాత్యకి.

ముఖ్య వ్యాసము: అష్టమహిషులు

ముఖ్య వ్యాసము: కృష్ణసంతానం

శ్రీ కృష్ణుడు రాధా దేవిని ప్రేమించి, బ్రహ్మదేవుని సమక్షంలో వివాహం చేసుకున్నారు. కానీ ఆమె శ్రీకృష్ణుని ప్రేయసిగా పరిగణించబడుతుంది. రాధాదేవి అనేక పురాణాలలో లక్ష్మీదేవి అవతారంగా వర్ణించబడింది. శ్రీ కృష్ణుడు అష్ట మహిషులను వివాహమాడాడు. విదర్భ రాజైన భీష్మకుని పుత్రిక రుక్మిణి కృష్ణుని ప్రేమించింది. కానీ ఆమె సోదరుడు రుక్మి అతడిని ద్వేషించి ఆమెను శిశుపాలునికిచ్చి పెళ్ళి చేయాలని నిశ్చయించాడు. రుక్మిణి పంపిన రహస్య సందేశం గ్రహించి కృష్ణుడు ఆమె అభీష్టం మేరకు రాక్షస పద్ధతిలో అపహరించి వివాహం చేసుకుంటాడు. సత్రాజిత్తు కుమార్తె సత్యభామ. కృష్ణుడు శమంతకమణిని తనకిమ్మని కోరగా అతడు అంగీకరించలేదు. ఒకసారి సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక సింహము అతనిని చంపి, మణిని హరించింది. జాంబవంతుడుసింహమును చంపి మణిని తన కుమార్తె జాంబవతి కిచ్చాడు. మణి కొరకై ప్రసేనుడిని కృష్ణుడే హతమార్చెనన్న అపవాదు వ్యాపించింది. కృష్ణుడు మణిని అన్వేషిస్తు పోయి పోయి జాంబవంతుని గుహలో ఉన్న మణిని తీసుకున్నాడు. జాంబవంతునికీ, కృష్ణునికీ జరిగిన యుద్ధంలో జాంబవంతుడు పరాజితుడైనాడు. శ్రీకృష్ణుని శ్రీరాముని అవతారంగా గుర్తించిన జాంబవంతుడు మణితో సహా కూతురు జాంబవతిని అతనికి సమర్పించాడు. మణిని తెచ్చి సత్రాజిత్తునకిచ్చాడు. అప్పుడు సత్రాజిత్తు మణితోపాటు తన కుమార్తె సత్యభామను కృష్ణునికిచ్చి వివాహం చేసెను.

కాళింది, భధ్ర, నాగ్నజితి, మిత్రవింద, లక్షణ అతని ఇతర భార్యలు. భద్ర శ్రీకృష్ణుని తండ్రియగు వసుదేవుని చెల్లెలైన శ్రుతకీర్తి పుత్రిక. మిత్రవింద కూడా అవంతీ రాజు పుత్రిక, మేనత్త కూతురు. ఆమెను స్వయంవరంలో వరించి కృష్ణుడు చేపట్టాడు. కోసల దేశాధిపతి నగ్నజిత్తుకు ఏనుగుల వంటి బలం కలిగిన ఏడు వృషభాలు ఉండేవి. వాటిని నిగ్రహించిన వానికి తన కుమార్తె నాగ్నజితిని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. కృష్ణుడు ఏడు రూపాలు దాల్చి ఏడు ఎద్దులను బంధించాడు. రాజు పుత్రికనిచ్చి పరిణయం చేశాడు. లక్షణ మద్ర దేశాధిపతి కూతురు. స్వయంవరంలో శ్రీకృష్ణుని వరించింది. ఈ విధంగా కృష్ణుని ఎనమండుగురు భార్యలు అష్టమహిషులుగా విలసిల్లారు.

సుభద్రను అర్జునునికి ఇచ్చి పెళ్ళి చేశారు. వారి కొడుకు అభిమన్యుడు (కృష్ణునికి మేనల్లుడు)

శ్రీకృష్ణుడికి భార్యలందరితోనూ ఒక్కొక్కరి వల్ల పదేసి మంది పిల్లలు పుట్టారు. రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే బిడ్డలు కలిగారు. సత్యభామ వల్ల కృష్ణునికి భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే బిడ్డలు కలిగారు. జాంబవతీ శ్రీకృష్ణులకు సాంబుడు, సుమిత్రుడు, పురజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే సంతానం కలిగింది. జాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే కృష్ణుడికి ప్రత్యేకమైన ప్రేమ ఉండేది.నాగ్నజితి, కృష్ణులకు వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, లముడు, శంకుడు, వసుడు, కుంతి అనే పిల్లలు కలిగారు. కృష్ణుడికి కాళింది వల్ల శ్రుతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహుడు, భద్రుడు, శాంతి, దర్శుడు, పూర్ణమానుడు, శోమకుడు అనే కుమారులు జన్మించారు. లక్షణకు, శ్రీకృష్ణుడికి ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే సంతానం కలిగింది. మిత్రవింద, కృష్ణులకు వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్ధుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాశుడు, పావనుడు, వహ్ని, క్షుధి అనే పుత్రులు పుట్టారు. కృష్ణుడికి భద్ర అనే భార్య వల్ల సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు అనే పిల్లలు పుట్టారు. చాలామంది అపోహపడుతున్నట్టుగా శ్రీకృష్ణుడికి 16వేలమంది (కొన్ని గ్రంథాలలో 16100 అని ఉన్నది) భార్యలతో శారీరక బంధము కలిగియుండలేదు. 16వేల గోపికా స్త్రీలను నరకాసురుని బారినుండి కాపాడి సంఘములో సముచిత స్థానము కల్పించాడు. "భర్త అనగా భరించువాడు" అను నానుడి ప్రకారము, ఒక పురుషుని పంచన చేరి, అతని నివాసమునందు నివసించు స్త్రీలకు అతడే భర్తగా నిర్ణయించే అప్పటి కాలమానస్థితిగతులనుబట్టి శ్రీకృష్ణునికి భార్యలుగా చెప్పబడ్డారు. కానీ పైన చెప్పబడిన అష్ట అష్టమహిషులతోనే శ్రీకృష్ణునికి సంతానము కలిగినది అని గ్రంథాలు ఉద్ఘాటిస్తున్నాయి. .

ద్వారకానగరంలో

[మార్చు]
కంసుడ్ని చంపిన తరువాత వసుదేవుడ్ని విడిపిస్తున్న బలరామ కృష్ణులు

లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్థన మేరకు భగవంతుడు దేవకీ వసుదేవులకు జన్మింపదలిచాడు. ఒకమారు పారిజాత పుష్పం కారణంగా కృష్ణుడు ఇంద్రునితో పోరి స్వర్గలోకంనుండి పారిజాతతరువును తెచ్చి సత్యభామకు ప్రీతికూర్చాడు. లోకాళను బాధిస్తున్న నరకాసురుని వధించి అతని కొడుకు భగదత్తునికి పట్టం కట్టాడు. నరకునిచే బంధింపబడిన రాజకన్యలను కృష్ణుడు పెండ్లాడి అందరిపట్ల తనమాయాప్రభావంతో సంసారం నెరపాడు.

శ్రీకృష్ణుని అతిశయాన్ని చూసి ఓర్వలేక కాలయవనుడు, జరాసంధుడు, సాళ్వుడు వంటివారు కృష్ణునిపై దండెత్తారు. శ్రీకృష్ణుడు వారిని ఓడించాడు. ఇంకా ద్వివిధుడు, దంతవక్త్రుడు మొదలైనవారు కూడా కృష్ణుని చేత హతులైనారు.

మహాభారతంలో

[మార్చు]

మేనత్త కుమారులైన పాండుసుతులతో శ్రీ కృష్ణుని అనుబంధం మరువరానిది. పాండవ మద్యముడైన అర్జునునితో చెలిమి విడదీయరానిది. పాండవుల జీవితములో జరిగిన ప్రతి సంఘటనలో శ్రీకృష్ణుని పాత్ర ఉంది. శ్రీకృష్ణుని సంప్రదించకుండా ధర్మరాజు శకునితో ఆడిన జూదము తప్పమిగిలినవన్నీ శ్రీకృష్ణుని సలహా సంప్రదింపులతో జరిగినవే. కీలకమైన సమస్యలన్నీ కృష్ణుని సహాయంతో తీరినవే. ద్రౌపదిని శ్రీకృష్ణుడు స్వంత చెల్లెలికన్నామిన్నగా చూసుకున్నాడు. వస్ర్తాపహరణ అవమానమునుండి ఆమె శ్రీకృష్ణుని సహాయంతోనే బయటపడింది. పాండవవనవాస సమయంలో వారికి వచ్చిన అనేక సమస్యలకు శ్రీకృష్ణుని సలహాతో పరిష్కారం చేసుకున్నారు. వారి రాజ్యం మీదకు అనేకమార్లు దండెత్తిన జరాసంధుని భీముని సాయంతో తుదముట్టించి తన రాజ్యానికి శత్రు భయాన్ని తొలగించాడు. ద్వారక సముద్రగర్భంలో మునిగిపోతుందని ముందుగానే ఊహించి ద్వారక వాసులను అప్రమత్తంచేసి వారిని ఆపదనుండి రక్షించాడు. ఇంద్రప్రస్థంలో ధర్మరాజు చేసిన అశ్వమేధయాగ సమయంలో మేనత్తకి ఇచ్చిన మాటను పాలించి శిశుపాలుని నూరు తప్పులను సహించిన తరువాత అతనిని చక్రాయుధంతో వధించాడు.

యుద్ధసమయంలో శ్రీ కృష్ణుడు అర్జునునికి గీతాబోధ చేయటం.

పాండవుల వనవాసం తరువాత వారి తరఫున కురుసభలో రాయబారము చేశాడు. కురుక్షేత్రంలో యుద్ధసమయంలో అర్జునునికి గీతాభోధ చేసి అతనిని యుద్ధోన్ముఖుని చేశాడు. అర్జునునికి సారథియై యుద్ధం ముగిసేవరకూ పాండవులకు రక్షణగా ఉన్నాడు. అశ్వత్థామ అస్త్రంవల్ల ఉత్తర గర్భంలో పిండం కూడా మృత్యవును ఎదుర్కోగా కృష్ణుడు తన చక్రంతో ఆ గర్భస్థ శిశువును రక్షించాడు. ఆ శిశువే పరీక్షిత్తుగా జన్మించి పాండవుల అనంతరం రాజ్యానికి అధిపతి అయ్యాడు.

నిర్యాణం

[మార్చు]
శ్రీ కృష్ణుని మరణం

మహాభారత యుద్ధానంతరం యాదవకులం కూడా అంతఃకలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది. అలాగే యాదవకులంలో కొందరి చిలిపి పనుల కారణంగా పుట్టిన ముసలం ( రోకలి ) అందరి మరణానికీ కారణమయ్యింది. బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు. కృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడినుండి కృష్ణుడు స్వర్గానికి నేరుగా వెళ్ళాడని వ్యాసుని భారతంలో ఉంది. అయితే ఒక నిషాదుని ( పూర్వజన్మలో వాలి) బాణం వలన కృష్ణుడు గాయపడి దేహాన్ని త్యజించాడని మరికొన్ని పురాణాలలో ఉంది.[17][18][19]

పురాణాలలో తెలిపిన ప్రకారం [20] శ్రీకృష్ణుని నిర్యాణంతో ద్వాపరయుగం అంతమయింది. కలియుగం ఆరంభమయింది. ఇది క్రీ.పూ. 3102 ఫిబ్రవరి 17/18 తేదీలలో జరిగిందని కొన్ని అంచనాలున్నాయి[21] (అయితే ఈ అంచనాలలో పలు అభిప్రాయ భేదాలున్నాయి)

రామానుజాచార్యులు వంటి వైష్ణవ గురువులు, గౌడీయ వైష్ణవుల విశ్వాసం ప్రకారం శ్రీకృష్ణుడు జరామరణ రహితుడు. మహాభారతంలో యుద్ధఘట్టం వర్ణనలో కొన్నిచోట్ల శ్రీకృష్ణుడి దేహం గాయపడినట్లు వర్ణించినా గాని, మరికొన్ని ఘట్టాలలో అతను చరాచరవిశ్వాత్మకుడని, ఆదిమధ్యాంతరహితుడని, సామాన్యమైన పాంచభౌతిక దేహానికి అతీతుడనీ గ్రహించాలి.[22] ఇదే విషయాన్ని కృష్ణుడు ఉద్యోగపర్వంలో చెప్పాడు కూడాను.[23]

చారిత్రక అంశాలు

[మార్చు]

ఉత్తర ప్రదేశ్ లోని మీర్జాపూర్‌లో లభించిన క్రీ.పూ. 800 నాటి ఒక చిత్రంలో సుదర్శన చక్రం ధరించిన రథసారథిని కృష్ణుడని అనుకోవచ్చును.[24]

కృష్ణుని గురించిన ప్రస్తావన లభించిన మొట్టమొదటి గ్రంథం (చరిత్ర కారుల అంచనా ప్రకారం) ఛాందోగ్యోపనిషత్తు. ఇందులో కృష్ణుడు దేవకి సుతుడని, ఘోర అంగీరసుని శిష్యుడని చెప్పబడింది.[25][26] "నారాయణ అధర్వశీర్ష", "ఆత్మబోధ" వంటి ఉపనిషత్తులలో కృష్ణుడు భగవంతుడని, నారాయణుని అవతారమని చెప్పబడింది.[25]

తైత్తరీయారణ్యకము (X,i,6) లో వాసుదేవుడు, నారాయణుడు, విష్ణువుల గురించిన ప్రస్తావన ఉంది. క్రీ.పూ. 4వ శతాబ్దికి చెందిన వ్యాకరణకర్త పాణిని "అష్టాధ్యాయి"లో"వాసుదేవకుడు" అనగా "వాసుదేవుని భక్తుడు" అని తెలిపాడు.[27] అదే సందర్భంలో అర్జునుని ప్రస్తావన కూడా ఉండడం వలన ఈ వాసుదేవుడే కృష్ణుడు అనుకొనవచ్చును.[28] వేదకాలంలో ఎప్పుడో "వాసుదేవుడు", "కృష్ణుడు" ఒకరిగా భావింపబడడం మొదలయ్యుండవచ్చును. ప్రస్తుతం మనకు లభిస్తున్న మహాభారతం కాలం నాటికి కృష్ణుడు విష్ణువు అవతారమనే భావన స్థిరపడింది.[25]

మధురలో ఉండే శూరసేనుడు "హెరాకిల్స్"ను పూజించాడని క్రీ.పూ. 4వ శతాబ్దంలో చంద్రగుప్తుని ఆస్థానాన్ని దర్శించిన మెగస్తనీస్ వ్రాశాడు. మెగస్తనీస్ వ్రాసిన ఇతర వ్రాతలను బట్టి "హెరాకిల్స్", "కృష్ణుడు" ఒకరే అనుకోవచ్చును.[29] క్రీ.పూ. 180-165 కాలంలో గ్రీకో-బాక్ట్రియన్ పాలకుడు "అగాథకిల్స్" (Agathocles) కృష్ణ బలరాములున్న నాణేలను ముద్రించాడు.

చితోర్ ఘర్ జిల్లా నగరి వద్ద ఘోసుండి, హాథిబాడలలో లభించిన క్రీ.పూ. 2వ శతాబ్దం నాటి శాసనాల ప్రకారం - సంకర్షణ (బలరాముడు), వాసుదేవులను (కృష్ణుడు) పూజించడం కోసం గజాయనసర్వతాత అనే రాజు "నారాయణ వటం"లో ఒక "పూజా శిలా ప్రాకారం" (గుడి వంటిది) నిర్మించాడు.[29][30] అదే కాలంనాటి శాతవాహనుల శాసనాలలో కూడా ఇతర దేవతలో పాటు సంకర్షణ, వాసుదేవుల ప్రస్తుతి ఉంది.[31]

క్రీ.పూ. 110లో భాగవత ధర్మాన్ని అవలంబించిన హెలిడోరస్ వేయించిన శాసనం

క్రీ.పూ. 1వ శతాబ్దంలో గ్రీస్‌కు చెందిన హెలిడోరస్ (Heliodorus) భిల్సా సమీపంలో బేసన్‌గర్ వద్ద ఒక స్తంభ శాసనాన్ని (Heliodorus pillar) వేయించాడు. ఆ శాసనంపై వ్రాసిన విషయం:[29] " దేవదేవుడైన వాసుదేవుని కొఱకు ఈ గరుడ స్తంభాన్ని వేయించిన భాగవత ప్రభువు భక్తుడు హెలియోడోరస్. అతను తక్షశిలకు చెందిన గ్రీకు వ్యక్తి (Diya Greek Dion) కొడుకు, గ్రీకుమహారాజు అంటాలికిట (Great King Amtalikita [Greek Antialcidas]) రాయబారిగా కాశీపుత్రభగభద్రుని ఆస్థానానికి వచ్చియున్నాడు. కాశీపుత్ర భగభద్రుడు తన 14వ సంవత్సరపు పాలనలో ఉన్నాడు. [...] మూడు అమృత ధర్మాలు [...] పాటిస్తే స్వర్గానికి మార్గం లభిస్తుంది. ఆత్మ సంయమనం, దానగుణం, శ్రమ". ఇలాగే ఇదే కాలానికి చెందిన మరికొన్ని శాసనాలు లభించాయి.[32][33]

సా.శ.పూ. 150 కాలానికి చెందిన వ్యాకరణకర్త పతంజలి రచనలలో కృష్ణుడు, సంకర్షణుడు, జనార్దనుడు, బలరాముడు, కేశవుడు వంటి దేవతల ప్రస్తావనలున్నాయి. క్రీ.పూ. 1వ శతాబ్దంలో వృష్ణివంశానికి ఐదుగురు వీరుల పూజ గురించి ( బలరాముడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సాంబుడు ) ప్రస్తావన ఉన్న శాసనం మధుర సమీపంలో "మోరా" వద్ద లభించింది.

అయితే శ్రీకృష్ణుడు చారిత్రక పురుషుడు కాదని, కేవలం మహాభారత కావ్యంలో కల్పిత పాత్ర అని, మహాభారత కావ్యం వేద కాలం తర్వాత, సుమారు 800 B.C - 500 B.C మధ్య రచించబడినది అని, ఆర్యుల రాక మునుపు భారతదేశంలో సంస్కృత భాష వాడుకలో లేదని వాదించేవారు లేకపోలేదు.

ఆరాధన

[మార్చు]
శ్రీవైష్ణవం
కృష్ణభక్తి
హరేకృష్ణ ఉద్యమం

కొన్ని ప్రసిద్ధ శ్రీకృష్ణ మందిరాలు

[మార్చు]

శ్రీకృష్ణారాధన ద్వారా ప్రసిద్ధులైనవారు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Knott 2000, p. 56
  2. Richard Thompson, Ph. D. (December 1994). "Reflections on the Relation Between Religion and Modern Rationalism". Archived from the original on 2008-10-07. Retrieved 2008-04-12. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  3. Mahony, W.K. (1987). "Perspectives on Krsna's Various Personalities". History of Religions. 26 (3): 333–335. doi:10.2307/599733. ISSN 0003-0279.
  4. "Monier Williams Sanskrit-English Dictionary p.306". website. Cologne Digital Sanskrit Lexicon project. 2008. Archived from the original on 2008-10-30. Retrieved 2008-10-13.
  5. Beck 1993, p. 195
  6. Bhaktivedanta Swami, Prabhupada. "Chaitanya Charitamrta Madhya-lila Chapter 9 Verse 30". vedabase.net. Archived from the original on 2008-03-03. Retrieved 2008-06-15.
  7. Lynne Gibson (2002). Modern World Religions: Hinduism - Pupils Book Foundation (Modern World Religions). Oxford [England]: Heinemann Educational Publishers. p. 7. ISBN 0-435-33618-5.
  8. Goswami 1998, p. 141
  9. Vishnu sahasranama, Swami Tapasyananda's translation, pg. 51.
  10. Bryant 2007, p. 17
  11. Hiltebeitel, Alf (2001). Rethinking the Mahābhārata: a reader's guide to the education of the dharma king. Chicago: University of Chicago Press. pp. 251–53, 256, 259. ISBN 0-226-34054-6.
  12. B.M.Misra. Orissa: Shri Krishna Jagannatha: the Mushali parva from Sarala's Mahabharata. Oxford University Press, USA. ISBN 0-19-514891-6. in Bryant 2007, p. 139
  13. కృష్ణమాచారి విపుల వ్యాస పరంపర. ఒక్కొక్క నామమునకూ అనేక వ్యాఖ్యలనుండి తీసుకొన్న విషయాన్ని రచయిత ఇక్కడ సమర్పించాడు.
  14. "శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము" సంగ్రహ తాత్పర్య వివరణ - గీతా సాహిత్య శిరోమణి పండిత పెమ్మరాజు రాజారావు రచన - గొల్లపూడి వీరాస్వామి సన్స్ ప్రచురణ.
  15. "శ్రీ కైవల్య సారథి" - విష్ణు సహస్రనామ భాష్యము -శ్రీ విద్యా విశారద డా.క్రోవి పార్థసారథి రచన.
  16. "కృష్ణుడు యొక్క చిన్ననాటి కథలు". Archived from the original on 2014-07-28. Retrieved 2014-07-17.
  17. Bryant 2007, pp. 148
  18. Dr. Satyabrata Das (November 2007). "Orissa Sarala's Mahabhārata" (PDF). magazine. Archived from the original (PDF) on 2008-10-30. Retrieved 2008-10-13.
  19. Kisari Mohan Ganguli (2006). "The Mahabharata (originally published between 1883 and 1896)". book. Sacred Texts. Retrieved 2008-10-13.
  20. The Bhagavata Purana (1.18.6), Vishnu Purana (5.38.8), and Brahma Purana (212.8) state that the day Krishna left the earth was the day that the Dvapara Yuga ended and the Kali Yuga began.
  21. See: Matchett, Freda, "The Puranas", p 139 and Yano, Michio, "Calendar, astrology and astronomy" in Flood, Gavin (Ed) (2003), Blackwell companion to Hinduism, Blackwell Publishing, ISBN 0-631-21535-2
  22. Ganguli, Kisari Mohan (2006). "The Mahabharata, Book 5: Udyoga Parva: Bhagwat Yana Parva: section CXXXI (originally published between 1883 and 1896)". book. Sacred Texts. Retrieved 2008-10-13.
  23. Ganguli, Kisari Mohan (2006). "The Mahabharata, Book 5: Udyoga Parva: Bhagwat Yana Parva: section CXXX(originally published between 1883 and 1896)". book. Sacred Texts. Retrieved 2008-10-13. "Knowest thou not sinless Govinda, of terrible prowess and incapable of deterioration?"
  24. D.D.Kosambi(1962), Myth and Reality: Studies in the Formation of Indian Culture, New Delhi, CHAPTER I: Social and Economic Aspects of the Bhagavad-Gita, paragraph 1.16.
  25. 25.0 25.1 25.2 Hastings, James; Selbie, John Alexander (2003). Encyclopedia of Religion and Ethics. Kessinger Publishing. pp. 195–196. ISBN 0766136884.
  26. See Chandogya Upanishad(III, xvii, 6) in Müller, Max (1879), Sacred Books of the East, vol. 1
  27. Bryant 2007, p. 4
  28. Singh, R.R. (2007). Bhakti And Philosophy. Lexington Books. ISBN 0739114247.Page 10: Panini, the fifth-century BC Sanskrit grammarian also refers to the term Vaasudevaka, explained by the second century BC commentator Patanjali, as referring to "the follower of Vasudeva, God of gods."
  29. 29.0 29.1 29.2 Rosen 2006, p. 126
  30. D.C.Sircar (1942), Select inscriptions bearing on Indian history and civilisation Vol 1, From sixth century BC to sixth century AD, Calcutta. These are four renderings of the same text.
  31. D.C.Sircar (1942), Select inscriptions bearing on Indian history and civilisation Vol 1, From sixth century BC to sixth century AD, Calcutta.
  32. S Jaiswal (1967), The origins and development of Vaisnavism, New Delhi - Manhorlal Munshiram.
  33. Gavin Flood (2003), The Blackwell Companion to Hinduism

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.