Jump to content

చతుర్వేదాలు

వికీపీడియా నుండి
(చతుర్వేదములు నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం

హిందూ సనాతన ధర్మంలో అత్యంత మౌలికమైన ప్రమాణంగా వేదాలను గుర్తిస్తారు. వేదములను శ్రుతులు (వినబడినవి) అనీ, ఆమ్నాయములు అనీ అంటారు. "విద్" అనే ధాతువుకు "తెలియుట" అన్న అర్ధాన్నిబట్టి వేదములు భగవంతునిద్వారా "తెలుపబడినవి" అనీ, అవి ఏ మానవులచేతనూ రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను అపౌరుషేయములు అని కూడా అంటారు. వేదములను తెలిసికొన్న ఋషులను ద్రష్టలు అని అంటారు. ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్ధం. హిందూ శాస్త్రాల ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు. అందుకే వీటిని శ్రుతులు అని కూడా అంటారు.

ఏనం విందంతి వేదేన తస్మాద్వేదస్య వేదతా,, (ఇష్టప్రాప్తి, అనిష్ఠపరిహారం ) కావల్సిన వాటిని తీర్చి అక్కర్లేని వాటిని రాకూండా చేసే ఆధ్యాత్మిక ఉపాయమే వేదం

వేదాలకు పేర్లు

[మార్చు]

వేదాలకు (1). శ్రుతి, (2). అనుశ్రవం, (3). త్రయి, (4). సమమ్నాయము, (5). నిగమము, (6). ఆమ్నాయము, (7). స్వాధ్యాయం, (8). ఆగమం, (9). నిగమం అని తొమ్మిది పేర్లున్నాయి.

  1. శ్రుతి - గురువు ఉచ్చరించినదాన్ని విని అదేవిధముగా శిష్యుడు ఉచ్చరిస్తూ నేర్చుకుంటాడు.
  2. అనుశ్రవం - గురువు ఉచ్చరించినదాన్ని సరిగా తిరిగి అదేవిధముగా శిష్యుడు ఉచ్చరిస్తూ ఉంటాడు.
  3. త్రయి - ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదములను కలిపి "త్రయి" అని పేరు.
  4. సమమ్నాయము - ఎల్లప్పుడూ అభ్యసింపబడునవి.
  5. నిగమము - భగవంతుని నిశ్వాస రూపములో బయలు పడేవి. యాస్కుడు నిగమము అని వీటిని వ్యవహరించాడు.
  6. ఆమ్నాయము - ఆవృత్తి లేదా మననం ద్వారా నేర్చుకోబడే విద్య.
  7. స్వాధ్యాయం - స్వాధ్యాయం అంటే—స్వ అధ్యయనం అంటే మనల్ని మనం విశ్లేషించుకోవడం
  8. ఆగమం - భగవంతుని నిశ్వాస రూపములో బయలు పడేవి.
  9. నిగమం - యాస్కుడు నిగమము అని వ్యవహరించాడు.

వేదాలు సంఖ్య

[మార్చు]

వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిసి ఒకే ఒక వేదరాశిగా ఉండేది. ఎవరయినా వేదం నేర్చుకునేవారు చేయాలంటే మొత్తం వేదరాశిని అధ్యయనము చేయాల్సిందే. కృతయుగం నుండి ద్వాపరయుగం వచ్చేసరికి వేదరాశిని అధ్యయనము చేయవలెనంటే బహుకష్టమని ఎక్కువ మంది అంతగా ఉత్సాహము చూపించే వారు కాదు. మొదట కలగలుపుగా ఉన్న వేదరాశి (వేదాలను) ని వ్యాస మహర్షి ఒక క్రమం ప్రకారం విభజించాడు. ఈ వేదరాశిని వ్యాసుడు ఋక్కులు అన్నింటిని ఋక్సంహితగాను, యజస్సులు అన్నింటిని యజుస్సంహితగాను, సామలన్నింటినీ సామసంహితగాను విడదీసి అలాగే అథర్వమంత్రాలన్నీ ఒకచోట చేర్చి అథర్వసంహితగా తయారు చేసాడు. కనుకనే ఆయన భగవానుడు వేదవ్యాసుడు అయ్యాడనీ చెబుతారు. అలా నాలుగు వేదాలు మనకు లభించాయి.

  1. ఋగ్వేదము
  2. యజుర్వేదము
  3. సామవేదము
  4. అధర్వణవేదము

వ్యాసుడు అలా వేదాలను విభజించి తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనేవారికి ఉపదేశించాడు. వారు తమ శిష్యులకు బోధించారు. అలా గురుశిష్యపరంపరగా ఈ నాలుగు వేదాలు వేల సంవత్సరాలుగా తరతరాలకూ సంక్రమిస్తూ వచ్చాయి. వేదాలను ఉచ్ఛరించడంలో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు.

అన్ని వేదాలూ కలిపి 1180 అధ్యాయాలు, లక్షపైగా శ్లోకాలు ఉండాలని అంటారు. కాని ప్రస్తుతం మనకు లభించేవి 20,023 మాత్రమే (ఈ సంఖ్య 20,379 అని కూడా అంటారు).

మళ్ళీ ఒక్కొక్క వేదంలోను నాలుగు ఉపవిభాగాలున్నాయి. అవి

  1. మంత్ర సంహిత
  2. బ్రాహ్మణము
  3. ఆరణ్యకము
  4. ఉపనిషత్తులు

ఈ విభాగాలలో మొదటి రెండింటిని "కర్మకాండ" అనీ, తరువాతి రెండింటిని "జ్ఞానకాండ" అనీ అంటారు.

ప్రపంచంలో అత్యంత పురాతనమైన గ్రంథాలలో ఒకటిగా చెప్పబడే ఋగ్వేదంలో ఒక పేజీ.

ఋగ్వేదము తొలుత సామాన్య శకం 1700 ప్రాంతములో ఉచ్చరించబడింది. ఋగ్వేదాన్ని దర్శించినప్పుడు ఆ వేదాన్ని ఒక రూపుతో దర్శించారు కనుక ఋగ్వేద పురుష అని వ్యవహరిస్తారు.
ఋగ్వేదః శ్వేత వర్ణస్యాత్ ద్విభుజో రాసబాననః |
అక్షమాలాదరః సౌమ్యః ప్రీతో వ్యాఖ్యా కృతో ద్యమః ||

ఋగ్వేద పురుషుడు తెలుపు రంగులో ఉంటాడట. గాడిద ముఖం కలిగి ఉంటాడట. చేతిలో మాల ధరించి ఉంటాడట. ప్రశాంతంగా కనిపిస్తూ వేదాన్ని అందించాడట. సంహితలు ఎనిమిది ఆష్టకములుగా ఉంటుంది. ఒక్కో అష్టకం ఎనిమిది అధ్యాయాలుగా ఉంటుంది. మొత్తం 1028 సూక్తులుగా ఉంటుంది. 10552 ఋక్కులు (మంత్రాలు) ఉంటాయి. మొత్తం 397265 అక్షరాలు ఉంటాయి. ఈ మొత్తం 21 శాఖలుగా విభజించారు. సంహితలని ఆ శిష్యుల పేర్ల రూపుతో వ్యాస, పైల, ఇంద్రప్రమాతి, మాండుకేయ, సత్య స్రవస్, సత్య హిత మరియూ సత్యశ్రీగా విభజించారు. ఒక్క సత్యశ్రీ శాఖను తీసుకుంటే అది వారి శిష్యులైన సాఖల, సాఖపూణి మరియూ భాష్కల అని మూడుగా విభాగం అయ్యింది. సాఖల మరో ఐదు భాగాలుగా, భాష్కల నాలుగు భాగాలుగా విభాగం అయ్యింది.

ఋగ్వేదంలో ఉపవేదంగా ఆయుర్వేదం ఉంటుంది. బ్రాహ్మణాలు నాలుగు భాగాలుగా, అవి పైంగ, బహ్-వ్రిచ, ఆశ్వలాయణ, గాలవ బ్రాహ్మణాలుగా విభాగం అయ్యాయి. ఆరణ్యకాలలో ఉపనిషత్తులు ఉంటాయి. అవి నిర్వాణ, ఐతరేయ, బహ్-వ్రిచ, సౌభాగ్య, కౌశీతకి, ముద్గల, నాథబిందు, త్రిపుర, ఆత్మ ప్రభోద మరియూ అక్షరమాలిక అని పది ఉపనిషత్తులుగా ఉంటాయి.

యజుర్వేద పురుషుడిని ఇలా దర్శించారు.
అజస్యపీత వర్ణస్యాత్ యజుర్వేదో అక్షసూత్ర ద్రుత్ |
వామే కులిసపాణిస్తూ భూతిదో మంగళప్రదః ||
మేక ముఖం కలిగి పసుపు రంగులో ఉంటాడు. ఎడమ చేతిలో కర్ర పట్టుకొని ఉంటాడు. సంపదలని, శుభముని ఇచ్చేలా ఉంటాడు.
యజుర్వేదం రెండు భాగాలు ఉంటుంది. శుక్ల యజుర్వేదం మరియూ కృష్ణ యజుర్వేదం. శుక్ల యజుర్వేదం కాన్వ మరియూ మాద్యందిన అనే శాఖలుగా ఉంటుంది. కృష్ణ యజుర్వేదం తైత్తిరీయ, మైత్రాయణి, కఠ మరియూ కపిస్తల అనే శాఖలుగా ఉంటుంది.
కాన్వ శాఖ 40 అధ్యాయాలు, 328 అనువాకాలు, 2086 మంత్రాలుగా ఉంటుంది. మాద్యందిన 40 అధ్యాయాలు, 303 అనువాకాలు, 1975 మంత్ర ఖండాలు, 3988 మంత్రాలు, 29626 పదాలు, 88875 అక్షరాలుగా ఉంటుంది. ఇంత లెక్కతో జాగ్రత్తగా బద్రపరిచారు. తైత్తిరీయ శాఖ 7 ఖాండాలు, 44 ప్రపాతకాలు, 635 అనువాకాలుగా ఉంటుంది. మైత్రాయణి శాఖ 4 ఖాండాలు, 54 ప్రపాతకాలు, 2144 మంత్రాలుగా ఉంటుంది. కఠ శాఖ 5 ఖాండాలు, 40 ఆధ్యాయాలు, 13 అనువాచకాలు, 843 అనువాకాలు మరియూ 3091 మంత్రాలుగా ఉంటుంది. బ్రహ్మణాలు చరక, కాతక, తుంబుర, జాబల, కన్కతి, స్వేతాస్వేతర, మైత్రాయణి, ఖాందికేయ, హారిద్ర, ఆహ్వరాక, ఔకేయ మరియూ చాగలేయ అనే శాఖలుగా ఉంటుంది. శుక్ల యజుర్వేద ఉపనిషత్తులు ఈసావాస్య, బృహదారణ్యక, జాబాల, సుభాల మొదలైనవి. కృష్ణ యజుర్వేద ఉపనిషత్తులు కఠ, తైత్తిరీయ, స్వేతాస్వేతర మొదలైనవి.

సామ వేద పురుషుడిని ఇలా దర్శించారు.
నీలోత్పలధలశ్యామోః సామవేదో హయాననః |
అక్షమాలాఅన్వితోదక్షే వామే కుంభదారణ స్మృతః ||
కృష్ణుడి వంటి నీలి రంగులో, గుఱ్ఱపు ముఖం కలిగి, ఒక చేతిలో కొరడా కలిగి, ఎడమ చేతిలో కుండ కలిగి ఉంటాడు. సామవేదం మొత్తం 1065 శాఖలుగా ఉంటుంది. అందులో ముఖ్యమైనవి తొమ్మిది. రాణాయణ, సాట్యాయన, సార్యముగ్ర, కల్వల, మహా కల్వల, లాంగల, కౌతుమీయ, గౌతమీయ, జైమినీయ అని ముఖ్య శాఖలు. అందులో రాణాయణ, కౌతుమీయ మరియూ జైమినీయ అనేవి మాత్రం ఉన్నాయి. మిగతా శాఖలు లభించడం లేదు. సామవేద సంహితలు పూర్వర్చిక, ఉత్తరార్చిక మరియూ ఆరణ్యకాలుగా ఉంటుంది. పూర్వర్చిక 6 ప్రాతకాలు, 59 దషతీలు, 585 మంత్రాలుగా ఉంటుంది. ఉత్తరార్చిక 9 ప్రాతకాలు, 120 దషతీలు, 1220 మంత్రాలుగా ఉంటుంది. ఆరణ్యకాలు 55 మంత్రాలుగా ఉంటుంది.
బ్రాహ్మణాలు భాల్లవి, కాలబవి, రౌరుకి, సాట్యాయన అని నాలుగు భాగాలుగా ఉంటుంది.
ఉపనిషత్తులు చాందోగ్య, కేన, మైత్రాయణి, తల్వకారీయ మరియూ మహోపనిషత్తులుగా ఉంది.

ఆదర్వణ వేద పురుషుడిని ఇలా దర్శించారు.
ఆధర్వణాభిదో వేదో ధవళో మర్కటాననః |
అక్షమాలాన్వితో వామే దక్షే కుంభదరః స్మృతః ||
తెలుపు రంగులో, కోతి ముఖం కలిగి, కుడి చేతిలో మాల ధరించి, కుండ కలిగి ఉంటాడు. ఆదర్వణ వేదం 15 శాఖలు, 20 ఖండాలు, 736 సూక్తాలుగా ఉంటుంది. పైప్పాలద, సౌనక అనే శాఖలు మాత్రం లభిస్తున్నాయి.
శిల్పవేదం ఉపవేదంగా ఉంది.

వేదముల ఉపవిభాగాలు

[మార్చు]

ఒక్కొక్కవేదంలోను, మళ్ళీ నాలుగు ఉప విభాగాలున్నాయి. అవి

ఇది వేదాలలోని మంత్రభాగం. స్తోత్రాలు, ఆవాహనలు ఇందులో ఉంటాయి. అన్నింటికంటే ఋగ్వేదసంహిత అత్యంత పురాతన, ప్రముఖ గ్రంథము. హిందూ తత్వవేత్తలకు పవిత్రము.ఋగ్వేదం ప్రకారం య‌జ్ఞాన్ని నిర్వహించే వానిని హోత అంటారు. యజుర్వేదసంహిత ఎక్కువగా వచనరూపంలో ఉంది. దీనిని అధ్వర్యులు, అనగా యజ్ఞాలు నిర్వహించేవారు ప్రధానంగా ఉపయోగిస్తారు. ఋగ్వేద మంత్రాలకు అనుబంధంగా ఇది ఉంటుంది. సామవేద సంహిత ఉద్గాత్రులచే, అనగా సామవేద పురోహితులచే గానం చేయబడే భగవస్తుతి. యజ్ఞంలో అధర్వవేద సంహితను చదివే పురోహితుని బ్రహ్మ అంటారు. మిగలిన ముగ్గురు పురోహితులు చదివే మంత్రసంహితలలో దొర్లే దోషాలను, యజ్ఞకార్యంలో సంభవించే పొరపాటులను సరిచేయడానికి అధర్వవేద సంహిత చదువుతారు.

సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు. ఇది గృహస్తులకు ఎక్కువగా వినియోగపడుతుంది. ఋగ్వేదంలో ఐతరేయ బ్రాహ్మణము, సాంఖ్యాయన బ్రాహ్మణము అనే రెండు విభాగాలున్నాయి. అలాగే శుక్ల యజుర్వేదంలో శతపథబ్రాహ్మణము, కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయ బ్రాహ్మణము, మైత్రాయణ బ్రాహ్మణము ఉన్నాయి. సామవేదంలో బ్రాహ్మణాల పేర్లు - తండ్య (పంచవింశ), షడ్వింశ, ఛాందోగ్య, అదభుత, ఆర్షేయ, ఉపనిషత్ బ్రాహ్మణములు. అధర్వణ వేదం లోని బ్రాహ్మణమును గోపథ బ్రాహ్మణము అంటారు.

ఆరణ్యకములు అనగా అడవులకు సంబంధించిన విషయాలు. వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణములకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి. కాని వీటిలో కర్మలయొక్క భౌతిక భాగం ఉండదు. కర్మలవెనుక ఉన్న నిగూఢమైన తత్వాలమీది ధ్యానానికి ఆరణ్యకాలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. సన్యాసాశ్రమం తీసుకోవడానికి ముందుగా వానప్రస్థంలో ఉన్న వారికి అరణ్యకములు ఎక్కువ ఉపయోగకరములు.

ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. కాని వీటిలో 108 ఉపనిషత్తులు మాత్రమే చదవదగ్గవి అని చెబుతారు.

యజ్ఞాలలో వేదమంత్రాలు

[మార్చు]

ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని ఐహిక సంపత్తిని, మోక్షాన్ని సంపాదించి పెట్టేవి యజ్ఞాలు. యజ్ఞ నిర్వహణ చాలా కష్టమైన పని. ఆ యజ్ఞ నిర్వహణలో నలుగురు పురోహితులుంటారు.

  • హోత: ఋగ్వేదంలోని స్తోత్రాలను క్రమంగా పఠించేవాడు.
  • అధ్వర్యుడు: యజుర్వేదంలో చెప్పిన ప్రకారం యజ్ఞకర్మలను యధావిధిగా నిర్వహించేవాడు.
  • ఉద్గాత: సామగీతాలను గానం చేసేవాడు.
  • బ్రహ్మ: అధర్వణ వేద పండితుడు. యజ్ఞాన్ని మొదటినుండి చివరివరకూ పర్యవేక్షించేవాడు.

వేదముల ప్రాముఖ్యత

[మార్చు]

హిందూమతము నకు, సంస్కృతికి, సంస్కృత భాషకు వేదములు అత్యంతమౌలికమైన ప్రామాణిక సాహిత్యము. దాదాపు అన్ని తత్వములవారు వేదముల ఆధారముగా తమ వాదనను సమర్ధించుకోవడం పరిపాటి. శాక్తేయము, వైష్ణవము, శైవము, అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము - ఇలా ఎన్నో తత్వమార్గాలవారు -తమదే వేదాలకనుగుణంగా ఉన్న మార్గము-- అని వాదించి, తమ తమ తర్కాలను సమర్ధించుకొన్నారు. వేదాల ప్రభావం మతానికే పరిమితం కాదు. పాలనా పద్ధతులు, ఆయుర్వేదము, ఖగోళము, దైనందిన ఆచారాలు - ఇలా ఎన్నో నిత్యజీవనకార్యాలు వేదాలతో ముడివడి ఉన్నాయి. అయితే బౌద్ధం వంటి సిద్ధాంతాలు మాత్రం వేదాలను పూర్తిగా త్రోసి పుచ్చాయి.

వేదాంగములు

[మార్చు]

వేదాలు ముఖ్యంగా ఋగ్, యజుస్, సామ మరియూ ఆదర్వణ విభాగాలుగా ఉన్నాయి. అందులో ఎంతో జ్ఞానం నిగూఢమై ఉంది. మరి ఆ అర్థాన్ని ఎట్లా తెలుసుకోవడం ? వేదాన్ని అర్థం చేసుకోవడానికి మన ఋషులు వాటికి ఎన్నో వివరణ గ్రంథాలను ఇచ్చారు. వేద రాశి యొక్క అర్థ నిర్ణయాని కొరకు. వీటినే వేదాంగాలు అని అంటారు. అవి ఆరు.

1) శిక్ష
2) వ్యాకరణము
3) ఛందస్సు
4) నిరుక్తము
5) జ్యోతిష్యము
6) కల్పము

1. శిక్షా
వేద శబ్దాల మూలాలు, ధాతువులని బట్టి ఆయా శబ్దాల ఉచ్చారణ, స్వరములని చెప్పేది. వేదాన్ని ఎట్లా పలకాలో తెలుపుతుంది.
2. వ్యాకరణం
కొన్ని శబ్దాలు ఒక్కో చోట ఒక్కోలా ఉచ్చరించాల్సి ఉంటుంది, అవి ఎట్లాలో చెప్పేది వ్యాకరణం. ఎన్నో ధాతువుల నుండి అర్థాన్ని చెబుతాయి. ఉదాహరణ మనవ అనే పదం మను అనే మహర్షి యొక్క సంతతి కనక మానవ అయ్యింది.
3. కల్పకం
వేద యజ్ఞంకోసం చేయాల్సిన యాగ శాల, వేదిక ఎట్లా ఉండాలి అనే విషయాలను తెలిపేది కల్పకం.
4. నిరుక్తం
పదాలు ఎట్లా తయారు అయ్యాయో తెలుపుతుంది. మనుష్య అనే పేరు ఎట్లా వచ్చింది అంటే 'మత్వా కర్మాణి సీవ్యతి'. లోకానికి ఏది కావాలో ముందే ఆలోచించి చేసే వాడు కనక మనిషి అని పేరు.
5. ఛందస్సు
ఛందస్సు అనేది వేద మంత్రాలలోని అక్షరాలను కొలిచేది, శబ్దాల అర్థాలను వివరిస్తుంది. విష్ణుసహస్రనామాలు ఉండేవి అనిష్ఠుప్ ఛందస్సు, అంటే శ్లోకంలో 32 అక్షరాలు ఉంటాయి. నాలుగు భాగాలు చేస్తే ఒక్కో భాగానికి 8 అక్షరాలు ఉంటాయి. గాయత్రి మంత్రానికి పేరు ఛందస్సుతో ఏర్పడింది. గాయత్రి అనేది ఛందస్సు. కొందరు గాయత్రి మంత్రం అనగానే ఒక స్త్రీమూర్తిని బొమ్మగా వేసి చూపిస్తారు, కాని అది తప్పు. గాయత్రి మంత్రం ప్రతిపాదించే దేవత నారాయణుడు. అందుకే సంధ్యావందనం చేసేప్పుడు సూర్యమండలం మధ్యవర్తిగా ఉండి నడిపేవాడు నన్నూ ప్రేరేపించుగాక అని కోరుతారు. నారాయణుడు ఆ మంత్రం యొక్క దేవత. ఉత్పలమాల, చంపకమాల అనేవి తెలుగులో ఛందస్సు. ఆ పదాలు స్త్రీలింగ శబ్దాలు, అట్లానే గాయత్రి ఛందస్సు కూడా.
6. జ్యోతిషం
మనం ఆచరించాల్సిన పనులు ఎప్పుడు, ఏమి, అట్లా చేయాలో తెలిపేది. చంద్రుడిని బట్టి, సూర్యుడిని బట్టి, ఋతువులని బట్టి కాలాన్ని చెబుతుంది.
వీటినే షడంగాలు అని చెబుతారు. ఇవి వేదం యొక్క అర్థాన్ని నిర్ణయించేవి.

ఇంకా చదవండి

[మార్చు]
  • ఆది నుండి సంస్కృతం ( దేవ నాగరి లిపి ) లో ఉన్న వేదాలను తొలుత విద్యారణ్య స్వామి వారు తెనుగించారు . దురదృష్ట వశాత్తు అవి ఇప్పుదు అలభ్యం . తదుపరి స్వామి దయానంద సరస్వతి వారు హిందీ భాష లో చతుర్వేదాలను తర్జుమా చేశారు .ఆ తరువాత దాశరధి రంగాచార్యులు వేదాలను తెలుగులోకి తర్జుమా చేసినప్పటికీ పండితుల విమర్శలు తప్పలేదు .ఇప్పటికినీ తెలుగు భాష లో సరి అయిన తర్జుమా లభించడం లేదు.

వనరులు

[మార్చు]